7, అక్టోబర్ 2025, మంగళవారం

కుమార సంభవం

ఇది కదా... స్కంద అనుగ్రహంస్కందుడు చరితం  అను రెండు టపాల తరువాయి భాగం - 

ఇక అసలు కథనం లోనికి వస్తే - 

శివ మాయామోహితులైన ఇంద్రాది దేవతలు అడగకూడని కోరిక కోరుతుంటే, శివుడు చిరునవ్వుతో,  "ఇకపై నా రేతస్సును ఎప్పుడూ పార్వతీదేవి యందు నిక్షిప్తం చేయను. నా రేతస్సును ఓజస్సుగా మార్చి, బ్రహ్మీమయ స్థితియందు తపశ్శక్తితో ఉంటాను. కానీ, ఇప్పుడు నా తేజం బయటికి వచ్చి తీరాలి. ఎందుకంటే నూరు దివ్యవర్షములు పార్వతీదేవితో కలిసి క్రీడించిన కారణం చేత, స్వస్థానమునుండి కదిలిన నా తేజస్సు బయటకు రాక తప్పదు. ఇప్పుడు నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి" అని అనెను. మాయ కమ్మిన వారు, పార్వతీదేవి తప్ప అన్యులు ఆ తేజస్సును భరించలేరన్న సత్యాన్ని గ్రహించలేక, 'భూమి భరిస్తుంది, భూకాంత మీద మీ తేజస్సును విడిచిపెట్టండి' అని అన్నారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరించింది. శివ రేతస్సు భూమి మీద పడింది. మరుక్షణంలోనే మహోత్తరమైన శంకర తేజస్సు భూమి మీద వ్యాపించి సమస్త ప్రాణికోటి స్తంభీభూతమయిపోతుంది. ఆ తేజస్సు వేడిని భరించలేక భూమి తల్లడిల్లుతూ తట్టుకోలేకపోతున్నాను అంటూ గట్టిగా కేకలేస్తుంది. తక్షణమే బ్రహ్మ సూచన మేరకు అగ్నిహోత్రుడు వాయు సహకారంతో వేగంగా భూమిని చేరి, ఆ తేజస్సును తనలో నిక్షిప్తం చేసుకుంటాడు. ఆ క్షణంలోనే పార్వతీదేవి బయటకు వచ్చి, జరిగిన విషయం తెలుసుకొని, ఆగ్రహంతో, "అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకు మీరందరూ ప్రతిబంధకం అయ్యారు. నా హక్కును మీరు కబళించారు. నా కడుపు పండకుండా, నా భర్త తేజస్సు వేరొక స్త్రీ యందు పడేటట్లు చేశారు. చేయకూడని పాపం చేశారు. ఇక మీదట దేవతలకు బిడ్డలు జన్మించకుందురుగాక" అని దేవతలను శపించింది. (అందుకే ఎప్పటికీ దేవతలు ముప్పది మూడు కోట్లు మంది మాత్రమే) అలానే భూమిని చూస్తూ, వీరు అడిగితే, నీవు ఎలా నా భర్త తేజాన్ని పుచ్చుకున్నావు? నీవూ ఆడదానివే కదా, ఇలా చేయడం నీకు తగునా? అందుకే నీవు ఇక వివిధ రూపాలను పొందుతావు. (ఒకచోట సారవంతమైన భూమిగా, మరో చోటా బీడు భూమిగా, ఎడారి భూమిగా, పర్వత ప్రాంతంగా, ఎగుడుదిగుడుగా... రకరకాల రూపాలు) వేరొకరి భర్త తేజస్సును నీవు భార్యగా పొందావు కాబట్టి, నీవు ఉన్నంతకాలం చాలామందికి భార్యవవుతావు. రాజు అయినవాడు భూకాంతుడు. అంటే భూమికి భర్త. భూమిని ఎంతమంది రాజులు పరిపాలిస్తే అంతమందీ వావి వరుసలు లేకుండా నీకు భర్తలే అవుతారు. కొన్ని వేలమందికి ఏక కాలంలో భార్యవగుదువు గాక. నాకు కొడుకు పుట్టకుండా చేశావు. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జనించినా, ఆ బిడ్డ ఆడపిల్లే అవుతుంది తప్ప, నీకు మగ పిల్లవాడు పుట్టడు..." ఇలా అమ్మ భూదేవికి శాపం ఇచ్చిన తర్వాత, దేవతలందరూ సిగ్గుతో తలలు వంచుకుని ఉండిపోయారు. పిమ్మట పార్వతీపరమేశ్వరులు అక్కడ నుండి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు మరింత విజృంభించాడు. మరల దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ బాగా ఆలోచించి, 'అగ్నిహోత్రుడులో నిక్షిప్తమై ఉన్న శివ తేజస్సును హిమవంతుని పెద్ద కుమార్తె గంగ యందు విడిచిపెడితే, గంగకు కుమారుడు కలిగితే, నా తోడబుట్టిన అక్కే కదా శివ తేజస్సు మోసింది అని  ప్రేమతో పార్వతీదేవి అనుకుంటుంది గానీ, కోపంతో శపించదు కాబట్టి, ఆమెను అడిగి ఆమె యందు విడిచిపెట్టు' అని అగ్నికి చెప్తూ, 'ఈ కార్య నిమిత్తం నీవు ఒక్కడివే గంగ దగ్గరకు వెళ్ళి సామరస్యంగా మాట్లాడు' అని చెప్పగా, అగ్నిహోత్రుడు గంగ దగ్గరకు వెళ్ళి, అమ్మా! దేవతల ప్రియము కొరకు, దేవతలు మరియు లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివునికి కొడుకు పుట్టాలి. శివతేజస్సును పట్టగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. అందుకే తల్లీ, నీవు అందరికోసం ఒక పని చేయాలి. నీవు పరమ సంతోషంతో అంగీకరిస్తే, నీ యందు శివ తేజస్సును ప్రవేశపెడతాను. నీవు గర్భం దాల్చాలి. గర్భం దాల్చడానికి దేవకాంతలు పనికిరారు. కనుక తల్లీ, లోక కల్యాణం కోసం నీవు ఆ తేజస్సును స్వీకరించి కొడుకును కను అని అడిగెను. దీనికి గంగ అంగీకరించడం, శివ తేజస్సును అగ్నిహోత్రుడు గంగ యందు ప్రవేశపెట్టడం జరిగింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ చూస్తుంటారు. ఆమె శివ తేజస్సును తట్టుకోగలదా? గర్భం దాల్చుతుందా? కుమార సంభవం జరుగుతుందా... ఎంతో ఉత్కంఠతో చూస్తుంటారు. ఇంతలో గంగాదేవి 'నేను ఈ తేజస్సును భరించలేకపోతున్నాను. నీరు నీరంతా ఉడికిపోతుంది. ఈ వేడి తట్టుకోలేను. నాలో నీరంతా ఆవిరైపోతుంది, ఈ తేజస్సును నాలో ఉంచుకోలేను...ఈ తేజస్సును విడిచిపెట్టేస్తాను. ఎక్కడ వదిలిపెట్టను? ఇప్పుడు నేను ఏమి చేయాల'ని అడుగుతుంది. (శివ తేజస్సును అమ్మ తప్ప అన్యులు భరించగలరా? పైగా ఈశ్వరుడుకు మాత్రమే మహాజ్ఞాని సనత్కుమారుడు కొడుకుగా పుడతానన్నప్పుడు ఆ శివ తేజస్సు ఏ స్త్రీ యందైన ఎలా నిక్షిప్తం అవుతుంది?). ఇక అందరిలో కంగారు మొదలైంది. అంతట అగ్నిహోత్రుడు పార్వతీపరమేశ్వరులు హిమావత్పర్వతం మీద ఉన్నారు కాబట్టి, వారే చూసుకుంటారు, కాపాడతారు అన్న నమ్మకంతో, గంగతో 'నీవు శివ తేజస్సును భరించ లేకపోతే, ఆ తేజస్సును హిమవత్పర్వతప్రాంతపాదముల దగ్గర విడిచిపెట్టు' అని చెప్పగా, గంగాదేవి అలానే చేసింది. తక్షణమే అక్కడ పెద్ద మెరుపు మెరిసి, ఆ ప్రాంతమంతా మిక్కిలి కాంతితో నిండిపోయింది. తేజస్సు వెళ్ళి రెల్లుగడ్డి మీద పడగా, తక్షణమే ఆ ప్రాంతమంతా తేజోమయమైంది. ఆ శివ తేజం నుండి విశేషమైన బంగారం, తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారములో నుండి రాగి, ఇనుము పుట్టాయి. దాని మలం లోంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమిలో కలిసిపోతే నానారకాల దాతువులు పుట్టాయి. అయ్యో...మనకి కావలసినవి ఇవి కాదు కదా, పైగా తేజస్సు భూమి మీద పడింది, భూమికి కొడుకులు పుట్టరు కదా... అని బెంగగా దిగులుగా చూస్తుండగా, అక్కడ శరవణం (రెల్లుపొదలు) దగ్గరలో ఉన్న శరవణ తటాకంలో పడిన తేజం నుండి బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఒక బాబు లేచి రెల్లు పొదాల మీద పడ్డాడు. కుమార సంభవం జరిగింది🙏. 

