31, డిసెంబర్ 2024, మంగళవారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏



క్రిందటి టపాలో ఓ అజ్ఞాత గారు చేసిన అనేక వ్యాఖ్యలలో ఇది ఒకటి.



అజ్ఞాత గారు,
మీరు చేసిన అనేక వ్యాఖ్యలను ప్రచురించలేదు గానీ, మీరడిగిన వాటికి కాస్త వివరంగా సమాధానం ఇవ్వాలి. అందుకు సమయం లేక కుటుంబ వ్యవహారాలు నడుమ తీరిక కుదరక బదులివ్వడం ఆలస్యమైంది. మన్నించగలరు. ఈ క్రింద వివరణ అంతా మీ పలు ప్రశ్నలను, మీ ఆలోచన సరళిని దృష్టిలో పెట్టుకొని సమాధానం ఇస్తున్నాను.

ఈ యుగంలో ఎవరు గొప్పవారు?

అజ్ఞాత గారు, ఈ యుగంలో గొప్పవారే లేరనా మీ అభిప్రాయం? మరి వీరంతా ఎవరు? గొప్పవారు కాదా?

శంకర భగవత్పాదులు వారు (సా.శ. 788–820)

ఊహూ..... వీరు సాక్షాత్ శివాంశ సంభూతులు. గొప్పోరు కాక, ఏమౌతారు? వీరు కాకుండా చెప్పమని అడుగుతారా? సరిసరే...

రామానుజాచార్యులు (సా.శ.1017 - 1137)
మధ్వాచార్యులు (సా.శ.1238 - 1278)

అబ్బే...రామానుజాచార్యుల వారిని ఆదిశేషుని అవతారంగా చెప్తుంటారు. అలాగే మధ్వాచార్యులు వారిని హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయాంశ అవతారం అని కొందరు, భీముని మరుజన్మ అని కొందరు చెప్తుంటారు. కాబట్టి వీరు కాక ఇంకెవ్వరైనా ఉన్నారా...అని మరల ప్రశ్నిస్తారేమో...

శ్రీపాద శ్రీవల్లభులు (1323-1344)
వేమన (1550-1650)
సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి (1560-1750)
నారాయణ తీర్థులు (1580-1680)
మంత్రాలయం రాఘవేంద్రస్వామి (1596-1671)
త్రైలింగ స్వామి (1607-1887)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693)
సమర్ధ రామదాసు(1608 - 1682)
సొరకాయ స్వామి(1700-1902)
పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి (1710– 1800)
తరిగొండ వెంగమాంబ (1730-1817)
ఆదోని లక్ష్మమ్మ (1815-1933)
లాహిరి మహాశయులు (1828 - 1895)
స్వామి యుక్తేశ్వర్ (1855 - 1936)
బ్రహ్మానంద సరస్వతీ స్వామి (1863-1938)
కుర్తాళం మౌనస్వామి (1868-1943)
నార్పల తిక్కయ్యస్వామి (1870-1924)
కురుముద్దాలి పిచ్చయ్య అవధూత (1870-1951)
కదిరిమంగళం మునీంద్రస్వామి (1876-1961)

ఇలా ఎందరో గొప్పవారు ఉన్నారు కదండీ.

నిజమే కానీయండీ, వీరంతా అవధూతలు, యోగులు, కారణజన్ములు అయి ఉంటారు కదండీ... అని అంటారేమో...

రామకృష్ణ పరమహంస(1836 -1886)
వివేకానంద స్వామి (1863 - 1902)
కావ్యకంఠ వాసిష్ఠగణపతి ముని(1878 - 1936)
శ్రీ అరవింద యోగి (1872 - 1950)
మలయాళ స్వామి (1885 - 1962)
జిడ్డు కృష్ణమూర్తి (1895 -1986) గురువు
మాష్టర్ సి వి వి (1868 - 1922) యోగులు
పరమహంస యోగానంద (1893-1952)
శ్రీ రమణ మహర్షి (1879 - 1953)
పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (1894 - 1994)
వీరంతా గొప్పవారే కదండీ...

ఊ...కానీ, వీరిలో కొందరు తాత్వికులు, పరమగురువులు ఉన్నారు. పరమ గురువులంతా పరమాత్మ ప్రతినిధులే, పరబ్రహ్మాంశలో జన్మించిన వారే అని పెద్దలు అంటుంటారు. ఇంకనూ వీరిలో కొందరు అసామాన్య భక్త మహాశయులు...వీరు గొప్పవారేనండీ నిస్సందేహంగా. కానీ, సామాన్యులు గొప్పవారు కాదు కదా...

ఇది సరైన మాట కాదు అజ్ఞాత గారు. సామాన్యులు తమ అసామాన్యమైన భక్తితో ఎంతో గొప్పవారైనవారు చాలామంది వీరిలో ఉన్నారు. నిజానికి అందరి కంటే గొప్పవాడు భక్తుడే. ఎప్పుడో విన్న ఓ కథ గుర్తుకు వస్తుంది.
'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతాలలో ఏది గొప్ప'దని అడిగాడు శ్రీ మహావిష్ణువు, నారదుల వారిని. 'భూమి గొప్పద'న్నాడు నారదుడు. 'భూమండలంలో ఒక వంతే భూమి, మూడొంతులు నీరు కదా, భూమి గొప్పదెలా అవుతుంద'న్నాడు విష్ణువు. 'అయితే జలం గొప్పద'న్నాడు నారదుడు. 'అంతటి జలాన్ని అగస్త్యుడు తాగేశాడు కదా' అన్నాడు విష్ణువు. 'అయితే అగస్త్యుడు గొప్పవాడ'న్నాడు నారదుడు. 'అంత పెద్ద ఆకాశంలో అగస్త్యుడు ఒక చిన్న నక్షత్రమే కదా' అన్నాడు విష్ణువు. 'అయితే ఆకాశమే గొప్పద'న్నాడు నారదుడు. 'అంతటి ఆకాశాన్ని భగవంతుడు వామనరూపంలో తన పాదంతో కప్పేశాడు కదా' అన్నాడు విష్ణువు. 'అయితే భగవంతుడు పాదం గొప్పద'న్నాడు నారదుడు. భగవంతుని పాదమే అంత గొప్పదైనప్పుడు మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయంలో బంధిస్తున్నాడు కదా అన్నాడు విష్ణువు. 'అయితే భక్తుడే గొప్పవాడ'న్నాడు నారదుడు.

సుదీర్ఘమైన కాలవాహినిలోఎందరో భక్తులు పూజాపుష్పాల్లా తేలియాడి పరమాత్మలో లయించి పోయారు. వారు ఇప్పుడు లేరు కానీ, వారి జీవిత గాథలు ఎందరో సాధకులకు ప్రేరణగా నిలిచి ఉన్నాయి.

అలాంటి గొప్ప భక్తులు ఎందరో.... ఉదాహరణకు -



"తుమ్ భయే సరోవర్, మై బనీ మఛియా
తుమ్ భయే చందా, మై బనీ చకోరా
తుమ్ భయే తరూవర్ మై బనీ ఫఖియా"

"నీవనే సరస్సులో చేపవై నేను సంచరిస్తాను. నీవనే చంద్రుడికై తపించే చకోరాన్నై జీవిస్తాను. నీవనే చెట్టుపై నేను పక్షినై మనుగడ సాగిస్తాను"

"జో తుమ్ తో డో పియా మైనహీ తోడోరే
తోరీ ప్రీత్ తోడో కృష్ణ కౌన్ సంగ్ జోడో...జో తుమ్"

"నీకు దూరమై నేను జీవించలేను. నిన్ను వదిలి నేను మరెవరినీ ఆశ్రయించలేను. మన చిరకాల బంధాన్ని నీవు త్రెంచుకున్నా, కృష్ణా! నేను నిన్ను విడిచిపెట్టను".

తన సర్వస్వమయిన గిరిధర గోపాలుని కోసం ఇంతలా పరితపిస్తూ అకుంఠిత భక్తితో ధన్యత పొందిన మీరాబాయి గొప్పది కాదా?

సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలి పురందరదాసు గొప్పవాడు కాదా?

అవివేకం, దుర్జనమిత్రుల సాంగత్యం కామాంధకారంతో ఉండే ఓ వ్యక్తి పరివర్తునుడై, ఇక తన జీవితంలో మళ్ళీ బాహ్య ఆనందాలపై మనసు మరలకుండా తన కళ్ళను తానే పొడుచుకొని, మనో నేత్రాల ముందు శ్రీకృష్ణుడే కదలాడేటట్లు ప్రార్థిస్తూ, కృష్ణ భక్తుడై పరితపిస్తూ ఆకలిదప్పులు లేకుండా తిరుగాడుతుండగా, ఆ సమయంలో బాల గోపాలుడుగా వచ్చి తనకు ఆహారం అందిస్తున్నది కృష్ణుడే అని గ్రహించి, కృష్ణ సాక్షాత్కారం పొంది ధన్యుడైన బిల్వమంగళుడు గొప్పవాడు కాదా?

సూరదాసు పాడుతుంటే శ్యామనాథుడు కూర్చుని చేతులు కట్టుకొని మరీ వినేవాడట. మరి సూరదాసు గొప్పవాడు కాదా?

అలనాడు యశోదమ్మ త్రాడుకు కట్టుబడినట్లు, భక్తురాలి రూపం దాల్చి, తనకు తానే త్రాడుతో బంధీ అయి, సక్కుబాయిని అనుగ్రహించిన విధం జగత్తుకు విధితమే. సక్కుబాయి గొప్ప భక్తురాలు కాదా?

శివుడును అభిషేకించడానికి చందనం దొరకక, తన మోచేతిని చందనానికి బదులుగా అరగదీసి అభిషేకించాలని తలచి, చర్మం రగిలి, ఎముకలు కనిపించేతగా మోచేతిని అరగదీసుకొని, శివయ్య దర్శనం పొందిన మూర్తి నాయనార్ గొప్పవారు కాదా?

హనుమంతుడి గుండెల్లో సీతారాములు కొలువైనట్లు తన గుండెల్లో కోదండరాముడును దర్శింపజేసిన బూర్లె రంగన్న బాబు (1895 - 1979) గొప్పవారు కాదా?

అమ్మవార్నే తన ఇంటిలో తిరుగాడునట్లు చేసుకున్న మహాభక్తుడు, చితిలో కూడా దేవత దర్శనం అయిన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (1897 - 1990) గారు గొప్పవారు కాదా?

భద్రాచలంలో రామదర్శనంకై వచ్చే భక్తులకు ఏదైన సహాయం చేయాలన్న సంకల్పం పమిడిఘంటం వెంకటరమణ దాసుది. కౌపీనం తప్ప, ఏ ఆస్తుపాస్తులు లేని ఆయన యాయవార వృత్తి ద్వారా సంపాదించిన దానితోనే, అన్నదానం చేసేవారు. ఒకనాడు దాసు గారి ప్రయత్నంకు విఘాతం రాకుండా రామలక్ష్మణులే స్వయంగా వచ్చి వండి వార్చేరంటే ఈయన ఎంతటి గొప్పవారో కదా.





సంకీర్తనలతో అన్నమయ్య త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి తమ సన్నిధికి రప్పించుకొన్నారు. తులసీదాసు తన రామచరితమానస్‌ ద్వారా శ్రీరాముడి మనసు దోచాడు. మూఢభక్తితో కన్నప్ప తన రెండునేత్రాలను శివుడికి సమర్పించి దివ్య సాక్షత్కారం పొందాడు. పోలి తన భక్తితో శివయ్యను మెప్పించి, కార్తీక మాస చివరాఖన బొందితో స్వర్గానికి వెళ్ళింది.

కష్టాల్లో ఉన్నప్పుడు సీతారామ సమేతంగా వారి పరివారమంతా వచ్చి, త్యాగరాజును ఆదుకోవడం, అలానే వెంకటాద్రి నాథుడే బోయిలా అన్నమయ్య పల్లకిని మోయడం, తులసీదాసు వాకిట రామలక్ష్మణులు కాపలాదారులై నిలవడం, శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు తినడానికి ఏమీ లేక నీరసించి సొమ్మసిల్లగా ఆ జగన్మాతే స్వయంగా అన్నం తినిపించడం..... ఇలాంటి భక్తుల కథలు వింటున్నప్పుడు వారి అసామాన్యమైన భక్తితో ఎంత గొప్పవారు అయ్యారో అని అనిపిస్తుంది కదా.

మీ మరో ప్రశ్న 'ఇప్పుడు ఎవరున్నారు గొప్పవారు'?

ఎందుకు లేరు?

భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి వారిలాంటి పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వామి, మాతా అమృతానందమయి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు..... ఇలా మనకి తెలిసిన వారు కొందరు... తెలియని వారు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

అజ్ఞాత గారు!
అన్ని సంబంధాల కన్నా అపురూపమైనది అద్భుతమైనది భగవత్ సంబంధమే. జన్మించక ముందు, జన్మించిన తరువాత, జన్మ చాలించిన అనంతరం, నిరంతరం వెన్నంటి ఉండే బంధం దైవానుబందం మాత్రమే. పై గొప్పవారినంతా పరిశీలిస్తే భగవంతునితో అనుసంధానం చేసేది భక్తి మాత్రమేనని తెలుస్తుంది.

భక్తి అంటే -


ఇది నా మనమరాలు చిట్టితల్లి శ్రీమాన్వి 5th std లో వేసిన చిత్రం.

భక్తి అంటే -


భగవంతుణ్ణి మనసార స్మరిస్తూ, 'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అని మనల్ని మనం పరమాత్మకు అర్పించుకోవడం. అందుకే కదా, నారద మహర్షులవారు 'అన్యస్మాత్ సౌలభ్యం భక్తా' భక్తికి మించిన సాధన లేదని అన్నది.

ఇలా వీరు గొప్పవారని, వారు గొప్పవారని ఉదాహరణలు ఇవ్వడం చాలా సులువు. తమ భక్తి ప్రపత్తులతో పై వారంతా ఉదాహరణగా నిలబడటం చాలా గొప్ప విషయం. మరి అలా ఉదాహరణగా నిలబడే ప్రయత్నం మనమెందుకు చేయకూడదూ ....

అత్యాశ అంటారేమో...
కానే కాదు,
ప్రయత్నం చేద్దాం.
ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి లేదా ఆ మరుసటి రోజు...
ఈజన్మ కాకపోతే వచ్చేజన్మ, వచ్చేజన్మ కాకపోతే ఆ మరుజన్మ లేదా ఆ పైజన్మ...
ఏదో ఒకరోజునా...
ఏదో ఒక జన్మనా...
మన ప్రయత్నముకు ఫలితం రాక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం.

అందుకే దైవాన్ని భక్తిగా నిత్యం ప్రార్ధిద్దాం. ప్రార్థన అంటే అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం కాదు. అంతా నువ్వే అంతా నీదే అంటూ, మనల్ని మనం అర్పణ చేసుకోవడం. సంపూర్ణ శరణాగతి చెందడం.

ఈ భ్రమా భరిత జీవిత నాటకం నుండి ముందుగా మనం బయటపడదాం. అంతులేని ఆశలతో, అర్థంకాని ఆవేదనతో రగిలిపోయే మనస్సుకు కళ్లెంవేసి కుదురుగా కూర్చోపెడదాం. నిలువుదోపిడి ఇచ్చినట్లు మనసునంతా శూన్యం చేసి ఆయన పాదాలముందు ఒరిగిపోదాం. హృదయాన్ని ఖాళీ చేసి వేణువులా ఆయన హస్తాల్లో ఒదిగిపోదాం. ఆరంభంలో అసాధ్యంగా అన్పిస్తుంది కానీ, ప్రయత్నిస్తూ పోతే, ఏదో ఒకనాటికి సాధ్యంకాక తప్పదు. ప్రయత్నించడం మన వంతు, ఫలితాన్ని ఇవ్వడం పరమాత్మ వంతు.

నిజమే గానీ, ఇదంతా కష్టం, కొంచెం సులువైన మార్గం లేదా?

ఎందుకు లేదండీ...

మన శాస్త్రాలు పట్ల వివేచన, మన మహర్షులు యోగులు తాత్వికులు జీవన విధానం పట్ల ఓ పరిశీలన, సదవగాహన అలవడితే, మనలాంటి సాధకులకు తత్వచింతన, దైవం పట్ల అనురక్తి, భగవత్ నామం పై ప్రీతి కల్గుతాయి. అప్పుడు అర్థమౌతుంది...
నామ స్మరణ, దైవ చింతన అని రెండు మార్గాలు ఉన్నాయని.
అమ్మా లలితాదేవి...
రామ రామా...
కృష్ణ కృష్ణా...
అని జపించటం స్మరణ.
ఆ జగన్మాత కథలను, రామకథను, కృష్ణుడు చేసిన లీలలను మహిమలను మననం చేసుకోవటం చింతన. కలియుగంలో నామస్మరణను మించింది లేదని శాస్త్ర వచనం. భక్తి ప్రేమలను అంతరంగంలో నింపి, చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.

రామమంత్రం యో జపేత్ స రామో భవతీతి రామేణోక్తాః
"రామమంత్రమును జపించువాడు రాముడే యగునని రాముడే వచించినాడు" రామరహస్యోపనిషత్తు తెలిపినది. అటులనే,

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్

"ఎవరు నన్ను భక్తితో భజింతురో వారు నాయందు ఉందురు. నేను వారి యందు ఉందును" అని భగవద్గీత తెలిపింది.

భగవంతుడు భక్తసులభుడు. ఇక, ఇంతకంటే సులువైన మార్గం, సున్నిత మార్గం, సురక్షిత మార్గం, సుశిక్షిత మార్గం వేరొకటి ఏముంటుంది? ఆ నామాన్ని సదా స్మరిద్దాం... నమ్మే నామాన్ని మనసార భజిద్దాం. పెదవుల నుండి కాక, హృదయం లోంచి ఉచ్చరిద్దాం. నామాన్ని (భగవత్ నామాన్ని) నామికి ( భగవంతునికి) వినిపిస్తుందనే నమ్మకంతో కీర్తించుదాం. భగవంతుడు వింటున్నాడనే అకుంఠిత విశ్వాసంతో పలుకుదాం. నామాన్ని మించింది ఏముంది? అందుకే కదా ... మోక్షాన్ని వద్దని, నిరంతరం నీ నామం నా నాలుక మీద నర్తించగలిగేటట్లు చేయు రామా, అది చాలు నాకు అని కోరుకున్నాడు రామదాసు.



ఈ సాధన త్రికరణ శుద్ధిగా సాగితే, హృదయమనే సరస్సులో నామం ఓ తామరపూవులా వికసిస్తుంది. తామరపూవు లోని మకరందాన్ని త్రాగడానికి మనస్సు ఐహికభావనలు వదిలి తుమ్మెద వలె పరుగుతీస్తుంది.
అప్పుడే, పరిపక్వత చెందిన మనసే ఫలంగా, కోరికలులేని సమర్పణా భావాలు సుగంధపుష్పాలుగా, సర్వుల క్షేమమే మహత్వాకాంక్షగా, నిర్మల నివేదనగా హృదయాన్ని సమర్పించ గలుగుతాం. ఇప్పుడు మన సాధనకు సఫలత లభించగలదు. పరిపూర్ణ ప్రేమతో, ఆర్తిగా ఆరాధిస్తే భగవత్సాక్షాత్కారం లభిస్తుంది.



అలా భగవత్ సాక్షాత్కారాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తశ్రేష్ఠులు ఎందరో ... వీరంతా సజీవ సాక్ష్యంగా కాలవాహినిలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటి చెప్పినవారే.



హృదయపూర్వకంగా మనం దైవ స్మరణ చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు. తులసీదాసు విషయంలో ఇది నిజమే కదా.

నిజమే సుమండీ...కానీ, అలా అతికొద్దిమంది మాత్రమే చేయగలరు.

ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండకూడదు?

ఓ ఇనుపముక్కను ఓ రాయి మీద రాస్తూ రాస్తూ పోతే, వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుపముక్కతో రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా అఖండంగా రాస్తూ పోతే, భక్తి అనే వేడిపుడుతుంది. పుట్టిన భక్తి అనే వేడి పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది. కరుణింపజేస్తుంది.

అంతటి భక్తితో ఆర్తిగా వెన్నలాంటి హృదయమున్న భగవంతుణ్ణి కరిగించాలంటే చాలా ఏళ్ళు పడుతుందేమో కదండీ...

పడుతుంది. నిరీక్షించాలి!
కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేయకూడదు. విశ్వాసంతో నిలబడాలి.



నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి 'నారాయణా! నారాయణా!' అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. అప్పుడు దైవం అనుభవం అవుతుంది.

 

ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పని చేస్తున్నా,
భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో కాస్త చక్కెరనో, తేనెనో కలుపుకొన్నట్లు, జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. పరమాత్మ నామ ధ్యానంలో మునిగిపోవాలి. నిరంతర భగవన్నామ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట.


31, అక్టోబర్ 2024, గురువారం

కాదేదీ కబుర్లకనర్హం - 2




అనే టపాలో చెప్పినట్లుగా కర్మల బట్టే జన్మ ఉంటుందని, కర్మల ఫలితం అనుభవించక తప్పదని, ఎవరి కర్మలకు వారే బాధ్యులని...ఇత్యాది విషయాలు గురించి మాట్లాడుకుంటుండగా...

రాముడు ఎక్కువ కష్టాలు పడ్డాడా? కృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డాడా...అకస్మాత్తుగా అడిగిన పద్మగారి ప్రశ్నతో, అంతా ఒక్కసారిగా మౌనమవ్వగా, అదే దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయా అనే పాటలో "నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా" అని విన్నప్పుడంతా, నాకీ సందేహం వస్తుంది. మరల మనమంతా ఎప్పుడు కలుస్తామోనని అష్టావధానంలో అప్రస్తుత పృచ్చకునిలా అడిగేసాను... ఏమనుకోకండి అని అన్నారు పద్మగారు కాస్త తడబాటుతో.

శ్రీరాముని గురించి చెప్పాలంటే - 
శ్రీరాముని జననం, తన తల్లితండ్రులతో సహా అందరూ ఆనందకరంగా ఎదురుచూస్తున్న సమయంలో అంతఃపురంలో జరిగింది. అందరి ఆలనాపాలనలో అల్లారుముద్దుగా పెరిగిన బాల్యం. చక్కటి విద్యాభ్యాసం. సుమారుగా పదహారవ యేట మొదటిసారి రాక్షస సంహారం చేసి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని పూర్తి చేయించడం, ఆపై మిథిలానగరానికి వెళ్ళి శివధనస్సు విరిచి, అందరి ఆమోదయోగ్యంతో సీతాదేవిని వివాహమాడడం... ఇప్పటివరకు అంతా ఆనందకరమే. అటుపై పట్టాభిషేకం అనుకున్న సమయంలో పినతల్లి స్వార్థానికి ఆ ముహూర్తానికే అడవుల బాటపట్టాడు. తోడుగా భార్య, తమ్ముడు లక్ష్మణుడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. అరణ్యవాసం తన తండ్రికి ఇచ్చిన గౌరవంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. మొదట పదమూడేళ్ళు ఋషి నియమాలను పాటిస్తూ, ప్రకృతిలో మమేకమై చెట్లను పుట్లను చూస్తూ, వన్య ప్రాణులతో చెలిమి చేస్తూ, సెలయేర్లు సవ్వళ్లును ఆస్వాదిస్తూ, ఎంతో ఆనందంగా హాయిగా గడిపారు. చివరి ఏడాది తోడుగా ఊరటగా నిలిచిన భార్యకు దూరమయ్యాడు. కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెలో మోస్తూనే రాక్షసవధ చేశాడు. తిరిగి అయోధ్య వచ్చి ఎన్నో వేల సంవత్సరాలు ఆనందంగా అద్భుతంగా పరిపాలన చేశాడు. రాముని జీవితకాలం 11000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ...దశవర్ష శతానిచ అని విడిగా చెప్పడానికి కారణం సీతమ్మ భూమి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అని పెద్దవారు చెప్పగా విన్నాను. అంటే వివాహ అనంతరం ఒక్క యేడాది మినహా ఇద్దరు కల్సి ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నారు. 1001 సంవత్సరాలు సీతమ్మతో ఎడబాటు...దుఃఖ భారం. ఇక  లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం అహం దశరథాత్మజః... దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమేనని ప్రకటించాడు. మాయలు మంత్రాలు చూపించలేదు. విశ్వరూపం ప్రకటించలేదు. అందరిలాగే ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. సాధారణ మనిషి ఎన్ని ఇబ్బందులు పడతాడో అన్ని యిబ్బందులు పడ్డాడు కానీ, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నరుడు నారాయణుడు ఎలా కాగలడో జీవించి చూపాడు.

ఇక కృష్ణుడు విషయానికి వస్తే - 
తల్లితండ్రుల ఆవేదన నడుమ జననం. పుట్టక ముందే సంహరించాలనే మేనమామ పథక రచన. కారాగారమే జన్మస్థలం. ఆదినుండి అడుగడుగునా గండాలే. ఏ పసివాడూ అనుభవించనన్ని కష్టాలు. పుట్టిన క్షణాల్లోనే తల్లితండ్రులకు దూరం. పెరిగింది ప్రమాదకర పరిస్థితులలో. అనుక్షణం గడిపింది ప్రాణాపాయకర విపత్తులలో. హతమార్చాలని నలుదిక్కుల నుండి అసుర గణాలచే దాడి చేయిస్తున్న మేనమామ. పాలుత్రాగే ప్రాయంలోనే  పూతన, ఆపై శకటాసురుడు, తృణావర్తుడు... ఒకరని ఏముంది... ముప్పైకి పైగా అసురదాడులు... బాల్యమంతా జీవన్మరణ పోరాటమే. ఆపై మధురకు వెళ్ళడం, కంసున్ని సంహరించడం. ప్రతీ వివాహం అనేక యుద్ధ సంఘర్షణల నడుమే జరగడం. కష్టాలతో కూడిన ఎన్నో ఘట్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో నిందలు, ఎన్నో కుట్రలను ఎదుర్కోవడం, తప్పు లేకున్నా గాంధారి శాపం స్వీకరించడం, జీవితం మొత్తం విషాదమయం. చరమఘట్టంలో తనవారంతా ఒక్కొక్కరుగా కొట్టుకొని దుర్మరణం పాలవుతుంటే, కళ్ళారా చూస్తూ, నిర్వికారంగా కదిలివెళ్ళి సాధారణ వేటగాని బాణం దెబ్బకు అవతార పరిసమాప్తం చేయడం. జీవితంలో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని, దేనికీ ఎవరికీ అంకితమవ్వక సాగించిన జీవితం.  ఒక్కమాటలో చెప్పాలంటే, కుదురుగా ఉండనివ్వని పరుగు పందెంలా సాగే జీవనం కృష్ణుడిది. అయినా ఏ క్షణంలోనూ సమ్మోహనకరమైన చిరునవ్వు వీడని చిద్విలాసుడు. లీలామానుష విగ్రహుడు. దార్శనికుడుగా యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా  వ్యూహకర్తగా కనబడతాడు. 
ఈ రెండు అవతారాలను పరిశీలిస్తే, శ్రీరాముడు కంటే శ్రీకృష్ణుడే ఎక్కువ కష్టాలు పడినట్లు నాకు అనిపిస్తుందని అన్నాను.

అయితే రాముని కంటే కృష్ణుడే గొప్ప అన్నమాట... ఇది పద్మగారి ఉవాచ. 
వెంటనే అలా ఎలా చెప్పగలరు పద్మగారు? శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడే గొప్పయని కొందరు... లేదు లేదు శ్రీకృష్ణుడే గొప్పయని మరి కొందరు. అక్కడున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి చమత్కారంగా వాగ్వివాదంకు దిగారు.

కృష్ణ వర్గం : నేటికీ భగవద్గీత అంతటా అందరిచే ఆదరింపబడుతుందంటే, ఆదర్శవంతంగా నిలబడిందంటే అది మా కృష్ణుని గొప్పతనం.

రామ వర్గం : ఆహా...ఇప్పటికీ రామరాజ్యం కావాలని, వస్తుందా...మనం చూడగలమా... అని కోరుకుంటున్నామంటే, అదీ మా రాముని గొప్పతనం. 

కృష్ణ వర్గం : ఓహో... మా కిట్టయ్య పసిప్రాయం నుండే పూతనాది రాక్షసులను సంహరించాడు. మరి మీ రాముడో, యుక్తప్రాయం అంటే పదహారు ఏళ్ళు వచ్చేక తాటకిని సంహరించాడు. పుట్టినప్పటి నుండే దుష్టశిక్షణ చేయనారభించిన మా కిట్టయ్య మీ రాముని కంటే గొప్పవాడమ్మా.

రామ వర్గం : అబ్బో... బాల్యం నుండే వెన్న దొంగలించడం, అత్తా కోడళ్ళు మధ్య తగాదాలు పెట్టడం, మాయలు చేయడం...అన్నీ తుంటరి చేష్టలే. ఇత్యాదివి మీ మాయావికి చేతనయినట్లు మా మర్యాద పురుషోత్తమునికి రావు లేమ్మా.  అయినా దరిజేరిన పూతనను స్త్రీ అని ఆలోచనైన లేకుండా వెన్వెంటనే సంహరించాడు. అదే మా రామయ్యో ... తాటకిని చూడగానే ఒక్కక్షణం తటపటాయిస్తూ ఆగేడు. గురువుగారు చెప్తే తప్ప, తాటకి మీద బాణాలు వేయలేదు. స్త్రీ అని జాలి చూపాడమ్మా... ఇదీ మా రాముడంటే. 

కృష్ణ వర్గం : మీ చోద్యం బంగారం కానూ... మీ రామునిలా తటపటాయింపులు తగ్గడాలు మాకృష్ణునికి తెలియవమ్మా...అంతా స్ట్రెయిట్ ఫార్వర్డ్... అవతరించిందే దుష్టశిక్షణ కోసం. అందుకే ఏ అవకాశం ఇవ్వకుండా చిన్ననాటి నుంచే రాక్షసవధ కావిస్తూ, భూభారాన్ని తగ్గించాడు. ఇప్పుడు చెప్పండి, మా కిట్టయ్యా గొప్పా? మీ రామయ్య గొప్పా? 

రామ వర్గం : చాలమ్మా సంబడం... కొన్ని క్షణాల్లోనే ఖర దూషణాది పద్నాలుగు వేల రాక్షసులను చంపిన పరాక్రమవంతుడు మా రాముడు. అయినా
మా రాముని ఔదార్యం మీ కృష్ణునికి ఎక్కడ? ఒకరోజు యుద్ధంలో రావణాసురుని అస్త్రాలను నిర్వీర్యం చేసి, రథాన్ని కూల్చి, నేల మీద నిలబెట్టాడు గానీ, సంహరించలేదు. "రావణా!  వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకొని, బలాన్ని సమకూర్చుకుని, ఆయుధాల్ని సిద్ధం చేసుకొని రేపు రా" అని, అవకాశం ఇచ్చిన ధర్మ ప్రభువు మా రాముడు. నిస్సహాయ స్థితిలో వున్న శత్రువు పట్ల దయ జాలి చూపించడం, అవకాశం వచ్చినా, శత్రువు అధర్మంగా ప్రవర్తించినా తను నిగ్రహం కొల్పోక, ధర్మానికే విలువనిచ్చి, సంయమనంతో వ్యవహరించడం రామునికే చెల్లింది. ధర్మమే పాటించని మీ కృష్ణునికంటే మా రాముడే గొప్పవాడు. 

కృష్ణ వర్గం : అవునవును...అందుకే కదా...రావణాసురుడిని చంపకుండా అవకాశమిచ్చి పంపడం వలన మరిన్ని ఉపద్రవాల్ని తెచ్చుకున్నది. రావణుడు సంధించిన ఓ అస్త్రానికి లక్ష్మణుడు  మూర్చల్లగా, హనుమంతుడు ఔషది పర్వతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అవకాశం ఇవ్వకుండా ఉంటే అప్పుడే అంతా అయిపోయేది. అదే మా కృష్ణుడైతే అవకాశం ఇవ్వకుండా దుర్మార్గులను సంహరించడమే.  శిష్టరక్షణ చేయడమే మా కన్నయ్య ధ్యేయం. ఇక ధర్మ ప్రభువు అయిన మీ రామయ్య సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించడం, గర్భవతిగా ఉన్న తనని అడవిలో విడిచిపెట్టడం తగునా? 
రామ వర్గం : చాలు చాలు... చాలించండి మీ మాటలు. వాల్మీకి రామాయణంలో ఏముందో ముందు తెలుసుకోండి. రావణ వధ అనంతరం దగ్గరకు వచ్చిన సీతమ్మను చూసి, అనేకం మాట్లాడుతూ, చివరగా నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి. నీవు నీకు నచ్చిన చోట ఉండవచ్చు. నీవు ఇక్కడ ఉన్న  విభీషణుడు దగ్గరగానీ, సుగ్రీవుడు దగ్గరకు గానీ, లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు దగ్గరకు గాని...నీకు నచ్చిన చోటకు వెళ్ళి ఉండమని అనగా, కోపంతో సీతమ్మ, ఒక పామరుడు ఒక పామర స్త్రీతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని.....అని అనేక మాటలు పలుకగా, ఊ...నేత్రరోగికి దీపంలా నాకంటికి ఇబ్బంది కల్గిస్తున్నావు ..... అని అనెను మా రామయ్యతండ్రి. 
రాముని మాటల్లో ఎంత ఔన్నత్యం ఉందో సూక్ష్మ రహస్యముందో గ్రహించండి. అక్కడ రామ లక్ష్మణులు తప్ప ఉన్నవారంతా వానరులు, రాక్షసులు. వాలి సుగ్రీవుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు, రాక్షసుల పద్ధతి అంతే... రాక్షసుల వానరుల నీతి అలా ఉండేది. వారు గానీ, లేదా మున్ముందు మానవజాతి గానీ సీతమ్మపై ఎటువంటి అపవాదం చేయకూడదని, సీతమ్మ పాతివ్రత్యం అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత తనపై ఉండడంతో అలా నర్మగర్భంగా మాట్లాడెను. పైగా ఏ కారణం చేతనైనా భర్త దగ్గర లేనప్పుడు ఆ స్త్రీ తన బిడ్డల చెంత గానీ, పుట్టింట గానీ, అత్తింట గానీ ఏదైనా తనకి సురక్షిత ప్రాంతంలో ఉండడం మంచిది. అందుకే పరమ భక్తులైన తండ్రి సమానులైన సుగ్రీవ విభీషణుల దగ్గర గానీ, పుత్ర సమానులైన లక్ష్మణ భరత శతృఘ్నల దగ్గరగాని సురక్షితంగా ఉండమని సూచన చేసేను. ఆపై మాట్లాడుతూ నీవు దీపం లాంటిదానివి, స్వచ్చమైనదానివి కానీ, లోకాపవాదం అనే నేత్రరోగం నాకు వచ్చింది. అందుకే నేను నిన్ను చూడలేకపోతున్నాను అనెను. అంతట సీతమ్మ భర్త మనసెరిగి, పరాయివాని చెరలో కొంతకాలం ఉండి వచ్చిన నన్ను రాముడెలా స్వీకరించాడన్న లోకాపవాదు రాకూడదని, రాక్షస చెరలో పది మాసాలు ఉన్నప్పటికీ, కొందరికి మాత్రమే తెలిసిన (సుందరకాండలో హనుమంతుని తోకకు నిప్పు పెడితే, అది తెలిసిన సీతమ్మ, “ఓ అగ్నిహోత్రుడా! నేను పతిసేవ చేసి ఉన్నట్లయితే, నేను తపస్సు చేసి నిరంతరం రామ ధ్యానం చేసింది నిజమైతే, నేను పతివ్రతను అయివున్నట్లయితే, నేను భాగ్యవంతురాలను అయి ఉన్నట్లయితే రాముడు నన్ను కలుసుకోవలెను అనుకుంటున్నట్టయితే  హనుమంతుడి తోకను దహించక చల్లగా చూడు" అని ప్రార్ధించగా... తోకపై మంచు రాసినట్లు మంట చల్లబడిన ఘటనలో ఆమె ఎంత పవిత్రురాలో హనుమకు, హనుమ ద్వారా రామ లక్ష్మణ సుగ్రీవ తదితర కొద్ది మందికి తెలుసు) తన పవిత్రతను అందరికీ నిరూపించాల్సిన బాధ్యత తనదేనని గ్రహించి, 'లక్ష్మణా! చితిపేర్చు అని అగ్నిప్రవేశానికి తనకి తాను సిద్ధమయ్యేను. అంతేగానీ, రాముడు అగ్నిప్రవేశం చేయమనలేదు. అయితే రాముడు ఆపకుండా, ఆమె చెప్పినట్లు చేయమని లక్ష్మణుడికి సంకేతమివ్వడమేమిటి అని మీరు అనవచ్చు. కానీ, సీతారాముల ఇరువురికీ తెలుసు... సత్యవంతురాలు పవిత్రమయి అయిన సీతను అగ్ని కాల్చలేదని. లోక అపవాదు లేకుండా నిరూపించుకోవడానికి ఇదే సరైనదని.

అయినా చాలా ఏళ్ళ తర్వాత అయోధ్య ప్రజలు అపవాదు తప్పలేదు. సీతమ్మ గర్భవతి అయ్యాక ఆమె ఋష్యాశ్రమంకు వెళ్ళాలని ఉందని కోరుకోవడం, అదే సమయంలో ప్రజల అపవాదు... తత్ఫలితంగా ప్రజా రక్షణ, ప్రజాభిప్రాయం గౌరవించడం, వ్యక్తి ధర్మం కంటే రాజ ధర్మం ముఖ్యం అనే ధర్మానుసారం సీతమ్మను వాల్మీకి ఆశ్రమం దగ్గరలో విడిచిపెట్టమని ఆజ్ఞాపించెను. ఇక్కడ ఓ విషయం గుర్తించండి. ప్రజలు ధర్మమార్గంలో ప్రవర్తించడం గురించి ఎంత ఆలోచించాడో, సీతమ్మ కోరిక మేరకు ఆమెకు ఋష్యాశ్రమం ప్రాప్తమయ్యేటట్లు చూసాడు. అంటే మా రాములోరు అటు రాజా రామునిగా, ఇటు సీతారామునిగా ధర్మమార్గంలో నడిచారు. 

లోతైన ధర్మగతిని లౌకిక దృష్టి గ్రహించలేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ; ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తియని లోకమంతా ఇన్ని యుగాలు తర్వాత కూడా గొప్పగా చెప్పుకుంటుంది.
ఇక మీ కృష్ణులవారో...ధర్మాన్ని తప్పి ద్రోణాచార్యుడుని, కర్ణుడిని సంహరించేలా చేయలేదా? ఇప్పుడు చెప్పండి సఖులారా! ఎవరు గొప్పో? 

కృష్ణ వర్గం : ఓహో.....ధర్మ సూక్ష్మాలు మీకూ, మీ రాములోరికేనా... మాకూ ఎఱుకే. మీ ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి. నగలు సొమ్ము మూట కట్టుకుని పారిపోతున్నారు. వారిని పట్టుకోవడానికి మీరు  తరుముకుని వెళ్తున్నారు. దొంగలు సందుల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు వారిని పట్టుకోవాలని వెంబడిస్తున్న మీరు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగలను పట్టుకోవాలంటే వారిని అనుసరిస్తూ, వారు వెళ్ళిన మార్గంలోనే మీరూ వెళ్ళాలి కదా.
సరిగ్గా ద్వాపరయుగంలో ఇదే జరిగింది. ధర్మవిరుద్ధంగా వెళ్ళేవారిని అదే మార్గంలో వెళ్ళి శిక్షించడం జరిగింది.
ద్రోణాచార్యుడు గురువు అయి వున్నందున యుద్ధం
చేయరాదు. రెండు వైపులా న్యాయం చెప్పాలి. మంచి చెడులను వివరించాలి. అంతే గానీ ఆయుధాలు పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం. అలానే బ్రాహ్మణుడు అయివుండి సాత్త్విక గుణం కంటే మెండుగా రజోగుణం కలిగి ఉండడం, స్నేహితుడు ద్రుపదుడుపై ప్రతీకారం, దృతరాష్ట్రుడు మాదిరిగా కాస్త పుత్రప్రేమతో అధర్మవర్తనం, ద్రౌపది వస్త్రాపహరణ సమయమందు అధర్మాన్ని నిలువరించకపోవడం... ఇవి ద్రోణాచార్యునికి తగునా? ఇది అధర్మం కాదా? అందుకే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు "అశ్వత్థామ హతః" అని పెద్దగా చెప్పి, "కుంజరహః" అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి, తప్పదు. ఏ కార్యమైనా లోక కళ్యాణానికే చేయించాడు.
ఇక కర్ణుడు - 
కర్ణుడి రథచక్రం భూమిలో దిగిపోవడంతో, రథం దిగి దాన్ని సరిచేస్తున్న సమయంలో, శ్రీకృష్ణుడు వెంటనే కర్ణున్ని చంపమన్న ఆదేశం ఇవ్వడంతో అర్జునుడు కర్ణునిపై బాణాలు సంధిస్తుండగా, నిరాయుధుడుపై బాణాలు సంధించడం ధర్మమేనా... ఇత్యాది ప్రశ్నలతో కృష్ణా! నీవే ఆజ్ఞాపిస్తున్నావా..... ధర్మం నన్నెందుకు రక్షించడం లేదని ప్రశ్నించగా - 

 

కర్ణా! ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మం వదిలిపెట్టడం వలనే నేడు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను అంగరాజు చేశాడన్న ఒకే ఒక కారణంతో ధర్మహీనుడైన దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తాను, మాట్లాడతాను అన్నట్లు ప్రవర్తించావు. ఎన్ని తప్పు పనులు చేశావో, తప్పు పనులు చేయడానికి ప్రోత్సహించావో గుర్తుతెచ్చుకో. దురాభిమానంతో గర్వంతో ఉండేవాడివి. లక్క ఇంటిని కాల్చేస్తున్నప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? కపట జూదంతో నీ మిత్రుడు దుర్యోధనుడు ధర్మరాజును ఓడిస్తున్నప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా? మిత్రుడు అధర్మ మార్గంలో నడిస్తే  మిత్రుడుగా మంచిమార్గంలో పెట్టడం నీ ధర్మం కాదా? నిండుసభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు నీవు అన్న మాటలు ధర్మబద్ధమైనవా? చక్రవ్యూహంలో బాలుడైన అభిమన్యుడు వీపుపై బాణాలు సంధించి, నిరాయుధుడైన సమయంలో, అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపినప్పుడు, ధర్మం తెలియరాలేదా? ఇది నీ కర్మ ప్రతిఫలం. ఇదే న్యాయమని ఆనాడే కృష్ణుడు చెప్పింది మీరు మరిచారా? అధర్మ ఆశయం ధర్మం నిలబెట్టడమే అయితే, ఆ అధర్మం కూడా ధర్మమే అవుతుంది. ఇప్పటికైనా మా కృష్ణ తత్త్వం గ్రహించి ఒప్పుకొండి కన్నయ్యే గొప్పవాడని. మీకో కథ చెప్పమా...విని మీరే చెప్తారు మా కిట్టయ్యే గొప్పయని. 
ఒకానొక రోజు గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్ళు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తి పెడతారేమో అని ఇటూ అటూ చూసింది. అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. "కృష్ణా కృష్ణా" అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు. కృష్ణకు ఏమైంది ఈరోజు అని అనుకుంటూ, ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె ఇంటికి ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. "రా! కుండ దించి పెడతాను," అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అడిగింది. "అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావో... నాకేం అర్ధం కావడం లేదు, కృష్ణా!" అంది. కృష్ణుడు నవ్వి, "నేను భారం దించేవాడిని, భారం ఎక్కించడం నా పని కాదు" అని వెళ్ళిపోయాడు. ఇదీ మా కృష్ణుని గొప్పతనం. కృష్ణా కృష్ణా అని పిలిస్తే చాలూ, మన భారాల్ని ఆయనే దించుతాడు. ఇప్పుడు చెప్పండి మా కన్నయ్యే గ్రేట్ అని.
ఓసోసి... మేమూ ఇలాంటి బోలెడు కథలు విన్నాం, చదివాం. మేమూ కథలు చెప్పగలం. 
ఒకానొకరోజు ఒకచోట రామనామ భజన జరుగుతుండడం చూసి, ఒకతను అపహాస్యం చేస్తూ మాట్లాడం గమనించిన ఒక జ్ఞాని, అతనని వారించి, నీకు తెలుసివస్తుందిలే త్వరలో రామ నామ మహిమ అని చెప్పి, అతనికి రామనామాన్ని ఉపదేశించి, 'దీన్నెప్పుడూ ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు, నీకు వీలున్నప్పుడల్లా చెప్పుకో' అన్నాడు. కాలక్రమంలో అతను చనిపోయాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. యమధర్మరాజు అతని పాపపుణ్యాల లెక్కలను పరిశీలించి, 'ఓమారు రామ నామాన్ని ఉచ్ఛరించావు. అందుకు నీకు ఏం కావాలో అడుగు?' అన్నాడు. అయితే అతనికి జ్ఞాని చెప్పిన 'ప్రతిఫలం కోసం ఇచ్చుకోకు' అన్నమాట గుర్తుకు వచ్చింది. కనుక అతను యమధర్మరాజుతో 'మీరు ఏమి ఇవ్వదలచుకున్నారో అది మీరే ఇవ్వండి. నేనుగా ఏదీ అడగను' అన్నాడు. అతని మాటలకు యమధర్మరాజు విస్తుపోయాడు. రామనామానికి తాను ఎలా వెల కట్టగలనని అనుకున్నాడు. ఎందుకైనా మంచిది ఈ విషయమై ఇంద్రుడిని కలిసి ఆయననే ఓ నిర్ణయం తీసుకోమంటే సరిపోతుందనుకున్నాడు. అతనితోపాటు యమధర్మరాజు ఇంద్రుడి వద్దకు బయలుదేరబోయాడు. అయితే అతను ఓ షరతు విధించాడు. 'నేను మీతో రావాలంటే నన్ను పల్లకీలో తీసుకుపోవాలి. పైగా ఆ పల్లకీని మోసేవారిలో మీరొకరై ఉండాలి' అన్నాడు. ఇందుకు సమ్మతమైతే వస్తానన్నాడు. ఇతను నన్నూ ఓ బోయిగా చూడాలనుకుంటున్నాడంటే రామనామ మహిమ ఘనంగానే ఉందన్న మాట అని అనుకున్నాడు యమధర్మరాజు. అందుకే అతను ఇలా షరతు విధిస్తున్నాడని భావించాడు. అందుకు సమ్మతించాడు. పల్లకీ మోసే బోయీలలో యమధర్మరాజు ఒకడయ్యాడు. ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. యమధర్మరాజుకు తన రాక కారణం చెప్పాడు. అయితే ఇంద్రుడు రామనామ మహిమకు నేను వెలకట్టలేనన్నాడు. మనమందరం కలిసి బ్రహ్మ దగ్గరకు పోదామన్నాడు. యమధర్మరాజుతోపాటు ఇంద్రుడు కూడా పల్లకీ మోస్తేనే తాను బ్రహ్మ వద్దకు వస్తానన్నాడతను. చేసేది లేక ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామ మహిమకు వెలకట్టలేననీ, వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదామనీ అన్నాడు. యమధర్మరాజు, ఇంద్రుడితోపాటు బ్రహ్మ కూడా పల్లకీ మోసే బోయీలలో ఒకడయ్యారు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. విష్ణువుతో తామెందుకు వచ్చామో చెప్పారు. 'ఇతను ఒక్కసారి రామనామాన్ని ఉచ్ఛరించాడు, అందువల్ల అతనికి ఏ పుణ్యం దక్కుతుందో మీరే చెప్పా'లన్నారు యమధర్మరాజాదులు. 'ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకీలో కూర్చోపెట్టి మోసుకువచ్చారు కదా, దీని బట్టి ఇంకా మీకు రామనామ మహిమ అర్థం కాలేదా?' అని ప్రశ్నిస్తూ ఆ ఆత్మను తనలో కలుపుకొన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు చెప్పండి కృష్ణ భక్తమహాశయులారా! మీ అభిప్రాయాన్ని...

బాబోయ్...ఇక ఆపండీ...మనందరికీ తెలుసు. ఇద్దరూ శ్రీమన్నారాయణుని అవతారములే. 


రాముడు పూర్ణ మానవవతారం. కృష్ణుడిది పరమాత్మ అవతారం. ఒకరు మాయామానుష విగ్రహులు, మరొకరు లీలామానుష విగ్రహులు.

ఒకరిది త్రేతాయుగం, మరొకరిది ద్వాపరయుగం. రామునిలా ధర్మంగా ఉంటానంటే ద్వాపరయుగంలో కుదరదు. ఇక్కడ ధర్మానికి ధర్మమే సమాధానం, అలాగే మోసానికి మోసమే సమాధానం. ధర్మ రక్షణ యుగయుగానికి భిన్నం. యుగధర్మాలు, అవతార బేధాలు గమనిస్తే ఈ ధర్మ సూక్ష్మాలు అవగతమౌతాయి. 
త్రేతాయుగంలో అప్పటి ధర్మశాసనాలు, ఆనాటి కాలానుగుణంగా రాముడు గొప్పవాడు. ద్వాపరయుగంలో అప్పటి కాలపరిస్థితులను బట్టి కృష్ణుడు గొప్పవాడు. త్రేతాయుగంలో రాముడు చేసిన పనిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పి చేయించాడు. 
రాముడు చేసి చూపించినది ఆచరణీయ ధర్మమార్గం.
కృష్ణుడు చెప్పి చేయించింది ఉపదేశ ధర్మమార్గం. అందుకే పెద్దలు అంటుంటారు 'రాముడు చేసింది చేయరా, కృష్ణుడు చెప్పింది వినురా' అని.
రాముడుని అనుసరించాలి, రాముని పనులను అనుకరించాలి. 
కృష్ణుడిని ఆశ్రయించాలి, కృష్ణుడు చెప్పినదానిని ఆచరించాలి. 

ధర్మాన్ని అనుసరించిన దేవుడు శ్రీరాముడు కాగా, ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు.
కాబట్టి ఇద్దరూ ఇద్దరే. ఇక ఈ చర్చ ఇంతటితో ఆపి ఇళ్ళకు వెళ్ళకపోతే భగవంతుని అనుగ్రహం ఉన్నా లేకున్నా, భర్త ఆగ్రహం తప్పక చవి చూడాల్సి వుంటుంది. ఇక  నడవండి అంటూ ముగించింది ప్రియంవద.

14, జనవరి 2024, ఆదివారం

కాదేదీ కబుర్లకనర్హం.....

కొన్ని నెలల క్రితం మిత్రురాలు రుక్మిణి జీ (రుక్మిణీదేవి | భారతీయం బ్లాగర్) వాట్సప్ లో పంపిన ఈ క్రింద వీడియో నచ్చి, మరి కొందరు స్నేహితులకు ఫార్వర్డ్ చేసాను.



{तूने जो कमाया है दूसरा ही खायेगा
खाली हाथ आया था खाली हाथ जाएगा
जब तलक ये सांसे हैं तब तलक ये रिश्ता है
सांस जिस घड़ी टूटी तो रिश्ता टूट जायेगा
जीते जी तू माया में राम नाम को भुला
मौत का समय आया तो राम याद आएगा

మీరు సంపాదించినది ఇతరులు తింటారు లేదా  అనుభవించుతారు
ఖాళీ చేతితో వచ్చావు ఖాళీ చేతితో పోతావు
ఈ శ్వాస ఉన్నంత కాలం ఈ సంబంధ అనుబంధాలు ఉంటాయి 
శ్వాస విడిపోయిన  మరు క్షణం సంబంధ అనుబంధాలు విచ్చిన్నమవుతాయి
జీవించి ఉండగా మీరు మాయలో పడి రాముని నామమును మరచి పోతారు
మరణ సమయం వస్తే ఆ రామ నామం  గుర్తు వస్తుంది}

ఈ వీడియో చూసి ఇది సత్యం అని కొందరు, నైస్ వీడియో అని కొందరు బదులివ్వగా, కొన్ని కొన్ని తరచి చూసి చర్చించే సత్సంగ మిత్రులు ఎప్పటిలా చర్చకు తెర తీసారు. 

మిత్రురాలు శారద మాట్లాడుతూ -
భౌతికంగా ఖాళీ చేతులతో రావడం, పోవడం కన్పిస్తుంది గానీ, పాప పుణ్య కర్మ మూటలు మరణించినప్పుడు తీసుకొని వెళ్తాం, అవి అనుభవించడానికి మరల పుడతాం. 


కర్మలు చేయకుండా ఉండలేం, కర్మ ఫలితాలు అనుభవించకుండా తప్పించుకోలేం. ఈ కర్మ వలయాన్ని భేదించుట అంత సులువు కాదు. అలానే మరణ సమయంలో భగవంతుని నామం గుర్తు రావాలంటే, అందుకు తగ్గ అభ్యాసం ముందు మనం చేస్తేనే గుర్తుకు వస్తుంది. లేదంటే మన ప్రారబ్దంలో ఏదైనా పుణ్య ఫలం ఉంటేనే సాధ్యమౌతుందనగా,

నిజమే, ఎవరూ వట్టిగా పుట్టలేదు, ప్రారబ్ధం అనే మూటలను నెత్తిన పెట్టుకుని మరీ పుడతాం. కర్మ ఫలం బట్టే జన్మలు. ఇక జన్మించాక కర్మలు చేయాల్సిందే. ఆ కర్మ ఫలితాలు ఇప్పుడో (ఈ జన్మలోనో) మరెప్పుడో (మరు జన్మలలోనో) అనుభవించక తప్పదు. అవతార పురుషులకైనా తప్పదు. రాముడు వాలిని చెట్టు చాటు నుండి ఒక్క బాణం వేటుతో హతమార్చిన ఫలితంగా, మరు జన్మలో కృష్ణ నిర్యాణం ఓ వేటగానిచే ఒక బాణం దెబ్బతో అనుభవించాల్సి వచ్చింది.  వెళ్ళి పోయేటప్పుడు ప్రాణవాయువు కర్మ వాసనలను తీసుకెళ్తుంది. ఏ వాసనలతో పోతామో అది మరుజన్మకు నాంది అవుతుంది. ఆ కర్మ వాసనల వలనే కదా, శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యం పొందినా సరే, అర్జునుడు కన్నప్పగా, భీముడు మధ్వాచార్యులుగా పుట్టారని పెద్దలు చెప్తుంటారు. మరి ఈ కర్మ వలయాన్ని చేధించడం ఎలా భారతీ గారు? ఇది పద్మగారి ప్రశ్న.

చెప్పారుగా గీతాచార్యుడు... "కర్మయోగం".
కర్మయోగమే మనకున్న ఏకైక అవకాశం.  కర్మని ఓ యోగంలా చేయడమే. మన దైనందిక కర్మలను, బాధ్యతలను కర్తవ్యమును ధర్మబద్దంగా నిర్వహిస్తూ, దైవస్మరణ విడువకుండా సాధనా మార్గంలో సాగిపోవాలి. మనకోసం, మన కుటుంబం కోసం కర్మలు చేయక తప్పదు! అంటే పనులు చేయడం ఎలాగూ తప్పదు. ఆ పనులేవో భగవంతుడుని స్మరిస్తూ చేస్తే, అది ఉపాసన అవుతుంది. ఏ ఉపాసనా చేయకున్నా మన రోజులు గడిచిపోతాయి. నిస్సారంగా జీవితం ముగిసిపోతుంది. పుట్టాం...గిట్టాం... అంతే! అదే మన జీవనవిధానం ఉపాసనతో అనుసంధానం చేస్తే జీవితం సారవంతమై అర్థవంతంగా పూర్తి అవుతుంది. 


కర్మని భగవత్ స్మరణతో చేస్తే, ఆ కర్మ యోగమౌతుందని నేను చెప్తుండగా...

ఏమిటో... ఈ కర్మ బంధనాలు...
ప్రారబ్ధ మూటలను భారంగామోస్తూ, ఇది నా తలరాత, విధిరాత అనుకుంటూ మరిన్ని కర్మలు మూట కట్టుకుంటూ...కర్మత్రయానికి లోబడి చావు పుట్టుకల చక్ర భ్రమణంలో పడి బ్రతుకుతున్నవారు కొందరు.
నిండు గుండెతో, మెండైన నమ్మికతో దైవాన్ని ఆశ్రయించి  మోసేది ఆయన, చూసేది నేను అనుకుని భక్తి మార్గంలో జీవిస్తూ జన్మ పరంపరను తగ్గించుకునేవారు మరికొందరు.
మోసేది ఎవరు? చూసేది ఎవరు? ఉన్నది ఒక్కటే... చావు పుట్టుకలు శరీరానికే అని ధ్యానమార్గంలో నడిచేవారు మరికొందరు.
పై మూడు సిద్ధాంతాలు గురించి ఔనని చెప్పిన, కాదని చెప్పినా, అవి ఎఱుకలో లేని మాటలే.  అన్నీ భ్రమ, భ్రాంతి లోవే... అన్నీ స్వప్న సదృశ్యమే... అని కొట్టిపారేస్తూ జ్ఞానమార్గంలో ఇంకొందరూ...
హూ... ఈ కర్మల గురించి ఎంతని చెప్పగలం? ఎంతని తెలుసుకోగలం? భగవాన్ గీతలో చెప్పారుగా... అభ్యాస జ్ఞాన ధ్యానాలకంటే కర్మఫల త్యాగమే గొప్పదని.
శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ ||

కర్మఫల త్యాగం మనం చేయలేం. అంతటి పరిణితి రాలేదు కాబట్టి. నన్నడిగితే కర్మలను భగన్నామస్మరణతో కలిపి సాధన చేయడమే ఒకింత సులభం అన్పిస్తుందని రజినీ గారు చెప్తుండగా...

మనతో పాటు మన కర్మ మూటలు మోసుకుపోవడం తప్పనప్పుడు, ఆ కర్మ మూటలేవో సుకర్మ అంటే పుణ్య మూటలైతే బాగుంటుంది కదా... నాకో కథ గుర్తుకొస్తుందంటూ -
ఒకానొక ధనవంతునికి ఓ సందేహం వచ్చింది. మరణించినప్పుడు మనతో ఈ సంపద రాదంటారే...ఊహు ...ఈ సంపద అంతా నాతోనే వుండాలి, నేను మరణించాక కూడా నాతో పాటే వుండాలి...ఎలా మరి...ఎన్నో విధాల యోచించిన సరైన ఆలోచన తట్టక, ఓ ప్రకటన చేస్తాడు. నేను మరణించాక కూడా నా సంపదనంతా నేను తీసుకెళ్ళడానికి సరైన సలహా ఇచ్చిన వార్కి లక్ష బంగారు వరహలిస్తానని.
ఈ ధనికునికి డబ్బు పిచ్చి కాకపోతే, ఇదెలా సాధ్యమని అందరూ అనుకుంటున్న తరుణంలో ఓ యువకుడు వచ్చి, నేను మీకో సలహా ఇస్తాను. మీరు నా సలహా అమలు చేస్తే, మీ సంపద అంతా మీతో తీసుకు వెళ్ళవచ్చునని చెప్పగా, ఎంతో ఆతృతగా, 'ఎలా' అని ప్రశ్నిస్తాడు కోటీశ్వరుడు. మీరు అమెరికా వెళ్ళారనుకొండి, అక్కడ ఈ ఇండియా రుపీ చెల్లుతుందా? చెల్లదు కదా. మరి అక్కడ చెల్లాలంటే మీకు కావల్సిన డబ్బు మొత్తం బ్యాంక్ లో ఎక్సేంజ్ చేసుకొని డాలర్లుగా మార్చుకొని తీసుకువెళ్ళి ఉపయోగించుకుంటారు. అదే రష్యా వెళ్తే రూబుల్ గా, జపాన్ వెళ్తే యెన్ గా మార్చుకొని వెళ్తాం. అదే రీతిలో మీ డబ్బు / సంపద స్వర్గానికి తీసుకు వెళ్ళాలంటే మార్చుకొని తీసుకు వెళ్ళాలి. 
'అవునా! ఏ బ్యాంక్ లో ఎక్సేంజ్ చేయాలి? ఆ బ్యాంక్ ఎక్కడుంది? ఆ బ్యాంక్ లోనికి నా డబ్బును ఎలా ట్రాన్స్ఫర్ చెయ్యాలి'? 


మీ దగ్గర ఉన్న సంపదను సేవా కార్యక్రమాలకు, సత్కర్మలకు వినియోగించి పుణ్యంగా మార్చుకుంటే, మీతో పాటు మీ పుణ్య సంపదను తీసుకువెళ్ళవచ్చు..... అని చెప్పిన యువకుడిని ఎంతో సంతోషంతో సత్కరించి, ఆ సూచననుసరించి తరించెను ఆ ధనికుడు.
నిజమేకదా...మానవసేవే మాధవసేవని పార్వతి గారు చెప్పారు.

నామ స్మరణ చేయువారికి పాపాలు పోతాయన్నది నిజమేనా? నాకు తెలిసిన కొందరు నామ స్మరణ చేస్తునో, స్తోత్రాలో మంత్రాలో పఠిస్తునో, వంట చేస్తుంటారు. పూజలు, ఆలయ దర్శనాలు, అర్చనలు చేస్తుంటారు. మరి వారికి పాపాలు పోయినట్లేనా? పాప ఫలితం వారికి ఉండదా? ముక్తస్థితిలో వారున్నట్లా? వారనే కాదు, మిమ్మల్నే తీసుకొండి...రామ స్మరణంలో ఉంటారు. మరి మీకు ఇక ఏ పాప కర్మ ఫలితాలు లేనట్లేనా...
ఆగండి వాణిగారు, మీ మనోభావం నాకు అర్థమైంది. 
నామ స్మరణ చేస్తే పాపాలు పోతాయన్నది సత్యం. ఇది శాస్త్ర వచనం. అయితే కుంజర శౌచం మాదిరిగా చేస్తే, కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు. అంటే, నామజపం చేస్తున్నా, పాప కర్మలు మరల మరల చేస్తే ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సిందే. 
ఇక నా గురించి అంటారా... ప్రాపంచిక బంధపాశముకు కట్టుబడి, కాలానుగుణంగా ఎవర్నీ నొప్పించక నొవ్వక సాగుతున్న నేపథ్యంలో చిరు చిరు తప్పులు తప్పవు. నా దృష్టిలో ఒప్పైన కర్మ, మీ దృష్టిలో తప్పు కావచ్చు.  మా తాతయ్య గారు ఓ మాట చెప్పేవారు...కర్మ అంటే, మనం చేతులతో చేస్తున్నదే కాదు, మనో వాక్కులతో చేసేది కూడా కర్మే. అలానే ప్రస్తుతం మనకు ఏం జరుగుతుందో అది మాత్రమే కాదు, మనకు ఏదైతే జరుగుతోందో, దానికి మనం ఎలా అనుభూతి చెందుతున్నామో, ఎలా స్పందిస్తున్నామో అనేది కూడా మన కర్మే. మనం చెడు చేయకపోవచ్చు కానీ; మన కళ్ళెదుట జరిగే చెడును చూస్తూ అడ్డుకోక పోవడం కూడా తప్పే. అది కూడా మన కర్మల ఖాతాలో జమవుతుంది. ఉదాహరణకు మహాభారతంలో భీష్మ, ద్రోణులు పెద్దలైనా, ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకోలేకపోతారు. రాజుకు విధేయులై ఉండాలన్న ధర్మం పాటించినా, కళ్ళముందు జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డుకోరు. జీవితమంతా మంచిగా బ్రతికినా, కళ్లెదుటి అధర్మ కార్యాన్ని అడ్డుకోలేని ఫలితానికి శిక్షగా యుద్ధంలో చంపబడతారు. నాది సర్ధుబాటు మనస్థత్వం. తటస్థ వైఖరి. వెంటనే దేనిని ఖండించలేను. కానీ, ఆ క్షణాల్లో నాలో రామ స్మరణం రెట్టింపు అవుతుంది. కొంతసేపటికి ప్రశాంతత... అలాగని మనస్సులో దేనిని మోయను... ఏదీ నిలవదు. నా ఈ వైఖరి కొంత తప్పే... కావున, నా కర్మ ఫలాలు నేను అనుభవించక తప్పదు. ఐతే రామ స్మరణ నడుమ పాపపుణ్యాల గురించి చింతన, చింత లేనే లేదు. కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడం స్థితప్రజ్ఞత. అంతటి ప్రజ్ఞ నాలో రాలేదింకా వృద్ద పక్షిలా. ఇక రామ నామ స్మరణం భక్తిగా అలవర్చుకున్నది... శ్రీరాముడు అంటే అమిత ప్రేమ, నా అంత్యకాలంలో రామ ధ్యాసలోనే తుదిశ్వాస విడవాలని. ఓ గృహిణిలా నా కర్మలు నేను సరిగ్గా నిర్వర్తిస్తూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, అప్పుడప్పుడు మీలాంటి వారితో సద్గోష్టిలో పాల్గొంటూ, మాయలో పడి గాడి తప్పుతున్న మనస్సును రామ స్మరణతో తిరిగి గూటిలో పెడుతూ సరళమైన జీవనం సాగిస్తున్నాను వాణి గారు. ఇదే నా కర్మలన్నింటిలో ప్రధాన కర్మ. ఇంతకు మించి నాకేమీ తెలియదని చెప్పగా, బాగుంది బాగుంది కానీ, ఆ వృద్ధ పక్షి ఊసేమిటి మధ్యలో...అని అడిగిన మిత్రులకు ఎప్పుడో చదివిన ఈ కథను చెప్పాను.
అనగనగా ఓ ఎడారి ప్రాంతంలో నివాసముండే ఓ పక్షి వృద్ధాప్య దశకు చేరుకున్నాక, జవసత్వాలు తగ్గి బక్క చిక్కేక, తన దీనావస్థకు దుఃఖిస్తూ,
అయ్యో! యవ్వనంలో వున్నప్పుడు ఎట్లా వుండేదానిని, ఇప్పుడు ఇలా వున్నాను...ఆహా... ఏమి నా తలవ్రాత అని అనుదినం చింతుస్తూ  కృంగిపోసాగింది. 
అలాంటి తరుణంలో ఆ పక్షి మసకబారిన కంటి చూపుకి, 
ఒక దేవదూత పక్షి అటుగా వెళ్ళడం కనిపించింది. వెంటనే కాస్తా సత్తువ కూడబెట్టుకొని, ఆ పక్షిని పిలుస్తూ, 
ఓ దైవ కపోతమా! నీవు ఎటు వెళ్ళుచున్నావు? అని అడుగగా...
ఆ దేవదూత పక్షి "నేను దైవం వద్దకు వెళ్తున్నానని" బదులిస్తుంది.
అంతట ఈ వృద్ధపక్షి, ఓ దేవదూత! నా ఈ దీన స్థితిని నీవు చూసితివి గదా, నాయందు దయపూని, నాకీ దైన్యత ఇంకెంతకాలమో దైవాన్ని అడిగి బదులీయరాదా? అంటూ వినమ్ర పూర్వకంగా, ఆర్తిగా అడిగింది.
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ద పక్షి ఎంతో ప్రాదేయపూర్వకంగా, దేవుని సమాధానం తెలుసుకోవాలనే తపనతో దేవదూత కపోతమును హృదయపూర్వకంగా వేడుకోగా,  ఆ పక్షి దైన్యతను చూసిన, ఈ దేవదూత పక్షికి కళ్ళు చెమర్చగా, 'నీకేం భయంలేదు, నీ తరఫున నేనడుగుతా, దైవం నుంచీ సమాధానం తప్పకుండా తీసుకుని వస్తాను అంటూ బయలుదేరిన ఆ దేవదూత పక్షి భక్తితో దైవం వద్దకు వెళ్ళి, సమయాసమయాలు చూసుకుని, మంచి తరుణంలో ఈ వృద్ధపక్షి ఉదంతం అంతా చెప్పి, హే! పరమ దయాళు! స్వామి! ఆ వృద్ధ పక్షి దైన్య స్థితి పోవడానికి ఎంత కాలం పడుతుందోనని తెలుసుకుని రమ్మని చెప్పిందని విన్నవించుకోగా -
అంతట దైవం, "ఆ వృద్ధ పక్షి రూపంలో వున్న జీవుడికి "వినాదైన్యేన జీవితం, అనాయాసేన మరణం" సంప్రాప్తమవ్వాలంటే, ఇంకా ఏడు జన్మలు పడుతుంద"ని పలికెను.

అప్పుడు ఆ దేవదూత పక్షికి ఆ వృద్ధ పక్షి దైన్య రూపం, హృదయపూర్వక ప్రార్థన గుర్తుకువచ్చి, 'అలా కాదు... స్వామి! ఏదైనా తరుణోపాయం వుంటే సెలవీయండి' అని వేడుకోగా, అంతట ఆ పరందాముడు దయామృత వదనుడై, కృపా రసార్ద్ర హృదయుడై, చిరు మందహాసంతో, "దైన్య స్థితినుంచీ దైవ స్థితికి చేరేందుకు మార్గమొక్కటి వున్నది, ఏది జరిగినా, ఏది ప్రాప్తించినా, ఏది ఏమైనా, అంతా ఈశ్వరేచ్ఛ మేరకే, అంతా భగవదనుగ్రహం మేరకే జరుగుతుందని, నేను చేసింది ఏమీ లేదని, పరిపూర్ణ విశ్వాసంతో, బలీయమైన నమ్మికతో, దృఢమైన చిత్తంతో... ఎదురౌతున్న ప్రతీదీ ఈశ్వర ప్రసాదమనే భావించి, 'సర్వకారణమీశ్వరం' అనెడి వాక్యాన్ని ఆశ్రయించి వున్నట్లయితే, అప్పుడు పరిస్థితి మారవచ్చును" అని సూచన చేసెను.
అంతట ఆ దేవదూత పక్షి శీఘ్రగతిన వృద్ధ పక్షి వద్దకు వచ్చి, పరమాత్ముని మాటలు వినిపించి, ధైర్యాన్ని ఆనందాన్ని నింపి, సంతోషంగా వెడలిపోతుంది.


