22, డిసెంబర్ 2015, మంగళవారం

"సత్య"సాధన

                                                   "సత్యమేవ జయతే"
                        సత్యమేవ జయతే అనేది భారత ప్రభుత్వం స్వీకరించిన ధ్యేయవాక్యం. 


సత్యంకు ఇంతటి ఘనత ఎందుకు? అసలు సత్యమంటే ఏమిటీ?

పరబ్రహ్మ స్వరూపమే సత్యము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్ లో చెప్పబడింది.
అటులనే ముండకోపనిషత్ సత్యమేవ జయతి (సత్యమే జయిస్తుంది)అని వక్కానిస్తుంది. 
బ్రహ్మసత్యం జగత్ మిధ్య (బ్రహ్మమే సత్యమని, జగత్తే మిధ్య)అని శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు.

సత్యమే అత్యున్నత సద్గుణం.
సత్యమే సకల సుగుణాలకు మకుటం.
సత్యమే సాధకునికి ఆలంబనం.
సత్యమే సత్య వాదులకు లక్ష్యం. 
సత్యమే పరమపదం.
సత్యమే పరమాత్మ.
సత్యమే సత్ సాధకులకు అత్యుత్తమ అనుష్టానం. 

సత్య పధంలో సాధన, సాధ్యం రెండూ కూడా 'సత్యమే'.

"మంచి నడవడిక అనేది ఒక మహాసాగరం. ఆ సాగరం నుండి తరింపజేసేందుకు ఓడలాగా ఉపయోగపడేది సత్యవాక్యం" అని తెలియజెప్తుంది విదురనీతి.  

"సత్యానికి సరి సమానమైన తపస్సు లేదు.అసత్యాన్ని మించిన పాపము లేదు.ఓ దేవా! ఎవరు సత్యాన్ని అనుష్థిస్తారో వారి హృదయంలో నీవు నెలకొని వుంటావు" అని సత్యం యొక్క ఔనత్యాన్ని కీర్తిస్తాడు కబీర్ దాసు.

"యవ్వనం, సౌందర్యం అదృశ్యమౌతాయి; జీవితం, సంపద మాయమౌతాయి; పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి; పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి; సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి; సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది" అని నినదించారు వివేకానందులవారు. 

మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం అన్న సుభాషితం ప్రకారం మనస్సులోని భావన, మాట, చేత ఈమూడు ఒకేరీతిలో వుండడం సత్యవ్రతుని లక్షణం. ఇలా మనస్సు, వాక్కు, కర్మల సమన్వయంలో చేసిన సాధనే సత్యవంతమైన జీవితానికి 'అత్యావశ్యకం '.

సత్యానుసారిణీ లక్ష్మీ: కీర్తి స్త్యగానుసారిణీ
అభ్యాస కారిణీ విద్యా బుద్ధి: కర్మానుసారిణీ
సత్యం మానవుణ్ణి తరింపజేస్తుంది. గౌరవం, సంపద మొదలైనవి సత్యాన్ని అనుసరించి వస్తాయి.

శ్రీ వసిష్టవారు దిలీప మహారాజుతో దేనివలన జనన మరణ భవసాగరము తరింపబడునో, దానికే తీర్ధమని అంటారని, మానసాది తీర్ధంలను గురించి వివరిస్తూ మొదటగా చెప్పింది ... సత్యము గురించే! సత్యమే ఓ తీర్ధమని... ఇలా తెలిపారు -

సత్యాదీనాంచ తీర్దానాం లక్షణం శృణు పార్ధివ/
యస్య శ్రవణ మాత్రేణ సర్వస్నాన ఫలం లభేత్//
అనుద్వేగ కరం హృద్యం సజ్జనానంద కారణమ్/
ఏవం లక్షణ సంయుక్తం సత్యం ప్రాహుర్మ నీషిణః //
సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్/
ప్రియం చ నానృతం బ్రూయా దేష ధర్మస్సనాతనః //
ఓ రాజా! సత్యాది తీర్ధముల కధనమును వినిన మాత్రమునే సమస్త తీర్ధముల యందును స్నానం చేసిన ఫలం లభించును. మనస్సుకు ప్రియమైనది, ఇంపైనది, సత్పురుషులకు ఆనందం కలుగజేయునదియు ఏదియో,  అది సత్యమని మహాత్ములు  చెప్పుదురు. ఓ రాజా! ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను. ఆ సత్యమునే ప్రియంగా హితంకల్గేలా చెప్పవలెను. ఇదే అనాది ధర్మమని  పెద్దలు చెప్పుదురు... అని వసిష్టులవారు చెప్పగా -

అనుద్వేగ కరంవాక్యం సత్యం ప్రియం హితం చ యత్ అన్నది గీతాచార్యుని బోధన.

సత్యం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మ స్సనాతనః
సత్యం చెప్పినా అది ఎదుటివారికి ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని కలిగించకుండా ప్రియంగా చెప్పగలగాలి. అలా చెప్పలేని సత్యమైతే, అట్టి సత్యాన్ని చెప్పకుండా నిగ్రహించుకోవాలని మనుస్మృతి తెలుపుతుంది.
అంటే ... సత్యం చెప్పడం వలన ప్రాణి హింస,  ప్రాణాంతకమైన స్థితి వస్తే, హింసకు తావీయకుండా సత్యంను  వెల్లడి చేయకుండా నిగ్రహించుకోమనే శాస్త్రం చెప్తుంది.
ఇక్కడ ఎప్పుడో చదువుకున్న ఓ కధ గుర్తుకొస్తుంది -
పూర్వం సత్యవ్రతుడనే మహాపురుషుడు ఉన్నచోటుకు ఓ జింక పరుగెత్తుకొని వచ్చి దాక్కుంది. దానిని తరుముకొని వచ్చిన వేటగాడు 'స్వామీ! ఈ వైపు జింక పరుగెత్తుకొచ్చిందా' అని అడుగగా -
నిజం చెబితే జీవహింసలో తనకూ భాగం ఏర్పడుతుంది, లేకుంటే అసత్యదోషం వస్తుంది, అందుకని చాలా జాగ్రత్తగా మృదువుగా 'చూసిన కంటికి చెప్పేశక్తి లేదు, చెప్పగల నోటికి చూసేశక్తి లేదు' అని బదులిచ్చి ఊరుకోగా... ఆ బోయకు ఈ మాటలు అర్ధంకాక తనదారిన తాను వెళ్ళిపోయాడు. 

ఇక; సత్యం చీర కట్టుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చింది, సత్యం చెప్పులేసుకొని బయల్దేరేలోపు అసత్యం వాడవాడలా తిరిగివచ్చింది ... అని లోకోక్తి. 
సత్యవాది లోక విరోధి, సత్యాన్ని చెప్పినా వినేవారు ఎవరు... విలువ ఇచ్చేవారు ఎవరు ... ఒకోసారి కోరి కష్టాలను తెచ్చుకోవడమే అనేవారు వున్నారు.  
నిజమే ... సత్యనిర్వహణ చాలా కష్టమైన విషయం. కానీ, సత్యసంధతదే అంతిమ విజయం ... శాశ్వత విజయం! సత్యాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.

చిన్నప్పుడు చదువుకున్న సత్యసంధత పాఠమొకటి గుర్తుకొస్తుంది -
పులివాత పడిన ఒక గోవు తన లేగదూడకు పాల్లిచ్చి తిరిగి వస్తానని ప్రమాణం చేసి వచ్చి, దూడకు పాలిచ్చి పులి ఆహారంనకై మరల తిరిగివెళ్ళిన గోవు తన సత్యసంధతతో ఆపదనుండి బయటపడినది.    

ఇక సత్యం విలువను తెలిపే మరో ఘటన -
నుతజల పూరితంబులగు నూతులు నూరింటి కంటె సూ
న్నతవ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్ర్కతువది మేలు; తత్త్కతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్
                                                                 -నన్నయ్య (మహాభారతం)
తియ్యటి నీటితో నిండిన నూరు నూతుల కంటే ఒక దిగుడుబావి మేలు. ఆ దిగుడుబావులు నూరింటికంటే ఒక యజ్ఞం గొప్పది. అటువంటి నూరు యజ్ఞాలు కంటే, ఒక కొడుకు గొప్ప. అటువంటి నూరుగురు కుమారులు కంటే ఒక సత్యవాక్యం మిన్న ... అని శకుంతల దుష్యంతునికి చెప్పిన ఈ మాటలు సత్యవాక్య విలువను తెలుపుతుంది.  

