13, సెప్టెంబర్ 2012, గురువారం

*శుద్ధ ఆహారము*


భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం. 
అందుకే అలా కాకుండా 
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.

మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. 
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: / 
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ //
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.

మరి ఈ శుద్ధఆహారం అంటే ఏమిటీ?
ఆహరవిషయములో వస్తుశుద్ధి (తీసుకునే పదార్ధము శుభ్రతగా ఉన్న మాత్రమే చాలదు, అది ఎటువంటి ధనముచేత, లేక యే విధంగా వచ్చిందో ఆ మార్గము శుద్ధముగా ఉండవలెను), పాత్రశుద్ధి ( వండే, తినే పాత్రలశుద్ధి), వాహక శుద్ధి (వండేవారు, వడ్డించేవారు శుద్ధత కలవారై) ఉండాలి. పాపపు సొమ్ముచే గానీ, పాపపు పనులచే గానీ వచ్చిన వస్తువు మంచిదైనను అది పాపాహారమే యగును. అలాగునే ఇతరులు కష్టపడి మనకై చేసినపనికి తగిన ప్రతిఫలం ఇవ్వక సంపాదించిన సొమ్ముచే భుజించెడు అన్నం పాపాన్నమే యగును. ఇట్టి ఆహారమును తీసుకున్నవారి మనస్సు నిర్మలముగా ఉండదు. శాంతి, దయ, వైరాగ్యాదులు వీరికి కలగవు. 
అటులనే ప్రతిఒక్కరూ వారు స్వభావములు అనుసరించి తీసుకునే ఆహారములో సాత్త్వికం, రాజసము, తామసము అను భేదములు కలవు.
సాత్త్వికాహారము సత్త్వగుణమును వృద్ధి చేయును. సత్త్వశుద్ధిచే చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధిచే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగును. 
శ్రీ మద్భగవద్గీత యందు పదిహేడవ అధ్యాయంలో తెలిపింది ఇదే -
ఆయుస్సత్వ్త్వ బలారోగ్యసుఖప్రీతివివర్ధనాః /
రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః 
ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిగా బాగుగా అభివృద్ధి నొందించునదియు, రసము గలదియు, చమురుతో కూడినదియు, దేహమందు చాలాకాలమునుండి సత్తువ నిచ్చునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. ఈ ఆహారమును సాత్త్వికులు ఇష్టపడుదురు. 
కావున విజ్ఞులు ఇట్టి ఆహారమును స్వీకరించవలెను.
కట్వామ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః /
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకా మయప్రదాః //
అమితముగా చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురులేనివిగాను, దాహము కలుగజేయునవిగాను, మనఃక్లేశం కలుగజేయునట్టి ఆహరం రాజసాహారం అనబడును. ఈ ఆహారమును రాజసులు ఇష్టపడుదురు. ఈ విధమైన ఆహారం దుఃఖశోకరోగములను కలిగించును. 
ఇటువంటి ఆహారమును త్యజించవలెను.
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ /
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ //
సారం నశించి పాచిపోయినట్టి పదార్ధమును, ఒకరు తినగా మిగిలిపోయినదియును, అశుద్ధముగా ఉన్నటియు (భగవంతునికి నివేదనచేయనటువంటివి) ఆహారము తమోగుణమును పెంచును. ఈ విధమైన ఆహారమును తామసులు ఇష్టపడుదురు. 
ఇటువంటి ఆహారమును స్వీకరించరాదు. 
అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృత చిత్తానాం ధర్మస్సమ్యక్ న భాసతే //
అన్నదోషముచేత మనస్సు కలుషితం అయి చిత్తమునందు ధర్మరహస్యం ప్రకాశింపదు.  కావున ఆహరవిషయమును సామాన్యమని తలంచరాదు. ఆహారశుద్ధి తప్పనిసరి.
ఇక భగవంతునికి నివేదన చేసి భగవంతున్ని స్తుతిస్తూ ఎందుకు భోజనం చేయాలంటే - మనం తీసుకున్న మిశ్రమాహారమందలి నిరుపయోగమైనదానిని మలమూత్రస్వేదములుగా బహిర్గతమొనర్చి, సారమును మాత్రమే గ్రహించి, అందలి పిండిపదార్ధములను విడగొట్టి గ్లూకోజ్ గా  మార్చి దేహములోని సూక్ష్మాణువులకు అందించి, కొవ్వుపదార్ధములను వేరుచేసి చర్మమునకు, కీళ్ళ సందువులకు అందించి, అందలి కాల్షియమును ఎముకలకు అందిస్తూ...... ఇలా సప్తధాతువులకు ఆహారం అందడానికి కారణం -
 
మనం భుజించే ఆహారంను జీర్ణమయ్యేటట్లు చేస్తున్న "జఠరాగ్ని". ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి, ఆహరపదార్ధములను జీర్ణమయ్యేటట్లు చేస్తుంది ఈ జఠరాగ్నే!
ఈ విధంగా మనం తీసుకున్న ఆహరం,
 జఠరాగ్ని
 
చే పక్వంకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపింపలేదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానం ఆక్రమించుకొని యున్నది. అంతటి కీలకమైన జఠరాగ్నిరూపమున భగవానుడే ఉండి, శరీరమునకు పుష్టిని చేకూర్చుతున్నట్లు గీత యందు పదిహేనేవ అధ్యాయమున పద్నాలుగవ శ్లోకం ద్వారా తెలుస్తుంది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః /
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ //
(నేను వైశ్వనరుడను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో కూడుకొని నాలుగువిధములగు అన్నమును వచనము చేయుచున్నాను.
నాలుగు విధములగు అన్నము :- 1) భక్ష్యమనగా దంతములచే కొరికి తినెడు గారెలు మొదలగు ఘనపదార్ధములు. 2) భోజ్యమనగా దంతములతో కాస్తా నమిలి  భుజించెడు క్షీరాన్నాదులు లాంటివి. 3) లేహ్యమనగా నాలుకచే చప్పరించి తినెడు పచ్చడి లాంటి పదార్ధములు 4) చోష్యమనగా నాలుకచే చప్పరించకనే ఆహారముగా తీసుకొనెడు క్షీరం లాంటి పానాదులు).
అందుకే భోజనంకు ముందు ఈ శ్లోకమును మరియు  బ్రహ్మార్పణం బ్రహ్మ....... క్రింద వివరించిన ఈ శ్లోకమును కూడా పఠించి, 
జీవులకు ఇంతటి మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్ముణ్ణి స్తుతిస్తూ, భగవంతునికి నివేదన చేసిన ఆహరమునే దైవభావముతో భుజించడం పరమోత్తమం. 
{ఇందుకే పూర్వం ఆహారమును భుజించుటకు ముందు  భగవంతునికి నివేదన చేసిన పిమ్మట దేహమును క్షేత్రముగాను, ఆత్మను క్షేత్రమందు గల సర్వేశ్వరునిగాను భావన చేయుచు, ఆ ఆహారమును స్వీకరించే ఆచారముండేది. ఇటువంటి ఆచారములవలన క్రమేపి శివ జీవైక్య జ్ఞానం కలుగుతుంది. 
ఇక్కడ నా చిన్నప్పటి విషయం ఒక్కటి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నతనంలో మా అమ్మమ్మ మాకు అన్నం తినిపిస్తూ ఇది మనూరి బంగారమ్మతల్లి ముద్ద అనీ, ఇది బెజవాడ కనకదుర్గ ముద్ద అనీ, ఇది రాయగడ మజ్జిగౌరమ్మ ముద్ద అనీ, ఇది కంచి కామాక్షిది, ఇది కాశీ విశాలాక్షిది, ఇది తిరుపతి వెంకన్నది, ఇది భద్రాది రామన్నది, ఇది శ్రీశైలం మల్లన్నది, ఇది సింహాద్రి అప్పన్నది........అంటూ ఒకొక భగవన్నామముతో అన్నం ముద్దలను పెట్టడం బాగా జ్ఞాపకం. కానీ అలా తినిపించడంలో పరమార్ధం కొంతకాలం క్రితం వరకు నాకు తెలియలేదు. చిన్నప్పటినుండి దైవ స్మరణ చేయిస్తూ పెద్దలు ఈ రీతిలో మనకు అన్నం తినిపించడంలో ఓ మంచి ఆధ్యాత్మిక బోధ ఉన్నదని తెలియక నా పిల్లలకు నేనలా చేయలేకపోయాను. నా పిల్లలు అన్నం తినమని మారాం చేసినప్పుడు, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్నది, ఇది అక్కది, ఇది అమ్మమ్మది, ఇది నానమ్మది, ఇది తాతయ్యది,  ఇది పిన్నది, ఇది అత్తది.......... అనీ సన్నిహిత బంధువుల పేర్లు చెప్తూ తినిపించేదానిని. నాలా తెలియని తల్లులు ఎందఱో ఉండవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను - అప్పటి ఆచారవ్యవహారాల్లో ఉన్న గొప్పతనమునూ మరియు మన పూర్వీకులు, పెద్దవారు వారి వారి పనులద్వారా ఉగ్గుపాలనుండియే తత్త్వబోధ చేసేవారని. అది గ్రహించక అజ్ఞానంలో నేనున్నానని. ఇక్కడ మరొక అనుభవపూర్వక విషయమును కూడా నేను చెప్పాలనుకుంటున్నాను - ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా ఏర్పడిన అవగాహన వలన మన ఆచారవ్యవహారాల్లో ఉన్న అంతరార్ధం అర్ధమై, వాటిని ఆచరణలో పెట్టడంతో గతంలో కంటే  నాదిప్పుడు ఎంతో సరళమైన ప్రశాంతకర జీవనమైంది}
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ /
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా //
హోమసాధనములు {సృక్ (సృక్ అనగా హోమములో, కొయ్యతో చేయబడిన గరిటివంటి యే పాత్రచే హవిస్సు అన్నాదులు హోమింపబడునో దాని పేరు), స్రువం (స్రువమనగా హోమములో, కొయ్యతో చేయబడిన యే పాత్రచే ఘ్రుతమును ఎత్తి హోమింతురో దానియొక్క పేరు) మున్నగునవి}, హోమద్రవ్యములు (అన్నం, నెయ్యి మొదలగునవి), హోమాగ్ని, హోమం చేయువారు, హోమం చేయబడింది....అన్నియును బ్రహ్మస్వరూపములే అన్న బ్రహ్మభావమును కలిగి బ్రహ్మార్పణ భావంతో ఈ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు..... క్రమేపి బ్రహ్మస్వరూపమును పొందగలడు.
ఈ శ్లోకమందు హోమం గురించి చెప్పబడినప్పటికిని సమస్త కార్యములందు ఈ ప్రకారమే, అంటే సమస్తమూ బ్రహ్మమయమే అన్న భావనతో చేసినచో - ప్రతీ కార్యమందునూ చేయువారు, చేయబడింది బ్రహ్మస్వరూపములే యగును. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చాందోగ్యోపనిషత్ తెలిపిన విధంగా ఈ సమస్తమూ బ్రహ్మమే అను భావమును దృఢపరచుకొని సర్వకార్యాలు నిర్వర్తించువాడు బ్రహ్మస్వరూపమే పొందును. ఈ ప్రపంచమున సమస్తమూ బ్రహ్మస్వరూపమేకానీ, అన్యం కాదు. ఈ విషయం సదా జ్ఞప్తియందు ఉంచుకొని, చిత్తమందు బ్రహ్మభావన, దైవభావన కలిగియుండి అన్నాదులు స్వీకరించినచో, ఈ స్వీకరించనెడి ప్రక్రియ ఓ యజ్ఞమే యగును, భుజించు పదార్ధము అమృతమే యగును. 
పూజితం హ్యశనం నిత్యం బలమూర్జం చ యచ్ఛతి /
అపూజితాం తు తద్భుక్తముభయం నాశయేదిదమ్ //
దైవభావముతో భుజించెడు అన్నం సత్త్వగుణమును, బలమును, దివ్యమైన ఓజస్సును కలుగజేయును. అట్లుకాక భుజించెడు ఏ పదార్ధమైనను ఆత్మబలమును, తేజస్సును నశింపజేయును.
బ్రహ్మభావనతో భుజింప అభ్యసించువారికి ఈ దేహం దేవాలయముగాను, ఆత్మ పరబ్రహ్మ స్వరూపముగాను బోధపడును. 
అటులనే భోజనం చేయునప్పుడు ఇట్టి భావంతో మౌనంగా భుజించువారు ఉత్తమ సాత్త్వికులు. భోజనం చేయునప్పుడు వ్యర్ధ విషయములు మాట్లాడుచు భుజించువారు రజోతామసతత్త్వం కలవారగుదురు. 

మానేన భోజయిత్వా తు స్వర్గం ప్రాప్తో న సంశయః /
ప్రజల్పన్ భుజంతే యస్తు తేనాన్న మశుచిర్భవేత్ //
పాపం న కేవలం భుంక్తే తస్మాన్మౌనం సమాచరేత్ /
ఉపవాసనమం భోజ్యం జ్ఞేయం మౌనేన నారద! //
మౌనంతో భుజించువారు స్వర్గమును పొందగలరు. దీనియందు సందేహం లేదు. మాట్లాడుతూ భుజించిన అన్నము అశుచి అగుతున్నది. వ్యర్ధవిషయాలు మాట్లాడుచు భుజించు అన్నం అన్నమే కాదు, పాపరూపమే యగును. మౌనంతో భుజించిన భోజనం ఉపవాస సమానమే అగుచున్నది. ఉపవాసం వలన ఎంత ఆత్మశుద్ధి కలుగునో అంత పుణ్యం మౌనంగా భుజించడం వలన కలుగును.

ఈ రీతిలో సాత్త్వికమైన ఆహారమును మౌనముగా దైవానికి నివేదనచేసి, దైవమును స్తుతిస్తూ తీసుకున్న ఆహారం శుద్ధాహారం అవుతుంది. 
శుద్ధ ఆహరముచే మనస్సు నిర్మలమవును. శాంతి, దయ, వైరాగ్యం, దైవచింతన, బ్రహ్మభావన కలిగి పరబ్రహ్మప్రాప్తి పొందవచ్చును. 
పుత్రోత్పత్తికి హేతువగు శుక్లశోణితం ఏ అన్నపానీయములచే స్త్రీపురుషులకు ఏర్పడునో అట్టి అన్నము శుద్ధముగా ఉన్నచో - దైవ, మాతాపితరులయందు, గురువులయందు, వేదశాస్త్రాలయందు, సాదు సత్పురుషులయందు విశ్వాసం గల ధర్మాతులైన వంశోద్ధారక సంతానం కలుగుదురని శాస్త్రవచనం. 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆ నాలుగు ఏమిటంటే.........

మొన్న మా అమ్మాయి (అనుషా) ఓ ప్రశ్న అడిగింది. 
అమ్మా! సత్యయుగం(కృతయుగం)లో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది అని అంటారు కదా. ఆ నాలుగు పాదాలు ఏమిటమ్మా?
ఆ నాలుగు ఏమిటంటే.........
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జ నైర్ధ్రతః /
సత్యం దయా తపో దానమితి పాదాని భోనృప //
(ఈ శ్లోకం మహాభారతం లోనిదని జ్ఞాపకం)
కృతయుగమందు ౧.సత్యం ౨.దయ ౩.తపస్సు ౪.దానం అనునవి నాలుగు పాదములు. 
మా అమ్మాయి అడిగిన ఈ ప్రశ్నతో మరో జ్ఞాపకం నా మదిలో కదలాడుతుంది. అది -
ఓ మూడు నాలుగు సంవత్సరముల క్రితమనుకుంటాను (సరిగ్గా జ్ఞాపకం లేదు), తెలుగుచలనచిత్రరంగ ఉత్సావాలప్పుడు ప్రముఖనటుడు రాజేంద్రప్రసాద్ గారు ఇలా అన్నారు -
కృతయుగంలో మంచే తప్ప చెడు అనేదే లేదు, త్రేతాయుగంలో మంచి సముద్రానికి ఇవతల, చెడు సముద్రానికి అవతల ఉండేవి, ద్వాపరయుగంలో మంచి చెడు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట ఉండగా, కలియుగంలో ఈ రెండూ ప్రతీ ఒక్కరిలో ఉన్నాయి అని! ఈ కార్యక్రమం టి.వి లో చూస్తూ 'ప్చ్..... కృతయుగంలో పుట్టిన బాగుండును, దురదృష్టం కొలది ఈ కలియుగమందు పుట్టాను కదా' అని నేను అంటుండగా, ప్రక్కనే ఉన్న మావారు  "అలా ఎందుకనుకోవడం? ఈ యుగమందైన సత్యయుగంలో ఉన్నట్లు ఉండవచ్చు. ఏ యుగమందు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందిన ధర్మం ప్రకారం మన ప్రవర్తన మార్చుకుంటే సరిపోతుందని" అన్నారు.
నాకు అర్ధం కాలేదు మావారి మాటలు. కాస్త వివరంగా చెప్పండి అని అడగగా -
కృతయుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సు, దానం అను పాదాలపై నడిచేది. ఈ నాలుగు గుణములు కలవారు ఏ యుగమందున్నను సత్యయుగంలో ఉన్నట్లే.
త్రేతాయుగమందు ధర్మం - సత్యం లోపించి దయ, తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ మూడు గుణములు కలవారు ఏ యుగమందున్నను త్రేతాయుగంలో ఉన్నట్లే.
ద్వాపరయుగమందు ధర్మం -సత్యం, దయ లోపించి తపస్సు, దానములనెడి పాదములపై నడిచేది. ఈ  రెండు గుణములు పరిపూర్ణముగా కలవారు ఏ యుగమందున్నను ద్వాపరయుగమందు ఉన్నట్లే.
ఇక కలియుగమందు ధర్మం - సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణం పైనే నడుస్తుంది. 
ఏ యుగమునందు నీవు ఉండాలనుకుంటున్నావో ఆ యుగమునకు చెందినట్లు నీ గుణసంపత్తిని పెంచుకో... 
అని వివరంగా మావారు చెప్తూ ఈ విషయాలన్నీ భారతంలో ఉంటాయి చదువు అని భారతమును నా చేతిలో పెట్టడం ఓ మధురమైన జ్ఞాపకం.

భారతంలో అనుశాసనికపర్వంలో ధర్మరాజు యుగములను గూర్చి అడిగిన ప్రశ్నకు భీష్ముడిట్లు సమాధానమిచ్చెను -
'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.

1, సెప్టెంబర్ 2012, శనివారం

దేహమే దేవాలయం; జీవుడే దేవుడు!

దేహస్తాః సర్వవిద్యా శ్చ దేహస్తా స్స ర్వదేవాతః
దేహస్తాః సర్వతీర్ధాని, గురువాక్యేన లభ్యతే 
బ్రహ్మాండలక్షణం సర్వం దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలినీతంత్రం) 
                                * * *
దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)
                                * * *
దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)
                                 * * *
ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం. (శాస్త్ర వచనం)
                                 * * *
మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది. (శ్రీ రమణమహర్షి)
                                  * * *
భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు కదా...
దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే -
భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ, మనకి కానరావడం లేదు... ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన!
మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు! మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి... ఎలా?
ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని - ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి, పుజాసామగ్రిని, పూజగదిని శుభ్రపరిచి, అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో, అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలును తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి). మనలో ఉన్న అజ్ఞాననిర్మాల్యలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి  ఆరు అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది. అందుకే చెడు ఎవరైనా చెబితే చెవిటివాడులా ఉండు, చెడు మాట్లాడే సంభాషణ సంభవిస్తే మూగవాడిలా వుండు, చెడు చూసే పరిస్థితి తారసపడితే గుడ్డివానిలా వుండు అని 'బాబా' అంటారు. మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. (ఆలోచనలతో నిండి ఉన్న భాగాన్ని మనస్సు అనియు, విచక్షణతో నిర్ణయం తీసుకునే భాగాన్ని బుద్ధి అని అంటారు). రామకృష్ణ పరమహంస చెప్పేది ఇదే - 'ఆకర్షణల మధ్య ఆకర్షణ లేకుండా ఉండగలగడమే వివేకం' అని! ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి. మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి, మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి. శ్రీ రమణులు అన్నట్లు, మనస్సు బయటికి వెళితే బంధం, లోపలి వెళితే మోక్షం!  
ప్రాపంచిక మార్గమైన, పారమార్ధిక మార్గమైన సరే, మన జీవన గమనంలో బయట లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు, దైర్యం, నమ్మకం, ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం. జీవితంలో కష్టాలు, దుఃఖం, ఆవేదన..... ఇత్యాదులు అనుభవిస్తేనే ఆనందములోని పరిపూర్ణత, అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు. 
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసిన దాని గురించి ఆలోచించం. ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ, ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం!  ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది. 
మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండింటిమీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ, మాటల్లోగానీ, పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి మనస్సు పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. 
ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను, ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను, ఎంతగానో ప్రార్ధిస్తున్నాను, మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని! 
అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి? 
దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. 
దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.
అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.
అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.
సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.
సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.
భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో (మిషన్లో) పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని బాబా అంటారు. 
'నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు' అని జిన్నూరు నాన్నగారు చెప్తుంటారు.
చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.
దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. శవబుద్ధి (దేహాత్మబుద్ధి) వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. 


అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.