28, సెప్టెంబర్ 2015, సోమవారం

స్థూలం నుండి ప్రజ్ఞామయం వరకు - - - చక్రశుద్ధి - ఆనందసిద్ధి (చివరిభాగం)

ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే అద్వైతస్థితి. 

ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. 
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. 
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే,  భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా  మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి. 

గత టపాల్లో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు సహస్రారచక్రం గురించి తెలుసుకుందాం. 

సహస్రారచక్రం : -              
                                                   
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ 

ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి. 
                                           

                                       
మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం. 

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 
షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు. 
ఈ చక్ర మానసిక స్వభావం - 
ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు. ఇది ఈశ్వరీయత స్థితి. ఈశ్వరత్వం పొందుతారు. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - 
తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతవరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు  ఆనంద నందనవనములు అవుతాయి. 
ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం. 

కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్ధించాలి. {ప్రార్ధన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, పూజగదిలో దేవుని పటాల ముందు దీపారాధన చేసి భగవంతుణ్ణి ఏదో ఒకపేరుతో నుతించడం, స్తుతించడం కాదు,  శ్లోకపూరితమైన అనుష్టానాలు కాదు. దేవుడు అంటే పటమో విగ్రహమో కాదు, దేవుడు అంటే గుడి లోనో, దివిలోనో ఉండేవాడు కాదు, పటమైనా, విగ్రహమైన, శ్లోకమైన, మంత్రమైన, నామమైన ... ఇవన్నియూ మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్ధన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. మనకేం కావాలో, మన గమ్యమేమిటో, ఏమార్గంలో పయనించాలో తెలుసుకుంటూ (శోధిస్తూ) సప్తచక్రాలను చైతన్యపూరితం చేయగలిగే సాధన చేయగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ విధంగా సాధన సాగిస్తున్న కొలది ...  ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు 'అహంబ్రహ్మస్మి' అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. పారమార్ధికంగా పురోగతి సాధించామన్నదానికి గుర్తు - ఆనందంగా ఉండటమే. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. 
ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారం నందు తిరిగి జన్మింపరు. మూడులోకములయందు సయితం బద్ధులు కారు.  

మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో  స్థూలంనుండి  ప్రజ్ఞామయం వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి. 
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి