1, మార్చి 2019, శుక్రవారం

"అంతరమౌనం - బాహ్యకర్మ"


                                                                


ఈ మధ్యన ఓ మిత్రురాలు, సహా బ్లాగరిణి "అంతరమౌనం - బాహ్యకర్మ" గురించి అడిగింది. 
చేస్తున్నానన్న భావన లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధితో బాహ్యకర్మలు ఉన్నప్పుడు దేనితో సంయోగం చెందని మనస్సు సాక్షియై అణగగా, అలవడిందే అంతరమౌనం. దీనినే కాస్త వివరించమన్న తన కోరిక మేరకే ఈ టపా -
"కర్మకు ఆవల నిష్కామం, నిష్కామమునకు ఆవల నిస్సంగం, నిస్సంగమునకు ఆవల ఏకాంతం, ఏకాంతమునకు ఆవల నిశ్శబ్దం, నిశ్శబ్దమునకు ఆవల మౌనం. ఆ మౌనమే ఆత్మస్థితి, ఆ మౌనమే జ్ఞానం, ఆ మౌనమే అమరత్వం " - శ్రీ రమణులు. 
మౌనం అని అనుకోగానే మాటై స్ఫురిస్తుంది. స్ఫురణకు ఆవల సాక్షియే మౌనము. మౌనం గురించి ప్రస్తావించడమంటే శబ్దంలోకి జారిపోవడమే. ప్రస్తావన లేని పరమపదం మౌనం. అది అవ్యక్తం, అవర్ణనం, శాశ్వతం, నిరంతరం, సనాతనం. నిజానికి మౌనం స్వయంభువది .
మౌనం శబ్దంగా మారే క్రమమే సంకల్పం, సృష్టి, ప్రపంచం, కర్మలు, పునర్జన్మలని పెద్దలంటుంటారు. కర్మలతో మనస్సు కలిసి బయల్పడితే  సృష్టి. బయల్పడే మనస్సు హృదయంలో ఇంకిపోతే లయం. సర్వ సమన్వయమంతా మౌనంలోనే ఉంది. వాక్ వర్తనలో లేనేలేదు. కర్మ కర్తృత్వంలో ఉండదు.   
పంచేంద్రియ కర్మలకు భావన చేరకపోవడమే సత్యస్థితి. ఈ స్థితే మౌనం. అంతరమైన అనంత మౌనమే ఆత్మస్థితి.  
"ఊరకనుండటమే సర్వసమన్వయం "   "ఊరకనుండుటయే ఉత్తమం" 
ఇది శ్రీ రమణుల బోధ. 
సత్యానుభవం రానంతవరకు అంతఃకరణం చేసే మహాశబ్దం " నేను ". ఆ 'నేను'ని తెలుసుకోవాలనుకుంటే ఆత్మతో అనుసంధానమై ఉండాలి. నిన్ను నీవు తెలుసుకునే ఎరుకకు సరళమైన సర్వోత్తమమైన మార్గం మౌనమే. మనస్సు మూలాల్ని అన్వేషించు, ‘నేను’అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. ఆ మౌనాన్నే ఆశ్రయించు. ఆ మౌనంలో విశ్రమించు, అదే మౌన తపస్సు . ఈ మౌన సాధన వల్లే  ఆ మౌనములోనే ఆత్మానుసంధానం... ఆత్మసాక్షత్కారం అని ఉపదేశించేవారు శ్రీ రమణ మహర్షివారు. 
మౌనం అత్యంత సమర్ధవంతమైన శక్తిప్రవాహం. దక్షిణామూర్తి చెప్పలేక మౌనం వహించలేదు. చెప్పడానికి ఏమీ లేక మౌనం వహించాడు. 
బ్రాహ్మీస్థితి అనుభవైకవేద్యం. అది వర్ణనాతీతం. 
అయితే ఇంతటి మౌనమునకు కర్మకు ఏమిటి సంబంధమో అవగాహన చేసుకునేముందు ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం - 
'నేను చేస్తున్నాను' అనే భావనతో మనస్సు మరియు ఇంద్రియాల చేత చేసెడి చర్యలను కర్మ అంటారు. స్థూలంగా (బాహ్యంగా) కన్పించే కర్మలు కొన్నయితే, సూక్ష్మంగా అంతరమున సాగేవి మరికొన్ని. ఆలోచనా రూపంలో, మాటల రూపంలో, చేతల రూపంలో కర్మలు చేస్తూనే ఉంటాం.  అలా చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. అది అనుభవంలోకి వస్తుంది. 
ఈ జగత్తులో  ప్రతీజీవి జన్మించడానికి కారణం మునుపుటి జన్మల కర్మఫలితమే. 
తత్రాస్యస్వకృతమ్ కర్మ ఛాయేవానుగతం సదా ... ఎవరు చేసిన కర్మలు వారిని పునర్జన్మ యందు నీడలా అనుసరిస్తాయి. 

యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పూర్వ కృతం కర్మ కర్తార మను గచ్ఛతి   వేల సంఖ్యలో ఉన్న ఆవుల్లో సైతం లేగదూడ తన తల్లిని ఏవిధంగా వెదకి పట్టుకుంటుందో అలాగే గతంలో చేయబడిన కర్మలు కర్తను అనుసరిస్తూ ఉంటాయనేది సత్యం.  

స్వకర్మ వశతః సర్వ జంతూనాం ప్రాభవాప్యయౌః తమ తమ కర్మలని అనుసరించి సకల ప్రాణుల చావు పుట్టుకలు ఉంటాయి. 
సకల ప్రాణులకున్ను పూర్వజన్మ కర్మానుసారంగా స్వభావ మేర్పడుచున్నది. చెడుకి చెడు, మంచికి మంచి కర్మఫలం అనుభవించాల్సిందే. ఇదే విశ్వ నియమం, హిందూ సనాతన ధర్మం తెలిపే కర్మ సిద్ధాంతం.
దేహాత్మభావనతో, కర్తృత్వ భావనతో చేసే పనులన్నీ కర్మబంధాలే. 
ఎక్కడ కర్తృత్వం (నేను చేస్తున్నాను) అనే భావన ఉంటే అక్కడ భోక్తృత్వం  (ఫలానుభవం) కూడా ఉంటుంది. ఒక విత్తు నాటితే అది మొలిచి వృక్షమై అనేక ఫలాల్ని ఇచ్చినట్లుగా చిన్న కర్మ అయినా దాని ఫలం అనూహ్యంగా అనంతంగా ఉంటుంది. ఒక విత్తు నాటేం కదా అని ఆ చెట్టు ఒక్క ఫలాన్నే ఇవ్వదు కదా. 
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ | నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరపి || 
చేసిన కర్మ అది పుణ్యమైన, పాపమైన కానీ, కోటికల్పాలకైనా సరే నశించేది కాదు. దానిని అనుభవించి తీరాల్సిందే. 
మరి జన్మలు, కర్మలు క్షయమయ్యే విధానం ఏది?  
జీవించినంతకాలం కర్మను ఆచరించకుండా ఉండలేం.  కర్మత్రయం (సంచిత, ప్రారబ్ధ, ఆగామి) గురించి అందరికీ తెలుసు. అనేకజన్మలనుండి సంపాదింపబడిన కర్మరాశికి సంచితమని, ఈ సంచిత కర్మరాశినుండి కొంతభాగం పక్వమై ఈ జన్మలో అనుభవానికి వస్తున్న కర్మఫలానికి ప్రారబ్ధమనియు, ప్రారబ్దాన్ని అనుభవిస్తూ, ఈ జన్మలో కొత్తగా చేసిన, చేస్తున్న పాపపుణ్యాల కర్మల ద్వారా పోగయ్యే కర్మఫలంలో కొన్ని ఈ జన్మలో అనుభవిస్తూ, చాలావరకు భావిజన్మలో అనుభవించడానికి సిద్ధం చేసుకుంటున్న కర్మరాశి ఆగామి. మరణాంతరం ఈ ఆగామి కర్మరాశి సంచితకర్మలో కలుస్తుంది. అంటే సంచితం - భూతకాలంతోను, ప్రారబ్ధం - వర్తమానకాలంతోను, ఆగామి భావికాలంతోను సంబంధపడియుండును. 
అనుభవించడం ద్వారే ప్రారబ్దకర్మ క్షయమౌతుంది. ఇక ఆగామి సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మ రూపానికి మారి మనకి అనుభవానికి రాకుండనే,  ధ్యానం, దానం, దైవారాధన, దయ, ధర్మజీవనం, క్షమ భూతహితం, లాంటి నిష్కామ కర్మల ద్వారా చాలావరకు తొలగించుకోవచ్చు. 
మనం అవిద్య / అజ్ఞానంతో సంపాదించుకొని వున్న ప్రారబ్ద కర్మలను తొలగించుకోవడానికి ఈ మానవజన్మ తీసుకున్నామన్న సత్యాన్ని మరచి, మరల మరల అజ్ఞానముతో వాటికి తోడూ మరింతగా కర్మరాశిని ప్రోగు చేసుకుంటున్నాము. మనస్సు మాయలోపడి వచ్చిన విషయాన్ని మరచిపోయి రకరకాల కర్మలను మూటగట్టుకుంటున్నాం. ఫలితం -  పునరపి జననం పునరపి మరణం . 
భగవంతుని యెడల శరణాగతి చెందితే ఎన్ని కర్మవాసనలు ఉన్నా అన్నీపోతాయి. అన్య ఆలోచనలు వీడి, అంతరమున అంతర్యామిని నిలుపుకొని కర్మలు ఆచరించిన చాలావరకు కర్మవాసనలు వదిలించుకున్నట్లే.   
                                               


ప్రారబ్ద కర్మ ఫలాలను అనుభవించటానికి జన్మ వస్తున్నదన్నది వాస్తవం. ఆ ప్రారబ్దకర్మలే లేకపోతే పుట్టుకే లేదు. ఐతే ఈ ప్రారబ్ద కర్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి? సంచితకర్మలలో నుండి పక్వమై వస్తున్నాయి. కనుక ప్రారబ్ద కర్మలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. మరి ఈ సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి? మనం ముందు జన్మలో చేసిన అగామికర్మలలో నుండి వెంటనే ఫలితాన్నిచ్చినవి పోను మిగిలిన కర్మలే సంచిత కర్మలుగా వస్తున్నవి. కనుక సంచిత కర్మలు చేయకుండా వుండాలి. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట. ఐతే కర్మలు చేయకుండా వుండటం ఎవరికైనా సాధ్యమేనా ? ఊహు ... సాధ్యం కాదు. మరి ఎలా???  ప్రారబ్ద కర్మలను  భక్తి ధ్యానాదుల  ద్వారా  ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఉదాసీనంగా అనుభవించి అధిగమించాలి. అదే తరుణంలో అగామికర్మలు భగవంతార్పణ బుద్దితో కర్తృత్వ భావన లేకుండా నిష్కామంగా చేయాలి. అలాగే సద్గురువుల సాంగత్యంలో సంచితకర్మలను జ్ఞానాగ్నిలో దగ్దం చేయాలి అప్పుడే కర్మశేషాలుండవు, జన్మలు ఉండవు. జీవన్ముక్తిని పొందుతాం. 
చేసే తలపు లోపల వున్నంతకాలం, చేసేశక్తి తనకు ఉందనుకున్నంతకాలం, కర్మ చేయకుండా ఉండలేడు. చేసే శక్తి తగ్గి, చేయాలన్న తలపు తొలగి, ఇక చేయడానికి ఏమీ లేదని గ్రహించి, చేస్తుంది ఎవరు - చేయిస్తుంది ఎవరు అన్న విచారణతో భాగవతంలోని గజేంద్రుడులా మౌనమై శరణాగతి పొందినప్పుడే ముక్తత్వం.        
ఇది గ్రహించి నడయాడేవారు కర్మయోగులు. వీరే అంతరమౌనంలో ఓలలాడుతూ బాహ్యకర్మలయందు తామరాకుపై నీటిబొట్టులా జీవిస్తారు. వీరికి నామరూపములు, బాహ్య కర్మలు ఆటంకం కానే కాదు. అదో సహజ స్రవంతి .

ప్రతీరోజు భగవంతుని ఎదుట నిలబడి, చేస్తున్నది చేయిస్తుంది అంతా నీవే, ఇదేదీ నేను కాదు, అంతా నీవే ఉన్నావని మౌనమై కొన్ని క్షణాలు ఉండండి. అదే నిజమైన మహన్యాసపూర్వక పూజ. ప్రయోజనంతో పట్టింపులేకుండా పనులాచరించడమే పరమ ప్రయోజనం. వ్యక్తిగతమైన నేను ను విడనాడి చేసిన కర్మయైన, ధ్యానమైనా జ్ఞానమునే ప్రసాదిస్తుంది. కాటిపై కాలేక కూడా కర్మవాసనలు మోస్తూ మరుజన్మ పొందుతున్నదెవరు అన్న విచారణ  జీవన్ముక్తిత్వమునే ఇస్తుంది.   
                                                                 
కర్తృత్వభావనతో కర్మలాచరించేకంటే ఈశ్వరార్పణతో కర్మలాచరించడం ధన్యత. 
మౌనంగా ఉండటం కంటే, మౌనమై ఉండటం శ్రేష్టత.