ఇక, పార్వతీదేవి సంబంధంగా పుడతానని అన్న సనత్కుమారుడు, పార్వతీదేవికి కొడుకులా ఎక్కడ ఎలా వచ్చాడనే సందేహం వస్తుంది కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సిన కథనం మరొకటి ఉంది.

విశేషవంతమైన శరవణ తటాకం గురించి తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు భస్మాసురుడికి శంకరుడు వరం ఇచ్చిన తర్వాత, తన హస్తమును శంకరుడు తల మీద పెడతానని, ఆ అసురుడు వెంటపడగా, శంకరుడు పరుగెత్తుతుంటే, అమ్మవారు అక్కడ తన శరీరమును ఒక తటాకంగా మార్చింది. దానినే శరవణ తటాకం అని పిలుస్తారు. ఆ తర్వాత అమ్మవారు జగదంబ రూపు దాల్చినా, అక్కడ శరవణ తటాకంలా అలానే నిలిచింది. ఆ తటాకంలోనే పడి,  పార్వతీదేవి శరీరం నందు పడినవాడు అయ్యాడు కావున, అమ్మవారికి కొడుకై భాసిల్లాడు.  అమ్మ గర్భవాసం లేకున్నా, అమ్మ శరీర సంబంధంతో అమ్మకు కొడుకై వచ్చాడు. శరవణభవుడు అయ్యాడు. ఈ విధంగా కుమార సంభవం జరిగింది. దేవతలందరూ పొంగిపోయారు. విజయ దుందుభులను మ్రోగించారు. పుష్పవృష్టి కురిపించారు.
     నా మనుమరాలు శ్రీమాన్వి నాకు బహుకరించిన చిత్రం

శరవణభవ శరవణభవ పాహిమాం 
శరవణభవ శరవణభవ రక్షమాం

తతిమ్మా భాగం తదుపరి టపాలో - 

6, అక్టోబర్ 2025, సోమవారం

స్కందుడు చరితం

క్రిందటి టపా ఇది కదా...స్కంద అనుగ్రహం లో తారకాసురుని గురించి తెలుసుకున్నాం. 

దేవతలు తారకాసురుని బాధలనుండి బయటపడేది ఎలా? కుమార సంభవం జరిగేదేలా?

దక్షయజ్ఞం సమయంలో సతీదేవి యోగాగ్ని నందు శరీరం విడిచిపెట్టేక, పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి, తపస్సులో మునిగిపోయి ఉండెను. 

కొంతకాలానికి సతీదేవి మేనక హిమవంతులకు పార్వతీదేవిగా జన్మించి, పెద్దదవుతుంది.
ఒకరోజు హిమవంతుడు పార్వతీదేవికి తగిన వరుడు శంకరుడే అని నారదుడు ద్వారా తెలుసుకొని, తన కుమార్తెతో, 'అమ్మా! హిమాలయ పర్వత ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్న శంకరునికి శుశ్రూషలు చేయడం వలన శుభం కలుగుతుంద'ని చెప్పి, శంకరుడు తపస్సు చేస్తున్న చోటకు తీసుకువెళ్ళి, శంకరుడు బహిర్ముఖుడయినప్పుడు, 'మీకు సేవ చేయాలని నా కూతురు కోరుకుంటుంది, మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా సేవలు చేస్తుంది'...అని పలు విజ్ఞాపనలు చేసి ఒప్పించి, కూతురితో, 'తల్లీ! ఈ మహానుభావుడిని జాగ్రత్తగా సేవించు, చీకటి పడేవేళకి ఇంటికి చేరు. నీకు శ్రేయస్సు కలుగుతుంద'ని చెప్పి, కూతుర్ని శివుని సేవలకు వినియోగించి వెళ్ళిపోయాడు. అమ్మ కోరికా ఇదే కదా... ప్రతిరోజు శివునికి పరిచర్యలు చేస్తుండేది. ఇలా కాలం గడిచిపోతుందే తప్పా, శివుడు తపస్సు విడవడు. ఇక వీరి కళ్యాణం ఎట్లా? వీరి వివాహం కానిదే, వీరికి బిడ్డ పుట్టనిదే తారకాసుర సంహారం జరగదు. 

ఈశ్వరుని మనస్సును పార్వతీదేవిపై మరలింపజేయడానికి ఇంద్రాది దేవతలు బాగా ఆలోచించాక, ఇంద్రుడు మన్మథుడుని పిలిచి,  శివుడు బహిర్ముఖుడు అయినప్పుడు ఓ పూలబాణం వేసి, పార్వతీదేవితో అనురాగంలో పడేటట్లు చేయమని చెప్పి, లోకరక్షణార్థం నీవు ఈ పని చేయాలని బలవంతంగా ఒప్పించడం, ఇక తప్పదని తెలిసి భయం భయంగానే మన్మథుడు అదును చూసి బాణం శంకరుడుపై వదలడం, చిరు వికారభావం కలిగిన శివుడు తన యందు వ్యగ్రతతో ఎవరు ప్రవర్తించారో గ్రహించడం, మూడవకంటి నుండి చిచ్చు బయలుదేరడం, ఆ అగ్నిహోత్రంలో మన్మథుడు భస్మరాశియై క్రింద పడిపోవడం తృటిలో జరిగిపోయాయి. అనంతరం ఎటువంటి మార్పు చెందని శివుడు మౌనంగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. ఈ వార్త తెలిసిన హిమవంతుడు బాధతో వచ్చి,  నిశ్చేష్టురాలై ఒంటరిగా నిలబడిపోయిన పార్వతీదేవిని అంతఃపురంకు తీసుకొని వెళ్ళిపోతాడు. 

ఇంద్రాది దేవతలు బ్రహ్మ సూచన మేరకు శివుడుని ప్రార్థిస్తుంటారు. కాలం గడుస్తుంది... శంకరుడుని ఎవరు కదిలించగలరు? ఆయనకు ఆయనే కదలాలి. లోకములు రక్షింపబడాలంటే, ఆయనే పూనుకోవాలి. అందుకే శివుడు ఎఱుకలసానిలా అమ్మ అంతఃపురంకు వెళ్ళి సోది చెప్పడం, తత్ఫలితంగా పార్వతీదేవి అరణ్యమునకు వెళ్ళి శివునిని భర్తగా పొందడానికి తీవ్ర తపస్సు చేయడం, శంకరుడు కదిలిపోయి పార్వతీదేవికి తనపై ఎంత ప్రేమ ఉందో లోకానికి చూపించడం కోసం బ్రహ్మచారి వేషంలో రావడం, శంకరుడు గురించి తక్కువ చేసి మాట్లాడుతూ, ఆయన నీకు తగడు...నేనే నీకు సరిజోడి, నన్ను చేసుకో అనడం...ఆ మాటలు విన్న పార్వతీదేవి చెలికత్తెలతో తక్షణమే ఈ శుష్క బ్రహ్మచారిని కొట్టి, అవతలకు తోసేయండి, శివ నింద చేస్తున్న ఈ ధూర్తబ్రహ్మచారి పళ్ళు ఊడిపోయేటట్లు కొట్టండి అని ఆదేశించడం, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పార్వతీదేవి అక్కడ నుండి కదిలి వెళుతుండగా, ఆ క్షణాన్నే శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షం కావడం, అమ్మ తపస్సు ఫలించి, అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగడం జరిగింది. 

ఇక ఇప్పుడు కుమారసంభవం జరగాలి - 
దేవతలంతా వీరిని మీరు ఓ బిడ్డను కనాలని కోరడం, సరే, బిడ్డ పుట్టేంతవరకు మాకు ఎటువంటి అవాంతరం కలిగించకండి అని చెప్పి ఓ గుహలోనికి శివపార్వతులు వెళ్ళిరి. ఆ గుహలో వారి దివ్యమైన క్రీడ ప్రారంభమై శత దివ్య సంవత్సరములు అయినవి. ఇక్కడ తారాకాసురుడు మరింత విజృంభిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. కొద్దిరోజులు ఆగండి, శివునికి పుత్రుడు పుడతాడు అని విష్ణువు చెప్పెను.
ఇప్పుడు శివ మాయ దేవతల మీద ప్రసరిస్తోంది. తత్ఫలితంగా వారి మధ్య ఒక తప్పు చర్చ ప్రారంభమైంది. శంకరుని మహా తేజస్సు, శక్తిస్వరూపిణి అమ్మతో కలిస్తే, వీరిరువురి శుక్రశోణితముల కలయికతో ఆవిర్భవించబోయే పుత్రుడు మహా మహా తేజోమంతుడు అవుతాడు. అటువంటి తేజోమూర్తిని ముల్లోకాలు తట్టుకోగలవా... మనం తట్టుకోగలమా... ఇత్యాది మాటలు మాట్లాడుకుంటూ, అసలు శివ తేజస్సు కదలరాదు అన్న ఆలోచన చేశారు. (శివునికి బిడ్డ పుట్టాలని తపించింది వీరే. ఇప్పుడు అమ్మో, వద్దు అనుకునేది వీరే) అనుకున్నదే తడవుగా పరమశివుడు దగ్గరకు వెళ్ళి, పార్వతీదేవితో లోక రక్షణార్ధం కోసం శృంగారక్రీడలో ఉన్న శివుణ్ణి గట్టిగా ప్రార్థించి పిలిచారు. శివుడు బయటకు రాగా, 'ఓ మహాదేవా, లోకముల హితమును కోరుకునేవాడా, శరణు శరణు, మీ తేజస్సును అమ్మలో నిక్షిప్తం చేస్తే, ఆవిర్భవించబోయే మహా తేజోవంత బిడ్డను తట్టుకునేశక్తి ముల్లోకాలకు లేదు. మీ రేతస్సు స్కలనం కాకూడదు. మీ తేజస్సును మీలోనే ఉంచేసుకోండి. పార్వతీదేవితో ఇక విహరణ వద్దు. ఏదైనా పర్వతశృంగం మీదకు మీ ఇరువురు వెళ్ళి తపస్సు చేసుకోండి'... అని కోరరాని ఘోర కోరిక కోరారు.
ఇలా ఇంద్రాది దేవతలు కోరడానికి కారణం, వీరంతా శివ మాయామోహితులు కావడం వలనే. ఇంతకు ఇక్కడ శివ మాయ ఏమిటి? ఎందుకు? దేవతలపై ఎందుకు తన మాయను ప్రసరింపజేసాడు... తెలుసుకోవాలంటే - 

త్రిపురా రహస్యంలో మహాత్మ్యకాండయందు ఒక సంఘటనను పరిశీలన చేయాలి.

 పార్వతీపరమేశ్వరులు ఓరోజు ఎత్తైన ఋషిపర్వతం మీద విహరిస్తుండగా, అచ్చట ఉన్న ఎందరో మహర్షులు, యోగులు, ఋషులు వీరికి ప్రణమిల్లగా,  బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు అనే బాలుడు అహంబ్రహ్మస్మి స్థితిలో ఉండి, వీరిని ప్రత్యేకంగా గుర్తించక, కదలక ఆత్మస్థితిలో బ్రహ్మానందంలో ఉండడం చూసి, ఆహా! ఎంతటి గొప్ప స్థితి అని శివుడు పార్వతితో చెప్తూ, సనత్కుమారుని చెంత నిలిచి, ''ఏమయ్యా! జగత్తుకే మాతాపితురలం కదా, మమ్మల్ని పలకరించవేమిటి?" అని అడుగగా, 'అంతటా బ్రహ్మమే కనబడుతున్న నాకు మీరు వేరుగా తోస్తే కదా, పలకరించడానికి'... అని బదులిస్తాడు. "నీకో వరం ఇస్తాం, ఏమి కావాలో కోరుకో" అని శివుడు అనగా, 'వరం ఇవ్వడానికి నువ్వొక్కడివి, తీసుకోవడానికి నేనొకడిని అని ఉంటే కదా...ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకే వరమూ వద్ద'నెను. శివుడు లోలోపల ఈయన అద్వైత జ్ఞానస్థితికి ముగ్ధుడౌతు, "అయితే శాపం ఇస్తాను" అని అనెను. 'వరమూ, శాపమూ అని రెండున్నాయా? వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖమూ అని రెండు లేనప్పుడు, నీవు ఏది ఇస్తే నాకేమిటి...సరే, శాపమిచ్చిన ఈ శరీరానికే గాని, నాకు కాదు కదా, ఇవ్వండ'నెను సనత్కుమారుడు. శివుడు ఆనందంతో, "ఏం జ్ఞానమయ్యా నీది. వరం వద్దంటావు, శాపాన్ని ఇస్తానంటే ఇమ్మంటావు" అని అంటుండగా, 'స్వామీ!  వరం అంటారు, శాపం అంటారు ఏమిటిదంతా... కావాలంటే నేనే మీకు వరం ఇస్తాను, ఏం కావాలో అడగండి' అంటాడు సనత్కుమారుడు. దీనికి ఎంతో ముగ్ధుడైన శివుడు, "నాయనా! నీవు నాకు కుమారుడిగా జన్మించు. ఇదే నేను కోరుకునే వరం" అని అన్నాడు. అప్పుడు 'నీకు మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను' అని సనత్కుమారుడు అంటాడు. ఈ మాటకి ప్రక్కనే ఉన్న పార్వతీదేవి "అదేమిటి నీకు మాత్రమే అని శివుడితో అంటున్నావు. నాకు కొడుకుగా పుట్టవా" అని అడుగుతుంది. 'అమ్మా! ఏమీ అనుకోకు, నీకు కొడుకుగా రావాలంటే, నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి. నేను యోనిసంభవుడుగా రానమ్మా. ఆ గర్భస్థ యాతన నాకొద్దు. నేను శివ కుమారుడుగానే పుడతాను...అంతే!' అన్నాడు సనత్కుమారుడు. "అదెలా సాధ్యమవుతుంది? మగవాడికి పుత్రుడు ఎలా  పుడతాడు? లోకంలో ప్రకృతి పురుషుడు లేకుండా జన్మించడం ఎలా కుదురుతుంది? ఆది దంపతులమైన మాకు నీవు పుత్రుడుగా పుట్టాల్సిందే"నని అమ్మ అనగా, 'అమ్మా! పార్వతీపరమేశ్వరులకు కొడుకును అవుతానేమో గానీ, నీ గర్భవాసం లేకుండా నీ కొడుకుగానే వస్తాను. నీ సంబంధంగా పుట్టి, నీ కొడుకుగా కీర్తింపబడతాను' అని సనత్కుమారుడు అంటాడు. ఆ మాటతో ఆదిదంపతులు ఆనందంగా అంతర్థానం అయిపోతారు.

