25, ఆగస్టు 2012, శనివారం

అమ్మా! గుర్తుకొచ్చిందీ......

సమయం : ఉదయం 6 గంటలు 
మా అమ్మాయి (అనూష) నుండి ఫోన్ -
శుభోదయమమ్మా! 
శుభోదయం నాన్నా! 
కొన్ని మాటలననంతరం, 'అమ్మా! నీకేదో చెప్పాలని ఫోన్ చేశానమ్మ. కానీ, గుర్తు రావడం లేదు, గుర్తు వచ్చినప్పుడు చేస్తానమ్మా అంటూ ఫోన్ కట్ చేసింది.

సమయం: ఉదయం సుమారుగా 9 గంటలు 
మరల మా అమ్మాయి నుండే ఫోన్ -
చెప్పరా నాన్నా...
అమ్మా! గుర్తుకొచ్చిందీ......
సరే, చెప్పమ్మా...
ఓ కదమ్మా...
కధా? వంట చేస్తున్నాను, పనయ్యాక ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు...
లేదమ్మా, ఇది జరిగిన కధ, వంట తర్వాత చేయవచ్చు, ముందు వినమ్మా...
తన గొంతులో ఉత్సాహం గమనించి, పని ఆపి, సరే చెప్పు అనక తప్పలేదు నాకు.
అమ్మా! పూర్వం శ్రీ మధ్వాచార్యులవారి కాలంలో జరిగిన సంఘటనటమ్మా... 
ఓర్నీ! అప్పటి సంఘటనా నీవు చెప్పాలనుకుంటున్నదీ?
అబ్బా! మద్యలో మాట్లాడకుండా విను. 

