9, జూన్ 2012, శనివారం

గురుభక్తి మహిమ

     మహాగురుభక్తియు, గొప్పవిరక్తియు, తీవ్ర ఆధ్యాత్మిక జిజ్ఞాసగల ఒకానొక భక్తుడును ఒక బ్రహ్మనిష్టుల సభలో ఉపన్యసించ వలసినదిగా సభాకార్యనిర్వాహకులు కోరగా, వారికోరికను మన్నించి ఆ గురుభక్తుడు ముందుగా తన గురువర్యున్ని స్మరించుకొని శ్రీ గురుస్తోత్రమును జేయదలచెను. అయితే గురుదేవుడును ఎటుల స్తుతించిన బాగుండునని యోచిస్తూ, ముందుగా సూర్యునితో పోల్చుతూ చెప్పడానికి ప్రయత్నించెను.

                                      సూర్య దృష్టాంతము 


ప్రపంచంలోగల చీకటిని రహితమొనర్చి ప్రకాశమును కలుగజేసిడి సూర్యునితో గురుదేవున్ని పోల్చి వర్ణించిన బాగుండునని తలచెను. కానీ, అది సరికాదని అలా పోల్చడం గురుదేవునుని అవమానపరచడమే అవుతుందని తలచెను. ఏలననగా -
సూర్యుడు తమస్సును రహితంగా చేసి ప్రకాశమును కలుగజేయునది నిజమైనను సూర్యప్రకాశము భూగోళమున ఒకప్రక్క ప్రకాశమును, మరోప్రక్కన చీకటిగా యుండును. తన జ్ఞానప్రకాశంతో అంతటా ఒకేలా ప్రకాశించుచున్న సర్వవ్యాపకుడు అయిన గురుదేవుడును సూర్యునితో పోల్చడం తప్పని భావించెను. అంతేకాదు, సూర్యుడు పగలు మాత్రమే ప్రకాశించి రాత్రియందు ప్రకాశింపజాలడు. అలానే సూర్యుడు బయటప్రదేశమున మాత్రమే ప్రకాశించు శక్తిగలవాడే గానీ, జీవుల హృదయాంతరాళమున నిబిడమై యుండు అజ్ఞానతమస్సును రహితమొనర్చజాలడు. కానీ, గురుదేవుడు మనస్సులో నిబిడమై యుండు అజ్ఞానతమస్సును రహితమొనర్చగలడు. అంతేకాదు, దట్టమైన మబ్బులవలన, గ్రహణకాలంలోనూ సూర్యుడు మరుగునపడిపోవుచున్నాడు. స్వప్రకాశకుడగు గురుదేవుడు సర్వప్రకాశకుడు.కాబట్టి సూర్యునితో గురుదేవుడును పోల్చలేను అని చెప్పి -
అజ్ఞానతిమిరాంధస్య  జ్ఞానాంజనశాలాకయా / చక్షరున్మీలితం యేవ తస్మై శ్రీగురవే నమః //
ఈ రీతిలో గద్గదస్వరంతో స్తుతించి కాసేపు ఉపన్యసించడం ఆపెను.

                                    చంద్ర దృష్టాంతము 
కాసేపటికి మరల ఉపన్యసించ దలచెను. ఈసారి చంద్రునితో పోల్చదలిచెను. కానీ, అదీ సరికాదని భావించెను. ఏలననగా -
చంద్రుడు చల్లనివాడును, ప్రసన్నుడును అయినను చంద్రుడు యొక్క చల్లదనమును, ప్రసన్నత్వం ఎల్లప్పుడును ఉండుటలేదు. కానీ, నా గురుదేవుడు సదా చల్లదనమును, ప్రసన్నత్వమును కల్గియున్నవాడు. అంతేకాక, శుక్లపక్షమున వృద్ధియు, కృష్ణపక్షమున క్షయమున్ను చంద్రునికి కల్గుచున్నది. నా గురుదేవుడో... ఏ హెచ్చుతగ్గులు లేకుండా పరిపూర్ణుడై యున్నాడు. అంతేకాక, చంద్రునియందు కళంకం కలదు. నా గురుదేవుడు నిష్కళంకుడు. పరప్రకాశంతో ప్రకాశించువాడు చంద్రుడు. మరి నా గురుదేవుడో... స్వయంప్రకాశకుడు. సూర్యుని మాదిరిగా మేఘాలువలన, గ్రహణకాలంలో రాహుకేతువులవలన చంద్రుడు మరుగునపడుచున్నాడు. మరియు రాత్రినే చంద్రుని ప్రకాశముండును. కానీ, నా గురుదేవుడు రేయింబవళ్ళు ఒకే విధంగా వెలుగుచున్నవాడు. కావున చంద్రునితో నా గురుదేవుడిని పోల్చడం దోషమని చెప్పి -
అఖండమండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ / తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీగురవే నమః // 
అని స్తుతించి కాసేపు మౌనమయ్యేను.

                                సముద్ర దృష్టాంతము 
కాసేపటికి మరల ఉపన్యసించదలచెను. ఈసారి సముద్రముతో పోల్చదలిచెను. కానీ, ఆ పోలిక కూడా సరికాదని భావించెను. ఏలననగా -
సముద్రం అపారమని చెప్పబడినను సముద్రమునకు కూడా పారం గలదు. కానీ, నా గురుదేవుడు సర్వవ్యాపకత్వం కలిగినవాడు. సముద్రజలమంతయు లవణరసమైనది. త్రాగుటకు ఉపయోగపడదు. కానీ నా గురుదేవుని హృదయం క్షారోదకం కాదు, ఆ హృదయం అమృతమయం. జిజ్ఞాసువులు రేయింబవళ్ళు వచ్చి జ్ఞానామృతమును పానమొనర్చి తృప్తులగుచున్నారు. సముద్రన్తర్భాగమున రత్నాదులు ఉన్నప్పటికిని అనేక క్రూరములగు పాములు, మకరములు, త్రిమింగలాది జలచరజంతువులు కలవు. కానీ, నా గురుదేవుని హృదయాన్తరమున శాంతమనెడు రత్నములను, సహనముత్యములను, వైరాగ్యపగడములను ఉన్నవి. సముద్రంలో జీవులు ఒకదానిని ఒకటి హింసించి తింటుంటాయి. మా గురుదేవుని హృదయం ఏ ప్రాణిని హింసించని అహింసా ధర్మమయమై యున్నది. సముద్ర అంతర్భాగమున బడబాగ్నులున్నాయి, నా గురుదేవుని హ్రుదయాన్తర్భాగమున బ్రహ్మానందము, శాంతం, శివము ఉన్నవి. సముద్రములో ఎన్నో మాలిన్యములు కలిసియుండును. కానీ, గురుదేవుని హృదయంలో వేదసారమగు జ్ఞానం నిలిచియున్నది. కావున సముద్రంతో గురుదేవున్ని పోల్చలేనని చెప్పి -
సంసారవృక్ష మారూడాః పతన్తి నరకార్ణవే / యస్తానుద్ధరతే సర్వాంస్తస్మై శ్రీగురవే నమః // 
ఇలా స్తుతిస్తూ మరల మౌనమయ్యేను.

                      మహా మేరువు దృష్టాంతము 
కాసేపటికి ఆ భక్తపరాయణుడు మరల తన ఉపన్యాసమును ప్రారంభిస్తూ, ఈ సారి మహామేరువుతో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడ సరికాదని భావించెను. ఏలననగా -
మేరుపర్వతం అక్కడక్కడ రత్నాలున్నను వట్టి మట్టి రాళ్ళగుట్ట. మేరువు ఏకప్రదేశమునకు పరిమితం. జ్ఞానం లేని జఢవస్తువు. మరి నా గురుదేవుడో.... జ్ఞానరత్నముల రాశిభూతుడై అంతటా  తిరుగాడు చైతన్యమూర్తి.  మేరువుపై పార్వతీపరమేశ్వరులు ఉండడంవలన పుణ్యం ప్రాప్తించింది. కానీ, నా గురుదేవుడు పకృతి పురుషులకు విలక్షణమగు శుద్ధశివస్వరూపుడు. మేరుగిరిపై సింహశార్దులాది భయంకరజంతువులు గలవు. నా గురుదేవుడు యందో, శాంతి, సత్య, కరుణాది అనేక సుగుణములే ఉన్నవి. మేరుగిరిపై అనేకమంది దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ భార్యలతో ఆసక్తితో క్రీడించుచుందురు. కానీ, నా గురువరుని ఆశ్రమమున అనేకమంది స్త్రీ పురుషులున్నను, వారందరునూ ఆత్మారాములై ఆత్మయందు రమించువారే గానీ విషయాసక్తులు కారు. మేరుగిరి యందుండి అనేక ప్రోతస్సులు ప్రవహించుచుండును. అవన్నీ వట్టి నీళ్ళే గానీ మరియొకటి కాదు. నా ప్రభువగు గురువు నుండి సదా జ్ఞానప్రవాహమే జరుగును. దానిని పానం చేసినవారికి మరల జననమరణములే ఉండవు. మేరుపర్వతం నుండి జాలువారు గంగాప్రవాహం కొంతసేపు దాహంను శమింపజేయును. కానీ నా గురుదేవుని ముఖరావిందం నుండి వెలువచుండు జ్ఞానగంగను పానంచేసిన వారికి ఏ కాలమందైనను తాపత్రయాగ్నిచే నేర్పడిన దాహముండదు. ఇత్యాది కారణములచే మేరుపర్వతంతో కూడా నా గురుదేవుడుని పోల్చడం తగదని చెప్పి -
అజ్ఞానేనాహినా గ్రస్తాః ప్రాణినస్తాచ్చికిత్సకః / విద్యాస్వరూపో భగవాంస్తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి కాసేపు మరల మౌనమయ్యేను.

                                   అగ్ని దృష్టాంతము 
మరల తన గురువు మహిమ తెలపడానికి ఉపన్యాసంను ప్రారంభిస్తూ, ఈసారి అగ్నితో పోల్చడానికి ప్రయత్నించెను. కానీ, అది కూడా సరికాదని తలచెను. ఏలననగా -
అగ్ని కట్టెలను కాల్చివేయు శక్తి గలదైనను అజ్ఞానకాష్టమును దహింపజేయుశక్తి అగ్నియందు లేదు. నా గురుదేవుడో....అజ్ఞానేంధనమును భస్మమొనర్చుడు శక్తిమంతుడు. స్థూలమైన కట్టెలను అగ్ని బూడిద చేయగలదు గానీ సూక్ష్మమై జన్మజన్మాంతరములనుండి వచ్చుచుండు కర్మరాశియను కట్టెలను గురుదేవుడు జ్ఞానదృష్టి అనెడు అగ్నిచే భస్మమయముగా చేయును. మహారణ్యమును ఈ అగ్నిహోత్రుడు భస్మమొనర్చినను నొనర్చుగాక, కానీ అంతు కనబడని సంసారారణ్యమును నా గురుదేవుడు జ్ఞానాగ్నిచే భస్మం చేయును. ఎంత శుద్ధమైన యజ్ఞాగ్ని కాని, దక్షిణాగ్ని కాని, గార్హపత్యాగ్ని కాని, ఆహనీయాగ్ని కాని, సమిధలు వేయుచుండువరకు మాత్రమే జ్వలించుచుండును, లేనిచో నింపాదిగా చల్లారిపోవును. జ్ఞానాగ్ని స్వరూపుడగు నా గురుదేవును ప్రజ్ఞానాగ్ని ఎప్పుడూ నశించదు. కావున అగ్నితో నా గురుదేవున్ని పోల్చడం సరికాదని చెప్పి -
తాపత్రయాగ్నితప్తానామశాంతప్రాణినాం భువి / గురురేవ పరా గంగా తస్మై శ్రీగురవే నమః //  
అని స్తుతించి మరల కాసేపు మౌనమయ్యేను. 

                                 బ్రహ్మ దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యచించడం ప్రారంభించెను. ఈసారి  గురుదేవున్ని బ్రహ్మదేవునితో పోల్చడానికి ప్రయత్నించెను. ఇది కూడా సరికాదని భావించెను. ఏలననగా -
బ్రహ్మదేవునికి శ్రీమన్నారాయణమూర్తి గురువని ప్రామాణికం కలదు ('యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యోవై వేదాంశ్చప్రహిణోతి తస్మై'). తనపై ఓ గురువుండగా ఈ బ్రహ్మను స్వయంప్రకాశుడున్ను, స్వయంభువు అగు నా గురువుతో సమానముచేసి నేను స్తుతించలేను. అదియును గాక, ఎవరుగొప్పవారనే అహం స్పురణతో  అనలస్తంభంగా ఆవిర్భవించిన శివుని అది అంతంలు కనుగొనలేక దేనువుచేతను, మొగలిపువ్వుచేతను అసత్యం పలికించినవాడు, శాపం వున్నవాడు బ్రహ్మయని అందురు. మరి నా గురుదేవుడో... సత్యవంతుడు, అందరి శాపములను పోగొట్టువాడు. అదియునుగాక, సనక సనందన సనత్కుమార, సనత్సుజాతులను నలుగురు తీవ్ర బ్రహ్మజిజ్ఞాస మహాయోగులు జీవబ్రహ్మైక్యసందేహనివృత్తికై బ్రహ్మలోకం వెళ్ళి సరస్వతీదేవితో కూడిఉన్న బ్రహ్మనుకాంచి, తమ సందేహమును తీర్చే గురువు ఇతనుకాదని వెడలిరి. అన్ని సందేహములను తీర్చే నా గురుదేవుడిని బ్రహ్మతో పోల్చలేనని చెప్పి -
అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే / జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి మరల కాసేపు మౌనం వహించెను.

                                        విష్ణు దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యసించ దలచి, ఈసారి గురుదేవున్ని విష్ణువుతో పోల్చడానికి ప్రయత్నించెను. ఈ పోలిక సరికాదని భావించెను. ఏలననగా -
తమ గురువుగా చతుర్ముఖ బ్రహ్మను స్వీకరించక వైకుంఠలోకంకి వెళ్ళిన సనకాది మహర్షులు లక్ష్మీదేవితో కలిసిఉన్న శ్రీమన్నారాయణమూర్తి దరి కూడా తమ సందేహనివృత్తి జరగదని తెలుసుకొని అచ్చటనుండి వెడలిరి. అంతేకాదు, బ్రహ్మ మాదిరిగా అసత్యం చెప్పకపోయినను అనలస్తంభం ఆది అంత్యంలను ఎరగనివాడు కావున సర్వజ్ఞుడైన నా గురుదేవున్ని విష్ణువుతో పోల్చలేనని చెప్పి -
భావారణ్యప్రవిష్టస్య దిజ్మోహభ్రాన్తచేతనః / యేవ సందర్శితః పన్దాస్తస్మై శ్రీగురవే నమః //
అని స్తుతించి మరల మౌనమయ్యేను.

                                      శివ దృష్టాంతము 
పిమ్మట మరల ఉపన్యసించ దలచి, ఈసారి శివునితో పోల్చడానికి సంకల్పించెను. సనకాదిమునిసత్తములు నలుగురున్ను తమ సందేహనివృత్తికై కైలాసమునకు వస్తున్న విషయమును పరమశివుడు ముందుగానే దివ్యదృష్టితో తెలుసుకొని, వారి సందేహములు తీర్చుటకై సర్వమును త్యాగమొనర్చి, విభూతి  రుద్రాక్షలను ధరించి ఓ వటవృక్షం యొక్క మూలమున వ్యాఘ్రాసనముపై  దక్షిణాభిముఖంగా సిద్ధాసనసీనుడై, చలించని బ్రహ్మదృష్టి గలవాడై, ప్రసన్నముఖారవిందుడై ధ్యానమయుడై కూర్చోండెను. ఇదియే దక్షిణామూర్తి యొక్క అవతార రహస్యం. సనకాది మునివర్యులు నలుగురును సర్వేంద్రియములను నిగ్రహపరచి ప్రత్యక్ చైతన్య బ్రహ్మస్వరూపమందు నిలకడకలిగి యుండునట్టి దక్షిణామూర్తి యొక్క స్థితిని జూచినవారై తమకు సరియైన గురువు ఇతనేనని నిశ్చయించుకొని ప్రణమిల్లిరి. అటుపై తమ సందేహములను తీర్చుకొని సనకాదులు దక్షిణామూర్తి మౌనబోధచే సర్వసంశయరహితులై, శివజీవైక్యస్వరూపులై గురుస్తోత్రం చేసి తమస్థానములకు తృప్తిగా తిరిగి వెళ్ళిరి, అని ఆనందంగా చెప్పి - 
శిష్యానాం జ్ఞానదానాయ లీలయా దేహదారిణే/సదేహేపి విదేహాయ తస్మై శ్రీగురవే నమః //
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే/వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః//
ఓమ్ నమః ప్రణవార్దయ శుద్ధజ్ఞానైకమూర్తయే/నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః//
అని దక్షిణామూర్తిని స్తుతిస్తూ గురుభక్తి మెండుగా గల ఈ పరమభక్తుడు గురుధ్యానం చేసి చేసి బ్రహ్మాకారస్వరూపుడగు గురుస్వరూపుడు అయ్యెను.                                                                                 

1 వ్యాఖ్య: