7, సెప్టెంబర్ 2019, శనివారం

అమ్మమ్మా, రాముడొచ్చాడు చూడు...

మొన్నరాత్రినుండి, నా బంగారుతండ్రి అభినవ్ రామ్ కు జ్వరం వాంతులు. రాత్రంతా నిద్రలో ఉలికులికి పడుతున్నాడు. డాక్టరు ఇచ్చిన మందులు పడుతూ తనపై చేయివేసి రామస్మరణతో కలతనిద్రే అయింది.
ఉదయం టిఫిన్ తినిపించి మందులు ఇచ్చాక, నీరసంగా సోపాలో అలా నా ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఓ క్షణమైన కుదురుగా వుండక అటుఇటు పరుగులు తీసే చిట్టితండ్రి ఇలా నీరసంగా ఉండడం...చాలా బాధగా ఉంది.ఏం చేయగలను? భారమైన మనస్సుతో "రామయ్య, కరుణించవయ్యా, ఎక్కడున్నావ్, రావయ్యా" అని అనుకుంటూ ... ఓ నిముషం నాన్న, కాస్త కూర్చో...ORSL తాగడానికి తెస్తానంటూ ఫోన్ లో ఓ విడియో పెట్టి చూస్తుండమని డైనింగ్ హాల్ లోనికి వెళ్ళాను. ఇంతలో కిచెన్ నుండి చిరు మాడువాసన. స్టవ్ పై పాలు పెట్టి మర్చిపోయాను. స్టవ్ కట్టేసి ప్రిడ్జ్ దగ్గరకు వెళ్తుండగా "అమ్మమ్మా, రాముడొచ్చాడు చూడు" అంటూ అభినవ్ వచ్చాడు. ఆర్ధం కాక ఏమిటమ్మా అని అడుగుతుండగా రాముడొచ్చాడు చూడు అని ఫోన్ చూపించాడు. అప్పుడే వాట్సప్ లో వచ్చిన విడియో చూపిస్తూ, చూడు రాముడొచ్చాడు అని చెప్పగా చూసాను ఆ విడియోను. 3:24 నిముషాల్లో మొత్తం  రామాయణాన్నే దర్శించాను. అంతరమున అనిర్వచ ఆనందానుభూతి.
ఆనందంతో ఆ విడియోను స్మరణలో పదిలపర్చుకుంటున్నాను ఇలా -

5, సెప్టెంబర్ 2019, గురువారం

భారతీయ సంస్కృతి సంప్రదాయంలో "దీపం"

                                                       

                                                         

                                                  దీపం జ్యోతి పరబ్రహ్మ 
                                                  దీపం సర్వతమోపహం
                                                  దీపేన సాధ్యతే సర్వం 
                                                    దీపదేవ నమోస్తుతే.   

"దీపం" పరమాత్మకు ప్రతిరూపం.   
"దీపం" మన సంస్కృతిలో విడదీయరాని భాగం.  
"దీపం" పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక. 
మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, వెలగడానికి కదలాడే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు.

విశ్వం కాంతిమయం. కాంతి శక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా, ప్రకాశాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయంను ఋషులు అనుష్టించి అందించారు.  
'అగ్నిముఖావై దేవా' అని వేదం తెలుపుతుంది. దేవతలు అగ్నిముఖులు. వారికి మనకి అనుసంధానం చేసే మాధ్యమం అగ్ని. 'అగ్నిం దూతం వృణీమహే' అన్నది శ్రుతి. అందుకే అగ్నిహోత్రాన్ని ఆరాధించే యజ్ఞవిజ్ఞానాన్ని ఋషులు ఆవిష్కరించారు. దేవతల శరీరాలు తేజోమయాలు. కనుకనే తేజస్వరూపాలతోనే వారిని భావించి ఉపాసిస్తారు. నిత్యాగ్నిహోత్రం ద్వారా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి,    యజ్ఞయాగాదులు ద్వారా అగ్నిని ఆరాధిస్తూ ఏ దేవతలకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. మనం ఇవ్వదలచుకున్న ద్రవ్యాన్ని ఏ దేవత లేదా దేవుని పేరు చెప్పి స్వాహా అనగానే, అగ్ని దానిని నేరుగా వారికే చేర్చేస్తాడు. దేవతలకు మనకి అనుసంధానకర్తగా అగ్ని వ్యవహరిస్తాడు. ముక్కోటి దేవతలకు వాహకంగా నిలిచే అగ్నికి సూక్ష్మరూపమే దీపం. ఆ దీప ప్రకాశమే పరబ్రహ్మ.    
పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. నేటి పరిస్థితుల రీత్యా నిత్య అగ్నిహోత్రం సాధ్యం కాకపోవడంతో ఉభయసంధ్యల్లో దీపారాధన శుభప్రదం అని శ్రేయస్సుకరమని ఓ నియమమును ఏర్పరిచారు.  


దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో పార్వతిదేవి, సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. 

భక్తిని క్రియారూపంగా ప్రకటించే విధానమే పూజ. మనస్సులో భగవంతుడిని నింపుకుని, నామాలను వాగ్రూపంగా ఉచ్చరిస్తూ, కర్మణా పూజను ఆచరించడం జరుగుతుంది. ఇలా త్రికరణశుద్ధిగా జరిగేది పూజ. ఇలా పూజను ప్రారంభించేముందు ఆ పరమాత్మునికి ప్రతిరూపమైన దీపాన్ని వెలిగిస్తూ...
దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వతమోపహం
దీపేన హరతే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే
అని అంటూ దీపాన్ని ఆరాధిస్తాం. 

అలాగే దీపారాధన సమయంలో ఈ క్రింద మంత్రం పఠిస్తూ నమస్కరిస్తాము. 
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా 
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ 
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే 
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే
మూడువత్తులను తీసుకొని, తైలంలో తడిపి అగ్నిని జతచేసి, శుభప్రదమైన మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుండి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను. అని రోజూ దీపానికి నమస్కరిస్తాము. వెలిగించేది చిన్న దీపం, ఆశించేది ముల్లోకాల్లోనూ వెలుగులీనాలని. ఎంత ఉదాత్త భావన, ఎంత గొప్ప ఆలోచన. చిన్ని చిన్ని చర్యలతో, చిన్న ప్రార్ధనతో సర్వుల శ్రేయస్సును కోరుతూ మన బ్రతుకులను ఎలా పండించుకోవాలో, ధన్యతనొందాలో తెలియజెప్పిన మన సంస్కృతీ సంప్రదాయాలకు జోహార్లు. అలానే సర్వేజనాః సుఖినోభవంతు అనుకుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉంటాం కానీ, అందరికై నిస్వార్ధ ప్రార్ధన. ఇటువంటి ప్రార్థనలలో ఎంత హాయని. 

                                                 దీపం జ్యోతి పరబ్రహ్మ 
                                                 దీపం సర్వతమోపహం
                                                 దీపేన సాధ్యతే సర్వం
                                                 సంధ్యాదీపం నమోస్తుతే  
లోకానికి వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సూర్యుని అస్తమయంకు కాస్త ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు.    

                           
సర్వదేవతలూ దీపంలోనే నిక్షిప్తమై ఉంటారన్నది శాస్త్రవచనం. కాంతిని ఐశ్వర్యంగా భావిస్తాం. కనుకనే దీపమును లక్ష్మీస్వరూపంగా కొలుస్తారు.  
ఉభయసంధ్యలలో దీపారాధన లక్ష్మీప్రదం అని సామాన్యులకు తెలుసు. అందుకనే పెద్దగా పూజలు వ్రతాలు చేయనివారైనా, ఏమీ తెలియని పామరుడయినా ధూప దీప నైవైద్యాలను తప్పక పూజలో సమర్పిస్తాడు.   

జ్యోతిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం. అజ్ఞానాన్ని అంధకారంతోను, జ్ఞానాన్ని వెలుగుతోను సంకేతించడం మన భారతీయ సంస్కృతి.  
దీపం అంధకారాన్ని పటాపంచలు చేస్తూ, సదా ఊర్ధ్వదృష్టినే కలిగియుండడం ద్వారా, అంధకారమనే అజ్ఞానాన్ని పారద్రోలి, మనస్సును అల్పవిషయాల పైకి కాక ఊర్ధ్వముఖంగా పరబ్రహ్మం వైపు మళ్లించమనే సంకేతాన్నిస్తుంది. 

ఆలయ ప్రాంగణములో దీపం, వృక్షమూలం చెంత దీపం, ధ్వజస్తంభం దగ్గర దీపం, గృహంలో దేవునిమూర్తుల ముందు దీపం, ఇంటిగుమ్మం దగ్గర దీపం, తులసి చెంత దీపం, ముగ్గుల నడుమ దీపం, పుష్పాల మధ్య దీపం ... ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించిన ఆ ప్రకాశం అసురశక్తుల్ని, అసురగుణాల్ని, గణాల్ని నిలువరించి సత్వాన్ని, సత్యాన్ని ప్రభోదిస్తుంది. దీపకాంతుల ప్రకాశంతో అశాంతిచీకటుల అస్తమయం, నిరాశ నిస్పృహల తిరోగమనం కాగా,  దైవంపట్ల భక్తి పురోగమనం, ఉల్లమున ఉల్లాస ఉత్సాహాల ఉత్తేజం, సత్వగుణ ఆగమనం,అంతరమున ఆంతర్యామిపై అనురక్తి అధికమౌతాయి.   

లక్ష్మీదీపం, అర్చనాదీపం, బృందావనదీపం, నందాదీపం, అఖండదీపం, ఆకాశదీపం,  అని దీపారాధనల్లో అనేక రకాలు. 

అలానే దీపపు సెమ్మెలను బట్టి నాగ దీపం, రథ దీపం, మేరు దీపం, కుంభదీపం అని కూడా వ్యవహరిస్తారు. వేదకాలంలో మత్స్య, కూర్మ, మయూర, హంస, గజ, అశ్వ, సర్ప, శంఖ, పద్మ, చక్రాకారాలతో ప్రమిదలను మట్టితో మలచి యజ్ఞయాగాదుల మంటపాలలో వినియోగించేవారట. ఇతిహాస పురాణయుగాల్లో దారు శిలా సువర్ణ రజిత తామ్ర కంచు ఇత్తడి ఇత్యాది వాటితో దీపపు కుందులను తయారుచేసి వినియోగించేవారు. 

సాధారణంగా నిత్యా దీపారాధనలో కుందిలో నాలుగువత్తులను జీవాత్మ, పరమాత్మలకు ప్రతిరూపంగా రెండువత్తులుగా చేసి  రెండు జ్యోతులుగా వెలిగిస్తారు. మూడు వత్తులు ముల్లోకాలకు, త్రిగుణాలకు, త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తూ  కొందరు మూడువత్తులను వెలిగిస్తారు. వారి వారి కుటుంబ ఆనవాయితి, అలవాటు బట్టి దీపారాధన చేస్తుంటారు. 

సద్గతిని కలిగించడానికి దీపం ఒక సేతువు. పరమాత్మకు ప్రతీకైనా దీపజ్యోతి మన ఆధ్యాత్మిక ప్రగతికి ఆలంబనంగా నిలుస్తుంది. 
చీకటి నుండి వెలుగువైపు, అమంగళం నుండి మంగళంవైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు సాగాలని ప్రబోధించడమే దీపం అంతరార్ధం. 

అలానే దీపజ్యోతి శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుంది. చీకటి తమోగుణానికి తార్కాణం. చీకటి సోమరితనం,నిద్ర, అలసత్వం,నిరాశలను పెంచి శారీరక కుంగుబాటుకు గురిచేస్తుంది. వెలుగు ఉత్సాహానికి ఆహ్లాదానికి క్రియాశీలత్వానికి దోహదపడుతుంది. దీపజ్యోతిని తదేకంగా చూడడం వలన మానసిక ఏకాగ్రత వృద్ధిచెందడంతో పాటు తాత్త్విక పరిణితికి దోహదపడుతుంది. 

హృదయకుహరంలో ఆత్మజ్యోతిని దర్శించాలన్న ధార్మిక విజ్ఞానం దీపారాధనలో ఉంది. దీపం యొక్క విశిష్టత తెలుసుకొని ధ్యానిస్తే తత్వదృష్టి మరింత విస్తరిల్లి అంతర్ముఖమై ఆత్మజ్యోతిని దర్శించుకోవచ్చని అనుభవజ్ఞులమాట. 'దీపజ్యోతి ధ్యానాభ్యాసం పరమాత్మ దర్శనానికి ఒక మార్గం' అని శ్రీరామకృష్ణులు వారు చెప్పేవారు. కాబట్టి దీపారాధన ఓ ఆధ్యాత్మిక సాధనాభ్యాసమే.


శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి, వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, హృదయంలో ఉన్న ఆత్మను దర్శింప జేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యం అని అంటుంది ఆర్యధర్మ. 

దీపారాధన వలన దుష్టశక్తులు రావని,  ఐశ్వర్యం కలుగుతుందని ఓ నమ్మకం. దీపమున్న ఇంట్లో దుష్టశక్తులు చొరబడనట్లు దేహమనే ఇంట్లో ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతిని ధ్యానించినప్పుడు మనస్సులోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుష్టశక్తులు ప్రవేశించలేవు. అలాగే దీపజ్యోతిలోని మూడురంగులు సత్వ రజో తమోగుణాలను సూచిస్తుంది. ఈ గుణాలను అధిగమించినప్పుడు ఆ ఆత్మజ్యోతిలో ప్రతిష్ఠితమై ఉన్న పరమాత్మ దర్శనము అవుతుందన్నది మహర్షుల మాట.   

ఘృతం లేదా తైలం, ప్రమిద, వత్తి వీటితో ఒక చిన్న వెలుగు మొలక దీపం. ప్రమిదలలోని గోఘృతం లేదా తైలం అజ్ఞానమైతే అహం వత్తి. అజ్ఞానాంధకారాన్ని జ్ఞానజ్యోతితో తొలగించుకొని మానవత్వపు దీపకాంతులని పంచిపెట్టడమే దీపకళిక తత్త్వం .చిన్ని దీపంలో ఎంత అద్భుతమైన ఆవిష్కరణ. నిత్యం దీపం వెలిగించడం అలవాటైపోవడం వలన గుర్తించలేకపోతున్నాం కానీ, దానికున్న విశిష్టత ఎనలేనిది. ఈ అద్భుతమైన అంతరార్ధాన్ని, మన సంప్రదాయ ఔచిత్యాన్ని గ్రహించి, దీపారాధనను వివిధరీతుల్లో, సుమాల సోయగాలతో, అందంగా అలంకరించి, ఆనందంగా అంతర్యామితో అనుసంధానం అవుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నచక్కటి సాధకులు 'వనజతాతినేని'గారు. ఆమె అభిరుచి అభినందనీయం. ఆమె అభిమతం ఆచరణీయం. ఆమెకిదే నా అభివందనం 🙏
ఇంతటి మహత్తరశక్తి  ఉన్న  దీపానికి మ్రొక్కకుండా ఉండగలమా?  
                                                                
                                                            దీపం నమోస్తుతే 


9, ఆగస్టు 2019, శుక్రవారం

నా జీవన గమనంలో కొన్ని దివ్యక్షణాలు - శ్రీ సొరకాయలస్వామి సమాధి చెంత


చాలాసార్లు తిరుపతి వెళ్ళాను. కానీ, ఏనాడు నారాయణవనం వెళ్ళలేదు. నారాయణవనం తొండమాన్ చక్రవర్తుల రాజధాని. తిరుమలకు సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
 నారాయణవనం - 
ఆకాశరాజు పుత్రిక 'పద్మావతి'గా శ్రీమహాలక్ష్మి బంగారుపద్మంలో ఆవిర్భవించిన  దివ్యధామం. 
సప్తగిరివాసుడు 'ఎరుకులసాని'గా తిరువీధుల్లో తిరుగాడిన పుణ్యక్షేత్రం.   
శ్రీనువాసుడు అక్కడే ఆమెను పరిణయమాడి, మామగారి కోరికమేరకు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరునిగా కొలువైయున్న దివ్యక్షేత్రము నారాయణవన(ర)మని తెలిసినా ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ, క్రిందటినెల తిరుపతి వెళ్ళడం, అనుకోకుండా నారాయణవనం వెళ్ళి శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామివారిని దర్శించించుకోవడం జరిగింది. అయితే నారాయణవనం వెల్దామని అనుకున్నప్పుడు యాదృచ్చికంగా శ్రీ సొరకాయల స్వామివారి సమాధి అక్కడ ఉందని తెలిసింది. వారి పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్లో, చదివినట్లో లీలగా గుర్తుంది కానీ, వారి గురించి ఏ వివరణ తెలియదు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం తర్వాత అక్కడ వారిని అడిగి, రాజగోపురంనకు ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయున్ని దర్శించించుకొని, ఆ ప్రక్కనే యున్న సొరకాయస్వామి సమాధి చెంతకు చేరాం. చేరాక అదో దివ్యానుభూతి. మేం వెళ్ళింది గురుపౌర్ణమి నాడు. మేం వెళ్లే సమయంలో అభిషేకం జరుగుతుంది. సిద్ధపురుషుల సన్నిధి మనోశుద్ధి చేసి స్వభావ  ప్రభావం నుండి బయట పడవేసి మనసును అంతర్ముఖం చేస్తుందని వీరి సమాధి చెంత నా స్వీయానుభవం. అభిషేకం హారతి అయిన తర్వాత, మావారు తట్టి  పిలవడంతో తిరుగుప్రయాణంకై చాలా కష్టపడ్డాను. మనస్సులో అక్కడే ఉందామన్న భావన. ఒకవిధమైన పరితపన. తిరుగుపయనమప్పుడు సొరకాయస్వామివారి అనుగ్రహ కటాక్షం. ఓ దివ్యానుభవం. ఆ అనుభవం అనిర్వచనీయం. ఆ దివ్యానుభూతి అవ్యక్తం, అక్షరీకరించలేను. కానీ, వారి గురించి చిరు మాత్రమేనా స్మరణలో స్మరించుకోవాలనే ఈ టపా -   

సొరకాయ స్వామి ఎక్కడివారో, ఎప్పుడు ఎక్కడ పుట్టారో, ఎవరికీ సరిగ్గా తెలియదు. 1902 లో ఈ స్వామివారు మద్రాసులో వియతిరాజు నాయుడు ఇంట్లో ఒకరు అడిగిన ప్రశ్నకు తన వయస్సు 500 సం|| అని తెలిపారట. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళే పుత్తూరులో 12వ శతాబ్దం మధ్యభాగంలో కట్టించిన సత్రంలో స్వామివారి ప్రస్తావన ఉన్నట్లు కధనం. దీనిని బట్టి స్వామిగారు 1700 లో జన్మించినట్లు చారిత్రక నిర్ణయం.  

తలపైన పెద్ద తలపాగా, మోకాలివరకు చిరుగులపంచ, నొసటన తెల్లని నామాల నడుమ ఎర్రనినామంతో, భుజాన ఖాళీ సొరకాయల బుర్రలు తగిలించుకొన్న ఓ కావడి వేసుకొని తిరుగుతుంటే, మామూలువారు మొదట పిచ్చివాడన్నారు (అవధూతలను గుర్తించే సామర్ధ్యం సామాన్యులకుండదు). మహిమలు ప్రకటితమౌతుంటే సొరకాయస్వామి అని కొలవడం ప్రారంభించారు. ఎప్పుడూ భుజంపైన వేలాడే సొరకాయలతో ఉండే స్వామి కనుక భక్తులు ఆయనకు సొరకాయస్వామి అని పిలుస్తుండేవారు. వీరి వెంట రెండు కుక్కలు ఉండేవి. అలానే వీరి చెంత చిన్నగొడ్డలి ఉండేది. దానితో ఎండుకట్టెలు కొట్టి తెచ్చి అగ్నిగుండం (ధుని) వెలిగించేవారు. ఆ ధునిలోని విభూదే భక్తులకు దివ్యౌషధం. శుకమహర్షి అంశగా అవతరించినాయన అని ఆయనను ఆశ్రయించినవారి అభిమతం. 

తిరిగి వచ్చాక వారి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో శ్రీ నండూరి శ్రీనివాస్ గారి విడియోలు యూట్యూబ్ లో చూడడం జరిగింది.  వారికి మనసార నమస్సులు. 
అటుపై ఇంకా తెలుసుకోవాలన్న ప్రయత్నంలో పూజ్యులు డా. వేదవ్యాసగారి పుస్తకం చదివాను. అందులో వేదవ్యాసవారు,  
"ఇహలోక స్పర్శలేని అంతఃపరిశుద్ధితో సదా బ్రహ్మయందే లగ్నంమయ్యే యోగస్థితిలో ఉండే శుకబ్రహ్మ అంతటివారు ఈ సొరకాయస్వామి" అని చెప్తూ -  
తన విచారణలో తెలుసుకున్న లీల గురించి వారు ప్రస్తావించారు. అదేమిటంటే - తిరుపతి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో సొరకాయలస్వాములవారు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి మాయమయ్యారట. సొరకాయలస్వామి అలా అదృశ్యమవ్వగా, ఆయనకై తపించే భక్తులు  కొందరు గుడికి ఎదురుగా కూర్చొని విలపిస్తూ పిలవగా పిలవగా "ఓ" అంటూ లోపలనుండి బయటకొచ్చారట. లోపల స్వామివారు పట్టుకొని ఆపేశారు. అందుకని ఉండిపోయాను అన్నారట. 

'స్వభక్తేఛ్చయా మానుషం దర్శయంతం' అంటే భక్తుల కోరికవలన మానుషరూపంలో కనబడతారు సద్గురువులు, అవధూతలు. నిరంతరం ఆత్మానందంలో ఉండేటటువంటి బ్రహ్మస్వరూపులు. సదా ఆత్మస్థితిలో ఉండే నిత్యానందపరులు. దయాస్వభావులు, సర్వోపకారులు, వాక్శుద్ధి, సంకల్పశక్తి, దివ్యదృష్టి కలవారు. ఆత్మయే తానని దృఢ ప్రజ్ఞతో నిశ్చలంగా తాను తానై నిలచియుండువారే అవధూతలు.    

స్వామి వారి మహిమలు తెలిశాక నాకు అర్ధమయ్యింది - మానవులు తరించటం కోసం తాను పరబ్రహ్మ స్థితిలో ఉంటూనే, మానుషస్వరూపంలో భూలోకంలో తిరుగాడిన అవధూతలలో ఒకరు ఈ సొరకాయస్వామి వారని.    
అనాధలను, దీనులను, హీనులను, రోగులను ఆదుకునే సంఘటనలు అనేకం. సాధ్యంకాని రోగబాధితులకు ఆకులు అలములు విభూదినిచ్చి బాగుచేసేవారు. అయితే ఈ అద్భుతాలు మహిమలు సామాన్య జనోద్ధరణకు. ఒకోసారి వీరి మానవాతీత శక్తిని ప్రసరించే మాటలు నర్మగర్భమై ఎవరికీ అర్ధమయ్యేవి కావట. యోగవిద్యారహస్యాలను యోగ్యులకు బోధించేవారట. సద్గతిని చూపేవారట. బ్రహ్మజ్ఞానాన్ని కోరినవారు కొద్దిమందే. సర్వస్య శరణాగతి చేసి సాధన చేసేవారు కొందరే. మహిమల మహత్యం కంటే వారు సూచించే మార్గం మీద దృష్టి పెట్టిన గట్టివారు కొందరున్నారు. ఆ కొందరిలో కొందరు సాదు సంతులు వీరే... 
శ్రీ ముంత పరదేశి అనే వారికి దృష్టిపాతంతో చక్షుదీక్షద్వారా బ్రహ్మజ్ఞానంను ప్రసాదించిరి.   
తిరుత్తణి నకు కొద్దిదూరంలో కుమారకుప్పం అనే గ్రామంలో గోవిందరెడ్డి గారికి ఇచ్చిన మంత్రదీక్ష ద్వారా యోగవిద్యను అనుగ్రహించి తనంతట వారిలా తయారుచేశారు. ఈయనే క్రమేణా కుమారకుప్పం స్వామిగా ప్రసిద్ధులైనారు. యోగమార్గంలో ఉన్నతోన్నత స్థాయిలధిగమించి గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు. దీన దుఃఖితులకు ఆసరై నిలిచారు.  
ఆపై మాటలమ్మమడుగుస్వామి, చట్టిపరదేశి, మంగమ్మ, నందనారు స్వామి తదితరులెందరకో దివ్యత్వాన్ని అనుగ్రహించిన అవధూత శ్రీ సొరకాయల స్వామివారు.  
రత్నసభాపతిపిళ్ళే, నారాయణ స్వామినాయుడు, చెంగల్వరాయ మొదలియార్, సుందరాసుబ్బారాయుడు మొదలియార్ తదితరులు స్వామిభక్తులై తరించినవారు. 

సొరకాయలస్వామి ప్రతీరోజూ, అరుణానది (ఆరణీ నది) నుండి ఒక గులకరాయిని తెచ్చి, శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయమునకు ఎదురుగా కాస్త కుడివైపున ఒక స్థలంలో వేసేవారట. చిన్న రాళ్లగుట్టగా తయారయిన ఆ స్థలమే తనను సమాధి చేయవలసిన చోటు అని అందరితో చెప్పేవారు. ఆ చోటనే 1902 ఆగష్టు నెల 9వ తేదీ శ్రావణ శుద్ధ పంచమి (గరుడపంచమి) శనివారం రోజున సమాదిగతులైనారు. శ్రీ పద్మావతి అమ్మవారు బంగారుపద్మంలో ఆవిర్భవించిన పవిత్రస్థలంలోనే ఆయన సమాధి వెలిసిందని కొందరు చెప్తుంటారు. 

