25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నీవు నా అమ్మవు...నేను నీ బిడ్డను...అందుకే నాకు ఈ ప్రశాంతత! 

సకల సిరిసంపదలున్నా శాంతిమయ జీవనానికి హామీ లేదు. సర్వాధికారాలున్నా భద్రమయ జీవనానికి భరోసా లేదు.సమస్త బంధుబలగం చుట్టూ ఉన్నా సుఖమయ జీవనానికి ఆసరా లేదు.  మనమెంత జాగ్రత్తగా ఉన్నా, ఒకోసారి ఎదుటివారి అజాగ్రత్త, మనల్ని బాధలకు గురి చేస్తుంటుంది. ఇప్పటికి సరిగ్గా నెల క్రితం మా ఇంట్లో అద్దెకున్నతని అజాగ్రత్త, గోప్యతల కారణంగా మా ఇంట్లో అందరం కోవిడ్ బారిన పడడం... కొంతమేర తేరుకోవడం అయింది. ఇంటిల్లుపాది ఒకేసారి బాధితులం కావడంతో నరకం చూసాం. ప్రారబ్ధం...అనుభవించకతప్పదు. ఇదే సమయంలో అంతర్గతంగా ఉన్న శారీరక బాధలు (కిడ్నీలో రాళ్ళు, యుటెరైన్ పైబ్రాయిడ్స్) బయటపడడంతో చాలా బాధ పడాల్సివచ్చింది. నావరకు నాకిది పునర్జన్మలా ఉంది. ఇటువంటి సమయంలో అమ్మవారు స్వప్న దర్శనం... "శ్రీ మాత్రే నమః" అనుకోవడం తప్ప, అమ్మని ఆరాధించే విధానం నాకు తెలియదు. అమ్మ గురించి ఆలోచిస్తుండగా - మనస్సులో శ్రీ శంకరులవారి 'దేవీ అపరాధ స్తొత్రం' కదిలాడింది. శ్రీ శంకర భగవత్పాదులవారు గురించి అందరికీ తెలుసు. మనల్ని తరింపజేయడానికీ ఎన్నో స్తోత్రాలను తెలిపారు. అందులో ఒకటి - 
 "శ్రీదేవి అపరాధ స్తోత్రరత్నమ్"
అమ్మా! నాకు నీ మంత్రము తెలియదు, నీ యంత్రమూ తెలియదు, నిన్ను స్తుతించడమూ తెలియదు, నిన్ను ఆవాహన చేయడమూ తెలియదు, నిన్ను ధ్యానించడమూ తెలియదు, నీ గాధలు చెప్పడమూ తెలియదు, నీ ముద్రలూ తెలియవు, అయ్యో...ఇవేవి తెలియవని నీకోసం విలపించడమూ చేత కాదు. కానీ, అమ్మా! నిన్ను విధేయతతో స్మరిస్తే, నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు. 
అమ్మా! విధివిధానాలు తెలియకపోవటంచేత, ధనం లేకపోవటంచేత, నా బద్ధకంచేత, ఆశక్తతచేత నీ పాదపద్మములు సేవించుటలో లోపం జరిగింది. అమ్మా! నన్ను క్షమించు, నన్ను క్షమించే క్షమత నీలో ఉంది. అందరినీ ఉద్ధరించే తల్లివి...నీకు తెలియనిది ఏముందీ? లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ చెడ్డతల్లి ఉండదు కదా.  
అమ్మా! ఈ భూమిపై సరళమార్గంలో, సత్యమార్గంలో నడయాడే సాధుజనులైన బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ; వారందరి నడుమ నిలకడలేని, మందమతినైనవాడను నేనొకడును ఉన్నాను. అయినను, అమ్మా! సర్వమంగళా! జగజ్జననీ! నేనూ నీ బిడ్డనే కాబట్టి, నన్ను నీవు వదిలివేయక ఆదరించి కాపాడు తల్లీ. ఎందుకంటే, లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ చెడ్డతల్లి ఉండదు కదా.  
