ఉన్నదీ, ఉన్నది.
ఉన్నది "నేను" అయి ఉన్నది.
ఉన్నది ఇప్పుడూ ఉంది.
ఉన్నది మరణం తర్వాత ఉంటుంది.
ఉన్నదిలో ఉన్నది ఉండడంకోసమే సాధన.
-
రమణ మహర్షి.
వివరణ: ఉన్నదీ (చైతన్యం) ఉన్నది. ఉన్నది నేను (ఆత్మ) అయి
ఉన్నది. ఆత్మ ఇప్పుడూ ఉంది. మరణం తర్వాత ఉంటుంది. కానీ జననమరణచక్రములో
పరిభ్రమించకుండా ఉన్నదిలో (చైతన్యంలో) ఉన్నది (ఆత్మ) ఉండడంకోసమే (లయం అవడానికే)
సాధన.
మన యధార్ధస్థితిని స్వరూపమును తెలుసుకోవడమే యోగం. జ్ఞానం
తెలుసుకునే మార్గమే యోగం. "యోగః చిత్తవృత్తి నిరోధః" (పతంజలి) చిత్తవృత్తి నిరోధమే
యోగం.
యోగమును నియమిత విధానంద్వారా ఆభ్యసించడాన్ని యోగానుష్టానం
అంటారు. యోగానుష్టానంవలన చిత్తమును ఆవరించివున్న మాలిన్యం అంటే అజ్ఞానము తొలగి
వివేకం కల్గును.
ఆధ్యాత్మిక సాధకులకు తమ లక్ష్యసిద్ధికై సరియైన ఆలోచన,
ప్రయత్నం, వాక్కు, ఏకాగ్రత అవసరం. ఇవి అలవడడానికి మన మహర్షులు "అష్టాంగయోగము"ను
ప్రభోదించిరి. మన శాస్త్రాలు దీనినే సూచిస్తున్నాయి.
అష్టాంగయోగమార్గమువలన సాధకుని శరీరం, మనస్సు మోక్షసాధనకు
అనుకూలముగా తయారగును.
అష్టాంగయోగము :-
యమ, నియమాసన, ప్రాణాయామ,
ప్రత్యాహారం, ధారణ, ధ్యాన సమాధ యోష్టావంగా:
యోగం అష్టాంగములతో (ఎనిమిది దశలతో) కూడుకొనియున్నది. అవి
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము,
సమాధిదశలు.
యమము
మనిషి ఎలా నడుచుకోవాలో సూచించేది యమము.
అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః
ఇందు ఇదు అంశములు ఉన్నాయి. అవి అహింసా, సత్యము, అస్తేయము,
బ్రహ్మచర్యము, అపరిగ్రహము.
వీటి బాహ్యార్ధములతో పాటు మహర్షులు తెలిపే అంతరార్ధములను
గ్రహించగలగాలి. బాహ్యార్ధమును అనుష్టించినప్పుడు అంతరార్ధము దానికదే గోచరించునని
స్పష్టమగును.
౧.అహింస
బాహ్యార్ధం :- మనోవాక్
కర్మేణ ఎవ్వరినీ బాధపెట్టకపోవడమే అహింస. ఏ జీవులకు హాని తలపెట్టకపోవడమే అహింస. హింస
దానవస్వభావం, అహింస మానవస్వభావం. శాంతముగా, వివేకముగా వుండటం అహింస.దేహరూపములో
భిన్నత్వం కన్పిస్తుందేగానీ అందరిలో వున్నది ఒకే ఆత్మస్వరూపం. అది పరమాత్మ
స్వరూపమన్న భావన సాధకుల్లో బలపడిన ఎవ్వరియందు కోపద్వేషాలు కలగవు. ఇక ఏ విధమైన హనీ
చేయలేరు, బాధించలేరు. సర్వజీవుల యెడల దయతో ప్రేమతో వుండగలుగుతారు. అహింసా
పరమోధర్మః
అంతరార్ధం :- ఆత్మ
సర్వవ్యాపకమనియు, చేదింపదగినది కాదనియు దృఢనిర్ణయంగల జ్ఞానమే అహింస అని తలచి, అట్టి
ఆత్మను సంసారబందము నుండి ఉద్ధరించుకొనుటయే అహింస.
౨.సత్యము
బాహ్యార్ధం :- వాక్కు,
మనస్సు ఒకేరకంగా నిజమైన విషయాలను ప్రతిబింబించుటయే సత్యం. ఈ సృష్టిలో సత్యమొక్కటే
స్థిరమైనది. నిజమైనది. యుగాలు మారిన మారనిది సత్యం. సత్యం ఎప్పుడూ సత్యంగా,
నిత్యంగా భాసిస్తుంది గానీ ఏకాలంలోనూ, ఏయుగంలోనూ నశించదు. యోగి కాదలచినవారు తమ
మనస్సులో, వాక్కులో సత్యమును ప్రతిష్టించుకున్నప్పుడు ఎలాంటి కర్మలు చేయనవసరం
లేకుండానే సత్యం యొక్క ఫలితమును పొందగలరు. భావన, మాటలు సత్యమై వుండాలి. సాధకుల
మాటలు సత్యంగా, ప్రియంగా, హితంగా, మితముగా వుండాలి. సత్యమంటే నిజం. ఈక్షణమే నిజం.
ఏక్షణంకాక్షణం పరిపూర్ణంగా వుండడమే సత్యం.
అంతరార్ధం :- ఏది సత్యమై,
నిత్యమై, శాశ్వతమై యుండునో అట్టి సత్యస్వరూప బ్రహ్మము నెరుంగుటయు, అట్టి బ్రహ్మమును
యదార్ధంగా బోధించుటయు కూడ సత్యమనబడును.
౩.అస్తేయము
బాహ్యర్ధం :- ఇతరులకు
చెందినా ఏ వస్తువులను, ధనమును దొంగలించుకుండుటయే అస్తేయం. తనది కానిదానిని, ఇతరుల
సొంతమైనదానిని వారికి తెలియకుండ తీసుకోకపోవడమే అస్తేయం. ఇతరులది ఆశించకపోవడమే
అస్తేయం. సంపాదనయందు, వృత్తియందు, చేసే కర్మలయందు ఏ ఒక్కరిని మోసగించక యుండుటయే
అస్తేయం.
అంతరార్ధం :- ఆత్మయందు,
ఆత్మధ్యానమందువుండుచు నిరతములైన లోకవ్యవహారములను ఆత్మయందు రానియ్యక చూచుటయే
అస్తేయమనబడును.
౪.బ్రహ్మచర్యము
బాహ్యార్ధం
:- ఇంద్రియనిగ్రహముతో కూడిన ఉపస్తేంద్రియనియమం బ్రహ్మచర్యం. వాక్కు,
క్రియ, భావనలతో నిగ్రహం కలిగియుండుటయే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమును పాటించినవారు
జితేంద్రియులై యోగమునందు అత్యంతప్రజ్ఞకలవారగుదురు. ఆశ్రమధర్మములలో బ్రహ్మచర్యం
మొదటిది. గృహస్థులు గృహస్థ బ్రహ్మచర్యమును (మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో
సంసారం లేకుండుటయే గృహస్థుబ్రహ్మచర్యం) పాటించవలెను.
అంతరార్ధం
:- బ్రహ్మభావమందు మనస్సును సర్వదా చరింపచేయుట అనగా బ్రహ్మచింతన యందు సర్వదా
యుండుటయే బ్రహ్మచర్యమనబడును. "బ్రహ్మణివేదే చరితుం శీలం యస్య సః బ్రహ్మచారీ"
వేదాధ్యయనములో నిరంతరం నిమగ్నుడగుటయే బ్రహ్మచర్యం.
౫.అపరిగ్రహము
బాహ్యార్ధం :- ఇతరుల
వద్దనుండి ధనమునుగానీ, వస్తువులనుగానీ స్వీకరించకుండుట, ఇతరులనుంచి బహుమతులు
స్వీకరించకుండుట, దానం పట్టకుండుట అపరిగ్రహమనబడుతుంది. స్వీకరించినను, దానం
గ్రహించినను స్వీకరించే వ్యక్తిలో తపఃశక్తి దాతకి సంక్రమిస్తుంది. అలానే దాత సంపాదన
సరైనరీతిలోనిది కానట్లయితే ఆ దాత దోషం స్వీకరించే సాధకునికి సంక్రమిస్తుంది. దానం
స్వీకరిస్తే పరతంత్రుడై మనస్సుని నిర్మలంగా, నిశ్చలంగా వుంచుకోలేరు కాబట్టి
ఎవ్వరినుండి దానం స్వీకరించకూడదు. పరిగ్రహం వలన అనురాగం, మమకారం కలిగి తద్వారా బందం
ఏర్పడును. యోగి కాదల్చినవాడు దానమును బహుమతులను ఆశించక స్థిరచిత్తుడై స్వతంత్రుడై
వుండాలి.
అంతరార్ధం :-
బ్రహ్మమార్గమునందు బ్రహ్మనిష్టలో బ్రహ్మజ్ఞానమును గ్రహిస్తూ బ్రహ్మమునందు మాత్రమే
త్రికరణములచే త్రికాలములందు పరిశుద్ధుడై స్థిరముగా యుండుటయే
అపరిగ్రహం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి