క్రిందటి గురువారం ఓ స్నేహితురాలు కోరిక మేరకు తనతో కల్సి షిర్డీ సాయి గుడికి వెళ్లాను. పూజాది కార్యక్రమములు పూర్తయ్యాక బయల్దేరుతుండగా - 'బాబా! ఇంటికి బయల్దేరుతున్నాం, వెళ్ళుటకు అనుమతి ఇవ్వు' అని తను అడగడం చూసి ఒకింత ఆశ్చర్యానందములకు లోనయ్యాను. బాబా ఉన్నప్పుడు షిర్డీ వెళ్ళినవారు తిరిగి వస్తున్నప్పుడు బాబా అనుమతి కోరేవారని చదివాను. కానీ, ఇప్పటికీ ఇలా ఎంతో భక్తీనమ్మకాలతో దానిని ఆచరించేవారు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆటోలో తిరిగి వస్తుండగా తనతో అదే చెప్తూ గతంలో పెద్దలు దగ్గరకు, మహర్షుల దగ్గరకు, గురువుల దగ్గరకు వెళ్ళినవారు తిరిగి వస్తున్నప్పుడు అనుమతి కోరేవారని చదివానని చెప్తుండగా, ఎప్పుడో చదివిన శ్రీరమణమహర్షి వారి కాలంలో జరిగిన ఓ చమత్కారపు ఘటన గుర్తుకొచ్చింది.
తెనాలి దగ్గర పెద్దపాలేం వాస్తవ్యులు కృష్ణయ్య అను నతను తను రచించిన "ధనుర్దాసు చరిత్ర" అనే పద్యకావ్యాన్ని రమణాశ్రమమునకు వచ్చి శ్రీ రమణులకు అంకితమిస్తూ ఇలా వ్రాసారట -
బహుమతులన్నిటిలోనికి కన్యనివ్వటం ఉత్తమమైనది కాబట్టి ఈ కావ్యకన్యకను పెండ్లియాడమని భగవాన్ రమణులకు సమర్పించుచున్నాను. నాకు తెలుసు, మీరింతకు ముందే ముక్తికాంతను పెండ్లాడినారు. దయచేసి ఈ కావ్యకన్యకను కూడా స్వీకరించి తప్పులు దిద్ది, ఈమె బలహీనతలను క్షమించి బాగా చూచుకోండి. నా వైష్ణవ కన్యకకు భగవాన్తో ఈ వివాహం జరగడం వాళ్ళ అద్వైతానికీ విశిష్టాద్వైతానికి పెండ్లి జరిగినట్లయింది. మీరు నా అల్లుడైనప్పటికీ మా ఇంటికి రండని అడుగలేను. ఎందుకంటే మిమ్మల్ని చూడడానికి ఎంతోమంది రాజులు, గొప్పవారు, సాధకులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు కదా" అని,
వీడుకోలును అంతే చమత్కారంగానే అడిగారట -
"చూసినవారందరూ పరవశించేలాగా, ఈ నీ రూపంలో ఏ మాయలు దాచావ్?
అందరి శ్రమను పోగొట్టేలా, ఈ గాలిలో ఏ శక్తిని పొందుపరిచావ్?
అన్ని రోగాలను అణచివేయగల్గేలా, ఇక్కడి నీటిలో ఏ మందు కలిపావ్?
వచ్చినవాళ్ళు తిరిగి వెళ్ళుటకు అయిష్టపడేలా ఏ మత్తుమందు ఈ చుట్టుపక్కలా వెదజల్లావ్?
పురుషోత్తమా! మాలాంటి సామాన్యులకు రకరకాల కోరికలు కలుగుతుంటాయి. కొన్ని సఫలమౌతాయి, కొన్ని కావు. నా అన్ని కోరికలు ఇక్కడ తీరాయి. అందులో ఒకటి, ధనుర్దాసు చరిత్రను పద్యకావ్యముగా వ్రాయాలని; రెండు, బంధుమిత్ర సపరివారంగా వచ్చి నా కావ్యకన్యక చేతిని మీకందివ్వాలని; మూడవది, ఈ పెండ్లి విందును మీతో కలిసి తృప్తిగా ఆరగించాలని; నాల్గవది, ఇక్కడ కొన్ని రోజులుండి మీ దర్శనంతో నా కనులకు విందు చేయాలని. మీ కృపవలన నా ఈ కోరికలన్నీ తీరాయి.
పురుషోత్తమా! నీ గొప్పతనాన్ని నీవు మాత్రమే తెలుసుకోగలవు, మేమెంత కాలం ఇక్కడ ఉన్నా, తిరిగి వెళ్ళుటకు మా పాదాలు కదలవు. నేనేమి చేయగలను?
ఓ పావనుడా! నేను వెళ్ళడానికి మీ అనుమతిని దయచేసి ఇవ్వండి."
నాకు జ్ఞాపకం వచ్చిన ఈ ముచ్చటని నా స్నేహితురాలికి చెప్పగా, తను అన్నదిలా -
ఆహా.....ఎంతటి చతురత!
చాలా బావుంది. క్రొత్త విషయం ..తెలుసుకుంటూ.,సాగుతూ.. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపాయని దయకు నిథానము ,
రిప్లయితొలగించండిహాయికి కడ లేని చోటు , అమృత మయమౌ
నీ యెదపై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !
శ్రీ రమణా ! పురుషోత్తమ !
కోరిన కోరికలు దీర్చు కూరిమి సఖుడా !
చేరి భవదీయ పదముల
నోరారగ నిన్భజించు నోపిక ఇమ్మా !
తెలుసుకుంటూ... సాగుతూ... సరిగ్గా చెప్పారు వనజగారు.
రిప్లయితొలగించండిమీ ఈ స్పందనకు ధన్యవాదములండి.
పాయని దయకు నిథానము ,
రిప్లయితొలగించండిహాయికి కడ లేని చోటు , అమృత మయమౌ
నీ యెదపై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !
మాస్టారు గారు!
మీ ఈ భక్తియుత పద్యరూప స్పందనకు మౌనంగా వందనములు అర్పించడం తప్ప, ఏమని బదులివ్వగలను?