17, నవంబర్ 2020, మంగళవారం

కార్తీకశుద్ద చతుర్దశి - నాగుల చవితి

పరమాత్మ యొక్క వ్యక్తరూపమే ప్రకృతి అని, అన్నింటిలోనూ ఆయా ఉపాధుల ద్వారా, పరమాత్మతత్త్వం వ్యక్తమౌతుందన్న విశ్వాసం భారతీయులది. అందుకే మన దృష్టిలో, ప్రకృతిలోని సర్వజీవులు, సర్వ పదార్ధాలూ పూజనీయమే.  ప్రకృతిలో కనిపించే ప్రతీజీవికి, అవి మనకు చేసే మేలుకు కృతజ్ఞతగా -  సందర్భానుసారంగా పూజలు చేస్తుంటాం. ఇది మన ఔనత్యం. ఇంతటి మహత్త్వభావన విశాలవిశ్వంలో భారతీయులకే సాధ్యమైంది. పంచభూతాలను, సముద్రమును, పర్వతాలను, వృక్షాలను, గోవులను, సర్పాలను, విగ్రహాదులను ఆరాధించడం ప్రాచీనకాలం నుండి వస్తున్న సంప్రదాయం. సనాతనధర్మంలో - సమస్తాన్ని భగవన్మయంగా భావించడం, పూజించడం ఓ భాగం. పూజలు చేయడం వలన, సాత్త్వికమైన మనస్సుతో పరమార్ధ విచారణ చేయడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది


కార్తీకశుద్ద చతుర్దశి  - నాగుల చవితి

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!


                       

నాగుల చవితి రోజున నాగేంద్రునిని శివభావముతో అర్చిస్తే, శారీరకరోగాలు  తగ్గుతాయని, సౌభాగ్యవంతులవుతారని, సర్పపూజ చేసే వారి వంశం చక్కగా వర్ధిల్లుతుందని పెద్దలు చెప్తుంటారు. 

నాగారాధన - వేదకాలం నుండి ఉంది. నాగేంద్రుడు శివునికి ఆభరణముగా, శ్రీమహావిష్ణువుకు శయ్యగా ఉన్నాడు. నాగులు బ్రహ్మదేవునికి పౌత్రులు (మనవళ్ళు). కనుక నాగరాజున్ని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్లేనని పెద్దల వచనం. 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, సాధరణంగా సర్పాలను చాలామంది దేవతలు ఆభరణంగా ధరిస్తారు. వినాయకుడి వడ్డాణం, యజ్ఞోపవీతం సర్పమే. ఇక, సుబ్రహ్మణ్యుడునయితే... నాగస్వరూపునిగా పూజిస్తారు. జంటపాములును సుబ్రహ్మణ్యుడే అని ఆరాధిస్తుంటారు. 

ఇక, సర్పపూజ విషయానికి వస్తే - ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణిని అనవసరంగా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతుంటుందనే ఓ చక్కటి సందేశంకు దర్పణం సర్పపూజ. 
పుట్టను పూజించడం, పాలు తేనె పోయడం...రావి వేప చెట్ల దరి, నాగప్రతిష్ఠ చేసి ప్రదక్షిణాలు చేసి పూజించడం... వీటన్నిటిలో ఎన్నో ఆరోగ్యకర, వైద్య, విజ్ఞాన రహస్యాలున్నాయి.

తలస్నానం చేసి ఉపవాసంతో వుండి పెసలు/పెసరపప్పు, మొలకెత్తిన/నానబెట్టిన అపక్వాహారంతో పాటు నువ్వులు దంచి, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి ప్రసాదమును, బియ్యపుపిండి బెల్లం కలిపి చేసిన చలివిడి మొదలగునవి నాగులకు నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తారు. ఎందుకంటే - పుట్ట దరికి వెళ్లడం, తాకడం, పుట్టమన్ను వాసన పీల్చడం వలన మరియు ప్రసాదములుగా పెట్టిన పై పదార్ధములు తినటం వలన, స్త్రీలకు నాడీమండలం శుద్ధై, సంతానోత్పతికి అవసరమైన శక్తులు వృద్ధి అవుతాయని, గర్భధారణకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయని ఆయుర్వేదం తెలుపుతుంది. ఈ కారణం చేతనే, సంతానం లేనివాళ్ళు నాగపూజలు, నాగప్రతిష్టలు చేసే ఆచారాన్ని పూర్విజులు ప్రతిపాదించారు. అలాగే పుట్ట బంగారం (పుట్ట మన్ను) చెవులకు రాసుకుంటారు. పుట్టలోకి పాములు వెళ్లి వస్తున్నప్పుడు పుట్ట అంచులకు శరీర రాపిడితో పాములనుండి స్రవించే ద్రవం ఆ మట్టికి అంటి ఓ ఔషధంలా పనిచేస్తుందని చెప్తుంటారు. 
                           

ఆధ్యాత్మిక అంతరార్ధం -  మన శరీరాన్ని నవరంద్రాలున్న పుట్టగా పోల్చుతారు. పుట్ట క్రిందభాగం విశాలంగా వుండి పోను పోను సన్నగా ఎలా అయిపోతుందో, అలానే మనం కూర్చున్నప్పుడు మన దేహాకృతి వుంటుంది.
మన దేహంలో ఉండే మనస్సుకు కేంద్రం మెదడు. ఈ మెదడు పాముపడగ ఆకారంలో వుంటుంది. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని వ్యవహరిస్తారు. కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం చెబుతోంది. 'కుండల'మంటే పాముల చుట్ట. పుట్ట అడుగున చుట్ట చుట్టుకొని పాము  ఉన్నట్లే, మన శరీరంలోనూ మూలాధార చక్రమునందు కుండలినీ శక్తి చుట్ట చుట్టుకున్న పాములా ఉంటుంది. ఈ కుండలినీ శక్తిని సాత్త్విక విధానంలో ఉద్ధీపింపజేయడమే నాగపూజ పరమార్ధం. 
                           

తలనుంచీ తోకవరకు మెలికలు ఉన్న రెండుపాముల రాయి ఒకటి రావిచెట్టు క్రింద ఉండడం కొన్ని దేవాలయాల్లో చూస్తుంటాం. 
                         

                                     
ఆ విధంగానే కుడి ఎడమ ముక్కు రంద్రాలతో పీల్చేగాలి, పింగళ ఇడ నాడుల ద్వారా, పాములు మెలిక వేసుకొని ఉన్నట్లు శరీరంలోనికి పోయి, సంచరిస్తూ వుంటుంది.

తమో రజో గుణాలనే విషాన్ని పాము చిమ్మకూడదని, సత్త్వగుణంతో ఉండి మనల్ని రక్షించాలని ప్రార్ధిస్తూ, సత్త్వగుణ ప్రతీకయైన పాలును పుట్టలో ఎలా వేస్తున్నామో... అలానే, మనలో  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, రజో తమో గుణాలు క్షయమై సత్త్వగుణ సంపత్తి పెంపొందించుకోవడానికి, భగవత్ భక్తి అనే క్షీరాన్ని పోయాలని పెద్దలు పేర్కొంటారు. 

ఒకోసారి మన దేవతామూర్తులను పరిశీలిస్తే, చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. వారు చెంత కొలువై ఉన్నవి ... పరస్పర శతృవర్గం వారు.  విష్ణువుకు ఆదిశేషువు శయ్య కాగా, గరుత్మంతుడు వాహనం.  ఒకే ఇంట ఉన్న - శివునికి, వినాయకునికి పాములు ఆభరణములు కాగా, కుమారస్వామికి వాహనం నెమలి. ఆపై అమ్మవారో...నకులేశ్వరి (నకుల అంటే ముంగిస). ముంగిస స్వరూపంలో కూడా అమ్మ వారు ఉంటారట. అంతేనా...మానవదేహమునందలి వెన్నెముక యందు కుండలినీ శక్తిగా సర్పాకారంలో ఉన్నదీ...  ఆ శ్రీవిద్యా స్వరూపిణి జగన్మాతయే.

పాముకు ప్రధాన శతృవులు - గరుడపక్షి, నెమలి, ముంగిస. మరి ఇవన్నీ మనం ఆరాధించే దేవతల చెంతనే ఉండడం వెనుక మర్మమేమిటి? 
అధోగతి పట్టించే అంశాలను సంహరించే స్థితిని దేవతలు అనుగ్రహిస్తారు. అందుకే మనకు అనుకూల్యతగా శతృత్వం ఉన్న వాటిని తమకి ఆభరణాలుగా, వాహనములుగా మలుచుకుంటారు. వాటి  ద్వారా మన పంచేంద్రియాలతో అపసవ్యంగా చరించే మనస్సును సవ్యదిశలో నడిపిస్తారు. దీనిని కాస్త కూలంకుషంగా  పరిశీలిద్దాం -
సృష్టిలో ప్రతీ అంశంలో అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, మనలో ఉన్న కుండలినీ  సర్పములో కూడా అనుకూలత, ప్రతికూలతల అంశాలు ఉంటాయి.  అనుకూలతగా ఉన్న అంశం ఉద్ధరణలోనికి తీసుకొస్తే,  ప్రతికూలతగా ఉన్న అంశం  క్షీణింపచేస్తుందని పేర్కొంటారు. 

క్షీణింపచేసే అంశం - మనలో తేజస్సుని ఇంద్రియలౌల్యం కొరకు క్షయం చేసే సర్పం. ఇది శరీరంలో మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. బుద్ధిని మందగింపజేస్తుంది. బ్రహ్మమునందు నిలబడనీయదు. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. తేజస్సుని అదోముఖంగా క్రిందకు వెళ్ళేటట్లు చేస్తుంది. తత్ఫలితంగా పురోగతి చెందలేం. భగవంతున్ని చేరుకునే దిశగా వెళ్ళలేం.
                       

ఉద్ధరణలోనికి తీసుకొచ్చే అంశం - భగవంతుని యందు భక్తితో బ్రహ్మచర్యమందు పూనికతో ఉండేటట్లు చేస్తుంది. తేజస్సును ఓజస్సుగా మార్చుతుంది. ఉన్నతపధం వైపు నడిపిస్తుంది. 

జన్మ సార్ధకతకు కావల్సిన స్థితిని పొందాలంటే కేవలం మనశక్తే సరిపోదు. ఈశ్వరశక్తి కూడా తోడవ్వాలి. అందుకై భగవంతున్ని త్రికరణశుద్ధిగా ప్రార్ధించాలి. అలా ప్రార్ధించినప్పుడు ప్రతికూలత అంశాలను సంహరింపజేసి, అనుకూలత అంశాలను ప్రేరేపించడానికి దోహదపడేవి దేవతల చెంతనున్న ఆ శతృవర్గం వారే. ఎలాగంటే - 
శ్రీహరిని ఆశ్రయిస్తే, ఆయన వాహనమైన గరుత్మంతుడు సర్పంలో ప్రతికూలత అంశాలను సంహరించి, అనుకూలతను  ప్రేరేపిస్తాడు.
శివున్ని, అమ్మవార్ని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యుడుని ప్రార్ధిస్తే -
జగన్మాత, ముంగిస రూపంలో వచ్చి, కుండలిని రూపంలో ఉన్న సర్పంలో ప్రతికూలతాంశాలను సంహరించి అనుకూలతాంశలను ఉద్ధీపనజేస్తుంది.  లేదా సుబ్రహ్మణ్యుడు తన వాహనమైన నెమలి ద్వారా, ప్రతికూల అంశాలను సంహరించి అనుకూలతను  పురోగమింపచేస్తాడు. 
 
పుట్టకు వెళ్ళడం ఏమిటీ...పూజించడం ఏమిటీ...
పుట్టలో పాలు పోయడం  ఏమిటీ...మూఢ నమ్మకాలు...అని కొందరు విమర్శించడం విన్నాను. అయితే మన పెద్దలు దేనినీ ఊరకనే చెప్పరు. వారు చెప్పినదాంట్లో పరమార్ధం మనకు తెలియకున్న, మన శ్రేయస్సుకై చెప్పారన్నది సత్యం. 
                      

మన ఆచారాల వెనుకనున్న ఆంతర్యాన్ని గ్రహిస్తే ... భారతీయుల జ్ఞాన విజ్ఞాన దృష్టి ఎంత సమున్నతమైందో అర్ధమౌతుంది.

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారిని  నాఇంటివారిని ఆప్తమిత్రులనందరిని ఏలు. 
పడగ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకో.
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో... నూకలిచ్చెదను, మూకలిమ్ము...  పిల్లల మూకను నాకిమ్ము .