1, డిసెంబర్ 2011, గురువారం

వేదమాత - గాయత్రి (ద్వితీయ భాగం)


"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
గాయత్రి ఉపనిషద్ 
వేదాలనుండి 'బ్రాహ్మణ' గ్రంధాలు ఆవిర్భవించాయి. ప్రతి వేదానికి అనేక బ్రాహ్మణ గ్రంధాలున్నాయి. అయితే నేడు అందుబాటులో వున్నవి కొన్ని మాత్రమే. ఋగ్వేదానికి రెండు, యజుర్వేదానికి మూడు, సామవేదానికి పదకొండు, అధర్వణ వేదానికి ఒక బ్రాహ్మణం అందుబాటులో వున్నాయి. అధర్వణ వేదానికి "గోపధ"బ్రాహ్మణం వుంది. ఈ గోపధబ్రాహ్మణం లోని 31 నుండి 38 వరకు ఉన్న ఎనిమిది ఖండాలను 'గాయత్రీ ఉపనిషద్' అంటారు. ఇందులో మైత్రేయ, మౌద్గల్యుల పరస్పర ఉపాఖ్యానంద్వారా గాయత్రీ మహాత్య రహస్యాలు తెలియజేయబడ్డాయి.
మైత్రేయుడు మొదట అహంభావంతో ప్రవర్తించి, ఆపై తన తప్పుని గ్రహించి అహమునువీడి ఎంతో మహత్యం ఆపాదించబడిన గాయత్రీమాత ప్రత్యేకతను తెలుసుకోవడానికి మౌద్గల్య ఋషికి సేవకుడిగా చేరి ఇలా ప్రశ్నించాడు -
కింస్విదాహుర్భో: సవితుర్వరేణ్యం భర్గో దేవస్య కవయః కిమాహు / ధియో విచక్ష యది తాః ప్రవేత్ధన్య ప్రచోదయ వితాయాభిరేతి //
౧. సవితా వరేణ్యం అని దేనిని అంటారు?
౨. ఆ దేవుని భర్గ ఏమిటి?
౩. 'ధీ' సూచించే, అందరికీ ప్రేరణనిస్తూ సవిత సంచరించే ఆ తత్వాలును తెలపమని ప్రశ్నించగా ---
మౌద్గల్యఋషి ఇలా చెప్తున్నారు -
వేదాశ్చందాంసి సవితుర్వరేణ్యం భర్గో దేవస్య కవయ్యోకన్నమాహు: / కర్మాణి ధియస్తదుతే ప్రబ్రవీమి ప్రచోదయన్సవితాయామిరేతి //
౧. వేదాలు మరియు ఛందస్సులు సవితా వరేణ్యంలు.
౨. పండితులు అన్నాన్నే దేవుని భర్గ అంటారు.
౩. కర్మయే 'ధీ' తత్వం. దీని ద్వారా అందరికీ ప్రేరణనిస్తూ సవిత సంచరిస్తూ ఉంటుంది.
వివరణ:-
౧. వేదాలు మరియు ఛందస్సులు సవితా వరేణ్యంలు : వేదమంటే జ్ఞానం. తత్వజ్ఞానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. అయితే ఆ జ్ఞానం కేవలం వాచకమాత్రంగా, పుస్తకపఠనంవలన, విన్నమాత్రమున రాదు. తత్వజ్ఞానం అనుభవపూర్వకముగా అలవడుతుంది. దేనినైన సహేతుకమైన తర్క ప్రామాణికతలతో పరిశీలించి సత్యాన్ని గ్రహించాలి. పూర్ణ భక్తి తత్పరతలతో ఏది కళ్యాణ కారకమో, ఏది ముక్తినిస్తుందో గ్రహించాలి. అలా గ్రహించిన విషయములందు పరిపూర్ణ ప్రగాఢ విశ్వాసమును కలిగియుండాలి. సత్యం, పరోపకారం, సంయమనం, నిజాయితీ మొదలగు సత్వగుణములను అలవర్చుకొని, అదే శ్రద్ధతో ఆ జ్ఞానమును (గ్రహించిన విషయములను) జీవితములో వ్యావహారికంగా ఆచరించాలి. వేదాలు మరియు ఛందస్సుల కలయికతో సవితను అందుకోవడం జరుగుతుంది. జ్ఞానం మరియు అనుభవంతో పరమాత్మను పొందడం జరుగుతుంది.
౨. దేవుని భర్గ అన్నం : దేవుని భర్గ (బలం) అన్నం. శ్రేష్ఠుల బలం సాధన. శ్రేష్టత్వంను శక్తివంతముగా చేయాలంటే అన్నం, సాధనాలు అవసరం. అన్నం, సాధనా సామగ్రి అంతయు లక్ష్మీశక్తి. అందుకే ధనమును, సాధనా సామగ్రులను భోగాలకు, లోభాలకు, కూడబెట్టడానికి, స్వార్ధానికి  అహంకారదర్పానికి వినియోగించక దైవత్వ కార్యక్రమములకు, మానవీయ సేవాకార్యక్రమములకు ఉపయోగించాలి.
౩. కర్మయే ధీ తత్వం : కర్మల ద్వారానే పరమాత్మ అందరిని వికశింపజేస్తాడు. పరమాత్ముడు అందరిని ఉన్నతిపధంవైపే ప్రేరేపిస్తాడు. ఈ ప్రేరణ యొక్క రూపం ధీ. ధీ అనగా కర్మచేసే ప్రేరణని ప్రోత్సాహాన్ని ఇచ్చే బుద్ధి.
మరల మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు - 
తముప సంగృహ్య పప్రచ్చాధీహి భో:, క- సవితా, కా సావిత్రీ 
సవితా అంటే ఏమిటి? సావిత్రి అంటే ఏమిటి?
ఈ ప్రశ్నలకు మౌద్గల్య ఋషి ఇలా బదులిచ్చెను -
                                                              ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటుంది. గాయత్రి యొక్క దేవత సవిత. గాయత్రికే మరో పేరు సావిత్రి. (గాయత్రి, సావిత్రి, సరస్వతి అని వేదమాత గాయత్రికి పేర్లు కలవు. ఇంద్రియములపై ఆధిపత్యం వహించునది కావున గాయత్రి అనియు, సత్యమును పోషించునది కావున సావిత్రి అనియు, వాగ్దేవత స్వరూపిణి కావడంచే సరస్వతి అనియు అందురు)  ప్రణవం, వ్యాహృతి, సావిత్రి ఈ మూడింటి కలయికే గాయత్రి మంత్రం. సవిత, సావిత్రి ఈ రెండింటికీ అవిచ్చన్న సంబంధం ఉంది.  తేజస్వి పరమాత్మ సవిత, ఆయన శక్తి సావిత్రి. ఈ రెండు కలిసి ఓ జంట. ఒకటి కేంద్రమైతే రెండవది దాని శక్తి. ఆ శక్తే గాయత్రి. 
మనస్సు సవిత, వాక్కు సావిత్రి. అగ్ని సవిత, పృథ్వి సావిత్రి. వాయువు సవిత, అంతరిక్షం సావిత్రి. ఆదిత్యుడు సవిత, ద్యౌ సావిత్రి. చంద్రుడు సవిత, నక్షత్రాలు సావిత్రి. పగలు సవితా, రాత్రి సావిత్రి. ఉష్ణం సవిత, శీతలం సావిత్రి. మేఘాలు సవిత, వర్షం సావిత్రి. విద్యుత్తు సవిత, దాని మెరుపు సావిత్రి. ప్రాణం సవిత, అన్నం సావిత్రి. వేదాలు సవిత, ఛందస్సు సావిత్రి. యజ్ఞం సవిత, దక్షిణ సావిత్రి.  
దేని యొక్క విస్తారం ఒంటరిగా జరగదు. అలానే పరమాత్ముడు వ్యక్తమవ్వాలంటే అతని శక్తి ద్వారానే అది సంభవం.
శక్తి - శక్తిమంతుడు అంటే సవిత - సావిత్రి కలయికలా ప్రతీ సాధకుడు తనలో శక్తులను బహుళముగా సంఘటితం చేసుకొని ప్రయత్నించినప్పుడే పరమాత్మను పొందగలడు అని మౌద్గాల్యుడు వివరించగా సవిత, సావిత్రుల రహస్యాన్ని మైత్రేయుడు తెలుసుకున్నాడు. మంత్రరాజమైన గాయత్రీ మంత్రం మోక్షప్రదాయిని అని తెలుసుకుంటాడు. సత్య జ్ఞాన వాస్తవిక రూపాన్ని, గాయత్రి తత్వమును తెలుసుకొని పరిపూర్ణుడు అయ్యాడు. 
మనస్సు అంతర్ముఖమైతేగానీ మోక్షం యందు మనస్సు నిలవదు. (ఇంద్రియములద్వారా బయటికి పరిగెత్తే మనస్సును లోపలకు త్రిప్పుటను అంతర్ముఖత్వం అంటారు). మనస్సు అంతర్ముఖం కావాలంటే మంత్రానుష్టానం, మంత్రజపం, నామజపం, ధ్యానం మొదలగు సాధనములు తప్పనిసరి. గాయత్రిమంత్రం ద్వారా అంతర్ముఖం చెందడం సులభమని అనుభవజ్ఞుల అభిమతం. 

1 కామెంట్‌:

  1. భారతి గారు చక్కటి విషయములను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి