ఉదయం మాఇంటిలో పనిచేస్తున్నామే ఇల్లు ఊడుస్తూ, తన కష్టసుఖాలను చెప్పుకుంటూ చివరగా ఈ మాట అంది - "దేనికైనా యోగం ఉండాలమ్మా" అని.
అవును....నిజమే, దేనికైనా "యోగం" ఉండాలి.
యోగం అంటే?
పుట్టిన దెల్లను గిట్టక మానదు. గిట్టినది మరల పుట్టియే తీరును. (జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్య చ) ఇది అనివార్యమగు ప్రకృతి నియమం.
పుట్టడం, కర్మానుబంధాలలో చిక్కుకోవడం, సుఖదుఃఖాలు అనుభవించడం... మరణించడం.
తిరిగి పుట్టడం కర్మానుబంధాలలో చిక్కుకోవడం, సుఖదుఃఖాలు అనుభవించడం... మరణించడం.
దీనికి అంతం లేదా? పునర్జన్మ లేకుండా చేసుకోలేమా?
చేసుకోగలం, అంతమనేది ఉంది.
పుట్టి నశిస్తుంది కర్మానుసారం వచ్చే భౌతికదేహమేగానీ, ఆ దేహాన్ని ఆశ్రయించుకున్న ఆత్మకాదు. కానీ జనన మరణ పరిభ్రమణానికి కారణం ఈ ఆత్మే. తన స్వస్థానమైన అతీంద్రియ, అదృశ్య, అద్భుత చైతన్యశక్తిస్వరూపాన్ని (పరమాత్మని) గుర్తించి ఆ స్వరూపంలో ఐక్యమయ్యేంతవరకు ఇలా జనన మరణ చక్రాన్ని అంటిపెట్టుకొని తాను పరిభ్రమిస్తూనే ఉంటుంది. అంటే పరమాత్మలో ఐక్యమయ్యేంతవరకు ఎవరి ఆత్మకైన పునరపి జననం, పునరపి మరణం తప్పదు. ఆత్మ పరమాత్మలో ఐక్యమవ్వడమే మోక్షం. జన్మంటూ లేని ఈ మోక్షాన్ని పొందేదుకు ఏదైనా దారి ఉందా? ఉంది - అదే 'యోగ' సాధన.
యోగసాధన ద్వారా జననమరణచక్రాన్ని జయించి మోక్షత్వం పొందవచ్చును.
ఐతే యోగమంటే మోక్షమా?
కాదు, కానే కాదు.
మరి యోగమంటే ఏమిటి?
గమ్యస్థానమైన మోక్షాన్ని పొందడానికి ఓ ముఖ్య సాధనోపకరణమే "యోగం".
యోగం అంటే కలయిక. చిత్తం ఆత్మయందు కలయికయే "యోగం".
ఆత్మానుసంధానమే "యోగం".
స్వస్వరూపస్థితి అంటే 'నేను' అని లోపల తెలియజెప్పుతున్నది ఏదైతే ఉందో, దానిని తెలుసుకొని దానియందు లయించడమే "యోగం".
యోగస్థః కురు కర్మాణి సజ్గం త్యక్త్వా ధనుంజయ
సిద్ధ్యసిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే // (శ్రీమద్భగవద్గీత)
ధనుంజయా! యోగనిష్టుడవై నీ నిత్యకృత్యములను నిర్వహింపుము. కర్మలయందు సంగము, లేక ఆసక్తి వీడుము. సిద్ధించిన దానియందును, సిద్ధింపని దానియందును సమబుద్ధి కలిగియుండుటయే "యోగం". అంటే సమత్వమే "యోగం".
యోగశ్చిత్త వృత్తి నిరోధః (పతంజలి యోగసూత్రం)
అంతఃకరణ వృత్తుల నిగ్రహమే "యోగం".
యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణమ్
ఇంద్రియములన్నియు లయించి తన స్వస్వరూపస్థితియందు స్థిరంగా నిలుచుటయే "యోగం".
వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య విముచ్యతే యోగోయం ముఖ్య ఉచ్యతే //
మనస్సుయొక్క వృత్తులను నిగ్రహించి, ఆ మనస్సును ఆత్మయందు ఏకీభావం చేయుటయే ముఖ్యమైన "యోగం".
యోగహీనం కధం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువమ్
తస్మాత్ జ్ఞానం చ ముముక్షుర్ధ్రుఢమభ్యసేత్ //
యోగం లేనిదే మోక్షదాయకమైన జ్ఞానం సిద్ధించుట కష్టం. ఈ కారణంచే ముముక్షువు అవ్వాలనుకునేవారు వీటిని తప్పకుండ అభ్యసించవలెను.
యోగాత్సంజాయతే జ్ఞానం జ్ఞానాన్ముక్తి: ప్రజాయతే
యోగం చేతనే శీఘ్రంగా జ్ఞానోదయమగును. జ్ఞానముచే ముక్తి సిద్ధించును.
ఈ విధమైన యోగసాధనవలన మనస్సు సమత్వభావనతో శుద్ధి అవుతుంది. శుద్ధైన మనస్సుతోనే భగవంతుడిని(శుద్ధ మనసై వాసుద్రష్టవ్యః) తెలుసుకోగలం. అప్పుడే ఆత్మ పరమాత్మలో సంలీనమై (తధశ్చ పరమాత్మనః సమవాయః) జననమరణములు మోక్షత్వమును పొందుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి