23, మే 2012, బుధవారం

ఎందుకనీ?????

కొందరిని చూస్తే మ్రొక్కాలనిపిస్తుంది, కొందరిని చూస్తే మొట్టాలనిపిస్తుంది.... ఎందుకనీ??? 
ఇది నా మిత్రురాలి నిన్నటి సందేహం. ఈ సందేహం తనది మాత్రమే కాదు, గతంలో అప్పుడప్పుడూ నాకూ ఈ సందేహం కల్గేది. 
ఒకొకరిని చూసిన మొదటసారే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, ఎంతో పరిచయం ఉన్నట్లు ఏదో ఆత్మీయతాభావానుభూతి.
ఒకొకరిని చూసినప్పుడు వారివలన ఏ ఇబ్బంది లేకున్నా ఏదో చిరాకుభావం. 
ఇది ఒకప్పటి నా అనుభవం -
మా వీధిలో ఇల్లుకట్టుకొని క్రొత్తగా గృహప్రవేశం చేసిన ఒకామెను చూసిన మొదటసారే ఏదో ఆత్మీయత! హృదయంలో అభిమానపు స్పందనలు! తనని అదే మొదటిసారి చూడడం...కానీ; ఎంతో పరిచయస్థురాలన్న అనుభూతి. ఏ జన్మలో బంధమో అన్న భావన. ఇలాంటి భావనలు ఎందుకనీ?
అలానే ఈ వీధిలో మరొకామెను చూసినప్పుడంతా ఎంతో చిరాకు. ఆమె నేను కన్పించినప్పుడంతా చిరునవ్వుతోనో, చిరుమాటతోనో పలకరించేవారు. కానీ; ఆమె వెళ్ళిన కొన్ని నిముషములు వరకు నాలో ఏదో అసహనం. ఇలా ఎందుకనీ?
అర్ధం కాలేదు, ఇలా ఎందుకన్న నా ప్రశ్నకు జవాబు తెలియలేదు.
(ఇది ఒకప్పటి నా అనుభవం అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఈమె పట్ల నాకు చిరాకు లేదు. ఓ యదార్ధఘటన చదివి రియలైజ్ అవడంతో చిరాకు స్థానంలో చిరుఅభిమానం చోటుచేసుకుంది.
నేను చదివిన ఆ యదార్ధఘటన -
సెయింట్ తెరిస్సా ఆశ్రమంలో ఇతరులతో కలవకుండా ఎప్పుడూ చిరుబురులాడే ఓ సన్యాసిని ఉండేవారట. ఆవిడ అందరిపై ఆకారణముగా అరుస్తూ, మండిపడుతూ ఉండేవారు. ఆమెని మిగత అందరు సన్యాసినులు తప్పించుకు తిరిగేవారు. కానీ మధర్ తెరిస్సా మాత్రం ఆమెను ఆత్మీయంగా పలకరించేవారు. ఆమె చిరాకుపడిన మదర్ తెరిస్సా మాత్రం చిరునవ్వుతో మాట్లాడేవారు. ఇలా కొంతకాలం గడిచాక ఓ రోజు ఆ సన్యాసిని మదర్ తెరిస్సాను ఆపి 'అందరూ నన్ను దూరంగా చూస్తేనే తప్పుకుంటారు, మాట్లాడరు కానీ, నీవు నేను కన్పించినప్పుడంతా స్వచ్ఛంగా హాయిగా నవ్వుతూ ఆత్మీయంగా పలకరిస్తావు, నాలో నీకంత నచ్చింది ఏముందని అడగారు. అంతట "అందరూ నిన్ను చూస్తున్నారు, నేను నీ అంతరాత్మలో నిలిచి ప్రకాశిస్తున్న జీసస్ ని చూస్తున్నాను" అని బదులిచ్చారని చదివిన తర్వాత ఆకారణంగా నాలో చిరాకు కలగడం ఎందుకో తెలియకపోయినను అది తప్పనిపించి ప్రయత్నపూర్వకంగా ఆ భావంనుండి బయటపడ్డాను. ఆ ఘటన చదివిన దగ్గరనుండి నా  ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటినుండి నాకు నేనుగా ఆమెను అభిమానంగా పలకరించడం అలవాటు చేసుకున్నాను. ఈ రీతిలోనే నన్ను మంచిగా ప్రభావితం చేసిన ప్రార్ధన మరొకటుంది. అది అస్సిసీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ప్రార్ధన -
ప్రభూ! నన్ను నీ శాంతికొక వాహికగా మార్చు
ద్వేషమున్న చోట ప్రేమ బీజాల్ని పాతనివ్వు
గాయాలు తగిలినచోట క్షమల్ని రాజిల్లు
సందేహాలు ముసిరినప్పుడు నమ్మకాల్ని ప్రసాదించు
నిరాశ మూసినవేళ ఆశను రగిలించు 
చీకటి కప్పిన సమయాన వెలుతుర్ని వెలిగించు 
బాధ పీడించిన వేళ ఆనందాన్ని రప్పించు
ఓ దివ్యమూర్తీ! నాకు మరేమీ కోరికలు లేకుండా చేయి
దార్చబడడంకంటే దార్చడానికీ
అర్ధంచేసుకోబడడంకంటే అర్ధంచేసుకోవడానికీ 
ప్రేమించబడడంకంటే ప్రేమించడానికీ నాకవకాశమివ్వు
ఇవ్వడంలోనే మనం పుచ్చుకోవడమూ జరుగుతుంది
క్షమిస్తున్నప్పుడే మనమూ క్షమించ బడతాం
స్వార్ధాన్ని చంపుకున్నప్పుడే మనం అనంతంలో పుడతాం)

ఐతే అలా అకారణ ప్రేమ, చిరాకులు ఎందుకు కల్గుతాయో అన్న ప్రశ్నకు సమాధానం సరిగ్గా తెలియదు. నిన్న నా మిత్రురాలు ప్రశ్నతో తిరిగి అదే ప్రశ్న నాలో - ఎందుకనీ?
బహుశా ఏ జన్మ ఋణానుబంధమో కారణం కావచ్చు. లేదా మనోభావనలకు దర్పణం ముఖం. త్రిగుణంలలో ఏ గుణం మనలో ఎక్కువగా ఉంటే ఆ గుణలక్షణం మన ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది. అంటే సత్త్వగుణం ఎక్కువగా ఉంటే ప్రశాంతత, మంచితనం; రజోగుణం ఉంటే కోపం, అశాంతి; తమోగుణం ఉంటే బద్ధకం, నిద్రముఖంలా కన్పిస్తుంది. సత్త్వగుణం ఉన్నవారిని చూసినప్పుడు గౌరవభావంకల్గి మ్రొక్కాలనిపిస్తుంది. రజోగుణమున్నవారిని చూసినప్పుడు మొట్టాలనిపిస్తుందనుకుంటాను  అని నేను చెప్పగా అది కొంతవరకే సరైన సమాధానమంటూ - సరేలే, ఎవరైనా పెద్దవారిదగ్గర ఆరా తీస్తానులే అని తను అంది. అదిగో అప్పుడే 'ఆరా' అన్న పదం వినగానే నాలో ఏదో జ్ఞాపకం. అవును... నా చిన్నప్పుడు మా మాస్టారుగార్ని భగవంతుడు చుట్టూ ఆ కాంతి ఏమిటని అడిగాను. అప్పుడు మాస్టారుగారు ఆరా గురించి చెప్పారు. 
ఆరా:
భగవంతుని చుట్టూ ఉన్న ఆ కాంతివలయమును "ఆరా" అంటారని, ఆ ఆరా ప్రతీ ప్రాణి చుట్టుతా కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంతవలయంలా ఉంటుందని చెప్తూ ఇంకా ఇలా చెప్పారు -
జీవరాసుల అన్నింటికీ దేహం చుట్టూ 'ఆరా'గా పిలవబడే కాంతివలయముంటుంది. ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం. ఈ కాంతి ఆత్మసాక్షాత్కారం అయిన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది. సామాన్యుల దృష్టికి ఇది కనబడదు. సాధరణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం ఐదు నుండి పది అడుగులవరకు ఉంటుంది. ఈ వలయంలోనికి ప్రవేశించిన మరోవ్యక్తి "ఆరా" ఆకర్షణలు పడతాయి. ఇలా ఒకరి 'ఆరా' మరొకరి 'ఆరా' దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికీ ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులౌతారు, సన్నిహితులౌతారు, వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు. అలానే వేరు వేరు గుణాలుగల 'ఆరా' లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు, వైముఖ్యం తప్పనిసరి. అలానే యోగులు, మహర్షులు చుట్టూ ఈ 'ఆరా' ఇరవైఐదు నుండి ముప్పది అడుగులమేర విస్తృతంగా, ధృడంగా ఉంటుంది. అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతిశక్తి ఎక్కువగా ఉంటుంది. 'ఆరా' బలహీనపడితే రోగాలబారినపడి వ్యాధిగ్రస్తులమౌతాం. 'ఆరా' పూర్తిగా శిధిలమైనప్పుడు ప్రాణం పోతుంది... అని చెప్పారు. మాస్టారుతో నా ముచ్చట్లన్ని ఎన్నో సంవత్సరములక్రితంనాటి జ్ఞాపకాలు. ఇప్పటిలా మంచివిషయాలు వెంటనే వ్రాసుకునే అలవాటు ఆనాడు నాకు అలవడలేదు. ఈ అలవాటు అప్పుడే ఉంటే ఈనాడు నాదగ్గర తరింపజేసే తరగని ఓ జ్ఞాననిధే ఉండేది. ప్చ్ .......!

17, మే 2012, గురువారం

జ్ఞాపకాల దొంతరలో మరో ముచ్చట - ఏడుచేపల కధ అంతరార్ధం.

వేసవికాలం....  ఉదయమంతా ఎప్పటిలా నేనూ, లావణ్య మా ఈడువారందరితో కల్సి ఒకటే అల్లరి. ఆటలూ, పాటలు, కబుర్లుతో గడిపేశాం. సాయంత్రమున పొలాల గట్లుపై పరుగులు. తోటలో మామిడికాయలు రైతుతో కోయించుకొని, ఇంట్లో పొట్లం కట్టుకొని తీసుకెళ్ళిన ఉప్పూ, కారముపోడిలో అద్దుకొని తినడం, కొబ్బరిబొండాలు దింపించుకొని త్రాగడం, లేత తాటిముంజులు పోటీలు పెట్టుకొని తినడం, బాగా ప్రొద్దు పోయేంతవరకు తిరిగి తిరిగి ఇంటికి చేరడం..... రాత్రికి ఆరుబయట నవ్వారు మంచాలుపై బొంతలేసుకొని మా తెలుగుమాస్టారు చెప్పిన కబుర్లు, ఆ అత్తయ్య (మాస్టారుగారి భార్య) తన మనవడుకు చెప్పే కధలు వింటూ పడుకోవడం ఓ అలవాటు. ఎప్పటిలా ఆ రోజు కూడా ఆరుబయట పడుకొని అత్తమ్మ చెప్పే కధని వింటున్నాం. అది ఏడుచేపల కధ. ఎన్నోసార్లు విన్న కధ, అయినా అత్తమ్మ చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాం. కధ కంచికి, మనమింటికీ....అంటూ కధ పూర్తిచేసిన అత్తమ్మ - 
'అవునూ..... మన పురాణాల్లో ఉన్న కధలలోనే కాదు, మన పెద్దలు చెప్పిన కధల్లో, సామెతల్లో కూడా ఎంతో లోగుట్టు ఉంటుందని అంటారు కదా! మరి ఈ ఏడుచేపల కధలో కూడా ఏదైనా మర్మముందా? అని మాష్టారుగార్ని ఆవిడ అడిగారు. ఓ అందులో కూడా చక్కటి అంతరార్ధం ఉందని మాష్టారుగారు అనగానే అందరం గబాలున లేచి మాష్టారుగారి చుట్టూ చేరిపోయాం.
అందరికీ తెలిసిన కధే అయినా ఓసారి ఆ కధను మననం చేసుకుందాం. అటుపై మాస్టారుగారు ఏం చెప్పారో తెలుసుకుందాం.
అనగనగా  ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు. అందులో ఓ చేప ఎండలేదు. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి... 
చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డువచ్చింది. 
గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డువచ్చావు? ఆవు మేయలేదు.
ఆవా ఆవా ఎందుకు గడ్డిని మేయలేదు? పాలేరు తాడు విప్పలేదు.
పాలేరా పాలేరా తాడు ఎందుకు విప్పలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు.
అవ్వా అవ్వా బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది.
చీమా చీమా ఎందుకు కుట్టావు? నా బంగారుపుట్టలో చేయిపెడితే కుట్టనా?
ఇది అత్తమ్మ చెప్పిన కధ. దీనికి మాస్టారుగారు ఇచ్చిన వివరణ -
 
 ఈ కధలో రాజు అనగా ఓ సాధకుడు. ఆ సాధకుని దేహంలో వున్న ఏడు చక్రాలు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం) ఏడుగురు కొడుకులు. 
ఆ ఏడుగురు కొడుకులు వేటకి అంటే ధ్యానస్థితికి వెళ్ళిరి. ఏడు చేపలు తెచ్చారనగా తన ధ్యానంకు అవరోధమైన మనస్సు, అరిషడ్వర్గములు అని తెలుసుకున్నారు. సాధన అనే ఎండలో ఈ ఏడింటిని ఎండబెట్టారు. అందులో మనస్సనే చేప ఎండలేదు. ఎందుకెండలేదన్న విచారణ ప్రారంభమైంది.
మనసా, మనసా ఎందుకు ఎండలేదు? అవివేకం అడ్డు వచ్చింది.
అవివేకమా, అవివేకమా ఎందుకు అడ్డువచ్చావు? వివేకం మేయలేదు.
వివేకమా, వివేకమా ఎందుకు మేయలేదు?బుద్ధీ అనబడే పాలేరు మాయనే తాడుని విప్పలేదు.
బుద్ధీ, బుద్ధీ ఎందుకు విప్పలేదు? భక్తీ అనబడే అవ్వ జ్ఞానమనబడే బువ్వని పెట్టలేదు.
భక్తీ, భక్తీ ఎందుకు బువ్వ పెట్టలేదు? ప్రాపంచిక బంధాలు ఏడిపిస్తున్నాయి.
ప్రాపంచిక బంధాలూ, ప్రాపంచిక బందాలు ఎందుకు ఏడిపిస్తున్నారు? వైరాగ్యం కుట్టింది.
వైరాగ్యమా, వైరాగ్యమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో చేయి పెడితే కుట్టనా?
ఇప్పుడు ఈ కధను చివరనుండి మొదటకి జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటూ మాస్టారుగారు ఇలా వివరించారు -
పుట్ట అంటే వ్యక్తి దేహమని అర్ధం. నేలమీద కూర్చున్నప్పుడు దేహం ఎలా క్రింద విశాలంగా ఉంటుందో, పైకి పోనూ పోనూ ఎలా దేహం సన్నగా ఉంటుందో పుట్ట కూడా అదే మాదిరిగా క్రింద విశాలంగా, పైకి వెళ్తున్నకొలదీ సన్నగా ఉంటుంది. మానవదేహంలో నవరంద్రాలు ఎలా ఉంటాయో పుట్టకు కూడా ఎన్నో రంద్రాలు ఉంటాయి. ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు ఏమిటీ జన్మ అని అన్పిస్తుంది. అలా అన్పించినప్పుడు కొందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కల్గి అంతర్ముఖం అవుతారు. పుట్టలో చేయి పెట్టడమంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అంతర్ముఖం కావడం. అలా అంతర్ముఖం కావడం వైరాగ్యమనే చీమ కుట్టినప్పుడు కల్గుతుంది. వైరాగ్యం కల్గినప్పుడు ప్రాపంచిక బందాలు ఎంత దుఃఖపూరితమో గ్రహిస్తాడు. భక్తి  జ్ఞానమనే బువ్వని పెడుతుందని గ్రహించి బుద్ధితో మాయ అనే తాడుని విప్పుకుంటాడు. అప్పుడు వివేకం కల్గి అవివేకమనే అడ్డుని తప్పిస్తుంది. అప్పుడు అరిషడ్వర్గాలుతో పాటు మనస్సు కూడా ఎండి అంటే నశించి ధ్యానం బాగా కుదిరి కుండలినీశక్తితో సప్తచక్రాలు అధిరోహించిన సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మానవుడే మాధవుడవుతాడు. 
                                                         కధ కంచికి, మనం జ్ఞానమింటికి.


 

14, మే 2012, సోమవారం

శ్రీ ఆంజనేయం శిరసా నమామి

 త్రేతాయుగమున దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కొఱకు, దానవులను సంహరించి ధర్మపాలన సంస్థాపన చేయుటకై మానవునుగా హరి, వానరయూధ ముఖ్యునిగా రుద్రాంశతో ఆంజనేయుడు జన్మించారు.   
 ఒకప్పుడు 'పుంజికస్థల ' అను అప్సరస శాపవశంచేత భూలోకమున అంజనగా జన్మించి వానర రాజైన కేసరిని వివాహమాడింది. ఆమె మహా పతివ్రత. వివాహమై  చాలకాలమైనా ఆమెకు సంతానం కలుగకపోవడంతో సంతానంకై కఠోర తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ప్రతినిత్యం ఒక ఫలంను అనుగ్రహిస్తే దానిని వాయుదేవుని ప్రసాదంగా స్వీకరించేది. ఒకనాడు శివపార్వతులు ఆ ప్రాంతమున స్వేచ్ఛా విహారులై వానరరూపాల్లో క్రీడిస్తుండగా స్ఖలించిన శివుని వీర్యమును భద్రపరిచిన వాయుదేవుడు ఆ వీర్యమును ఒక ఆకు దొప్పలో పండుగా మార్చి వాయువీవనచే అంజనాదేవి ముందు పడవేయగా ఆ శివవీర్యాన్ని ఆనాటి వాయుప్రసాదముగా భావించి అంజన భుజించినది. ఫలితంగా తక్షణమే గర్భం దాల్చింది. తనకు గర్భము ఎలా వచ్చిందో తెలియక దుఃఖించి దానికి కారణమైన వారిని శపించబోగా, వాయుదేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భమున శివాంశతో పుత్రుడు జన్మిస్తాడని, అతడు వాయుపుత్రుడుగా వాసికెక్కుతాడని అభయమిస్తాడు. వానరరాజు అయిన కేసరి దీనిని దివ్యప్రసాదంగా భావించి సమ్మతించాడు. అటుపై -    
వైశాఖ మాసం, కృష్ణ పక్షం, తిధి దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నం, వైధృతి నామయోగం, గ్రహాలన్నీ శుభస్థానాలలో ఉన్న మధ్యాహ్న తరుణంలో ఆంజనేయుని జననం జరిగింది.
మామూలు మానవుడుగా పుట్టి ఆదర్శ తనయునిగా, ఆదర్శ మిత్రుడుగా, ఆదర్శ ప్రభువుగా, ఆదర్శ పరిపూర్ణ ధర్మమూర్తిగా, ఆదర్శ వ్యక్తిగా.........పలు ఉత్తమోత్తమ గుణములతో జీవనం సాగించిన అవతారమూర్తి శ్రీరాముడు కాగా, 
తాను నమ్మిన దైవమును త్రికరణశుద్ధిగా సేవిస్తూ, రామున్ని అపారభక్తితో ఆరాదిస్తూ, రామనామమహిమను రామునికే తెలియజెప్పే పరమభక్తునిగా, త్రేతాయుగమున రామబంటై, ద్వాపరమున తన ప్రకీర్తితో రామభక్తుడై ఫరిడిల్లి, కలియుగమున రామభక్తులకు బాంధవుడై, మహిమాన్విత దైవమై, ఊరూరా వాడవాడన, ఇంటింటా, గుండె గుండెలో కొలువై యుగయుగాలుగా చిరంజీవిగా విరాజిల్లుతున్న భక్తజ్ఞానప్రపూర్ణ దివ్యమూర్తి 'ఆంజనేయుడు'.

సేవ, భక్తి, దౌత్యం, నీతి, దైర్యం, అభయం అనే షడ్గుణములకు ప్రతీక ఆంజనేయుడు. ఆత్మబలంనందు, మతియందు, గతియందు హనుమంతుడికి ధీటి, సాటి మరొకరు లేరు. ఆర్తులను రక్షిస్తూ, ఆంజనేయా అని తలచిన అందరినీ ప్రజ్ఞా దైర్యవంతులను చేస్తూ, తనని స్మరించినంతమాత్రమునే భూత ప్రేత పిశాచాలను దరిచేరనివ్వక అభయమొసగే ఆపద్భాందవుడు ఆంజనేయుడు. 'దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే'. ఈ జగత్తులో కష్టమైనా పనులేమైనా ఉంటే ఆంజనేయుడి అనుగ్రహంతో అవి నెరవేరుతాయి.

పుట్టిన కొద్దిరోజులనాడే  బాలాంజనేయుడు సూర్యున్ని గాంచి పండుగా భావించి సూర్యుని మింగుటకు వాయువేగంతో సూర్యమండలంలో ప్రవేశించగా, ఆనాడు సూర్యగ్రహణం అవటంచే సూర్యున్ని పట్టుటకు వస్తున్న రాహువుని మరొకపండుగా భావించి రాహువున్ని ఆంజనేయుడు పట్టబోగా అతను తప్పించుకొని పారిపోయి ఇంద్రుణ్ణి శరణుకోరాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతంపై రాగా, ఐరావతమును మరొక పండుగా తలచి పట్టుకోగా ఇంద్రుడు వజ్రాయుధంను ప్రయోగించడంతో వాయుసుతుని వామహనువుకు (ఎడమ దవడకు) గాయమై కుప్పకూలిపోతుండగా వాయుదేవుడు పదిలంగా పట్టుకొని ఓ గుహలోనికి తీసుకుపోయి బాధతో ఆగ్రహించి తనవాయుప్రసారగతిని నిరోధించాడు. వాయుస్తంభనతో జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు తీవ్రవిఘాతం కలుగగా, ముల్లోకాలు తల్లడిల్లగా దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఆ బాలుడు సామాన్యుడు కాదు, దేవతాకార్యసిద్ధి నిమిత్తం రుద్రుడే అంజనా గర్భమున అవతరించాడు, మీరు దండించినది సాక్షాత్తు రుద్రుడునేనని చెప్తూ భూలోకమున వాయుదేవుడున్న గుహలోనికి ఇంద్రాదిదేవతలతో కల్సివచ్చి వాయునందనుడును తాకి స్వస్థుడిని చేసాకా, అందరూ వరాలు ప్రసాదించిన పిమ్మట ఆంజనేయుడు హనుమ అనే నామంతో ప్రసిద్ధుడవుతాడని ఆశ్వీరదించిరి.
ఈ ఘటనలో కూడా ఓ అంతరార్ధం ఉంది. ఎర్రని సూర్యుడిని పండు అనుకోని మ్రింగబోయాడు. అటుపై సూర్యగ్రహణమవటం వల్ల నల్లగా ఉండే రాహువు రాగా అతనినీ మింగబోయాడు. ఆ తర్వాత తెల్లగా ఉండే ఐరావతంను చూసి దానిని మింగబోయాడు. పై సంఘటనను కాస్తా పరిశీలిస్తే ఎరుపు రజోగుణమునకు సంకేతం కాగా, నలుపు తమస్సు అంటే తమోగుణంనకు, తెలుపు సాత్త్విక గుణంనకు సంకేతాలు. ఈ మూడింటిని మింగబోయడంటే రజస్తమోసత్త్వగుణములకు ఆంజనేయుడు అతీతుడు కాబోయడని అర్ధం.  అంటే పుట్టుకుతోనే ఆంజనేయుడు త్రిగుణములకు అతీతుడు.

ఈ హనుమ అన్న దివ్యనామం ఎంతో మహిమాన్వితమైనది. 
హ :- హకారం శివ బీజంచ, శుద్ధస్ఫటిక సన్నిభం    
        అణిమాద్యష్ట  సిద్ధించ, భుక్తిముక్తి ప్రదాయకం.
        {హకారం ఈశ్వరబీజం. శుద్ధస్ఫటికంలా తెల్లని కాంతిగల                         ఈశ్వరత్వానికి ప్రతీక. ఈ బీజోచ్చారణ వలన అణిమాద్యష్టసిద్ధులు లభిస్తాయి. భుక్తి ముక్తిలను ప్రసాదిస్తుంది}
ను :- నుకారం చైవ సావిత్రం, స్ఫటికం జ్ఞాన సిద్ధిదం       
        వాయువేగం మనోవేగం, స్వేచ్ఛారూపం భవేద్రువం.     
        {సావిత్రి లేక సవిత అంటే సూర్యునికి సంకేతం. సూర్యుని అనుగ్రహం కలిగించే స్పటికంవంటి కాంతిగల ఈ బీజోచ్చారణ వాయు,మనోవేగాలను   
స్వేచ్ఛారూపాన్ని, జ్ఞానసిద్ధిని  కలుగజేస్తుంది}
మ :- మకారం మధనంజ్ఞేయం, శ్యామం సర్వఫలప్రదం
        కాలరుద్రమితిఖ్యాతం, ఉమాబీజంభయప్రదం.
        {మకారం మనస్సును మధించే శక్తి కలది. కాలరుద్రమని పిలవబడే ఈ బీజం, ఉమాబీజం, శివశక్తులకు సంకేతం. శ్యామవర్ణంగల ఈ 'మ' బీజం  స్థిరమైన మనస్సును, సమస్త కోరికలను తీర్చును}
శివ, సూర్య, శక్తి బీజాలతో కూడుకున్న ఈ 'హనుమ' అనే నామోచ్చారణచే  జ్ఞానం, బుద్ధి, యశస్సు, ధైర్యం, అభయం, పూర్ణాయువు, ఆరోగ్యం, కార్యసిద్ధి, వాక్ఫటిమ ప్రాప్తించును.
తన ప్రభువైన సుగ్రీవునకు, అవతారమూర్తులైన సీతారాములకు హితాన్ని కూర్చిన మహామహిమోపేతుడు హనుమంతుడు. శ్రీరామచంద్రుడు విజయానంతరం హనుమంతునితో -  
'ఏకైకస్యోపకారాయ ప్రాణాన్ దాస్యామి హే కపే, ప్రత్యహం క్రియమాణేన శేషస్యఋణినావయమ్'
హనుమా! నీవు చేసిన ఒక్కొక్క ఉపకారమునకు నేను ప్రాణార్పణం చేసి ఋణమున తీర్చుకొనువాడును. నిస్వార్ధంగా నీవు చేసిన సేవల ఋణమును నేనెట్లు తీర్చుకొనగలను? సదా నీకు ఋణపడియే యుందును. 
ఉపకారేణ సుగ్రీవః రాజ్యం కాంక్షన్ విబీషణః / నిష్కారణస్త్వం హనుమన్ త్వమేవాతః ప్రమోదకః //
ప్రత్యుపకారార్ధమై సుగ్రీవుడు, రాజ్యకాంక్షతో విబీషుణుడు నాకు సహకరించినారు. నీవు మాత్రం అకారణముగా నాకు సహకరించి నాకెంతయో ప్రీతిభాజనుడవైనావు. 
సరే, ఇందుకు బదులుగా -
సర్వస్వభూతం గృష్ణీష్వ పరిష్వంగం మయాకృతం
వరం దదామి పింగాక్ష సర్వకార్యపరో భవ 
త్వన్మంత్ర జాపినాం నిత్యం త్వన్నామస్మృతికారిణాం
త్వద్రూప పూజకానాం చ సర్వకార్యపరో భవ 
నా సర్వస్వంగా నేను సంభావించి (సీతకు మాత్రమే ఇచ్చిన) నా కౌగిలిని నీకు ఇచ్చుచున్నాను. అంతేకాదు, నీకు కొన్ని వరములు కూడా ఇస్తున్నాను. నీ నామాన్ని జపించేవారికి, నిను సదా స్మరించేవారికి, నీ రూపాన్ని అర్చించేవారికి నీవు సర్వకార్యసిద్ధిప్రదుడవు అవుతావు. 
మత్కధావేక్షితా యావత్ యావత్ పర్వతసంస్థితి: యావచ్చంద్రశ్చసూర్యశ్చ తావత్వం సుఖితోభవ 
పశ్చాత్ చతుర్ముఖో భూత్వ సృష్ట్యా లోకాన్ యధావిధి త్రిలోకవాసిభిస్స్వార్ధం మత్స్వరూపము పైష్యసి 
లోకములో రామకధ ఉన్నంతవరకు, పర్వతాలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు నీవు చిరంజీవిగా యుండి, తర్వాత కల్పంలో భవిష్యద్బ్రహ్మవై లోకాలను సృష్టించి, పాలించి ఆ కల్పాంతంలో నా సాయుజ్య ముక్తిని పొందుతావు. ఇత్యాది రామానుగ్రహ వరములను పొందిన మహిమాన్వితుడు శ్రీ ఆంజనేయుడు.
                             శ్రీ ఆంజనేయం శిరసా నమామి

8, మే 2012, మంగళవారం

గజేంద్రమోక్షం - అంతరార్ధం

మన పురాణయితిహసాల్లో, వివరింపబడే ప్రతీ సంఘటనలో, ఓ ఆధ్యాత్మిక అంతరార్ధం ఉంటుంది. ప్రతీ ఘటనా పరమాత్మ పధనిర్దేశంనే సూచిస్తుంది. అన్ని అంశములయందు ఆ అనంతున్ని తెలుసుకునే మార్గముంటుంది. అనేక కధనాలు ద్వారా ఆధ్యాత్మిక మార్గాలు ఎన్ని తెలియజేయబడుతున్నను గమ్యం మాత్రం ఒక్కటే. ఎవరికి వీలైన, నప్పిన మార్గం ద్వారా వారు పయనించవచ్చు. అలానే మానవుడు ప్రార్ధన, భక్తి, విశ్వాసం లను అధిగమిస్తూ సంపూర్ణ శరణాగతి స్థితిలో మోక్షం ఎలా పొందవచ్చో, చెప్పే కధనమే శ్రీమద్భాగవతం యందు తెలపబడిన "గజేంద్ర మోక్షం". 
ముందుగా గజేంద్రుడు ఎలా మోక్షత్వం పొందాడో తెలుసుకొని అటు పిమ్మట ఆ కధనంలోని అంతరార్ధం తెలుసుకుందాం.


గజేంద్రుడు తన్ననుసరించి వచ్చిన ఆడ ఏనుగులతో కూడి, వనవిహారం చేస్తూ మోహవేశమున పరిసరములు కానక, దారితప్పి, తప్పుదారి పట్టి అలసిసొలసి ఓ కొలనుయందు ప్రవేశించి తన ప్రియకాంతలతో కల్సి తన్మయత్వ పారవశ్యముతో జలక్రీడలాడుతూ యుండగా... ఓ మకరేంద్రుడు ఒడుపుగా గజేంద్రుని కాలుని పట్టుకొని లోపలికి లాగడం, స్థానబలిమితో మొసలి, దేహబలంతో గజరాజు మధ్య పోరు వెయ్యి సంవత్సరములు జరిగెను. గజరాజు మిక్కిలి బలంతో, సామర్ధ్యంతో, స్థైర్యంతో అన్ని సంవత్సరములు యుద్ధంచేసి అలసిపోయి, స్థానబలంతో ఉన్న మొసలిని జయించడం తనవల్లకాదని గ్రహించి, ఇది పూర్వజన్మ ప్రారబ్ధమని తలచి, వివేకంతో ఇలా అనుకొనెను -
శా. ఏ రూపంబున దీని గెల్తు నిటమీ దే వేల్పు జింతింతు నె
    వ్వారిన్ జీరుదు నెవ్వ రడ్డమిక ని వ్వారి ప్రచారోత్తమున్ 
    వారింపందగువార లెవ్వ రఖిల వ్యాపార పారాయణుల్
    లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరా లింపన్ బ్రపుణ్యాత్మకుల్ 
ఏ రూపమున దీనిని గెలవగలను? ఎవరిని వేడుకొనగలను? నన్ను రక్షించు వారెవ్వరు? నా మొర విని నన్ను కాపాడగల్గిన వేల్పులెవరు? అట్టి పరోపకార పుణ్యాత్ములను కాపాడమని వేడుకోవడంకంటే గత్యంతరం లేదు.
ఉ. ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై 
    యెవ్వనియందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూలకారణం 
    బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వం దాన యైనవా 
    డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడేదన్
ఈ విశ్వమంతయూ ఎవ్వనిచే జనింపబడినదో, ఎవ్వనియందింతయు పుట్టి పెరిగి నశించుచుండునో, ఎవ్వనియందు ఈ జగమంతయు అణిగియుండునో, ఈ సకల చరాచర జీవరాశికంతకూ ప్రభువెవ్వడో, దీని మూలకారకుడెవ్వడో, దీనికంతటికిని మొదలు మధ్య చివరలు లేనివాడెవ్వడో, ఈ విశాల విశ్వమంతటికి సమస్తమైన వాడెవ్వడో, సర్వాత్మ స్వరూపుడైనవాడెవ్వడో, అట్టి ఈశ్వరుణ్ణి నా ఆపదను తొలగింపుమని వేడుచున్నాను.
క. ఒకపరి జగముల వెలినిడి
    యొకపరి లోపలికి గొనుచు, నుభయం గనుచున్ 
    సకలార్ధసాక్షి యగున 
    య్యకలంకుని నాత్మమయుని నర్ధింతు మదిన్ 
ఇచ్చాపూర్వకంగా ఎవ్వనియందీ విశ్వమంతయు బయటను, లోపలను ప్రకాశించియుండునో, ఈ విశ్వం యొక్క సృష్టి సంహారములను సక్రమంగా నడిపించువాడెవ్వడో అట్టి సకలసాక్షి స్వరూపుడు, కళంకంలేని ఆత్మమయుని ఆ సర్వేశ్వరున్ని మనస్సులో ధ్యానించుచున్నాను.
క. లోకంబులు లోకేశులు 
    లోకస్థులు దెగిన దుది న లోకంబగు, పెం 
    జీకటి కవ్వల నెవ్వడు 
    నేకాకృతివెలుగు నతని, నే సేవింతున్ 
లోకములను, దిక్పాలురును, లోకవాసులను నశించిన పిమ్మట ఈ అంధకార బంధురమైన ప్రదేశంనందు ఏకాత్మ స్వరూపుడై వెలిగి ప్రకాశించునట్టి భగవంతున్ని సేవించెదను.
క. నర్తకుని భంగి బెక్కగు 
    మూర్తులతో నెవ్వడాడు, మునులున్ దివిజుల్ 
    గీర్తింప నేర రెవ్వని 
    వర్తన మొరు లెరుగ, రట్టి వాని నుతింతున్
పలువేషములు ధరించి, పెక్కు రూపములతో ఎవడు ఈ చరాచర సృష్టితో మసలుచున్నాడో, మునీశ్వరులు, దేవతలు కీర్తింపలేని కీర్తిని పొందియున్నవాడెవ్వడో, ఎవనినెవ్వరూ తెలుసుకొలేరో అట్టి పరమేశ్వరుణ్ణి స్మరింతును. 
ఆ. ముక్తసంగులైన మునులు దిదృక్షులు
    సర్వభూతహితులు సాధుచిత్తు 
    ల సదృశవ్రతాడ్యు లై కొల్తు రెవ్వని 
    దివ్యపదం వాడు దిక్కు నాకు 
బ్రహ్మసాక్షాత్కారకామితులై, సమస్త ప్రాణులను సమదృష్టితో చూచు సత్పురుషులు, అత్యంత నియమనిష్టలు గలవారైననూ ఎవరిని ఎరుంగలేరో అట్టి పరమేశ్వరుని ప్రార్ధింతును. నా కతడే రక్షయగుగాక!
సీ. భవం దోషంబు రూ పంబు కర్మంబు నా 
     హ్వయమును గుణం లె వ్వనికి లేక 
  జగముల గలిగించు సమయించుకొఱకునై
    నిజమాయ నెవ్వడి న్నియును దాల్చు 
  నా పరమేశు న నంతశక్తికి బ్రహ్మ 
    కిద్ధరూపికి రూప హీనునకున్ 
  జిత్రచారునికి సా క్షికి నాత్మరుచికిని 
    బరమాత్మునకు బర  బ్రహ్మమునకు 
ఆ. మాటల నెరుకల మనముల జేరంగ 
    రానిశుచికి సత్త్వ గమ్యు డగుచు 
    నిపుణడైనవాని నిష్కర్మతకు మెచ్చు 
    వాని కే నొనర్తు వందనములు
జన్మ, పాప, నామ, గుణ, రూప రహితుడెవ్వడో సృష్టి, స్థితి, లయాదినామ రూపములు గలవాడును, మాయను జయించినవాడునూ, తేజోరూపుండునూ, పరాత్పరుడును, మిక్కిలి శక్తిపరుడైనవాడును, రూపరహితుడునూ, చిత్రాతిచిత్రమైన విచిత్ర చరిత్రలు కలవాడును, సాక్షియైనవాడును, స్వయంప్రకాశం కలవాడును, పరమాత్మ, పరబ్రహ్మం కలవాడును, మనోవాక్కాయకర్మలకు అగోచరుడును, సత్వగుణ సంభూతుడును, సంసారత్యాగికి సాక్షాత్కరించువాడును అయిన ఆ విశ్వేశ్వరున్ని మ్రొక్కెదను.
సీ. శాంతున కపవర్గ సౌఖ్యసంవేదికి 
      నిర్వాణ భర్తకు నిర్విశేషు 
    నకు ఘోరునకు గూడు నకు గుణధర్మికి 
      సౌమ్యున కదిక వి జ్ఞానమయున 
    కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు 
      క్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి
    మూలప్రకృతి కాత్మ మూలున కుజితేంద్రి
      యజ్ఞాపకునకు దుః ఖాంతకృతికి 
ఆ. నెరి నసత్య మనెడి నీడతో వెలుగుచు 
    నుండు నెక్కటికి మ హోత్తమునకు 
    నిఖిల కారణునకు నిష్కారణునకు న 
    మస్కరింతు నన్ను మనుచుకొఱకు 
శాంతస్వభావునికి, మోక్షసంతోష మాధుర్యమును గ్రోలినవార్కి, మోక్షతీతుడు, పామరులకు భయంగొల్పువాడు, ఎవ్వరికిని అంతుచిక్కనివాడును, సత్వరజ స్తమోగుణ సంయుతుడును, సౌమ్యుడును, అధిక విజ్ఞానవంతుడును, సర్వులకు అధిపతియై కాపాడువానికిని, సర్వాంతర్యామియనువాడును,మూలాధారుడైన వానికిని, సర్వదుఃఖవినాశునికి, జగత్కారకునకు, ఉత్తమోత్తముడు అయిన ఆ భగవంతునిని రక్షించమని వేడుకుంటున్నాను. 
క. యోగాగ్ని దగ్ధకర్ములు 
    యోగీశ్వరు లే మహాత్ము నొండెరుగక స 
    ద్యోగవిభాసితమనముల
    బాగుగా నీక్షింతు రట్టి పరము భజింతున్ 
మాయమోహవర్జితులై, యోగీశ్వరులు తపోనిష్టగరిష్టులై సర్వమును త్యజించి ఏ భగవంతుని సాన్నిధ్యం ఆశించెదరో, అట్టి భగవంతున్ని ఈ ఆపదనుండి నన్ను కాపాడమని వేడుకుంటున్నాను.
సీ. సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ 
      మయునికి నుత్తమ మందిరునకు 
    సకలగుణారణి చ్చన్నభోదాగ్ని కి 
      దంత రాజిల్లు ధన్యమతికి 
    గుణలయోద్దీపిత గురుమానసునకు సం 
      వర్తిత కర్మని ర్వర్తితునకు 
    దిశలేని నాబోటి పశువుల పాపంబు 
      లణచు వానికి సమ స్తాంతరాత్ము
ఆ. డై వెలుంగువాని కచ్చిన్నునకు భగ
    వంతునకు దనూజ పశునివేళ 
    దార సక్తులయిన వారి కందగరాని 
    వాని కాచరింతు వందనములు 
సర్వదేవతా పూజావిధానం తెలుపు వేదములకు నిధియైనవాడును, మోక్షమార్గ స్వరూపుడును, సర్వశ్రేష్టులకు ఆటపట్టయినవానికి, జ్ఞానగుణ సంపన్నునకు, స్వయంప్రకాశ నిర్మలబుద్ధి గలవానికి దీనజనోద్ధారకుడు, సర్వాంతర్యామియై వెలుగొందువాడును అయిన ఆ జగత్ప్రభువును మనసార రక్షించమని వినయపూర్వకంగా వేడుకొనుచున్నాను. 
సీ. వర ధర్మ కామార్ధ వర్జిత కాము లై 
      విబుధు లెవ్వాని సే వింతు రిష్ట 
    గతి బొందుదురు చేరి కాంక్షించువారి క 
      వ్యయ దేహ మునిచ్చు నె వ్వాడుకరుణ 
    ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు 
      రానందవార్ది మ గ్నాంతరంగు 
    లేకాంతు లెవ్వని నేమియు గోరక 
      భద్రచరిత్రంబు బాడుచుండు
ఆ. రా, మహేశు, నాద్యు నవ్యక్తు, నధ్యాత్మ 
    యోగ గమ్యు బూర్ణు నున్నతాత్ము 
    బ్రహ్మమైనవాని బరుని నతీంద్రియు 
    నీశు, స్థూక్ష్ము నే భజింతు 
మహోన్నతమైన ధర్మార్ధకామములను త్యజించినవారై, పండితులెవ్వని గని తమ కోరికలను తీర్చుకుందురో, మనస్పూర్తిగా ప్రార్ధించువారి కోరికలను ఎవ్వరు కరుణతో తీర్చునో, శరీరాభిమాన రహితులై నిష్టతో నెవనిని ధ్యానించి ఆనందింతురో, అట్టి పరమేశ్వరుణ్ణి పూజించెదను. త్రికరణములకగోచరుడును, నిష్టాగరిష్టులైన పరమభక్తులను పొందినవాడును, బ్రహ్మస్వరూపుడును, సర్వాంతర్యామియై స్థూల సూక్ష్మ రూపంబుల నొందు వాడును, అగు పరమేశ్వరుణ్ణి సర్వదా రక్షింపుమని ప్రార్ధిస్తున్నాను.
సీ. పాపకుండర్చుల భానుండు దీప్తుల 
      నెబ్భంగి నిగిడింతు రెట్లడంతు 
    రా క్రియ నాత్మ క రావళిచేత బ్ర 
      హ్మాదుల వేల్పుల నఖిలజంతు 
    గణముల జగముల ఘననామరూప భే 
      దములతో మెఱయించి తగ నడుంచు 
    నెవ్వండు మనము బు ద్ధీంద్రియంబులు దాన 
     యై గుణసంప్రవా హంబు బఱపు 
తే. స్త్రీ నపుంసక పురషమూ ర్తియును గాక 
    తిర్యగమరనరాది మూ ర్తియును గాక 
    కర్మగుణభేద సద సత్ర్స కాశి గాక 
    వెనుక నన్నియు దా నగు విభుని దలంతు 
సూర్యాగ్నులు తమతమ కాంతులను ప్రజ్వలించి కాంతింపజేయునట్లు ఏ విశ్వేశ్వరుడు ఈ విశ్వమంతటినీ, సమస్త భూమ్యాది లోకంబులను, బ్రహ్మాది దేవతలను, చరాచర జీవసముదాయమును, సృష్టించి స్థితించి లయమును పొందించి తనలోనికి చేర్చుకొనునో, మనోబుద్ధులను జ్ఞాన కర్మేంద్రియములకు ఎవడు కర్తగా ఉండి త్రిగుణముల కార్యములను పరిపూర్తిచేసిన పిమ్మట శూన్యరూపుండై, రూపరహితుడై, మానవ పశు పక్షాదుల దేవతారూపంబుల నొందక, సత్త్వ అసత్త్వ రూపుడును గాక, చివరికన్నియు తానైన వాడగు ఆ పరమాత్ముని సేవించెదను.
క. కలడందురు దీనులయెడ 
    గలడందురు పరమయోగి గణముల పాలన్ 
    గలడందు రన్నిదిశలను 
    కలడు కలండనెడువాడు కలడో లేడో
ఆ పరాత్పరుడు ఆపన్నులు, యోగుల సమూహముల యెడను, సకల దిక్కులయందును కలడని ప్రస్తుతింతురు. అసలట్టి మహాత్ప్రభువు ఈ యిలను గలడో, లేడో అని సంశయం కల్గుచున్నది. ఎన్ని విధముల ప్రార్దించినను నన్ను కరుణించడేమి? ఆపన్నులను ఆదుకోడేమి?
సీ. కలుగడే నాపాలి కలిమి సందేహింప 
      గలిమి లేములు లేక గలుగువాడు 
    నాకడ్డపడరాడే నలిన సాధువులచే 
      బడినసాధుల కడ్డ పడెడువాడు 
    చూడడే నా పాటు జూపుల జూడక 
      జూచువారల గృప జూచువాడు 
    లీలతో నా మొరా లింపడే మొఱగుల 
      మొర లెరుగుచు దన్ను మొఱగువాడు 
తే. నఖిలరూపులు దన రూప మైనవాడు 
    నాదిమధ్యాంతములు లేక యలరువాడు 
    భక్తజనముల దీనుల పాలివాడు 
    వినడె చూడడే తలపడె వేగరాడె
పుట్టుటయు, గిట్టుటయు లేని ఆ పరాత్పరుడు నాయందు ఉన్నాడో, లేడో? అన్న సంశయం కల్గుచున్నది. లేకున్న నాపై దయ చూపడేమి? తన జ్ఞాన చక్షువులతో నన్నేల వీక్షింపకున్నాడు? కపటభక్తులకు కానరాని కమలనాధుడు, నన్ను, నా నిష్కళంక మొరను ఆలకింపకున్నాడేమీ? జగత్స్వరూపుడైన, ఆదిమధ్యాంతరహితుడై ప్రకాశించు, దీనజనభక్త భాందవుడు అగు ఆ పరంధాముడు నా ప్రార్ధనల నాలకించి, నను కని, నాపై దయతలచి నను రక్షింప వేగమే రాడా?
వి. వను దట జీవులమాటలు 
    జను దట చనరాని చోట్ల శరణార్ధులకో 
    యను దట పిలచినసర్వము 
    గను దట సందేహ మయ్యే గరుణా వార్దీ
ఓ కరుణామూర్తీ! జగద్రక్షకా! నీవు ఆపన్నులను ఆదుకొందువని, జొరరాని స్థలమునకేగగలవని, నిన్ను శరణన్నవారికి నేనున్నానని అభయమిచ్చెదవని వినియున్నాను. కానీ ఎంతసేపటినుండి వేడికొన్ననూ రాకపోవుటచే సందేహం కలుగుతున్నది స్వామీ!
క. విశ్వకరు విశ్వదూరుని 
    విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్ 
    శాశ్వతు నజు బ్రహ్మప్రభు 
    నీశ్వరునిన్ బరమపురుషు నే సేవింతున్ 
ప్రపంచానికంతకూ తానే సృష్టికర్తయైయుండి తాను వెలుపలనుండవాడును, విశ్వాత్మరూపుడును, విశ్వమునకు దెలిసిన వాడునూ, బ్రహ్మకంటే గొప్పవాడైన ఈశ్వరుని పరమపురుషోత్తముని రక్షింపమని మనసారా సేవించెదను.
శా. లావొక్కింతయులేదు దైర్యము విలో లంబయ్యేబ్రాణంబులున్  
    ఠావుల్దప్పెను మూర్చవచ్చే దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ 
    నీవేతప్ప నితః పరంబెరుగా మన్నింపన్ దగున్ దీనునిన్ 
    రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా 
ప్రభూ! పరమేశ్వరా! ఇంక పోరాడలేకపోవుచున్నాను. తండ్రీ! శక్తి సన్నగిల్లుతుంది. ఇంతవరకు నేనీ మకరంబును జయించగలనని తలచితిని. ఆ ధైర్యం పోయినది. ప్రాణములు పై కెగిరిపోతున్నాయి. మైకం వస్తుంది ప్రభూ! ఈ దేహం అలసిసొలసి అణగారిపోయింది తండ్రీ! ఈశ్వరా! నీవుతప్ప వేరెవ్వరు తెలియదు. నీవు తప్ప ఇతరులు నన్ను కాపాడలేరు. ఈ మొసలితో పోరాడలేకున్నాను స్వామీ! ఈ దీనుని తప్పులు మన్నించి నన్ను కాపాడ వేగమే రావా పరమేశ్వరా! ఓ దివ్యశరీర! దయతో నన్ను రక్షించు స్వామీ! 
ఉ. ఓ కమలాక్ష యో వరద యో ప్రతిపక్షవిపక్ష యీశ్వరా 
    యో కవియోగివంద్య సుగుణోత్తమ యో శరణాగతామరా 
    నోకహ యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ 
    రావే కరుణింపవే తలపవే శరణార్ధిని నన్ను గానవే 
ఓ కమలాక్షుడా! భక్తుల కోరికలు సత్వరమే తీర్చువాడా! శత్రువులను కూడా ప్రేమించువాడా! ఈశ్వరా! మునుల చేతను, పండితుల చేతను పొగడబడినవాడా! సుగుణోత్తమా! శరణాగతరక్షకా! మునీశ్వరులకు మనోహరమైనవాడా! ఓ నిర్మలచరితా! త్వరగా వచ్చి నన్ను కాపాడుము తండ్రీ! నీ నామస్మరణే నా ధ్యేయంగా నుంటిని స్వామీ! ప్రభువా! దయతో రక్షింపుము.

అంతట వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీదేవితో కూడి యున్న శ్రీమన్నారాయణుడు తనని శరణుకోరుతున్న గజరాజుని కాపాడడానికి దేనినీ గమనించక తటాలున ఉన్నపళంగా బయలుదేరడం, సుదర్శన చక్రాయుధంను ప్రయోగించి మకరంను సంహరించి గజేంద్రుని రక్షించడం అందరికీ తెలిసిన కధనమే. 

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం -
పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో, ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.  
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్న మానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!
తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని, దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే,  మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే, తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి. 
గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని, అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి, పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో, వివేక విశ్వాసాలతో, నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను  శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి, మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి,  ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనే జ్ఞానముతో, అజ్ఞాన అహంభావనను సంహరించిన పిదప  ఆత్మసాక్షాత్కారం అవుతుంది.  
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి. 
'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం. 
ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.



3, మే 2012, గురువారం

మంచిమాట

 
  
శరీరమనే క్షేత్రంలో మంచిపనులను విత్తనములుగా చల్లి, భగవన్నామస్మరణమనే నాగలితో
నీ హృదయమే రైతై దున్నినట్లయితే
నీ అంతఃకరణలోనే భగవంతుడు ఉదయిస్తాడు.

                                                         _ గురునానక్