సీతమ్మను అపహరించడానికి రావణుడు, మారీచుని సహాయం కోరినప్పుడు ... మారీచుడు, 
రావణా! ధర్మమూర్తి అయినా రామునితో వైరం పెట్టుకోవద్దు, నీతో పాటు నీ వంశమంతా నాశనమౌతుంది అని చెప్తూ ... 
సులభాః పురుషాఃరాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః // అని అంటాడు. 
రాజా! నీకు ప్రియవచనాలతో, స్తోత్రవ్యాక్యాలతో సంతోషం కల్గించేవాళ్ళు చాలామంది వున్నారు. కానీ, నీకు వినడానికి అప్రియంగా వున్నా, హితకరమైన సత్యమైన మాట చెప్పేవాళ్ళు దొరకరు. చెప్పినా వినేవాళ్ళు దొరకరు...

సత్యమును మారీచుడు చెప్పిన గ్రహించక ధర్మాన్ని తప్పిన రావణుడు సత్యవాక్కు పరిపాలకునిచే సంహరింపబడ్డాడు.
అసత్యం చెప్పదగిన సందర్భాలు శుక్రాచార్యుడు ఉదహరించిన వినక మానధనులు మాటతిరగరాదని, సత్యహీనున్ని కాలేనని, సత్యవాక్కుకు కట్టుబడిన బలిచక్రవర్తి ....
అటులనే -
విశ్వామిత్రుడు కల్పించిన అనేక కష్టాలను ఎదుర్కొన్న సత్యదీక్షను విడవకపోవడంతో సత్యవాక్పాలకుడు అయిన హరిచంద్ర చక్రవర్తి ...
ఎంతటి ఘనకీర్తిని పొందారో జగద్వితితమే.

సత్యపధగాములందరూ తమ మాటలలో, నడవడికలో బహు జాగ్రత్త వహిస్తారు. ఈ రకమైన నియమపాలన సహజంగానే మనిషిని నిరంతరం జాగరూకతలో ఉండేలా చేస్తుంది.ఇది తీవ్రమైన తపస్సుగా, అనుష్ఠానంగా రూపుదిద్దుకుంటుంది.ఈ విధంగా సాధకుని 'సత్య సాధన ' అతని మనోప్రపంచంలో నూతన పరిధిలను ఆవిష్కరించుకునేలా చేస్తుంది.

అలానే, ఒక వ్యక్తి సత్యానుష్ఠానం వల్ల సత్యసంధుడు అయినప్పుడు అద్భుతమైన సంకల్పశక్తిని సంతరించుకుంటాడు.

ఇక మన జ్ఞానేంద్రియముల పరిధిలోనికి వచ్చే విషయాలను యధాతధంగా చెప్పడం వ్యవహారిక సత్యం కాగా, కొన్ని కొన్ని సందర్భాల్లో అసత్యమైనవి సత్యంగా భ్రమింపజేస్తాయి. దీనిని ప్రాతిభాషిక సత్యమంటారు. శాస్త్రం ఇటువంటి భ్రాంతిని 'రజ్జు సర్ప భ్రాంతి'గా పేర్కొంటుంది.  ప్రాపంచిక వ్యవహారాల్లో ఇటువంటి భ్రాంతులకు లోను కాకూడదనే పెద్దలు కళ్ళతో బాగుగా పరిశీలించి,
సత్యమును గ్రహించి మనస్సులో వడబోసిన మాటనే పలకాలి... అని చెప్తారు. ఇక బ్రహ్మ సత్యం, జగత్ మిధ్య అనే పారమార్ధిక సత్యమే అసలైన సత్యం. ఈ పారమార్ధిక సత్యంకై చేసే సాధనే "సత్య"సాధన. 

అటువంటి సాధనకై -  
సత్యవంతమైన జీవితాన్ని గడిపిన హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, యుధిష్ఠరుడు మొదలైన వారి జీవితం, సందేశాలను పఠించి,తద్విషయముపై ధ్యానించాలి.........

ఎంతసేపు పురాణ పురుషులనే ఉదాహరణలుగా చూపడమే గానీ, అటుపై అన్యులెవరూ లేరా ... ఇది నేను ఈ పోస్ట్ టైపు చేస్తుండగా వెనక నిల్చొని చదివిన ప్రక్కింటి అమ్మాయి ప్రశ్న ... 
లేకేం ... సత్యము, అహింస అను  రెండు సద్గుణములును పాటిస్తూ, భారతీయ పతాకమును ఎగురవేసి, మన ఖ్యాతిని పెంచిన జాతిపిత మహాత్ముడు బాపూజీ ఉన్నారు. అలానే దేశ విదేశాలలో మన భారతీయ ఔనత్యాన్ని, తానూ నమ్మిన సత్యాన్ని చాటిచెప్పి మన స్థాయిని చిరస్థాయిగా నిలిపిన వివేకానందుడు ఉన్నారు....