ఆ వాస్తవకధ తన మాటలోనే -
మధ్వాచార్యులవారి కాలంలో 'కనకదాసు' అనే పేరుగల మహాభక్తుడు ఉండేవాడట. ఇతను శూద్రుడు. ఈ కనకదాసు భగవంతున్ని కీర్తిస్తూ అనేక కీర్తనలు పాడుతూ ఉండేవాడు. ఇతనంటే మధ్వాచార్యులవారికి చాలా ఇష్టమట. అందుకే మొదట ఈ కనకదాసుకే తీర్ధప్రసాదాలు ఇచ్చి, తర్వాత తక్కిన బ్రాహ్మనాదులకు ఇచ్చేవారట. ఆ కాలమునందు మధ్వాచార్యులవారి సన్నిధానమునందు శాస్త్రాలను చదివినవారు, వేదములను చదివినవారు, యజ్ఞయాగాదులు, హోమాలు చేయువారు ఉండేవారట. ఈ పండితులయందరికి తమకంటే ముందు తీర్ధప్రసాదాలు కనకదాసుకు మధ్వాచార్యులవారు ఇవ్వడం నచ్చలేదు. వీరికి ఈ పని కోపం కల్గించేది. ఓరోజు, వీరందరూ మధ్వాచార్యులవారిని అడిగారు -
'ఓ మహాత్మా! మీకు తెలియని ధర్మం ఏది గలదు? తాము వర్ణాశ్రమములను ఉద్ధరించుటకు అవతరించినవారు. మీకు తెలియదా, మాలో కొందరు వేదపండితులు, కొందరు ట్చాస్త్రములలో ప్రావీణ్యులు, మరికొందరు అనేక యజ్ఞములు చేసినవారు, మహా నైష్టిక బ్రాహ్మణులు. ఇట్టివారిని కాదని, కనదాసు భక్తుడైనను శూద్రవంశ సంజాతుడగు అతనికి ముందుగా తీర్ధప్రసాదాలు ఇచ్చి, తర్వాత మాకు ఇవ్వడంలో సందేహం కల్గుతుంది, తాము సర్వజ్ఞులు, ఇది సరికాదు కదా' అని అడిగారటమ్మా. అందుకు ఆ గురువుగారు 'కనకాదాసు పరమభక్తుడు, ఎప్పుడు తీర్ధప్రసాదములు దొరుకునా, ప్రసాదము తీసుకొని ఎప్పుడు కీర్తనలు పాడుకుందునా, అని ఆత్రంగా నిరీక్షించువాడు. అందుకే ముందుగా అతనికి ఇస్తున్నాను, సరే, ఈ విషయమై రేపటిదినం మాట్లాడుకుందాం, అని అందరికీ ఒక్కొక్క అరటిపండునిచ్చి ఇది రెండవవాడు చూడని స్థలములో భుజించి, ఆ సంగతి రేపు మరల చెప్పండి' అని ఆజ్ఞాపించిరట. ఆ అరటిపండుని ఒకరు తమ గదిలో, ఇంకొకరు చెట్టు చాటున, మరియొకరు గట్టు చాటున, మరియొకరు నిర్జన ప్రదేశమున, వేరొకరు కంబళితో మూసుకొని తిన్నారటమ్మా. కనకదాసు మాత్రం ఆ దినమంతా అనేక నిర్జన ప్రదేశములు, కొండలు, గుహలలో తిరిగి తిరిగి, ఎచట చూసినను భగవంతుడు లేని స్థలం కన్పించక చరాచర సృష్టిలోనూ, అణువణువులోను, పరమాణువులతో సహ కన్నురెప్పలార్పక శ్రీమన్నారాయణుడు చూచుచున్నట్లు కన్పించడంతో ఆ పండుని తినక, ఆ రోజంతా ఉపవాసముండి మరుసటిరోజు పూజసమయమున ఆ పండుని చేతపట్టుకొని మధ్వాచార్యులవారి దగ్గరికి వెళ్ళెనట. మధ్వాచార్యులవారు ముందుగా పండితులందరినీ 'ఎవ్వరును చూడని స్థలములో పండుని భుజించారా?' అని అడగగా - ఎవ్వరూ చూడనిచోటే భుజించామని, ఎక్కడెక్కడ భుజించారో చెప్పారు ఆ పండితులు. తర్వాత కనకదాసుని అడిగారు, 'ఏమి కనకదాసు! మన ఆచార్యులవారందరూ ఎవరు చూడని స్థలములలో పండ్లు భుజించినారట, నీవేల తినలే'దని అడుగగా -
"మహాత్మా! ఏకాంత ప్రదేశమున, కొండలలో, గుహలలో పగలంతయు, రాత్రి యందు తిరిగితిని. ఎచ్చోట చూసినను భగవంతుడు లేని స్థలం కనిపించలేదు. అణువులో అణుస్వరూపముగాను, విభువులో విభుస్వరూపముగాను పరిపూర్ణుడై నిండియుండుటచే నాకు వేరుస్థలం కనిపించలేదు" అని కనకదాసు చెప్పింది విని, మధ్వాచార్యులవారు, ఆచార్యులారా! 'అణోరణీయాన్మహతో మహీయాన్' అను శ్రుతియు, 'సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్' అని గీతయు మీరు అనేకమార్లు చదివినారు కదా! మీలో ఈ భావం కల్గిందా? ఇతను శూద్రజాతిలో పుట్టినను అపరోక్షజ్ఞానం కలవాడు. ఇతడు గుణముచే బ్రాహ్మణుడు. అందుకే ఇతనికి ముందుగా తీర్ధప్రసాదములు ఇచ్చుచుంటిని, అని చెప్పగా అందరూ వారి వారి అవివేకమునకు సిగ్గుపడ్డారటమ్మ...
అమ్మా! గుర్తుకొచ్చిందీ......అని అంటూనే చెప్పాలనుకున్నది చెప్పేసి, హమ్మయ్య! ఇక వంట చేసుకో, నాకూ పనుందని తను ఫోన్ పెట్టేసినను మదిలో ఆ కధే కదలాడుతుంది. 


నిజమే -
భగవంతుడు లేని చోటు ఎక్కడ?
సకల సృష్టి, సమస్త చరాచరం అంతయూ ఆ సర్వాంతర్యామియే.
సర్వులయందు, సమస్తము నందు సర్వవ్యాపకుడు.
అంతయూ భగవత్ స్వరూపమే......
ఇక భగవంతుడు లేనిది ఎక్కడ????? 

కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్
కుంభినింకలడగ్నిన్ దిశలం పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్ 
కలడోంకారమునన్ త్రిమూర్తులత్రిలింగవ్యక్తులందంతటన్ 
కలడీశుండు కలండూ తండ్రీ వెదుకంగానేల ఈయాయెడన్ 
              
నిజమే -
జన్మతః కులం ఏదైతేనేం? 
శూద్రోపి శీలసంపన్నో గుణవాన్ బ్రాహ్మణో భవేత్ (శూద్రజాతి యందు జన్మించినవారైనను, సద్గుణ సంపన్నులై ఉన్నచో వారు బ్రాహ్మణులే)
దీనినే శివుడు పార్వతీదేవికి ఇలా తెలిపెను -
సత్కర్మాభి: శుచిర్దేవి! శుద్ధాత్మా విజితేంద్రియః 
శూద్రోపి ద్విజవత్సేవ్య ఇతి బ్రహ్మానుశాసనమ్ //
ఓ పార్వతీదేవీ! శుద్ధములగు సాత్త్విక కర్మలతో గూడినవాడై, పరిశుద్ధాత్ముడై, జితేంద్రియుడైనవాడు శూద్రకులములో జన్మించినను బ్రాహ్మణునివలె సేవింపదగినవాడు.
బ్రాహ్మణత్వమునకు బ్రహ్మజ్ఞానమే గుర్తు అని మన శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియజెప్తున్నాయి.
న చర్మాణో న రక్తస్య మాంసస్య చ న చాస్థినః 
న జాతి రాత్మనో జాతి ర్వ్యవహార ప్రకల్పితా// (తేజోబిందూపనిషత్)
సర్వభూతస్థమగు ఆత్మకు జాతిభేదము లేదు. మరి చర్మమునకును, రక్తమునకును, మాంసమునకును, అస్థికిని లేదు. జాతి సాధారణ వ్యవహార కల్పితమే.
జన్మనా జాయతే జంతు: సంస్కారా ద్ద్విజ ఉచ్చ్యతే 
వేదపారాయణా ద్విప్రో బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః //
జన్మముచే  అందరును జంతుసమానులే. సంస్కారముచే ద్విజుడౌను, వేదపారాయణం వలన విప్రత్వము కలుగును. బ్రహ్మజ్ఞానము కలిగినప్పుడు బ్రాహ్మణుడు అగును.
సుఖం దేహస్య శూద్రాణాం ధనం శ్రేష్టం విశాం భవేత్ 
యశో నిత్యం క్షత్రియాణాం విప్రాణాం జ్ఞానమేవ హి //
దేహసౌఖ్యమును మాత్రమే చూసే స్వభావంగల స్థితి శూద్రత్వ మగును. ధనమే గొప్పదని తలంపు గలవాడు వైశ్యత్వస్థితిలో ఉండువాడు. ధనముగాని, ప్రాణంగాని పోయినను, లక్ష్యం చేయక యశస్సును నిలబెట్టువాడు క్షత్రియత్వమునకు వచ్చును. దేహమునుగాని, ధనమునుగాని, కీర్తినిగాని, లక్ష్యమందుంచక బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కొఱకు యత్నంచేయు జీవుడు బ్రాహ్మణత్వస్థితికి వచ్చినవాడు.
ఇక జన్మతః కులం ఏదైతేనేం?????
న జాతి: కారణం తాత! గుణాః కల్యాణకారణమ్ 
వృత్తిస్థ మాపి చండాలం తం దేవా బ్రాహ్మణం విదు:  

21 కామెంట్‌లు:

  1. భక్తిభావమున్న కధ, బాగుందండి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మార్పిత గారు!
      మీకు ఈ కధ నచ్చినందుకు సంతోషం.
      మీ ఈ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. చాలా బాగా చెప్పారు భారతి గారూ!
    జన్మతో కులాన్ని చెప్పటం కంటే...
    కర్మతోనే కులాన్ని గుర్తించాలి....
    బాగా వ్రాసారు..
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గారు!
      కధని అర్ధం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది.
      ధన్యవాదాలండి.

      తొలగించండి
  3. కులం చూసుకుని విర్రవీగే ఛాందస, దురహంకార బ్రాహ్మణులకు చెంపపెట్టులాగా ఉంది మీ రచన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారు!
      మీ స్పందనకు ధన్యవాదాలు.
      కానీ, ఇక్కడ ఎవర్ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టలేదు. మా అమ్మాయి ఈ కధ చెప్పినప్పుడు ఈ కధలో ఉన్న ప్రభోదాత్మక సందేశం అర్ధమై, స్ఫూర్తిదాయకమైన ఈ కధని పోస్ట్ చేశాను.
      కొందరు కారణజన్ములు తప్పిస్తే జన్మతః అందరూ ఏమీ తెలియని మాయలో ఉన్నవారే. అంటే జన్మతః అందరూ శూద్రులే. సాధన సంస్కారములతో జ్ఞానం పొంది బ్రాహ్మణత్వస్థితికి వస్తారు. బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, వైశ్వత్వం, శూద్రత్వం గుణ, కర్మల బట్టి ఏర్పడిన స్థితులే (ఈ స్థితులకే కులాలని పేరు పెట్టుకున్నాం) తప్ప అందరిదీ ఒకే కులం. అదే మానవకులం. శ్రీ మధ్వాచార్యులవారు చెప్పింది ఇదే.
      అసలు నాకేమనిపిస్తుందంటే -
      భగవంతుడు కరుణామయుడు. అవివేకంతో అజ్ఞానంలో ఉన్న మానవులను ఉద్ధరించడానికి ఇటువంటి సంఘటనలద్వారా గురువుల ద్వారా సమస్త మానవజాతికి అర్ధమయ్యేటట్లు సందేశాలు ఇప్పిస్తాడని.
      పూర్వం గురుశిష్యుల మధ్య సంభాషణ గానీ, సంఘటనలు గానీ పరిశీలిస్తే - అవన్నీ సకల మానవళికి శ్రేయస్సును కల్గించే ప్రభోదాత్మక సందేశాలేనని అర్ధమౌతాయి.
      పై కధనే పరిశీలించండి - సకల వేదపారంగతులైన ఆ పండితులకు తెలియని సత్యమా అది? కానీ మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు సంకల్పంచే ఒకోసారి అంతటివారు కూడా మాయలో పడిపోతుంటారని అన్పిస్తుంది. ఆ కాలములో వర్ణాశ్రమ పట్టింపులు ఎక్కువగా ఉండడంచే అది తగదని, అందరికీ అర్ధమయ్యేరీతిలో ఈ విధంగా తెలియజేశారని అన్పిస్తుంది.
      ఇక్కడ నాకు మరో కధ గుర్తుకు వస్తున్నది -
      పరమానందయ్య శిష్యుల కధలు చాలావరకు అందరికీ తెలుసు. శిష్యుల అమాయకత్వం, ఆ అమాయకత్వంలో వారు చేసే పనులు, గురువుగారి బోధలు ...... వీటినీ పరిశీలిస్తే మనల్ని ఉద్ధరించే సందేశాత్మకమైన ఆధ్యాత్మిక ప్రభోదాలే ఉంటాయి.
      ఆరోజు విశ్రమిస్తున్న పరమానందయ్యగారి కాళ్లు ఇద్దరు శిష్యులు పడుతూ, నేను పడుతున్న కుడికాలు గొప్పని ఒకరు, నేను పడుతున్న ఎడమకాలు గొప్పదని మరొక శిష్యుడు వాగ్వివాదం చేసుకుంటూ, చివరికి గురువుగారి కాళ్ళునే మరచెంబుతో ఒకరు, పానపాత్రతో మరొకరు కొట్టడం మొదలుపెట్టారు. ఆ బాధకి గురువుగారికి మెలుకువ వచ్చి ఆ రెండు కాలు తనవే నని, మీరు చేసిన ఈ అజ్ఞానపుపని నన్నే గాయపరిచిందని, మనిషి మనుగడకు రెండు కాళ్లు ముఖ్యమే కాబట్టి రెండు కాళ్లు గొప్పవేయని, అవివేకంను వీడమని చెప్పిన కధ మనకందరికీ తెలుసు.
      పూర్వం శివుడే గొప్పయని శైవులు, విష్ణువే గొప్పయని వైష్ణువులు పరస్పర నిందలతో, కొట్లాటలతో అవివేకంగా ప్రవర్తించేవారు. శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక ఈ రెండు రూపాలు మనిషి ఆధ్యాత్మిక జ్ఞానత్వమునకు ముఖ్యమే అని తెలుసుకొని అవివేకమును వీడమని.... ఈ కధ ద్వారా అదే తెలియజెప్పారు. ఏదైనా మనం అర్ధంచేసుకునే దృష్టికోణం బట్టే ఉంటుంది.

      తొలగించండి
    2. chakkati, chikkani samaadhanam. meeru challagaa undaali.

      తొలగించండి
  4. కలడంబోధి, కలండుగాలి, కలడాకాశంబునన్
    కుంభినింకలడగ్నిన్ దిశలం పగళ్ళనిశలన్ ఖద్యోతచంద్రాత్మలన్
    కలడోంకారమునన్ త్రిమూర్తులత్రిలింగవ్యక్తులందంతటన్
    కలడీశుండు కలండూ తండ్రీ వెదుకంగానేల ఈయాయెడన్

    ఇదే నిజం. తెలుసుకోగలిగితే కనకదాసే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు!
      ఇదే నిజం. తెలుసుకుంటే కనకదాసే....... చక్కగా చెప్పారు.
      చాలాకాలం తర్వాత స్మరణ బ్లాగ్ ని సందర్శించి స్పందించినందుకు ధన్యవాదములు సర్.

      తొలగించండి
  5. భారతి గారూ, మీ విశ్లేషణ బాగుంటుంది,
    కానీ ఈ కులవ్యవస్థ ఎప్పటినుండో మనలో పాతుకుపోయింది.
    పాపకి కథ చెప్పాలి అనిపించటం విశేషం. బాగుంది మంచి పోస్ట్.....మెరాజ్.

    రిప్లయితొలగించండి
  6. మెరాజ్ ఫాతిమా గారు!
    మీకు ఈ కధ నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  7. ఎవరైనా చూడని ప్రదేశం అంటే వేరే మానవుడనే అనుకోవాలి. తన శరీరం, దేవుడు, దయ్యాలు, పశుపక్ష్యాదులు, కీటకాలు చూడని ప్రదేశం అని అర్థం చేసుకోవడం సరికాదేమో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. SNKR గారు!
      ముందుగా మీ ఈ స్పందనకు నా ధన్యవాదాలండి.
      సాధారణంగా ఎవరూ చూడని చోటు అంటే వేరే మానవుడనే స్ఫురిస్తుంది. కానీ, ఇటువంటి కధనాలని భక్తికోణంలోనే చూడాలనుకుంటాను. శరీరం, దేవుడు, దయ్యాలు, పశుపక్ష్యాదులు, కీటకాలు ....... ఏదైతేనేం? ఏమైతేనేం?
      అన్నింటా, అంతటా పరమాత్ముణ్ణి కనకదాసు కాంచిన,
      అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని రామదాసు కీర్తించిన,
      సీతారామమయం ఈ జగమని ఓ హరిదాసు శ్లాఘించిన.... అది వారి వారి భక్తిత్వమును, తాత్త్విక దృష్టి ని తెలిపేవే. భక్తునికి భగవంతుని పట్ల ఉండాల్సింది భక్తిత్వంతో అంతట అనంతున్ని చూసే ఈ తాత్విక దృష్టే నన్నది సరైనదని నా భావనండి. ఏమంటారు?

      తొలగించండి
    2. కథ వరకూ అయితే, బాగానే వుందండి.
      ప్రాపంచికమైన ప్రసాదాన్ని, తాత్విక దృష్టితో ముడిపెట్టడం సరికాదేమో అనిపిస్తుంది. ప్రసాదం వేరే, భగవంతుడిని చూడటం వేరే. భగవంతుడిని చూడలేకున్నా, ప్రసాదమైతే అందరికీ కనిపిస్తూనే వుంటుందిగా. :)

      /శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక /
      శివకేశవుల అభేధ్యాన్ని మధ్వాచార్య చెప్పినట్టు రాశారు. ఆయన నారాయణుడొక్కడే సర్వోత్తముడు, మిగిలిన వాళ్ళంతా చాలా రెట్లు తక్కువ అని ఆచార్యులవారు లెక్కగట్టినట్టు, ఆ లెక్కలో నారాయణుడి వాహనం గరుడుని తరువాతనే శివుడు అని ఓ మధ్వ మతస్థుడు చెప్పగా ఎక్కడో చదివాను.

      తొలగించండి
    3. SNKR gaaru!!!

      మీరు విన్నది నిజమే!!!

      మధ్వ మతం జీవ తారతమ్యత మీద ప్రతిపాదించబడినది.

      జీవ-జడ భేదం
      జడ-జడ భేదం
      జీవ-జీవ భేదం
      జీవ-ఈశ భేదం
      జడ-ఈశ భేదం
      శివ కేశవులకే కాదు, సమస్త జీవ కోటి కి పైన చెప్పిన ఎదో ఒక విభాగం లో చేరుతుంది
      ఏ ఇద్దరు మనుషులు, ఒకేలా ఉండరు
      ఏ రెండు జంతువులు ఒకేలా ఉండవు.
      ఏ రెండు చెట్టూ-చేమలు ఒకేలా ఉండవు.
      అలాగే
      ఏ ఇద్దరు దేవతలు ఒక్కరే కాలేరు.
      ఆ బేధాన్ని సరిగా తెలుసుకోవడమే మధ్వశాస్త్ర సిద్ధాంతం.

      తొలగించండి
  8. SNKR గారు!
    భగవంతునికి నివేదన చేసిన పదార్ధమునే ప్రసాదమంటారు. ప్రసాదాన్ని పారమార్ధిక భావనతోనే స్వీకరిస్తాం. ప్రాపంచికంగా చూస్తే అది ఓ పదార్ధం మాత్రమే. నీటిని మామూలుగా తీసుకుంటే అది ప్రాపంచిక కోణంలో నీరు మాత్రమే. అదే జలముని భగవంతునికి అర్పించి తీసుకుంటే తీర్ధమౌతుంది. దేనినైన తాత్విక దృష్టిలో చూస్తే అది పరమ పవిత్రమే అవుతుంది. అన్నింటా భగవంతుడిని చూసే పరమ భక్తి కొందరు పుణ్యాత్ములది. ఇందుకు ఉదాహరణగా భక్త ప్రహ్లాదుని కధని చెప్పుకోవచ్చు. తండ్రి దృష్టిలో ఓ స్థంబం స్థంబముగానే కన్పించినది, ప్రహ్లాదుని దృష్టిలో ఆ స్థంబంలో నారాయణుడే కన్పించాడు. భక్తితత్వంలో వేరు వేరు అన్న బేధభావం ఉండదు. స్థూలదృష్టి కోణంలో భగవంతుడు కన్పించకపోయినను ప్రసాదం అంటే భగవంతుని నైవేద్యం అన్న భక్తిభావన హృదిలో కడులాడుతుండగా ఆ భావనతోనే స్వీకరిస్తాం కదండీ... అప్పుడు సూక్ష్మత్వంలో భగవంతుడిని దర్శించేనట్లే నని నా భావన.
    /శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక /
    శివకేశవుల అభేధ్యాన్ని మధ్వాచార్య చెప్పినట్టు రాశారు. లేదండీ...... మధ్వాచార్యులవారు చెప్పినట్లు వ్రాయలేదు.
    ఇది పరమానందయ్య అనే గురువుగారు తన శిష్యులకు తెలియజెప్పారని వ్రాశాను. ఓసారి గమనించండి.
    ఇక మధ్వ మతస్థుడు చెప్పగా, ఎక్కడో మీరు చదివినట్లుగా తెలిపిన విషయం గురించి నాకు తెలియదండి.
    కాకపోతే, శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు 'తత్వవేత్తలు' (సిద్ధాంతాలు - జీవిత విశేషాలు)అని వ్రాసిన పుస్తకంనందు
    ద్వైతతత్వవేత మద్వాచార్యులు వారి గురించి వ్రాసిన ఆర్టికల్ నందు "నిష్కామంగా నైతిక నియమాలను అనుష్టించాలి. నైతిక బాధ్యతలను నెరవేర్చాలి. నైతిక జీవితం జ్ఞానపరిశోధనకు తోడ్పడుతుంది." అని మధ్వాచార్యులవారు ఉద్భోదించినట్లుగా తెలిపారు. దీనిబట్టి చూస్తే మీరు చదివినట్లుగా చెప్తున్నది ఆ మధ్వ మతస్థుని వ్యక్తిగత భావన కావొచ్చేమో గానీ, మధ్వాచార్యులవారు ఆవిధంగా అన్నారన్నది అవాస్తవమేమో నని నా వ్యక్తిగత భావన.

    రిప్లయితొలగించండి
  9. భారతి గారు
    చిన్న సవరణ.

    అది మధ్వాచార్యులు కాదు.
    వ్యాసరాయల వారు

    రిప్లయితొలగించండి
  10. *జన్మచేత కాదు వర్ణం, కర్మ చేతనే...*

    బ్రాహ్మణులుగా పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు ..

    (వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..)

    1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

    2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

    3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

    4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

    5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు.

    6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

    7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు.

    వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు.

    8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

    9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

    ఇంకా ..

    1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు . జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

    2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

    3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

    ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

    1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

    2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

    3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు.

    4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

    5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

    6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

    7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13).

    8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

    9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

    10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

    వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవ.

    హిందూ ధర్మం జ్ఞానంమీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.
    వాట్సప్ సేకరణ

    రిప్లయితొలగించండి
  11. కడు చక్కటి పోష్టు , మహా
    త్ముడు మధ్వాచార్యుని కథతో , వర్ణములే
    ర్పడు నెటు? , బ్రాహ్మడవగ మను
    జుడు శూద్రాదులను దాటు చొప్పులు దెలిసెన్ .

    రిప్లయితొలగించండి