కొన్నిరోజుల క్రితం తిరుపతి వెళ్ళాం, నా మనవళ్ళు {మా అమ్మాయి సంతానం, మొదటపాప శ్రీమాన్వి (స్మరణ సందర్శులకు సుపరిచితం), రెండవసారి ఇద్దరు బాబులు (కవలలు), అభినవ్ రామ్, అభిజిత్ రామ్} బాబులిద్దరికి పుట్టుజుత్తు తీయించడానికి.
పుట్టుజుత్తు తీసేసిన తర్వాత దర్శనానికి వెళ్తుండగా ఓ ఆమె వచ్చి నామాలు బాబులకు పెట్టి "అచ్చంగా బాలగోవిందులు"లా వున్నారు అని అనగా,
అచ్చంగా బాలగోవిందులు
ఆహా! బాల గోవిందులు నా మనవళ్ళు అని అనుకోగా, మనసంతా ఆనందంతో నిండిపోయింది. 'ఇంతటి అదృష్టాన్ని అనుగ్రహించిన నీకు నేనెమివ్వగలను వేంకటేశా' అని అనుకోగానే నవ్వువచ్చింది. సర్వమూ తనదైన ఆ సర్వేశ్వరునికి నేనిచ్చేది ఏముంటుందీ? మనసార నమస్కరించడం, పాహిమాం పాహిమామని ప్రార్ధించడం, శరణు శరణని వేడుకోవడం తప్ప... అని అనుకుంటుండగా, నాకెంతో ఇష్టమైన అన్నమయ్య సంకీర్తన గుర్తుకొచ్చింది. ఆ సంకీర్తన మదిలో కదులాడుతుండగా, శరణాగతి భావంతో దైవాన్ని దర్శించుకోవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి.
ఇంతకీ నా మదిలో కదిలాడే ఆ సంకీర్తన ఏమిటో చెప్పనే లేదు కదా. ఆ పరమోత్తమ సంకీర్తన ఇదే -
ఏ దుపాయము యే నిన్ను చేరుటకు / ఆదినంత్యములేని అచ్యుతమూరితివి
వెలయ నీగుణములు వినుతించేనంటే /తెలియ నీవు గుణాతీతుడవు
చెలరేగి నిన్ను మతి జింతించేనంటే / మలసి నీవచింత్యమహిముడవు
పొదిగి చేతుల నిన్ను బూజించేనంటే / కదసి నీవు విశ్వకాయుడవు
అదన నేమైన సమర్పించేనంటే / సదరమై అవాప్తసకలకాముడవు
కన్నులచేత నిన్ను గనుగొనేనంటే / సన్నిధి దొరక నగోచరుడవు
యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవవి / వన్నెల శరణనేవాక్యమే చాలు
ఆదీ అంత్యమూ లేని అచ్యుతమూర్తివి అయిన నిన్ను ఉపాసించే మార్గం ఏదీ? నిన్ను చేరాడానికి ఉపాయం ఉందా? ఉంటే అది ఏదీ? అని అన్నమయ్య అంటూ ఇలా కీర్తించాడు -
నీ గుణములు కీర్తించుదామంటే నీవు గుణాలకన్నింటికీ అతీతుడవు. మదిలో నిన్ను గూర్చి చింతించుదామనుకుంటే నీకై చింతించుటకు సాధ్యంగాని అనంతమైన మహిమలు కలవాడివి. ఇక నా చేతులతో నిన్ను పూజిద్దామంటే, నీవు అందుకు సాధ్యంగాని విశ్వమయుడవు. మరి ఏదైనా నీకు సమర్పించుదామంటే, నీవు అన్నికోరికలు తీరినవాడివి. నా కన్నులతో నిన్ను చూద్దామంటే, నీవు అగోచరుడవు. అందువల్ల ఓ వేంకటేశా! అన్నింటా మేలైనది, నీకు శరణు అనడమే, నిన్ను శరణుపొందడమే.
*****
వావ్ ... బాలగోవిందులు ఇక్కడ బాలకృష్ణులయ్యరే!
నా మనవళ్ళు బాలగోవిందులై గుర్తుచేసిన అన్నమయ్య సంకీర్తన పైనది కాగా, బాలకృష్ణులై గుర్తుచేసిన మరో సంకీర్తన యిది -
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు / వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు వోయరే
గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన / చేమపూవు కడియాల చేయిపెట్టి
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార / వేమరు వాపొయె వాని వెడ్డువెట్టరే
ముచ్చువలె వచ్చి తన ముంగిట మురువుల చేయి / తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నొరినెల్ల జొల్లుగార / వొచ్చిలి వాపోవువాని నూరడించరే
ఎప్పుడు వచ్చెనో మా యిల్లుజొచ్చి / పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన / తప్పకుండా బెట్టె వాని తలకెత్తరే //
కుదురుగా కూర్చోక, ఉన్నచోట వుండక, ఆ వాకిట ఈ వాకిట, చెట్టూపుట్టా, సందూ గొందూ అనక అటూ ఇటు పరుగులు తీసే చిలిపికన్నయ్యను చూస్తూ గోపకాంతలు మురిపంగా ఇలా అనుకుంటున్నారట ...
ఈ ముద్దులోచ్చే బాలుడు ఎక్కడివాడమ్మా, వాని పట్టితెచ్చి పొట్టనిండా పాలు పోయండే.
వెన్నను కాజేద్దామని ఆరిందలా పరిగెట్టుకుంటూ వచ్చి కాగుతున్న వెన్నకుండలో తన కడియాల చేయిపెట్టి, చేయి చురుక్కుమని, చెక్కిట కన్నీరు కారుతుండగా, తన నవనీతచోరత్వం బయటపడకూడదని మనల్ని ఏమార్చుతూ చీమకుట్టిందని వాపోతున్న కృష్ణయ్యను ఊరడించరే ...
దొంగలా వచ్చి తన బుజ్జిచేతిని చిలుకుతున్న పెరుగులోన పెట్టగా, కవ్వం తగలగా, చేయినొచ్చెనని నోరంతా జొల్లుకారెట్లు ఏడుస్తున్న ఈ కన్నయ్యను కాస్తా ఊరడించండ్రా ...
బాలకృష్ణుని చిలిపిచేష్టలు, రేపల్లే పడుచుల ముచ్చట్లూ, మురిపాలు ... ఎంతవిన్నా, ఎంతచదివినా ఆ ఆనందం తనివి తీరనిది.
మొదటంతా తన భక్తులైన గోపకాంతల చెంత నవనీతచోరత్వం గురించి ఆ గోపికలు మురిపంగా చెప్పుకోవడంను అన్నమయ్య కీర్తించాడు. {భక్తుల భవబంధపాశాల విమోచన చేసే ఈ చోరత్వం వెనుక ఓ మర్మముంది. ఆ వివరణ
ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు}. ఇంతవరకు కృష్ణయ్య బాలలీలలు తెలిపిన అన్నమయ్య చివరి చరణంలో ఇలా కీర్తించాడు -
ఎప్పుడు వచ్చెనో మాయింట్లోనికి. వచ్చి పెట్టెలో చెయ్యి పెట్టెను. ఇక ఈ పెట్టెను తప్పకుండా అసమానుడైన వేంకటేశ్వరుని తలకెత్తరే ... అని అన్నమయ్య అనడంలో అంతరార్ధం అనంతం.
ఇంట్లోనికి రావడం, పెట్టెలో చెయ్యి పెట్టడం, ఆ పెట్టెను భగవంతుని తలపై పెట్టమనడం ... కాస్తా ఆలోచిస్తే ఇందులో సూక్ష్మార్ధం అవగతమౌతుంది.
ఆ సూక్ష్మార్ధం తెలుసుకునే ముందు ఓసారి మనసార అన్నమయ్యను స్మరించుకోవాలని వుంది.
తాను తరించి, మనలనూ తరింపజేసే వాగ్గేయకారుడు "అన్నమయ్య". ఈయన సంకీర్తనలు వేదాంత భావగర్భితాలు. ప్రతీ కీర్తనలో వేదాంత రహస్యాలు, ఆధ్యాత్మిక సూచనలు వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సంకీర్తనలో బ్రహ్మతత్త్వ సారాంశముంటుంది.
ఆధ్యాత్మిక సాధకుని ప్రయత్నంలో తొలుత ఎంతో అయోమయం, ఎన్నో అర్ధంకాని విషయాలు, అటుపై ఎంతోకొంత అస్థిరత్వం, అంతం అగుపించని అన్వేషణ, తీరం తెలియని పయనం, అంతర్యామిని కనుగొంటానా అన్న ఆవేదన, అనంతున్ని పొందాలన్న ఆరాటం, వీడని వాసనల వలన ఆందోళన, అన్నింటినీ వీడి మనస్సుని అధిగమించాలన్న పోరాటం ... ఇలా ఎంతో సంఘర్షణతో నలిగిపోతున్న మనస్సును చల్లగా తాకి, దారిచూపేవే అన్నమయ్య సంకీర్తనలు. సాధకునికి అన్నమయ్య ప్రతీ సంకీర్తన సదా స్మరణీయం.
అయితే, అన్నమయ్య పాటలు కొన్ని త్వరగా అర్ధం కావు. అందుకు కారణం - ఈయన వాడిన కొన్ని పదాలు నేడు మరుగున పడిపోయాయి. జన వ్యవహారికంలో లేవు. అయినను అవగాహన చేసుకోవడానికి ఒకింత ప్రయత్నం చేస్తే, ఆప్పుడు అవగతమౌతుంది ఈయన పలికిన పలుకెల్ల పదకవితై పరమాత్ముణ్ణి ఎలా మెప్పించ గలిగిందన్నది.
పదకవితా పితామహుడయిన ఆన్నమయ్య విరచిత సంకీర్తనలు వేనవేలు.
దాచుకో, నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి
పూచి నీ కీరితి రూపు పుష్పములివియయ్యా
ఒక్క సంకీర్తనే చాలు, ఒద్ధికై మము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి ఉంచనీ ... అన్న ఆయన భావంలో అతిశయోక్తి లేదు.
ప్రతీ పలుకు పారమార్ధిక పాటైన పదజీవనునికి పాదాభివందనాలు.
ఇక పై సంకీర్తనలో ఆ చివరి చరణం యొక్క సూక్ష్మార్ధంను పరిశీలిస్తే -
కర్మ చేయక క్షణమైనను జీవించలేం. ఉన్నస్థితినుండి ఉన్నతస్థితికి చేరుకోవాలనే ప్రయత్నమే ప్రతీ ప్రాణీ చేయు 'కర్మ'. చేసే ప్రతీ కర్మ యొక్క ఫలితం మనస్సులో సూక్ష్మాతి సూక్ష్మమైన ముద్రను వేస్తుంది. దీనినే 'వాసన' అంటారు. ఈ వాసనలననుసరించే మనలో కోరికలు, తలపులు జనిస్తుంటాయి, పునర్జన్మలకు హేతువవుతుంటాయి. అందుకే ఈ వాసనలుగా పరిణమించే కర్మలు ఉన్నతంగా, అచ్యుతున్ని అందుకునేలా ఉండాలి. ఏ కర్మలాచరిస్తే అది 'వాసన'గా మనల్ని బాధపెట్టాక, బంధీ చేయక వుంటుందో, అటువంటి సత్కర్మలు సద్భావనతో ఆచరించగలగాలి. అటుపై ఆ సత్కర్మ ఫలితాన్ని ఆసక్తితో, ఓ సంపదగా మన మది అనే బోషానంలో దాచుకోక, ఆ బోషానాన్ని అంటే ఆ పెట్టెను ఆ అనంతున్నిపై పెట్టేస్తే ... అంతా ఆయనకే సమర్పించేస్తే ... మనసు వెదురుబొంగులా డొల్లవ్వదా, అది ఆ భగవంతుని చేతిలో పిల్లనగ్రోవి కాదా? ఇలా చేస్తే జీవితం సార్ధకం కాదా? ఈ ప్రయత్నం పరమాత్ముణ్ణి చేర్చదా?
నిష్కామ కర్మయోగం అంటే ఇదే. దీనిని ఆచరిస్తే జన్మ పావనమౌతుందన్న సత్యాన్ని తెలియచెప్తుంది పై కీర్తనలో చివరి చరణం.
అమ్మమ్మా! నేను కూడా కృష్ణునిలా తయారయ్యాను చూడు అని అంటున్న నా చిట్టితల్లి శ్రీమాన్వి
ఇంత చక్కటి సంకీర్తనలను స్మరించుకునేటట్లు చేసిన నా చిన్నారి మనవళ్ళుకు శుభాశీస్సులతో ఈ పోస్ట్ ను ప్రేమగా వారికి అంకితమిస్తున్నా.