11, జులై 2018, బుధవారం

మ్యాజిక్ ట్రీ (కల్పవృక్షం) మ్యాజిక్ కౌ (కామధేనువు)

అమ్మమ్మా... అమ్మమ్మా...
నా చిట్టితల్లి శ్రీమాన్వి పిలుస్తూ పరుగు పరుగున వచ్చింది. కాస్త నెమ్మదిగా రావచ్చుకదా, పడిపోతావు ... అంటున్న, నా మాటలు వినిపించుకోకుండా,
నాకు మ్యాజిక్ లైట్ కావాలమ్మమ్మా ...
మ్యాజిక్ లైట్ ??? అదేమిటి? అదెక్కడ ఉంటుంది? నా ప్రశ్న వింటూనే...  

రా, చూపిస్తా... నా చేతిని లాగుతూ హాల్ లోనికి తీసుకు వచ్చి అల్లావుద్దీన్ అద్భుతదీపం ఫోటో చూపించి ఆ మ్యాజిక్ లైట్ కావాలని మారాం చేస్తుంటే, అసలు ఆ మ్యాజిక్ లైట్ ఎందుకమ్మా? అని అడుగుతుండగానే, తమ్మూస్ కు స్పైడర్ మాన్, సూపర్ మాన్, చోటాభీమ్,కారు బొమ్మలు, నాకేమో బుక్స్, క్రేయాన్స్, బార్బీ, సింద్రిల్లా బొమ్మలు బోలెడన్ని అడగాలమ్మమ్మా... అప్పుడు ఆ లైట్ లోని భూతం వచ్చి వెంటనే అన్నీ ఇస్తుంది కదా, తాతయ్య, నాన్న కొద్దిగానే కొంటారు కదా... ఆ మాటలు వింటూనే ప్రక్కనే వున్న నా సుపుత్రిక గట్టిగా నవ్వుతూ, మాన్వీ! భూతం లైట్ ఎందుకు, కల్పవృక్షమనే మ్యాజిక్ ట్రీ గాని, కామధేనువనే మ్యాజిక్ కౌ గాని అడుగు, భూతాలుండవందులో అని రెచ్చగొట్టింది. ఆపై మా అమ్మమ్మ మనుమరాల కబుర్లు ప్రక్కనపెడితే -

తన కోరికతో గుర్తుకొచ్చిన నా చిన్ననాటి ఓ జ్ఞాపకంకు వస్తాను -
నేను చదువుకునే రోజుల్లో - రమణి, ఇందిర, రాణి, మరికొందరు మిత్రులం తరుచుగా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మాలో రమణి కాస్త పెద్ద. తను బాగా మాట్లాడేది, మంచి మంచి కబుర్లు , కధలు చెప్పేది. ఒకసారి నిర్మల అనే అమ్మాయి 'అల్లావుద్దీన్ దగ్గరున్న అద్భుతదీపం నా దగ్గరుంటే ఎంత బాగుండునో' అని అంది. ఎందుకని అడగగా, మా అమ్మను రెండురోజులుగా అరిసెలు తినాలనిపిస్తుంది, చేయమ్మా అంటే, పెద్ద పండుగ వస్తుంది కదా, అమ్మమ్మ చేసి పంపుతుందిలే అంటుంది, అదే అద్భుతదీపముంటే ఎంచక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అరిసెలు, జీళ్ళు, చక్కిలాలు తినవచ్చు కదా... తన మాటలకు అందరం నవ్వుకున్నాం. అప్పుడే రమణి ఏది కోరుకుంటే అది ఇచ్చే కల్పవృక్షం గురించి చెప్తూ, కల్పవృక్షం పూర్వం ఉండేదని, ఓసారి ఒకతను అడవి మార్గంలో పయనిస్తూ, ఓ చెట్టు నీడన కాసేపు సేద దీరుదామని ఓ చెట్టు చెంతన ఆగి, 'అబ్బా, ఇక్కడ ఎంత చల్లగా వుంది, తినడానికి ఏమైనా ఉంటే బాగుండును అని అనుకోగానే ఫలాదులు ప్రత్యక్షం ..... తిన్నాక కాస్త విశ్రమించాలనిలించిన వెంటనే చక్కటి పాన్పు ప్రత్యక్షం ..... ఆ పాన్పు పై కూర్చుంటూ, ఇదేదో మాయచెట్టులా వుంది, కొంపదీసి ఇప్పుడు భూతమేదో వచ్చి నన్ను మింగేస్తుందేమో .... అనుకునేంతలో భూతం ప్రత్యక్షమై మింగేసిందట. ఇదంతా తన యోగదృష్టితో చూసిన ఓ యోగి, ఆ చెట్టు చెంతకు వచ్చి , ఓ కల్పవృక్షమా! నీకు నమస్కారం, నీవు ఇక్కడ నుండి మాయమైపోవడం మంచిద'ని తలవగానే మాయమైపోయిందని చెప్పింది. 
ఆ తర్వాత కొంతకాలానికి మహర్షుల దగ్గర కల్ప వృక్షం, కామధేనవలుండేవని చదివాను. అటుపై మా తాతయ్యగారి వద్ద పుస్తక పఠనం, తాతయ్య చెప్పేకధలు, కబుర్లు ... (అప్పుడే లేశమాత్రంగా ఆధ్యాత్మిక అవగాహన అలవడింది) ఓసారి తాతయ్యగార్ని అడిగాను, కల్పవృక్షం, కామధేనువులు ఇప్పుడు ఎక్కడున్నాయని. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ... ఇత్యాదులు భూలోకంలో ఉండవు తల్లీ అన్నారు.  
మరి అవి ఉన్నట్లు మన పురాణ ఇతిహాసాలలో చదివాము కదా. మన పురాణాలలో ఉన్నటువాటికీ అంటే రామాయణాది ఘట్టాలకు చారిత్రాత్మిక ప్రదేశాలుకు ఆధారాలున్నాయి కదా. మరి అవి ఉన్నప్పుడు ఇవి ఎక్కడకు మాయమాయ్యాయి?   ప్రశ్నకు -
ఓ... అవి ఎవరి దగ్గర ఉన్నట్లు చదివావని అడిగారు.  వసిష్ఠుడు, జమదగ్ని, కపిల మహర్షి మొదలగు వారిదగ్గర ఉన్నట్లు చదివానని బదులిచ్చాను. ఆ...అలాగా, వారు ఎవరమ్మా? ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్ధం చేసుకో తల్లీ... నీవు పైన చెప్పిన వారంతా తమ తపస్సిద్ధి మహిమా విశేషమున మహా సిద్ధత్వం పొందిన మహర్షులు. వారంతా సిద్ధపురుషులు. వారి వారి సిద్ధత్వస్థితికి వారి వారి ఆశ్రమమునందు అవి సాకారమై నిలిచాయి. అవి వాళ్ళతోనో అంతరార్ధమాయ్యాయని గ్రహించాలి. 
తల్లీ!  ఈ మూడింటిని ఒక గోవు గానో, చెట్టుగానో, మణిగానో పరిగణించక, అవి దివ్యశక్తులని, అవి ఎలా ప్రాప్తిస్తాయో పరిశీలిస్తే బాగుంటుంది.
ముందో విషయం చెప్పు, ఇవి ఎక్కడ నుండి జనించాయి? 

క్షీరసాగర మధనం జరిగినప్పుడు అందులోనుండే ఉద్భవించాయి కదా... ముందు క్షీరసాగర మధనం అంతరార్ధం గ్రహిస్తే, ఇది సులభంగానే అర్ధమౌతుంది. క్షీరసాగరమధనం యొక్క అంతరార్ధం గురించి గతంలో ఓ టపా పెట్టాను కాబట్టి, దాని గురించి ఇక్కడ మరల ప్రస్తావించను. [ఆ టపా లింక్ ను ఇక్కడ చూడగలరు.] 
ఆధ్యాత్మిక సాధన యందు పురోగమించుతున్నప్పుడు ఎన్నో సిద్దులు ప్రాప్తమౌతాయి. అలా ప్రాప్తించినవే కల్పతరువు, కామధేనువులాంటివి. 

సాధకుడు ఆత్మవిచారణ చేయుచు, యోగధ్యానాదులచే ఆధ్యాత్మికోన్నతి చెందుతున్నప్పుడు, మొదట మనో మలినాది విషయవాసనలు నశించిన పిమ్మట సంకల్పసిద్ధి కలుగుట ప్రారంభమగును. ఈ సంకల్పసిద్ధిచే యోగనిష్ఠుని యొక్కక్క కోరిక ఫలవంతమగును. ఈ సంకల్పసిద్ధి పేరే కామధేనువు. అలానే, కొంతకాలమునకు యోగి జితేంద్రియుడగును. సంకల్పములు నశించును. నిస్సంకల్పస్థితి కల్గును. ఆ స్థితి పొందినవారి సమక్షమున ఏది చేయ సంకల్పించిన అది సిద్ది కల్గును. ఇదే కల్పవృక్ష సిద్ధత్వం. 
అంటే ఆధ్యాత్మిక తపమునందు -
ఎవరు జితకాములగుదురో అంటే కామ రహితులగుదురో అప్పుడు వారికి కామధేనుత్వ సిద్ధియును, 
ఎవరికి నిర్వికల్పస్థితి అనగా సంకల్పములు నశించునో (సర్వ ప్రకృతి సంకల్పములను జయించింతురో) అప్పుడు వారికి కల్పవృక్ష సిద్ధియును, 
ఎవరు పూర్ణంగా నిశ్చింతుడగునో అప్పుడు వారికి చింతామణిత్వ సిద్ధియును కలుగునని శ్రీ మలయాళ  సద్గురువు లాంటివారు తెలిపారు తల్లీ ... అని చెప్తూ, ఇలా అన్నారు -
సాగరమధనం జరుగుతుండగా కామధేనువు, కల్పవృక్షములు మొదలగునవి ఉద్భవించినను అమృతం దొరికేంతవరకు ఎలాగైతే క్షీరసాగర మధనం చేశారో, అలాగే ఆధ్యాత్మిక సాధకులు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ, మధ్యలో ఎన్ని అద్భుత దివ్యసిద్ధులు సిద్ధించిన, వాటియందు ఆపేక్ష ఏర్పరచుకోకుండా, అమృతత్వమనే ముక్తిత్వం లభించేంతవరకు సాధన నుండి సడలిపోరాదు. ఇంతటి స్థితికి చేరిన మహర్షుల చెంతే ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణులుంటాయని చెప్పగా, ఇదంతా వింటున్నవారిలో ఒకరు, ఏమిటో బాబయ్యా, అర్ధమయ్యి అర్ధంకానట్లు వుంది, ఇలాంటిసాధన సామాన్యులకు కష్టమే. మరి మాబోటి సామాన్యులకు గతేమిటని అడగగా, మనలాంటి సామాన్యులకు దృఢమైన భక్తి ఆ సర్వేశ్వరుని పట్ల ఉంటే చాలు, ఆయనే మనకు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. ఇది నేను చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మే గీత యందు ఇలా చెప్పారు - 
యో యో యాం యాం తనుం భక్తశ్రద్ధయార్చితుమిచ్ఛతి
తస్య తస్యాచలాం శ్రద్దాం తామేవ విదధామ్యహామ్
స తయా శ్రద్ధాయ యుక్తః తస్యారాధన మీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్హి తాన్

సకామభక్తుడు ఏయే దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయా దేవతలయందే స్థిరభక్తి కుదురుకొనునట్లు , అలాగే ఆయా దేవతల ద్వారా నా అనుగ్రహముచే ఆయా భక్తుల అభీష్ట కామములను తీర్చగలను. 
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీ ... ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అను చతుర్విధ భక్తులకు ఆ పరమాత్ముడే కల్పవృక్షం.  

అటులనే, శివానందలహరి లో శ్రీ శంకరులవారు చెప్పారిలా -
ఆమ్నాయాంబుధి మాదరేణ సుమనస్సంఘా స్సముధ్యన్మనో 
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తత: 
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం 
నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే 

దేవతలు మందరగిరిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మధించి కల్పవృక్ష, చింతామణి, అమృతములను సంపాదించినట్లుగా విజ్ఞులు తమ మంచి మనస్సులను కవ్వంగా చేసి, దృఢభక్తి యనే త్రాడుకట్టి, వేదాలనే మహాసాగరాన్ని మధించి దానినుండి భక్తులకు కల్పవృక్ష కామధేను చింతామణి వంటి వాడును, నిత్యానందామృత మూర్తియు, మోహాలక్ష్మీ స్వరూపుడును యైన ఉమా సమేతుడగు సదాశివదేవుని పొందుచున్నారు.
మనం కూడా అలా దృఢభక్తిని ఏర్పరచుకొని ఆ పరమాత్ముని పాదములను పట్టుకుంటే ఆయనే మనకన్నీనూ... అని చెప్పారు మా తాతయ్యగారు. 
తన మ్యాజిక్ లైట్ కావాలనే కోరికతో, ఆనాటి ఈ నా మధుర జ్ఞాపకంను మననం చేసుకునేటట్లు చేసిన శ్రీమాన్వికి శుభాశిస్సులు. ఈ వివరణ అర్ధం చేసుకునే వయస్సు కాదు నా మనుమరాలిది. నా చిట్టితల్లి శ్రీమాన్వి పెద్దయ్యాక చెపుదామంటే ... అప్పుడు చెప్పేశక్తి నాకుంటుందో.... ఉండదో.... ఏమో... అందుకే ఇలా స్మరణ లో పదిలపరుస్తున్నాను. పెద్దయ్యాక చదివి తెలుసుకుంటుందన్న ఆశ.  

2 కామెంట్‌లు: