7, ఫిబ్రవరి 2013, గురువారం

స్త్రీలు వేదవిద్యకు అర్హులేనా???

క్రిందటి టపా 'స్త్రీల సందేహాలు' చదివిన ఒకరు  వేదాన్ని ఆడవారు, బ్రాహ్మణేతరులు చదవకూడదంటుంటారు. ఇది నిజమేనా అండీ ... అని ప్రశ్నించారు. 
ఈ ప్రశ్నలకు సమాధానం మన శాస్త్రాల యందే ఉన్నది.

స్త్రీపురుషుల శరీరసృష్టియందు బేధం కలదు. శరీర నిర్మాణమున త్వచము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి అను ఆరుకోశములు కలవు. త్వచమూ, రక్తమూ, మాంసము స్త్రీల శరీరమునందు అధికముగాను, మేధస్సు మజ్జ, అస్థి కాస్త తక్కువగాను ఉండడమువలన స్త్రీ పురుషుని కంటే తక్కువ దేహబలం కలిగియున్నది. ఇది సృష్టి నియమం. అందుచే మనోనిగ్రహము, ధారణాశక్తి, బలము పురుషులకు ఉన్నంతగా స్త్రీలకు ఉండదన్నది యదార్ధం. అలానే పురుషుల కంటే స్త్రీలల్లో ప్రేమ, శాంతస్వభావం, మృదుత్వం అధికం. ఇవి చాలు, భగవద్భక్తికిని, వేదాధ్యయనమునకు, బ్రహ్మజ్ఞానమునకు! 
అయితే వేదమంత్రధారణలో పురుషులకున్న దృఢశక్తి స్త్రీలల్లో ఉండదు. మరియు బ్రహ్మచర్యం వలన అమితశక్తిని పురుషులు పొందగలరు. స్త్రీలల్లో నెలనెలా ఋతుక్రమం వలన కాయికశక్తి, మానసికశక్తి, బుద్ధినిశ్చయాత్మకశక్తి కొంత తగ్గుతుంది. ఈ కారణం వలన బ్రహ్మవిద్య యందు కొంత అవరోధం ఉంటుందన్నది నిజమేనైనప్పటికీ వేదవిద్యలను అభ్యసించే అర్హత స్త్రీలకు లేదనుకోవడం తప్పు. స్థిరసంకల్పముతో ఈ విద్యలను అభ్యసించవచ్చును. అలా అభ్యసించినవారిలో గార్గేయ, మైత్రేయి, విశ్వవర... మొదలగువారు ఉన్నారు. 

భగవద్గీత యందు 'కీర్తి: శ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ద్రుతి: క్షమా' స్త్రీల యందలి కీర్తి, ఐశ్వర్యం, వాక్చమత్కృతి, ధారణాశక్తి, బుద్ధిబలం, దైర్యం, ఓర్పు... నా అంశములే (స్వరూపములే) అన్న శ్రీకృష్ణ పరమాత్మ మాటలను పరిగణలోనికి తీసుకొని పరిశీలించిన ఇన్ని భగవదంశములున్న స్త్రీ వేదవిద్యకు అనర్హురాలని అనుకోవడం అవివేకం.

ఇక మన వేదగ్రంధాలను పరిశీలిస్తే - 
సమస్తమైన వేదవేదాంత రహస్యాలను పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించలేదా?  శ్రీమన్నారాయణుడు భూదేవికి బోధించలేదా? ... వీరంతా శక్తిస్వరూపులు కాబట్టి, వీరిని పరిగణలోనికి తీసుకురాకూడదని అనుకుంటే -
యాజ్ఞవల్క్యమహర్షి బృహదారణ్యకోపనిషత్తులో, తన భార్యయైన మైత్రేయికిని, శ్రీ కపిలాచార్యుడు సాంఖ్యశాస్త్రమందు తనతల్లియైన దేవహుతికిని, మతంగమహర్షి తన శిష్యురాలైన శబరికిని వేదవిద్యలు బోధించలేదా?

యోగాదికారిణమునకు అందరునూ అర్హులే. బాలుడు, వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, యౌవనస్థుడు, స్త్రీ, శూద్రుడు అందరునూ జ్ఞానమునకు సమానాధికారులే నని ఈ క్రింది శ్లోకం ద్వారా తెలుస్తుంది.
యోగాదికారిణస్సర్వే ప్రాణిన స్సర్వదా యతః /
బాలో వృద్ధో వ్యాధియుక్తో యువా స్త్రీ శూద్రజన్మబృత్ // (సనత్కుమార సంహిత)

బ్రహ్మచారీ గృహస్థో వా వానప్రస్థో థవా యతి: /
నారీ వా వృషలో వా పిపక్వో బ్రహ్మ విచారయేత్ // (రమణగీత)
బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి, స్త్రీ వీరిలో ఎవరికైనను మనఃపరిపక్వత యున్నచో బ్రహ్మవిచారం చేయవచ్చు. 

శూద్రులు వేదవిద్యకు అర్హులేనా? 
శూద్రులంటే ఎవరు? 
పుట్టుకతో అందరూ శూద్రులే.
జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః /
వేదపాఠాత్తు విప్రస్స్యాత్ బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః //
ఎవరైనను జననముచే శూద్రుడును, ఆత్మసంస్కారాది కర్మముచే ద్విజుడును, వేదాధ్యయనముచే విప్రుడును, బ్రహ్మజ్ఞానము కలుగునప్పుడు బ్రాహ్మణుడును అగుచున్నారు.

న యోనిర్నాపి సంస్కారో న శ్రుతం న చ సంతతి: /
కారణాని ద్విజత్వస్య వృత్తమేవ తు కారణమ్ //
బ్రాహ్మణత్వమునకు కారణం బ్రాహ్మణస్త్రీ యందు జన్మించుట కాదు, ఉపనయనాది సంస్కారములు కాదు, వేదాధ్యయనం కాదు, బ్రాహ్మణసంతతి కాదు, సత్యధర్మాది వృత్తియే బ్రాహ్మణత్వం.

సత్యం దానం క్షమా శీల మానృశంస్యం తపో ఘ్రుణా /
దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః //
సత్యము, దానము, క్షమ, ఓర్పు, సదాచారం, మానవత్వం, తపస్సు, జీవకారుణ్యం మొదలగు గుణములు ఎవరియందు యుండునో వారు బ్రాహ్మణులే అన్నది వేదవాక్యం.

శూద్రోపి శీలసంపన్నోగుణవాన్ బ్రాహ్మణో భవేత్ /
బ్రాహ్మణోపి క్రియాహీనః శూద్రాత్ర్పత్యవరో భవేత్ //
శూద్రకులమందు జన్మించినవారైనను, శమదమాది సద్గుణసంపన్నుడై  యుండినచో వారు బ్రాహ్మణులే. బ్రాహ్మణకులమందు జన్మించినవారైనను, సదాచార సద్గుణ దూరుడైనచో శూద్రుని కన్న నీచుడని భావించవచ్చును.

స్వభావాలు బట్టే వర్ణములుంటాయన్నదే కృష్ణ పరమాత్మ మాట కూడా.
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప /
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః // (భగవద్గీత)
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల వారిని వారివారి స్వభావాలను బట్టి విభజన యుండును.

మాం హి పార్ధ వ్యపాశ్రిత్య యేపి స్యు: పాపయోనయః /
స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ // (భగవద్గీత)
ఓ పార్ధా! నీచయోనియందు జన్మించిన వారెవరు గలరో వారున్నూ, స్త్రీలును, వైశ్యులును, శూద్రులును నన్ను ధ్యానించి జ్ఞానవంతులై శాశ్వతానందమగు పరమపదం పొందుచున్నారు.
దీనిబట్టి జ్ఞానసముపార్జనకు అందరూ అర్హులే అని అర్ధమౌతుంది కదా.

న చర్మణో న రక్తస్య మాంసస్య చ న చాస్థినః /
న జాతి రాత్మనో జాతి ర్వ్యవహార ప్రకల్పితా // (తేజోబిందూపనిషత్)
ఆత్మకు జాతి బేధం లేదు, అలానే చర్మానికి, రక్తమునకు, మాంసమునకు, అస్థికిని జాతి బేధంలేదు, జాతి సాధారణ వ్యవహార కల్పితమే.

న గోత్రం న కులం సూత్రం న విభుత్వం న శూన్యతా /
న స్త్రీర్న యోషిన్నో వృద్ధా న కన్యా న వితంతుతా //
గోత్రము, కులము, సూత్రము, గొప్పది, చిన్నది, స్త్రీ, యువతి, వృద్ధస్త్రీ, కన్య, వితంతువు మొదలగుగా గల బేదములు లేకుండా వేదవిద్యాభ్యాసం చేయవచ్చని ఋభు మహర్షి నిదాఘునకు బోధించెను.

 ఇక ఆధ్యాత్మ జ్ఞానమునకు ప్రధానమైనది శరీరం కాదు, హృదయస్థమే ప్రధానం. దానికి స్త్రీపురుష బేధమేమున్నది? శ్రీ శంకరాచార్య భగవత్పాదులవారి అనుభవం ఒకటి పరిశీలిద్దాం -

వర్ణజాతిబేధములు తగవని, వీటినుండి జనులను ఉద్ధరించాలని పరమశివుడు తలచి, కాశీక్షేత్రమునకు వెళ్ళుచున్న శ్రీ శంకరాచార్యులవారికి చండాలవేషధారియై ఎదురుగా రాగా, 'ఆవలకు(ప్రక్కకు) తొలగ'మని శంకరాచార్యులవారు పలికిరి. అంతట చండాలవేషధారియైన ఈశ్వరుడు ఇట్లనెను -
అన్నమయా దన్నమయ మథవా చైతన్యమేవ చైతన్యాత్ /
యతివర! దూరీ కర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి //
ఓ యతివర్యా! అన్నరసమైన శరీరమునుండి అన్నమయమైన శరీరమును దూరముగా తొలగమని కోరుతున్నావా? లేక చైతన్యరూపమైన ప్రత్యగాత్మను, చైతన్యరూపమైన ప్రత్యగాత్మనుండి దూరముగా తొలగించమని కోరుచున్నావా? అన్నమయ శరీరం అశుద్ధమైనచో, నీ శరీరముకూడా అన్నమయమై యున్నదికావున అదియునూ ఆశుద్ధమే. లేక చైతన్య రూపమగు ఆత్మతో తొలగించమని చెప్పినచో, ఆత్మ సర్వవ్యాపి కనుక, ఆత్మచైతన్యం లేని స్థలమెచ్చట కలదు? అని సమత్వమును బోధించే కధనం బట్టి స్త్రీ పురుష, వర్ణజాతిబేధములు లేవని గ్రహించవచ్చును.

ఇక్కడ మరో శాస్త్రీయమైన విషయాన్ని కూడా పరిశీలిద్దాం -
స్త్రీలు గర్భంతో ఉన్నసమయమందు వారి వారి విచారముననుసరించి సంతానం కలుగునని నిరూపింపబడినది. అందుకు శాస్త్రములయందు ఉన్న కొన్ని ఉదాహరణలు...
హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు హిరణ్యకశిపుడు భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదమహర్షి అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానబోధ చేయుచున్నపుడు ఆమె కడుపున గల ప్రహ్లాదుడు వింటుంటాడు. నారదమహర్షికి శుశ్రూష చేసి వారి ఉపదేశప్రకారం పరమాత్మను ధ్యానించుటచే ఆమె గర్భంలో యున్నది అసురబీజమైనను భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు జన్మించెను.
సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తున్నప్పుడే అభిమన్యుడు అది వింటూ ఊ కొట్టడం, శ్రీకృష్ణుడు చక్రం అడ్డుపెట్టినట్లు..... భారతంనందు కలదు.
జిజాబాయ్ గర్భంలో ఉన్నప్పుడే శివాజీ చక్రవర్తి ఎన్నో ధీరోదత్తమైన కధలను, మంచి మంచి విషయాలను తల్లి ద్వారా గ్రహించినట్లు చరిత్ర చెప్తుంది.
పై విషయాలను గమనించే గర్భిణీస్త్రీలు సాత్త్విక ఆహారంతో పాటు సదాచారులై, దైవభక్తిపరులై ఉంటూ, సత్కధలను, ఆధ్యాత్మిక గ్రంధపారాయణమును చేయవలయునని, తద్వారా సత్సంతానం కలుగునని పెద్దలు చెప్తుంటారు. అలానే ఇటువంటి అధ్యాయనములు చేసిన స్త్రీ వలన ఆమెకు పుట్టిన బిడ్డలు జ్ఞానవంతులగుదురు. తల్లే తొలిగురువు. ఇటువంటి స్త్రీవలన ఆ కుటుంబం అంతా అభివృద్ధిలోనికి వచ్చును. ఇల్లాలే ఇంటికి దీపం.





15 కామెంట్‌లు:

  1. చాలా చక్కటి విషయాలను తెలియజేసారండి.

    రిప్లయితొలగించండి
  2. అన్ని వివరంగా సెలవు ఇచ్చారు. బాగ తెలియజేసారు.

    రిప్లయితొలగించండి
  3. అనూరాధ గారు!
    మీ ఈ స్పందనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. నరసింహా గారు!
    మీ స్పందనకు ధన్యవాదాములండి.

    రిప్లయితొలగించండి
  5. సవివరంగా తెలియజేసారు. కొన్ని అనుమానాలు పాటా పంచలు అయ్యాయి. బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసుకున్నాం. భారతి గారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. వనజ గారు!
    మన శాస్త్రలయందు ఉన్నదే నా అవగాహనమేరకు తెలిపాను.
    మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.
    మీ స్పందనకు మనసార ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. కృతఙతలు ...మీకు తెలిసిన విషయాన్ని పంచి మాకు కాస్త విషయ పరిఙానం అందించారు.

    రిప్లయితొలగించండి
  8. నరసింహా గారు!
    మీ ఈ స్పందనకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. అమ్మ దగ్గరనుంచి కదా మొదట నేర్చుకునేది, అటువంటి అమ్మ తెలుసుకో కూడనిదేదీ లేదు. అసలు విద్యల తల్లి అమ్మ, మధ్యలో వచ్చిన శషభిషలివి.

    రిప్లయితొలగించండి
  10. నా సందేహనివృత్తికోసం శ్రమతీసుకుని ఇంత విస్తారమైన పోస్ట్ రాసినందుకు ధన్యవాదాలు. మీకు దీనిపై మెయిల్ కూడా పంపాను. చూడగలరు.

    రిప్లయితొలగించండి
  11. అమ్మ దగ్గరనుంచి కదా మొదట నేర్చుకునేది, అటువంటి అమ్మ తెలుసుకో కూడనిదేదీ లేదు. అసలు విద్యల తల్లి అమ్మ,
    చక్కటి వ్యాఖ్య... ధన్యవాదములు సర్.

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాత గారు!
    మీ సందేహం తీరినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి