ఆహారశుద్ధి గురించి, వాని నియమములు గురించి, అలానే మాంసాహారం హింసాపూర్వక ఆహారమయినచో, శాకాహారంలో కూడా జీవముంటుంది కదా, మరి అది ఎందుకు హింసాపూర్వక ఆహరం కాదు? అలానే సాత్త్విక ఆహారం భుజించిన వారంతా ఎందుకు ధ్యానులు, జ్ఞానులు కాలేదని శైలజగారు గతంలో నేను పోస్ట్ చేసిన "శుద్ధ ఆహరం" చదివి తన సందేహాలను అడిగారు.
నాకు తెలిసినంతవరకు ఆ సందేహాలకు వివరణ ఇక్కడ ఇస్తున్నాను.
అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృతచిత్తానాం ధర్మస్సమ్యజ్న భాసతే //
ఆహారదోషంచే సర్వదా చిత్తమునకు కల్మషం కలుగును. కల్మషచిత్తం కలవారికి ధర్మరహస్యమైన జ్ఞానం ప్రకాశింపదు.
అందుకే ఆధ్యాత్మిక సాధకులకు ఆహరశుద్ధి, ఆహారనియమములు తప్పనిసరి.
మాంసాహారమునకు శాకాహరమునకు గల భేదం -
శాకాదులయందు జీవశక్తి యున్నప్పటికీ అవి జడములు. వాటికి ఇంద్రియములు లేవు. ఇంద్రియములు లేకపోవడం వలన వాటికి సుఖదుఃఖములు కలుగుటకు అవకాశం లేదు.
జంతువులు మనుష్యులవలె స్త్రీపురుష సంయోగంచే నుత్పత్తి యగును గాని, సస్యముల వలె నుద్భిజ్జములు కావు. సస్యవర్గములు భూమి, నీరు మొదలగువాటి సహాయముతో పాటు, ఎక్కువగా సూర్యశక్తిని గ్రహించి, సూర్యశక్తిచే వృద్ధి అగుచున్నందున సూర్యుని యందున్న శక్తి సస్యాదులయందధికముగా యున్న కారణంచే వాటిని భుజించువారికి శుద్ధత్త్వం కలుగును. సత్త్వగుణం అలవడును. సూర్యుడు తమస్సును నాశము జేయునట్లు, శాకాహారంచే తమోగుణం నాశన మగును.
ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధి: సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతి: /
స్మృతిలాభే సర్వగ్రంధీనాం విప్రమోక్షః //
సాత్త్వికమైన శుద్ధాహారంచే మనఃశుద్ధియు, మనఃశుద్ధిచే దృఢమైన ప్రజ్ఞయు గల్గును. దృఢప్రజ్ఞచే సర్వగ్రంధులు నిశ్శేషముగా నాశంపొందును.
ద్యానమూ, జ్ఞానమూ ఎప్పుడు అలవడతాయంటే -
మానవునికి స్థూల, సూక్ష్మ, కారణలనెడి దేహములు కలవు. శుద్ధమైన సాత్త్వికాహారముచే స్థూలదేహము ఇంద్రియములు మాత్రమే శుద్ధములగును. సూక్ష్మ దేహానికి ఈ ఆహారం కొంతమాత్రమే సహాయపడును. కరుణ, శాంతం, సత్యం, అధ్యయనం, ప్రేమ, దైవభావం, సమత్వం, ఏకాత్మభావనం, దేవోపాసన బ్రహ్మచర్యం గురు, దేవ, పూజయుక్తమైన సాత్త్వికాహారం ప్రాణాయామాది యోగములచే స్థూలదేహ శుద్ధి గలుగును. అటుపై కారణదేహశుద్ధతకు పై రెండు శుద్ధతవలన జ్ఞానం అలవడి పవిత్రమగును.
సాత్త్వికాహారులందరూ ఎందుకు జ్ఞానులు కాలేకపోతున్నారంటే -
ఆహరశుద్ధి అంటే తీసుకున్న ఆహరం సాత్త్వికముగా ఉంటే చాలదు. ఆ ఆహారం వచ్చిన మార్గము కూడా సత్యముగా ఉండవలయును. సత్యముగా సంపాదించిన ఆహారమును యుక్తముగా, నియమముగా దైవారాధన చేసి భుజించవలెను.
శ్రీశంకరభగవత్పాదుల వారు చెప్పినట్లు -
జిహ్వతో భుజించెడు ఆహారమే ఆహరం కాదు. కర్ణ, త్వక్, చక్షు, ఘ్రాణముల ద్వారా స్వీకరించేది కూడా ఆహారమే అవుతుంది.
ఇక ఆహారశుద్ధి యొక్కటే చాలదు, ఆత్మశుద్ధియు కలిగి యుండవలయును. అలానే ఆత్మశుద్ధి గలిగిన చాలదు, ఆహారశుద్ధియు కలిగి యుండవలయును. పైన చెప్పినట్లు స్థూల సూక్ష్మ దేహాలలో శుద్ధతా లోపము వలననే కొందరికి శుద్దాహారము కలిగియుండినను ఆత్మజ్ఞానం కలుగకపోవుటకును, అలానే ఆత్మ శుద్ధమైనది జ్ఞానమైనదని విచారణచేత తెలుసుకొనినను ఆత్మజ్ఞానం అనుభవమునకు రాకపోవుటకున్ను కారణమని గ్రహించాలి. కావుననే "శుద్ధిద్వయం మహత్కార్యం దేవానామపి దుర్లభం" అని శాస్త్రం వక్కాణిస్తుంది.
ఈ సూక్ష్మ కారణ దేహములను శుద్ధపరుచుట తెలియకపోవుటచేతనే స్థూలమైన సాత్త్వికాహారమును భుజించువారందరిలో ధ్యానం, జ్ఞానం అలవడడం లేదు.
ఇక గృహస్థులు ఎంత హింసారహితముగా ఉందామనుకున్నను అనివార్యమైన ఐదు విధములైన హింసలు వచ్చుచుండును.
అవి -
పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్కరః /
కండనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్ //
1. చుల్లీ :- కట్టెలు మొదలగువాని వలన వండునప్పుడు కట్టెలలో గల చెదలు మొదలగు క్రిములు నాశం.
2. పేషణి :- విసరుచున్నప్పుడును, నూరుచున్నప్పుడును కలిగెడు ప్రాణహింస.
3. ఉపస్కరః :- ఇతర గృహకృత్యములు చేయునప్పుడు కలిగెడు ప్రాణహింస. (బూజులు దులుపుట, తుడుచుట, చిమ్ముట, అలుకుట మొదలగు గృహ శుభ్రత పనులు, అలానే సస్యములలో నాగలితో దున్నుతున్నప్పుడు, పారతో చెక్కుతున్నప్పుడు కొన్ని క్రిములకు కలుగు ప్రాణహింస)
4. కండనీ :- ధాన్యాదులు దంచుతున్నప్పుడు కలుగు హింస.
5. ఉదకుంభః :- నీరు మరిగించినప్పుడు కలుగు ప్రాణహింస.
అందుకే ప్రతిదినం పంచయజ్ఞపరాయణులై యుండవలయునని మనుస్మృతి చెప్తుంది.
పైన తెలిపినవి లేకపోతే మానవునికి మనుగడ కష్టం కాబట్టి, ఇటువంటి అనివార్యమైన హింసల నివృత్తి కొరకు పంచయజ్ఞములు విధింపబడినవి.
అవి -
అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్ /
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో తిధిపూజనమ్ //
1. బ్రహ్మయజ్ఞము :- వేదోపనిషద్భగవద్గీత పారాయణము లేదా ప్రణవాది మంత్రజప భగవత్కీర్తన పూజాదులలో ఏదో ఒకటి ఆచరిస్తూ భోజనం చేయడం.
2. పితృయజ్ఞము :- తర్పణాదులచే పితరులను తృప్తి పరచుట.
3. దైవయజ్ఞము :- అగ్ని యందు వ్రేల్చుహోమము (వైశ్వదేవము).
4. భూతయజ్ఞము :- కుక్క, పిల్లి, కాకి మొదలగు చిరుప్రాణులకు ఆహారమిడుట.
5. మనుష్యయజ్ఞము :- అతిధిసత్కారం (బ్రహ్మచారులకు, సన్యాసులకు, సాధువులకు, తీర్ధయాత్రికులకు పూజ్యభావంతో భోజనం పెట్టుట, రోగులు, అంగహీనులు, నిస్సహాయులకు కరుణతో అన్నదానం చేయుట.
ఆహార నియమములు -
హితం మితం సదాశ్నీయాద్యత్సుఖే నైవ జీర్యతే /
దాతు: ప్రకుప్యతే యేవ తదన్నం వర్జయేద్యతి: /
ఎల్లప్పుడూ ఆహరం మితంగాను, శుద్ధమైనదిగాను, ప్రీతికరమైనదిగాను ఉండవలెను. సుఖముగాను త్వరితముగాను జీర్ణమగునట్టి ఆహారమునే భుజించవలయును. ధాతుప్రకోపం కల్గించునట్టి అన్నమును భుజించరాదు.
అన్నమని చెప్పుటచే బియ్యపు అన్నము అని అనుకోకూడదు. 'అద భక్షణే' అన్న దాతువునుండి అన్న శబ్ధమేర్పడినది. కనుక భక్షించున దంతయు అన్నమనియే భావించవలెను.
ద్వౌ భాగౌ పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్ /
మారుతస్య ప్రచారార్ధం చతుర్ధమవశేషయేత్ //
సాధకులు అందరూ ఉదరమును సగభాగము అన్నము చేతను, పాతికభాగము జలము చేతను నింపి, మిగిలిన పాతిక భాగము గాలి సంచారార్ధముగా నుంచువారు బ్రహ్మనిష్ఠ యందు సర్వదా యుండగలరు. వీరికి వ్యాధులు రావు.
సాయం ప్రాతర్మనుష్యాణామశనం దేవనిర్మితమ్ /
నాన్తరం భోజనం దృష్టముపవాసీ తధా భవేత్ //
మనుష్యులకు దైవనిర్మితమగు భోజనము - ఉదయము, సాయంకాలము రెండుసార్లు మాత్రమే యేర్పడినది. అనగా మధ్యాహ్నం లోపల ఒకసారియు, సాయంకాలమున ఒక పర్యాయము మాత్రమె యుండవలయును. అట్టివారికి ఎలాంటి వ్యాదియు ఉండదు. ఈ రెండువేళల తప్ప ఇతర సమయములలో నేమియూ భుజింపనివారు ఉపవాసఫలమును పొందుదురు.
మోక్షధర్మేషు నియతో లఘ్వాహారో జితేన్ద్రియః /
ప్రాప్నోతి బ్రాహ్మణః స్థానం తత్పరం ప్రకృతేర్ధ్రువమ్ //
మోక్షమార్గమందు ప్రవర్తించువారు నియమశీలులై, యుక్తాహారులై జితేన్ద్రియులై యుండినచో ప్రకృతికి పరమై, శాశ్వతమై యుండు పరబ్రహ్మస్థానమును పొందుదురు.
ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః /
చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం త్రుట్యన్తి గ్రంధయస్పుటమ్ //
మీ సందేహ నివృత్తి చాలా విపులంగా చక్కగా ఉంది.
రిప్లయితొలగించండిరాజమౌళి గారు,
తొలగించండిమీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములండి.
namaskaaramulu bharatigaru.
రిప్లయితొలగించండిmee vivarana baagundi. dhanyavaadamulandi.
ayite sookshma dehashuddhata kai satyam, karuna. daivopasana ..... latho paatu brahmacharyam ani koodaa annaaru kadaa. gruhasthulaku brahmacharyam vartinchademo? ante gruhasthulaku brahmacharyam elaa saadhyam? visigistunnaanani anukunte javaabu ivvakandi.
శైలజగారికి,
తొలగించండినమస్కారమండి.
కాస్త తీరిక లేకపోవడంచే మీ వ్యాఖ్యను చూడడం ఆలస్యమయినది.
భుజించెడి ఆహారమే ఆహరం కాదని అర్ధమైయుంటుంది. హింస అనేది ఆహారంలోనే కాదు, మాటల్లో చేతల్లో ... ఎన్నో రీతుల్లో తెలియకుండనే జరుగుతుంటుంది. ఉదాహరణకి నమ్మక ద్రోహాలు, మోసపుచ్చడాలు, అలానే మాటల ద్వారా ఎవర్ని నొప్పించిన అది ఓ వ్యక్తిని నిర్భందించి కత్తితో హత్య చేసిడి హింస కంటే ఘోరమైనదని పెద్దలు అంటుంటారు. అయితే, సాధకులకు స్వభావదోషాలు తొలగి సాత్త్వికగుణం అలవడాలంటే అందుకు శుద్ధాహారం అవసరమని గ్రహించాలి. ఎందుకంటే -
మానవులు భుజించెడు ఆహరం జఠరాగ్ని వలన మూడుభాగాలుగా (మలమూత్రములుస్థూలభాగముగాను, మధ్యమభాగం మాంసముగాను, కనిష్టభాగం మనస్సుగాను) మారుచుండును. కావున మనస్సు శుద్ధము కావలసియుండిన ఆహారము శుద్ధముగా యుండవలెను.
ఒకింత వివరణగా చెప్పాలంటే ... ప్రాణాపానముల శక్తివలన యేర్పడిన జఠరాగ్ని అన్నపానాదులను రసరక్త మాంసాది సప్తధాతువులుగా మార్చుచుండును. దీనివలననే స్థూల సూక్ష్మ శరీరములేర్పడును. ఇక కనిష్టభాగములో గల పృధ్వీతత్త్వం అహంకారముగాను, జలతత్త్వం చిత్తముగాను, అగ్నితత్త్వం బుద్ధిగాను, వాయుతత్త్వం మనస్సుగాను, ఆకాశతత్త్వం అంతఃకరణంగాను మారుచుండును. పృధ్వీతత్త్వం కఠినమగుటచే అహంకారం కఠినంగా, జలతత్త్వం చిత్తమగుటచే చిత్తమునకు చింతనాశక్తియు, అగ్నితత్త్వం బుద్ధియగుటచే బుద్ధికి అన్నిటిని తెలుసుకొనెడిశక్తియు, వాయుతత్త్వం మనస్సగుటచే మనస్సుకు చలనస్వభావమును కలుగుచున్నవి. నాలుగు భూతములు వ్యక్తములుగాను, ఆకాశ మవ్యక్తముగాను నుండునట్లున్ను, బుద్ద్యాదులు వ్యక్తముగాను, అంతఃకారణము అవ్యకమగుచున్నది. అందుచే శుద్ధాహారం (సత్త్వగుణమును అలవర్చుకుంటూ, సత్యార్జిత ధనముచే శుద్ధమైన పదార్ధములను, యుక్తముగా నియమితకాలములో దైవోపాసన చేస్తూ భుజించినప్పుడే అది సాత్త్విక ఆహరముగును) అవసరం.
ఇక బ్రహ్మచర్యం గురించి నాకు తెలిసినది చాలా తక్కువ. నా వీలు వెంబడి నాకు తెలిసిన ఆ విషయములను పోస్ట్ చేస్తాను.
హితం మితం చ భుంజీత, న భుంజీ తామితం హితమ్
రిప్లయితొలగించండిహిత మిష్టం చ భుంజీతే, త్యేష ధర్మ స్సనాతనః
(హితమైన పదార్ధాలనే తినాలి. అవైనా మితంగానే తినవలెను. హితమైనవి ఇష్టంగా ఉన్నంతవరకే తినవలెను. ఇది సనాతన ధర్మం.
నైస్ పోస్ట్ భారతిగారు.
చాలా బాగా చెప్పారండి...
రిప్లయితొలగించండిహితం మితం చ భుంజీత, న భుంజీ తామితం హితమ్
రిప్లయితొలగించండిహిత మిష్టం చ భుంజీతే, త్యేష ధర్మ స్సనాతనః
ఈ శ్లోకం ఎక్కడిదో చెప్పగలరు దయచేసి... 8008636981