ఆ సమాధి పైనే మందిరం నిర్మించారు. సమాధికి ఎదురుగా సొరకాయస్వామి వెలిగించిన ధుని ఉంది. సమాధిమందిరం చుట్టూ సొరకాయల్ని భక్తులు వేలాడదీస్తుంటారు.
ఇక్కడ అభిషేకార్చనలతో పాటు పౌర్ణమి అమావాస్యలనాడు విశేషపూజలుంటాయి. సమాధిగతులైన ఈరోజున విశేష ఆరాధనోత్సవం ఉంటుందట. 

శ్రీకల్యాణవెంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రధాన రాజగోపురం ఎదురుగావున్న వీధి చివర్న శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం ప్రక్కన మహనీయుడైన సొరకాయస్వామి అవధూత సమాధి అవశ్యం దర్శనీయమైన దివ్యమందిరం.


నారాయణవనంలో  శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారిని సందర్శించే భక్తులకు, అవధూత శ్రీ సొరకాయలస్వామి మందిరం కూడా దర్శనీయ స్థలం. స్వీయానుభవంతో చెప్తున్నా - శక్తివంతమైన మహిమాన్విత స్థలమిది. తప్పక దర్శించి తీరవలసిన పవిత్ర గురుసన్నిధి.

18, జూన్ 2019, మంగళవారం

సరళ సాధన

సాధన ఎలా సాగించను? సంఘర్షణలను ఎలా అధిగమించవచ్చు? సరళంగా సహజంగా సాగే సాధన తెలపరా? అహంకారం, అహం గురించి కూడా తెలియజేయండి... అంటూ, గతంలో నేను పెట్టిన ఓ సాధారణ సాధకురాలి స్వగతం....... టపాను చదివిన వసుంధరగారు అడిగిన ప్రశ్నలకు, పలువురు నుండి నేను గ్రహించిన, అనుసరిస్తున్న ఈ సాధనా విధానము, తనకీ సహకరిస్తుందన్న నమ్మకంతో 'సరళ సాధన' పేరిట ఇలా ఓ టపాగా పెడుతున్నాను. 

ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని, ఆధ్యాత్మిక జీవనం సాగించాలనే జిజ్ఞాస ప్రారంభమయ్యాక సాధన ఎలా మొదలెట్టాలి, ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఎలా సాధించాలి, ఎవర్ని ఆశ్రయించాలి, దేనిని అనుకరించాలి, ఎవర్నిఅనుసరించాలి ... ఎన్నో సందేహాలు, ఎంతో సంఘర్షణ. 
ఆధ్యాత్మికమనేది అంతరంగ జీవితానికి సంబంధించినది గానీ, బాహ్య జీవితానికి సంబంధించినది కాదు. 
ఆధ్యాత్మిక పయనం అంటే ఏమిటి? 
తొలుత అపార శ్రద్ధాభక్తులతో కూడిన ఓ దైవ చింతన, మనోశుద్ధతకై యత్నించడం, మానసిక పరివర్తన, పరిపక్వత, మనలోకి మనం చూసుకోవడం, అదే ద్యాస, ఒకే ధ్యానం, శోధించడం... ఆత్మసాక్షత్కారం పొందడం.

ఈ ఆధ్యాత్మిక పయనంలో కొందరు దైవాన్ని ఆలంబనగా తీసుకుంటారు. వీరు ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, పైన భగవంతుడు అనే వాడు ఒకడు గమనిస్తుంటాడనే భావంతో జాగ్రత్తగా సద్భుద్ధితో, సరళస్వభావంతో నడుచుకుంటారు. సేవాతత్పరతతో సత్కార్యాలు చేస్తూ, మనోశుద్ధత పొంది భక్తిమార్గంలో దైవమునకు చేరువవుతుంటారు. మరి కొందరు తమ ఆత్మనే తమ దైవంగా భావించి, తమతో పాటు అందరూ దైవ సమానులేనని, సకల జీవుల్లోనూ భగవదంశ ఉన్నదని భావించి, ఆచరించి ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు. ఇలా ఎన్నెన్నో సాధనామార్గాలు. ఎవరి సాధన వారిది. చివరికి అన్ని సాధనల గమ్యం ఒక్కటే.      
                                                   
                    

ఏ మార్గంలో పయనించిన ఆ పయనం ఆత్మసాక్షాత్కారం కోసమే. ఆ ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే ప్రయత్నమే "ఆధ్యాత్మిక సాధన". అయితే ముందుగా సాధనకు కావాల్సింది మనో నియంత్రణ, అంతఃకరణశుద్ధి.
                                                                                                  
మన మనస్సే మనకు ప్రతిబంధకం. మన వ్యక్తిత్వ విషయవాసనలే ఆటంకములు. మన ప్రవర్తనా సహవాసముల అలవాట్లే  అవరోధములు. అవగాహన లేమే అలజడులు. స్వభావిక దోషాలే రోదనలు. అలాగని సాధన పేరుతో మనస్సును నియంత్రించనవసరం లేదు. మనస్సు ఎప్పుడూ బాహ్యంగా పరుగులు పెడుతుంది. దానికి నిరంతరం ప్రేమతో సద్గుణాలను అలవాటు చేయాలి, భక్తిమాధుర్యంను రుచి చూపిస్తుండాలి, సద్బోధనలను వినిపిస్తుండాలి, వివేకం గురించిన వివరణలు మననం చేస్తుండాలి, విరాగంను అలవర్చాలి.  
కదలనిరాయిని దేవుణ్ణి చేసింది కదిలే భక్తులే, కదలనిది గొప్పదా? కదిలేది గొప్పదా? అది గ్రహించుకొని, సున్నితంగా ప్రేమగా మనో కదలికలను తగ్గించడమే సాధన. అవసరమైనవారికి చేయూతనివ్వడం,  అందర్నీ ప్రేమతో చూడడం, సర్వాత్మభావనతో మసలుకోవడం,  బాహ్యమును భగవంతునిగా అంగీకరించడం, నిరాడంబర జీవితంలో ఉన్నతమైన భావాలు అలవర్చుకోవడం, దేహగతమైన అంతటినీ భగవంతునికి నివేదించి శరణాగతి భావంతో ఉండడం... ఇలా సరళంగా, సంతృప్తిగా జీవించడమే సమర్ధత కూడిన సాధన. 
       
అంతరశుద్ధి -
అంతరశుద్ధి లేకుండా అంతర్యామిని పట్టుకున్నది ఎవరు?  
మన జీవితంలో అనేక మార్పుల్ని ఆహ్వానిస్తాం. కానీ, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించం. అంతరశుద్ధికై మనల్ని మనం సరిచేసుకోవాలి, మనలో సంస్కార దోషాల్ని వదులుకోవాలి. నిబద్ధత, నైతికత, నిజాయితీలను అలవర్చుకోవాలి. 

ఇక అహం - అహంకారం 
మొదటిది పారమార్ధికం, రెండవది ప్రాపంచికం. అహం అంటే 'నేను' అని అర్ధం. ఆ అహం ఆకారంతో చేరితే అది అహంకారం. యదార్ధ అస్తిత్వం 'నేను'. 
అపరిమితమైన 'నేను'ని పరిమితమైన మాయ ఉపాధికి చేర్చి చెప్పడం అహంకారం.  
                                         


అహంకారమంటే అదొక స్థితి కాదు, దేహస్మృతి. ఈ శరీరమనోబుద్ధులే నేను అనుకోవటం అహంకారం. అహంకు ఇహం పరం మనేది తెలియదు. తెలుస్తుందల్లా అహంకారంకు మాత్రమే. రాయిని చెక్కి దైవమును చూసే మనం, మనిషిలో దైవమును చూడలేకపోతున్నది ఈ అహంకారం వలననే. అహంకారమనేది సకలవాసనల సమూహము. అహంకారమున్నంతవరకు చావుపుట్టుకులు తప్పవు. శరీరం ఖననమైన స్వభావం ఖననమవ్వదు. అహంకారమనేది అనేక జన్మలనుండి జీవుడిని పెనవేసుకుని వున్నది. అనేకజన్మల అహంకారాన్ని నిశ్శేషంగా నాశము చేయడం శీఘ్రంగా సాధ్యం కాదు. స్వార్ధ రహిత, ఫలాపేక్ష రహిత, వాంఛ రహిత కార్యములు నిర్వహించుటవలన అహంకారం తొలగుతుంది. భగవంతుని పాదాలను భక్తితో ఆశ్రయిస్తే వాసనలు తగ్గుతాయి. మాటకి మాట, చేతకి చేత అనే భావన మనలో లేకుంటే ఎవరి మాటల్ని చేతల్ని పట్టించుకోము. ఈ ఉదాసీనత స్థిరచిత్తంకు దర్పణం. ఆలోచనలు, అలవాట్లు మారితే మనస్సు నెమ్మదిస్తుంది. అహంకారం నశిస్తుంది. మానవ సంబంధాల్లో ఏర్పడే అంతరాలకు, అపార్ధాలకు అహంకారం కారణంగా నిలుస్తుంది. అహంకారంపోతే మానవ సంబంధాలూ... ప్రపంచంతో మన సంబంధ బాంధవ్యాలూ... బాగుండటమే కాదు దైవానుబంధంగా శోభిల్లుతాయి.    
అలానే మనలో అహంకారం తగ్గించే మరో శక్తివంతమైన సాధన ఏంటంటే ఇతరుల అహంకారమునకు ప్రతిస్పందించకపోవడం. 
భగవంతునికి మనకి రెండు అడుగుల దూరమే. నేను, నాది - అహంకారం, మమకారం. ఆ రెండు అడుగులు దాటామో .... జీవన్ముక్తులమే అంటారు పెద్దలు.    
                                                        

మనం తూర్పుదిక్కుకు వెళ్లేకొద్దీ పడమరకు మరింత దూరం అవుతాం కదా. అలాగే మన మనస్సును బుద్ధిని ఎంత మంచిగా మలచుకుంటామో, అంతగా అహంకారం అణుగుతుంది, అరిషడ్వార్గాలు తగ్గుతాయి, అంతరశుద్ధి అవుతుంది, అంతర్యామికి చేరువవుతాం.      
                                                   
సాధకులకు అంతరంగిక స్వీయ నియమం, విచక్షణ  అతిముఖ్యం. సర్వులకు శ్రేయస్సు చేకూర్చాలన్న ఆలోచన మనస్సులోను, సత్యాన్నే పలుకాలనే ఆలోచన వాక్కులోను, ధర్మాన్నే ఆచరించాలనే ఆలోచన కర్మలోను అలవర్చుకుంటూ, సర్వాత్మ భావన అంతరంలో నిలుపుకుంటే చాలు. ఈ భావం బలపడితే మనస్సు స్థిరమౌతుంది. మనస్సు స్థిరమైతే వాక్కు సత్యమౌతుంది. వాక్కు సత్యమైతే చేతలు శుద్ధమవుతాయి. తద్వారా పవిత్రత ప్రవహిస్తుంది. 

సాధకులు చలించని మనస్సును, భ్రమించని దృష్టిని కల్గియుంటూ, వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో శ్రద్ధగా ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే, ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే చిత్తశుద్ధి కల్గుతుంది. ఇది  అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (నిత్యానిత్యవస్తు వివేకం), విరాగం. శ్రద్ధ వివేకము, విరాగంలు అలవడితే గాని విషయాసక్తి నుండి విడుదల పొందలేము. అవగాహనను పెంపొందించుకోలేం. అంతవరకు అర్ధంకాని బోధనలతో విబేధం తప్పదు. అవగాహన అవ్వనంతవరకు ఆవేదన తప్పదు 
                                                   


ఆధ్యాత్మిక జీవితం, ప్ర్రాపంచిక జీవితం అని రెండు వేరు వేరు జీవితాలు ఉండవు. మన జీవన విధానంలోనే రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవనం సాగించాలని తలపే జీవితంలో ఓ మలువు. మన సంసార ధర్మాలను, ప్రాపంచిక బాధ్యతలను నిర్వర్తిస్తూ మన దైనందిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక సాధన ఓ అంతర్భాగమైనట్లు అనుసంధానం చేసుకోవాలి. ఏ బంధమూ, ఏ బాంధవ్యమూ ఆత్మవిచారణకు ప్రతిబంధకం కాదు. వాటిని కొనసాగిస్తూ మానసికంగా అన్నింటికీ అతీతమౌతూ ఆత్మకు చేరువ కావాలి. మనోశుద్ధత, నిరాహంకార సాధనలతో ముందుకు సాగాలి. అంతరంగ వివేచనతో సాధన చేస్తే క్రమక్రమంగా ప్రాపంచిక లాలస తగ్గుతుంది. ఏదీ కొద్ది రోజుల్లోసాధ్యం కాదు.  సద్గురువులు, సత్సంగాలు ఊతం ఇస్తాయి. క్రమేణా కాస్త కాస్త ఆధ్యాత్మిక జీవనం గురించి అవగాహన ఏర్పడుతుంది. 
                                                                                                     

ఈ గమనంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అన్పించిన, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరిక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధనని ఆధ్యాత్మిక అనుభవజ్ఞుల సూచన. అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.  
1, మార్చి 2019, శుక్రవారం

"అంతరమౌనం - బాహ్యకర్మ"


                                                                


ఈ మధ్యన ఓ మిత్రురాలు, సహా బ్లాగరిణి "అంతరమౌనం - బాహ్యకర్మ" గురించి అడిగింది. 
చేస్తున్నానన్న భావన లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధితో బాహ్యకర్మలు ఉన్నప్పుడు దేనితో సంయోగం చెందని మనస్సు సాక్షియై అణగగా, అలవడిందే అంతరమౌనం. దీనినే కాస్త వివరించమన్న తన కోరిక మేరకే ఈ టపా -
"కర్మకు ఆవల నిష్కామం, నిష్కామమునకు ఆవల నిస్సంగం, నిస్సంగమునకు ఆవల ఏకాంతం, ఏకాంతమునకు ఆవల నిశ్శబ్దం, నిశ్శబ్దమునకు ఆవల మౌనం. ఆ మౌనమే ఆత్మస్థితి, ఆ మౌనమే జ్ఞానం, ఆ మౌనమే అమరత్వం " - శ్రీ రమణులు. 
మౌనం అని అనుకోగానే మాటై స్ఫురిస్తుంది. స్ఫురణకు ఆవల సాక్షియే మౌనము. మౌనం గురించి ప్రస్తావించడమంటే శబ్దంలోకి జారిపోవడమే. ప్రస్తావన లేని పరమపదం మౌనం. అది అవ్యక్తం, అవర్ణనం, శాశ్వతం, నిరంతరం, సనాతనం. నిజానికి మౌనం స్వయంభువది .
మౌనం శబ్దంగా మారే క్రమమే సంకల్పం, సృష్టి, ప్రపంచం, కర్మలు, పునర్జన్మలని పెద్దలంటుంటారు. కర్మలతో మనస్సు కలిసి బయల్పడితే  సృష్టి. బయల్పడే మనస్సు హృదయంలో ఇంకిపోతే లయం. సర్వ సమన్వయమంతా మౌనంలోనే ఉంది. వాక్ వర్తనలో లేనేలేదు. కర్మ కర్తృత్వంలో ఉండదు.   
పంచేంద్రియ కర్మలకు భావన చేరకపోవడమే సత్యస్థితి. ఈ స్థితే మౌనం. అంతరమైన అనంత మౌనమే ఆత్మస్థితి.  
"ఊరకనుండటమే సర్వసమన్వయం "   "ఊరకనుండుటయే ఉత్తమం" 
ఇది శ్రీ రమణుల బోధ. 
సత్యానుభవం రానంతవరకు అంతఃకరణం చేసే మహాశబ్దం " నేను ". ఆ 'నేను'ని తెలుసుకోవాలనుకుంటే ఆత్మతో అనుసంధానమై ఉండాలి. నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన సర్వోత్తమమైన మార్గం మౌనమే. మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. ఆ మౌనాన్నే ఆశ్రయించు. ఆ మౌనంలో విశ్రమించు, అదే మౌన తపస్సు . ఈ మౌన సాధన వల్లే  ఆ మౌనములోనే ఆత్మానుసంధానం... ఆత్మసాక్షత్కారం అని ఉపదేశించేవారు శ్రీ రమణ మహర్షివారు. 
మౌనం అత్యంత సమర్ధవంతమైన శక్తిప్రవాహం. దక్షిణామూర్తి చెప్పలేక మౌనం వహించలేదు. చెప్పడానికి ఏమీ లేక మౌనం వహించాడు. 
బ్రాహ్మీస్థితి అనుభవైకవేద్యం. అది వర్ణనాతీతం. 
అయితే ఇంతటి మౌనమునకు కర్మకు ఏమిటి సంబంధమో అవగాహన చేసుకునేముందు ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం - 
'నేను చేస్తున్నాను' అనే భావనతో మనస్సు మరియు ఇంద్రియాల చేత చేసెడి చర్యలను కర్మ అంటారు. స్థూలంగా (బాహ్యంగా) కన్పించే కర్మలు కొన్నయితే, సూక్ష్మంగా అంతరమున సాగేవి మరికొన్ని. ఆలోచనా రూపంలో, మాటల రూపంలో, చేతల రూపంలో కర్మలు చేస్తూనే ఉంటాం.  అలా చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. అది అనుభవంలోకి వస్తుంది. 
ఈ జగత్తులో  ప్రతీజీవి జన్మించడానికి కారణం మునుపుటి జన్మల కర్మఫలితమే. 
తత్రాస్యస్వకృతమ్ కర్మ ఛాయేవానుగతం సదా ... ఎవరు చేసిన కర్మలు వారిని పునర్జన్మ యందు నీడలా అనుసరిస్తాయి. 

యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పూర్వ కృతం కర్మ కర్తార మను గచ్ఛతి   వేల సంఖ్యలో ఉన్న ఆవుల్లో సైతం లేగదూడ తన తల్లిని ఏవిధంగా వెదకి పట్టుకుంటుందో అలాగే గతంలో చేయబడిన కర్మలు కర్తను అనుసరిస్తూ ఉంటాయనేది సత్యం.  

స్వకర్మ వశతః సర్వ జంతూనాం ప్రాభవాప్యయౌః తమ తమ కర్మలని అనుసరించి సకల ప్రాణుల చావు పుట్టుకలు ఉంటాయి. 
సకల ప్రాణులకున్ను పూర్వజన్మ కర్మానుసారంగా స్వభావ మేర్పడుచున్నది. చెడుకి చెడు, మంచికి మంచి కర్మఫలం అనుభవించాల్సిందే. ఇదే విశ్వ నియమం, హిందూ సనాతన ధర్మం తెలిపే కర్మ సిద్ధాంతం.
దేహాత్మభావనతో, కర్తృత్వ భావనతో చేసే పనులన్నీ కర్మబంధాలే. 
ఎక్కడ కర్తృత్వం (నేను చేస్తున్నాను) అనే భావన ఉంటే అక్కడ భోక్తృత్వం  (ఫలానుభవం) కూడా ఉంటుంది. ఒక విత్తు నాటితే అది మొలిచి వృక్షమై అనేక ఫలాల్ని ఇచ్చినట్లుగా చిన్న కర్మ అయినా దాని ఫలం అనూహ్యంగా అనంతంగా ఉంటుంది. ఒక విత్తు నాటేం కదా అని ఆ చెట్టు ఒక్క ఫలాన్నే ఇవ్వదు కదా. 
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ | నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరపి || 
చేసిన కర్మ అది పుణ్యమైన, పాపమైన కానీ, కోటికల్పాలకైనా సరే నశించేది కాదు. దానిని అనుభవించి తీరాల్సిందే. 
మరి జన్మలు, కర్మలు క్షయమయ్యే విధానం ఏది?  
జీవించినంతకాలం కర్మను ఆచరించకుండా ఉండలేం.  కర్మత్రయం (సంచిత, ప్రారబ్ధ, ఆగామి) గురించి అందరికీ తెలుసు. అనేకజన్మలనుండి సంపాదింపబడిన కర్మరాశికి సంచితమని, ఈ సంచిత కర్మరాశినుండి కొంతభాగం పక్వమై ఈ జన్మలో అనుభవానికి వస్తున్న కర్మఫలానికి ప్రారబ్ధమనియు, ప్రారబ్దాన్ని అనుభవిస్తూ, ఈ జన్మలో కొత్తగా చేసిన, చేస్తున్న పాపపుణ్యాల కర్మల ద్వారా పోగయ్యే కర్మఫలంలో కొన్ని ఈ జన్మలో అనుభవిస్తూ, చాలావరకు భావిజన్మలో అనుభవించడానికి సిద్ధం చేసుకుంటున్న కర్మరాశి ఆగామి. మరణాంతరం ఈ ఆగామి కర్మరాశి సంచితకర్మలో కలుస్తుంది. అంటే సంచితం - భూతకాలంతోను, ప్రారబ్ధం - వర్తమానకాలంతోను, ఆగామి భావికాలంతోను సంబంధపడియుండును. 
అనుభవించడం ద్వారే ప్రారబ్దకర్మ క్షయమౌతుంది. ఇక ఆగామి సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మ రూపానికి మారి మనకి అనుభవానికి రాకుండనే,  ధ్యానం, దానం, దైవారాధన, దయ, ధర్మజీవనం, క్షమ భూతహితం, లాంటి నిష్కామ కర్మల ద్వారా చాలావరకు తొలగించుకోవచ్చు. 
మనం అవిద్య / అజ్ఞానంతో సంపాదించుకొని వున్న ప్రారబ్ద కర్మలను తొలగించుకోవడానికి ఈ మానవజన్మ తీసుకున్నామన్న సత్యాన్ని మరచి, మరల మరల అజ్ఞానముతో వాటికి తోడూ మరింతగా కర్మరాశిని ప్రోగు చేసుకుంటున్నాము. మనస్సు మాయలోపడి వచ్చిన విషయాన్ని మరచిపోయి రకరకాల కర్మలను మూటగట్టుకుంటున్నాం. ఫలితం -  పునరపి జననం పునరపి మరణం . 
భగవంతుని యెడల శరణాగతి చెందితే ఎన్ని కర్మవాసనలు ఉన్నా అన్నీపోతాయి. అన్య ఆలోచనలు వీడి, అంతరమున అంతర్యామిని నిలుపుకొని కర్మలు ఆచరించిన చాలావరకు కర్మవాసనలు వదిలించుకున్నట్లే.   
                                               


ప్రారబ్ద కర్మ ఫలాలను అనుభవించటానికి జన్మ వస్తున్నదన్నది వాస్తవం. ఆ ప్రారబ్దకర్మలే లేకపోతే పుట్టుకే లేదు. ఐతే ఈ ప్రారబ్ద కర్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి? సంచితకర్మలలో నుండి పక్వమై వస్తున్నాయి. కనుక ప్రారబ్ద కర్మలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. మరి ఈ సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి? మనం ముందు జన్మలో చేసిన అగామికర్మలలో నుండి వెంటనే ఫలితాన్నిచ్చినవి పోను మిగిలిన కర్మలే సంచిత కర్మలుగా వస్తున్నవి. కనుక సంచిత కర్మలు చేయకుండా వుండాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట. ఐతే కర్మలు చేయకుండా వుండటం ఎవరికైనా సాధ్యమేనా ? ఊహు ... సాధ్యం కాదు. మరి ఎలా???  ప్రారబ్ద కర్మలను  భక్తి ధ్యానాదుల  ద్వారా  ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఉదాసీనంగా అనుభవించి అధిగమించాలి. అదే తరుణంలో అగామికర్మలు భగవంతార్పణ బుద్దితో కర్తృత్వ భావన లేకుండా నిష్కామంగా చేయాలి. అలాగే సద్గురువుల సాంగత్యంలో సంచితకర్మలను జ్ఞానాగ్నిలో దగ్దం చేయాలి అప్పుడే కర్మశేషాలుండవు, జన్మలు ఉండవు. జీవన్ముక్తిని పొందుతాం. 
చేసే తలపు లోపల వున్నంతకాలం, చేసేశక్తి తనకు ఉందనుకున్నంతకాలం, కర్మ చేయకుండా ఉండలేడు. చేసే శక్తి తగ్గి, చేయాలన్న తలపు తొలగి, ఇక చేయడానికి ఏమీ లేదని గ్రహించి, చేస్తుంది ఎవరు - చేయిస్తుంది ఎవరు అన్న విచారణతో భాగవతంలోని గజేంద్రుడులా మౌనమై శరణాగతి పొందినప్పుడే ముక్తత్వం.        
ఇది గ్రహించి నడయాడేవారు కర్మయోగులు. వీరే అంతరమౌనంలో ఓలలాడుతూ బాహ్యకర్మలయందు తామరాకుపై నీటిబొట్టులా జీవిస్తారు. వీరికి నామరూపములు, బాహ్య కర్మలు ఆటంకం కానే కాదు. అదో సహజ స్రవంతి .

ప్రతీరోజు భగవంతుని ఎదుట నిలబడి, చేస్తున్నది చేయిస్తుంది అంతా నీవే, ఇదేదీ నేను కాదు, అంతా నీవే ఉన్నావని మౌనమై కొన్ని క్షణాలు ఉండండి. అదే నిజమైన మహన్యాసపూర్వక పూజ. ప్రయోజనంతో పట్టింపులేకుండా పనులాచరించడమే పరమ ప్రయోజనం. వ్యక్తిగతమైన నేను ను విడనాడి చేసిన కర్మయైన, ధ్యానమైనా జ్ఞానమునే ప్రసాదిస్తుంది. కాటిపై కాలేక కూడా కర్మవాసనలు మోస్తూ మరుజన్మ పొందుతున్నదెవరు అన్న విచారణ  జీవన్ముక్తిత్వమునే ఇస్తుంది.   
                                                                 
కర్తృత్వభావనతో కర్మలాచరించేకంటే ఈశ్వరార్పణతో కర్మలాచరించడం ధన్యత. 
మౌనంగా ఉండటం కంటే, మౌనమై ఉండటం శ్రేష్టత.