20, ఫిబ్రవరి 2014, గురువారం

ఆధ్యాత్మికఆచార్యుడు ఆంజనేయుడు

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. 
ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతీకార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే. 

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు 

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 
'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు. 

పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం 

వానరరూపం - వాయుతత్త్వం. 
గరుడరూపం - ఆకాశతత్త్వం. 
నరసింహరూపం - అగ్నితత్త్వం. 
వరాహరూపం - భూమితత్త్వం. 
హయగ్రీవరూపం - జలతత్త్వం. 
ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 
నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 
సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు. 

అఖిలలోకోపకారి ఆంజనేయుడు 

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు. 

{అష్టసిద్ధులు - వివరణ :-
అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. 
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.  

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.  
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.  
పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.  
ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.  
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి. 
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం". 
అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"} 

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా / 
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?
ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి. 
గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //
భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. 
అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును. 
రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు 
అటుపై వీరి బంధం "ఏకత్వం". 
ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -
దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /
ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //
ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. 

బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు. రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. 
భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు. 

మరిన్ని వివరణలు తదుపరి టపాలో ... 


   

1, ఫిబ్రవరి 2014, శనివారం

నా నెచ్చలితో నా కబుర్లు ... 'భక్తుని అంతరంగభావపరంపరలు'

భారతీ! పాండురంగ శతకంలో పద్యాలు చదువుతూ ఆశ్చర్యానందములతో పులకించిపొయాను. ఓ భక్తుని భావపరంపరలు ఏమని చెప్పను? నేను చదివిన ఆ కొన్ని పద్యాలు నీకోసమని వ్రాసుకొచ్చానని నా నెచ్చలి ఇచ్చిన అమూల్యపద్యాలు చదివి పరవశమయ్యాను. ఆ పద్యాలను 'స్మరణ'లో పదిలపరచుకుంటున్నాన్నిలా -

భగవంతుడు నిరాకారుడు అయినా సాకారుడుగా, నిర్గుణుడు అయినా సగుణుడుగా భక్తులకై అవతరించు ఆత్మీయుడు. అటువంటి సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ఆరాదించే భక్తుని మనోభావనలు అనంతం, అద్భుతం. 
అట్టి సర్వేశ్వరునిని ముందు ఓ భక్తుడు జోలె సాచి అర్ధిస్తున్నాడిలా -

భక్తితో నొసగిన పత్రమైనను గొని 
     తినలేదే? దృపదుని తనయ కొరకు,
ఆర్తితో కుసుమమ్ము నర్పించి మొరలిడ 
     రాలేదే? వే కరిరాజు కొరకు,
పండుదినుటె గాదు పై పొట్టు సైతం 
     మ్రింగలేదే? విదురాంగనకయి,
నోరూర బుడిశెడు నీరమున్ గైకొని 
     త్రావలేదే? రంతిదేవు కొరకు,

ఏమిగని యారగించితో శ్యామలాంగ 
అట్టి ప్రేమను భిక్షగా బెట్టుమయ్య 
జోలెసాచితి నీ ముందు జాలితోడ 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు, భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే. భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. భక్తునికై పరుగులు తీస్తాడు. భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు. తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను సేద తీరమంటాడిలా -

ఏకనాధుని యింట పాకాది కార్యముల్ 
     జేసి కావడి నీళ్ళు మోసి మోసి, 
ప్రేమన్ జనాబాయి పిలిచిన నటకేగి 
     వేడుకతో పిండి విసిరి విసిరి,
శ్వేతవాహను పైన ప్రీతితో రణమున 
     లీలగా రధమును తోలి తోలి,
ఆర్త జిజ్ఞాసువు లర్ధార్ధులెందరో 
     మొరలిడ వారికై తిరిగి తిరిగి, 

ఎంత శ్రమనొంది యుంటివో యే మొరమ్ము 
దాచు కొందును హృదయాన తాల్మితోడ 
విశ్రమింపుము క్షణమైన విమల చరిత 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! భగవంతుడు నిష్క్రియుడు, నిర్విశేషుడు, నిర్లిప్తుడు అయినను సృష్టి స్థితి లయ కారకుడు. సర్వవ్యాపకుడు, పరిపూర్ణుడు, మహిమాన్వితుడు. అటువంటి పరమాత్మను తనకు తానుగా తెలుసుకోలేనని, తనపై కరుణతో తనకు తానుగా(భగవంతుడు) తానే తెలియబడాలన్న సత్యాన్ని గ్రహించి, ప్రార్ధిస్తాడిలా -

నిన్నెరుంగగ మాకు కొన్ని గుర్తులు జెప్పి 
     మూగదై శ్రుతి మౌనమును వహించె, 
వేనోళ్ళ బొగిడిన విభవాదియే గాక
     శేషింప తానాదిశేషుడయ్యె,
నిన్నెరింగిన వారలన్న తెల్పుచు తత్త్వ 
     మిదమిద్ధమని నిరూపించరైరి,
అంతరంగములోన నెంత యోచించిన 
     తెలిసినట్లౌ నేమి తెలియకుండు,

నీవు కరుణించినంగాని నిన్నుగాంచ 
నలవి గాదయ్య బహు జన్మములకునైన 
వేగ కృపతోడ బ్రోవుమో వేదవేద్య 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!!