28, అక్టోబర్ 2020, బుధవారం

కాల విశిష్టత

                                                     



మహిమాన్వితమైన కాల మహాత్మ్యం -
సహస్ర నేత్రాలతో భూమిపై జరిగే సమస్త కర్మలకు ప్రత్యక్ష సాక్షి కాలం.     
కాలం సమస్త జీవకోటి జీవన గతిగమనాలను నిర్దేశించే మహేంద్రజాలం.   

                                                           


కాలో అశ్వోవహతి సప్త రశ్మిః సహస్రాక్షో అజరో భూరి రేతాః | 
తమా రోహంతి కవయో విపశ్చి తస్తస్య చక్రాభువనాని విశ్వా | |( అధర్వణవేదం)
కాలమనే అశ్వము ఏడు పగ్గములతో తనను తాను నియమించుకొనుచూ ప్రపంచమును మోయుచున్నది. ఈ కాలమునకు వేల వేల కన్నులు. ముదిమి లేని ఈ కాల ప్రభావము, బలము చాలా గొప్పవి. ఈ అశ్వమును పరమాత్మను సాక్షాత్కరించుకొనువారు, పరమాత్మ స్వరూపమును బోధించువారు అధిరోహించెదరు.   

స ఇమా విశ్వా భువనాని అంచ్యత్‌
కాలస్య ఈ యతే ప్రధమోనుదేవ:
సఏవ సంభువాన్యా నా భారత్‌
సఏవ సంభువానాని పరైత్‌
పితాసన్నభవత్‌ పుత్ర ఏషాం
తస్మాద్వై నాన్యత్‌ పరమస్తు తేజ: 

అనంత భువనములను ఏర్పరిచింది, అనంతకోటి బ్రహ్మాండాల్లో నిండియున్నది, అన్నింటా తానుండి నడిపించింది, చరాచరాలు అన్నింటా ఉన్నది కాలపురుషుడే. 

మహాభారత సంగ్రామ రంగంలో శరతల్పగతుడైన భీష్మాచార్యులవారు పాండవులతో, 
నాయనలారా! శ్రీకృష్ణపరమాత్ముడు, మీ జీవితాలకు సారధ్యం వహిస్తున్నా, మీరు కష్టాల పాలై, బాధలు పడ్డారు కదా అని అంటూ...ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ పడిపోతూ ఉన్నట్లు (వాయువశంబులై యెగసి వారిధరంబులు ...) ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తమూ కాలచక్రం వల్ల కూడుతూ, వీడుతూ ఉంటుంది. కాలమే అన్నింటికీ మూలం. కాలం విచిత్రమైనది ఎంతటివారైన సరే ఈ కాలప్రవాహాన్ని దాటలేరని ఓదార్చారు. 

కాలం ఒకేలా ఉండదు. మనకు ప్రాప్తించిన కష్టసుఖాలు, వియోగ విలాపాలు, సిరి సంపదలు  మన ప్రారబ్ధ ఫలితాలే. కాల నియమానికి ఎవరమూ అతీతులు కాము.  విశ్వంలోని ప్రతిజీవి కాలాధీనమై  వర్తించాల్సిందే. సుఖ దుఃఖాలైన, మంచి చెడులైన, కాలంతోనే వస్తుంటాయి... పోతుంటాయి. మన మనస్సును మురిపించే బంధాలు, ప్రేమాభిమానాలు, ఆస్తులు, హోదాలు... సమయానుకూలంగా కాలం వాటిని మనకు ప్రారబ్ధ ప్రాతిపదికన సమకూర్చి, గడువు తీరగానే తనలో లయం చేసుకోవడం అందరూ నెఱిగిందే.  దీనిబట్టి కాలగమనంలో కష్టసుఖాలు సహజమేనని గుర్తించి, స్థిమితంగా జీవనగమనం సాగించడం ఉత్తమం.  "బహు విఘ్నః సురాః కాలః కాలః కాలం నయిష్యతి:" కాల గమనంలో ఎన్ని విఘ్నాలైనా రావచ్చు, కానీ, కాలానికి కాలమే ఏదో పరిష్కారం చూపుతుంది.     

                             
                                                     
కాలం పరమేశ్వర స్వరూపం. కనుక అఖండమైనది. విభజించడానికి అవకాశం లేనిది. కానీ; కార్య స్వరూపం చేత క్షణములు, ఘటికలు, దినములు, పక్షములు, మాసములు...మొదలగు భేదాలు కల్పించారు. 
                                                     


ఒక్క క్షణం ఆగండి...చిటికెలో చేసేస్తా.
కనురెప్పపాటులో జరిగిపోయింది. 
లిప్తపాటైన ఏమరుపాటు వద్దు. 
ఇలా విభజన చేయలేని అతి చిన్న సమయాన్ని కూడా మాటల్లో సూచిస్తుంటాం. 

కాలాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా విభజించినా, వర్తమానం చాలా చిన్నది. అది కేవలం క్షణకాలమే వుంటుంది. భూతకాలం చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోగలిగినంత. భవిష్యత్తు మరి ఎక్కువ. ఊహించగలిగినంత. భూత భవిష్యత్తుల కాలంలో కాకుండా వర్తమానంలో అనుక్షణం ఉండగలగడం ఓ అద్భుత జీవనసరళి. 




మనం ప్రతీ క్షణముని ఎలా వినియోగంచుకుంటామన్నది ముఖ్యం. వినియోగించుకోని క్షణం తిరిగిరానిది, వృధాగా గడిచిపోయినది. సకల సృష్టికి సమయం ఒకటే. కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్లమందిని పాలించే ప్రభువైన గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. కాలాన్ని వృధా చేయడమంటే మనల్ని మనం దోపిడి చేసుకోవడమే అవుతుంది. ఏ క్షణంకా క్షణం వినియోగించుకుంటేనే ఆ క్షణం జీవించునట్లు. లేకపోతే పొగొట్టుకున్నట్లే. 

                                                      


మన జీవితమంతా మన ఆలోచనల పర్యవసానమే. మన ఆలోచనలే మనల్ని రూపొందిస్తున్నాయి. ఆలోచన అంటే మనస్సు లోపల నిశ్శబ్ధంగా జరిగే మాటల ఆట. 
చాలావరకు ఎన్నో క్షణాలను ఏవేవో ఆలోచనల నడుమ పరధ్యానంగా గడిపేస్తాం. మనిషి సంపూర్ణంగా జీవించాలంటే ముందుగా పరధ్యానం పొగొట్టుకోవాలి. ధ్యానంలోనికి రావాలి. పూర్తిగా ఎఱుకలోనికి వచ్చి, జీవితాన్ని సంపూర్ణంగా జీవించే విధానమే పరధ్యానం లేని ధ్యానం. ఆ క్షణంలో చేస్తున్న పనియందే  శ్రద్ధగా, నిలకడగా ద్యాస పెట్టడమే ధ్యానం. వర్తమానంలో ఎఱుకతో అన్ని పనులు చక్కబెట్టడమే జీవించమంటే. 

                                                          


కానీ, సాధారణంగా మనలో చాలామంది -  ఎప్పుడూ చేసే పనులే కదా, అలవాటైన ఆ పనులు అలవోకగా అయిపోతుంటాయి. ఈ పనులు గురించి ఆలోచనలు అవసరం లేదని అనుకుంటాం. అయితే ఇక్కడే పొరపాటు చేస్తుంటాం. అలవాటైన పనులే కదా  అని, ఆ పనిని యాంత్రికంగా నిర్వహించడాన్ని శరీరానికి వదిలేసి,  ఆ క్షణంలో ఆ పని గురించి కాక, వేరే ఆలోచనలలోనికి అలవోకగా  జారుకుంటాం.  చేస్తున్న పనికి ఏ సంబంధం లేని, సమయానికి వర్తించనిది అయిన మరేదో విషయంలోకి వెళ్ళటం... అంటే భూత భవిష్యత్తు లోనికి పయనించటం.  వర్తమానంలో చరించక భూత భవిష్యత్తు లోనికి చరించే వెసలుబాటు మన మనస్సులకు ఇస్తుంది మనమే. ఆ అలవాటు చేస్తుంది మనమే.

                                                                 


అన్ని పనుల్లో, అంత ఆలోచించాల్సిన అవసరం లేదన్నది నిజమే గానీ, ఇక్కడ ఇతరత్రా ఆలోచించడం అవసరమా? ఇతర ఆలోచనలు ముఖ్యం కాదు, గమనించటం ముఖ్యం. చేస్తున్న దానిని గమనించటమనే పనిలో, ఏకాగ్రత పెట్టడం వలన, మనస్సు అనవసర విషయాల్లోనికి పోకుండా వుంటుంది. మనస్సు ఎన్నోసార్లు చేస్తున్న పనినుంచి ప్రక్కకు తప్పుకుంటూ ఉండవచ్చు... తిరిగి వెనక్కి తీసుకొని రావచ్చు. ఇలా ఎన్నిసార్లు జరుగుతుందని లెక్కలు వేసుకోవడం సాధన కాదు, పోయిన క్షణాలు ఎలాను పోయాయి, వాటి గురించి ఆలోచించి, బాధపడి మరిన్ని క్షణాలు పోగొట్టుకోకూడదు. ఇంతసేపు ఇలా జరిగిందని బాధపడడం కంటే, ఎప్పుడైతే మనస్సు ప్రక్కకు వెళ్ళిందని గ్రహింపుకొస్తుందో, ఆ క్షణంలో వర్తమానం లోనికి వచ్చి మనస్సుని అక్కడే నిలుపుకోవాలి. ఈ విధమైన అభ్యాసంకు  సమయం పడుతుంది. కానీ, ఇది మనస్సును ఏకాగ్ర మొనర్చటానికి శక్తివంతమైన సాధన. ఇది శ్రేయోదాయకమైన సాధన. కాలం విలువ గుర్తించి, ఎవరిని వారు గమనించుకుంటూ జీవితం గడపటం వలన, ప్రతీ పనిలోనూ ఆనందం తృప్తి కలుగుతుంది. ఎంత సమర్ధవంతంగా పని చేయగలుగుతున్నామో ఎవరికి వారు ప్రత్యక్షానుభవముతో తెలుసుకోవచ్చు. 



అలాగని గతాన్ని వదిలేయాలా? భవిష్యత్తుకై ఆలోచించకూడదా ... అంటే - 
ఇప్పుడు చేస్తున్న పనికి గతానుభవం అవసరమైతే, దాన్ని తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకొని ఇప్పటిపనిని మరింత చక్కగా చేయవచ్చు.  
అలానే భవిష్యత్తు -   భవిష్యత్తులోని ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చేయాల్సిన పనులకోసం ఆయా ప్రణాళికలను దృష్టిలో పెట్టుకోవడం కూడా అవసరమే.
రేపటి పలహారానికి (ఇడ్లి, అట్లు లాంటివి) ఈరోజే పప్పు నానబెట్టాలి. తినటం రేపటి పని. పప్పు నానబోయడం ఈరోజు పని. అంతేగానీ,  రేపటి పలహారపు రుచిని, తినడాన్ని ఇప్పటినుండే ఊహించుకొని ఆ ఊహల్లో ఉండడం సరికాదు. ఎవరికైతే ఉన్నత లక్ష్యం ఉంటుందో వారు దానికై ఊహించుకుంటూ వర్తమానంను ఆలోచనలతో గడిపేస్తే ఫలితముండదు.  
భవిష్యత్తులోకి అవసరమైన దానిని అమర్చుకోవడం ప్రస్తుత కర్తవ్యమే గానీ, నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. ఊహాలతో విజయాలు రావు. కాలానుగుణ కార్యాచరణ చేస్తూ, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. ఆదౌ కాలం పరిక్ష్యేత్, తతః కర్మాణి కారయేత్ ... 
కాలాన్ని అనుసరించి కర్మలు చేయాలి. కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ కర్తవ్య నిర్వహణ కావించేవారే విజ్ఞులు. 

                                                   


గతానుభవాలు చేదువని, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ప్రస్తుత క్షణాలను చేజార్చుకోవడం తగదు. మంచి క్షణం కోసం ఎదురుచూసేకంటే, ఉన్న క్షణాన్నే మంచిగా మలుచుకోవడం విజ్ఞుల లక్షణం. సమయాన్ని దేనికి ఎప్పుడు ఎలా కేటాయించాలో అప్పుడు అలా పద్దతి ప్రకారం కేటాయిస్తేనే సత్ఫలితాలు అందుతాయి. సమయాన్ని సద్వినియోగపర్చుకోవడం ఓ  చక్కటి కళ.







19 కామెంట్‌లు:

  1. ఈ పోస్ట్ యువతకు స్ఫూర్తిదాయకం. బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. మన మధ్య భాషణే ఈ టపాకు ప్రేరణ రుక్మిణిజీ.
      మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      తొలగించండి
  3. అద్భుతం. ఏ మార్పు తెచ్చినా కాలమే తేవాలి. అంతా కాలంతోదే.అన్నీ కాలంలోవే.తెలిసీ మాయలో పడిపోవడం పెనుమాయ,విష్ణుమాయ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారమండి. బాగున్నారా?

      నిజమేనండి...అన్నీ తెలిసి మాయలో పడిపోవడం
      పెనుమాయే.

      మీకు మనసార ధన్యవాదములు.

      తొలగించండి
  4. కాలః పచతి భూతాని
    కాలం సం హరతే ప్రజాః
    కాలః సుప్తేషు జాగ్రర్తి
    కాలోహి దురతిక్రమః

    చక్కటి వివరణ భారతిగారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు పద్మగారు

      తొలగించండి
    2. అన్నీ తెలిసి... రెండు పాటలు గుర్తు వచ్చాయి. వస్తామొట్టిదె, పోతామొట్టిదె,, ఆదిశంకరాచార్య మూవీలో తెలిసిపోయింది అన్న పాటలు.. నిజంగా మనకి ఏమైనా తెలుసా? వివరించగలరు..

      తొలగించండి
    3. రుక్మిణిజీ,

      సుందరకాండలో సీతమ్మ కష్టాన్ని చూసిన ఆంజనేయుడు అనుకుంటాడిలా - కాల ప్రభావం దాటరానిది కదా ('...యది సీతాపి దుఃఖార్తా, కాలోహి దురతిక్రమః').

      జన్మించడం, మరణిచడం తప్పుకోలేం...మధ్యకాలాన్ని అనుభవించడం తప్ప. అయిపొయిన జీవితం (గతం) ఓ స్వప్నం. రాబోయే జీవితం (భవిష్యత్) ఓ ఆకాంక్ష. ఈ కల, ఆ కోరిక మోస్తూ, వర్తమానమును వినియోగించుకునే కంటే
      దుర్వినియోగపరుస్తున్నాం చాలావరకు.
      మనభావం, ప్రయత్నం - ఎలా వుంటే అలా, కాలం అనుగ్రహిస్తుంది.
      కాలం విశిష్టత తెలుసు...తెలిసీ జీవితకాలంలో సగం నిద్రకు, మిగిలిన సగంలో సగం పరధ్యానంతోనే గడిపేస్తున్నాం.
      కాలం విలువ తెలిసీ...
      దుర్వినియోగం చేసుకుంటున్నామెందుకనీ.....
      మాయ... మాయ...మాయా...

      జీవభావ సముచ్చయమంత చింత అని తెలిసినా...ఆ చింతకై చింతన చేస్తూ కాలయాపన చేయడం ఓ మాయ. అశాశ్వతమైనవి శాశ్వతమైనవిగా భ్రమిపజేసెదే మాయ. తెలిసీ... ఆ మాయలో మరల మరల పడిపోవడం మాయ కాదా? తెలిసి మాయలో పడడం పెనుమాయ.

      మీకు జ్ఞప్తికి వచ్చిన రెండు గీతాలు జీవితత్త్వాన్ని సమగ్రంగా వివరించే పాటలు.

      తొలగించండి
    4. రుక్మిణిజీ ఎంత చక్కటి పాటలను ప్రస్తావించారో..... ��

      వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంటా
      చేసిన ధర్మము చెడని పదార్ధం చేరును మీ వెంటా!

      జనన మరణాలు అన్నీ వట్టివే. అశ్వాశతమైన ఈ జీవితంకై ఆశలెందుకని? మనం మరణించాక మన వెంట వచ్చేది మనం చేసిన ధర్మము మాత్రమే.

      మానవుల్ని ఉత్తమ సంస్కార రూపంలో ఉంచు గుణమే ధర్మం. శాస్త్రప్రామణికంగా సత్కార్మానుష్టానం చేయడమే ధర్మం.
      'ధర్మస్య తత్త్వం నిహితం గుహాయం' చీకటి గుహలో చిరుదీపం లాంటిది ధర్మం.

      ఆచారః పరమో ధర్మః
      సదాచరణమే పరమధర్మం.
      ఆచారహీనం న పునంతి వేదాః
      ఆచారహీనున్ని వేదాలు కూడా పవిత్రం చేయవు.

      ధర్మాన్ని ఆచరించాలంటే - ఏది ధర్మమో, ఏది కాదో గ్రహించే జ్ఞానముండాలి. అలాంటి జ్ఞానం మానవుని బుద్ధికి కొంత సహజంగా వున్నను, అది మాత్రమే చాలదు. యుగయుగానికి ధర్మం మారిపోతుంది. ఒకరికి ధర్మంగా తోచినది, మరొకరికి అధర్మంగా గోచరిస్తుంది కాబట్టి, అల్పజ్ఞుడైన మానవుడు తన బుద్ధితో నిర్ణయించవలసినవి కావీ ధర్మాధర్మాలు.

      ఆశాశ్వతమైన జీవితంలో శాశ్వతమై నిలిచి, మరణించిన పిదప కూడా వెంట వుండి రక్షించేది ధర్మం మాత్రమే.
      ధర్మ విశిష్టతను స్పష్టంగా తెలిపే తత్త్వగీతమిది.

      తొలగించండి
  5. ఈ జగత్తు అంతా భ్రమేనని, పుట్టుట గిట్టుట నడుమ, సాగే గమనమంతా బొమ్మలాట లాంటిదనే సత్యాన్ని తెలుపుతూ -


    భ్రమ అని తెలుసు
    బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు
    కధ అని తెలుసు
    కధలన్నీ కంచికే చేరునని తెలుసు...

    చిన్నప్పుడు మా తాతయ్యగారు కధ చెప్పేక - 'కధ కంచికి,
    మనం ఇంటికి' అనేవారు. అప్పుడు దాని పరమార్ధం నాకు తెలియదు. కాలక్రమేణ కొందరు తాత్త్వికులు ఆ మాటలకు చేసిన విశ్లేషణ తెలిసి, మన పెద్దలు ఎంత చక్కగా మనకు వేదాంతం తెలిపేవారో అర్ధమై, ఆశ్చర్యానందాలకు లోనయ్యాను.

    కధ - మన జీవన కధ.
    కంచి - జీవుడికి పునర్జన్మ అవసరం లేకుండా ముక్తిని చేకూర్చే మోక్షపురం కాంచీపురం.
    మనం - జీవులం
    ఇంటికి - జీవుల అసలు ఇల్లు పరమాత్మ నెలవు. జీవాత్మకు పరమాత్మయే పుట్టినిల్లు. కధ అంతా పూర్తయ్యాక అంటే జనన మరణాలు తప్పడమే కధ పూర్తవ్వడం. అప్పుడు మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ దరికి చేరుతుంది. జన్మలు కధలు లాంటివని, కధలు ముగిసాక ఆత్మ పరమాత్మలో ఐక్యమౌతుందని పెద్దలు సూక్షంగా ఆ మాటల్లో తెలిపేవారు.

    మరో వివరణ -
    తల్లి నవమాసాలు బిడ్డను తన పొట్టలో పోషిస్తున్నది - నాభి నాళం ద్వార. ఈ విధంగా పోషింపబడ్డ బిడ్డ బయటకొచ్చాక బొడ్డు కోస్తారు. అంతవరకు ఆ బిడ్డకు ఆధారం నాభినాళమే. ఆ నాభినాళం లేకుంటే జననం వుండదు. జననం లేకపొతే మరణం లేనట్లే.
    ఇక; ఆ జగన్మాత కామాక్షి అమ్మవారి నాభి కేంద్రం కాంచీపురంలో ఉంది. ఆ నాభికేంద్రంలో మనం పడిపోతే ఇక చావుపుట్టుకలుండవు. అందుకే కాంచీపురి- మోక్షపురి.
    ఇలా ప్రాపంచిక తల్లుల పొట్టలో పడి, నాభిబంధం ఏర్పరచుకోకుండా, ఇకనైనను నీ కధను ముగించుకొని, కంచికి చేరమని సూచిస్తూ...'కధ కంచికీ' అని చెప్తూ...అంతలోనే ప్రేగుబంధపు ప్రేమ మాయలో పడి, ప్రాపంచిక పాశంతో ... మనమందరం ఇక్కడే ఉండాలనే కోరికతో... 'మనం ఇంటికీ' అని అనేవారట.

    వేదం తెలుసు...
    తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
    శాస్త్రం తెలుసు...
    శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు
    ......................................
    అన్నీ తెలిసి అడుసులో పడి దొర్కుతుంటాం దేనికని
    మాయ మాయా మాయా
    ........................................
    అద్భుతమైన తత్త్వ గీతాలు. ధన్యవాదాలు రుక్మిణిజీ

    రిప్లయితొలగించండి
  6. నిజంగా మనకి ఏమైన తెలుసా...
    తెలుసు...తెలుసు కాబట్టే చక్కటి గీతాలను ప్రస్తావించారు. ఆధ్యాత్మిక తత్త్వకోవిదులు, ప్రవచనాకారులు, పెద్దలు ద్వారా కొన్ని తెలుసుకోగల్గుతున్నాం. పుస్తక పఠనం ద్వారా మరికొన్ని తెలుసుకోగలుగుతున్నాం. తెలిసీ...మాయలో పడి ఆచరణలో విఫలమౌతున్నాం. అయినా మాయ నుండి బయటపడే ప్రయత్నమును విడవవద్దు.

    రిప్లయితొలగించండి
  7. భారతిగారు,
    వివరణ బాగుంది.
    కాలం ఎవరికోసం ఆగదు, కాలంలో జరిగేవీ ఆగవు, ఎవరూ ఆపలేరు కూడా. కాని జనన మరణాల మధ్య కాలంలో సర్వమూ నాది నేను అనే ( నా సంపద, నా బార్య/భర్త, నా పిల్లలు, నా బంధువులు ఇలా నాది నావాళ్ళు అనే భావన)భావన విడలేకపోవడమే, ప్రతి నిమిషం అందులో కూరుకుపోవడమే అసలు మాయ. ఇది తెలిసీ తప్పించుకోలేకపోవడం పెనుమాయ. అదే విష్ణుమాయ.

    ఈ మాయను దాటడం సాధ్యమా? కాదనే చెప్పేరు. మరి మార్గం. ఈ అస్థిరమైన సంసారంలో( సంసారం అంటే ప్రపంచం, కుటుంబం అనికూడా చెప్పచ్చంటారు పెద్దలు)అసాధ్యం,విషయాలు పట్టుకుంటూనే ఉంటాయి. అందుకే తామరాకు మీద నీటి బొట్టులా జీవితం గడపమన్నది, కాని ఇదీ సాధ్యం కావటం లేదు.

    రిప్లయితొలగించండి
  8. అందరూ శాస్త్రప్రామణికం....శాస్త్రప్రామణికం....శాస్త్రం....శాస్త్రం అని అంటారే. అసలు ఈ శాస్త్రలు ఏమిటీ? ఎవరు రాసి ప్రవేశపెట్టారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఋషులు తమ ప్రజ్ఞతో, యోగదృష్టితో దర్శించిన "సత్యం" నిగమమై, నిగమం ఆగమమై, ఆగమం శబ్ధమై, శబ్ధం శృతియై, శృతి వేదమై, ఆ వేదమే ఇప్పుడు మనకు ప్రమాణభూతమైన శాస్త్రముగా నిలిచిందని పెద్దలు చెప్తుంటారు.

      ఇక, నిగమం ఆగమం అంటే ఏమిటో... శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వివరణ ఈ క్రింద లింక్ లో చూడండి.

      https://youtu.be/0d552Nx-TkA

      అలాగే శాస్త్రం అంటే ఏమిటో... శ్రీ చిన్న జియ్యారుస్వామివారు చెప్పిన వివరణ కూడా వినండి.

      https://youtu.be/p_kL3u4I9xU

      తొలగించండి
    2. వేదాలకు 1.శ్రుతి, 2.అనుశ్రవం, 3.త్రయి, 4.ఆమ్నాయం, 5.సమామ్నాయం, 6.ఛందం, 7.స్వాధ్యాయం, 8.ఆగమం, 9.నిగమం వంటి పర్యాయ పదాలు ఉన్నాయి.గురువు ఉఛ్చరించినదాన్ని విని అనుకరిస్తూ శిష్యుడు నేర్చుకుంటాడు కాబట్టి శృతి అనీ అనుశ్రవం అనీ అంటారు.ఉపనీతుడైన శిష్యుడు పారంపర్యగా వచ్చిన తన శాఖను గురుకులంలో ఉచ్చారనను విని వేదాన్ని వల్లె వేసే పద్ధతిని వేదాధ్యయనం అంటున్నారు.అధ్యయనం చేస్తే చాలు;దానివల్ల కూడా స్వాధ్యాయధ్యయన రూపమైన నిత్యవిధి నెరవేరినట్లేనని కొందరి భావన.ఇప్పటి సమాజంలో వీరి సంఖ్యయే ఎక్కువ.ఒక ఇబ్బంది ఏమిటంటే,ఒక శాఖను సంపూర్ణం ఇలా అధ్యయనం చేసేటప్పటికి కనీసం పది సంవత్సరాలు పడుతున్నది - అర్ధజ్ఞానం కోసం కూడా అని కూర్చుంటే ఒక జీవితకాలం కేవలం అధయ్యనంలో గడపాలి,సంపాదనా కుటుంబపోషణా ఎలా?అయితే, అర్ధజ్ఞానం లేని అధ్యయనం వల్ల అలౌకిక పురుషార్ధాన్ని సాధించడం కుదరదు కాబట్టి వేదానికి అర్ధం తెలుసుకుని తీరాలి!

      మంత్రం అంటే ఏమిటి అని పరిశీలిస్తే "విహితార్ధాభిదాయకః మంత్రః" అన్న నిర్వచనంలో "విధింపబడిన అర్ధాన్ని చెప్పేది" అని మాత్రమే వుండి విధిరూపమైన మంత్రాలకు సరిపోక అవ్యాప్తి అనే దోషం ఉన్నది.యాస్కుడు చెప్పిన "మంత్రా మననాత్" అన్న నిర్వచనంలో "మననం చెయ్యడానికి హేతువయ్యేది" అని మాత్రమే వుండి ఆ లక్షణం బ్రాహణాల్కు కూడా ఉండటం వల్ల అతివ్యాప్తి అనే దోషం ఉన్నది.అయితే, యజ్ఞయాగాది కర్మలు చేస్తూ వాటి స్వరూపాన్ని స్మరించడం కోసం యాజ్ఞికులు ఉచ్చరించే శబ్దాలను మంత్రాలు అన్న నిర్వచనం అన్ని విధాల సరిపోతుంది.

      తొలగించండి
    3. మీరిచ్చిన వివరణకు ధన్యవాదములండి.

      తొలగించండి