7, అక్టోబర్ 2025, మంగళవారం

కుమార సంభవం

ఇది కదా... స్కంద అనుగ్రహంస్కందుడు చరితం  అను రెండు టపాల తరువాయి భాగం - 

ఇక అసలు కథనం లోనికి వస్తే - 

శివ మాయామోహితులైన ఇంద్రాది దేవతలు అడగకూడని కోరిక కోరుతుంటే, శివుడు చిరునవ్వుతో,  "ఇకపై నా రేతస్సును ఎప్పుడూ పార్వతీదేవి యందు నిక్షిప్తం చేయను. నా రేతస్సును ఓజస్సుగా మార్చి, బ్రహ్మీమయ స్థితియందు తపశ్శక్తితో ఉంటాను. కానీ, ఇప్పుడు నా తేజం బయటికి వచ్చి తీరాలి. ఎందుకంటే నూరు దివ్యవర్షములు పార్వతీదేవితో కలిసి క్రీడించిన కారణం చేత, స్వస్థానమునుండి కదిలిన నా తేజస్సు బయటకు రాక తప్పదు. ఇప్పుడు నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి" అని అనెను. మాయ కమ్మిన వారు, పార్వతీదేవి తప్ప అన్యులు ఆ తేజస్సును భరించలేరన్న సత్యాన్ని గ్రహించలేక, 'భూమి భరిస్తుంది, భూకాంత మీద మీ తేజస్సును విడిచిపెట్టండి' అని అన్నారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరించింది. శివ రేతస్సు భూమి మీద పడింది. మరుక్షణంలోనే మహోత్తరమైన శంకర తేజస్సు భూమి మీద వ్యాపించి సమస్త ప్రాణికోటి స్తంభీభూతమయిపోతుంది. ఆ తేజస్సు వేడిని భరించలేక భూమి తల్లడిల్లుతూ తట్టుకోలేకపోతున్నాను అంటూ గట్టిగా కేకలేస్తుంది. తక్షణమే బ్రహ్మ సూచన మేరకు అగ్నిహోత్రుడు వాయు సహకారంతో వేగంగా భూమిని చేరి, ఆ తేజస్సును తనలో నిక్షిప్తం చేసుకుంటాడు. ఆ క్షణంలోనే పార్వతీదేవి బయటకు వచ్చి, జరిగిన విషయం తెలుసుకొని, ఆగ్రహంతో, "అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకు మీరందరూ ప్రతిబంధకం అయ్యారు. నా హక్కును మీరు కబళించారు. నా కడుపు పండకుండా, నా భర్త తేజస్సు వేరొక స్త్రీ యందు పడేటట్లు చేశారు. చేయకూడని పాపం చేశారు. ఇక మీదట దేవతలకు బిడ్డలు జన్మించకుందురుగాక" అని దేవతలను శపించింది. (అందుకే ఎప్పటికీ దేవతలు ముప్పది మూడు కోట్లు మంది మాత్రమే) అలానే భూమిని చూస్తూ, వీరు అడిగితే, నీవు ఎలా నా భర్త తేజాన్ని పుచ్చుకున్నావు? నీవూ ఆడదానివే కదా, ఇలా చేయడం నీకు తగునా? అందుకే నీవు ఇక వివిధ రూపాలను పొందుతావు. (ఒకచోట సారవంతమైన భూమిగా, మరో చోటా బీడు భూమిగా, ఎడారి భూమిగా, పర్వత ప్రాంతంగా, ఎగుడుదిగుడుగా... రకరకాల రూపాలు) వేరొకరి భర్త తేజస్సును నీవు భార్యగా పొందావు కాబట్టి, నీవు ఉన్నంతకాలం చాలామందికి భార్యవవుతావు. రాజు అయినవాడు భూకాంతుడు. అంటే భూమికి భర్త. భూమిని ఎంతమంది రాజులు పరిపాలిస్తే అంతమందీ వావి వరుసలు లేకుండా నీకు భర్తలే అవుతారు. కొన్ని వేలమందికి ఏక కాలంలో భార్యవగుదువు గాక. నాకు కొడుకు పుట్టకుండా చేశావు. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జనించినా, ఆ బిడ్డ ఆడపిల్లే అవుతుంది తప్ప, నీకు మగ పిల్లవాడు పుట్టడు..." ఇలా అమ్మ భూదేవికి శాపం ఇచ్చిన తర్వాత, దేవతలందరూ సిగ్గుతో తలలు వంచుకుని ఉండిపోయారు. పిమ్మట పార్వతీపరమేశ్వరులు అక్కడ నుండి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు మరింత విజృంభించాడు. మరల దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ బాగా ఆలోచించి, 'అగ్నిహోత్రుడులో నిక్షిప్తమై ఉన్న శివ తేజస్సును హిమవంతుని పెద్ద కుమార్తె గంగ యందు విడిచిపెడితే, గంగకు కుమారుడు కలిగితే, నా తోడబుట్టిన అక్కే కదా శివ తేజస్సు మోసింది అని  ప్రేమతో పార్వతీదేవి అనుకుంటుంది గానీ, కోపంతో శపించదు కాబట్టి, ఆమెను అడిగి ఆమె యందు విడిచిపెట్టు' అని అగ్నికి చెప్తూ, 'ఈ కార్య నిమిత్తం నీవు ఒక్కడివే గంగ దగ్గరకు వెళ్ళి సామరస్యంగా మాట్లాడు' అని చెప్పగా, అగ్నిహోత్రుడు గంగ దగ్గరకు వెళ్ళి, అమ్మా! దేవతల ప్రియము కొరకు, దేవతలు మరియు లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివునికి కొడుకు పుట్టాలి. శివతేజస్సును పట్టగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. అందుకే తల్లీ, నీవు అందరికోసం ఒక పని చేయాలి. నీవు పరమ సంతోషంతో అంగీకరిస్తే, నీ యందు శివ తేజస్సును ప్రవేశపెడతాను. నీవు గర్భం దాల్చాలి. గర్భం దాల్చడానికి దేవకాంతలు పనికిరారు. కనుక తల్లీ, లోక కల్యాణం కోసం నీవు ఆ తేజస్సును స్వీకరించి కొడుకును కను అని అడిగెను. దీనికి గంగ అంగీకరించడం, శివ తేజస్సును అగ్నిహోత్రుడు గంగ యందు ప్రవేశపెట్టడం జరిగింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ చూస్తుంటారు. ఆమె శివ తేజస్సును తట్టుకోగలదా? గర్భం దాల్చుతుందా? కుమార సంభవం జరుగుతుందా... ఎంతో ఉత్కంఠతో చూస్తుంటారు. ఇంతలో గంగాదేవి 'నేను ఈ తేజస్సును భరించలేకపోతున్నాను. నీరు నీరంతా ఉడికిపోతుంది. ఈ వేడి తట్టుకోలేను. నాలో నీరంతా ఆవిరైపోతుంది, ఈ తేజస్సును నాలో ఉంచుకోలేను...ఈ తేజస్సును విడిచిపెట్టేస్తాను. ఎక్కడ వదిలిపెట్టను? ఇప్పుడు నేను ఏమి చేయాల'ని అడుగుతుంది. (శివ తేజస్సును అమ్మ తప్ప అన్యులు భరించగలరా? పైగా ఈశ్వరుడుకు మాత్రమే మహాజ్ఞాని సనత్కుమారుడు కొడుకుగా పుడతానన్నప్పుడు ఆ శివ తేజస్సు ఏ స్త్రీ యందైన ఎలా నిక్షిప్తం అవుతుంది?). ఇక అందరిలో కంగారు మొదలైంది. అంతట అగ్నిహోత్రుడు పార్వతీపరమేశ్వరులు హిమావత్పర్వతం మీద ఉన్నారు కాబట్టి, వారే చూసుకుంటారు, కాపాడతారు అన్న నమ్మకంతో, గంగతో 'నీవు శివ తేజస్సును భరించ లేకపోతే, ఆ తేజస్సును హిమవత్పర్వతప్రాంతపాదముల దగ్గర విడిచిపెట్టు' అని చెప్పగా, గంగాదేవి అలానే చేసింది. తక్షణమే అక్కడ పెద్ద మెరుపు మెరిసి, ఆ ప్రాంతమంతా మిక్కిలి కాంతితో నిండిపోయింది. తేజస్సు వెళ్ళి రెల్లుగడ్డి మీద పడగా, తక్షణమే ఆ ప్రాంతమంతా తేజోమయమైంది. ఆ శివ తేజం నుండి విశేషమైన బంగారం, తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారములో నుండి రాగి, ఇనుము పుట్టాయి. దాని మలం లోంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమిలో కలిసిపోతే నానారకాల దాతువులు పుట్టాయి. అయ్యో...మనకి కావలసినవి ఇవి కాదు కదా, పైగా తేజస్సు భూమి మీద పడింది, భూమికి కొడుకులు పుట్టరు కదా... అని బెంగగా దిగులుగా చూస్తుండగా, అక్కడ శరవణం (రెల్లుపొదలు) దగ్గరలో ఉన్న శరవణ తటాకంలో పడిన తేజం నుండి బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఒక బాబు లేచి రెల్లు పొదాల మీద పడ్డాడు. కుమార సంభవం జరిగింది🙏. 

