🪔 లోక కళ్యాణ కారకుడు
తారకాసురుడనే రాక్షసుడి అరాచకాలతో ముల్లోకాలు అల్లాడిపోతున్న సమయంలో, ఆ పరమశివుని తేజస్సు నుండి శరవణంలో ఆరు ముఖాలతో జన్మించాడు కుమారస్వామి. దేవతలందరికీ సేనాధిపతిగా నిలిచి, అత్యంత పరాక్రమంతో తారకాసురాది అసురులను సంహరించి ముల్లోకాలను రక్షించి, శాంతిని చేకూర్చిన షణ్ముఖుడు... ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేనను, బోయిరాజు కుమార్తె అయిన వల్లీదేవిని వరించిన వృత్తాంతం అత్యంత రమణీయమైనది. భక్తిరసంతో, దైవిక లీలలతో సాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని శుభపరిణయ అమృత గాథ ఈనాటి మన టపాలో -
👑 దేవేంద్రుడి పెంపుడు కుమార్తెగా దేవసేన
అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆ పాప బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి, ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి, ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో కొన్ని ఆశ్చర్యకరమయిన ముఖ్య సంఘటనలు జరిగాయి
ముఖ్యమైన ఘట్టాలు
⚔️ ⛳ అసుర సంహారం & విజయయాత్ర :
తారకాసురుడు, సూరపద్ముడు(శూరపద్ముడు) వంటి రాక్షసులను అంతం చేసి దేవతలను కష్టాల నుండి విముక్తులను చేసి, లోకాలకు శాంతిని చేకూర్చిన మహావీరుడు, సూరపద్ముడు సంహారం చేసిందే గాక, వరాలు లొసగిన కారుణ్యమూర్తి అయిన కుమారస్వామి శౌర్యానికి, ధర్మానికి ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోనైన దేవేంద్రుడు తన కుమార్తెకు తగిన వరుడు కుమారస్వామే అని నిశ్చయించుకున్నాడు.
🎁 ఇంద్రుడి కృతజ్ఞత :
రాక్షస బాధలు తొలిగి స్వర్గాధిపత్యం తిరిగి దక్కడంతో, దేవేంద్రుడు పరమానందభరితుడై తన పెంచిన కుమార్తె అయిన 'దేవసేన' ను కుమారస్వామికకే ఇవ్వాలని నిశ్చయించాడు.
🍀దేవసేన కుమారస్వామిల కల్యాణ వైభోగం🍀
🔱 సకల దేవతల సమక్షంలో శుభ పరిణయం:
ఇంద్రుని కోరికను పరమశివుడు పార్వతీదేవి ఆనందంగా అంగీకరించారు. బ్రహ్మదేవుడు ముహూర్తం నిశ్చయించాడు.
📍తిరుప్పరంకుండ్రం:
తిరుప్పరంకుండ్రం పుణ్యక్షేత్రం దేవసేన కుమారస్వాముల వివాహ సంబరాలకు వేదిక అయింది. (తమిళనాడులోని మదురై దగ్గర ఉన్న ఈ పుణ్యక్షేత్రం మురుగన్ ఆరు ప్రధాన క్షేత్రాలలో మొదటిది).
సకల దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు ఈ పెండ్లి వేడుకకు తరలిరాగా, వేద మంత్రాల ఘోష నడుమ, మంగళ వాయిద్యాల శబ్దాల మధ్య కుమారస్వామి దేవసేన హస్తాన్ని అందుకున్నాడు. ఇంద్రుడు తన కుమార్తెను కన్యాదానం చేసి, స్వామివారికి ఐరావతాన్ని (తెల్లని ఏనుగు) కానుకగా ఇచ్చాడు. ఇలా దేవసేనను వివాహం చేసుకోవడం ద్వారా స్వామివారికి 'దేవసేనాపతి' అనే పేరు మరింత శోభిల్లింది.
🛕ఆలయ విశిష్టత & స్థల పురాణం :
🌺వివాహవేదిక :
శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత కుమారస్వామి తన సైన్యంతో ఇక్కడికి విచ్చేశారు. రాక్షస బాధల నుండి విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతగా దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేన (దేవయాని)ను స్వామికి ఇచ్చి ఇక్కడే వివాహం చేశారు.
🧘 కూర్చున్నభంగిమ :
సాధారణంగా మురుగన్ ఆలయాల్లో స్వామి నిలబడి దర్శనమిస్తారు. కానీ ఈ తిరుప్పరంకుండ్రం క్షేత్రంలో మాత్రమే స్వామివారు పెళ్ళి కుమారుడిగా కూర్చుని, పక్కనే దేవసేన అమ్మవారితో కలిసి దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత.
🛕కొండను తొలిచిన ఆలయం :
ఈ ఆలయం ఒక పెద్ద కొండను తొలిచి నిర్మించిన అద్భుతమైన కట్టడం. 6వ శతాబ్దంలో పాండ్య రాజుల కాలంలో ఈ నిర్మాణం జరిగింది.
ఈ కళ్యాణం కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక.
దేవసేనను వివాహం చేసుకోవడం ద్వారా స్వామి లౌకిక మరియు దైవికధర్మాలను ఎలా రక్షించాలో చూపించారు.
🌴 వల్లీ సుబ్రహ్మణ్య కళ్యాణ వైభవం 🌴
🏔️ కైలాసంలో నారదుని రాక :
ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్లారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలుపెట్టారు. నిజానికి నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. అందుకే వల్లీ గురించి చెప్పడం మొదలెట్టాడు.
🌿 వల్లీ జనన వృత్తాంతం :
ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒక పిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా, ఒక భిల్లు నాయకునికి దొరికింది. ఆ పిల్లను ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదై, వంశాచారమును బట్టి తినై చేను (కోరచేను) రక్షణకై వెళ్తుంది. అక్కడ ఒక మంచె మీద కూర్చొని, పిట్టలు ఎగిరిపోవడం కోసం చేతిలో కర్రను తిప్పుతూ, పాటలు పాడుతుంది. ఆమెది రాశిభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక.
ఆ అన్నట్లు...ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వంటిని పట్టిన పాములను చూస్తారో, వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు. ఆమె ఒంటినుండి సహజంగా సువాసనలు వస్తాయి. ఆ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పాములు వేలాడుతున్నాయా అన్నట్లుగా ఆమె కేశపాశం వేలాడుతుంటుంది. వల్లిని చూసావంటే, ఆ అమ్మాయి చిటికనవేలు పుచ్చుకుంటే తప్ప తిరిగి రావు.....అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి బయల్దేరాడు.
🗣️ భిల్లరాజుకు నారదుని శుభవార్త - అల్లుడి వైభవం
సుబ్రమణ్య స్వామి కంటే ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్లాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు.
నారదుడు భిల్లరాజుతో... 'నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్దరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకోబోయేవాడు—లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ శక్తివంతమైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవరు గొప్ప వీరుడో, ఎవరు మహాజ్ఞానియో, ఎవరు దేవసేనాధిపతియో, ఎవరు అసుర సంహారం చేసి, ముల్లోకాలకు శాంతిని చేకూర్చారో... అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం' అన్నాడు. భిల్లరాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు.
శివపార్వతుల దేవుని ముద్దుల కుమారుడు, శరవణభవుడైన కుమారస్వామి (మురుగన్) లీలలు అనంతం. స్వామివారి భక్తుల రక్షణ కోసమే కాదు, తనను మనసా నమ్మిన భక్తులను అనుగ్రహించడానికి కూడా ఎన్నో అద్భుత రూపాలను ధరించారు. అలాంటి దివ్యలీలలలో అత్యంత మనోహరమైనది, భక్తిరసభరితమైనది "వల్లీ కళ్యాణం".
🕊️ వల్లీదేవితో ప్రణయం & వివాహం
తనపై నిశ్చలమైన భక్తిని పెంచుకున్న గిరిజన కన్య వల్లీ దేవిని పరీక్షించి, ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించేందుకు షణ్ముఖుడు ఆడిన ఒక మధురమైన నాటకం ఇది. వల్లిని అనుగ్రహించే క్రమంలో కుమారస్వామి వేటగాడిగా, వృద్ధుడిగా మారి చేసిన ఆ దివ్యలీల విశేషాన్ని తెలుసుకుందాం.