ఆ పిమ్మట ఒకసారి బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారునికి తాను దేవసైన్యానికి అద్యక్షుడయినట్లు, కత్తి పట్టుకొని, రాక్షససంహారం చేస్తున్నట్లు కల వచ్చింది. అన్నింటికీ సాక్షిగా ఉండవలసిన నేను ఈ కలలో తాదాత్మ్యత పొందాను. ఉద్వేగాన్ని పొందాను. నాలో ద్వంద్వ భావం ఎలా వచ్చింది. తనకి కల రావడమేమిటని విచారణ చేస్తూ, తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, 'నాకు కల రావడం ఏమిటీ? నేను దేవసైన్యములకు అధిపతిని అయినట్లు, రాక్షస సంహారం చేస్తున్నట్లు కల వచ్చింద'ని చెప్పగా, "నాయనా! క్రిందటిజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు, ఈ వేదాలనే కదా రాక్షసులు తస్కరించారు,  సముద్రంలో పడేసారు, ధిక్కరించారు, పరమాత్మను ఇబ్బందిపెట్టి అవతారాలు తీసుకునేలా చేశారని కోపగించుకుంటూ చదివావు. దేవాసుర యుద్ధ ఘట్టాలు చదివినప్పుడు విపరీతమైన భావోద్వేగాన్ని పొంది, నాకే గనుక దేవసేనాధిపతిగా అవకాశం వస్తే, కత్తిపట్టి, వాళ్ళ తలలు నరికేసి ఉండేవాడిని... అని బలంగా అనుకునేవాడివి. ఆ వాసనాబలం చేతనే ఈ కల వచ్చింది. ఈ వాసన పోవడానికి దేవసేనానిగా ఒకసారి నీవు పుట్టవలసిందే. అన్నీ తెలిసిన మహానుభావుడు శంకరుడు. అందుకే నీ వాసనాబలం క్షయం చేయడానికే, నీ చెంతకు వచ్చి, వరం తీసుకున్నాడు. లేకపోతే ఆయన నీకు వరం అడగడం ఏమిటి? నీవు ఆయనకు కుమారుడవై పుట్టబోతున్నావు.  దేవసైన్యమునకు అధ్యక్షత వహిస్తావు"... అని బ్రహ్మ తెలిపెను. 
ఇప్పుడు ఇక్కడ మనం కొంత పరిశీలన చేస్తే, శివుడుచే జరగాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 
మొదటిది : బ్రహ్మ ఇచ్చిన వరం వలన దేవతలను రక్షించడానికి తన వీర్యం నుండి తారాకాసురుడును సంహరించగలిగే కొడుకు రావాలి.
రెండవది: సనత్కుమారుడు వాసనాబలం పోగొట్టాలంటే, ఆ జ్ఞానిని కొడుకుగా కని, దేవసైన్యానికి అధిపతిని చేసి, అసురులను అంతమొందించాలి.
మూడవది : పార్వతీదేవి గర్భవాసం చేయనన్న బ్రహ్మజ్ఞాని సనత్కుమారుని మాట నిలబెట్టాలి.
ఈ మూడు విషయాలు అర్ధం చేసుకుంటే, ఈ మూడు నిజం చేయడానికే అన్నీ తెలిసిన శివయ్య ఒక ప్రణాళిక ప్రకారం శివమాయను దేవతలపై ప్రసరింపచేశాడనే పరమార్థమును గ్రహించగల్గుతాం.

కుమార సంభవం తదుపరి టపాలో - 

5, అక్టోబర్ 2025, ఆదివారం

ఇది కదా...స్కంద అనుగ్రహం

తాతయ్య నాన్నమ్మలతో కలిసి చి|| అన్విక (2 సం|| నా మనుమరాలుకు) మొదటి సినిమా చూస్తే బాగుంటుందనే మా అబ్బాయి కోరికను కాదనలేక, సుమారుగా 17 లేక 18 సం||ల తర్వాత ఆగస్ట్ 25 న దియేటర్ కు వెళ్ళి (చివరగా దియేటర్ కు వెళ్ళి చూసింది పాండురంగడు) 'మహావతార్ నరసింహ' యానిమేషన్ చిత్రాన్ని చూసాను. 

అద్భుతంగా తీసారు. ఆద్యంతం ఆసక్తిదాయకం. సినిమా చూడడం అయింది కానీ; మనస్సులో పురాణ కథనాల కదలికలు...ఆలోచనలు!

బీజం, క్షేత్రం రెండూ శ్రేష్ఠమైతే జనించేవి ఒకలా, బీజం శ్రేష్టమైనది అయినను, క్షేత్రం శ్రేష్టమైనది కాకపోతే, జనించేవి మరోలా...! జనించేవాటిలో ఎంతో వైరుధ్యం. అందుకు ఉదాహరణే దైత్యులు, దేవతలు.

గర్భవతుల వైఖరి, మనోభావాలు పుట్టబోయే బిడ్డలపై ఎంతగా ప్రభావితమౌతాయో ప్రహ్లాదుడు, అభిమన్యుడులాంటివారిని పరిశీలిస్తే అర్థమౌతుంది. అలాగే భర్తను చేరిన భార్య మనోభావాలు ఎంత ప్రభావం చూపుతాయో భారతంలో ధృతరాష్ట్రుడు అంధుడిగా, పాండురాజు పాండురోగిగావిదురుడు జ్ఞానవేత్తగా ఎలా జన్మించారో గ్రహిస్తే, భర్తను చేరిన భార్య మనోభావాలకు, అంకురం మొదలు ప్రసవించేంతవరకు తన భావాలకు, నడవికకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థమౌతుంది. అందుకే కదా, పెద్దలు గర్భిణీ స్త్రీలు ఉత్తమ సంతానం పొందడానికి పురాణ ఇతిహాసాలు, ముఖ్యంగా స్కందోత్పత్తి లాంటివి చదవమని, వినమని చెప్తుంటారు. స్కందోత్పత్తి అంటే జ్ఞాపకం వచ్చింది, కొన్ని నెలల క్రితం మా అక్కగారి అమ్మాయి 'విద్య' ఇంతవరకు కుమారస్వామి గురించి స్మరణలో వ్రాయలేదు, నాకోసం కుమార సంభవం గురించి వ్రాయమని అడిగింది. తన కోసం, ఇప్పుడు వ్రాయగల్గుతున్నాను స్వామి అనుగ్రహంతో.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఈ బ్లాగ్ మొదలుపెట్టాక చాలాసార్లు అనుకున్నాను... సుబ్రమణ్యస్వామి గురించి వ్రాయాలని. షణ్ముకోత్పత్తి కథనం తెలిసినా గానీ, వ్రాయలేకపోయేదాని. ఈ సినిమా చూసాక, ఎలాగైనా ఈసారి వ్రాయాలని బలంగా అనుకున్నా గానీ, ఏరోజుకారోజు వాయిదాలు. రాత్రి పడుకునేటప్పుడు రేపు వ్రాయాలని గట్టిగా అనుకోవడం... మరునాడు మనస్సు వేరేదానిపై మరలడం, ఏదో అలసత్వం... తమోగుణంలో ఉండేదానిని. ఎందుకిలా? ఆలోచిస్తే, స్వామి గురించి వ్రాయాలంటే, స్వామి గురించి నాకు తెలుసు అన్న అహంను వీడి, ముందు స్వామిని ఆరాధించాలి అని స్ఫురించి, ఆరోజు నుండి స్వామి కథనాలు, స్వామి భక్తులకథలు, శరవణభవ శరవణభవ... స్మరణం, పఠనం, శ్రవణం... ఒకే ధ్యాస... అదే ధ్యానం.
దసరా సెలవులని వచ్చిన అభినవ్ రామ్, అభిజిత్ రామ్ (దౌహిత్రులు)లకు రాత్రి పడుకునే ముందు ఇవే కథలు, మావారికి, చెల్లికి, స్నేహితులకు... ఒకరని ఏముందీ, ఈమధ్యకాలంలో నన్ను కలిసిన అందరితో స్వామి కబుర్లే. ఇది కదా...అనుగ్రహమంటే🙏
ధర్మసూక్ష్మాలతో కూడుకున్న స్కందుని జననంకు కారణం తెలుసుకోవాలంటే, ముందున్న నేపథ్యం కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే స్వామి జననం కొన్ని కథనాలకు, శివయ్య లీలలకు అనుసంధానమై ఉంటుంది. అలాగే ఈ కథనాలు రామాయణం లోనూ, మహాభారతంలోనూ, శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చిన్న చిన్న వ్యత్యాసాలతో కనిపించవచ్చు. ఒకే కుమారసంభవమును అనేక కోణాలలో మహర్షులు దర్శించారు కాబట్టి, చిరు చిరు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, అవి అన్నీ సత్యమే. కథనాలన్నీ ఋషి ప్రోక్తములే.

కుమార సంభవంకు పూర్వ నేపథ్యం - 

బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కళల కుమారుడు కశ్యప ప్రజాపతి. దక్ష ప్రజాపతి కుమార్తెలలో పదమూడు మంది ఈయన భార్యలు. ఈ పదముగ్గురులో అదితి, దితిల గురించే ఇక్కడ కాస్త తెలుసుకోవాలి. ఎందుకంటే దేవతలు, దైత్యుల
ఆవిర్భావంనకు ప్రధానభూమికలు వీరివురే. 

సంతాన విషయంలో స్త్రీ సంస్కారబలం, శుద్ధభావనలు ఎంతో ముఖ్యం కాబట్టి, పూర్వం వివాహం అవగానే  ఋషులు కొంతకాలం తమ భార్యలతో కలిసి ఈశ్వరారాధనం చేసేవారు. వారి మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తరువాత భార్యను ఏమి కావాలని అడిగి, తను కోరుకున్న  సంతానముకు బీజం వేసేవారు. 

తపోనిష్టాగరిష్ఠుడు, ధర్మానిష్టాగరిష్ఠుడు మహాభక్తుడైన కశ్యప ప్రజాపతిని త్రికరణశుద్ధిగా ఏకాత్మ భావనతో అనుగమించే ధర్మపత్ని సత్త్వగుణశీలి అదితికి ఆదిత్యులు (దేవతలు) జన్మించగా, భర్త యెడల కించిత్ ధర్మలోపంతో, అశాస్త్రీయ కోరికలతో, ద్వైత భావంతో అనువర్తించే దితికి దైత్యులు (అసురులు) పుడతారు. 
మోహంతో సంగమించిన దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టడం, వారిరువురును శ్రీమహావిష్ణువు వరాహ, నరసింహ అవతారాల్లో సంహరించడం అందరికీ తెలిసిందే. ఇంత జరిగినా, ఏ మార్పు రాని దితి మరల బిడ్డలను కనాలని, కశ్యప ప్రజాపతిని 'నాకు ఇంద్రుడిని చంపే కొడుకు కావాల'ని కోరింది. అంతట కశ్యప ప్రజాపతి, 'నీకు ఎలాంటి బిడ్డ పుట్టాలో ఆ ఈశ్వరునికే ఎరుక. నీవు కోరుకున్నటువంటి బిడ్డ కలగాలంటే, ఈశ్వరుడుని సేవిస్తూ, ఏ ధర్మలోపం జరగకుండా తపస్సు చేయ'మని చెప్పెను. కొంతకాలానికి ఆమె లోపలకి కశ్యప ప్రజాపతి తేజం ప్రవేశించింది. ఆమె గర్భిణీ అయింది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఆమె దగ్గరకు వచ్చి, 'నీకు సేవ చేస్తాన'ని అడుగగా, ధర్మం పాటిస్తూ 'సరే'నని అంగీకరించింది. ఒకానొకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చొని ఉండగా, చిన్న కునుకు పట్టి, మోకాలి మీదకు తల ఒరగగా, జుట్టు పాదములను తాకింది. స్త్రీలకు అలా తగలకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం జుట్టు చివర ముడి వేయాలి. ముడి వేయని ఆమె జుట్టు పాదములను తాకగానే, అదే అదునుగా ఇంద్రుడు, ఆమె గర్భంలోనికి ప్రవేశించి, వజ్రాయుధంతో లోపలున్న పిండమును మారుదః మారుదః (ఏడవకండి ఏడవకండి) అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడుస్తూ, 'నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను కానీ, నీచే చంపబడ్డ పిల్లల్ని కాదు. నీచే చంపబడ్డారు కనుక నువ్వు వాళ్ళని బ్రతికించి, నీ దగ్గర పదవులియ్యు'అని ఇంద్రుణ్ణి కోరగా, మారుదః మారుదః అని ఇంద్రునిచే చంపబడ్డ వాళ్ళు 'మరుత్తులు'గా స్వర్గలోకంలో పదవులు పొందారు.
మరికొంతకాలం పిమ్మట, దితి భర్తను 'నాకు దేవతలందరినీ జయించగల కుమారుడు కావా'లని కోరింది. అంతటా కశ్యప ప్రజాపతి, 'అటువంటి కొడుకు కావాలంటే పదివేల సంవత్సరాలు నియమంతో, బ్రహ్మ గురించి తపస్సు చేయ'మని చెప్పగా, ఆమె కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహం పొంది, భర్తను చేరగా, గర్భం ధరించి వజ్రములవంటి అంగములు గల కొడుకును కన్నది. ఆ కొడుకు పేరు వజ్రాంగుడు. 
ఈ వజ్రాంగుడు తన అపార దేహబలంతో ఇంద్రాది దేవతలను ఓడించి, ఇంద్రాది దిక్పాలకులను కారాగారంలో బంధించి, దేవలోకాన్నంతటిని ఆక్రమించి, అక్కడ మిగిలిన వార్ని అడవులకు తరిమేసి, సర్వాధిపత్యాన్ని పొందాడు. ఆ తరుణంలో బ్రహ్మ, కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకొని, వజ్రాంగుడు దగ్గరకు రాగా, వజ్రాంగుడు లేచి నమస్కరించి, సముచితాసనమునందు కూర్చోబెట్టి, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చెను. 'నాయనా! నీ అతిథిమర్యాదకు సంతోషించాం. నీవు విజేయుడివే, ఇందులో సందేహం లేదు గానీ, నేను పదవులిచ్చిన ఇంద్రాది దిక్పాలకులను కారాగారంలో పడేశావు. వార్ని విడిచిపెట్టి, వాళ్ళ పదవులను వారికి తిరిగి ఇచ్చేయ'మని బ్రహ్మ చెప్పగా, 'మహానుభావా! మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకోవడానికి మేము తపస్సు చేయాలి గానీ, మీకు మీరుగా నా దగ్గరకు రావడం ఏమిటి? అమ్మ కోరిక తీర్చడానికి, ఇంద్రుడును ఓడించి బంధించాను. వారిని విడిచిపెట్టమని శాసించకుండా యాచించడం ఏమిటి? ఇది నాకు కీర్తి కాదు, అపకీర్తి. నాకు ఈ రాజ్యం మీద గానీ, పదవుల మీద గానీ ఆశ లేదు'...అని వజ్రాంగుడు అంటూ, అందర్నీ విడిచిపెట్టి, వారి వారి పదవులు వారికి ఇచ్చివేసెను. (ఇది తండ్రి అయిన కశ్యప ప్రజాపతి తేజస్సుచే అబ్బిన సంస్కారం). పిమ్మట బ్రహ్మను ప్రార్థిస్తూ, 'నాకు ఈ భోగ భాగ్యాలు వద్దు, నాలుగు వేదములు తెలిసిన మీరు, అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో... అది నాకు బోధపడేటట్లు ఉపదేశం చేయవలసింది'గా కోరెను. వజ్రాంగుడు ఈ కోరికకు బ్రహ్మ ఆనందభరితుడై, 'నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వగుణము కలిగి ఉండు. ఈశ్వరుడుని నమ్మి ఉండు. ఈశ్వరుడుని పట్టుకొని ఉంటే, నీ మనస్సు భగవంతునిపై లగ్నమైతే, సంసారంలో ఉన్నా, నీకు ఏ బాధ ఉండదు. నీవు సదా చిత్త శాంతితో ఉంటావు. నేనే నీకు ఒక భార్యను ప్రసాదిస్తాను. నేను సృష్టించి ఇచ్చిన ఈమెను స్వీకరించు, ఈమె పేరు వరాంగి' అని చెప్పి, దగ్గరుండి పౌరోహిత్యం చేసి పెళ్ళి చేసెను. సత్త్వ స్థితికి వచ్చిన వజ్రాంగుడు  బ్రహ్మచేత సృష్టింబడిన వరాంగితో కల్సి నిరంతరం ఈశ్వరుని యందు భక్తితో ధర్మాచరణపరుడై ఉంటాడు. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అసురుడుగా పుట్టిన వజ్రాంగుడు రజో తమోగుణాలు విడిచిపెట్టి సత్త్వగుణ సంపన్నుడై ధర్మమార్గంలో అనువర్తిస్తుంటే, బ్రహ్మచే సృష్టింపబడిన వరాంగి అసురుల ఇంటా అసురులచే వండబడిన అన్నం తినడంతో, రజో తమో గుణాలు పొంది, బాహ్యంగా భర్తతో పాటు పూజలు చేస్తున్నా, అన్నింటా భర్తకి సహకరిస్తున్నా, అంతరాన మాత్రం ఈయన ఎంతో ప్రతాపంతో పుట్టి, ఆ ప్రతాపమును మరిచి, ఏ కోరికా లేకుండా సదా ఈశ్వర ధ్యాసలో ఉంటారేమిటీ... అని లోలోన వాపోతూ, మూడు లోకములను ఏడిపించగలిగిన కొడుకు నాకు పుడితే బాగుండును అనే కోరికతో ఉంటుంది. ఒకనాడు ఏం కావాలో కోరుకో అని వజ్రాంగుడు వరాంగినీ అడుగగా, 'విష్ణు ద్వేషి, వేదాలను గౌరవించని, ముల్లోకములను గడగడలాడించి, ఇంద్రుణ్ణి అవలీలగా గెలిచే, దేవలోకాన్ని స్వాధీనం చేసుకునే శక్తివంతుడైన కొడుకు నాకు కావాలి' అని కోరుతుంది. అత్త దితికి తగ్గ కోడలు వరాంగి. భార్య కోరిన ఈ కోరికతో ఎంతో వేదనకు లోనై, బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు వజ్రాంగుడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే, మీరు ప్రసాదించిన వరాంగితో కలిసి ఈశ్వరుని పై నమ్మికతో ధర్మాచరణలో నేనుంటే, ఆమె ఇంద్రుడిని జయించే, ముల్లోకాలను ఏడిపించే కొడుకు కావాలని కోరింది. ఆమె కోరిక తీర్చడం నా ధర్మం. అటువంటి కొడుకు నా వలన ఆమెకు కలిగేటట్లు మీరే వరమివ్వండి అని అడిగాడు. ' తథాస్తు' అన్నాడు బ్రహ్మ. తిరిగివచ్చిన వజ్రాంగుడు భార్య యందు తన వీర్యాన్ని నిక్షిప్తం చేయగా,  కొంతకాలం పిమ్మట వరాంగికి తను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే భూమి కంపించింది. మేఘాలు రక్తాన్ని కురిపించాయి, దిక్కులన్నింటా అగ్నిహోత్రాలు చెలరేగాయి, ప్రకృతి విలయతాండవం చేసింది. పశుపక్షాదులు భయంతో గోల చేశాయి. ఆ బాలుడికి తాతగారైన కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశారు. తారకాసురుడు చిన్న వయస్సులోనే, దుష్ట ఆలోచనల దితి, వరాంగీలా సూచనతో బ్రహ్మ కోసం ఉగ్ర తపస్సు చేసి, మూడు లోకాలను జయించగల శక్తిని ఇమ్మని, పరమశివుడు వీర్య స్ఖలనం నుండి పుట్టిన ఏడురోజుల కొడుకు చేతిలోనే మరణం ప్రాప్తించాలనే వరాలను బ్రహ్మ నుండి పొందాడు. (సతీ వియోగంతో తపస్సు చేసుకుంటున్న శివుడుకు కొడుకు ఎలా పుడతాడనే భావన తారకునిది). తమతో దండెత్తుకొచ్చిన వీడితో యుద్ధం ఎందుకని ఇంద్రాది దేవతలు తలవొగ్గారు. ఇంద్ర పదవిని అధిష్టించి, దిక్పాలకులందరి పదవులను తీసేసి, ఇక తన ఆజ్ఞానుసారం నడుచుకోవాలని శాసించాడు. కుబేరుడిని, తుంబురుడిని, సూర్యచంద్రాదులను తను చెప్పినట్లే నడుచుకోవాలని శాసించాడు. ఈ నిర్భంద బాధలు పడలేక, వీరంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, శివుడుకి కొడుకు పుట్టేలా, మీరే ఏదైనా చేసి, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. 

తారకాసురుడు ముల్లోకాల మీద పడి చేస్తున్న విద్వాంసం ఆగాలంటే, స్కందోత్పత్తి జరగాలి. దక్షయజ్ఞం తరువాత సతీవియోగుడైన పరమశివుడు తీవ్రధ్యానంలో ఆత్మస్థితిలో ఉన్నాడు. మరి కుమారస్వామి జననం జరిగేది ఎలా? 

తదుపరి టపాలో -