క్రిందటి టపా ఇది కదా...స్కంద అనుగ్రహం లో తారకాసురుని గురించి తెలుసుకున్నాం.
దేవతలు తారకాసురుని బాధలనుండి బయటపడేది ఎలా? కుమార సంభవం జరిగేదేలా?
దక్షయజ్ఞం సమయంలో సతీదేవి యోగాగ్ని నందు శరీరం విడిచిపెట్టేక, పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి, తపస్సులో మునిగిపోయి ఉండెను.
కొంతకాలానికి సతీదేవి మేనక హిమవంతులకు పార్వతీదేవిగా జన్మించి, పెద్దదవుతుంది.
ఒకరోజు హిమవంతుడు పార్వతీదేవికి తగిన వరుడు శంకరుడే అని నారదుడు ద్వారా తెలుసుకొని, తన కుమార్తెతో, 'అమ్మా! హిమాలయ పర్వత ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్న శంకరునికి శుశ్రూషలు చేయడం వలన శుభం కలుగుతుంద'ని చెప్పి, శంకరుడు తపస్సు చేస్తున్న చోటకు తీసుకువెళ్ళి, శంకరుడు బహిర్ముఖుడయినప్పుడు, 'మీకు సేవ చేయాలని నా కూతురు కోరుకుంటుంది, మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా సేవలు చేస్తుంది'...అని పలు విజ్ఞాపనలు చేసి ఒప్పించి, కూతురితో, 'తల్లీ! ఈ మహానుభావుడిని జాగ్రత్తగా సేవించు, చీకటి పడేవేళకి ఇంటికి చేరు. నీకు శ్రేయస్సు కలుగుతుంద'ని చెప్పి, కూతుర్ని శివుని సేవలకు వినియోగించి వెళ్ళిపోయాడు. అమ్మ కోరికా ఇదే కదా... ప్రతిరోజు శివునికి పరిచర్యలు చేస్తుండేది. ఇలా కాలం గడిచిపోతుందే తప్పా, శివుడు తపస్సు విడవడు. ఇక వీరి కళ్యాణం ఎట్లా? వీరి వివాహం కానిదే, వీరికి బిడ్డ పుట్టనిదే తారకాసుర సంహారం జరగదు.
ఈశ్వరుని మనస్సును పార్వతీదేవిపై మరలింపజేయడానికి ఇంద్రాది దేవతలు బాగా ఆలోచించాక, ఇంద్రుడు మన్మథుడుని పిలిచి, శివుడు బహిర్ముఖుడు అయినప్పుడు ఓ పూలబాణం వేసి, పార్వతీదేవితో అనురాగంలో పడేటట్లు చేయమని చెప్పి, లోకరక్షణార్థం నీవు ఈ పని చేయాలని బలవంతంగా ఒప్పించడం, ఇక తప్పదని తెలిసి భయం భయంగానే మన్మథుడు అదును చూసి బాణం శంకరుడుపై వదలడం, చిరు వికారభావం కలిగిన శివుడు తన యందు వ్యగ్రతతో ఎవరు ప్రవర్తించారో గ్రహించడం, మూడవకంటి నుండి చిచ్చు బయలుదేరడం, ఆ అగ్నిహోత్రంలో మన్మథుడు భస్మరాశియై క్రింద పడిపోవడం తృటిలో జరిగిపోయాయి. అనంతరం ఎటువంటి మార్పు చెందని శివుడు మౌనంగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. ఈ వార్త తెలిసిన హిమవంతుడు బాధతో వచ్చి, నిశ్చేష్టురాలై ఒంటరిగా నిలబడిపోయిన పార్వతీదేవిని అంతఃపురంకు తీసుకొని వెళ్ళిపోతాడు.
ఇంద్రాది దేవతలు బ్రహ్మ సూచన మేరకు శివుడుని ప్రార్థిస్తుంటారు. కాలం గడుస్తుంది... శంకరుడుని ఎవరు కదిలించగలరు? ఆయనకు ఆయనే కదలాలి. లోకములు రక్షింపబడాలంటే, ఆయనే పూనుకోవాలి. అందుకే శివుడు ఎఱుకలసానిలా అమ్మ అంతఃపురంకు వెళ్ళి సోది చెప్పడం, తత్ఫలితంగా పార్వతీదేవి అరణ్యమునకు వెళ్ళి శివునిని భర్తగా పొందడానికి తీవ్ర తపస్సు చేయడం, శంకరుడు కదిలిపోయి పార్వతీదేవికి తనపై ఎంత ప్రేమ ఉందో లోకానికి చూపించడం కోసం బ్రహ్మచారి వేషంలో రావడం, శంకరుడు గురించి తక్కువ చేసి మాట్లాడుతూ, ఆయన నీకు తగడు...నేనే నీకు సరిజోడి, నన్ను చేసుకో అనడం...ఆ మాటలు విన్న పార్వతీదేవి చెలికత్తెలతో తక్షణమే ఈ శుష్క బ్రహ్మచారిని కొట్టి, అవతలకు తోసేయండి, శివ నింద చేస్తున్న ఈ ధూర్తబ్రహ్మచారి పళ్ళు ఊడిపోయేటట్లు కొట్టండి అని ఆదేశించడం, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పార్వతీదేవి అక్కడ నుండి కదిలి వెళుతుండగా, ఆ క్షణాన్నే శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షం కావడం, అమ్మ తపస్సు ఫలించి, అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగడం జరిగింది.
ఇక ఇప్పుడు కుమారసంభవం జరగాలి -
దేవతలంతా వీరిని మీరు ఓ బిడ్డను కనాలని కోరడం, సరే, బిడ్డ పుట్టేంతవరకు మాకు ఎటువంటి అవాంతరం కలిగించకండి అని చెప్పి ఓ గుహలోనికి శివపార్వతులు వెళ్ళిరి. ఆ గుహలో వారి దివ్యమైన క్రీడ ప్రారంభమై శత దివ్య సంవత్సరములు అయినవి. ఇక్కడ తారాకాసురుడు మరింత విజృంభిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. కొద్దిరోజులు ఆగండి, శివునికి పుత్రుడు పుడతాడు అని విష్ణువు చెప్పెను.
ఇప్పుడు శివ మాయ దేవతల మీద ప్రసరిస్తోంది. తత్ఫలితంగా వారి మధ్య ఒక తప్పు చర్చ ప్రారంభమైంది. శంకరుని మహా తేజస్సు, శక్తిస్వరూపిణి అమ్మతో కలిస్తే, వీరిరువురి శుక్రశోణితముల కలయికతో ఆవిర్భవించబోయే పుత్రుడు మహా మహా తేజోమంతుడు అవుతాడు. అటువంటి తేజోమూర్తిని ముల్లోకాలు తట్టుకోగలవా... మనం తట్టుకోగలమా... ఇత్యాది మాటలు మాట్లాడుకుంటూ, అసలు శివ తేజస్సు కదలరాదు అన్న ఆలోచన చేశారు. (శివునికి బిడ్డ పుట్టాలని తపించింది వీరే. ఇప్పుడు అమ్మో, వద్దు అనుకునేది వీరే) అనుకున్నదే తడవుగా పరమశివుడు దగ్గరకు వెళ్ళి, పార్వతీదేవితో లోక రక్షణార్ధం కోసం శృంగారక్రీడలో ఉన్న శివుణ్ణి గట్టిగా ప్రార్థించి పిలిచారు. శివుడు బయటకు రాగా, 'ఓ మహాదేవా, లోకముల హితమును కోరుకునేవాడా, శరణు శరణు, మీ తేజస్సును అమ్మలో నిక్షిప్తం చేస్తే, ఆవిర్భవించబోయే మహా తేజోవంత బిడ్డను తట్టుకునేశక్తి ముల్లోకాలకు లేదు. మీ రేతస్సు స్కలనం కాకూడదు. మీ తేజస్సును మీలోనే ఉంచేసుకోండి. పార్వతీదేవితో ఇక విహరణ వద్దు. ఏదైనా పర్వతశృంగం మీదకు మీ ఇరువురు వెళ్ళి తపస్సు చేసుకోండి'... అని కోరరాని ఘోర కోరిక కోరారు.