🌾 వనంలో స్వామి రాక - తొలి సంభాషణ :
కుమారస్వామి వేటగాని వేషంలో వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి... 'బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటినీ ఒకచోట రాశిభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి' అని అనుకున్నాడు. సంభాషణ ప్రారంభించి, "లతాంగీ నన్ను చేపట్టవా?" అని అడిగాడు.
ఆమే ఈయన వంక చూసి... 'అబ్బో ఇతడు ఎంత అందగాడో' అనుకుని, నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంది.
💖🦚వల్లీదేవి నిశ్చలభక్తి - నిజరూప దర్శనం :
ఆమె మనస్సులో ఇలా అనుకుంది... 'ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ, నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను పార్వతీ పరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్యుడికి చెందినదానను...అని నిశ్చల భక్తితో అనుకొని,
వెలుపలికి... 'ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదైనా అడగవలసి వస్తే నన్ను కాదు, మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది' అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది.
💌 ఆకు మీద ఉత్తరం - చెలికత్తె సాయం :
ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుమిలి కుమిలి ఏడుస్తోంది... 'అయ్యో ఎక్కడో ఆ మహానుభావుడు. లోకాలలో ఉండే కన్యలందరు ఆయనను పొందుదామని తపిస్తుంటారు. అలాంటి ఆయన నా దగ్గరకు వస్తే, నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేకపోయాను' అని.
అది చూసి చెలికత్తె... 'ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్ళి ఆయనకు ఇస్తాను' అని ధైర్యం చెప్పింది.
🫶 సరోవరం ఒడ్డున కలయిక - చెలికత్తె రాయబారం :
అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి ఆకుపై వ్రాసిన పత్రాన్ని చూపించింది. ఆయన దాన్ని చదివి, వల్లీదేవి దగ్గరకు వెళదాం అన్నాడు. అప్పుడు చెలికత్తె... 'అలా వద్దు, నేనే పిల్లను తీసుకువస్తాను' అని చెప్పి వెళ్ళి, వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది.
🏹 భిల్లరాజు ఆగ్రహం - సమ్మోహనాస్త్ర ప్రయోగం :
పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా, ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. స్వామి కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో ఓరి తుంటరీ, రాత్రంతా నా కూతురుతో మాట్లాడుతూ కూర్చున్నావా? నా కూతురు సుబ్రమణ్యుడికి కాబోయే భార్య. ఎంతపని చేశావు అని, తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగించాడు.
సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి, వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు.
🦚🛐 నిజరూప దర్శనం - భిల్లుల శరణాగతి :
అప్పుడు వల్లీ దేవి తన వాళ్లందరూ పడిపోయారని ఏడ్చింది. అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని, నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.
🔱 పార్వతీ పరమేశ్వరుల రాక :
ఇంతలో నారదుడు దేవసేనతో, పార్వతీపరమేశ్వరులతో అక్కడికి వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. సంతోషంగా పార్వతీ పరమేశ్వరులు దేవసేన ఆశీర్వదించారు.
🌸 వల్లీ సమేత స్కందుని శోభాయమాన కళ్యాణ వేడుక
ఆ తర్వాతే స్వామికి, వల్లికీ వివాహమవ్వగా, స్వామి ఇద్దరు దేవేరులతో కలిసి తిరుత్తణి క్షేత్రానికి చేరుకున్నారు. ఆ ఇరువురు దేవేరులు ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారితో కలిసి 'తిరుత్తణి' యందు వెలిసి ఉన్నారు.
⛰️🛕తిరుత్తణి
వల్లిమలైలో గిరిజన సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన తర్వాత, కుమారస్వామి వల్లీ దేవితో కలిసి తన ఐదవ నివాస క్షేత్రమైన "తిరుత్తణి" కొండకు చేరుకున్నారు.
అందుకే తిరుత్తణి ఆలయంలో స్వామివారికి కుడివైపున వల్లీ దేవి, ఎడమవైపున దేవసేన అమ్మవారు కొలువై దర్శనమిస్తారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న తిరుత్తణి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరు పవిత్ర క్షేత్రాలలో ఒకటి. కొండపై ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 700 అడుగుల ఎత్తులో ఉంది.
💮"శాంతిక్షేత్రం"
పురాణ సంప్రదాయం ప్రకారం, అసురులతో యుద్ధం చేసి విజయం సాధించిన తరువాత కుమారస్వామివారిలో ఉన్న యుద్ధావేశం ఇక్కడ శాంతించింది.
అందుకే తిరుత్తణిని "శాంతిపురి" - శాంతిని ప్రసాదించే స్థలంగా భావిస్తారు.
⛰️ 🪨🪜365 మెట్లు - ఒక అందమైన ప్రతీక
సముద్రమట్టానికి దాదాపు 700 అడుగుల ఎత్తులో ఒకే ఒక భారీ రాతికొండపై ఈ ఆలయం నిర్మించబడింది.
ఈ ఆలయానికి వెళ్లడానికి 365 మెట్లు ఉన్నాయి. ఆలయ సంప్రదాయంలో ఈ 365 మెట్లును సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా విశ్వసిస్తారు.
🐘ప్రత్యేక ఆయుధం & వాహనం:
సాధారణంగా మురుగన్ చేతిలో 'వేల్' (ఈటె) ఉంటుంది, కానీ ఇక్కడ ఆయన చేతిలో వజ్ర వేల్ (ఇంద్రుడు బహుకరించిన వజ్రాయుధం) ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారికి నెమలి వాహనానికి బదులుగా ఐరావతం (తెల్ల ఏనుగు) వాహనంగా ఉంటుంది.
ఇది శివ మహాపురాణంలో కథనం కాగా,
📚 మరికొన్ని పురాణాల్లో ఉన్న కథలు :
14వ శతాబ్దంలో కచ్చియప్ప శివాచార్యార్ అనే గొప్ప భక్తుడు దీనిని తమిళంలో రచించిన 'కంద పురాణం' లో "వల్లీ అమ్మై తిరుమణ పడలం" (వల్లీ కళ్యాణ ఘట్టం) లో వేటగాడి రూపం, వేంగై చెట్టుగా మారడం, వృద్ధుడిగా వచ్చి తేనె, తినై పిండి తినడం, వినాయకుడి సహాయం కోరడం... వంటి లీలలన్నీ అత్యంత మనోహరంగా వర్ణించబడ్డాయి.
🏹✨"వల్లీని అనుగ్రహించేందుకు కుమారస్వామి చేసిన దివ్యలీలలు"
కుమారస్వామి (మురుగన్) వల్లిని వివాహం చేసుకోవడానికి మరియు ఆమెను అనుగ్రహించడానికి ప్రదర్శించిన దివ్యలీలలు అత్యంత మనోహరమైనవి. తమిళ కంద పురాణం ప్రకారం ఈ లీలల క్రమం క్రింద విధంగా సాగింది:
🏹 వేటగాడి రూపం
లీల: వల్లి ఒక గిరిజన రాజు కుమార్తె. ఆమె తినై (కొర్రలు) పొలాల్లో పక్షులను తోలుతుండేది. కుమారస్వామి ఆమె భక్తిని పరీక్షించడానికి, ఆమెను చేరుకోవడానికి ఒక అందమైన వేటగాడి రూపంలో అక్కడకు వచ్చాడు.
విశేషం: వల్లితో మాటలు కలిపి, ఆమెను ప్రేమగా పలకరించాడు. కానీ గిరిజన కన్య అయిన వల్లి పరాయి పురుషుడైన ఆ వేటగాడిని తిరస్కరించింది.
🌳 వేంగై చెట్టు
లీల: వేటగాడి రూపంలో ఉన్న కుమారస్వామితో వల్లి మాట్లాడుతుండగా, ఆమె తండ్రి (గిరిజన రాజు) మరియు బంధువులు ఆ ప్రాంతానికి రావడం గమనించారు. వల్లీ వెంటనే "మా తండ్రిగారు వస్తున్నారు, మీరు వెంటనే వెళ్ళిపోండి" అని చెప్పింది.
విశేషం: పరాయి వ్యక్తితో వల్లిని చూస్తే వారు ఆగ్రహిస్తారని గ్రహించిన స్వామి, క్షణాల మీద తన రూపాన్ని ఒక "వేంగై" (కలిగొట్టు/ఇరిడి) చెట్టుగా మార్చేసుకున్నాడు.
