18, ఫిబ్రవరి 2012, శనివారం

ఓం నమశ్శివాయ

మాఘే కృష్ణ చతుర్ధశ్యాం ఆదిదేవో మహానిశి
శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమప్రభః 
తస్మాచ్చివ స్యయా రాత్రి: సమాఖ్యాతా శివప్రియా 
తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః 
పరమశివుడు మాఘకృష్ణ చతుర్దశి నాడు నిశీది సమయంలో కోటిసూర్యుల కాంతితో శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ రాత్రి శివునికి చాలా ప్రియమైన రాత్రి. శివలింగాలన్నీ శివతేజస్సుతో ప్రకాశిస్తాయి. ఈ రోజునే మహాశివరాత్రి అంటారు.
శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనమ్ 
అచండాల మనుష్యాణాం మోక్ష ప్రదాయకమ్
శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరింపజేసి సర్వులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
శివరాత్రి వ్రతం తనకెంతో ప్రియమైనదని, ఈ వ్రతం సర్వయజ్ఞ సమానమని, ఉత్తమోత్తమైన ఈ వ్రతంను ఒక్కసారి చేసిన వారు ముక్తిని పొందుతారని పరమశివుడు పార్వతిదేవికి చెప్పినట్లుగా లింగపురాణం తెలియజేస్తుంది. అందుకే పెద్దలు జన్మానికో శివరాత్రి అని అంటారు.
నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి అని నాలుగు శివరాత్రులున్నట్లుగా శాస్త్రం తెలుపుతుంది.
నిత్యశివరాత్రి :- ప్రతి దినమూ రాత్రి శివుడిని ఆరాదించడం నిత్య శివరాత్రి.
పక్షశివరాత్రి :- ప్రతి నెలా చతుర్ధశిన ఉపవాసముండి రాత్రి శివుడిని ఆరాదించడం.
మాసశివరాత్రి :- ప్రతి నెలా కృష్ణ చతుర్ధశిన నియమ నిష్టలతో శివారాధన చేయడం.
మహాశివరాత్రి :- మాఘమాస బహుళ చతుర్ధశిన పరమేశ్వరుణ్ణి భక్తిప్రపత్తులతో శాస్త్రబద్ధంగా ఆరాదించడం.
నిత్య, పక్ష, మాస శివరాత్రులను ఆచరించకపోయిన మహా శివరాత్రిని ఆచరించిన చాలు, అనంతమైన పుణ్యం లభిస్తుందని, ముక్తి ప్రాప్తమౌతుందని స్కాంద, శివ పురాణంలందు వివరింపబడింది.
పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడికి, విష్ణువుకు మధ్య తమలో ఎవరు గొప్పవారనే బేధభావం వచ్చి వాదులాడుకొని శివుడిని చెప్పమని అడగగా వారి తగవు తీర్చేందుకై శివుడు వారిద్దరి మధ్య అనలస్తంభంగా ఆవిర్భవించాడు. తన ఆది అంతాలను ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని శివుడు చెప్పగా శివుని ఆది అంతాలను కనుగొనేందకు బ్రహ్మదేవుడు హంసరూపంలో ఆకాశంవైపు, మహావిష్ణువు వరాహరూపంలో పాతాళానికి వెళ్ళారు. ఎంత దూరం పయనించి వెదికినా వారు శివుని ఆది అంతమలు కనుగొనలేక శివుని దగ్గరకు వచ్చి ప్రార్ధించగా వారిద్దరి మధ్య లింగరూపంలో ఆవిర్భవించాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన మూర్తే లింగోద్భవమూర్తి. ఈ లింగోద్భవం రాత్రిపూట జరిగింది. అందుచే మహాశివరాత్రి పగలంతా ఉపవాసం (ఉపవాసమనగా దైవమందు వసించడం. అంటే త్రికరణశుద్ధిగా శివున్నే ధ్యానిస్తూ, శివ నామాన్నే స్మరిస్తూ, శివుని యందే లగ్నమై ఉండడం) ఉండి రాత్రిపూట శివాభిషేకాలు, శివస్మరణం చేస్తూ,శివగాధలు వింటూ జాగరణ చేయమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. 
మహాశివరాత్రిన అభిషేకాలు, పూజలు రాత్రియందే చేయడం ఎంతో శ్రేయష్కరం. రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు విధములుగా ఈ అభిషేకాలు చేయాలన్నది శాస్త్రవచనం.
మొదటి ఝామున శివునికి క్షీరంతో అభిషేకించి, పద్మాలతో పూజ చేస్తూ పులగము(బియ్యం పెసరపప్పు కలిపి వండినది)ను  నైవేద్యంగా సమర్పిస్తూ ఋగ్వేద మంత్రాలను చదవాలి. రెండవ ఝామున పెరుగుతో అభిషేకించి, తులసీదళంలతో పూజిస్తూ పాయసంను నైవేద్యంగా సమర్పిస్తూ యజుర్వేద మంత్రాలను చదవాలి. మూడవ ఝామున నెయ్యితో అభిషేకించి, మారేడుదళంలతో పూజ చేస్తూ నువ్వులతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తూ సామవేద మంత్రాలను చదవాలి. నాల్గవ ఝామున  తేనెతో అభిషేకించి, తుమ్మిపూలతో పూజించి అన్నమును నైవేద్యంగా సమర్పిస్తూ అధర్వ మంత్రాలను చదవాలి. ఇవేవి చేయకపోయినను శివుడు అభిషేకప్రియుడు (అలంకార ప్రియో విష్ణు:, అభిషేక శివః) కావున శివలింగంపై శివరాత్రినాడు నీటిని పోసి మారేడుదళంలను సమర్పించిన విశేషమైన పుణ్యం లభిస్తుందని లింగపురాణం తెలుపుతుంది. 

శివ = శ + ఇ + వ. 'శ'కారం సుఖాలను, పరమానందమును, 'ఇ'కారం పరమ పురుషత్వాన్ని, 'వ'కారం అమృతశక్తిని ప్రసాదిస్తాయి. 
పరమశివుని రూపంలో పరమార్ధం :- మెడలో సర్పం, శిరస్సుపై గంగ - కుండలిని జాగృతిని సూచిస్తున్నాయి. శివనామంలోని మూడుగీతలు - జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలుపుతున్నాయి. మద్యబింధువు తురీయావస్థకు ప్రతీక. అలానే శివుని మూడో నేత్రం ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ప్రజ్ఞాచక్షువు. అర్ధనారీశ్వర తత్వంలో శివపార్వతులు ఇడా పింగళ నాడులకు సంకేతాలు. పాక్షికంగా మూయబడిన కళ్ళు ధ్యానస్థితిలో అంతర్ముఖస్థితికి దర్పణం. శివుడు ఆదిగురువు. యోగ గురువు.
శివుని వృత్తి భిక్షాటన, ఆసనం పులి చర్మం, ధరించేది గజచర్మం, నివసించేది స్మశానం (వైరాగ్యానికి సూచన) ఆయన దగ్ధం చేసింది మదాకారం.... ఇవన్నీ జన్మ బంధ విమోచనలకు మార్గంలకు సూచనలు. 
లింగాభిషేకములో పరమార్ధం :- పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనంలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం. 
శివలింగం :- నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్యవిషయంను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"
                                                శివ పంచాక్షర స్తోత్రమ్ 
నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ,
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై "న"కారాయ నమశ్శివాయ.

మందాకినీ సలిల చందనచర్చితాయ, నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ,
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ, తస్మై "మ"కార మహితాయ నమశ్శివాయ.

శివాయ గౌరీవదనారవింద, సూర్యాయ దక్షాధ్వరనాశనాయ,
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ, తస్మై "శి"కారాయ నమశ్శివాయ.

వసిష్టకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ,
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ"కారాయ నమశ్శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ,
దివ్యాయ దేవాయ దిగంబరాయ, తస్మై "య"కారాయ నమశ్శివాయ.

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్చివసన్నిధౌ,
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే.

9 వ్యాఖ్యలు:

 1. amma

  http://www.youtube.com/watch?feature=player_profilepage&v=jibRNs-SHvg

  ee link chudandi

  unnadi okade shivudegaa

  shivude shivude shivude gaa

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఉన్నది ఒకడే శివుడే గా శివుడే శివుడే శివుడే గా........

  ధన్యురాలిని. మంచి లింక్ ని పంపారు.
  మీకు నా ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఓం! నమశ్శివాయ.
  మీ బ్లాగు ఇప్పటికి కనుపించేలా చేసిన అమ్మకి నమస్కారం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమస్కారమండి శర్మగారు! బ్లాగ్ చూసినందులకు ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. A very well-written post. I read and liked the post and have also bookmarked you. All the best for future endeavors
  IT Company India

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీకూ, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు