28, అక్టోబర్ 2020, బుధవారం

కాల విశిష్టత

                                                     



మహిమాన్వితమైన కాల మహాత్మ్యం -
సహస్ర నేత్రాలతో భూమిపై జరిగే సమస్త కర్మలకు ప్రత్యక్ష సాక్షి కాలం.     
కాలం సమస్త జీవకోటి జీవన గతిగమనాలను నిర్దేశించే మహేంద్రజాలం.   

                                                           


కాలో అశ్వోవహతి సప్త రశ్మిః సహస్రాక్షో అజరో భూరి రేతాః | 
తమా రోహంతి కవయో విపశ్చి తస్తస్య చక్రాభువనాని విశ్వా | |( అధర్వణవేదం)
కాలమనే అశ్వము ఏడు పగ్గములతో తనను తాను నియమించుకొనుచూ ప్రపంచమును మోయుచున్నది. ఈ కాలమునకు వేల వేల కన్నులు. ముదిమి లేని ఈ కాల ప్రభావము, బలము చాలా గొప్పవి. ఈ అశ్వమును పరమాత్మను సాక్షాత్కరించుకొనువారు, పరమాత్మ స్వరూపమును బోధించువారు అధిరోహించెదరు.   

స ఇమా విశ్వా భువనాని అంచ్యత్‌
కాలస్య ఈ యతే ప్రధమోనుదేవ:
సఏవ సంభువాన్యా నా భారత్‌
సఏవ సంభువానాని పరైత్‌
పితాసన్నభవత్‌ పుత్ర ఏషాం
తస్మాద్వై నాన్యత్‌ పరమస్తు తేజ: 

అనంత భువనములను ఏర్పరిచింది, అనంతకోటి బ్రహ్మాండాల్లో నిండియున్నది, అన్నింటా తానుండి నడిపించింది, చరాచరాలు అన్నింటా ఉన్నది కాలపురుషుడే. 

మహాభారత సంగ్రామ రంగంలో శరతల్పగతుడైన భీష్మాచార్యులవారు పాండవులతో, 
నాయనలారా! శ్రీకృష్ణపరమాత్ముడు, మీ జీవితాలకు సారధ్యం వహిస్తున్నా, మీరు కష్టాల పాలై, బాధలు పడ్డారు కదా అని అంటూ...ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ పడిపోతూ ఉన్నట్లు (వాయువశంబులై యెగసి వారిధరంబులు ...) ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తమూ కాలచక్రం వల్ల కూడుతూ, వీడుతూ ఉంటుంది. కాలమే అన్నింటికీ మూలం. కాలం విచిత్రమైనది ఎంతటివారైన సరే ఈ కాలప్రవాహాన్ని దాటలేరని ఓదార్చారు. 

కాలం ఒకేలా ఉండదు. మనకు ప్రాప్తించిన కష్టసుఖాలు, వియోగ విలాపాలు, సిరి సంపదలు  మన ప్రారబ్ధ ఫలితాలే. కాల నియమానికి ఎవరమూ అతీతులు కాము.  విశ్వంలోని ప్రతిజీవి కాలాధీనమై  వర్తించాల్సిందే. సుఖ దుఃఖాలైన, మంచి చెడులైన, కాలంతోనే వస్తుంటాయి... పోతుంటాయి. మన మనస్సును మురిపించే బంధాలు, ప్రేమాభిమానాలు, ఆస్తులు, హోదాలు... సమయానుకూలంగా కాలం వాటిని మనకు ప్రారబ్ధ ప్రాతిపదికన సమకూర్చి, గడువు తీరగానే తనలో లయం చేసుకోవడం అందరూ నెఱిగిందే.  దీనిబట్టి కాలగమనంలో కష్టసుఖాలు సహజమేనని గుర్తించి, స్థిమితంగా జీవనగమనం సాగించడం ఉత్తమం.  "బహు విఘ్నః సురాః కాలః కాలః కాలం నయిష్యతి:" కాల గమనంలో ఎన్ని విఘ్నాలైనా రావచ్చు, కానీ, కాలానికి కాలమే ఏదో పరిష్కారం చూపుతుంది.     

                             
                                                     
కాలం పరమేశ్వర స్వరూపం. కనుక అఖండమైనది. విభజించడానికి అవకాశం లేనిది. కానీ; కార్య స్వరూపం చేత క్షణములు, ఘటికలు, దినములు, పక్షములు, మాసములు...మొదలగు భేదాలు కల్పించారు. 
                                                     


ఒక్క క్షణం ఆగండి...చిటికెలో చేసేస్తా.
కనురెప్పపాటులో జరిగిపోయింది. 
లిప్తపాటైన ఏమరుపాటు వద్దు. 
ఇలా విభజన చేయలేని అతి చిన్న సమయాన్ని కూడా మాటల్లో సూచిస్తుంటాం. 

కాలాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా విభజించినా, వర్తమానం చాలా చిన్నది. అది కేవలం క్షణకాలమే వుంటుంది. భూతకాలం చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోగలిగినంత. భవిష్యత్తు మరి ఎక్కువ. ఊహించగలిగినంత. భూత భవిష్యత్తుల కాలంలో కాకుండా వర్తమానంలో అనుక్షణం ఉండగలగడం ఓ అద్భుత జీవనసరళి. 




మనం ప్రతీ క్షణముని ఎలా వినియోగంచుకుంటామన్నది ముఖ్యం. వినియోగించుకోని క్షణం తిరిగిరానిది, వృధాగా గడిచిపోయినది. సకల సృష్టికి సమయం ఒకటే. కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్లమందిని పాలించే ప్రభువైన గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. కాలాన్ని వృధా చేయడమంటే మనల్ని మనం దోపిడి చేసుకోవడమే అవుతుంది. ఏ క్షణంకా క్షణం వినియోగించుకుంటేనే ఆ క్షణం జీవించునట్లు. లేకపోతే పొగొట్టుకున్నట్లే. 

                                                      


మన జీవితమంతా మన ఆలోచనల పర్యవసానమే. మన ఆలోచనలే మనల్ని రూపొందిస్తున్నాయి. ఆలోచన అంటే మనస్సు లోపల నిశ్శబ్ధంగా జరిగే మాటల ఆట. 
చాలావరకు ఎన్నో క్షణాలను ఏవేవో ఆలోచనల నడుమ పరధ్యానంగా గడిపేస్తాం. మనిషి సంపూర్ణంగా జీవించాలంటే ముందుగా పరధ్యానం పొగొట్టుకోవాలి. ధ్యానంలోనికి రావాలి. పూర్తిగా ఎఱుకలోనికి వచ్చి, జీవితాన్ని సంపూర్ణంగా జీవించే విధానమే పరధ్యానం లేని ధ్యానం. ఆ క్షణంలో చేస్తున్న పనియందే  శ్రద్ధగా, నిలకడగా ద్యాస పెట్టడమే ధ్యానం. వర్తమానంలో ఎఱుకతో అన్ని పనులు చక్కబెట్టడమే జీవించమంటే. 

                                                          


కానీ, సాధారణంగా మనలో చాలామంది -  ఎప్పుడూ చేసే పనులే కదా, అలవాటైన ఆ పనులు అలవోకగా అయిపోతుంటాయి. ఈ పనులు గురించి ఆలోచనలు అవసరం లేదని అనుకుంటాం. అయితే ఇక్కడే పొరపాటు చేస్తుంటాం. అలవాటైన పనులే కదా  అని, ఆ పనిని యాంత్రికంగా నిర్వహించడాన్ని శరీరానికి వదిలేసి,  ఆ క్షణంలో ఆ పని గురించి కాక, వేరే ఆలోచనలలోనికి అలవోకగా  జారుకుంటాం.  చేస్తున్న పనికి ఏ సంబంధం లేని, సమయానికి వర్తించనిది అయిన మరేదో విషయంలోకి వెళ్ళటం... అంటే భూత భవిష్యత్తు లోనికి పయనించటం.  వర్తమానంలో చరించక భూత భవిష్యత్తు లోనికి చరించే వెసలుబాటు మన మనస్సులకు ఇస్తుంది మనమే. ఆ అలవాటు చేస్తుంది మనమే.

                                                                 


అన్ని పనుల్లో, అంత ఆలోచించాల్సిన అవసరం లేదన్నది నిజమే గానీ, ఇక్కడ ఇతరత్రా ఆలోచించడం అవసరమా? ఇతర ఆలోచనలు ముఖ్యం కాదు, గమనించటం ముఖ్యం. చేస్తున్న దానిని గమనించటమనే పనిలో, ఏకాగ్రత పెట్టడం వలన, మనస్సు అనవసర విషయాల్లోనికి పోకుండా వుంటుంది. మనస్సు ఎన్నోసార్లు చేస్తున్న పనినుంచి ప్రక్కకు తప్పుకుంటూ ఉండవచ్చు... తిరిగి వెనక్కి తీసుకొని రావచ్చు. ఇలా ఎన్నిసార్లు జరుగుతుందని లెక్కలు వేసుకోవడం సాధన కాదు, పోయిన క్షణాలు ఎలాను పోయాయి, వాటి గురించి ఆలోచించి, బాధపడి మరిన్ని క్షణాలు పోగొట్టుకోకూడదు. ఇంతసేపు ఇలా జరిగిందని బాధపడడం కంటే, ఎప్పుడైతే మనస్సు ప్రక్కకు వెళ్ళిందని గ్రహింపుకొస్తుందో, ఆ క్షణంలో వర్తమానం లోనికి వచ్చి మనస్సుని అక్కడే నిలుపుకోవాలి. ఈ విధమైన అభ్యాసంకు  సమయం పడుతుంది. కానీ, ఇది మనస్సును ఏకాగ్ర మొనర్చటానికి శక్తివంతమైన సాధన. ఇది శ్రేయోదాయకమైన సాధన. కాలం విలువ గుర్తించి, ఎవరిని వారు గమనించుకుంటూ జీవితం గడపటం వలన, ప్రతీ పనిలోనూ ఆనందం తృప్తి కలుగుతుంది. ఎంత సమర్ధవంతంగా పని చేయగలుగుతున్నామో ఎవరికి వారు ప్రత్యక్షానుభవముతో తెలుసుకోవచ్చు. 



అలాగని గతాన్ని వదిలేయాలా? భవిష్యత్తుకై ఆలోచించకూడదా ... అంటే - 
ఇప్పుడు చేస్తున్న పనికి గతానుభవం అవసరమైతే, దాన్ని తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకొని ఇప్పటిపనిని మరింత చక్కగా చేయవచ్చు.  
అలానే భవిష్యత్తు -   భవిష్యత్తులోని ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చేయాల్సిన పనులకోసం ఆయా ప్రణాళికలను దృష్టిలో పెట్టుకోవడం కూడా అవసరమే.
రేపటి పలహారానికి (ఇడ్లి, అట్లు లాంటివి) ఈరోజే పప్పు నానబెట్టాలి. తినటం రేపటి పని. పప్పు నానబోయడం ఈరోజు పని. అంతేగానీ,  రేపటి పలహారపు రుచిని, తినడాన్ని ఇప్పటినుండే ఊహించుకొని ఆ ఊహల్లో ఉండడం సరికాదు. ఎవరికైతే ఉన్నత లక్ష్యం ఉంటుందో వారు దానికై ఊహించుకుంటూ వర్తమానంను ఆలోచనలతో గడిపేస్తే ఫలితముండదు.  
భవిష్యత్తులోకి అవసరమైన దానిని అమర్చుకోవడం ప్రస్తుత కర్తవ్యమే గానీ, నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. ఊహాలతో విజయాలు రావు. కాలానుగుణ కార్యాచరణ చేస్తూ, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. ఆదౌ కాలం పరిక్ష్యేత్, తతః కర్మాణి కారయేత్ ... 
కాలాన్ని అనుసరించి కర్మలు చేయాలి. కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ కర్తవ్య నిర్వహణ కావించేవారే విజ్ఞులు. 

                                                   


గతానుభవాలు చేదువని, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ప్రస్తుత క్షణాలను చేజార్చుకోవడం తగదు. మంచి క్షణం కోసం ఎదురుచూసేకంటే, ఉన్న క్షణాన్నే మంచిగా మలుచుకోవడం విజ్ఞుల లక్షణం. సమయాన్ని దేనికి ఎప్పుడు ఎలా కేటాయించాలో అప్పుడు అలా పద్దతి ప్రకారం కేటాయిస్తేనే సత్ఫలితాలు అందుతాయి. సమయాన్ని సద్వినియోగపర్చుకోవడం ఓ  చక్కటి కళ.