26, అక్టోబర్ 2018, శుక్రవారం

బాగు చేసేందుకే బాధలు

మానవులకు మానసికంగా, శారీరకంగా, ఆర్ధికంగా, సంతానంతో, సంతానలేమితో, బంధుమిత్రులతో, బయటవారితో, ఊహించని ఘటనలతో ... ఇలా సమస్యలు అనేకం. ఒకోసారి ఈ సమస్యలు ఒకదాని వెంబడి ఒకటిగా , ఊకుమ్మడిగా ఎదురవ్వడంతో అనేక సతమతలు ...

ఆ పరిస్థితుల్లో - ఆ విపులుణ్ణి, ఈ విపత్తులనుండి విడిపించమని, విన్నవించుకుంటాం ... విముక్తిని కల్గించమని వివిధరీతుల్లో వేడుకుంటాం, విలపిస్తాం, చివరికి విసిగి కలడో లేడో నని సందేహిస్తాం.
                                               


సరిగ్గా నా స్నేహితురాలిది ఇదే అనుభవం. తనో మంచి సాధకురాలు. భక్తిపరురాలు. అయినా కష్టాల నడుమ కలతపడి కలడో, లేడో అని సందేహించింది. ఎప్పుడూ ఎవ్వరికీ ఎలాంటి అపకారం చేయని మాకు ఎందుకిన్ని కష్టాలు అని వాపోయింది.  భగవంతుణ్ణి నమ్మనివారు హాయిగానే ఉన్నారు, భక్తులకే కష్టాలన్నీ అంటూ ... వేదనలో వివేచన విడిచి విలపించింది. 
ఇది తన అనుభవమే కాదు, ఒకప్పుడు నాది, మరికొందరిది కూడా కావచ్చు. 
                                     

జీవితమంటేనే సుఖదుఃఖాల సంగమం. అనుబంధాలు, ఆత్మీయతలు, ఆనందకర అనుభూతులతో పాటు ... ఎన్నెన్నో అవరోధాలు, అవహేళనలు, ఆవేదనలతో కూడిన ప్రయాణమే జీవితం. అందరి జీవితగమనంలో ఎత్తుపల్లాలు సహజం. వాటినుంచి పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరుకోగలం. 
                                                     


మనకు కలిగిన అపకారాల మరుగున ఏదో ఉపకారం దాగివుంది. మన బ్రతుకు బండిని ముందుకు నడిపించడానికి ఎదురయ్యే కష్టాలు కొరడా దెబ్బల్లాంటివని ఓ చైనా తత్వవేత్త సద్బోధ.  

మనకన్నా కొన్ని లక్షలమంది బాగుండి ఉండవచ్చు. కానీ, కొన్ని కోట్లమందికన్నా మనం బాగున్నామన్న నిజాన్ని గుర్తించాలి. అటుపై 

సానుకూలమైన మార్పును స్వాగతించాలి

నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, కొంచెం మన ప్రతికూల భావాలను మార్చుకుంటే చాలు.
ప్రతికూలతల నడుమ వున్నప్పుడు, మన ఈ స్థితికి కారణం ... మన బంధువులు, చుట్టూ వున్నవారు, తలరాతలు, గ్రహాలూ, దురదృష్టాలు, ఆర్ధిక స్థితిగతులు కారణమని భావిస్తూ అశాంతికి లోనౌతుంటాం.  బయట ప్రభావాలని మనం తప్పు పట్టినంతకాలం దుఃఖాన్ని మోయక తప్పదు.
ఒకోసారి మన అశాంతికి ఎదుటివారు కారణం అనుకుంటాం కానీ, అది తప్పు. మన ఆనందానికి మనమే కారణం. మన మనోభావనలే కారణం. బాహ్య ప్రపంచం, బయటి వ్యక్తుల మనస్తత్వాలు, ప్రవర్తన మన ఆధీనంలో ఉండవు.  ఎదుటివారు అర్ధం చేసుకోలేదనో, విమర్శించారనో, అనుగుణంగా లేరనో భావిస్తూ చిరువేదనకు లోనౌతాం. ఎదుటివారు మారితే బాగుండును, మనల్నీ అర్ధం చేసుకుంటే బాగుండునని తలపోస్తూ తల్లడిల్లినంతకాలం అశాంతే. మార్పును మన నుంచి కాకుండా ఎదుటివారినుంచి అభిలాషిస్తూ ఉండడం వల్లనే మానవసంబంధాలు బలహీనమౌతున్నాయి. దానికి బదులు మనమే కొంచెం మారే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇతరుల సాయం, సానుభూతి కన్నా ముందుగా మన ఆలోచనలో మార్పు రావాలి. మనం మారితే మనం బాగుంటాం. క్రమేణా  మనతో వున్నవారు మారుతారు. నూటికి నూరు శాతం ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదు, చిన్న చిన్న తప్పులు, బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. వాటిని పరిగణ లోనికి తీసుకోకుండా సామరస్యంగా ఉండగలగాలి. ఒకింత సర్దుబాటుతత్త్వం ఉండాలి.  సర్దుకుపోవడం అంటే అపరాధమూ కాదు, అవమానం కాదు, అసమర్ధత కాదు, మనస్సుని నొప్పించుకుంటూ, నిస్సహాయంగా, తప్పనిసరిగా నడుచుకోవడం కాదు. అప్పటి పరిస్థితిని, ఎదుటివారి స్థితిని అంచనా  వేస్తూ, దానికి తగ్గట్లు స్పందిస్తూ, నొప్పించక నొవ్వక, సమయస్ఫూర్తితో, ఆత్మీయంగా పెద్ద మనస్సుతో వ్యవహరించడమే సర్ధుకుపోవడమంటే.
ఒకోసారి తప్పుడు భావాలు ఏర్పరచుకుంటాం. కానీ, మన ఊహలు, భావాలు అన్నీ నిజం కావు. నిజం తెలియాలంటే అవగాహన, నిశిత పరిశీలన, నిగ్రహం, స్వీయశోధన అవసరం. 
తప్పులు చేయడం సహజం. ఆ తప్పుల్ని ఒప్పుకొని, వాటి నుంచి పాఠం నేర్చుకొని, తిరిగి ఆ తప్పుల్ని చేయకుండా సాగిపోవడం విజ్ఞత. గతంలో సంబంధ బాంధవ్యాల విషయంలో నేను చేసిన తప్పిదం నాకో గుణపాఠం నేర్పింది. కొన్ని బాధ్యతల నిర్వహణలో బిజీ బిజీగా పరుగులు తీస్తూ, ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. అర్ధం చేసుకున్న ఆత్మీయులు నేటికీ అక్కరనే ఉన్నా, వారి వారి అవసరాలలో ఆసరా కాలేకపోవడం ... బాధాకరం. ఎంతసేపు మనకోసమే కాకుండా సన్నిహితులకై ఆలోచించాలి.  కాస్త మనవార్ని పట్టించుకోవడం, వారి అవసరాలని గుర్తించడం, ఆపేక్ష చూపించడం, ప్రేమగా పలకరించడం చేసినప్పుడే ఆత్మీయతలు పెరిగి అందరిమధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. బంధమనేది ఒక ఆత్మీయ గ్రంధం. పొరపాట్లు , పొరపొచ్చాలు అనేవి అందులో కొన్ని పుటలు మాత్రమే. వీటిని సవరించాలే గానీ, కొన్ని పుటలకై మొత్తం గ్రంధాన్నే చింపేయకూడదు. 
గతంలోనికి భవిష్యత్తు లోకి కాకుండా వర్తమానంలో ఉంటూ, ప్రతికూలతలను వదిలి సానుకూలతలను  ఎంచుకొని, మనపై మనకు దృఢనమ్మకంతో, ధైర్యంగా ఓ నిబద్ధతతో సాగిపోవడం వివేకవంతమైన పని.
ఒకటి నిజం - జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, మనం వాటిని ఎలా ఎదుర్కొంటామనే దాన్నిబట్టి విషాదంగానో, వినోదంగానో ఉంటాయి.
సుఖమూ - దుఃఖమూ, మంచీ - చెడూ, చీకటీ - వెలుగూ ... అన్నీ సహజం. ఎన్నో సంఘటల సమాహారమే జీవితం. ఎదురయ్యే అన్ని సంఘటనల్నీ ముందుగా ఊహించలేం, నిర్ణయించలేం, కానీ; ఎలా ఎదుర్కోవాలో, ఎలా మలచుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. ఒక హరివిల్లు తయారవ్వాలంటే ఎండావాన రెండూ కావాలి. మన జీవితాలు శోభిల్లాలంటే కష్టసుఖాలు రెండూ అనుభవించాలి. 

శరీరానికి హాని కలిగించే ఆహరం, మనస్సుకి గ్లాని కలిగించే ఆలోచనలు విడిచిపెట్టినప్పుడే ఆరోగ్యవంతమైన ఆనందకరజీవనం సాధ్యం. మృదువైన మాట, దయగల చూపు. స్నేహపూర్వక సత్సంబంధాలు, మర్యాదకర ప్రవర్తన, నిరాశను నిలువరించగలిగే మనోబలం, అర్ధం చేసుకోవడం, ఆత్మీయతను  నిలుపుకోవడం... అలవర్చుకుంటే చాలు - ఆనందకర జీవనం మన సొంతం. మనకంటే ఎంతోమంది ఎక్కువ బాధలు పడేవారున్నారు ఈ లోకంలో. వారి వారి కష్టాలముందు మనదేం పెద్ద కష్టం కాదు. రామకృష్ణ పరంహంస. వివేకానందుడు,  ప్రహ్లాదుడు, సక్కుబాయి, మీరాబాయి ... ఇలా ఎందరో భక్తులు కష్టాలను ఎదుర్కొన్నారు. వీడని వాడని భక్తితో విశ్వాసం విడువక విమలచిత్తులై ఏం సాధించారో అందరికీ విదితమే. అలానే లింకన్, అబ్దుల్ కలాం తదితరులు బాల్యంలో అనుభవించిన కష్టాలెన్నో... అయినా అన్నీ భరించి ఎంత ఉన్నతస్థితికి చేరుకున్నారో అందరికీ విదితమే కదా. 

ఒకటి గుర్తించండి, చాలావరకు చాలామంది మహనీయులందరు దుఃఖాలనుండే జీవితపాఠాలు నేర్చుకున్నారు. దుఃఖాలే వారిలో నిద్రాణమైన/ నిద్రాణావస్థలో ఉన్న శక్తుల్నీ, ప్రతిభాల్నీ అభివ్యక్తం చేశాయి... అన్న వివేకానంద మాటలు సత్యం. 

                                 
ఎప్పుడూ ఎవ్వరికీ ఎలాంటి అపకారం చేయని మాకు ఎందుకిన్ని కష్టాలు??? 
మనకందరికీ పూర్వం చేసిన కర్మల ఫలితంగానే ఈ జన్మ ప్రాప్తించిందన్నది విస్పష్టం. ఈ జన్మలో తప్పులు అపకారాలు చేయకపోవచ్చు గానీ, జత జన్మలలో చేసినవానిబట్టి ప్రారబ్ధంగా సమకూరినవే ఈ బంధాలూ, బాధలు. 

భాగవతమందు కపిలమహర్షి తల్లి దేవహూతి తో,
ధన పశు పుత్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన యీ
తనువున నున్న జీవుడు పదంబడి యట్టి శరీర మెత్తి న
న్నునుగతమైన కర్మఫల మందక పోవగరాదు, మింట బో
యిన భువి దూరినన్ దిశల కేగిన నెచ్చటనైన దాగినన్
ధనధాన్యాలు పశువులు, పుత్రులు, మిత్రులు స్త్రీలు, గృహాలు మొదలైన వాటికి కారణభూతమైంది ఈ శరీరం. ఈ దేహంలో ఉన్న జీవుడు ఇవన్నీ అనుభవించి మళ్ళీ ఈ జన్మలోని కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇటువంటి తనువును తిరిగి ధరిస్తాడు. ఆకాశంలోకి ఎగిరిపోయినా, భూమిలో దూరినా, దిక్కులకు పారిపోయినా, ఎక్కడ దాగినా కర్మఫలాన్ని అనుభవించక తప్పదని తెలియజేస్తాడు.


బాగు చేసేందుకే బాధలు  

                                                    
కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు శ్రీ  సుందర చైతన్యానందులవారు. 

                                                     
భక్తిలో పుష్టి ఉండాలి. ఏ చిన్న అవాంతరం వఛ్చినా అర్చించడం మానేస్తాం. అపవాదు వేచేస్తాం. సానుకూల పరిస్థితుల్లో పొంగి భగవంతుడున్నాడని, ప్రతికూల పరిస్థితుల్లో కృంగి ఉన్నాడో లేడోనని  భావించడం సరికాదు. భగవంతుడు మంచివాళ్లకు కష్టాలనిచ్చేది వారిని ఉత్తములుగా మలచడానికే నన్నది ఆధ్యాత్మిక అనుభవజ్ఞుల మాట.  


భగవంతుడు బలీయమైన సంకల్పంతో ఈలోకాన్ని నడిపిస్తూ వున్నాడు. బండ్లను ఓడలు చేయడం, ఓడల్ని బండ్లు చేయడం ఆయనలీల. ఏదో ప్రాసాదించాడని పరవశించేలోపే. మరేదో పట్టిలాగేసుకుంటాడు . బ్రతుకు ఎడారిలో వైరాగ్య జ్వాలలు రగులుతున్న వేళ ఎక్కడో సుదూరంగా సుఖాల ఎండమావుల్ని చూపిస్తాడు. మనం ఆశించేది ఒకటైతే, ఆయన శాసించేది మరొకటి. అయితే, అంతిమంగా భగవంతుని ప్రతిచర్య వెనుకో పరమార్ధం దాగి వుందనీ, ఆయన శిక్షలు వేసేవాడు కాదని, శస్త్రచికిత్సకుడేనని అర్ధమౌతుంది. ఆయన చేసే గాయాలు తాత్కాలికంగా బాధించినా, శాశ్వతంగా మనల్ని స్వస్థత పరుస్తాయని విదితమవుతోంది - స్వామి జ్ఞానదానంద   
ఒక్కొక్కసారి భగవంతుడే మన స్థిరచిత్తాన్ని పరీక్షించడానికి, పవిత్రకరించడానికి బాధలు కల్గిస్తాడు. అందుకే, సాధకుడు బాధల మధ్య చెదిరిపోకూడదు. మనల్ని మలిచేందుకు వచ్చినవే ఇవన్నీ అని భావిస్తూ, బాధలను దూరం చేయమని పరమాత్మను ప్రార్ధించక, బాధలను తట్టుకునే శక్తినివ్వమని పరితపించాలి.  బంగారు నగ శోభాయమానంగా తయారయ్యేముందు నిప్పుల్లో ఎంతగా కాలిందో, సమ్మెటపోట్లను ఎంతగా భరించినదో కదా. రోకలిపోటులకు ముక్కలుగాని బియ్యమే భగవదారాధనకు ఉపయోగపడే అక్షింతలైనట్లు, జీవితంలో దెబ్బల్లాంటి బాధలు తట్టుకొని విరగని చెదరని చిత్తదారులే భగవత్ప్రాప్తికి పాత్రులౌదురు.  


మరి వీటినుండి విముక్తి లేదా? అంటే ఉందనే మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 
                                                     


కష్టాలు కలతలు కన్నీరు ల నడుమ కలవరముతో మనుగడ సాగించే బదులు తాము పూర్వము చేసిన దుష్కర్మల పట్ల ప్రాయశ్చిత్తం, భగవంతుని ను కృపకై ప్రయత్నమూ చేస్తే చాలామటుకు కర్మలనుండి విమోచనం లభిస్తుంది.
భగవద్ధ్యానం, జపం వలన మానసిక పాపాలు నశిస్తాయని, భజన సంకీర్తనల వలన వాచికపాపం. ఉపాసన అర్చన యజ్ఞయాగాదులు వలన శారీరకంకా చేసిన పాపాలు పరిహారమౌతాయని సూచిస్తున్నాయి.
అలానే ధనం కోసం చేసిన పాపాలు దానాల వలన, మనస్సుతో మాటతో క్రియతో చేసిన దుష్కర్మలనేవి తిరిగి మనస్సుతో మాటతో క్రియతో చేసే సుకర్మల ద్వారా సమసిపోతాయని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.                                    
                                                               
జీవితంలో ప్రాప్తించిన వాటితో తృప్తి పడటం నేర్చుకున్న వ్యక్తి ఎన్నడూ విచారానికి గురికాడు; అది చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురి అవుతూనే ఉంటాడు!