అమ్మా! జగన్మాత! నేను నీ పాదపద్మములు ఎన్నడూ సేవించలేదు, ధనం లేక నీ సన్నిధిన సమర్పించిన నైవేద్యమూ ఏమీలేదు, కానీ; అమ్మా! నీవు మాత్రం నాపై నిరుపమానమైన మాతృవాత్సల్యం చూపించక తప్పదు. ఎందుకంటే, లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ, చెడ్డతల్లి ఉండదు కదా.   
ఏ దేవతా పూజావిధానాలు ఏమీ చేయని నాకు, 55సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నేను చేయగల్గినది నీ శరణు కోరడమే. ఓ లంబోదరజననీ! ఇప్పుడు నీ కృప కలగకపోతే నాకు దిక్కెవరు? నిరాశ్రయుడైన నాకు, నీవుకాక వేరెవ్వరు ఇవ్వగలరు ఆశ్రయం?  
  అమ్మా! నీకై చేసే ప్రార్ధన చెవిన పడినంత మాత్రమునే - ఛండాలుడు(కుక్కమాంస భక్షకుడు)తేనెలూరు తియ్యని మాటలతో మాటకారి అవుతాడు. దరిద్రుడు కోటి కనకరాశితో చిరకాలం అడ్డులేకుండా విహరిస్తాడు. అమ్మా! అపర్ణా! ఇక నీకై భక్తిగా ప్రార్ధన చేసిన వారికి ప్రాప్తించే ఫలితాన్ని కొనియాడడం సాధ్యమా? 
 అమ్మా! చితాభస్మధారి, విషభోక్త, దిగంబరుడు, జటాధారి, కంఠంలో పాములను ధరించేవాడు, పశుపతి, కపాలమును భిక్షపాత్రగా కలవాడు, భూతాలకి అధిపతి అయిన శంకరుడు, ఈ జగత్తంతటిచే ఈశ్వరుడుగా ప్రార్ధింపబడుతున్నాడంటే... భవానీ! అది నీ పాణిగ్రహణ ఫలమేనమ్మా.
అమ్మా! చంద్రవదనా! నాకు మోక్షం పొందాలనే కోరిక లేదు, అనంత ఐశ్వర్యం కావాలనీ లేదు, ప్రాపంచిక విజ్ఞానమూ వద్దు, సుఖాలు మళ్ళీ అనుభవించాలనీ లేదు, కాబట్టి అమ్మా! నా శేషజీవితం మృడానీ, రుద్రాణీ, శివశివ భవానీ అంటూ నీ నామస్మరణతో గడిపేసేలా అనుగ్రహించమని వేడుకుంటున్నాను తల్లీ.  
అమ్మా! శ్యామా! నిన్ను వేదోక్తంగా షాడోపచారాలతో పూజింపలేదు. సరికదా, పరుషమైన పదాలతో దూషించాను. చేయని చెడు తలపు, మాట్లాడని చెడు మాట లేదు. కానీ, ఓ శ్యామా! నీవు ఈ అనాధ యందు కృప చూపు. అమ్మా! నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ అభాగ్యునిపై నీవు దయ చూపుతున్నావంటే, అది కేవలం కరుణామయమైన నీ తత్త్వానికి ఉచితమైన నడవడి కావడంవల్లనే తల్లీ.   
అమ్మా! కరుణాసముద్రా! ఆపదల యందు నిన్ను స్మరిస్తున్నానని తప్పుగా భావించకమ్మా.  దయాసాగరీ! ఇది సహజమే కదమ్మా ... ఆకలిదప్పులున్నప్పుడే, బిడ్డలు తల్లిని స్మరిస్తారు.    
అమ్మా! జగన్మాత! నాపై నీవింత దయ కలిగి వుండండంలో ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. సహస్రాధికమైన తప్పులు చేసినా సరే, ఏ తల్లీ తన బిడ్డను ఉపేక్షించదు  కదమ్మా.   
అమ్మా! నాతో సమానమైన పతితుడు వేరొకరు లేరు. అలాగే మహాపాపాలను సైతం ధ్వంసం చేయటంలో నీకు సరిజోడు లేరు. ఓ మహాకాళీ! ఇది దృష్టిలో వుంచుకొని నన్ను బ్రోచుటకు ఏది యోగ్యమో అది చేయు. 