ఇలా ఇంద్రాది దేవతలు కోరడానికి కారణం, వీరంతా శివ మాయామోహితులు కావడం వలనే. ఇంతకు ఇక్కడ శివ మాయ ఏమిటి? ఎందుకు? దేవతలపై ఎందుకు తన మాయను ప్రసరింపజేసాడు... తెలుసుకోవాలంటే -
త్రిపురా రహస్యంలో మహాత్మ్యకాండయందు ఒక సంఘటనను పరిశీలన చేయాలి.
పార్వతీపరమేశ్వరులు ఓరోజు ఎత్తైన ఋషిపర్వతం మీద విహరిస్తుండగా, అచ్చట ఉన్న ఎందరో మహర్షులు, యోగులు, ఋషులు వీరికి ప్రణమిల్లగా, బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు అనే బాలుడు అహంబ్రహ్మస్మి స్థితిలో ఉండి, వీరిని ప్రత్యేకంగా గుర్తించక, కదలక ఆత్మస్థితిలో బ్రహ్మానందంలో ఉండడం చూసి, ఆహా! ఎంతటి గొప్ప స్థితి అని శివుడు పార్వతితో చెప్తూ, సనత్కుమారుని చెంత నిలిచి, ''ఏమయ్యా! జగత్తుకే మాతాపితురలం కదా, మమ్మల్ని పలకరించవేమిటి?" అని అడుగగా, 'అంతటా బ్రహ్మమే కనబడుతున్న నాకు మీరు వేరుగా తోస్తే కదా, పలకరించడానికి'... అని బదులిస్తాడు. "నీకో వరం ఇస్తాం, ఏమి కావాలో కోరుకో" అని శివుడు అనగా, 'వరం ఇవ్వడానికి నువ్వొక్కడివి, తీసుకోవడానికి నేనొకడిని అని ఉంటే కదా...ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకే వరమూ వద్ద'నెను. శివుడు లోలోపల ఈయన అద్వైత జ్ఞానస్థితికి ముగ్ధుడౌతు, "అయితే శాపం ఇస్తాను" అని అనెను. 'వరమూ, శాపమూ అని రెండున్నాయా? వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖమూ అని రెండు లేనప్పుడు, నీవు ఏది ఇస్తే నాకేమిటి...సరే, శాపమిచ్చిన ఈ శరీరానికే గాని, నాకు కాదు కదా, ఇవ్వండ'నెను సనత్కుమారుడు. శివుడు ఆనందంతో, "ఏం జ్ఞానమయ్యా నీది. వరం వద్దంటావు, శాపాన్ని ఇస్తానంటే ఇమ్మంటావు" అని అంటుండగా, 'స్వామీ! వరం అంటారు, శాపం అంటారు ఏమిటిదంతా... కావాలంటే నేనే మీకు వరం ఇస్తాను, ఏం కావాలో అడగండి' అంటాడు సనత్కుమారుడు. దీనికి ఎంతో ముగ్ధుడైన శివుడు, "నాయనా! నీవు నాకు కుమారుడిగా జన్మించు. ఇదే నేను కోరుకునే వరం" అని అన్నాడు. అప్పుడు 'నీకు మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను' అని సనత్కుమారుడు అంటాడు. ఈ మాటకి ప్రక్కనే ఉన్న పార్వతీదేవి "అదేమిటి నీకు మాత్రమే అని శివుడితో అంటున్నావు. నాకు కొడుకుగా పుట్టవా" అని అడుగుతుంది. 'అమ్మా! ఏమీ అనుకోకు, నీకు కొడుకుగా రావాలంటే, నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి. నేను యోనిసంభవుడుగా రానమ్మా. ఆ గర్భస్థ యాతన నాకొద్దు. నేను శివ కుమారుడుగానే పుడతాను...అంతే!' అన్నాడు సనత్కుమారుడు. "అదెలా సాధ్యమవుతుంది? మగవాడికి పుత్రుడు ఎలా పుడతాడు? లోకంలో ప్రకృతి పురుషుడు లేకుండా జన్మించడం ఎలా కుదురుతుంది? ఆది దంపతులమైన మాకు నీవు పుత్రుడుగా పుట్టాల్సిందే"నని అమ్మ అనగా, 'అమ్మా! పార్వతీపరమేశ్వరులకు కొడుకును అవుతానేమో గానీ, నీ గర్భవాసం లేకుండా నీ కొడుకుగానే వస్తాను. నీ సంబంధంగా పుట్టి, నీ కొడుకుగా కీర్తింపబడతాను' అని సనత్కుమారుడు అంటాడు. ఆ మాటతో ఆదిదంపతులు ఆనందంగా అంతర్థానం అయిపోతారు.
ఆ పిమ్మట ఒకసారి బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారునికి తాను దేవసైన్యానికి అద్యక్షుడయినట్లు, కత్తి పట్టుకొని, రాక్షససంహారం చేస్తున్నట్లు కల వచ్చింది. అన్నింటికీ సాక్షిగా ఉండవలసిన నేను ఈ కలలో తాదాత్మ్యత పొందాను. ఉద్వేగాన్ని పొందాను. నాలో ద్వంద్వ భావం ఎలా వచ్చింది. తనకి కల రావడమేమిటని విచారణ చేస్తూ, తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, 'నాకు కల రావడం ఏమిటీ? నేను దేవసైన్యములకు అధిపతిని అయినట్లు, రాక్షస సంహారం చేస్తున్నట్లు కల వచ్చింద'ని చెప్పగా, "నాయనా! క్రిందటిజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు, ఈ వేదాలనే కదా రాక్షసులు తస్కరించారు, సముద్రంలో పడేసారు, ధిక్కరించారు, పరమాత్మను ఇబ్బందిపెట్టి అవతారాలు తీసుకునేలా చేశారని కోపగించుకుంటూ చదివావు. దేవాసుర యుద్ధ ఘట్టాలు చదివినప్పుడు విపరీతమైన భావోద్వేగాన్ని పొంది, నాకే గనుక దేవసేనాధిపతిగా అవకాశం వస్తే, కత్తిపట్టి, వాళ్ళ తలలు నరికేసి ఉండేవాడిని... అని బలంగా అనుకునేవాడివి. ఆ వాసనాబలం చేతనే ఈ కల వచ్చింది. ఈ వాసన పోవడానికి దేవసేనానిగా ఒకసారి నీవు పుట్టవలసిందే. అన్నీ తెలిసిన మహానుభావుడు శంకరుడు. అందుకే నీ వాసనాబలం క్షయం చేయడానికే, నీ చెంతకు వచ్చి, వరం తీసుకున్నాడు. లేకపోతే ఆయన నీకు వరం అడగడం ఏమిటి? నీవు ఆయనకు కుమారుడవై పుట్టబోతున్నావు. దేవసైన్యమునకు అధ్యక్షత వహిస్తావు"... అని బ్రహ్మ తెలిపెను.
ఇప్పుడు ఇక్కడ మనం కొంత పరిశీలన చేస్తే, శివుడుచే జరగాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
మొదటిది : బ్రహ్మ ఇచ్చిన వరం వలన దేవతలను రక్షించడానికి తన వీర్యం నుండి తారాకాసురుడును సంహరించగలిగే కొడుకు రావాలి.
రెండవది: సనత్కుమారుడు వాసనాబలం పోగొట్టాలంటే, ఆ జ్ఞానిని కొడుకుగా కని, దేవసైన్యానికి అధిపతిని చేసి, అసురులను అంతమొందించాలి.
మూడవది : పార్వతీదేవి గర్భవాసం చేయనన్న బ్రహ్మజ్ఞాని సనత్కుమారుని మాట నిలబెట్టాలి.
ఈ మూడు విషయాలు అర్ధం చేసుకుంటే, ఈ మూడు నిజం చేయడానికే అన్నీ తెలిసిన శివయ్య ఒక ప్రణాళిక ప్రకారం శివమాయను దేవతలపై ప్రసరింపచేశాడనే పరమార్థమును గ్రహించగల్గుతాం.
కుమార సంభవం తదుపరి టపాలో -
ఎంత చక్కటి కథనాలు.
రిప్లయితొలగించండిఎన్ని మలుపులు...
స్కందుని జననం టపాకై నా నిరీక్షణ