2, జులై 2025, బుధవారం

నా జీవితానికి ధన్యత చేకూర్చవా శివా🙏

సనాతన సాంప్రదాయంలో భాగంగా మన ఋషులు సమాజ శ్రేయస్సు, చైతన్యం కొరకు అనేక సూచనలు చేశారు. అందులో భాగంగా ఆలయాల ఆవశ్యకత, సాకారోపాసన, దైవ దర్శనం అనంతరం ఆలయ మండపంలో కూర్చొని, భగవంతుణ్ణి కాసేపు ధ్యానిస్తూ ఈ క్రింద శ్లోకాన్ని, లేదా వేరే మంత్రాల్ని లేదా నమ్మే నామాన్ని మననం చేసుకోమని చెప్పడం...ఇత్యాదివి మరి కొన్ని.

స్థల పరిశీలన, వాస్తుశాస్త్ర నిబద్ధత, నిష్ణాతుల పరివేక్షణ, అద్భుత శిల్పకళా నైపుణ్యతల నడుమ ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా నిర్మితమయ్యే దేవాలయాల గర్భగుడిలో, మంత్ర యంత్ర బీజాక్షరాల శక్తితో ప్రతిష్ట అయిన అర్చా మూర్తులు... నిత్య దీప ధూప మంత్ర సహిత ఆరాధనలు... అందుకే ఆలయం లోనికి అడుగుపెట్టగానే, మంద్రంగా వినిపించే భక్తి పాటలతో తనువు పులకిస్తుంది. గుడి గంటల సవ్వడితో సడి చేయక మనస్సు నెమ్మదిస్తుంది. సర్వాలంకృత అర్చా మూర్తిని చూడగానే చేతులు అప్రయత్నంగా నమస్కరిస్తాయి. శిరస్సు వంగుతుంది. వేద మంత్రోచ్ఛరణతో జరిగే అభిషేక అర్చనాదులతో, కర్పూర నీరాజనాలతో హృదయం లయిస్తుంది. మూల విరాట్ ను ప్రతిష్టించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలతో అంతరంగం పరవశిస్తుంది. ఇన్ని విధాల సానుకూల భావాలు సమీకృతమై భగవంతుని పట్ల భక్తిభావంతో ఏకాగ్రమై మనమున్న ఆ సమయంలో, దివ్య చైతన్యంతో బాసిల్లే ఆ ప్రాంగణంలో కూర్చొని, దర్శించిన అర్చామూర్తిని ధ్యానిస్తూ, నిర్మలమైన మనస్సుతో ఈ శ్లోకాన్ని చదవమని చెప్తుంటారు. 


 వేదన లేని మరణాన్ని, ఒకరిపై ఆధారపడని జీవితాన్ని, మరణ సమయంలో నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు పరమేశ్వరా...అని!

కొందరు ఇలా చదువుతారు -


వేదన లేని మరణం, ఒకరిపై ఆధారపడని జీవనం, నీ పట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు శంభో శంకరా...అని!

అనాయాసేన మరణం
నాకు నొప్పి, బాధ  లేని, మరణాన్ని ప్రసాదించు.

{ఓ పరమేశ్వరా! తనువు రోగగ్రస్తమై మంచాన పడి యాతనపడుతూ ఇతరులకు భారంగా మారేక, వచ్చే మరణం కాకుండా, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ పండు తొడిమ నుండి సునాయాసంగా విడివడినట్లు సునాయాస మరణం ప్రసాదించు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు నిష్క్రమించాల్సిందే. ఆ క్షణం బాధతో కూడిన క్షణంగా ఉండకూడదు, కృతజ్ఞతతో భగవంతుణ్ణి తలచుకుంటూ చిరునవ్వుతో సంతృప్తిగా కనులు మూయాలి. ఆ స్థితికి రావడానికి కావలసిన సన్నాహం మొదట నుండి చేసుకోవాలని సాధకులు చెప్తుంటారు}

వినా దైన్యేన జీవనం
ఎవరి మీదా ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు.
{ఇలాంటి జీవితాన్ని కోరుకోవడం తప్పు కాదు గానీ, విలాసాల కోసం ఆశిస్తూ కోరుకుంటే అది దురాశే. ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు ఇది తగదు. ఏది కోరుకోవాలో, ఏ కోరిక విడవాలో అన్న వివేకం ఉండాలి}

దేహాంతే తవ సాన్నిధ్యం
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

{దీనికంటే రెండవ శ్లోకంలో చెప్పినట్లుగా ముందు త్వయి భక్తిమచంచలం (అచంచలమైన భక్తినిప్రసాదించమని) కోరుకోవడం ఉత్తమం. ఎందుకంటే అచంచలమైన భక్తి లేనిదే మరణ సమయంలో భగవంతుని స్పురణ కలగదు}

దేహిమే పరమేశ్వరా!
ఓ పరమేశ్వరా! నాకు ఈ మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. 

మామూలుగా చూస్తే, ఇది సాధారణభక్తితో కూడిన ప్రార్థనా శ్లోకం. కానీ, ఆధ్యాత్మిక అన్వేషకులు భగవంతునిపై భక్తి ప్రేమ విశ్వాసం కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం కాదని, దీనిలో మార్మికతను శోధించి సాధన చేయమంటారు. గుడిలో కాసేపు కూర్చొని ఈ శ్లోకం వల్లెవేస్తే పరమేశ్వరుడు ఈ మూడు కోరికలు తీర్చేస్తాడు అని అనుకంటే, అది పొరపాటే. 

జీవిత పరమార్థం కోసం కోరే మూడు ముఖ్యమైనవాటిని పొంది తరించాలంటే మనం ముందు శ్లోకం అంతరార్థం అర్ధం చేసుకొని, తదానుగుణంగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు మాత్రమే పరిపూర్ణ ఫలితాన్నిస్తాయి.

ఇక్కడ రెండు సందేహాలు వస్తాయి మొదటిది - ఈ శ్లోకం తెలియని వారు, రానివారు ఉంటారు కదా...వారిని పరమేశ్వరుడు అనుగ్రహించడా? 
రెండవది - అన్నింటికీ అర్థం తెలుసుకొని చేయలేం కదా... మరి అర్ధం తెలియకుండా మననం చేసుకుంటే ఫలితం ఉండదా? అని.
మొదట సందేహంకు పెద్దవారు ఇలా సమాధానం చెప్పారు - 

భగవంతునికి మంత్రాలు కాదు మన మనస్సు కావాలి. మన భావం కావాలి. ఆ భావం శ్లోకాలలోనో మంత్రాల్లోనే వ్యక్తం చేయనవసరం లేదు. మన భాషలో మన మాటల్లో వ్యక్తపరచవచ్చు. ప్రార్ధించవచ్చు.

"యే యథా మాం ప్రపద్యంతే తాంసదైవ భజామ్యహమ్..." ఎవరు ఎలా భావించి సేవిస్తారో వారిని నేను అలా అనుగ్రహిస్తాను అన్న కృష్ణ పరమాత్మ మాటలయందు విశ్వాసం ఉంచి, నిర్మల మనస్సుతో ఆ భగవంతునితో మాట్లాడవచ్చు. ఆ మాటలే నిజమైన ప్రార్థన.

రెండవ దానికి కూడా సమాధానం చెప్పారిలా - 
నీటిలో తెలిసి పడినా, తెలియక పడినా తడిసిపోతాం. అలానే, దేవుణ్ణి తెలిసి తలచినా, తెలియక తలచినా తప్పక అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాకపోతే,  సునాయాస మరణం, తిండికి బట్టకి ఇంటికి ఎవరిపై ఆధారపడని సౌకర్యవంతమైన జీవితం... ప్రాప్తించవచ్చు గానీ, దేహాంతే తవ సాన్నిధ్యం... మృత్యువు సమీపించినప్పుడు భగవంతుడినే స్మరించుకోవడం, దర్శించుకోవడం జరగాలంటే, ఎంతో సాధన కావాలి. 

మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. తెలిసినా అంతవరకు జీవించిన కాలంలో స్మరణలో లేనిది ఆ క్షణంలో స్ఫురణకు ఎలా వస్తుంది? మరణం వచ్చే సమయానికి మన మతి గతి స్థితి లకు భగవంతుడు స్పురించాలంటే నిరంతరం భగవత్ ధ్యానంలో ఉండాలి. అందుకు ఎంతో సాధన అవసరం. 

మనమెన్ని సాధనలు చేసినా, మనసులో గూడు కట్టుకుని ఉన్న దుర్గుణాలు వదిలించుకోకపోతే, సాధనంతా వృథాయే. రావణుడు గొప్ప సాధకుడు. తన తపస్సు చేత బ్రహ్మ, శివుని సహితం మెప్పించి గొప్ప వరాలు పొందినాడు. ప్రతి దినం సూర్యోదయం కాక మునుపే, కోటి శివలింగాలకు అభిషేకం చేసిన గొప్ప భక్తుడు. అంత సాధకుడు అయిననూ, తనలో ఉండిన అసుర గుణాలు వదులుకోలేక నాశనం అయిపోయాడు. సాధన చేశాం అంటే దుర్గుణాలు వదిలి పోవాలి. అంతే తప్ప, ఏదో చేసాం, ఎన్నోసార్లు మంత్రాలు వల్లె వేశాం చాలు, అనుకుంటే సరిపోదు. అందుకే పెద్దలు ఇలా చెప్తుంటారు - దేహి దైవాన్ని నిత్యం దర్శించాలి, స్పృశించాలి, సేవించాలి, సంభాషించాలి, తన వేదనను రోదనను వాదనను ఆర్తిని అర్ద్రతను స్వామి ముందుంచాలి, సహాయం కోరాలి, ఆశలను తిరస్కరించాలి, ప్రాప్తించిన వాటిని స్వీకరించాలి, సమాధాన పడాలి, అహంకారం వీడాలి, సాష్టాంగపడి శరణాగతి కావాలి, సద్గుణాలు అలవడాలి, సంస్కారం పరిమళించాలి, ఓంకారంతో నమస్కారం సమన్వయపడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితంగా పలకరించాలి, చేతలు పరహితం కావాలి, మన స్వార్థం మరొకరికి అపకారం కారాదు, ఉపచారాలు ఉపకారాలు అలవడాలి, సాత్త్వికతతో ఉద్వేగాలు ఉద్రేకాలు అంతరింపజేయాలి... అప్పుడే భక్తి భావన ప్రేమతత్వంగా రూపుదిద్దుకుంటుంది. మనసంతా భగవన్మయం అవుతుంది. 

అప్పుడే సాధనకు సార్థకత చేకూరుతుంది. ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుంది. జన్మ పరమార్థం సార్థకమవుతుంది. అన్నివేళలా అంతటా భగవంతుడు స్ఫురిస్తాడు,గోచరిస్తాడు. 

ఇంత సాధన చేస్తేనే, "దేహాంతే తవ సాన్నిధ్యం" అనే కోరిక తీరుతుంది.

పై రెండు వీడియోస్ వాట్సప్ సేకరణ. రూపకర్తకు 🙏
 

3 కామెంట్‌లు:

  1. భారతి గారు.. చాలా స్పష్టంగా, అద్భుతమైన వివరణ తో మీరు తెలియజేసిన విషయం సామాన్యమైనది కాదు. ఈ శ్లోకం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము. కానీ స్పురణ కి, స్మరణ కి తెచ్చుకోము. కారణం మనది కాని మనకి కాని విషయాలని పట్టుకుని త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉంటాము. ముందుగా ఈ అద్భుతమైన ప్రశ్న అడిగిన వారికి i think పద్మ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విషయాన్ని అద్భుతంగా చెప్పిన మీకు మా ధన్యవాదాలు.. ఈ సందర్భంగా "మరణానికి ముందు మా అమ్మ నవ్విన నవ్వు గుర్తు వచ్చిందండి"
    మనిషికి ఉన్నవి రెండే కష్టాలు అంటారు. ఒకటి పుట్టుక మరొకటి మరణం.. పుట్టిన మనం మరల మోక్ష ప్రాప్తి ఎలా పొందాలి అనేది మన చేతుల్లో, మన చేతల్లో ఉంచుకోవాలి.. ఎరుక తో అని ఎందుకు అంటారో అర్ధం అవుతుంది.. మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ...

    రిప్లయితొలగించండి
  2. శ్రీనివాసరావు2 జులై, 2025 5:45 PMకి

    అమ్మా,ఊహించలేదు ఇంత వివరణాత్మకంగా సమాధానం ఇస్తారని. చదువుతుంటే ఆనందాశ్రువులు. మాటలు లేవు నా దగ్గర 🙏

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది మీ వివరణ.
    సాధారణ భక్తి, అచంచల భక్తి, ప్రేమ అన్నారు కదా భారతీ గారు. మామూలుగా కొంచెం దైవ భక్తి ఉండడం సాధారణ భక్తి. అపార భక్తి ఉండడం అచంచల భక్తి. భక్తి యే ప్రేమ. మరి భక్తి, ప్రేమ అని విడదీసి చెప్పారు. రెండింటికి తేడా ఉందా?

    రిప్లయితొలగించండి