🦚✨🌳కుమారస్వామి యోగమాయ
కుమారస్వామి అక్కడ ఒక సామాన్య మానవుడిగా కాకుండా, పరమాత్మగా లీలలు ప్రదర్శిస్తున్నారు. భగవంతుడు తన మాయను ప్రయోగించినప్పుడు, ఎదురుగా ఉన్న వ్యక్తికి అసలు ఏం జరుగుతుందో గ్రహించే విచక్షణ లోపిస్తుంది.
వల్లి తన తండ్రి, సోదరులు వస్తున్నారని కంగారు పడుతున్న ఆ ఒక్క క్షణంలో... స్వామి తన ఐశ్వర్య శక్తితో వల్లి కళ్ళు కప్పేలా (యోగమాయతో) అదృశ్యమై, ఆ స్థానంలో వేంగై చెట్టుగా మారిపోయారు.
⚡ఇదీ ఒక పరీక్ష
స్వామి ఆడిన ఈ నాటకంలో, ప్రతి ఘట్టం వల్లి నిశ్చలత్వాన్ని పరీక్షించడానికే జరిగింది. వేటగాడే చెట్టుగా మారాడని ఆమెకు ముందే తెలిసిపోతే, కథలో ఆ తర్వాత వచ్చే వృద్ధుడి రూపం, ఏనుగు లీలలకు ప్రాధాన్యత ఉండదు. చివరన నిజరూప దర్శనం ఇచ్చినప్పుడే స్వామి ఆమెకు వేటగాడు రూపం, ఈ "వేంగై చెట్టు" లీల వెనుక ఉన్న రహస్యాల్ని కూడా తెలిపి, తన సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించారు.
👴 వృద్ధుడి రూపం
లీల: వేటగాడి రూపం పని చేయకపోవడంతో, కుమారస్వామి ఒక ముసలి సాధువు (వృద్ధుడి) రూపంలో వల్లి ముందుకు వచ్చాడు
విశేషం: తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పి వల్లి ఇచ్చిన తేనె, తినై పిండిని తిన్నాడు. దాహం వేస్తోందని అడగగా, వల్లి అతడిని దగ్గరలోని నీటి వనరు నుండి నీరు తీసుకొచ్చి ఇచ్చి, ధర్మానుసారంగా అతిథి మర్యాదలు చేసింది. నీరు తాగాక, ఆ వృద్ధుడు వల్లిని పెళ్ళి చేసుకోమని కోరగా ఆమె కోపగించుకుంది.
🦣 గణపతి సహాయం
లీల: వల్లిని వివాహం చేసుకోవడానికి వృద్ధుడి రూపంలో ఉన్న స్వామి తన అన్నయైన వినాయకుడిని స్మరించాడు. గణపతి వెంటనే ఒక భయంకరమైన అడవి ఏనుగు రూపంలో వల్లి పైకి దూసుకు వచ్చాడు
విశేషం: ఏనుగును చూసి భయపడిన వల్లి, కాపాడమంటూ పక్కనే ఉన్న వృద్ధుడిని గట్టిగా కౌగిలించుకుంది. నన్ను ఈ ఏనుగు నుండి కాపాడితే మీరు ఏం అడిగినా ఇస్తానని మాట ఇచ్చి, శరణు కోరింది.
ఆ వెంటనే కుమారస్వామి ఏనుగును శాంతపరిచి, తన ముసలి రూపాన్ని వీడి, ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో తన నిజమైన దివ్య స్వరూపాన్ని వల్లికి చూపించాడు. స్వామి లీలలను తెలుసుకున్న వల్లి ఆనందంతో ఆయనను శరణు కోరింది.
ఈవిధంగా కుమారస్వామి తన దివ్యలీలల ద్వారా వల్లీ దేవి ప్రేమను పొంది, ఆమెకు నిజరూప దర్శనం ఇచ్చిన తర్వాత, గిరిజన రాజైన నంబిరాజుకి వారిద్దరి దైవత్వం అర్థమవుతుంది. ఆయన ఎంతో సంతోషంతో గిరిజన సాంప్రదాయం ప్రకారం పెళ్ళి ఏర్పాట్లు చేస్తాడు.
🔱✨🙌 కైలాసనాధుల ఆశీర్వాదం
ఈ వివాహ వైభవానికి నారద మహర్షితో పార్వతీ పరమేశ్వరులు, దేవసేన అమ్మవారు స్వయంగా విచ్చేశారు. వల్లి భక్తికి మెచ్చి దైవకుటుంబం అంతా కలిసి వివాహవేదిక అయిన వల్లిమలై (కొండ) వద్దకు వచ్చి, నూతన దంపతులను దీవించారు.