"ఆమె - అమ్మ" 
 న మాతుః పరదైవతమ్ ... కన్నతల్లిని మించిన దైవం లేదు... అంటుంది శాస్త్రం.  కన్నతల్లే దైవమంటే, అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ... ఆ జగన్మాత గురించి చెప్పేదేముంది? ఆమె విశ్వానికి "అమ్మ".  
"ఆమె - శ్రీమాత" 
లోకంలో జన్మనిచ్చిన మాత - జన్మనిచ్చి, లాలించి, పోషించి, పెంచి, పెద్దజేసి, వృద్ధాప్యంలో బిడ్డలపై ఆధారపడడం సహజం. కానీ, సృష్టి స్థితి లయకర్తయైన ఆ జగన్మాతది శ్రీమంతమైన మాతృత్వం. అందుకే ఆమె "శ్రీమాత".  

శ్రీ = "శ"కారం +"ర"కారం + "ఈ"కారం. 
"శ"కారం ➡ ఆనందవాచకం.  
"ర"కారం ➡ తేజోవాచకం. 
 "ఈ"కారం ➡ శక్తివాచకం. 
 తేజోమయానందశక్తి స్వరూపిణి "అమ్మ". అందుకే ఆమె "శ్రీమాత". 
 శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, బుద్ధి, ధర్మం, సంపత్తి, విభూతి, విద్య, శోభ... ఇవన్నీ అమ్మ అనుగ్రహం. వీటన్నిటికి అధిష్టాన దేవత అమ్మే. అందుకే ఆమె "శ్రీమాత". 
 
"ఆమె - లలితాపరాభట్టారిక" 
 సృష్టికి మూలం శక్తి. వైదిక శాస్త్రల వచన ప్రకారం విశ్వరచనకు మూలం 'ఈక్షణశక్తి'. కనుచూపులతోనే ఈ జగద్రచనను కొనసాగించినది పరమేశ్వర శక్తి. ఈ చరాచర జగత్తుని నడిపించేది ఆ శక్తే. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కంటికి కనబడకుండా సూక్ష్మరూపంలో అంతటా అందరిలో వున్న శక్తుల సముదాయానికే 'పరాశక్తి, మహాశక్తి' అని పేర్లు. ఆ కటాక్ష రూప చైతన్యాన్ని 'విశ్వపోషణ చేసే మాతృరూపం'గా ఆరాధించడం మన సంప్రదాయం (శాక్తేయం).  
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ... రెప్పలు మూయడంతో విలయాన్నీ, తెరవడంతో సృష్టినీ, చూపుల ప్రసరణతో స్థితినీ కొనసాగించే చైతన్యశక్తి శ్రీలలిత. శక్తికి అధిష్టాన దేవత పరాశక్తి. నరాయణం నుంచి నారాయణం వరకు సమస్త సృష్టిని నిలిపి కాపాడేది ఆ పరాశక్తే. అందుకే ఆమె "లలితాపరాభట్టారిక". 

 "ఆమె" 
 సృష్టి స్థితి లయకారిణి.  ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సుస్వరూపిణి. శ్రీవిద్యా స్వరూపిణి, ఆది పరాశక్తి, పరబ్రహ్మతత్త్వమయి, అఖిలాండకోటి బ్రహ్మండ భాండోదరి, సర్వవేద వేదాంతసారిణి, శాస్త్ర సాహిత్య సమభూషిత, విశ్వమాత, విజ్ఞానమును ఒసగే జ్ఞాన ప్రదాత్రి, ప్రకృతికి ప్రాణదాత్రి, ప్రేమను పంచే హృదయనేత్రి, అవ్యాజ కరుణామూర్తి, సౌభాగ్యాలను ప్రసాదించే శుభకరి, అనేక రూపాల్లో కరుణించే అనంతరూపిణి.   శక్తి ఏ రూపంలో ఉన్నా, అది ఆ ఆది పరాశక్తి స్వరూపమే. ప్రపంచమంతా ఆదిశక్తి సంభరితం. శక్తి కానిది, లేనిది ఈ సృష్టిలో లేదు. జగమంతా ఆ జగన్మాత విశేష విన్యాసమే. 'నిర్గుణము, సూక్ష్మము, శుద్ధచైతన్యం' శ్రీ జగన్మాత మూలతత్త్వం. 
'శక్తి యొక్క అంతర్ముఖం - ఆత్మ. 
శక్తి యొక్క బహిర్ముఖం - ప్రకృతి'.
సర్వదేవతల సమన్విత శక్తి రూపం అమ్మ.  వీక్షణ శక్తి గల పరమాత్మను ఉపాసన సంప్రదాయంలో అనేక నామాలతో ఆరాధిస్తుంటారు. అమ్మకు అసేతు హిమాచలంలో ఎన్ని నామాలో, ఎన్ని విభూతులో! అష్టాదశ శక్తిపీఠాలలోనే కాదు, గ్రామగ్రామమున, వాడవాడన ఎన్ని దేవతల రూపాలో.  గ్రామదేవతలు కూడా జగన్మాత అంశలే. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కలకత్తా కాళీ, ముత్యాలమ్మ, తలుపులమ్మ, పోలేరమ్మ, కుంచుమాంబ ..... ఒకటని ఏముంది? ఊరు ఏదైనా, పేరు ఏమైనా, అన్నీ... ఆ ఆదిశక్తి ప్రతిరూపాలే. అనేక నామాలతో అమ్మ ఆరాధించబడుతున్నా వాస్తవానికి నిరాకారబ్రహ్మ యొక్క శక్తియే వ్యక్తరూపంలో ఇలా  పిలవబడుతుంది. 
అమ్మా!నా బలహీనతలన్నీ నీకు తెలుసమ్మా. లోపల మనోశుద్ధత కావడడంలేదు. శాస్త్ర విధులను ఎరుగను. నిన్ను ఏ స్తోత్రాలతో స్తుతించలేను. తల్లీ! నా అనంత అపరాధాలను క్షమించి దయతో నన్ను ఉద్ధరించు. అమ్మలగన్నయమ్మవు, నా అవసరాలు నీకు తెలియనివా? అడగకపోయినా నాకు కావాల్సింది ఎలాగూ నీవు ఇస్తావు. ఎందుకంటే నీవు అమ్మవు కాబట్టి!   అయినను అల్పురాలిని... అడగకుండా ఉండలేను... గాఢభక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. ఈ అజ్ఞానురాల్ని అత్యంత  ఆర్ధతతో అక్కున చేర్చుకోమ్మా... నీవు నా అమ్మవు...నేను నీ బిడ్డను...కనుక నీవు నన్ను చూసుకుంటావ్... అదే నా విశ్వాసం... అందుకే నాకు ఈ ప్రశాంతత!

21 కామెంట్‌లు:

 1. ఎక్సలెంట్ భారతిగారు.. అమ్మ కడుపున పుట్టి, అమ్మ దగ్గరతనం తెలియక కేవలం అమ్మ నవ్వు మాత్రం మనసులో నుంచి, తను దూరం అయిన తర్వాత అనాధ అంటే అర్ధం తెలిసి, ఇప్పటికీ అమ్మ వెదుకులాటలో ఇంకా. తెలుసుకోలేను నాకు ఇంత అమోఘమైన రచన ద్వారా మళ్లీ నా వెదుకులాట గుర్తు చేసారు... చాలా చాలా బాగా వ్రాసారు.. ఆమె ఆశిస్సులు తో మీ అందరి ఆరోగ్యం త్వరలో కుదుట పడి, సుఖమయ జీవనం ప్రసాదించచమని ఆ అమ్మ ని కోరుకుంటున్నాను..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అమ్మ అమ్మే.
   భుక్తి ముక్తి ప్రదాయిని.
   బ్రహ్మండ జనని సూర్య చంద్రాత్మిక శక్తుల్ని, తన నేత్రాల నుంచే నిర్వహిస్తున్నది. అంటే మనం నిత్యం ఆ తల్లి చూపుల చలవతోనే జీవనం సాగిస్తున్నాం. ఈ సత్యాన్ని గ్రహిస్తే నిత్యమూ అమ్మ సన్నిధిలోనే ఉన్నామన్న ఆనందతో నిశ్చింతగా నిబ్బరంగా నిలకడగా జీవితాన్ని గడపగలం.
   శ్రీ మాత్రే నమః
   ధన్యవాదములు రుక్మిణిజీ

   తొలగించండి
 2. అయ్యో భారతిగారు ఇప్పుడెలా ఉన్నారు. పూర్తిగా ఆరోగ్యం కుదుటపడిందా?

  యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
  యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
  యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా
  నమస్థస్యై నమస్థస్యై నమస్థస్యై నమో నమః

  శ్రీ మాత్రే నమః
  ఎప్పటిలా మీ పోస్ట్ చాల చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్మగారు!
   కోవిడ్ నుండి బయటపడినట్లేనండి. మిగతా చిరు అనారోగ్యాలకు చికిత్స కొనసాగుతుంది.
   శ్రీ మాత్రే నమః
   మీకు మనసార ధన్యవాదములు.

   తొలగించండి
 3. వినయం చేత భక్తి శోభిల్లబడుతుంది. ఆర్ద్రతతో ప్రార్ధించడం వలన సముచితమైనవన్నీ లభిస్తాయని నాకనిపిస్తూ ఉంటుంది. అమ్మ ముందు మన బలహీనతలు అజ్ఞానం వెల్లడించుకోవడం కూడా శరణాగతి కొరడమే కదా ..భారతి గారూ .. నాకు మీ పోస్ట్ బాగా నచ్చింది. హృదయాంతరాలను బహిర్గతం చేసుకుంటూ ప్రార్దించే ఈ బిడ్డలను అమ్మ రక్షణకవచంలో దాచి ఉంచదా! ప్రార్ధించే హృదయాన్ని హృదయానికి హత్తుకుంటుంది అమ్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వనజగారు,
   > అమ్మ ముందు మన బలహీనతలు అజ్ఞానం వెల్లడించుకోవడం కూడా శరణాగతి కోరడమే కదా -
   > ప్రార్ధించే హృదయాన్ని హృదయానికి హత్తుకుంటుంది అమ్మ.

   నిజమేనండి...స్వభావమును మార్చుకోవడం కంటే మన బలహీనతలు, అజ్ఞానమును నివేదించడం అంత్యంత సులువైనది. అంతా అమ్మ ప్రసాదమే అన్న భావనతో, ఆమె చేతిలోనే సకలమూ ఉన్నదని స్థిమితపడితే, ఏ గోలా లేదు. ఇలా ప్రార్ధించి శరణుపొందినవారు, ఏ గోళములో ఉన్నా, ఏ లోకాల్లో ఉన్నా, అవ్యాజమైన ప్రేమతో తన హృదయానికి హత్తుకుంటుంది అమ్మ.
   మీ చక్కటి వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 4. భారతిగారు మీరు అతిశయోక్తి అనుకోకండి నాకు ఇది పునర్జన్మ ఇది పునర్జన్మ ఇది చదివేసరికి మనస్సు పిండేసినట్లైంది. ఎంత బాధ పడితే ఇంత మాట అంటారు. మీతో ప్రత్యేక పరిచయం లేకున్నా అక్క మీ గురించి చెప్పినప్పటి నుండి మీరంటే ఎంతో అభిమానం. అమ్మ దయవలన గండం గట్టెక్కారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొండి. మీ ఈ పోస్ట్లో మీ రాతలు చిత్రాలు మహా వైబోగంగా రాజిల్లుతున్నాయి. ఎంతైన ఆమె శ్రీ మహారాజ్ఞి.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ మాత్రే నమః

  రమణీగారు మీ అభిమానమునకు హృదయపూర్వక ధన్యవాదములు.
  అన్యధా భావించక మీ అక్కగారు ఎవరో చెప్పరా? గుర్తుపట్టలేకపోతున్నందుకు మన్నించాలి.

  రిప్లయితొలగించండి

 6. దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
  దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
  సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
  సకల జగతి నేలు సాంద్ర కరుణ .

  తరణిని తారాధి పతిని
  తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
  పరదేవతను మనంబున
  పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .

  అమ్మా యని ఆర్తి గదుర
  అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
  అమ్మతనపు వాత్సల్యము
  క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాస్టారుగారు 🙏
   ఎంతో నేర్పుగా, అలతి అలతి పదాలతో, మీ పద్యకూర్పు బహు బాగుందండి.
   మనసార ధన్యవాదములు సర్

   తొలగించండి
 7. భారతిగారు కరోన బారి నుండి మీ కుటుంబమంతా అమ్మదయతో బయటపడడం ఆనందదాయకం. అమ్మవారి గురించి చక్కగా రాసారు. ఈ టపా నాకెంతో నచ్చింది. మనస్సును తట్టింది.
  మీరు నాకు మీ గత టపాల్లో అక్కడక్కడ ప్రస్తావించినదానిబట్టి మీరు రాముని ఆంజనేయుని ఆరాధికులు. ఇప్పుడు అమ్మ ఆరాధికులుగా మారిపోయారా? ఒకరు రాముడు గొప్ప అంటే, మరొకరు కృష్ణుడు గొప్ప అని మరొకరు అమ్మవారు గొప్పయని అంటుంటారు. అసలు ఎవరు గొప్పండీ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసుంధర గారు,"పరబ్రహ్మం" - అవ్యక్తంగా, నామరూపాలు లేకుండా, అఖండంగా, అనంతంగా, మనోఇంద్రియాలకు అతీతంగా చెప్పబడినా, వ్యక్తరూపంలో - అత్యద్భుతంగా, నిర్మాణాత్మకమైన శక్తిగా, క్రియారూపం ధరించి, నామరూపాలు వహించి, ఈ దృశ్యప్రపంచాన్నంతా తన అఖండశక్తులతో నింపి అడుగడుగునా గోచరించడం...  విదితమే కదమ్మా. 
   ఏకమై, అవిభాజ్యమై ఉన్నటువంటి పరమాత్మ- సృష్టికర్తగా బ్రహ్మగా వ్యక్తమైతే, పోషణకర్తగా ఉన్నప్పుడు విష్ణువుగా, లయకర్తగా ఉన్నప్పుడు శివుడు గా వ్యక్తమౌతున్నాడు.  
   దైవం గురించి చింతన చేయడం తత్త్వచింతన. తత్ అంటే అది. దానిని లింగరూపంలో చూడకూడదు. ఆధ్యాత్మిక పురోగతి చెందుతున్నకొలది ఇది అవగతమౌతుంది. మనం ఆ స్థితికి చేరలేదు కాబట్టి, రూపం ద్వారా, రూపాతీతమైన సత్యమును సద్భక్తితో తెలుసుకోవాలి. ఏ రూప నామ జపాలైన మనం తరించడం కోసమే.  
   పుంరూపం వా స్మరేత్ దేవీం స్త్రీరూపం వా విచింతయేత్|అధవా నిష్కళాం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహమ్ || (దేవీ పురాణం)సత్యమై, జ్ఞానమై, ఆనందమయమై, ఉన్న ఆ పరతత్త్వాన్ని, పురుషరూపంలో ధ్యానించినా, స్త్రీరూపంలో ధ్యానించినా, నిర్గుణంగా ఉపాసించినా ఉన్నది మాత్రం ఒక్కటే.  
   నావరకు నేను ఆ శ్రీరామాంజనేయుల భక్తురాలనే. ఆ పరమాత్మను ఈ రూపనామాలతో ఆరాధిస్తుంటాను. ఒకో రూపనామానికి ఒకో విశిష్టత. దానిని అప్పుడప్పుడు స్మరణలో టపాల రూపేణా స్మరిస్తుంటాను.   అయితే, ఏ రూప నామాలతో ఉపాసించినా, ఒక్కటేనమ్మా. సర్వమూ తానై, సర్వాంతర్యామియై, సర్వమునకు ఆధారమై ఉన్నటువంటి 'పరమాత్మ', అనేకముగా వ్యక్తమై ఎవరి సంస్కారానుగుణ్యమైనటువంటి 'జీవనవిధానము లో-  వారికి ఆ 'రూపంలో ఆ నామంలో సహకరించడానికి, ఉద్ధరించడానికి, ఉద్దేశింపబడినటువంటి ఆ చైతన్యం ను మన అజ్ఞానం చేత విడదీసి చీలికలు చేసి చూడడం సరికాదమ్మా.  

   తొలగించండి
  2. మీ వివరణతో మీరంటే మరింత గౌరవభావం పెరిగింది. నా సందేహాలు తీరాయి. కనువిప్పు అయింది. అద్భుతమైన వివరణ ఇచ్చారు. ధన్యోస్మి.🙏

   తొలగించండి
 8. Awunawunu.naaku ee sandeham eppudu vastundi. okokka puraanaallo oko devudu gurinchi cheptunTaaru. Answer naaku telusukovaalani undi

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అజ్ఞాత గారు,
   ఏ దేవతను/దేవుడను ఉపాసించిన ఆ దేవత/ దేవుడు యెడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వేరు భావాలను విడిచి 'ఏకత్వభావనతో ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలి. ఎవరి మనస్సుకు(భావనకు) ఇష్టమైనటువంటి రూపం ను దాని సంబంధమైనటువంటి 'నామం ను స్వీకరించి వారు పురోగమించడానికే పురాణాల్లో వివిధ దేవదేవతల గురించి ప్రస్తావించారే తప్ప, భిన్నత్వం చూపడంకై కాదు. దేవదేవతలు అనేకమంది ఉన్నా, అసలు చైతన్యం ఒక్కటే. ఎవరు గొప్ప అన్న భావం సరికాదు.  

   యద్భావం తద్భవతి ఏది భావిస్తే అదే అవుతాం. అందుచేత మన భావనలో దోషం ఉండకూడదు.

   తొలగించండి
 9. వసుంధరగారు, అజ్ఞాతగారు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసినంతలో నేను సమాధానం ఇవ్వడం జరిగింది. నా సమాధానంలో తప్పుంటే పెద్దలు సరిచేస్తారని ఆశిస్తున్నాను. 

  రిప్లయితొలగించండి
 10. అమ్మా భారతి గారు. మీ టపాను చాలా ఆలస్యంగా చూచాను. దైవకృప మీయందు నిలచియుంది. పునర్జన్మ అన్నారంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటకు వచ్చారన్న మాట. అంతా దైవానుగ్రహమే.

  మీ వ్రాతలు ఎప్పుడూ చక్కగా ఉంటాయి.

  మీరన్నది నిజం. దైవానికి స్థలకాలగుణనామరూపాదులు ఏమీ ఉండవు. అవన్నీ ప్రకృతి లక్షణాలు కదా. దైవం ప్రకృతికి ఆవలి శుధ్ధతత్త్వం. ఐతే పకృతిలో ఉన్న మనం ఎంతోకొంత ఏతల్లక్షణాలతో సాకారం ఐతేకాని ఆ విశుధ్ధమైన పరబ్రహ్మాన్ని ఉపాసించి లేము కాబట్టి అదైవం మనకు వివిధంగా తోచి అనుగ్రహించటం. ఈవిషయంపై మీరిచ్చిన వివరణ బాగుంది.

  రిప్లయితొలగించండి
 11. శ్యామలీయం గారు!
  నిజంగా...ఓ ఇబ్బందికర, బాధకర పరిస్థితి నుండి భగవంతుని అనుగ్రహంతో క్షేమంగా బయటపడ్డాం.
  మీ ఆత్మీయ పలకరింపు, మీ సూక్ష్మ విశ్లేషణ, నా వివరణపై మీ స్పందన...మానసిక స్థైర్యాన్ని స్వాంతనను ఇచ్చాయి. మీకు నా హృదయపూర్వక నమస్సులు.

  రిప్లయితొలగించండి

 12. Great ideas all put in one blog post. Need to bookmark this page for future reference.best regards....best regards.
  telugu quotes vivekananda

  రిప్లయితొలగించండి