22, ఏప్రిల్ 2018, ఆదివారం

"మాట - మౌనం"

                                   

మాట - మౌనం ..... ఈ రెండు మానవునికి ముఖ్యమైనవే. ఈ రెండూ మనిషిని ఉన్నతంగా నిలిపేవే. అయితే అవి రెండూ అర్ధవంతంగా ఉండాలి.

ఎప్పుడు ఎక్కడ చదివానో గుర్తులేదుగాని, చక్కటి సత్యాన్ని తెలియజెప్పే శ్లోకమిది - 
(లీలగా జ్ఞాపకమున్న శ్లోకమిది. అక్షరదోషముంటే మన్నించాలి)

మౌఖర్యం లాఘవం కరమ్ మౌనమున్నతి కారకం 
ముఖరీం సూ/నూపురౌ పాదౌ కంఠే హార విరాజతే 
మౌనం మనిషిలోని ఔనత్యాన్ని చాటితే, మాటల ఒరవడి అల్పత్వాన్ని సూచిస్తుంది. పాదాలను అలంకరించే మంజీరాలే చప్పుడు చేస్తాయి. కానీ, కంఠంలో భాసించే హారం మాత్రం శబ్దం చేయదు. చాలామంది అలికిడి లేని కంఠ హారంగా ఉండడం కన్నా అలుపెరగని మాటలతో పాదమంజీరాలుగా ఉంటున్నారు. మాట మనిషి తీరును తెలుపుతుంది. 

మాట్లాడే పద్దతిబట్టే  ఎంతటి సంస్కారవంతులో తెలుపుతుంది 

గతంలో ... "మాటే మంత్రం"  "మౌనం" 

అన్న రెండు టపాలు రాసినా, ఈ మధ్యకాలంలో వాట్స్ అప్ లో వచ్చిన ఓ రెండు ఫార్వర్డ్ మెసేజెస్ మరల మరోసారి ఈ టపా రాయడానికి కారణమయ్యాయి.


ఆ మెసేజెస్ ఏమిటంటే -


సుందర చైతన్యానంద స్వామి వారి
 సుభాషితాలు - 
దీపం మాట్లాడదు, గాలి కబుర్లు ఎరగదు. మాట్లాడకపోయిన దీపం ప్రకాశము నందిస్తుంది. కబుర్లు చెప్పకపోయిన గాలి హాయిని కల్గిస్తుంది. సూదులవంటి మాటలు, గొడ్డలి పోట్లువంటి కబుర్లు అందించే నీవు దీపంలా జీవించలేవా? గాలిలా కదలలేవా?
పద్మం నందలి పుప్పొడి రాలిపోవునేమో ననెడి భావంతో భ్రమరం అతినెమ్మదిగా తన పాదములను పద్మంపై నుంచునట్లు, ఇతరుల మనస్సు కష్టపడునేమో యని యోచించి, వారికి నొప్పిని కల్గించకుండా ప్రవర్తించువారే సంస్కారయుతులు, సత్ సాధకులు.
సంస్కారమన్నది ఇతరులు చెబితే వచ్చేది కాదు, అది స్వతహాగా అలవర్చుకోవలసిన సద్గుణం... స్వీయ శిక్షణే రక్షణ.  నీలోని చెడుని, ఇతరులలోని మంచిని గాలించి గ్రహించే సదలవాటుని కలిగియుండు.
               
                               
                                                       
గోడకు కొట్టిన మేకులు 
ఓ తండ్రి తన కొడుక్కి కొన్ని మేకులు ఇచ్చి, 'నీకు రోజుకి ఎంత మంది మీద అయితే కోపమొస్తుందో, ఎందర్ని తిడతావో, విమర్శిస్తావో అన్ని మేకులు గోడకు కొట్టు' అని చెప్తాడు. 
మొదటిరోజు కొన్ని, తర్వాతి రోజు మరికొన్ని, మూడవ రోజు ఇంకొన్ని... ఇలా తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు ఆ కొడుకు. మేకులు అయిపోగానే, కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి 'నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి' అని అన్నాడు.
'ఓ …అయితే రేపటి నుండి రోజుకు కొన్ని మేకుల చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయ్' అన్నాడు కొడుకుతో తండ్రి. తండ్రి చెప్పినట్టే, గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు… కొన్ని మేకులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. అన్ని మేకులు తీసేసాక, తండ్రి వద్దకు వెళ్లి 'గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాను నాన్న'అన్నాడు కొడుకు.
'మరి గోడ ఎలా ఉందిరా' అని అడిగిన తండ్రితో 'మేకులైతే తీసేశాను కానీ, వాటి వలన గోడలకు అయిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్నా' అన్నాడు కొడుకు.
అప్పుడు తండ్రి, కొడుకుతో... 'చూసావా, మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావ్. తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసినా రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయంటే, మనకి చాలా మంది మీద కోపం వస్తుంది, ఆ కోపంలో వాళ్ల మనస్సును గాయపరుస్తాం(మేకులు కొడతాం), తర్వాత సారీ చెప్పేస్తాం (కొట్టిన మేకులు తీసేస్తాం), కానీ సారీ చెప్పనంత మాత్రన వారి మనస్సుకు అయిన గాయం (రంధ్రాలను) మాత్రం పూడ్చలేం. అందుకే మాట-తూటా లాంటిది, ఆచితూచి మాట్లాడాలి, ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి' అని కొడుకు తప్పిదాన్ని తెలియజెప్తాడు ఆ తండ్రి. 

చైతన్యానందులవారు చెప్పినట్లు, మంచి చెడుల కలయికే ఈ ప్రపంచం. మంచి చెడుల మిశ్రమమే ప్రతీమానవుడు. అయితే నీరు కలిసిన పాలలో పాలును గ్రహించి నీటిని విడిచిపెట్టే హంసలా' ఎదుటిమనిషిలో మంచిని గ్రహించి చెడును విస్మరించాలి. అందుకే కాకిలా కాకుండా హంసలా బ్రతకమన్నది పెద్దల మాట.  సహజంగా కొంతమందికి మాటలతో పోయేదానిని ఘర్షణల వరకు తీసుకెళ్లటం అలవాటుగా ఉంటుంది. ప్రతీ మనిషిలో తప్పొప్పులుంటాయి. ఆ ఒక్క తప్పుని కాకుండా వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు, దూషిస్తారు. అది సద్గుణమెప్పటికీ కాదు,  అలా కాకుండా, ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, ఆ తప్పుని సున్నితంగా తెలియజేయండి. కానీ ఆ మనిషిని మాటలతో గాయపర్చకండి. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించగల్గితే, జీవితమో నందనవనమే అవుతుంది.  
ద్వేషభావాలు, దోష దర్శనాలు మంచివి కావు. కోపతాపాలు సహజం, అవి వచ్చినంతవేగంగా పోవాలి. ఇతరుల తప్పులను గురించి విచారణ చేస్తూవుంటే, వారి భావాలతో విభేదిస్తూంటే మన మనస్సు శుద్ధమౌతుందా? నిన్ను నీవు విచారించుకో, నీ తప్పులను సరిదిద్దుకో, నీవెవరో తెలుసుకో అంటారు శ్రీరమణులు.
                                          
                                   

  పంచపునీతాలు (వాక్ శుద్ధి, దేహ శుద్ధి, భాండ శుద్ధి, కర్మ శుద్ధి, మనశ్శుద్ధి)లో మొదటిది వాక్కు. 
                     వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు కాబట్టి, వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, పంతం, కసి, ద్వేషం, అర్థరహిత వాదనలతోసాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు. 
అటులనే, సప్తవ్యసనాలు (మద్యపానం, స్త్రీలోలత్వం, జూదం, వేట, వాక్పారుష్యం, దండ పారుష్యం, అర్థ దూషణం) లో వాక్పారుష్యం ఒకటి. 
                       వాక్పారుష్యం అంటే మాటలో కాఠిన్యం, దురుసుతనం, క్రోధావేశంలో విచక్షణ కోల్పోయి, 'నోటికి ఏదివస్తే అది' మాట్లాడటం వల్ల కూడా మనిషి విపరీతంగా నష్టపోతాడు. ఇది రోజూ మన చుట్టూ కనిపించే లోకానుభవమే. మానవీయ సంబంధాలను వాక్పారుష్యం తీవ్రంగా దెబ్బతీస్తుంది. పరుషమైన వాక్కు పదునైన కత్తికంటే, విషం పూసిన బాణం కంటే, తుపాకీ తూటాకంటే ఎక్కువగా గాయపరచగలదు. అంత శక్తివంతమైనది మాట.
చెడ్డ పని కన్నా చెడ్డమాట చాలా ప్రమాదకరమైనది. ఒక్కమాట చాలు... మిత్రుణ్ణి శత్రువుగా, శత్రువుని మిత్రునిగా మారుస్తుంది.  మనిషి దైనందిక జీవితంలో చాలావరకు తెలిసి చేసే తప్పు దూషణ. ఇదో దుష్కర్మ. వాగ్దోషఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. 
           
              కొందరు సద్గుణవంతులుంటారు... ఎవరు ఎంత దూషించిన, అనవసర విమర్శలు చేసిన, చేసినవారి వైఖరి అలాంటిదని సరిపెట్టుకొని, స్థిమితంగా సాగిపోతుంటారు. 

                                 
ఒకోసారి మౌనం, మాటలకన్నా గంభీరంగా మాట్లాడుతుంది. అలాగని మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉన్నా, మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడిన తప్పే అవుతుంది. 
మన నోటిలోనికి పోయే పదార్ధాలు శుచిగా రుచిగా మంచిగా ఉండాలని కోరుకునే మనం - మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అలానే మంచిగా వుండాలని ఎందుకనుకోము?


ఇక్కడ మాహావాగ్మి నా ఆరాధ్యదైవం ఆంజనేయున్ని మనసార స్మరించుకోవాలనిపిస్తుంది -
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్
జీవన సాఫల్యానికి  కావాల్సిన ముఖ్యలక్షణాలు - బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం చురుకుదనం, వాక్పటుత్వం. 
మొదటసారి రామ లక్ష్మణులను కలిసినప్పుడు, సీతమ్మ జాడను కనిపెట్టి, ఆ తల్లితో మాట్లాడినప్పుడు, రావణుని ఎదుట నిలిచి మాట్లాడినప్పుడు హనుమంతుని మాటతీరు గమనిస్తే ... అర్ధమౌతుంది మాటలెలా ఉండాలో... 

అవిస్తరం - సందర్భానుసారంగా, ఎదుటి వ్యక్తి యొక్క స్థితిననుసరించి,  చెప్పవలసిన విషయాన్ని సూటిగా , క్లుప్తంగా చెప్పడం.  
అసందిగ్ధం - ఉచ్చారణ దోషం లేకుండా, చెప్పవలసినదానిని అవగాహనా లోపం వలన వచ్చే సందిగ్ధం లేకుండా ముందే ఒక స్థిరమైన నిర్ణయంతో ఉండి, నిశ్చయంగా మాట్లాడటం.
అవిరంబితం - మాట్లాడేటప్పుడు మాట్లాడే వారి వంక శ్రద్ధ గా చూస్తూ, నిశ్చలంగా ఉండి, వాక్కుగా అనవసరమైన రాగాలు లేకుండా విషయాన్ని అందిచడం.
అవ్యధం - మాట్లాడే మాటల వలన ఎదుటివారి హృదయం బద్దలవకుండా,  సత్వగుణంతో తాను హృదయ స్థానంలో ఉండి , మృదువుగా చెప్పడం.
ఇలా మాట్లాడడం కొంతవరకైనా మనం అలవర్చుకుంటే ధన్యులమే. 


అందుకే అన్యుల మనస్సును నొప్పించకుండా అర్ధయుక్తంగా అవసరమైన మేరకు ఆలోచిస్తూ మాట్లాడడం, కరుకు పదాలతో కలతలను పెంచక, మధురమైన మాటలతో మమతలను పెంచుకోవడంలో హాయిని ఆస్వాదించడం అలవర్చుకుందాం. మాటలనేవి రెండు మనస్సుల నడుమ వారధి లాంటివి. 
ఆధ్యాత్మిక సాధనలు, యజ్ఞయాగాదులు, తపస్సులు చేయలేకపోవచ్చు... కానీ; ఒకొక్క సద్గుణం అలవర్చుకుంటే సాత్వికగుణం పెంపొందదా... సర్వేశుడు మెచ్చి అనుగ్రహించడా?