ఇక ఈ వృద్ధపక్షి దేవ కపోతం మాటలను శ్రద్ధగా విని, విశ్వాసంతో ఆచరణ లోనికి తెచ్చుకుంది. 
ఎంతలా అంటే - ఇవాళ ఆహారంగా కాసిన్ని రెక్కల పురుగులు దొరిగాయి... సంతోషం, ఈశ్వర ప్రసాదం... ఈశ్వరా! నీకు కృతజ్ఞతలు.
మరోరోజు ఆహారంగా పప్పు ధాన్యాలు లభించాయి... ఇది ఈశ్వర అనుగ్రహం... ఈశ్వరా! నీకు ప్రణతులు. 
ఇంకో రోజు ఆహార అన్వేషణ గావిస్తుంటే, కంట్లో నలుసుపడి తీవ్రంగా బాధించింది, అప్పుడు కూడా, ఇదీ ఈశ్వర ప్రసాదమే, ఈశ్వరా! నీకు కన్నీటితో నమస్సులు..
వేరొక రోజు ఆహారంకై వెళ్తుండగా... ముళ్ళకంప గీరుకుంది... మరీ సంతోషం... ఇదీ ఈశ్వరానుగ్రహమే... ఈశ్వరా! నమోనమః ఇలా... ఆహారం దొరికినా, దొరకున్నా, ఎక్కువైనా, తక్కువైనా, భుక్తాయాసమైన, కడుపుమాడిన... ఏది ఏమైనా సరే, ప్రతీసారి, ప్రతీ చోట... ఈశ్వర, ఈశ్వర, ఈశ్వరా నీవే సర్వమూ, అంతా నీ అనుగ్రహమే... నీకు మనసా, వాచా, కర్మణా మ్రోకరిల్లుతున్నాను తండ్రీ... అని శరణాగతి భావంతో జీవించ సాగింది.
కొన్ని నెలలు అనంతరం అటుగా మరల వచ్చిన దేవపక్షి ఈ వృద్ధపక్షి కేసి ఆకాశం నుంచే చూస్తూ, ఆహా! ఎంతటి మార్పు... మచ్చుకైనా మునుపటి దైన్యత, వృద్దచాయలు లేవే... అని ఆశ్చర్యానందాలకు లోనై, వెంటనే దైవం వద్దకు వెళ్ళి విషయం చెప్పి, ఏమిటి ఆ వృద్ద పక్షిలో ఇంత మార్పు? ఏడు జన్మల వరకూ దుఃఖ ఛాయలు కూడా పోవు అని మీరు నాకు సెలవిచ్చారు... ఇప్పుడు ఏడు నెలలలోనే ఇంత మార్పా? అని అడుగగా, అప్పుడు పరమాత్ముడు చెబుతాడు... ఇదంతా నేను అన్న అహాన్ని వీడిన ఔన్నత్యమని. శరణాగత సమర్పణ ఫలితమని. ఈ కథ విన్నాక,

భారతీ గారు, మీరు భక్తితో రామ నామస్మరణం ఎందుకు అలవర్చుకున్నారోనన్న మాటలు వింటుంటే -

అంతకాలే చ మావేవ స్మరన్ ముక్త్వా కలేబరమ్|
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః||

మరణసమయంలో ఎవరైతే నన్నే స్మరించుచు దేహమును వీడుదురో వారు నన్నే చేరుదురు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరమ్|
తం తమేవైతి కౌంతేయః సదా తద్భావభావితః||

ఓ కుంతీపుత్రా! ఎవరేయే భావమును స్మరించుచు తుదకు దేహత్యాగ మొనర్చునో వారు ఆ భావమునే పొందుదురు. అంటే మన ఉత్తరజన్మ మన కట్టకడపటి భావముపై ఆధారపడి ఉంటుందన్నది యదార్థం... అన్న గీతాచార్యుని మాటలతో పాటు ఎక్కడో చదివిన ఓ కథ కూడా గుర్తుకు వస్తుంది.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి మరు జన్మకు కారణమవుతాయి.

ఒకసారి ఒక రాజ్య కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చి, రాజు వద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వుంది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొనగా, రాజు అందుకు సమ్మతించాడు.
రాత్రి అయింది. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే తలంపుతో, ఆ రాజు మారువేషంలో చాటుగా మూగవాన్ని గమనిస్తూ బయల్దేరాడు.
 
అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ కాపలాదారుని కొడుకు కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు -

కామం క్రోధంచ, లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.

(మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని, జ్ఞానమనే రత్నాన్ని అపహరించడానికి పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త)

ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. మూగవానిగా నటిస్తున్నాడు. ఇతణ్ణి వెంబడించి, గమనించాలి' అని రాజు భావించాడు. 

రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు -

జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః

(పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, ఇవి మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త)

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది.

మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః 

(తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు [ఇదంతా మిథ్య అని అర్థం] జాగ్రత్త! జాగ్రత్త) అని చాటాడు. 

ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ యువకుడు
 
ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః

(ఆశాపాశంచేత కట్టుబడి తిరుగుతూ, లోక కర్మల చేత బహుచింతలకు లోనై, ఆయువు క్షీణించడం ఎరుగలేరే... జాగ్రత్త జాగ్రత్త) అని చాటాడు...

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మ గల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతణ్ణి తన రాజప్రాసాదానికి రప్పించి, అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకొని రాజు తన కోటకు వెళ్ళి పోయాడు.

మర్నాడు ఆ యువకుని తండ్రిని పిలిపించి,
అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు... అని. తండ్రి ఆశ్చర్యానందంకు లోనై, తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక, ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు.
అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. 
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ యువకుడు. ఈ కోరిక విని రాజు అమితాశ్చర్యపోయి, ఇచ్చిన మాట ప్రకారం అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ యువకుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించగా,
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి, “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని, ఇప్పుడు ఎందుచేతనో ఒక దేశం నుండి చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, ఆ దేశంలో పాపాత్ములే లేరా! లేదా పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం”... అని చెప్పగా, బ్రహ్మకీ ఇది విచిత్రంగా తోచి, అసలు విషయం పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. 
ఇక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు ఈ జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతున్నారు. 
ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి ఈ జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా, బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది.

అదేమంటే - మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా, ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది.

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింప చేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, భక్తితో తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి, వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు భక్తి మైకంలో గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై, ఈ జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. 
అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు -
"ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా?నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం నాకు ఒక పాఠమైనది” అని తెలపగా...

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి, సత్యలోకం చేరుకొన్నాడు. 
మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేదా ముక్తి లభిస్తుంది. 
సత్ చింతన కాక, వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది.
నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా అలవర్చుకోవాలని ఎప్పటిలా ప్రియంగా చెప్పింది ప్రియంవద.

జహా జహా చలూ కరూ పరిక్రమా, జో జో కరూ సో సేవా
జబ సోవూ కరూ దండవత్, జానూ దేవ న దూజా 
                          - సంత్ కబీర్
నేను నడిచినప్పుడల్లా భగవంతుని గుడిని ప్రదక్షిణ చేస్తున్నట్టు భావిస్తాను; నేను ఏది చేసినా, అది భగవత్ సేవ గానే భావిస్తాను. నిద్రకు ఉపక్రమించినప్పుడు, నేను భగవంతునుకి ప్రణామం అర్పించినట్టుగా భావన పై ధ్యానం చేస్తాను. ఈ విధంగా, నేను ఎల్లప్పుడూ ఆయనతో ఏకమై ఉంటాను... 
సంత్ కబీర్ లా కర్మలను భగవత్ తలపుతో జత చేసే భావన మనలో ధృఢమౌతే ధన్యులమే కదా... కానీ, అంత ధృఢ సంకల్పం లేదే... నిట్టూర్పుతో నెమ్మదిగా అన్నారు నిర్మల గారు.

గత మూడు దశాబ్దాలుగా మీకు నేను తెలుసు. నేను తెలిసి తెలిసీ ఏ తప్పులు చేయలేదు, భగవత్ ఆరాధన మానలేదు. నా జీవితం ఓ సుడిగుండం. అయినా ఈ ఆధ్యాత్మిక చింతన అలవడేకా మునుపటిలా దుఃఖం లేదంది నీరజ.

అసలు ఎందుకీ కష్టాలు? కొందరికి బ్రహ్మరాత ఇలా ఉంటాదేమిటి? ఇది వారి ప్రారబ్దం అంటారు...
 అసలు ఈ ప్రారబ్ధం ఏమిటి? ఈరోజు చేసిన వంట ఈరోజే తింటున్నాం కదా. అలాగే ఈ జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవించేయాలి కదా... మరు జన్మలకు ఎందుకు? 
హైమ గారి ఈ ప్రశ్నలకు, ఈరోజు వంట ప్రిజ్ లో దాచుకొని దాచుకొని తింటారు కదా, ఈరోజు చేతికి అందిన పంట ఫలాదులను ఈరోజే తినేయరు కదా,  గర్భంలో పడిన బిడ్డను వెంటనే కనేయలేరు కదా. దేనికైనా సమయం రావాలి. విత్తనాలు చల్లగానే అవి అంకురించవు. నియమిత కాలంలోనే మొలకెత్తుతాయి కదా! ఈ ఏడాది పండిన ధాన్యం కొన్ని మరుసటి సంవత్సరపు పంటకు కారణమయినట్లే, కొన్ని మన కర్మలు మరుజన్మకు కారణమవుతాయి. 


మనం చేసిన సత్కర్మలైనా, దుష్కర్మలైనా కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తే, కొన్ని కొన్ని వెను వెంటనే తమ ప్రభావాన్ని చూపవు, కాలానుగుణంగా తమ ఫలితాన్ని చూపుతాయి. 
ఇక బ్రహ్మ కాదు, మన తలరాతలు మనమే వ్రాసుకుంటాం.
కర్మ ఎలా ఉంటుందో ఒక దగ్గర చదివాను. కృష్ణుడు కంసుని సంహరించి, తన తల్లిదండ్రులను కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూడగానే "నాయనా! నీవే పరమాత్మవి కదా. నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. ఎందుకు 14 ఏళ్ళు ఆగావు... కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు "అమ్మా! నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? విన్న దేవకి ఆశ్చర్య చకితురాలయింది.
"కృష్ణా ఇదెలా సాధ్యము? ఎందుకిలా అంటున్నావు?" అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ, గత జన్మలో నీవు " కైకేయివి", నీ భర్త "దశరథుడు". 
ఇక ప్రారబ్ధం అంటారా... కర్త, కర్మ, క్రియ మూడూ భగవంతునివే. కానీ; ఈ మూడు మనవే అని మన నెత్తిన వేసుకుని మోయడమే ప్రారబ్దం... ఝాన్సీగారు ఈ వివరణ ఇస్తూ, ఈమధ్య నేనో పాట విన్నాను, చాలా బాగుంది... వినడంటూ పార్వర్డ్ చేసిన వీడియో -


పైన ఉదాహరించిన కథా రచయితలకు హృదయపూర్వక నమస్సులు.

                ఈ కబుర్లు కొనసాగుతునే ఉన్నాయి...