22, డిసెంబర్ 2012, శనివారం

వైరాగ్యం

                 నీ మనస్సు భగవద్విలీనం కాలేదంటే నీలో దృఢమైన వైరాగ్యం లేనట్లే - బాబా.

వైరాగ్యం అంటే -
                 విరాగం. రాగం లేకుండుట. దృశ్యమాన ప్రపంచమందు రాగం లేకుండుట.
                 శరీరము, ప్రపంచమందు విషయములు అనిత్యమైనవని గ్రహించి, ఇహ పరలోకములయందు ఏ విధమైన కోరికలు లేకుండా ఉండటం. 

అలాగని తాముచేసే పనిని, తమకుగల బాధ్యతలను, స్వధర్మాన్ని వదిలివేయడం వైరాగ్యంకాదు, తాము సాధించదలిచిన లక్ష్యానికి అడ్డుగా వచ్చే వాటినన్నిటినీ వదలడమే వైరాగ్యం.

[గృహస్థుడగు పురుషుడు సహధర్మిణితో నుండి తల్లితండ్రులను, బిడ్డలను చక్కగా పోషించి అతిధి సత్కారపరుడై గృహకృత్యములలో లోటు గలుగక చూచుకుంటూ జ్ఞాననిష్ఠుడై ఉండవలెను. అలానే స్త్రీ గృహధర్మం నిర్వర్తిస్తూ, పెద్దలకు పతికి శుశ్రూషలు చేస్తూ, పిల్లలను చక్కగా పెంచుతూ, అతిధి అభాగ్యులను ఆదరిస్తూ, బ్రహ్మనిష్ఠను అభ్యసించవలెను. ఇదియే గృహస్థులు చేయవలిసిన పంచమహాయజ్ఞములలో గల గొప్ప బ్రహ్మయజ్ఞమని మహర్షులు చెప్తారు] 

వివేకం వలన, విచారణ వలన వైరాగ్యం కలుగును. ఏది నిత్యమో, ఏది అనిత్యమో; ఏది సుఖమో, ఏది దుఃఖమో; ఏది మంచో, ఏది చెడో....... ఇత్యాదులను గ్రహించడమే వివేకం. దృక్కును, దృశ్యమును పరీక్షించుచుండుట విచారణ. విచారణ అనేది అంతరంగిక అన్వేషణ. ఈ విచారణయే వైరాగ్యంనకు దగ్గరదారి. సద్విచారణ వలెనే అనిత్యపదార్ధములయందు అనాసక్తి ఏర్పడుతుంది. ఇట్టి సద్విచారణ జనితమైన అనాసక్తి పేరే వైరాగ్యం.

అలాగే ప్రతికూల పరిస్థితిలో విషయాసక్తి విడిచిపెట్టడం వైరాగ్యం కాదు, అనుకూల పరిస్థితిలో కూడా విషయాసక్తి లేకపోవడం వైరాగ్యం. 

వైరాగ్యంనందు మూడవస్థలు గలవి. అవి 1. వైరాగ్యం యొక్క హేతువు, 2. వైరాగ్యం యొక్క స్వరూపం, 3. వైరాగ్యం యొక్క కార్యం.

దోషదృష్టిర్జిహాసా చ పునర్భోగేష్వదీనతా /
అసాధారణ హేత్వాద్యా వైరాగ్యస్యత్రయోప్యమీ //
విషయములయందుగల అనిత్యత్వ సాతిశయత్వాది దోషదర్శనమే వైరాగ్యమునకు హేతువు. విషయభోగములను విడుచుటయే వైరాగ్యస్వరూపం. మరల భోగేచ్చ కలుగకపోవుటయే వైరాగ్యము యొక్క కార్యమగును.

అలానే మనుజులలో కదిలాడే భావాలబట్టి వైరాగ్యమందు వైవిద్యాలున్నాయి. కొన్ని వైరాగ్యాలు తాత్కాలికమైనవి. అందులో కొన్ని -
1. మందవైరాగ్యం:- 
                         సంసార బాధలు వచ్చినప్పుడో, మహాత్ముల మాటలు విన్నప్పుడో, దైవిక గ్రంధములు చదువునప్పుడో, సత్సాంగత్యం కలిగినప్పుడో దైవకార్యంలో ప్రవేశించాలన్న భావన కలిగి, ఏదైనా నొక తరుణోపాయమగు ధ్యానమునో ధ్యాసనో ఏర్పరచుకునే తలంపు చేయడం మందవైరాగ్యం. (కొద్దిరోజులే ఈ సాధన. మరల ప్రాపంచికజీవనంలో పడిపోతారు)
2. శ్మశానవైరాగ్యం:-
                         ఆత్మీయులో, తెలిసినవారో మరణించినప్పుడు 'ఎవ్వరికెవ్వరొ, ఎన్నాళ్ళు ఉంటారో, ఎప్పుడు రాలిపోతారో తెలియదు. మరణం తప్పదని తెలిసినా బంధాలను పెంచుకోవడం, భార్యాపుత్రాదులకై, బందుమిత్రులకై పరితపించడం, కష్టపడి సంపాదించడం, చివరికి ఏదీ తోడురాక ఒంటరిగా కాటికి చేరుకోవడం....... ఏమిటిదంతా? ఇంతటిదానికి ఎందుకింత ప్రాకులాడడం........ ఇత్యాది ఆలోచనలతో వైరాగ్యభావంకు లోనుకావడం శ్మశానవైరాగ్యం. (కొలదిరోజుల్లోనే సంసారమునందు మునిగిపోతారు)
3. ప్రసూతివైరాగ్యం:-
                         ప్రసవవేదన పడుతున్నప్పుడు ఈ బిడ్డ ఒక్కరు చాలు, చాలు. ఈ నొప్పులు మరల మరల పడలేను..... అని ఆ బాధను తాళలేక అనుకోవడం ప్రసూతివైరాగ్యం. (మరల సంతోషంగా మరోసంతానికి సిద్ధం కావడం జరుగుతుంది)

4. పురాణవైరాగ్యం:- 
                         పురాణాలు వింటున్నప్పుడూ, పఠిస్తున్నప్పుడు దైవంనందు భక్తిభావం కుదిరి మోక్షం పొందేయాలి అని ఆక్షణమునే భావించి త్వరపడడం పురాణవైరాగ్యం. 
[ఈ పురాణవైరాగ్యం గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన ఓ కధ జ్ఞాపకం వస్తుంది. 
ఒకరాజు తన ఆస్థాన గురువుద్వారా ప్రతీరోజు భాగవత శ్రవణం చేయుచుండెను. ఏడురోజుల్లో పరీక్షిత్తు మహారాజునకు శుకమహర్షి భాగవతమును తెలిపి మోక్షమును కలుగజేసినట్లు గ్రహించి, తనకును భాగవతసారమంతా ఏడురోజుల్లో తెలిపి మోక్షమును కలుగజేయమని, అలా కలుగజేయనిచో వంద కొరడా దెబ్బలు మరియు రాజ్య బహిష్కరణ తప్పవని శాసించెను. గురువుగారు ఆరురోజులవరకు ఎంతో శ్రద్ధతో చెప్పినను మహావ్యాకులతతో ఉండడం చూసిన పరమభక్తుడైన గురువుగారి సేవకుడు 'దీనికేల వ్యాకులత చెందుతారు? ఏం భయపడకండి, రేపటిదినమున నేను మీ బదులుగా రాజుగారి దగ్గరకు వెళ్లి భగవత్కృప వలన అన్నిటిని చక్కబరిచి వచ్చెద'నని చెప్పెను. 
ఆ సేవకుడు మరుసటిరోజు ప్రాతఃకాలమున రాజుగారిని దర్శించి, మా గురువుగారు ఈ దినం తమను ఉపవాసముగా ఉండమనియు, ఈ దినం ఏడవరోజు అగుటచే పూజలు జరిపించమని తెలపమనిరి, అని చెప్పెను. అంతట ఆ రాజుగారు దినమంతయు ఉపవాసముండి నాలుగవయామమున పురాణ శ్రవణంనకు నిరీక్షించుచుండెను. ఆ సేవకుడు రాజమందిరం ప్రవేశించుసరికి జరగబోవు రాజుయొక్క ముక్తిని చూడవచ్చిన జనులతో క్రిక్కిరిసివుంది. తమ ఆచార్యులు ఈ దినం రాజాలరనియు, మోక్షధర్మము యొక్క రహస్యమును తమకు తెలుపుటకు తనాజ్ఞాపించి పంపిరనియు, ఈ చిన్నవిషయమునకు తానెలా రావలసియున్నదనియు గురువు చెప్పి పంపినట్లు సేవకుడు తెలిపెను. అంతట అచ్చట ఉన్న పండితులందరూ రాజుగారితో ఎవరైనను మనకేమి? ప్రయోజనము కలిగిన చాలునని చెప్పగా రాజు దానికి అంగీకరించెను. అప్పుడు ఆ భక్తుడగు సేవకుడు 'ఉపదేష్ట ఎవడైనను వారి వాక్యములను గురువాక్యముగా నమ్మవలయును. వినువాడెవడైనను శిష్యభావము గలిగియుండవలెను నని చెప్పగా రాజు సరే అనగా, ముహూర్తం దగ్గరకు వచ్చినది, రాజుగారి ముందట ఒకబల్లపై పంచభక్ష్యపరమాన్నములుంచి భాగవత పూజలు జరపవలసిందని చెప్పి, రాజుగారి రెండు చేతులు, కాళ్ళను సింహాసనమునకు కట్టివేసి, 'ఓ ప్రభువా! లగ్నం వచ్చినది, అయిదు నిముషముల లోపల పుష్కర ముహూర్తం కలదు, దీనిలోపల ఉపవాస విరమణ జరగవలెను. కావున ఈ పదార్ధములన్నియు వెంటనే భుజించినచో ముక్తి కలుగును' అని చెప్పగా; చేతులు, కాళ్ళు కట్టుబడినందుచే రాజు తినలేకపోయెను. ఈ కారణంచే ముక్తి అనుభవం కలుగలేదని ఆ సేవకుడు అని ఇలా వివరించెను - కాళ్ళు చేతులు బందింపబడి యున్నందున కంటికి కన్పిస్తున్న పదార్ధములను తినలేకపోయారు. అలానే మా గురువరుడగు పౌరాణికుడు, దివ్యోపదేశముల నన్నిటిని, భాగవత సారమంతయు మీకుపదేశించినను మీరు మీ మనస్సును భగవద్విలీనము చేసుకోలేక ఆశాపాశంలచే కట్టుబడియుండుటచే ముక్తానుభవం కలుగలేదు. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికే బ్రహ్మానుభవం కలుగును తక్కినవారికి వేదాంతశ్రవణం ఈ మోస్తారుగానే ఉండునని చెప్పెను. ఈ విషయం తెలిసుకున్న గురువుగారే ఆ భక్తసేవకునికి సేవకుడు అయ్యారన్నది వేరే విషయం. స్థిరమైన వైరాగ్య అభ్యాసలున్డాలి. కేవలం శాస్త్ర శ్రవణ పఠన వైరాగ్యాలు ఫలితాన్నివ్వవు] 
అంధకారమును పోగొట్టుటకు దీపం వెలిగించాలంటే ప్రమిద, తైలం, వత్తి ఎలా అవసరమో, అలానే అజ్ఞానాంధకారమును పోగొట్టుటకు సంపూర్ణవైరాగ్యమను తైలం, అనన్యభక్తియను వత్తి, పూర్ణమైన ప్రబోధం అనెడి పాత్ర (ప్రమిద) ఉన్నప్పుడే జ్ఞప్తి జ్ఞానమనెడు జ్యోతి వెలుగును. 

వైరాగ్య తైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే /
ప్రబోధపూర్ణపాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్ //
                                                - దక్షిణామూర్త్యుపనిషత్ 


కొన్ని స్థిరముగా నిలిచే దృఢమైనవైరాగ్యాలు. అందులో కొన్ని -            
1. మృదువైరాగ్యం:-
                         ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని, అందుకై గురువును ఆశ్రయించాలని, పరమార్దసిద్ధిని పొందాలని, పరితాపంతో ప్రయత్నించడం మృదువైరాగ్యం.
2. తీవ్రవైరాగ్యం:-
                         ఇదంతా మిధ్యాప్రపంచమని గ్రహించి, ప్రాపంచిక విషయలాలసను విడిచి, దేనియందు ప్రీతి లేకుండా పరమాత్మకై ప్రయత్నించడం తీవ్రవైరాగ్యం.
3. తీవ్రతరవైరాగ్యం:-
                         అనన్యదైవభక్తితో బ్రహ్మజ్ఞానామృతం గ్రోలడానికి ఒకే ధ్యాసలో మోక్షమనెడు సర్వేశ్వరప్రాప్తికై అవిశ్రాంతకంగా ప్రయత్నించడం తీవ్రతరవైరాగ్యం.
4. అతి తీవ్రతమవైరాగ్యం:-
                         జ్ఞానతాపంచే తపిస్తూ ఆత్మోపలబ్ధికొరకు ఆజన్మాంతం ప్రయత్నించడం అతి తీవ్రతమవైరాగ్యం. 


వైరాగ్యం ఎప్పుడూ మనస్సులోనే కలుగుతుంది. కాని, అరణ్యానికో, నిర్జనప్రదేశానికో, స్వధర్మాన్ని విడిచిపెట్టి ఏకాంత వాసానికో వెళ్ళడం వైరాగ్యం కాదు. 

                            దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు 
                               దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి

2 కామెంట్‌లు: