7, ఏప్రిల్ 2013, ఆదివారం

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత!

"అచంద్రార్కం యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్ఠతి మేదిని" అని వాల్మికి మహర్షి అన్నట్లు సూర్యచంద్రులు వున్నంతకాలం రామాయణం మానవాళిని తరింపజేస్తుంది.

రామాయణం అనే మహాకావ్యాన్ని ఎవరు ఎన్నివిధాల చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు రామకధను కొనియాడినా, ఎవరు ఎన్నిసార్లు రామనామ మహత్యమును కీర్తించిన, ఎవరు ఎన్నిసార్లు రామతత్వాన్ని ప్రవచించిన, ఎవరు ఎన్నివిధాల మధించి అమృతరసాన్ని గ్రోలిన, ఎవరు ఎంతగా రామామృతాన్ని ఆస్వాదించిన, ఎవరు దీని సారాన్ని గ్రహించి శ్లాఘించిన .....  తనివి తీరని తపన రామభక్తులది.

రామాయణంలో బయటకు కనిపించనటువంటి ఆధ్యాత్మికమైన నిగూఢసత్యాలు అనేకం వున్నాయి. అందులో ఒకటి - జనకుడు సీతారాములకళ్యాణఘట్టమందు కన్యాదానం చేస్తూ చెప్పిన ధర్మాచరణ ఉపదేశం.
ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||

ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది.
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీతా' ఇదిగో సీత. నా పుత్రిక. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీ ధర్మపత్ని. ఈమె పతివ్రతయై, ఎల్లవేళలా సహధర్మచారిణిలా నిన్ను అనుసరిస్తుంది.

అయితే; ఈ శ్లోకం గురించి కొందరు చలోక్తులతో వివరిస్తూ చెప్పినవి ... అక్కడక్కడ, అప్పుడప్పుడూ విన్నవీ, చదివినవీ ... నాకు అర్ధమయినంతవరకు ఈ టపాలో పెడుతున్నాను.

రామా! ఈమె ఎవరో కాదు, 'ఇయం సీతా' ఈమె సీత, నీ భార్యయే, నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో, ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించినది. ఈమెను నీవిప్పుడు స్వీకరిస్తేనే తప్ప, లోకానికి మంచి జరగదు.  కావున నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు, నీ ధర్మాచరణలో నీ నీడవలె అనువర్తిస్తుంది.

ఎటు చూసిన దివ్యప్రకాశంతో శోబిల్లుచున్న సీతే కనబడడంతో విభ్రాంతికి లోనయి అటుఇటు చూస్తున్న రాముని అవస్థను గమనించిన జనకుడు, రామా!  నీవే 'పుంసాం మోహనరూపాయ' అని, నీవే సుందరుడివి అని అనుకుంటున్నావేమో... 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. నా కుమార్తె. ఈమె పాణిని గ్రహించి, ధర్మపత్నిని చేసుకో. ధర్మాచరణలో నిను అనువర్తిస్తుంది.

రామచంద్రా! 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. మీరు లక్ష్మీనారాయణులు. లోక కళ్యాణార్ధమై ఈ మానవజన్మ మీరు ఎత్తడానికి ఇలా విడివడినారు. ఈమె చేతిని అందుకొని, ఈమెని నీ ధర్మపత్నిని చేసుకొని, ఇక ధర్మస్థాపన చేయు రామా. నీవు ఏ కారణంచే ఈ రూపంలో అవతరించావో ఆ పని పూర్తిచేయు. నీవు చేసే ఆ ధర్మస్థాపనలో నీ నీడవలె నిను అనుకరించి, సహకరిస్తుంది.

సీత సిగ్గుతో తనచేతిని పట్టుకోమని తనకు తానుగా చెయ్యి చాపలేక సిగ్గుపడడం, అలానే రామచంద్రమూర్తి కూడా, తనకు తానుగా చెయ్యి చాచి సీత చేతిని పట్టుకోవడానికి, పెండ్లికాకముందే ఇంత తొందరా? ఎంత రసికుడయ్యా రామచంద్రుడు అని ఎదురుగా కూర్చొని కల్యాణం తిలకిస్తున్నవారు భావింతురని బిడియపడడం గమనించిన జనకుడు, తానే సీత చేతిని రాముని వైపుకు త్రోస్తూ, 'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె, ఈమె చేతిని గ్రహించి నీ ధర్మపత్నిని చేసుకో, నిను నీడలా అనుకరిస్తుంది.

రామయ్యా! ఎదురుగా ఉన్న సీత నీకు కానరాలేదని కాదయ్యా... 'ఇయం సీతా' ఈమె సీత అని చెప్తున్నది; నీవు శివధనస్సును ఎక్కిపెట్టినప్పుడే అర్ధమైంది - నీవు విష్ణువే అని! నీ ధర్మపత్నియైన లక్ష్మీదేవియే ఈ సీత అని నీవు గ్రహించాలనే 'ఇయం సీతా' అని చెప్తున్నానయ్యా. ఈమె చేతిని అందుకొని నీ ధర్మపత్నిని చేసుకో, నిన్ను నీడలా అనుగమిస్తుంది.

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. సీతా ... ఇదేం పేరు అని యెంచకు. ఈమె నాగటిచాలుకి తగిలి, తనకు తానుగా పైకి లేచిన బాలిక. ఈమె అయోనిజ. ఈమె సీత అని, నాకు కూతురు అవుతుందని అశరీరవాణి చెప్పింది.  ఏ ఫలాపేక్ష లేక, కర్షకునికి భూమాత ఎట్లు ఫలములను కలిగించునో, అట్లే; నా సీత కూడా ఏ ఫలాపేక్ష ఆశించక, నీ ధర్మస్థాపనలో నీకు సహకరిస్తుంది. తల్లి భూదేవి వలెనె సహనంతో నీకు సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవీమెను నీ ధర్మపత్నిగా గ్రహించు.

'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె. నీకు సహధర్మచారిణి. నీతో కలసి ధర్మమూ ఆచరిస్తుంది. నీవు చేసే ధర్మస్థాపనలో నీకు తోడై యుండి, నీ ధర్మకార్యం సఫలమగునట్లు చూస్తుంది. నీవు ఎట్లు నీ తండ్రి వాక్యం శిరసావహించి పాలించుచున్నావో, ఈమెయూ నీ వాక్యం పాలించి, నీవు నిర్వహించు ధర్మకార్యములన్నింటిలో నీకు తోడై యుండును.

'ఇయం సీతా' ఈమె సీత. పరమాత్మవైన నీకు సహధర్మచారిణి. నీ సహధర్మచారిత్వమీమెకు సహజసిద్ధం. ధర్మఉద్ధరణకై నీవు చేయు కార్యములయందు సహధర్మచారిణియై నీకు సహకరించడానికి 'సీత'లా అవతరించిన ఈమె పరమాత్మానుగ్రహంతో నా కుమార్తె. నీ ధర్మచారణలో తోడై వుండే ఈమెను నీవు స్వీకరించి, ధర్మస్థాపన చేయు.

మన హిందూ వివాహపద్ధతిలో వధూవరులిద్దరూ గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన ధర్మములలో ధర్మానికే ప్రముఖత్వం ఉంది. వివాహమనేది ప్రధానంగా ధర్మాచరణకొరకై నియమింపబడినది. అర్ధకామాలకంటే ధర్మమే ప్రధానమైనది కావున భార్యను ధర్మపత్ని అంటారు.
వివాహఘట్టమందు -
'నాయనా! ఈమె నా కుమార్తె. ఈమెను నీ భార్యగా స్వీకరించు. నీవు చేసే సకల ధర్మాచరణలయందు సహధర్మచారిణిలా నిన్ను అనువర్తిస్తుంది. ఇక నా కుమార్తె చేతిని అందుకుని, ప్రేమగా చూసుకో' అని వరునికీ,
అలానే వధువునకు - 'తల్లీ! నీవు నీ భర్తని ఛాయలా వెంబడించు. నీ భర్తకు నీడలా వెన్నంటే ఉండు, అతని పనుల యందు సహకరించు' .....
అన్న సందేశం జనకునిది. జనకుడు అంటే తండ్రి అని అర్ధం. జనకుడు సీతకు మాత్రమే తండ్రిగా కాదు, సర్వులకు తండ్రే, ముఖ్యంగా వధువులందరకు ఆయన తండ్రే. ఆయన కన్యాదానం చేస్తూ చెప్పిన పై శ్లోకంలో సందేశం అందరు వధూవరులకు ఆచరణీయం.

21 కామెంట్‌లు:

 1. చాలా బాగా చెప్పేరు

  రిప్లయితొలగించండి
 2. త౦డ్రి స౦దేశానికి బద్దురాలై, ఆ సీతామాత ధర్మాచరణలో భాగ౦గా"పతి సాహచర్య౦ లేని అయోధ్య అరణ్య౦తో సమానమనీ, పతి సన్నిధిలో ఉ౦టూ క౦దమూలాలను స్వీకరి౦చినా, అవి అమృతతుల్యమేననీ, క౦టకాలతో కూడిన అరణ్యమార్గమైనా పూలబాటే" అని శ్రీరాముణ్ణి ఒప్పి౦చి అరణ్యాలకు పయనమైన ఆదర్శ అర్ధా౦గి సీతామాత.దుస్సహనమైన కష్టాలను సైత౦ భరి౦చిన సహనశీలి.సీతమ్మవారిగురి౦చి ఎ౦తచెప్పినా చాలా తక్కువే!కద౦డీ.

  రిప్లయితొలగించండి
 3. ఆహా...
  ఇయం సీతా మమసుతా....
  రామా... మగపెళ్ళివారివనీ, ఇక్ష్వాకు వంశస్థులమనీ, రఘుమహారాజు భగీరథాదులు పుట్టిన వంశమనీ కాస్త బెట్టుగా ఉన్నావేమో.. మా వంశమేమో తక్కువ కాదు ఈమె ఏవరో తెలుసా సీత, నాగటి చాలుకు తనంత తాను ఉద్భవించిన ’నా’ కూతూరు.. అయోనిజ ఎంత రాముడవైనా తల్లి గర్భవాసం చేసినవాడివే... నేను ఈ సీతకి తండ్రిని ఆమె నా కూతురు.. నిన్ను నీ వంశాన్నీ ధర్మపాలనంలో నిష్ఠగా ఉంచడానికి ఈమెను నీకిస్తున్నాను.. అని ఒకింత ఆనందాతిశయంతో తల్లి చేతిని అయ్యచేతిలో పెడుతున్నట్లు అనిపుస్తుంది నాకు.. .ఆడపిల్లలు కలవాళ్ళు మరీ మరీ ఒంగిపోయి లొంగిపోయి ఉండనక్కరలేదు.. రాముడెంతగొప్పవాడో సీతమ్మంతకన్నా గొప్పదని పొంగిపోయే మావగారు జనకుడు... కూతురుని కన్నవాళ్ళకి తాము కని పెంచిన కూతుర్ల పట్ల అంత మమకారం అంత అతిశయం ఉండాల్సిందే... ఒకరికి అనవసరంగా ఒంగి ఒంగి ఉండక్కర్లేదేమో ... ఆ సందేశం జనకుడు ఈ శ్లోకం ద్వారా అప్పుడే చెప్పారేమో అని పిస్తుంది. అదే సమయంలో నువ్వెంత వశిష్ఠ విశ్వామిత్రాదుల వద్ద సుక్షితుడవో తెలుసు, మా అమ్మాయీ నీతో పాటు కలిసి ధర్మాచరణం చేసేంత సమర్థురాలు ’నా’ కూతురు అంతే... ఏదో సీతట అని అలవోకగా చేయిపట్టుకుంటావేమో జాగ్రత్త సుమా... ఆమె నా కూతురు... ఆమె తనంత తాను ఉద్భవించింది (సీత).. ఈమె నిన్ను నీడలాగా పతివ్రతా ధర్మంతో అనుగమిస్తుంది...

  ఇయం సీతా మమ సుతా.... భద్రంతే.....

  ధన్యవాదాలండీ
  శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ

  రిప్లయితొలగించండి
 4. సీతమ్మ వారి గురించి ఎంత బాగా చెప్పారండి.సీతమ్మ కథ ఎందరు ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరని కథేనండి.

  రిప్లయితొలగించండి
 5. సర్! (శర్మగారు)
  మీ స్పందనకు మనసార ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి
 6. వేద గారు!
  నిజమే, మీరన్నట్లు సీతమ్మవారి గురించి ఎంతచెప్పినా అది చాలా తక్కువే.
  మీ స్పందనకు ధన్యవాదాలు వేదగారు.

  రిప్లయితొలగించండి
 7. వనజగారు!
  మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ గారు!
  ఆహా ..... ఎంత చక్కటి వివరణ ...
  చాలా బాగుందండి మీరిచ్చిన విశ్లేషణ.
  ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 9. జయగారు!
  ఎందరు ఎన్ని సార్లు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా ... తనివి తీరడం లేదండి.
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 10. మనోహర్ గారు!
  మీ స్పందనకు ధన్యవాదములండి.

  రిప్లయితొలగించండి
 11. సీతారాములను గురించి , ఇంకా మరెన్నో విషయములను గురించి చక్కగా తెలియజేసారు.

  రిప్లయితొలగించండి
 12. అనూరాధ గారు!
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించండి
 13. శ్లోకం అర్ధం వివరంగా తెలిపారు భారతి గారు.
  మరి రాముడికి సీతని అప్పగిస్తూ,జనకుడు చెప్పినట్టు...
  సీతను ఈ విధంగా చూసుకోవాలి అని రాముడికి చెప్పిన స్లోకం ఉంటే ,అది కూడా వివరించండి. తెలుసుకోవాలని ఉంది.
  మీకు విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

  రిప్లయితొలగించండి
 14. టపా బాగుంది. ఆలస్యంగా చదివాను! (మీరు పలుమార్లు 'ఇయం సీత' అని ప్రస్తావించారు. 'ఇయం సీతా' అనే ఉండాలండి. సీతా అని దీర్ఘాంతంగానే ఇక్కడ చెప్పాలి. శ్లోకంలో కూడా సీతా అనే ఉంది చూడండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సర్, నమస్తే!
   సరిగ్గా సవరించాను... గమనించగలరు.
   సరైన సూచన చేసినందులకు ధన్యవాదములు.

   తొలగించండి
  2. సవరించినందుకు సంతోషం. మీరు ఈ చిన్ని తెలుగుస్తోత్రం రామకృపాస్తోత్రం పద్యత్రయం చదువగోరుతారని భావిస్తూ లింక్ ఇస్తున్నాను.

   తొలగించండి
 15. ఇయం సీతా- ఈమె సీత, ఇయం సీతా- ఈమె నాగటి చాలలోంచి బయటకు వచ్చిన భూదేవి పుత్రిక, మమ సుతా- నా పుత్రిక, మమ సుతా - భూమిలో పుట్టిందని అనుకుంటున్నావేమో, ఈమో నా కూతురు, అంటే జనక చక్రవర్తి కూతురు సుమా-

  రిప్లయితొలగించండి