5, అక్టోబర్ 2025, ఆదివారం

ఇది కదా...స్కంద అనుగ్రహం

తాతయ్య నాన్నమ్మలతో కలిసి చి|| అన్విక (2 సం|| నా మనుమరాలుకు) మొదటి సినిమా చూస్తే బాగుంటుందనే మా అబ్బాయి కోరికను కాదనలేక, సుమారుగా 17 లేక 18 సం||ల తర్వాత ఆగస్ట్ 25 న దియేటర్ కు వెళ్ళి (చివరగా దియేటర్ కు వెళ్ళి చూసింది పాండురంగడు) 'మహావతార్ నరసింహ' యానిమేషన్ చిత్రాన్ని చూసాను. 

అద్భుతంగా తీసారు. ఆద్యంతం ఆసక్తిదాయకం. సినిమా చూడడం అయింది కానీ; మనస్సులో పురాణ కథనాల కదలికలు...ఆలోచనలు!

బీజం, క్షేత్రం రెండూ శ్రేష్ఠమైతే జనించేవి ఒకలా, బీజం శ్రేష్టమైనది అయినను, క్షేత్రం శ్రేష్టమైనది కాకపోతే, జనించేవి మరోలా...! జనించేవాటిలో ఎంతో వైరుధ్యం. అందుకు ఉదాహరణే దైత్యులు, దేవతలు.

గర్భవతుల వైఖరి, మనోభావాలు పుట్టబోయే బిడ్డలపై ఎంతగా ప్రభావితమౌతాయో ప్రహ్లాదుడు, అభిమన్యుడులాంటివారిని పరిశీలిస్తే అర్థమౌతుంది. అలాగే భర్తను చేరిన భార్య మనోభావాలు ఎంత ప్రభావం చూపుతాయో భారతంలో ధృతరాష్ట్రుడు అంధుడిగా, పాండురాజు పాండురోగిగావిదురుడు జ్ఞానవేత్తగా ఎలా జన్మించారో గ్రహిస్తే, భర్తను చేరిన భార్య మనోభావాలకు, అంకురం మొదలు ప్రసవించేంతవరకు తన భావాలకు, నడవికకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థమౌతుంది. అందుకే కదా, పెద్దలు గర్భిణీ స్త్రీలు ఉత్తమ సంతానం పొందడానికి పురాణ ఇతిహాసాలు, ముఖ్యంగా స్కందోత్పత్తి లాంటివి చదవమని, వినమని చెప్తుంటారు. స్కందోత్పత్తి అంటే జ్ఞాపకం వచ్చింది, కొన్ని నెలల క్రితం మా అక్కగారి అమ్మాయి 'విద్య' ఇంతవరకు కుమారస్వామి గురించి స్మరణలో వ్రాయలేదు, నాకోసం కుమార సంభవం గురించి వ్రాయమని అడిగింది. తన కోసం, ఇప్పుడు వ్రాయగల్గుతున్నాను స్వామి అనుగ్రహంతో.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఈ బ్లాగ్ మొదలుపెట్టాక చాలాసార్లు అనుకున్నాను... సుబ్రమణ్యస్వామి గురించి వ్రాయాలని. షణ్ముకోత్పత్తి కథనం తెలిసినా గానీ, వ్రాయలేకపోయేదాని. ఈ సినిమా చూసాక, ఎలాగైనా ఈసారి వ్రాయాలని బలంగా అనుకున్నా గానీ, ఏరోజుకారోజు వాయిదాలు. రాత్రి పడుకునేటప్పుడు రేపు వ్రాయాలని గట్టిగా అనుకోవడం... మరునాడు మనస్సు వేరేదానిపై మరలడం, ఏదో అలసత్వం... తమోగుణంలో ఉండేదానిని. ఎందుకిలా? ఆలోచిస్తే, స్వామి గురించి వ్రాయాలంటే, స్వామి గురించి నాకు తెలుసు అన్న అహంను వీడి, ముందు స్వామిని ఆరాధించాలి అని స్ఫురించి, ఆరోజు నుండి స్వామి కథనాలు, స్వామి భక్తులకథలు, శరవణభవ శరవణభవ... స్మరణం, పఠనం, శ్రవణం... ఒకే ధ్యాస... అదే ధ్యానం.
దసరా సెలవులని వచ్చిన అభినవ్ రామ్, అభిజిత్ రామ్ (దౌహిత్రులు)లకు రాత్రి పడుకునే ముందు ఇవే కథలు, మావారికి, చెల్లికి, స్నేహితులకు... ఒకరని ఏముందీ, ఈమధ్యకాలంలో నన్ను కలిసిన అందరితో స్వామి కబుర్లే. ఇది కదా...అనుగ్రహమంటే🙏
ధర్మసూక్ష్మాలతో కూడుకున్న స్కందుని జననంకు కారణం తెలుసుకోవాలంటే, ముందున్న నేపథ్యం కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే స్వామి జననం కొన్ని కథనాలకు, శివయ్య లీలలకు అనుసంధానమై ఉంటుంది. అలాగే ఈ కథనాలు రామాయణం లోనూ, మహాభారతంలోనూ, శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చిన్న చిన్న వ్యత్యాసాలతో కనిపించవచ్చు. ఒకే కుమారసంభవమును అనేక కోణాలలో మహర్షులు దర్శించారు కాబట్టి, చిరు చిరు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, అవి అన్నీ సత్యమే. కథనాలన్నీ ఋషి ప్రోక్తములే.