⛰️ వల్లిమలై
కుమారస్వామి మరియు వల్లీ దేవిల వివాహం తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఉన్న "వల్లిమలై" అనే కొండపై జరిగింది. ఇది గిరిజన రాజు నంబిరాజ నివాస ప్రాంతం. వల్లి పెరిగిన పవిత్ర భూమి.
🌺 వివాహ వేదిక :
కుమారస్వామి వేటగాడిలా, వృద్ధుడిలా వచ్చి వల్లిని పరీక్షించిన స్థలం, వినాయకుడు ఏనుగు రూపంలో భయపెట్టిన చోటు, చివరకు వారిద్దరి కళ్యాణం జరిగిన వేదిక అంతా ఈ వల్లిమలై కొండపైనేనని పురాణాలు చెబుతున్నాయి.
🛕క్షేత్ర విశిష్టతలు:
⛰️🪨🪜444 రాతిమెట్లు
కొండపై ఉన్న ఈ అద్భుతమైన గుహాలయానికి చేరుకోవడానికి 444 రాతి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కుతుంటే చుట్టూ ప్రకృతి అందాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి.
🌳వేంగైచెట్టు
కథలో కుమారస్వామి క్షణాల్లో చెట్టుగా మారినట్లు చెప్పుకున్నాం కదా, ఆ "వేంగై" వృక్షం ఇక్కడి స్థల వృక్షంగా ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది.
🌄సూర్యుడు చూడని బావి
కొండపై ఒక వింత నీటి బుగ్గ లేదా బావి ఉంది. దీనిపై సూర్యకిరణాలు అస్సలు పడవు. వృద్ధుడి రూపంలో ఉన్న స్వామికి దాహం వేసినప్పుడు వల్లీ దేవి ఈ బావి నీటినే ఇచ్చిందని, తేనె, తినై పిండితో కలిపి ఆహారంగా ఇక్కడే ఇచ్చిందని కథనం.
🌟 ముగింపు
ఈ విధంగా కుమారస్వామి తన అన్నయైన వినాయకుని సహాయంతో వల్లీ దేవి భయాన్ని పోగొట్టి, ఆమెకు తన నిజరూప దర్శనాన్ని ప్రసాదించారు. భగవంతుని లీలలను, దైవత్వాన్ని గ్రహించిన వల్లి తనను తాను స్వామివారి చరణాలకు అంకితం చేసుకుంది. గిరిజన సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
📖👂🎧శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి కళ్యాణ గాథ – పఠన, శ్రవణ ఫలం 🙏
శరవణభవుని పౌరాణిక వివాహ గాథను భక్తితో చదివినా లేదా విన్నా లభించే శుభఫలితాలు:
🔹శీఘ్ర వివాహ ప్రాప్తి: వివాహ ప్రయత్నాలలో ఉన్న
యువతీ యువకులకు అడ్డంకులు తొలగి, త్వరగా కళ్యాణ యోగం పడుతుంది.
దాంపత్య అన్యోన్యత: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వీడి, వల్లీదేవసేన సమేతుడైన స్వామిలా సంసారంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
సత్సంతాన భాగ్యం: సంతాన లోపాలు ఉన్నవారికి సత్సంతాన ప్రాప్తి కలిగి, పిల్లలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు.
గ్రహదోష నివారణ: జాతకంలోని కుజ దోషాలు (మంగళ దోషం), సర్ప దోషాలు మరియు పెళ్లికి అడ్డుపడే ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయి.
శతృ రుణ విముక్తి: దేవసేనాధిపతి అయిన కార్తికేయుని అనుగ్రహంతో శతృ భయాలు, కోర్టు సమస్యలు మరియు అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.
✍️ తదుపరి టపా
ఈ ఇద్దరు దేవేరులను కుమారస్వామి వివాహం చేసుకోవడం వెనుక ఉన్న పరమార్థం, ఆధ్యాత్మిక రహస్యం... త్వరలోనే తెలుసుకుందాం.
🙏"ఓం శరవణభవ"🙏




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి