20, జులై 2016, బుధవారం

"సనత్సుజాతీయం"

భగవంతుడే చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు,. ఆ పరమాత్ముడే సత్యం ... సనాతనం. అతని ప్రేమైక సృజనయే సృష్టి.

దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై భాసిల్లే పరతత్త్వం గురించి తెలియజెప్పేదే వేదం. దీనికి శబ్ధరూపములుగానైన ప్రతులే ఋగ్వేదాది నాలుగు వేదములు. వీటి సారమే విజ్ఞానదాయకమైన ముక్తిప్రదాయినులగు పురాణములు, రామాయణము, మహాభారతం, భాగవతములు. ఇందు రామాయణం వాల్మీకి ప్రోక్తం కాగా, మిగిలినవి వ్యాసప్రోక్తములు.  ఇందులో మహాభారతం పంచమవేదంగా ప్రశస్తి పొందడానికి కారణం - అందు అశ్వనీదేవతల స్తుతి, సనత్సుజాతీయం, భగవద్గీత, ఉత్తరగీత, భీష్ములవారి ఉపదేశములు, విష్ణు సహస్రనామములు మొదలగు ఎన్నో ముక్తిత్వంలను ఒసగు ధర్మ ధార్మిక ఘట్టములు అనేకములు వుండడంచే పంచమవేదంగా కీర్తింపబడుతుంది.

శ్రీమన్నారాయణునిచే వేదములు గ్రహించిన సృష్టికర్తయగు బ్రహ్మ తేజోమయ చతుర్ముఖములకు నేపధ్యములు సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు. ఈ ముఖములందలి తేజస్సులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు పరమ ఋషీంద్రులు. బ్రహ్మవిద్యా ప్రవర్తుకులు.

శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణకై ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడుగా అవతరించక ముందే దైవప్రణాళికకు సహకరించడానికి సనత్కుమార, సనత్సుజాతులవారు గోపాలురుగా దిగివచ్చిరి. ఇందులో సనత్సుజాతులవారు శతగోపనామధేయంతో గోకులంకు వచ్చిరి. ఈయనే రాధదేవిని పెంచిన తండ్రి. ఇటు నరదేహంన శతగోపుడుగా వర్తించుచున్నను, అటు సనత్సుజాత ఋషీంద్రులుగా కూడా వర్తించగలిగేవారు. కృష్ణ భక్తుడును, సద్గుణవంతుడయిన విదురుడు వీరి శిష్యుడై బ్రహ్మజ్ఞానం పొందిరి.

సంజయుడు పాండవ వాసుదేవుల వద్దనుండి తిరిగివచ్చిన తర్వాత...
దృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేయమని, లేదంటే యుద్ధం తప్పదని, యుద్ధమే సంభవిస్తే నీ కుమారులెల్లరు మృత్యువాత పడేదరని విదురుడు ఉపదేశించినను, దురాశతో విదురుని మాటలకు దృతరాష్ట్రుడు విలువివ్వలేదు. కానీ, తన కుమారులు యుద్ధమందు మరణిస్తారేమో నన్న భయంతో నిద్రపట్టక విదురునిని రప్పించుకొనగా ...
రాజా!   ఏ విధమైన అనారోగ్యాలు లేనప్పుడు నిద్ర పట్టనిది నలుగురికే. 1. బలవంతుడయిన శత్రువు తనపై దాడి చేస్తాడేమో నన్న భయంతో వుండే బలహీనునకు, 2. సరుకు (సంపద)కోల్పోయినవారికి 3. దొంగకు 4. కామాతుర చిత్తుడునకు. రాజా! ఇప్పుడు చెప్పు ... ఎందుకు నీకు నిద్రపట్టడం లేదు అని విదురుడు అడగగా -
ప్రతీవారు మృత్యువే అంటారు, ఆ మృత్యువును దాటడానికి ఏ మార్గమూ లేదా ? అన్న దృతరాష్ట్రుని ప్రశ్నకు విదురుడు ఇలా ప్రబోధిస్తాడు -
ఆధ్యాత్మిక జ్ఞానం ... ఆత్మవిద్య ఉన్నది. సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకొని, దాని మీద మనస్సు నిలిపి, మనస్సులో కూడా అదే అంతర్యామిత్వం చెంది, ఇంద్రియములను నిలిపి, ఇంద్రియములలో కూడా అదే అంతర్యామిత్వం చెంది, దేహము, మనస్సు ఇంద్రియములు అనేటువంటివి లేకుండా, వాటి స్థానంలో కూడా సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమునే నిలుపునటువంటి ... ధారణ, ధ్యాన సమాధి నిష్టులయిన మహాత్ములకు మృత్యువు లేదు అని చెప్పగా ...

"మృత్యువు" యొక్క స్వరూపంను, మృత్యువును దాటే ఉపాయాన్ని తెలపమని విదురునిని దృతరాష్ట్రుడు కోరగా,  ఇది బ్రహ్మవిద్యా రహస్యం. దీనినుపదేశింప తానర్హుడ గానని, మా గురువుగారే అర్హులని, దానిని ద్రుతరాష్ట్రునికి ఉపదేశించుటకు  తన గురువగు సనత్సుజాతులవారిని విదురుడు సంస్మరించెను. స్మరణ మాత్రంచేత అనుగ్రహిస్తానని విదురునికి మాట ఇచ్చిన సనత్సుజాతుల వారు ప్రత్యక్షమై ద్రుతరాష్టునికి ఉపదేశించిన దివ్యజ్ఞానామృతమే "సనత్సుజాతీయం". 


తదుపరి వివరణ తదుపరి టపాలో ... 


27, మే 2016, శుక్రవారం

తెలుసుకోవాలని ఉంది...

శంబూకుడి వధ గురించి వ్రాయండి, ఈ మధ్య ఏదేదో వింటున్నాను, మీరు చెపితే తెలుసుకోవాలని ఉంది...

అని ఓ మిత్రురాలు అడిగారు.

నిజమే, ఈ కధపై విమర్శలు వున్నాయి. శూద్రులు తపస్సు చేయకూడదా? చేస్తే నేరమా? అందుకు సంహరిస్తారా? శూద్రులంటే ఎందుకింత వివక్ష? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ధర్మమూర్తి అని అంటారే శ్రీరామచంద్రున్ని, మరి ఆయనే, ఎవరికీ ఏ హానీచేయక తపస్సు  చేసుకుంటున్నశంబూకుడు అన్న శూద్రున్ని సంహరించడం ధర్మమా? ... ఇత్యాది ప్రశ్నలతో కొన్ని విమర్శలు వింటున్నాను అప్పుడప్పుడు!
మిత్రమా!
ఈ శంబూకుని కధ లోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చతుర్వర్ణాలు గురించి, శాస్త్రం గురించి, అప్పటి యుగధర్మం గురించి,  అప్పటి ప్రజలు ఎలా వుండేవారు?... ఇత్యాది విషయాలు ఓసారి పరిశీలిస్తే -

రామాయణం బాల కాండము, అయోధ్యా కాండము, అరణ్య కాండము, కిష్కింధ కాండము, సుందర కాండము, యుధ్ధ కాండము, ఉత్తర కాండము అనే ఏడుకాండలుతో కూడుకున్నది. ఇందులో ఉత్తరకాండ వాల్మీకి వ్రాసింది కాదని, ఇది ఋషిప్రోక్తమని / ప్రక్షిప్తమని కొందరు చెప్తుంటారు. అలానే రామాయణంలో కొన్ని కధలు (లక్ష్మణ రేఖ, శబరీ రామునికి పండ్లు తినిపించడం, హనుమాన్ తన గుండెను చీల్చడం మొ..) కూడా ఋషిప్రోక్తమేనని అంటుంటారు.
అసలు ఈ ఋషిప్రోక్తమంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.

ఈ సృష్టి మొత్తము పరస్పరత్వముపై ఆధారపడి యున్నది. ఒక అంశంతో పరస్పర సహకారం లేక మరియొక అంశమునకు అస్తిత్వం లేదు. సర్వజీవరాశుల యెడలను  ఈ సత్యమును మనం గమనిస్తే అవగతమౌతుంది. ఈ పరస్పరత్వము గురించి, ధర్మాల గురించి తెలియజేయునది శాస్త్రం. దీనియందు ప్రజ్ఞయున్నవారిని లేదా దీనిని దర్శించేవారిని ద్రష్టలు లేక ఋషులు అందురు. ఋషులు అంటే జ్ఞానపారంగతులు. జీవిత సూక్ష్మాన్ని, తత్త్వాల్ని దర్శించగలిగే యోగద్రష్టలు. వేలసంవత్సరాలు తరబడి ఋషుల పరంపర ఈ పరస్పరత్వమను మహత్తర సత్యమును దర్శనం చేసి, క్రోడీకరించి ఇచ్చిన శాస్త్రం పరంపరాగతంగా మనకు అందింపబడుచున్నది.
ఋషులు అంటే ఆశ్రమంలోనో, అరణ్యంలోనో, తపోదీక్షతలో ఉంటూ నిస్సంతుడై సమాజానికి దూరంగా వుండేవారని అనుకుంటే పొరపాటే.  యుగయుగాలుగా, తరతరాలుగా కాల ప్రవాహగతిలో ఎప్పటికప్పుడు మార్పులను సంతరించుకుంటూ సాగిపోతున్న సమాజానికి ఎప్పటికీ కాలదోషంపట్టని సంస్కృతీవిధిని, సమ్యగ్వివేచన, ఆచరణ అనేవి సమాజహితం కోసం శాస్త్రాల్లో పొందుపరుస్తూ భావితరాలకు మార్గదర్శకం చేసేవారే ఋషులు. 
ఋషులు అనుభవజ్ఞానంతో యోగదృష్టితో దర్శించిన ధర్మమే మనకు ప్రమాణికం.
ధర్మమును ఆచరించాలంటే - ఏది ధర్మమో, ఏది కాదో గ్రహించే జ్ఞానముండాలి. అలాంటి జ్ఞానం మానవునికి కొంత సహజంగా వున్నను, అది మాత్రమే సరిపోదు. యుగ యుగానికి, దేశ దేశానికి ధర్మం మారిపోతుంది. ఒకరికి ధర్మంగా అన్పించింది, మరొకరికి అధర్మంగా గోచరించవచ్చు కాబట్టి అల్పజ్ఞుడైన మానవుడు తన బుద్ధితో నిర్ణయించవలసినవి కావీ ధర్మాధర్మాలు. ఋషిప్రోక్తమైన శాస్త్రాలే మనకు మార్గదర్శకం. మన హైందవ సంస్కృతికి మూలం శాస్త్రాలే. 
వ్యక్తిశీలాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని తీర్చి దిద్దడానికి ఋషులప్రోక్తమైన సందేశాత్మక కధలు ఉపదేశాలు, మానవాళికి ఎంతో తోడ్పడతాయి.
దీనిబట్టి మనకు అవగతమౌతుంది ఋషిప్రోక్తం అంటే ఋషులచే చెప్పబడినవి మనకు శ్రేయోదాయకమని. 

ఇక చతుర్వర్ణాలు గురించి -

అందరూ చైతన్యస్వరూపులే.  ఇందులో సందేహం లేదు. అయితే, 
వారిలో విద్య చెప్పుటకొరకును, దేవపూజ చేయుటకొరకును కొందరు, శత్రువులను నిరోధించుటకొరకును, 
అందరిని ఓ పద్ధతిలో నడిపించుటకును, బలం, ధైర్యము గల కొందరిని, దేహబలమున బుద్ధి యుక్తిశ్శక్తియున్నవారిని వ్యాపరకృత్యములకు, 
తెలివి సంపూర్ణంగా లేనివారిని కృషిచేయుటకును, ఇతరపనులు చేయుటకును నిశ్ఛయించి, జనుల పరిపక్వత అనుసరించియు, అప్పుడుండు స్థితిని అనుసరించియు పూర్విజులు మానవులను నాలుగుభాగములుగా నియమించి వుండవచ్చునని పెద్దలు చెప్తుంటారు. 
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః । 
తస్య కర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్ ॥ 

మానవులు తమ సదుపాయమునకై బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర ధర్మములనుసరించి నాలుగు వర్ణములుగా ఏర్పడిరి. మానవులు చేయుపనులు నాలుగు విధములుగా నుండును. 1. తెలుసుకొనుట, తెలియజెప్పుట, 2. కాపాడుకొనుట, కాపాడుట, 3. ఉపయోగపడుట, ఉపయోగించుకొనుట, 4. కాయకష్టంతో పనులను చేసుకొనుట, చేసిపెట్టుట. ప్రతీ మానవుడు ఈ నాలుగింటిలో ఏదో ఒకదానికి పనికి వచ్చు స్వభావంను కలిగియుందురు. దీనినిబట్టే వృత్తి కర్మలు ఏర్పడును. ఈ నాలుగు విధముల విభాగమునే పెద్దలు నాలుగు వర్ణములుగా పేర్కొనిరి. 

అందరూ వేదపండితులమై వుంటామంటే సమాజం నడవదు. అందరూ క్షత్రీయులమై వుంటామన్నా, వ్యైశ్యులమై వుంటామన్న ఈ సమాజము నడవదు. ధర్మమేమిటో తెలియజెప్పే వేదశాస్త్రాలు అభ్యసించి ఆచరించి, తెలియజేప్పేవారు కావాలి, తప్పుచేసేవారిని శిక్షించడానికీ, ప్రజలను పరిరక్షించడానికీ, సరైన మార్గంలో నడిపించడానికీ పాలకులూ కావాలి, అలానే మిగతా వర్ణాలువారు అవశ్యం సమాజానికి.
అందుకే పూర్విజులంటారు - కేవలం సత్వగుణం వల్లనే సంఘం నడవదు. రాజసిక, తామసిక లక్షణాలూ వుండాలి. తప్పుచేసేవారిని శిక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి రజోగుణం, పొలం దున్నాలి, పండించాలి, కడుపునిండా తినాలి, కంటి నిండా నిద్ర కావాలి! ఇది తమోగుణం. ఈ పనులన్నీ లోక క్షేమం కోసం చేయాలి కనుక అట్టి రాజసిక తామసిక కృత్యాలను భగవానుడు నిందించలేదు. వారిట్టి పనులు చేసి సంఘాన్ని ఆదుకొని ముందుకు నడిపిస్తున్నారు కనుక ఆ పుణ్యం వలన ఉన్నతస్థితినే పొందుతారు. 
గృహస్థు ఆశ్రమవారిపై మిగిలిన మూడు ఆశ్రమముల వారు కొంత ఆధారపడి వున్నట్లే , శూద్ర వర్ణంవారిపై తక్కిన వర్ణపువారు కొంత ఆధారపడే వున్నారు. అటువంటప్పుడు శూద్రజాతి అనే చిన్నభావన ఎందుకు? అన్ని వర్ణాలువారు సమాజానికీ అవసరమని, సమానమేనని అవగాహనతో, సామరస్యముగా సౌహార్దంగా వుంటే మేలు కదా. 
అప్పటియుగధర్మం, ప్రజల జీవనం - 
త్రేతాయుగంలో ప్రజలందరికీ విధ్యుక్త కర్మలంటూ నియమించబడి వున్నాయి. వాటిని వారు శ్రద్ధగా పాటించేవాళ్ళు. మన ఉపనిషత్తులు 'సత్యం వద ధర్మం చర', 'స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహ' అని ఘోషిస్తున్నాయి గదా. దానినే ప్రజలు మనఃపూర్వకంగా నమ్మి జీవించేవారు. అప్పటి యుగధర్మమది.
ప్రజలందరూ స్వధర్మాచరణలో ధర్మనిరతులై  కల్లా కపటాలు, కార్పణ్యాలు లేనందున పరస్పర సహకారంతో విరోధాలు లేక ఆత్మీయతతో మెలుగుతూ సుఖజీవనం సాగిస్తూ వుండేవారు. అందరును సహోదరభావంతో జీవించేవారు. అన్నివర్ణాలువారు శాస్త్రప్రామాణికంగానే జీవించేవారు. శాస్త్రం పట్ల అప్పటివారికి అవగాహన, ఆదరణ,ఆచరణ వుండేది. 

అసలు శాస్త్రం అంటే ఏమిటి?
ఇది చేయుము, ఇది చేయకుమని శాసించున దగుటచేతనే దీనికి శాస్త్రమని పేరు వచ్చింది. రాజశాసనమందు ఇట్టి పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఉన్నతోద్యోగంను, ప్రజలకు ఇట్టి బాధలు కలుగజేయువారికి కారాగార దండనయు ఎట్లు విధింపబడి యున్నవో, అలాగున ఇట్టి కార్యంచే పుణ్యమూ, ఇట్టి కార్యంచే పాపమూ, ఇట్టి విరక్తి మార్గంచే మోక్షమునూ, ఇట్టి విషయ ప్రవృత్తిచే సంసార బంధమును శాస్త్రం విధించుచున్నది. అందుచే శాస్త్రవిధి ననుసరించి ప్రవర్తించు వారికట్టి ఉత్తమలోకప్రాప్తి కలుగును. 
మానవులందరూ ఒక్కటేయైనను వారి స్వభావంను బట్టి, వృత్తిని బట్టి, వంశాచారమును బట్టి భిన్నంగా నుందురు. వారి వారి ప్రవృత్తికి, వృత్తికి, కులమునకు, వంశమునకు అనుగుణంగా వారు ఆచరింపవలసిన విదానములుండును. ఆదర్శవంతమైన ధర్మాలు అందరికీ అంటే ఎవ్వరూ పాటించరని మన ఋషులు గుర్తించి, భిన్న వ్యక్తులకు భిన్న వర్ణాలు, బిన్నధర్మాలు సూచించారు.
ఒక వర్ణం గొప్పదని, మరొకటి నీచమని శాస్త్రాలలో లేదు. శాస్త్ర నియమాలు కొంత సరసర్దుబాటుతో ఉంటాయి. అందరూ అన్ని ధర్మాలను పాటించాలని చెప్పదు. వారి వారి వృత్తుల కనుగుణమైన ధర్మాలను పాటించాలని అంటుంది. జాతిని బట్టి భేదభావంను చూపించదు. వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి వివిధ ధర్మాలుంటాయి. ఒక వృత్తి గొప్పదని, ఒకటి నీచమని చెప్పదు. కర్మను బట్టి ఆచారాలు మారుతాయి. రకరకాల వృత్తులు రకరకాల వర్ణాలకు వృత్తి ధర్మాన్ని పాటించడం శ్రేష్టమని శాస్త్రాలు తెలిపాయి. ఆ స్వధర్మ ఆచరణయే ఉన్నతి స్థితిని ప్రాప్తింపజేస్తుందనే తెలుపుతుంది. ఎవరి కర్మలో వారు సిద్ధి పొందాలని గీత సందేశం. అనగా స్వధర్మానుష్టానం వుంటే పరిపక్వత పుణ్యం దానంతట అదే సిద్ధిస్తుంది. తన పని యేది, తన పని కానిదేది తెలియుటలోనే ఇహపరముల పరిష్కారమంతయూ యిమిడియున్నది. తనపని ఏదియో తెలిసికొను నిపుణత, ఆచరించు శ్రద్ధ, ఈ రెండునూ కలవారు ఆచరించునదే లోకమునకు సత్కర్మ యగును. తనకు స్వధర్మమగును. కార్యసిద్ధినికాని, ఆధ్యాత్మికసిద్ధినిగాని కోరినవారు శాస్త్రంను అంగీకరించి ఆచరించి తీరవలెను.
యశ్శాస్త్రవిధిముత్స్రాజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥
ఎవరు శాస్త్రోక్తవిధిని విడిచిపెట్టి స్వేచ్చగా ప్రవర్తించుచున్నారో, వారు సిద్ధిని పొందరు. సుఖమును పొందరు. సర్వోత్క్రుష్టమగు ముక్తిని కూడా పొందరు.

