17, జనవరి 2013, గురువారం

అమ్మా! నాకో సందేహం.....


ఓం... నమో నారాయణాయ
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
 దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
 హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
 అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
 వంకర కన్నుల మీరు శంకర కింకరులు
 వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు.....

ఉదయం ఈ పాటను మా అమ్మాయి అనూష పాడుతూ - 
అమ్మా! నాకో సందేహం... హరి హరులు వేరు వేరా? భగవంతుడు ఒక్కడే అంటారు కదా. మరి ఇన్ని రూపాలెందుకు? ఇన్ని బేధాలెందుకు? మానవుల మద్య ఈ విబేధాలెందుకు?
అమ్మా! నాకో సందేహం..... అంటూ నాలుగు ప్రశ్నలు సంధించింది. నాకు తెలిసినంతలో జవాబు చెప్పాను ఇలా -
హరి హరులు వేరు కాదమ్మా...
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే /
శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః //
                                                    - స్కందోపనిషత్తు
శివుని యొక్క రూపమే విష్ణువు. విష్ణువు యొక్క రూపమే శివుడు. శివుని హృదయమే విష్ణువు. విష్ణు హృదయమే శివుడు. 

భగవంతుడు ఒక్కడే. 
"ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్నది శ్రుతి వాక్యం. 
సత్స్వరూపమైన పరబ్రహ్మ ఒక్కటే అయినను జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులను బట్టి అనేక స్వరూపాలుగా, పలు పేర్లుగా పిలవబడుచున్నది.

పరమాత్ముడు ఒక్కడైనను, ఆ కాలమందున్న జనుల యొక్క మనఃపక్వతను అనుసరించి ఒక్కొక్క కాలమందొక్కొక్క అవతారం వహించెను.
బహునా త్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ /
అనేక భేదాభిన్నస్తు క్రీడతే పరమేశ్వరః //
ఈ జగమంతయూ బ్రహ్మమే. ఆ బ్రహ్మమగు పరమేశ్వరుడు అనేక విధములుగా అవతరించి క్రీడించుచున్నాడు.

సృష్టిస్థిత్యంత కరణీం బ్రహ్మవిష్ణు శివాత్మికామ్ / 
స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః //
సృష్టి స్థితి లయ కారణముల కొఱకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పేర్లు వహించిన పరమాత్మ ఒకటియే గాని అన్యం లేదు.

నారాయణశ్శివో విష్ణుశ్శంకరః పురుషోత్తమః /
ఏతేషు నామాభిర్బ్రహ్మపరం ప్రోక్తం సనాతనమ్ //
నారాయణ, శివ, విష్ణు, శంకర, పురుషోత్తములను నామములన్నియు సనాతనమైన పరబ్రహ్మము యొక్క పేరులే గానీ వాటి మద్య బేదం లేదు.

మానవుల అజ్ఞానం కొలదే ఈ విబేధాలు. పూర్వం ఈ విబేధాలు ఎక్కువగా ఉండేవి. ( ఈ మద్యనే ఓ పుస్తకం చదివాను. శైవం కంటే వైష్ణవ మతం గొప్పదని ఓ ఆచార్యులవారి ప్రబోధం. తదుపరి టపాలో దీనిని ప్రస్తావిస్తాను) ఈ అజ్ఞానమును వీడమని, అంతా పరబ్రహ్మమయమేనని శాస్త్రవచనం. అంతా ఒకటేనని మహర్షుల మాట. ఏకం సత్ అన్నది గురువుల ప్రబోధం. 
యో సౌ విష్ణుస్స్వయం బ్రహ్మాయో బ్రహ్మా సౌ మహేశ్వరః /
వేదత్రయే చ యజ్ఞే స్మిన్ పండితేష్వేష నిశ్చయః //
ఎవ్వడు విష్ణువో, వాడే స్వయంగా బ్రహ్మదేవుడు. ఎవ్వడు బ్రహ్మదేవుడో, వాడే మహేశ్వరుడు. ఈ రహస్యం మూడువేదముల యొక్క, యజ్ఞాదుల యొక్క, పండితుల యొక్క నిశ్చితాభిప్రాయం. 
గతంలో ఓ పోస్ట్ లో ప్రస్తావించిన పరమానందయ్య అనే గురువుగారు తన శిష్యులకు జ్ఞానోదయం కల్గించిన కధను మరోసారి మా అమ్మాయికి గుర్తుచేశాను.
పరమానందయ్య శిష్యుల కధలు చాలావరకు అందరికీ తెలుసు. శిష్యుల అమాయకత్వం, ఆ అమాయకత్వంలో వారు చేసే పనులు, గురువుగారి బోధలు ...... వీటినీ పరిశీలిస్తే మనల్ని ఉద్ధరించే  సందేశాత్మకమైన ఆధ్యాత్మిక ప్రభోదాలే ఉంటాయి. (పరమానందయ్య శిష్యులు అజ్ఞానపు అమాయక చేష్టలు మన చేష్టలకు ప్రతిబింబాలే)
పూర్వం శివుడే గొప్పయని శైవులు, విష్ణువే గొప్పయని వైష్ణువులు పరస్పర నిందలతో, కొట్లాటలతో అవివేకంగా ప్రవర్తించేవారు. శివుడైనా, విష్ణువైన ఒకే పరబ్రహ్మమునకు చెందినవారని, ఒకే చైతన్య స్వరూపులని, అవివేకంతో ప్రవర్తించక ఈ రెండు రూపాలు మనిషి ఆధ్యాత్మిక జ్ఞానత్వమునకు ముఖ్యమే అని తెలుసుకొని అజ్ఞానమును వీడమని.... తెలియజెప్పే కధనమిది.
ఓ రోజు విశ్రమిస్తున్న పరమానందయ్యగారి కాళ్లు ఇద్దరు శిష్యులు పడుతూ, నేను పడుతున్న కుడికాలు గొప్పని ఒకరు, నేను పడుతున్న ఎడమకాలు గొప్పదని మరొక శిష్యుడు వాగ్వివాదం చేసుకుంటూ, చివరికి గురువుగారి కాళ్ళునే మరచెంబుతో ఒకరు, పానపాత్రతో మరొకరు కొట్టడం మొదలుపెట్టారు. ఆ బాధకి గురువుగారికి మెలుకువ వచ్చి ఆ రెండు కాలు తనవే నని, మీరు చేసిన ఈ అజ్ఞానపుపని నన్నే గాయపరిచిందని, మనిషి మనుగడకు రెండు కాళ్లు ముఖ్యమే కాబట్టి రెండు కాళ్లు గొప్పవేయని, మానవుల మనఃపక్వతను బట్టి వారిని ఉద్ధరించడానికే అనేక రూపాల్లో అవతరించిన భగవంతుడు ఒక్కడే అని, అది గ్రహించి అజ్ఞానమును వీడమని.

హరిం హరం విధాతారం యః పశ్యేదేకరూపిణమ్ /
స యాతి పరమానందం స యోగీ బ్రహ్మ ఉచ్యతే //
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకరూపంగా ఎవరు చూచుచున్నారో, అట్లున్న యోగి శాశ్వతానంద పొందే బ్రహ్మమని చెప్పబడుదురు.

10 వ్యాఖ్యలు:

 1. చక్కటి విషయాలను తెలియజేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అమ్మో.... ఎంత జ్ఞానమోనండి మీకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భారతి గారు.. శివ విష్ణు బేధం గురించి చక్కగా వివరించారు. చాలా మందిలో ఇప్పుడు కూడా ఇలాంటి దోరణి గమనిస్తూ ఉంటాం. వివరణాత్మకంగా చాలా బాగా తెలిపారు. ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అనూరాధ గారు!
  మీ ఈ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పద్మార్పిత గారు!
  ఆధ్యాత్మిక అభిరుచి, అధ్యాయనం, అవగాహన, అభ్యాసం అలవడడంతో అప్పుడప్పుడూ అనూష అడిగేప్రశ్నలకు ఇలా తెలిసినంతలో బదులివ్వగలుగుతున్నాను. మీ స్పందనకు ధన్యవాదములండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వనజ గారు!
  మీరన్నది నిజమే. అప్పుడప్పుడూ కొందరిలో ఇలాంటి దోరణి కనబడినా వారిలో కూడా క్రమేపి ఏకత్వభావన అలవడుతుందని నా నమ్మకం. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ఆనందంగా ఉంది. మీకు నా ధన్యవాదములండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చక్కగా రాశారు .
  ఈశావాస మిదం సర్వం .
  ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యమనీ ,
  విష్ణు శబ్దానికి విశ్వమంతా వ్యాపించి ఉండడ మనీ ,
  అంటే ,
  విశ్వ వ్యాపన మైన పరమాత్మ మహాచైతన్యమే ఈశ్వర-విష్ణు శబ్దాల పరమార్థంగా భావించవచ్చు .
  భారతి గారూ ,
  మీ బ్లాగు భగవంతుని ముంగిలి .

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మాస్టారు గారు!
  మీ అమూల్య స్పందనకు, మీరిచ్చిన వివరణకు హృదయపూర్వక ధన్యవాదాములండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఈ మధ్య ముఖ పుస్తకంలో(ఫేస్ బుక్ ) బిజీ అయ్యి...పండుగ హడావిడిలో బ్లాగ్స్ చూడలేదసలు...మీ మంచి పోస్టులు మిస్ అయ్యాను...చాలా వివరంగా చెప్పారు భారతి గారూ!...అభినందనలు...@శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు శ్రీ గారు.

  ప్రత్యుత్తరంతొలగించు