ఇక, పార్వతీదేవి సంబంధంగా పుడతానని అన్న సనత్కుమారుడు, పార్వతీదేవికి కొడుకులా ఎక్కడ ఎలా వచ్చాడనే సందేహం వస్తుంది కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సిన కథనం మరొకటి ఉంది.

విశేషవంతమైన శరవణ తటాకం గురించి తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు భస్మాసురుడికి శంకరుడు వరం ఇచ్చిన తర్వాత, తన హస్తమును శంకరుడు తల మీద పెడతానని, ఆ అసురుడు వెంటపడగా, శంకరుడు పరుగెత్తుతుంటే, అమ్మవారు అక్కడ తన శరీరమును ఒక తటాకంగా మార్చింది. దానినే శరవణ తటాకం అని పిలుస్తారు. ఆ తర్వాత అమ్మవారు జగదంబ రూపు దాల్చినా, అక్కడ శరవణ తటాకంలా అలానే నిలిచింది. ఆ తటాకంలోనే పడి,  పార్వతీదేవి శరీరం నందు పడినవాడు అయ్యాడు కావున, అమ్మవారికి కొడుకై భాసిల్లాడు.  అమ్మ గర్భవాసం లేకున్నా, అమ్మ శరీర సంబంధంతో అమ్మకు కొడుకై వచ్చాడు. శరవణభవుడు అయ్యాడు. ఈ విధంగా కుమార సంభవం జరిగింది. దేవతలందరూ పొంగిపోయారు. విజయ దుందుభులను మ్రోగించారు. పుష్పవృష్టి కురిపించారు.
     నా మనుమరాలు శ్రీమాన్వి నాకు బహుకరించిన చిత్రం

శరవణభవ శరవణభవ పాహిమాం 
శరవణభవ శరవణభవ రక్షమాం

తతిమ్మా భాగం తదుపరి టపాలో - 

2 కామెంట్‌లు:

  1. ఓం స్కందాయ నమః
    అద్భుతః

    రిప్లయితొలగించండి
  2. ఓం స్కందాయ నమః
    చి.శ్రీమాన్వి గీసిన చిత్రం బహు రమ్యం.
    కుమారసంభవం గురించి చక్కగా వివరించారు.
    శరవణభవ శరణవభవ పాహిమాం🙏

    రిప్లయితొలగించండి