నీవు దీనిని చేయుమని చెప్పునట్టి శాస్త్రవిధివాక్యమును, నీవు దీనిని చేయకుము అని చెప్పునట్టి ప్రతిషేధవాక్యమును అనగా వేదోక్తములగు విధిప్రతిషేధవాక్యములను అనాదరణ చేసి, విడిచిపెట్టి, స్వేచ్చాప్రకార మెవరు నడుచుకోనుచున్నారో, వారికి పురుషార్ధ ప్రాప్తియోగ్యమగు తత్త్వజ్ఞానం గాని, ఇహలోక సౌఖ్యం గాని, స్వర్గం గాని, మోక్షం గాని ఏదియును లభింపదు.

ఇక శంబూకుని కధ -
ఉత్తర కాండలోని ఈ కధ అందరికీ తెలుసుకాబట్టి, సంక్షిప్తంగానే ఈ శంబూకుని వధను తెలుపుతాను -

ఒకరోజు ఓ బ్రాహ్మణుడు అకాల మరణం పొందిన తన కుమారుణ్ణి రామ దర్భారుకు తీసుకువచ్చి దుఃఖాతిశయంతో రామున్నినిందిస్తూ ఆశ్రయించగా, ఈ విధంగా జరగడానికి కారణం ఏమిటని వశిష్ఠులు తదితరవారిని శ్రీరాముడు వివరణ కోరగా, వారు స్వధర్మం విడిచి, సశరీరంతో స్వర్గంకు వెళ్ళాలనే తపనతో శంబూకుడు చేస్తున్న తపస్సే కారణమని చెప్పగా, వారి సూచనమేరకు శంబూకున్ని తన ఖడ్గంతో సంహరించగా ఆ బాలుడు పునర్జీవుడు అయినట్లు ఉత్తరాకాండలో కధ .

ఈకధ త్రేతాయుగం నాటిది. శ్రీరాముని కాలం నాటిది.
ఆ కాలంలోఆయా జాతులవారు వారివారి స్వధర్మాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ, తమతమ వ్యక్తిత్వాల్ని సరిదిద్దుకుంటూ జీవనం సాగిస్తే చాలు, సకాలంలో అదే జ్ఞానంగా పరిపక్వం పొంది మోక్షాన్ని ప్రసాదించే త్రేతాయుగమది. 
అప్పటి యుగధర్మం ప్రకారం స్వధర్మాచరణ పట్ల మొగ్గుచూపక, ఆచరించక పరతంత్ర మోహితుడై తన ఇచ్ఛానుసారం వర్తించడం, సశరీరంతో స్వర్గంకు వెళ్ళాలనే అసహజ కోరికతో తపస్సు చేయడం తప్పు. తప్పుచేసినవారిని శిక్షించడం రాజధర్మం. శంబూకున్ని శ్రీరాముడు అందుకే శిక్షించాడు. 
ఆచారః పరమో ధర్మః (సదాచరణమే పరమధర్మము). 
ఆచారహీనం న పునంతి వేదాః (ఆచారహీనున్ని వేదాలు కూడా పవిత్రం చేయవు). 

శూద్రుడనే వధించాడు అని అనేకంటే, శంబూకుడు ఆనాటి యుగధర్మమును విడిచి, విపరీత కోరికతో తపస్సు చేయడం సరికాదని అవగాహన చేసుకుంటే మంచిది.
ఆ కాలంలో శూద్రుడికే కాదు, అందరికీ ఒకే ధర్మం. రాజైనా ధర్మానికే కట్టుబడి నడుచుకునే యుగమది. 
ఓ రజకుడు  పరమసాధ్వి సీతమ్మపై నింద వేశాడని వేగుల ద్వారా విన్న అయోధ్యాధిపతి శ్రీరాముడు ఒక వ్యక్తిగా కాకుండా సమాజ రక్షకుడైన రాజుగా ఆలోచించి, తనకెంత బాధాకరమైనను, సీతను పరిత్యజించాడు. ఆ యుగధర్మప్రకారం కుటుంబంకోసం ఒక వ్యక్తినీ, ఊరుకోసం ఓ కుటుంబాన్నీ, దేశంకోసం ఒక ఊరును త్యజించడం ధర్మం. అప్పటిధర్మానుసారం నడుచుకొని రాముడు చేసిన ఈ పనిని గుర్తించరేం?
ఒకరడిగారు -  రాములవారికి మల్లే నాకూ ఒకే భార్య. మరి రామున్ని ఏకపత్నీవ్రతుడని కీర్తించడం దేనికని? 
ఆప్పటికాలంలో రాజులు బహుభార్యత్వం కలిగి వుండేవారు. అయినప్పటికీ, సర్వకాల సర్వకర్మల సర్వధర్మాలయందు మనోవాక్కుకర్మేణా ఒకే భార్య అన్న భావంతో శ్రీరాములవారు వుండబట్టే ఏకపత్నీవ్రతుడని ప్రజలు కీర్తించారు. ఇలాంటి సూక్ష్మాలను గ్రహించక విమర్శలు గుప్పిస్తూ విభేదించడం సరికాదు.

శంబూకునికై యోచించేవారు వాదించేవారు స్వవిషయంలోనూ రాముడు ఎంత ధర్మ నిబద్ధతగా వ్యవహరించాడో గ్రహిస్తే బాగుంటుంది. కొంచెం పరిశీలన, విజ్ఞత అవగాహన వుంటే ఈ విషయం చక్కగా అర్ధమౌతుంది.

అన్నికులాల్లో గర్భితమైన మూలసత్యాన్ని గ్రహించి, అప్పటి యుగధర్మాన్ని అవగాహన చేసుకొని ఈ కధని చదివితే విమర్శకు తావే వుండదు. అలా కాకుండా తర్కబుద్ధితో ఒక వాదనను నిర్మించుకుని కులవ్యవస్థను విమర్శించడం వలన సామరస్యం కుదరక, శాంతి సౌహార్దాలు ఉండక అశాంతినే పొందుతాం 
                                                    

రామాయణం -

ఓ అద్భుత కావ్యం. అందరి మదిలో మెదిలే పవిత్ర కావ్యం.
వాగ్వాదాలు చేసేవారికి అంతుబట్టదు ఈ గ్రంధం. మనం సత్యాన్ని గ్రహిస్తే సత్యమే గోచరిస్తుంది. ధర్మాన్ని గ్రహిస్తే ధర్మమే దర్శనమౌతుంది.
శ్రీరాముడు ధర్మం విలువేమిటో. ధర్మానికి వున్న శక్తి ఏమిటో తెలియజెప్పిన మహిమాన్వితుడు.
రావణ సంహారసమయంలో మండోదరి తనభర్త మరణానికి ఆయన అనుసరించిన అధర్మమే కారణమని అంటుందేగాని రాముడు సంహరించాడని నిందించదు. ఓ రాక్షస స్త్రీకి అర్ధమైన రాముని ధర్మం, కలియుగ మానవునికి అవగతం కాకపోవడం 'కలి'. 

మిత్రమా!
ఏదైనా మనదృష్టికోణం బట్టే వుంటుంది. దృష్టికోణం మనోభావన బట్టి వుంటుంది. మనోభావన అవగాహన బట్టి వుంటుంది.

శుభమ్ ... 

14, ఏప్రిల్ 2016, గురువారం

రాములోరు ...



శ్రీరామనవమి అనగానే గుర్తుకువచ్చే ఒకప్పటి నా మధుర జ్ఞాపకం - 

శ్రీరామనవమి నాడు ... 
రామాలయం దగ్గర సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేవారు. మధ్యాన్నం కల్యాణం చేసి, సాయంత్రం లక్ష్మణ, అంజనేయుల సమేతంగా సీతరాముల్ని పల్లకిపై ఊరేగించేవారు. 
ఎప్పటికంటే కాస్తా ముందుగానే పలహారాలో, భోజనమో... అమ్మమ్మ పెట్టేసి ... చక్కగా తినేయండమ్మా, రాములోరు మన ఇళ్ళకు వస్తారు, మరి చూడాలి కదా, త్వరగా తినేయాలి మరి ... అనేవారు. త్వరగా తినేసి వీధిలోనికి పరుగులు... రాములోరికే ఎదురుచూపులు ... 
రాములోరు వస్తారు కాసేపటిలో అన్న సూచనగా వీధి తొలి మలుపులో ... ముందుగా డప్పులు ... ఆ వెనుక తప్పెట గుళ్ళు... ఆ వెన్నంటే ఎడ్లబండిపై రామయ్య, సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు వేషం వేసుకొన్న వారు, ఆ వెంబడే సన్నాయి మేళతాళాలతో రాములోరి పల్లకి ... ఎదురెళ్ళి స్వాగతించడం ... మా గుమ్మంలోనికి సీతారాములవారు రాగానే, సాయంత్రం నుండి అందంగా అల్లిన పూలమాలలును మేమూ, కానుకలు ప్రసాదాలు పెద్దవారు సమర్పించడం ... వీధి చివరింటివరకు పల్లకి వెంబడి వెళ్ళడం ... చిన్నా పెద్దా మదినిండా భక్తితో, ధన్యులయ్యామన్న తృప్తితో అర్ధరాత్రి వరకు రాముని గురించి పెద్దవారు చెప్తుంటే వినడం ... ఓహో ... అదో మధురానుభూతి. 
                                              

                                       
ఒక కొడుకు తల్లితండ్రులను ఎలా గౌరవించాలో, 

ఒక శిష్యుడు గురువుగారితో ఎలా మసలుకోవాలో, 
ఒక అన్నయ్య తన తమ్ముళ్ళతో ఎలా నడుచుకోవాలో, 
ఒక భర్త భార్య పట్ల ఎలా ప్రవర్తించాలో, 
ఒక మిత్రుడు మిత్రులను ఎలా ఆదరించాలో, 
ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ... 
అలా ఆచరించి ధర్మాన్ని చాటిచెప్పిన ధర్మమూర్తి నా "రాములోరు". 

మహర్షయిన వాల్మికి అయిన, 
పడవ నడిపిన కిరాతజాతికి చెందిన గుహుడైన, 
శబరకులానికి చెందిన శబరైనా, 
పక్షయిన జటాయువైన, 
వానరడైన సుగ్రీవుడైన, 
రాక్షసుడైన విభీషణుడు అయినా, 
చిరుజంతువయిన ఉడుత అయినా ... 
అందర్నీ ఒకేలా ఆదరించి గౌరవించిన మర్యాదరాముడు నా "రాములోరు".  

ధర్మం, సత్యం, కారుణ్యం, క్షమ, వినయం, విదేయత, ప్రేమ, సాత్వికం, సహనం, సమత్వం, త్యాగం, ధైర్యం, స్థితప్రజ్ఞ  ... ఇత్యాది సౌశీల్యాలు మూర్తిభవించిన సుగుణాభిరాముడు నా "రాములోరు". 

ఆదర్శపురుషుడుగా అగుపించి అందరి ఆరాధ్య దైవమయి, అంతరాల్లో అంతర్యామై ఆత్మారాముడుగా భాసిల్లుతున్నాడు నా "రాములోరు". 
ధర్మావలంబంవలన మానవుడు మాధవుడు ఎలా కాగలడో విషదపర్చేదే రామాయణం. 
మానవుడు మాధవుడు ఎలా కాగలాడో ... నిరూపించిన మార్గదర్శకుడు నా "రాములోరు".  
ఈ విషయమై వివరణ ఇచ్చేముందు ఒకప్పుడు నాలో కదిలాడే కొన్ని సందేహాలను ఇక్కడ  ప్రస్తావించడం సముచితం. 

కామి గానివాడు మోక్షకామి కాడు ... ఇది లోగడ విన్న మాటైనను, కొందరు దీనిని వక్రీకరించి అన్న మాటలు విన్నప్పుడు మన పెద్దలు ఇలా చెప్పారేమిటి అని బాధపడ్డాను.
స శాంతి మాప్నోతి న కామ కామి ... అన్నది గీతాచార్యుని వాక్కు. (సర్వేంద్రియ సంయమియైన సాధనపరుడైన సత్పుర్షునికే మోక్షస్థితి సాధ్యమవును గాని, కామం గలవానికి సాధ్యం కానే కాదు).
త్యజించవల్సిన కామాన్ని మోక్షంతో ఇలా కలిపి చెప్పడం ఏమిటని ఒకింత అయోమయంగా అనుకున్నా.
అలానే సాధకుడు వర్జించాల్సిన అరిషడ్వర్గములో ఒకటైన కామంతో మోక్షానికి ముడిపెట్టడమేమిటీ అని అనుకున్నాను. కాకపొతే పెద్దల మాటల్లో మర్మం అర్ధంకాకున్నా, అందులో పరమార్ధం ఏదో దాగి వుంటుందనే నమ్ముతానుకాబట్టి,  సరే, అర్ధమైనప్పుడే తెలుస్తుందనుకొని వదిలేశాను.

కాలగమనంలో మన వివాహ విశిష్టతలు, పద్ధతులు  తెలుసుకుంటున్నప్పుడు  తెలిసాయి కొన్ని విషయాలు -
ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వమైషా నాతిచరితవ్యాః అని కన్యాదానం చేస్తూ   (ఈరోజు వరకు నా కూతురిగా వున్న ఈమె నేటినుండి నీ అర్ధాంగి అగుచున్నది. ఈరోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటం లోను, ధన సంబంధిత విషయాలలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతుర్ని అతిక్రమించక మీరిరువురు అన్యోన్యంగా వుండాలని) కన్యాదాత అనగా,
ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతిచరామి (ధర్మమునందు గాని, సంపదల విషయంలందు గాని, శారీరక సుఖవిషయంలందు గాని నిను అతిక్రమించి చరించను) అని వరుడు ప్రమాణం చేసే ఓ అద్భుత ఘట్టముందని. అలాగే ధర్మార్థ కామమోక్షాలను నాలుగింటిని  చతుర్విధ పురుషార్ధములని పేర్కొంటారని అర్ధమైంది. ఈ నాలుగింటిని చక్కగా ఆచరిస్తే జీవన సాపల్యమౌతుందని అర్ధం చేసుకున్నాను.
జీవిత పరమార్ధమంతా ఇందులోనే యిమిడివుంది కాబట్టి, ఈ నాలుగింటిని ఓసారి పరిశీలిస్తే ...
ధర్మార్ధ కామమోక్షాలు - ఇవి పురుషార్ధాలు.

మనిషి ధర్మంగా జీవించాలి. ఆ ధర్మంతో అర్ధం సంపాదించాలి. ఆ ధర్మం ద్వారానే సముచితమైన కామనలు (కోరికలు) తీర్చుకోవాలి. ఇక కోరికలలో పడి కొట్టుకుపోకుండా సత్కర్మలు ఆచరించాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఇదే మానవ జీవిత పరమార్ధమని భారతీయ సంస్కృతి ప్రబోధం.

ఈ పురుషార్ధాలను ఇదే క్రమంలో చెప్పడంలో కూడా విజ్ఞత, విశేషత వుంది. అత్యంత ప్రాధాన్యతమైన అముష్మికంలను మొదట చివర పెట్టి, ఐహికమైన రెండింటిని మధ్యలో పెట్టారు. ఈ నాలుగింటిలో అర్ధ, కామములు ఐహికం - ఈ రెండూ స్థూలదేహంతో నశిస్తాయి. ధర్మం, మోక్షం అముష్మికం - ఈ రెండింటిలో మరణాంతరం అనుభవం లోనికి వచ్చేది మొదటిదైతే, మరణమే లేదని అనుభవస్థితికి చేర్చేది రెండవది. 
అంతేకాక, ఈ నాలుగింటిని చెప్పేవిధంలో కూడా ఓ ప్రత్యేకత వుంది. ధర్మార్ధంను ఓ జంటగా, కామమోక్షాలను ఓ జంటగా చెప్పడంలో అంతరార్ధం ఏమిటంటే -
ధర్మంతో అర్ధాన్ని సంపాదించాలని ... ఈ సంపాదన యోగిస్తుంది. అంతేకాని, కామార్ధం అంటే కామంతో అర్ధాన్ని సంపాదిస్తే అది పతనమే అవుతుంది. 

అటుపిమ్మట కొద్ది రోజుల తర్వాత రామాయణం మరోసారి చదివాను. గతంలో కొన్నిసార్లు చదివిన అవగాహనకాని కొన్ని విషయాలు అవగతమయ్యాయి. అప్పుడప్పుడు చదివిన, విన్న రామకధ, ఈ చతుర్విధ పురుషార్ధాలు గురించి తెలుసుకున్నాక చదివినప్పుడు మార్మికత, దార్మికత, దార్శినికత అర్ధమయ్యాయి. ధర్మాచరణతో కూడిన ఆదర్శ జీవనం సాగించిన రాముడు దేముడు ఎందుకయ్యాడో అర్ధమైంది. 
'కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తారం ...' అని బాలకాండ యందు వాల్మికిమహర్షి అంటారు. కామం, అర్ధం గురించి మితంగాను, ధర్మార్ధగుణం గురించి విస్తారంగా తెలుపుతుంది రామాయణం.
ధర్మగుణంకు ప్రతీక అయిన రాముడు దేముడైతే, భక్తిపరాయణుడు అయినను కామార్ధ ప్రలోభుడయిన రావణుడు ధర్మంచే సంహరింపబడ్డాడు.

శ్రీరాముడు అవతార పురుషుడు అన్న మాటను ప్రక్కన పెట్టి, తన జీవన విధానం గమనిస్తే ఓ సామాన్య మానవునిగా ఎన్నెన్నో కష్టనష్టాలు, అపవాదులు, సుఖసంతోషాలను అనుభవించాడు. సత్కర్మాచరణలతో ధర్మం ఆచరిస్తూ, తద్వారా సక్రమార్జనతో (అర్ధంతో) సత్ కామనలతో (కోరికలతో) మనుగడ సాగిస్తూ ... నిత్య సత్య శాశ్వత ఆనంద మోక్షసిద్ధితో జీవన సాపల్యం ఎలా చేసుకోవాలో తెలియజెప్పేదే రామకధ. మానవుడు మాధవుడు ఎలా కాగలడో తెలిపేదే రామాయణం. అందుకే కదా ... ఊరు ఊరున, వాడవాడలో ... ఒక చోటని ఏముందీ? గూడు గూడులో ప్రతీ గుండెలో కొలువై, అందరి ఆరాధ్యదైవమయ్యారు నా "రాములోరు".

దశరధరాముడుగా జనించి, తొలుత అయోద్యరాముడై, పిదప సీతారాముడై, అపై కొదందరాముడై, ఆటుపై పట్టాభిరాముడై, ఆ తర్వాత ఆదర్శరాముడై, అనంతరం అందరిరాముడై, ఆఖరికి ఆత్మారాముడై విరాజిల్లుతున్నారు "నా రాములోరు".

సర్వేషు రమంతే ఇతి రామః ... అందరిలో రమించే దివ్య చైతన్యమే రాముడు.
రామ అంటే రమణీయుడు. రామనామం రమణీయం, రాముని రూపం రమణీయం, రాముని గుణం రమణీయం, రాముని తత్త్వం రమణీయం, రామచరితం రమణీయం, రామ మహిమ రమణీయం... ఇన్ని రమణీయాల సమాహార స్వరూపుడయిన నా రాములోరిని నిత్యం తలచేవారి మనస్సు రమణీయం, కొలిచేవారి హృదయం అత్యంత రమణీయం... ధన్యణీయం.

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే//

                                     
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
                                  పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్//


రామనామ మహిమను తెలిపే పరమపావనం - రామనామం

రామాయణ అంతరార్ధం తెలిపే మోక్షపధం - రామ దర్శనం



7, ఏప్రిల్ 2016, గురువారం

ఉగాది పండుగ - పరమార్ధం



భారతీయ సంస్కృతికి దర్పణం పండుగలు. భారతీయ జీవనగమనం నుండి ఈ పండుగలు విడదీయలేనివి. ఆరోగ్యవంతమైన ఆచారాలతో, ఆధ్యాత్మిక సందేశాలతో, ఓ చక్కటి ఉన్నత జీవనశైలిని అలవడేలా చేస్తాయి మన ఈ పండుగలు.  
మానవాళికి ప్రాపంచిక విజ్ఞానాన్ని, పారమార్ధిక జ్ఞానాన్ని అందించి, శారీరక మానసిక శక్తులను యినుమడింపజేస్తూ, మనలో చైతన్యంను సంఘటితం చేసి, విశ్వశాంతి కోసం, మానవజన్మ సార్ధకత కోసం, ఇహ పర శ్రేయస్సుల కోసం, ఎన్నెన్నో అత్యంత ఉన్నత ఆచారముల పేరిట ఆచరణకు శ్రీకారం చుట్టేవే మన పండుగలు.
ఈ పండుగలు ఆహ్లాదభరితంగా వుంటూ, 
ఇటు ... యాంత్రిక ప్రాపంచిక జీవనం నుండి సేద తీర్చే విధంగా, శారీరకంగా ఆరోగ్యంను ప్రసాదించే ఆచారాలతో...  
అదే సమయంలో అటు ... అంతర్గత జీవితసత్యాలను ప్రబోధిస్తూ, ఆధ్యాత్మిక తత్త్వాన్ని తెలుపుతూ, మనస్సును పారమార్ధికం వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ఈ పండుగలన్నీ మానవజన్మ పరమార్ధాన్ని చాటిచెప్పేవే.

యుగస్య ఆది: ఉగాది అని శాస్త్రం తెలుపుతుంది. యుగం ఆరంభమైన మొదటిరోజు యుగాది లేదా ఉగాది. 
చిత్త చిత్ర అనే పేర్లు కలిగిన నక్షత్రమున పూర్ణిమ వచ్చే మాసం చైత్రమాసం. 
చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించడంచే ఆ రోజునే ఉగాదిగా పెద్దలు పేర్కొన్నారు.
ఉగాది వసంత ఋతువులో వస్తుంది. వసంతాగమనం శుభకరమైన నూతన ఆశయాలకు, సంకల్పాలకు స్పూర్తిదాయకంగా చెప్తారు.
'వసంతి సుఖం యధా తధా అస్మిన్నితి'... వసంతంలో ప్రజలు సుఖంగా వుంటారని భావం.
కోయిలలు కుహు కుహురావాలతో, అత్యంత రమణీయ శోభాయమానమైన ప్రకృతితో రంజింపజేసే కాలమిది. ఈ వసంతంలో ప్రకృతి నూతనత్వాన్ని సంతరించుకుంటూ పచ్చదనంతో చిగురిస్తూ, ఆహ్లాదభరితంగా శోభాయమానంగా వుంటుంది.
అదేరీతిలో అంతరంగికంగా మన మానసిక జగత్తును పారమార్ధిక జ్ఞానంతో చిగురింపజేస్తే ... మన జీవనం ఆనందమయంగా, ఆధ్యాత్మికభరితముగా ఇహ పర తృప్తినిస్తుంది. 
ప్రకృతిలో భాగమైన మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో, మానవత్వంతో కూడి వున్నప్పుడే నిజమైన మనిషి అవుతాడనే శుభాసందేశాన్ని తెలుపుతుంది ఉగాది.
నిశితంగా పరిశీలిస్తే ... పండుగ దినాల్లో పాటించాల్సిన నియమధర్మాలు, ఆచార వ్యవహారాల్లో ప్రాపంచిక పారమార్ధిక ప్రగతే వుంటుంది.


ఈ ఉగాదినాడు ఆచరించవలసిన ముఖ్య విధులు... 

అభ్యంగే నూత్న వ స్త్రే పంచాంగ శ్రవణే ద్విజాత్ / షడృచే నింబపుష్పేచ యుగాదౌ నివసామ్యహమ్ //

అభ్యంగనం :-
పర్వదినాల్లో మహాలక్ష్మి నూనెలోనూ, గంగాదేవి జలములోను ఉంటారని ప్రతీతి. సూర్యోదయంనకు ముందే అభ్యంగస్నానం చేయాలి.
శారీరక ఆరోగ్యం దృష్ట్యా తైలాభ్యంగనం. 
నువ్వులనూనె మర్దనం ఉష్ణాన్ని వెలికితీసి, వాతాన్నీ, చర్మదోషాల్ని హరిస్తుంది. దేహపుష్టినిస్తుంది, దేహంపై వున్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. అలానే ఈరోజున మఱ్ఱి, మామిడి, నేరేడు, మేడి, జువ్వి ఆకుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళతో తలస్నానం చేయడం వలన దేహవర్చస్సుతో పాటు కళ్ళకు మంచిదని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది. 
అలానే,  మానసిక ఆరోగ్యం దృష్ట్యా హృదయాభ్యంగనం చేస్తే -
తైలమర్దనం ద్వారా శరీర జడత్వమును తొలగించుకున్నట్లే ...
 ప్రేమ, దయ, కరుణ శాంతి, సహనం క్షమత్వం, అవగాహన, విశ్వాసం పరోపకారం.....ఇత్యాది సద్గుణంలతో అభ్యంగనం... మానసిక వర్చస్సుని పెంచడమే కాకుండా యిది పారమార్ధిక ప్రగతికి సోపానమని ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలుపుతున్నాయి. 

నూతన వస్త్రధారణ :-
పాతదుస్తులనువిడిచి నూతనవస్త్రధారణచేయడం శుభప్రదం. ఈ ప్రక్రియ ఉత్సాహాన్ని, సంతోషాన్నిస్తుంది. 
పాత దుస్తులను విడిచిపెట్టినట్లు ... చెడును అహాన్ని వర్జించి సద్భావన ధారణ చేయడం మానవజన్మకు సార్ధకతను చేకూర్చుతుంది. 

'సంకల్పాదీ నూతన సంవత్సర నామ కీర్తనం'. 
చైత్రశుద్ధ పాడ్యమినాడు తైలాభ్యంగనము చేసి ఆ తర్వాత నూతన సంవత్సరము పేరు చెప్తూ, సంకల్పం మార్పుచేసి చెప్పాలి. అటుపై కాలస్వరూపుడైన పరమాత్మ అనుగ్రహంను కోరుతూ దైవపూజ చేయడం... ధూప దీప నైవేద్యాలు పూర్తిచేసుకొని నైవేద్యంగా పెట్టిన వేపపూత ఉగాది పచ్చడిని సేవించాలి.

నింబకుసుమ భక్షణం / ఉగాది పచ్చడి సేవనం :-
ఈ రోజున షడ్రుచులతో అలరారే ఉగాది పచ్చడిని సేవించడం ప్రధానమైనది. ఆరు ఋతువుల తత్త్వాన్ని ఆరు రుచుల పదార్ధంగా మలచి, కాలస్వరూపుడైన పరమాత్మునికి నివేదించి, ఆరగించడం ఆచారం.
                                 


ఆరుఋతువులకు ఆరు ధర్మాలున్నాయి. వాటిలో కొన్ని సుఖానికి, కొన్ని దుఃఖానికీ కారణమౌతున్నాయి. ఆయా ఋతువుల్లో అనుభవించబోయే సుఖదుఃఖాలని ఉగాది పచ్చడి రుచులలో నేడే చవిచూసి సుఖాలకు పొంగక, దుఃఖాలకు క్రుంగక ధైర్యంగా వుండడం అలవర్చుకోవాలనే ఈ పచ్చడి సంకేతం. ఆరోగ్య ప్రదాయిని అయిన ఉగాది పచ్చడిని సుఖదుఃఖ సమ్మిళతమైన మానవజీవితానికి సంకేతంగా పరిగణిస్తారు.
శతాయుర్వజ్రదేహృయు: సర్వసంపత్కచ రాయచ / సర్వారిష్ట వినాశాయ, నింబ కుసుమ భక్షణం //
ఈ వేప పూత పచ్చడి సేవనం...  
సర్వమైన అనగా చెడుగ్రహాలు, విపత్తులు, అనారోగ్యదాదులును నివారించి, సర్వ సంపదలను కల్గించే అదృష్టాన్ని వృద్ధిచేసి, దీర్ఘాయువును, వజ్రము వంటి దేహదారుడ్యము ప్రసాదిస్తుంది.
'మధురామ్ల లవణ తిక్తకటు కషాయాః' అని అంటుంటారు. మధురం(బెల్లం), ఆమ్లం(మామిడికాయ, చింతపండు), లవణం(ఉప్పు), తిక్తం(వేపపూవు), కటు(మిర్చి), కషాయం(మిరియం). 
కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చడి తయారి కొంత భిన్నంగా వున్నప్పటికీ, వేపపూవు తప్పనిసరిగా వుంటుంది. అలానే ధర్మసింధు లాంటి శాస్త్రాలలో అశోక పల్లవాన్ని కూడా ఈ క్రింది శ్లోకం చదువుతూ సేవించమని తెలుపుతుంది. అశోక పల్లవం దుఃఖ నివారకం.
త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ/ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు //
ఓ అశోక కలికమా! జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను నిన్ను సేవించుచున్నాను. మధుమాసంలో చిగిర్చిన అశోకమా నీవు నన్ను శోకములు లేకుండా చేయుదువుగాక.
వేప క్రిమిసంహారిణి, ఆరోగ్య వర్ధిని. వేపపువ్వు రక్తశుద్ధిని చేసి, రోగానిరోధకశక్తిని పెంచుతుంది. మామిడి, చింతపండు ఆలోచనాశక్తిని, బుద్ధి సూక్ష్మతను పెంపొందిస్తుంది. మిగిలినవి శరీరపుష్టిని, మంచి ఆరోగ్యాన్ని, ఉష్ణ ఉపశమనాన్ని కల్గిస్తాయి. అంతే కాకుండా తీపి (బెల్లం) గురుగ్రహ అనుగ్రహాన్నిస్తుంది. రాహు కేతు కుజాది గ్రహాల పీడలకు ఔషదం మిరియాలు. కాబట్టి వీటిని సేవించడం ద్వారా గ్రహానుకూలతలు కూడా లభిస్తాయని పెద్దల వాక్కు. 

పంచాంగ శ్రవణం :-
అనంతమైన కాలాన్ని భగవంతుడిగా భావించి, ఆరాదించడం ఉగాది పండుగలో ఓ విశేషాంశం. కాలగణనకు ఓ నిర్దిష్ట రూపం పంచాంగం.
అనంతమైన కాలాన్ని మన వ్యవహార నిమిత్తం నామరూపాత్మకంగా విభాగించారు మన పూర్విజులు.
ఈ కాలాన్ని సూర్యసంచారాన్ని బట్టి - క్షణాలు, నిముషాలు, గంటలు, పగలు, రాత్రి, దినాలు, పక్షాలు, నెలలు,ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలుగా విభజించారు. దీనిని తెలియజేస్తూ  పంచాంగమును రూపొందించారు. ఈ విధంగా కాలగణనను చేసి మొదటి ఋతువు అయిన వసంతంలో మొదటిమాసమైన చైత్రంలో మొదటి పక్షంలో మొదటిరోజైన పాడ్యమిని ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితి.   సృష్టి ఆరంభం, రాబోయే మార్పులు, భవిష్యత్ కాలగమనం, మంచిరోజులు, చెడుకాలం, కష్టాలు నష్టాలు, లాభాలు, నక్షత్ర గమనాలు, సూర్యోదయ అస్తమయ సమయాలు, నవగ్రహ సంచారాలు ... ఇత్యాది విషయాలు తెలియజేసేది పంచాంగం.
కాలగణనం మూడువిధాలుగా శాస్త్రం తెలుపుతుంది. అవి - 1సౌరమానం (సూర్యుని ఉదయాస్తమయాలను ఆధారంగా చేసుకొని నిర్ణయించేది)
2. చాంద్రమానం(చంద్రుని ఉదయాస్తమయాలు, వృద్ధి క్షయాల ఆధారంగా చేసే కాలనిర్ణయం)
3. బార్హస్పత్య మానం (గురుగ్రహంఅంటే బృహస్పతి గ్రహం యొక్క చలనమాధారంగా చేసే కాలగణన) మనం పాటించేది చాంద్రమానం.

పంచాంగం - ఐదు అంగములు. అవి ... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం. 
కాలస్వరూపుడైన 'దైవం' నివసించి ఉండేది 'తిధి'లో. నవగ్రహాలు ఆ దైవాన్ని సేవిస్తూ ప్రదక్షిణం చేసేదినం వారం. క్షతం కాకుండా కాపాడేది నక్షత్రం. చంద్రుడు నక్షత్రంతో కలిసివుండే కాలం యోగం. కరణ మంటే సాధనలో కార్యసాఫల్యత. అందువలన కాలస్వరూపుడైన పరమాత్ముణ్ణి పంచాంగ రూపంలో  పూజించడం, పెద్దల చెంత శ్రవణం చేయడం ఓ సంప్రదాయం.
తిధేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య వర్ధనమ్
నక్షత్రార్ధరతే పాపం, యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు, పంచాంగ ఫల ముత్తమమ్
కాల విత్కర్మా కృద్దీయాన్ దేవతానుగ్రహం లభతే
పంచాంగ శ్రవణంచే తిధివల్ల సంపదయును, వారము వలన ఆయుష్షును, నక్షత్రం వలన పాపపరిహారమును, యోగము వలన వ్యాధినివృత్తియును, కరణము వలన కార్యానుకూలతయును కలుగును. కావున కాలము దెలిపి కర్మము చేయువారు భగవదనుగ్రమును పొందుదురు. ఈ ఐదును కాలదేవత అంగాలుగా చెప్తారు.
పంచాంగ శ్రవణం ఉగాది నాటి విశేష ఆచారం. ఈ రోజున పంచాంగ శ్రవణం గంగాస్నానంతో సమానమైన ఫలాన్నిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
తిధిర్యారం చ నక్షత్రం యోగః కరణఏవచ / పంచాంగస్య ఫలం శ్వణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్://
పెద్దల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం, వారి ఆశిస్సులు పొందడం, కష్టసుఖాలను, ఏది మంచో చెడో తెలుసుకుంటూ... వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం... ఇదో శుభపరిణామంనకు నాంది. 
ప్రపాదానం :-
సేవాభావం, సాటి ప్రాణుల యందు దయ లాంటి సద్గుణాలు అలవడాలని బాటసారులకై, సర్వప్రాణులకై ... ఉష్ణశాంతిని, దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మన శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి. దీనినే ప్రపాదానమని అంటారు.
సమాజసేవకై చలివేంద్రాల ఏర్పాటు ... 
ఇక్కడ ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యనే నా ప్రియనెచ్చలి 'విశాల' వాట్సఅప్ లో ఓ సందేశం పంపింది - 
                                        
ఓ చిన్ని గిన్నిలో నీరు పోసి పక్షుల దాహార్తిని తీర్చడమ్... ఇదికూడా ప్రపాదానమే
ఈ ప్రపాదానము వలన పితృదేవతలు సంతృప్తులై సుఖశాంతులను ప్రసాదిస్తారని, మనోరధములన్నీ సిద్ధిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఈ ప్రక్రియ సేవాభావాన్ని, మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. 

 గురు రాజ మిత్ర బంధు సందర్శనం :- 
గురువులను, పెద్దలను, బంధుమిత్రులను కలుసుకొని అత్మీయాతానుబంధాలను పెంచుకోవడం ... నేను, నా కుటుంబం అని అనుకోకుండా వ్యక్తులమధ్య సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకోవడం ... మంచి భావనతో, మంచి సంకల్పంతో, మంచి ఆకాంక్షతో శుభాకాంక్షలు తెలుపుకోవడమనే అద్భుత ప్రక్రియలను పెద్దలు పెట్టడానికి కారణం... ఈ విధమైన విధివిధానములు బాహ్యంగా దేహాన్ని, అంతరంగికంగా హృదయాన్నిశుద్ధి చేస్తాయి. 'నా' సంకుచితభావం నుండి 'మన' అని అనుకునే సద్భావన సహృదయత అలవడుతుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే - "మనలో వున్న స్వభావదోషాలను వదులుకొని సరిక్రొత్తగా సరైనరీతిలో మనల్ని తీర్చుదిద్దుకోవడమే ఉగాది అంతరార్ధం". 
                                     

ఈ ఉగాది అందరిలో...  
సత్సంకల్పానికి నాంది పలుకుతూ,  వినూత్న జీవనానికి క్రాంతులను వెదజల్లుతూ ఆయురారోగ్య ఆనందాలను నింపుతుందని కాంక్షిస్తూ ... 

అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. 

29, ఫిబ్రవరి 2016, సోమవారం

'అమ్మమ్మ ఆకాంక్ష'.

సరస్వతీ సమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా... 

మాఘ పౌర్ణమి -
మాఘ పౌర్ణమిన నా మనుమరాలు చిట్టితల్లి శ్రీమాన్వికి బాసరలో "జ్ఞాన సరస్వతి అమ్మ" అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో అక్షరాభ్యాసం జరగడం ఆనందదాయకం.
మన జీవితంలోని వివిధ దశల్లో జరిపే షోడశ సంస్కారాలలో ముఖ్యమైన సంస్కారం "అక్షరాభ్యాసం".



యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

అక్షరాభ్యాసం :-
అక్షర - అభ్యాసం ... అక్షరాలను సాధన చేయడం.
అక్షరం ... క్షరం కానిది... అంటే నాశనం కానిది. నాశనం కానటువంటి విద్యను అభ్యచించడానికి నాంది అక్షరాభ్యాసం.
ఈ అక్షరాభ్యాసం ... వ్యక్తిత్వం, సామర్ధ్యం, జీవన నైపుణ్యతలతో కూడిన విద్యకు నాంది.

విద్య ...

మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ ।
కీర్తిం చ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం
కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా ॥
విద్య తల్లివలే రక్షించును, తండ్రివలే ధర్మమునుపదేశించును, భార్యవలే ఆపత్కాలమున శ్రమను శమింపచేయును, దశదిశలలో కీర్తిని కలుగజేయును, ఐశ్వర్యము సమకూర్చును, ఇన్ని మాటలెందుకు? కల్పవృక్షం వలే సమస్త కోరికలను ఇచ్చునది విద్య యొక్కటే.

విద్యా నామ నరస్య రూప మధికం ప్రచ్చన్నగుప్తం ధనం
విద్యా భోగకరీ యశఃసుఖకరీ విద్యా గురూణాం గురు: ।
విద్యా బందుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యావిహీనః పశు: ॥

మానవునికి విద్య అతి మనోహరమగు సౌందర్యం. విద్య దొంగలచే అపహరింపబడని ధనం, విద్య అన్ని భోగములను, యశస్సుఖములను నొసంగునది. విద్యయే సద్గురువు. విదేశ గమనమందు బంధువువలే సహకరిస్తుంది. విద్య పరాదేవత. రాజుపూజితం. విద్యను మించిన ధనం లోకమున వేరు లేదు, విద్యాధనమే ధనము. విద్య లేనివాడు పశువుతో సమానమని భర్తృహరి విద్య గురించి శ్లాఘిస్తాడు.

న చోరహార్యం న నృపేణ దండ్యం న బంధుభాజ్యం నకరోతి భారమ్ ।
వ్యయే కృతే వర్దత ఏవ నిత్యం విద్యాధనం సర్వధనప్రదానమ్ ॥
ఈ విద్యాధనం చోరులచే అపహరింపబడునది కాదు, రాజులకు పన్ను కట్టవలసిన ధనం కాదు, బంధువులకు భాగమివ్వవలసినది కాదు, మోయుటకు భారం లేనిది, వ్యయం చేస్తున్నకొలది వృద్ధియగునది. అంతేగాక ఈ విద్యాధనం  సర్వధనముల {యశస్సు, కీర్తి, భోగభాగ్యాలు, జ్ఞాన వైరాగ్యాలు ...} ప్రదాయిని.


విద్యావంతుల వలన  ఎంతోమందికి ఉపయోగముంటుంది, వారి బతుకు ఎంతో మందికి బతుకునిస్తుంది.
జన్మించాక .... బ్రతకడం కాదు చక్కగా జీవించగలగాలి. అందుకు చక్కటి విద్య అవసరం. విద్యను చక్కగా అభ్యసించినవారు తాము చక్కగా జీవించడమే కాదు, ఎందరినో ఉన్నతంగా జీవించేలా మార్గదర్శకులు కాగలరు.

విద్య ...
ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తే -
దేనియందు అవిద్య లేదో ... అదే విద్య.
ఏది క్షరం గాక సత్తు అయి యుండునో దానియందు గల అభ్యాసమే అక్షరాభ్యాసమని ఆధ్యాత్మిక కోవిదుల వాక్కు.

శాస్త్రరీత్యా విద్య రెండు రకములు - 
ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్ /
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి //
మానవుడు రెండు విద్యలు నేర్చుకొనవలయును. 1. శబ్దబ్రహ్మము 2. పరబ్రహ్మము. 
శబ్దబ్రహ్మమనగా శాస్త్రము. పరబ్రహ్మమనగా ఆత్మజ్ఞానం. అయితే శబ్దబ్రహ్మమందు నిష్ఠ కలిగినవారు మాత్రమే పరబ్రహ్మమును పొందగల్గును అని శృతి బోధించుచున్నది. (అమృత బిందూపనిషత్తు).

ప్రాకృతవిద్య అలవడిన అప్రాకృతమైన  బ్రహ్మవిద్యను అభివృద్ధి చేసుకొనవచ్చును. మండుచుండు అగ్నికి వాయువెంత సహాయమో, అటులనే ఆధ్యాత్మిక జ్ఞానవిద్యకు ఈ ప్రాకృతమైన విద్య అత్యవసరం.
జన్మ సార్ధకతకు విద్యను అభ్యసించాలి. ఆ విద్యారంభంకు అక్షరాభ్యాసమనే సంస్కారం తప్పనిసరి.

విద్య గురించి కొందరు మహానుభావుల భావాలు ...
అత్యున్నత మేధాశక్తి పట్ల, సత్యం పట్ల ప్రగాఢమైన ప్రేమను రగిలించడానికి స్పూర్తినివ్వడమే విద్య లక్ష్యం.                                                                                                    - జాన్ స్టూవర్ట్ మిల్
విద్య అంటే మెదడులోకి బలవంతంగా ఎక్కించే సమాచారం కాదు. శీల నిర్మాణానికి తోడ్పడాలి. సమాచారాన్నే విద్యగా పరిగణిస్తే గ్రంధాలయాలే ప్రపంచంలో గొప్ప రుషులయివుండేవి. 
                                                                                                   - స్వామి వివేకానంద
విద్య అంటే ఓ వ్యక్తిని జీవితం కోసం తయారు చేయడం కాదు, వాస్తవానికి విద్యే జీవితం. 
                                                                                                                   - జాన్ డ్యూయీ
విద్య అంటే నిప్పును రగిలించడమేగానీ ఏదో ఒక మట్టికుండను నీటితో నింపడం కాదు. అదో ఆలోచనాజ్వాల.                                                                                                  - సోక్రటీస్
విద్య నేర్చుకోవడం సృజనాత్మకతకు దారి తీస్తుంది. సృజనాత్మకత స్వతంత్రంగా ఆలోచింపజేస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానమే మనల్ని ఉన్నతుల్ని చేస్తుంది. 
                                                                                        - అబ్దుల్ కలామ్

                                              
                                                                          శ్రీమాన్వి

చిట్టితల్లి శ్రీమాన్వి!
ఉన్నత విద్యలను చక్కగా అభ్యసించి ఇహసుఖమును, పరసుఖమును, పరాత్పరసుఖమును జ్ఞాన సరస్వతి అమ్మ అనుగ్రహంతో, అందరి ఆశీస్సులతో పొందాలన్నదే 'అమ్మమ్మ ఆకాంక్ష'. 


22, డిసెంబర్ 2015, మంగళవారం

"సత్య"సాధన

                                                   "సత్యమేవ జయతే"
                        సత్యమేవ జయతే అనేది భారత ప్రభుత్వం స్వీకరించిన ధ్యేయవాక్యం. 


సత్యంకు ఇంతటి ఘనత ఎందుకు? అసలు సత్యమంటే ఏమిటీ?

పరబ్రహ్మ స్వరూపమే సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్ లో చెప్పబడింది.
అటులనే ముండకోపనిషత్ సత్యమేవ జయతి (సత్యమే జయిస్తుంది)అని వక్కానిస్తుంది. 
బ్రహ్మసత్యం జగత్ మిధ్య (బ్రహ్మమే సత్యమని, జగత్తే మిధ్య)అని శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు.

సత్యమే అత్యున్నత సద్గుణం.
సత్యమే సకల సుగుణాలకు మకుటం.
సత్యమే సాధకునికి ఆలంబనం.
సత్యమే సత్య వాదులకు లక్ష్యం. 
సత్యమే పరమపదం.
సత్యమే పరమాత్మ.
సత్యమే సత్ సాధకులకు అత్యుత్తమ అనుష్టానం. 

సత్య పధంలో సాధన, సాధ్యం రెండూ కూడా 'సత్యమే'.

"మంచి నడవడిక అనేది ఒక మహాసాగరం. ఆ సాగరం నుండి తరింపజేసేందుకు ఓడలాగా ఉపయోగపడేది సత్యవాక్యం" అని తెలియజెప్తుంది విదురనీతి.  

"సత్యానికి సరి సమానమైన తపస్సు లేదు.అసత్యాన్ని మించిన పాపము లేదు.ఓ దేవా! ఎవరు సత్యాన్ని అనుష్థిస్తారో వారి హృదయంలో నీవు నెలకొని వుంటావు" అని సత్యం యొక్క ఔనత్యాన్ని కీర్తిస్తాడు కబీర్ దాసు.

"యవ్వనం, సౌందర్యం అదృశ్యమౌతాయి; జీవితం, సంపద మాయమౌతాయి; పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి; పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి; సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి; సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది" అని నినదించారు వివేకానందులవారు. 

మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అన్న సుభాషితం ప్రకారం మనస్సులోని భావన, మాట, చేత ఈమూడు ఒకేరీతిలో వుండడం సత్యవ్రతుని లక్షణం. ఇలా మనస్సు, వాక్కు, కర్మల సమన్వయంలో చేసిన సాధనే సత్యవంతమైన జీవితానికి 'అత్యావశ్యకం '.

సత్యానుసారిణీ లక్ష్మీ: కీర్తి స్త్యగానుసారిణీ
అభ్యాస కారిణీ విద్యా బుద్ధి: కర్మానుసారిణీ
సత్యం మానవుణ్ణి తరింపజేస్తుంది. గౌరవం, సంపద మొదలైనవి సత్యాన్ని అనుసరించి వస్తాయి.

శ్రీ వసిష్టవారు దిలీప మహారాజుతో దేనివలన జనన మరణ భవసాగరము తరింపబడునో, దానికే తీర్ధమని అంటారని, మానసాది తీర్ధంలను గురించి వివరిస్తూ మొదటగా చెప్పింది ... సత్యము గురించే! సత్యమే ఓ తీర్ధమని... ఇలా తెలిపారు -

సత్యాదీనాంచ తీర్దానాం లక్షణం శృణు పార్ధివ/
యస్య శ్రవణ మాత్రేణ సర్వస్నాన ఫలం లభేత్//
అనుద్వేగ కరం హృద్యం సజ్జనానంద కారణమ్/
ఏవం లక్షణ సంయుక్తం సత్యం ప్రాహుర్మ నీషిణః //
సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్/
ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మస్సనాతనః //
ఓ రాజా! సత్యాది తీర్ధముల కధనమును వినిన మాత్రమునే సమస్త తీర్ధముల యందును స్నానం చేసిన ఫలం లభించును. మనస్సుకు ప్రియమైనది, ఇంపైనది, సత్పురుషులకు ఆనందం కలుగజేయునదియు ఏదియో,  అది సత్యమని మహాత్ములు  చెప్పుదురు. ఓ రాజా! ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను. ఆ సత్యమునే ప్రియంగా హితంకల్గేలా చెప్పవలెను. ఇదే అనాది ధర్మమని  పెద్దలు చెప్పుదురు... అని వసిష్టులవారు చెప్పగా -

అనుద్వేగ కరంవాక్యం సత్యం ప్రియం హితం చ యత్ అన్నది గీతాచార్యుని బోధన.

సత్యం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మ స్సనాతనః
సత్యం చెప్పినా అది ఎదుటివారికి ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించకుండా ప్రియంగా చెప్పగలగాలి. అలా చెప్పలేని సత్యమైతే, అట్టి సత్యాన్ని చెప్పకుండా నిగ్రహించుకోవాలని మనుస్మృతి తెలుపుతుంది.
అంటే ... సత్యం చెప్పడం వలన ప్రాణి హింస,  ప్రాణాంతకమైన స్థితి వస్తే, హింసకు తావీయకుండా సత్యంను  వెల్లడి చేయకుండా నిగ్రహించుకోమనే శాస్త్రం చెప్తుంది.
ఇక్కడ ఎప్పుడో చదువుకున్న ఓ కధ గుర్తుకొస్తుంది -
పూర్వం సత్యవ్రతుడనే మహాపురుషుడు ఉన్నచోటుకు ఓ జింక పరుగెత్తుకొని వచ్చి దాక్కుంది. దానిని తరుముకొని వచ్చిన వేటగాడు 'స్వామీ! ఈ వైపు జింక పరుగెత్తుకొచ్చిందా' అని అడుగగా -
నిజం చెబితే జీవహింసలో తనకూ భాగం ఏర్పడుతుంది, లేకుంటే అసత్యదోషం వస్తుంది, అందుకని చాలా జాగ్రత్తగా మృదువుగా 'చూసిన కంటికి చెప్పేశక్తి లేదు, చెప్పగల నోటికి చూసేశక్తి లేదు' అని బదులిచ్చి ఊరుకోగా... ఆ బోయకు ఈ మాటలు అర్ధంకాక తనదారిన తాను వెళ్ళిపోయాడు. 

ఇక; సత్యం చీర కట్టుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చింది, సత్యం చెప్పులేసుకొని బయల్దేరేలోపు అసత్యం వాడవాడలా తిరిగివచ్చింది ... అని లోకోక్తి. 
సత్యవాది లోక విరోధి, సత్యాన్ని చెప్పినా వినేవారు ఎవరు... విలువ ఇచ్చేవారు ఎవరు ... ఒకోసారి కోరి కష్టాలను తెచ్చుకోవడమే అనేవారు వున్నారు.  
నిజమే ... సత్యనిర్వహణ చాలా కష్టమైన విషయం. కానీ, సత్యసంధతదే అంతిమ విజయం ... శాశ్వత విజయం! సత్యాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.

చిన్నప్పుడు చదువుకున్న సత్యసంధత పాఠమొకటి గుర్తుకొస్తుంది -
పులివాత పడిన ఒక గోవు తన లేగదూడకు పాల్లిచ్చి తిరిగి వస్తానని ప్రమాణం చేసి వచ్చి, దూడకు పాలిచ్చి పులి ఆహారంనకై మరల తిరిగివెళ్ళిన గోవు తన సత్యసంధతతో ఆపదనుండి బయటపడినది.    

ఇక సత్యం విలువను తెలిపే మరో ఘటన -
నుతజల పూరితంబులగు నూతులు నూరింటి కంటె సూ
న్నతవ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్త్కతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్
                                                                 -నన్నయ్య (మహాభారతం)
తియ్యటి నీటితో నిండిన నూరు నూతుల కంటే ఒక దిగుడుబావి మేలు. ఆ దిగుడుబావులు నూరింటికంటే ఒక యజ్ఞం గొప్పది. అటువంటి నూరు యజ్ఞాలు కంటే, ఒక కొడుకు గొప్ప. అటువంటి నూరుగురు కుమారులు కంటే ఒక సత్యవాక్యం మిన్న ... అని శకుంతల దుష్యంతునికి చెప్పిన ఈ మాటలు సత్యవాక్య విలువను తెలుపుతుంది.  

సీతమ్మను అపహరించడానికి రావణుడు, మారీచుని సహాయం కోరినప్పుడు ... మారీచుడు, 
రావణా! ధర్మమూర్తి అయినా రామునితో వైరం పెట్టుకోవద్దు, నీతో పాటు నీ వంశమంతా నాశనమౌతుంది అని చెప్తూ ... 
సులభాః పురుషాఃరాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః // అని అంటాడు. 
రాజా! నీకు ప్రియవచనాలతో, స్తోత్రవ్యాక్యాలతో సంతోషం కల్గించేవాళ్ళు చాలామంది వున్నారు. కానీ, నీకు వినడానికి అప్రియంగా వున్నా, హితకరమైన సత్యమైన మాట చెప్పేవాళ్ళు దొరకరు. చెప్పినా వినేవాళ్ళు దొరకరు...

సత్యమును మారీచుడు చెప్పిన గ్రహించక ధర్మాన్ని తప్పిన రావణుడు సత్యవాక్కు పరిపాలకునిచే సంహరింపబడ్డాడు.
అసత్యం చెప్పదగిన సందర్భాలు శుక్రాచార్యుడు ఉదహరించిన వినక మానధనులు మాటతిరగరాదని, సత్యహీనున్ని కాలేనని, సత్యవాక్కుకు కట్టుబడిన బలిచక్రవర్తి ....
అటులనే -
విశ్వామిత్రుడు కల్పించిన అనేక కష్టాలను ఎదుర్కొన్న సత్యదీక్షను విడవకపోవడంతో సత్యవాక్పాలకుడు అయిన హరిచంద్ర చక్రవర్తి ...
ఎంతటి ఘనకీర్తిని పొందారో జగద్వితితమే.

సత్యపధగాములందరూ తమ మాటలలో, నడవడికలో బహు జాగ్రత్త వహిస్తారు. ఈ రకమైన నియమపాలన సహజంగానే మనిషిని నిరంతరం జాగరూకతలో ఉండేలా చేస్తుంది.ఇది తీవ్రమైన తపస్సుగా, అనుష్ఠానంగా రూపుదిద్దుకుంటుంది.ఈ విధంగా సాధకుని 'సత్య సాధన ' అతని మనోప్రపంచంలో నూతన పరిధిలను ఆవిష్కరించుకునేలా చేస్తుంది.

అలానే, ఒక వ్యక్తి సత్యానుష్ఠానం వల్ల సత్యసంధుడు అయినప్పుడు అద్భుతమైన సంకల్పశక్తిని సంతరించుకుంటాడు.

ఇక మన జ్ఞానేంద్రియముల పరిధిలోనికి వచ్చే విషయాలను యధాతధంగా చెప్పడం వ్యవహారిక సత్యం కాగా, కొన్ని కొన్ని సందర్భాల్లో అసత్యమైనవి సత్యంగా భ్రమింపజేస్తాయి. దీనిని ప్రాతిభాషిక సత్యమంటారు. శాస్త్రం ఇటువంటి భ్రాంతిని 'రజ్జు సర్ప భ్రాంతి'గా పేర్కొంటుంది.  ప్రాపంచిక వ్యవహారాల్లో ఇటువంటి భ్రాంతులకు లోను కాకూడదనే పెద్దలు కళ్ళతో బాగుగా పరిశీలించి,
సత్యమును గ్రహించి మనస్సులో వడబోసిన మాటనే పలకాలి... అని చెప్తారు. ఇక బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య అనే పారమార్ధిక సత్యమే అసలైన సత్యం. ఈ పారమార్ధిక సత్యంకై చేసే సాధనే "సత్య"సాధన. 

అటువంటి సాధనకై -  
సత్యవంతమైన జీవితాన్ని గడిపిన హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, యుధిష్ఠరుడు మొదలైన వారి జీవితం, సందేశాలను పఠించి,తద్విషయముపై ధ్యానించాలి.........

ఎంతసేపు పురాణ పురుషులనే ఉదాహరణలుగా చూపడమే గానీ, అటుపై అన్యులెవరూ లేరా ... ఇది నేను ఈ పోస్ట్ టైపు చేస్తుండగా వెనక నిల్చొని చదివిన ప్రక్కింటి అమ్మాయి ప్రశ్న ... 
లేకేం ... సత్యము, అహింస అను  రెండు సద్గుణములును పాటిస్తూ, భారతీయ పతాకమును ఎగురవేసి, మన ఖ్యాతిని పెంచిన జాతిపిత మహాత్ముడు బాపూజీ ఉన్నారు. అలానే దేశ విదేశాలలో మన భారతీయ ఔనత్యాన్ని, తానూ నమ్మిన సత్యాన్ని చాటిచెప్పి మన స్థాయిని చిరస్థాయిగా నిలిపిన వివేకానందుడు ఉన్నారు....