కుమార సంభవంకు పూర్వ నేపథ్యం - 

బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కళల కుమారుడు కశ్యప ప్రజాపతి. దక్ష ప్రజాపతి కుమార్తెలలో పదమూడు మంది ఈయన భార్యలు. ఈ పదముగ్గురులో అదితి, దితిల గురించే ఇక్కడ కాస్త తెలుసుకోవాలి. ఎందుకంటే దేవతలు, దైత్యుల
ఆవిర్భావంనకు ప్రధానభూమికలు వీరివురే. 

సంతాన విషయంలో స్త్రీ సంస్కారబలం, శుద్ధభావనలు ఎంతో ముఖ్యం కాబట్టి, పూర్వం వివాహం అవగానే  ఋషులు కొంతకాలం తమ భార్యలతో కలిసి ఈశ్వరారాధనం చేసేవారు. వారి మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తరువాత భార్యను ఏమి కావాలని అడిగి, తను కోరుకున్న  సంతానముకు బీజం వేసేవారు. 

తపోనిష్టాగరిష్ఠుడు, ధర్మానిష్టాగరిష్ఠుడు మహాభక్తుడైన కశ్యప ప్రజాపతిని త్రికరణశుద్ధిగా ఏకాత్మ భావనతో అనుగమించే ధర్మపత్ని సత్త్వగుణశీలి అదితికి ఆదిత్యులు (దేవతలు) జన్మించగా, భర్త యెడల కించిత్ ధర్మలోపంతో, అశాస్త్రీయ కోరికలతో, ద్వైత భావంతో అనువర్తించే దితికి దైత్యులు (అసురులు) పుడతారు. 
మోహంతో సంగమించిన దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టడం, వారిరువురును శ్రీమహావిష్ణువు వరాహ, నరసింహ అవతారాల్లో సంహరించడం అందరికీ తెలిసిందే. ఇంత జరిగినా, ఏ మార్పు రాని దితి మరల బిడ్డలను కనాలని, కశ్యప ప్రజాపతిని 'నాకు ఇంద్రుడిని చంపే కొడుకు కావాల'ని కోరింది. అంతట కశ్యప ప్రజాపతి, 'నీకు ఎలాంటి బిడ్డ పుట్టాలో ఆ ఈశ్వరునికే ఎరుక. నీవు కోరుకున్నటువంటి బిడ్డ కలగాలంటే, ఈశ్వరుడుని సేవిస్తూ, ఏ ధర్మలోపం జరగకుండా తపస్సు చేయ'మని చెప్పెను. కొంతకాలానికి ఆమె లోపలకి కశ్యప ప్రజాపతి తేజం ప్రవేశించింది. ఆమె గర్భిణీ అయింది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఆమె దగ్గరకు వచ్చి, 'నీకు సేవ చేస్తాన'ని అడుగగా, ధర్మం పాటిస్తూ 'సరే'నని అంగీకరించింది. ఒకానొకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చొని ఉండగా, చిన్న కునుకు పట్టి, మోకాలి మీదకు తల ఒరగగా, జుట్టు పాదములను తాకింది. స్త్రీలకు అలా తగలకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం జుట్టు చివర ముడి వేయాలి. ముడి వేయని ఆమె జుట్టు పాదములను తాకగానే, అదే అదునుగా ఇంద్రుడు, ఆమె గర్భంలోనికి ప్రవేశించి, వజ్రాయుధంతో లోపలున్న పిండమును మారుదః మారుదః (ఏడవకండి ఏడవకండి) అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడుస్తూ, 'నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను కానీ, నీచే చంపబడ్డ పిల్లల్ని కాదు. నీచే చంపబడ్డారు కనుక నువ్వు వాళ్ళని బ్రతికించి, నీ దగ్గర పదవులియ్యు'అని ఇంద్రుణ్ణి కోరగా, మారుదః మారుదః అని ఇంద్రునిచే చంపబడ్డ వాళ్ళు 'మరుత్తులు'గా స్వర్గలోకంలో పదవులు పొందారు.
మరికొంతకాలం పిమ్మట, దితి భర్తను 'నాకు దేవతలందరినీ జయించగల కుమారుడు కావా'లని కోరింది. అంతటా కశ్యప ప్రజాపతి, 'అటువంటి కొడుకు కావాలంటే పదివేల సంవత్సరాలు నియమంతో, బ్రహ్మ గురించి తపస్సు చేయ'మని చెప్పగా, ఆమె కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహం పొంది, భర్తను చేరగా, గర్భం ధరించి వజ్రములవంటి అంగములు గల కొడుకును కన్నది. ఆ కొడుకు పేరు వజ్రాంగుడు. 
ఈ వజ్రాంగుడు తన అపార దేహబలంతో ఇంద్రాది దేవతలను ఓడించి, ఇంద్రాది దిక్పాలకులను కారాగారంలో బంధించి, దేవలోకాన్నంతటిని ఆక్రమించి, అక్కడ మిగిలిన వార్ని అడవులకు తరిమేసి, సర్వాధిపత్యాన్ని పొందాడు. ఆ తరుణంలో బ్రహ్మ, కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకొని, వజ్రాంగుడు దగ్గరకు రాగా, వజ్రాంగుడు లేచి నమస్కరించి, సముచితాసనమునందు కూర్చోబెట్టి, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చెను. 'నాయనా! నీ అతిథిమర్యాదకు సంతోషించాం. నీవు విజేయుడివే, ఇందులో సందేహం లేదు గానీ, నేను పదవులిచ్చిన ఇంద్రాది దిక్పాలకులను కారాగారంలో పడేశావు. వార్ని విడిచిపెట్టి, వాళ్ళ పదవులను వారికి తిరిగి ఇచ్చేయ'మని బ్రహ్మ చెప్పగా, 'మహానుభావా! మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకోవడానికి మేము తపస్సు చేయాలి గానీ, మీకు మీరుగా నా దగ్గరకు రావడం ఏమిటి? అమ్మ కోరిక తీర్చడానికి, ఇంద్రుడును ఓడించి బంధించాను. వారిని విడిచిపెట్టమని శాసించకుండా యాచించడం ఏమిటి? ఇది నాకు కీర్తి కాదు, అపకీర్తి. నాకు ఈ రాజ్యం మీద గానీ, పదవుల మీద గానీ ఆశ లేదు'...అని వజ్రాంగుడు అంటూ, అందర్నీ విడిచిపెట్టి, వారి వారి పదవులు వారికి ఇచ్చివేసెను. (ఇది తండ్రి అయిన కశ్యప ప్రజాపతి తేజస్సుచే అబ్బిన సంస్కారం). పిమ్మట బ్రహ్మను ప్రార్థిస్తూ, 'నాకు ఈ భోగ భాగ్యాలు వద్దు, నాలుగు వేదములు తెలిసిన మీరు, అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో... అది నాకు బోధపడేటట్లు ఉపదేశం చేయవలసింది'గా కోరెను. వజ్రాంగుడు ఈ కోరికకు బ్రహ్మ ఆనందభరితుడై, 'నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వగుణము కలిగి ఉండు. ఈశ్వరుడుని నమ్మి ఉండు. ఈశ్వరుడుని పట్టుకొని ఉంటే, నీ మనస్సు భగవంతునిపై లగ్నమైతే, సంసారంలో ఉన్నా, నీకు ఏ బాధ ఉండదు. నీవు సదా చిత్త శాంతితో ఉంటావు. నేనే నీకు ఒక భార్యను ప్రసాదిస్తాను. నేను సృష్టించి ఇచ్చిన ఈమెను స్వీకరించు, ఈమె పేరు వరాంగి' అని చెప్పి, దగ్గరుండి పౌరోహిత్యం చేసి పెళ్ళి చేసెను. సత్త్వ స్థితికి వచ్చిన వజ్రాంగుడు  బ్రహ్మచేత సృష్టింబడిన వరాంగితో కల్సి నిరంతరం ఈశ్వరుని యందు భక్తితో ధర్మాచరణపరుడై ఉంటాడు. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అసురుడుగా పుట్టిన వజ్రాంగుడు రజో తమోగుణాలు విడిచిపెట్టి సత్త్వగుణ సంపన్నుడై ధర్మమార్గంలో అనువర్తిస్తుంటే, బ్రహ్మచే సృష్టింపబడిన వరాంగి అసురుల ఇంటా అసురులచే వండబడిన అన్నం తినడంతో, రజో తమో గుణాలు పొంది, బాహ్యంగా భర్తతో పాటు పూజలు చేస్తున్నా, అన్నింటా భర్తకి సహకరిస్తున్నా, అంతరాన మాత్రం ఈయన ఎంతో ప్రతాపంతో పుట్టి, ఆ ప్రతాపమును మరిచి, ఏ కోరికా లేకుండా సదా ఈశ్వర ధ్యాసలో ఉంటారేమిటీ... అని లోలోన వాపోతూ, మూడు లోకములను ఏడిపించగలిగిన కొడుకు నాకు పుడితే బాగుండును అనే కోరికతో ఉంటుంది. ఒకనాడు ఏం కావాలో కోరుకో అని వజ్రాంగుడు వరాంగినీ అడుగగా, 'విష్ణు ద్వేషి, వేదాలను గౌరవించని, ముల్లోకములను గడగడలాడించి, ఇంద్రుణ్ణి అవలీలగా గెలిచే, దేవలోకాన్ని స్వాధీనం చేసుకునే శక్తివంతుడైన కొడుకు నాకు కావాలి' అని కోరుతుంది. అత్త దితికి తగ్గ కోడలు వరాంగి. భార్య కోరిన ఈ కోరికతో ఎంతో వేదనకు లోనై, బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు వజ్రాంగుడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే, మీరు ప్రసాదించిన వరాంగితో కలిసి ఈశ్వరుని పై నమ్మికతో ధర్మాచరణలో నేనుంటే, ఆమె ఇంద్రుడిని జయించే, ముల్లోకాలను ఏడిపించే కొడుకు కావాలని కోరింది. ఆమె కోరిక తీర్చడం నా ధర్మం. అటువంటి కొడుకు నా వలన ఆమెకు కలిగేటట్లు మీరే వరమివ్వండి అని అడిగాడు. ' తథాస్తు' అన్నాడు బ్రహ్మ. తిరిగివచ్చిన వజ్రాంగుడు భార్య యందు తన వీర్యాన్ని నిక్షిప్తం చేయగా,  కొంతకాలం పిమ్మట వరాంగికి తను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే భూమి కంపించింది. మేఘాలు రక్తాన్ని కురిపించాయి, దిక్కులన్నింటా అగ్నిహోత్రాలు చెలరేగాయి, ప్రకృతి విలయతాండవం చేసింది. పశుపక్షాదులు భయంతో గోల చేశాయి. ఆ బాలుడికి తాతగారైన కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశారు. తారకాసురుడు చిన్న వయస్సులోనే, దుష్ట ఆలోచనల దితి, వరాంగీలా సూచనతో బ్రహ్మ కోసం ఉగ్ర తపస్సు చేసి, మూడు లోకాలను జయించగల శక్తిని ఇమ్మని, పరమశివుడు వీర్య స్ఖలనం నుండి పుట్టిన ఏడురోజుల కొడుకు చేతిలోనే మరణం ప్రాప్తించాలనే వరాలను బ్రహ్మ నుండి పొందాడు. (సతీ వియోగంతో తపస్సు చేసుకుంటున్న శివుడుకు కొడుకు ఎలా పుడతాడనే భావన తారకునిది). తమతో దండెత్తుకొచ్చిన వీడితో యుద్ధం ఎందుకని ఇంద్రాది దేవతలు తలవొగ్గారు. ఇంద్ర పదవిని అధిష్టించి, దిక్పాలకులందరి పదవులను తీసేసి, ఇక తన ఆజ్ఞానుసారం నడుచుకోవాలని శాసించాడు. కుబేరుడిని, తుంబురుడిని, సూర్యచంద్రాదులను తను చెప్పినట్లే నడుచుకోవాలని శాసించాడు. ఈ నిర్భంద బాధలు పడలేక, వీరంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, శివుడుకి కొడుకు పుట్టేలా, మీరే ఏదైనా చేసి, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. 

తారకాసురుడు ముల్లోకాల మీద పడి చేస్తున్న విద్వాంసం ఆగాలంటే, స్కందోత్పత్తి జరగాలి. దక్షయజ్ఞం తరువాత సతీవియోగుడైన పరమశివుడు తీవ్రధ్యానంలో ఆత్మస్థితిలో ఉన్నాడు. మరి కుమారస్వామి జననం జరిగేది ఎలా? 

తదుపరి టపాలో -