19, నవంబర్ 2013, మంగళవారం

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానం ఏమిటంటే ...

ఏ యోగం యోగ్యమైనదన్న నా ప్రశ్నకు నా నెచ్చలిచ్చిన సమాధానమిదే -
భారతీ! నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేముందు ఓ పుస్తకంలో చదివిన కబీరుగారి ప్రబోధకీర్తన గురించి చెప్తాను. " సద్గురుకీ భిక్షా మాంగాయిరే బాల" అన్న కీర్తన పూర్తిగా నాకు గుర్తులేదు, కానీ, అందులో వివరించిన అర్ధం, అంతరార్ధం గుర్తుంది. సద్గురుకీ ప్రేమభిక్ష వేడుకోమని, చెప్తూ ఆ భిక్షకు అంగభూతములుగా నాలుగు భిక్షలను కబీరు నిర్వచించెను. మొదటిది గోధుమపిండి. ఇది అంగడికి గాని, పిండిమరకు గాని పోకుండా జోలెనిండ తేవలెను. రెండవది జలము. బావికి గాని, నదీతటాలములకు గాని పోకుండానే ఆనపబుర్ర నిండా తేవయును. మూడవది కట్టెలు. అంగడికి గాని, అడవికి గాని పోకుండా మోపెడు కట్టెలు తేవలయును. నాల్గవది దర్శనభిక్ష. మసీదు, దేవళములకు గాని, సాధు ఫకీర్ల వద్దకు గాని పోకుండా, ఉన్నచోటనే దర్శనం పొందవలెనని, అందుకై సద్గురుకి ప్రేమభిక్ష వేడమనే ప్రబోధం ఆ కీర్తనలో ఉంది. ఇప్పుడు ఈ కీర్తనలో అంతరార్ధం తెలుసుకుందాం. మొదట మూడు అంటే, పిండి, జలము, కట్టెలు రొట్టెను తయారుచేయుటను సూచించును. ఆ రొట్టెను తినినచో దర్శనం, దాని ఫలితంగా ప్రేమ లబింపవలయును. రొట్టెను తయారుచేయుటకు పిండి ముఖ్యపదార్ధం. కాని పొడిపిండిని తినలేం. అందుకే నీరు కావలయును, ఆ నీటితో పిండిని తడిపి, ముద్ద చేసి రొట్టెగా ఒత్తవలెను. అలా పచ్చిరొట్టెను తినలేం, దానిని కాల్చాలి. కాల్చడానికి కట్టెలు కావాలి. ఇలా సక్రమముగా తయారైన రొట్టెను తింటే ఆకలి తీరుతుంది. ఇక్కడ పిండి జ్ఞానం. దానిని భక్తి రసముచే (జలముచే) తడిపి మృదువుగా నొనర్చిన పిమ్మట నిష్కామ కర్మలను కట్టెలతో పక్వమొనర్చి  సక్రమముగా తయారైన ధ్యానమను రొట్టె ఆరగిస్తే ఆధ్యాత్మికక్షున్నివారణమగును. అప్పుడు ఉన్నచోటనే తత్క్షణమునే పరమాత్మ దర్శనమగును. అటుపిమ్మట అంతా పరమాత్మ ప్రేమతత్త్వమే. దానిని సద్గురువునివ్వమని వేడుకో... ఈ కీర్తనబట్టి ఆత్మసాక్షాత్కారానికి భక్తి, ధ్యాన, కర్మ, జ్ఞానమనే నాలుగూ అవసరమేనని అర్ధమౌతుంది. కాకపోతే ఈ నాలుగు యోగాలు అనుష్టించగలిగే శక్తి కారణజన్ములయిన మహాత్ములకే ఉంటుంది. మనలాంటివారికి ఇది అసాధ్యము కావున, ఏ యోగమార్గం ద్వారైన నను పొందవచ్చని గీతలో సూచించాడు. 

జీవకోట్ల సంస్కారములు అనేకవిధములు. జీవుల యొక్క పరిపక్వతా భేదములున్ను అనేక రకములు. వారి వారి భావనలబట్టి ఒక్కొకరికిని ఒక్కొక్కదానిలో ప్రవేశం కల్గుచుండును. కావున నిష్కామ కర్మయోగం, భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం మొదలగు మార్గములు ఏర్పడినవి. దేహాంతరాలయములోనికి ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఈ నాలుగుమార్గాలు గోపురద్వారాలుగా ఉన్నాయి. ఈ మార్గాలలో ఏ మార్గం ద్వారైనను నిర్మలబుద్ధితో, నిష్కపట ప్రయత్నముతో ప్రవేశించి గమ్యస్థానమును చేరవచ్చును. అయితే, ఏ యోగమార్గములో ప్రవేశించినను, మిగిలిన మూడు మార్గాలు అందు అంతర్భూతమయ్యే యుండును. ఆంటే అంగభూతములుగా యుండును. ఈ నాలుగున్ను ఒకదానికి ఒకటి అన్యోన్య సంబంధం కల్గియే యుండును. జ్ఞానికి భక్తి, కర్మ, ధ్యానములు అంగభూతములుగా నుండును. అట్లే భక్తునికి కర్మ, ధ్యాన, జ్ఞానములూ; ధ్యానికి భక్తి, కర్మ, జ్ఞానములూ; కర్మయోగికి భక్తి, ధ్యాన, జ్ఞానములూ అంతరభాగములై యుండును. ఎలాగంటే, చీకటి నశించి ప్రకాశము కలుగుటకు దీపమే ప్రధానమైనను, దానికి ప్రమిద, తైలము, వత్తి ఎలాగున అవసరమో, అదేరీతిగా జ్ఞానజ్యోతి అయిన ఆత్మను దర్శించడానికి తక్కిన సాధనములు అవసరమే.
దైవోపాసనచే విక్షేపశాంతియు, శుద్ధమగు కర్మానుష్టానంచే అంతఃకరణశుద్ధియు, ధారణాధ్యానబలంచే సంయమనమును, జ్ఞాననిష్టచే ఆవరణరాహిత్యమును కలుగును. కనుక ఏ యోగమార్గమందైనను ఒకదానికి ఒకటి అనుసంధానింపబడే ఉంటాయి. 
భోజనం చేస్తున్నామంటే, దాని తయారికి బియ్యము మొదలగు పదార్దములు, అగ్ని, జలము, పాత్ర, కట్టెలు మొదలునవి ఎలా ఉన్నాయో, ఏ యోగం అనుసరించినను ఆ యోగంలో తక్కినవి అంగభూతములై ఉంటాయి. ఈ సూక్ష్మం అర్ధమైతే ఏది శ్రేష్టమన్న సందేహం ఉండదు ... అని నా నేస్తం 'హరిప్రియ' చెప్పింది.

17, నవంబర్ 2013, ఆదివారం

హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.

క్రిందటివారం తిరుపతి కంచి వెళ్లి, తిరుగు ప్రయాణం అయినప్పుడు ట్రైన్లో ఇద్దరు సాధకులు తాము అనుసరిస్తున్న 'సుషుమ్న నాడీ' ధ్యానవిధానమును తెలిపారు.
పతంజలి యోగసాధన, బుద్ధుని అనాపాన సతి, మాస్టర్ సి. వి. వి. ధ్యానయోగం, పరమహంస యోగానంద క్రియాయోగం, మహేష్ యోగి భావాతీత ధ్యానయోగం, శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీరమణుల నేనెవరిని అన్న విచారణయోగం, స్వామి శివానంద సగుణ నిర్గుణ ధ్యానపద్ధతి, బ్రహ్మకుమారీల రాజయోగం, మాతా అమృతానందమయి ఐ యామ్ టెక్నిక్, అరవిందుని ఇంటిగ్రల్ యోగం, ఋషి ప్రభాకర్ గారి యస్. యస్. వై ధ్యానపద్ధతి, శ్రీ భిక్షుమయ్య గారి యమ్. యమ్. వై ధ్యానపద్ధతి, పత్రీజీ పిరమిడ్ ధ్యానం ... ఇలా ... ఒక్కొక్కరు ఒక్కోలా ఈ ధ్యానయోగాన్ని అనుభూతిస్తూ, నిర్వచిస్తూ, సూచిస్తూ, తెలియజేస్తున్నను, ఈ ధ్యానప్రక్రియలన్నీ స్వస్వరూపస్థితిని తెలుసుకోవడానికే కదా, అని నాకన్పించింది.
ఇంతలో ఆ సాధకులు చెప్పినదంతా విన్న సహప్రయాణికుడు కొందరు ధ్యానయోగం గొప్పదని, మరికొందరు భక్తియోగమని, మరికొందరు జ్ఞానయోగమని, మరికొందరు కర్మయోగమని చెప్తుంటారు. నిజానికి ఏది గొప్పదని వారిని అడగగా, వారు ధ్యానయోగమే గొప్పదని బదులిచ్చారు.
ఇంతలో నేను దిగాల్సిన స్టేషన్ రావడంతో దిగిపోయాను. కానీ, ఏ యోగం గొప్పదన్న ఆలోచన నన్ను వీడలేదు. గీతలో భక్తియోగంలో అనేక మార్గాలను సూచిస్తూ కృష్ణపరమాత్మ ఇలా అంటారు -
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ|
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః||

నాలోనే మనస్సును, బుద్ధిని నిలుపుము. అటుపిమ్మట నీవు నిస్సందేహంగా నాలోనే వసింతువు. అంటే ఇది భక్తియోగం.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్|
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ||

స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు. ఇది ధ్యానయోగం.

అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మపరమో భవ|
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి||

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం చేసే పుణ్యకర్మలు వలన నన్ను పొందుతావు. ఇది కర్మయోగం.

అథైతదప్యశక్తోऽసి కర్తుం మద్యోగమాశ్రితః|
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్||

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీవు చేసే
కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
ఇలా సాధకులకు అనేక యోగామార్గాలు ఉన్నాయి కదా, మరి ఇందులో ఏది శ్రేష్టమైనది అన్న నా సందేహాన్ని తీర్చుకోవడానికై మూడురోజుల క్రితం నా మిత్రురాలు 'హరిప్రియ'కు ఫోన్ చేసి అడిగాను. తను నవ్వి, మంచి సందేహమే, ఈ ఆదివారం కార్తీకపౌర్ణమి కదా, ఆరోజు ఉపవాసముంటాం కదా, ఉపవాసమంటే దేవునికి దగ్గరగా ఉండడం అంటే దైవస్మరణ, దైవప్రార్ధన ... ఇత్యాదులతో గడపడం కదా, ఆరోజు వస్తాను, నీ సందేహాన్ని తీరుస్తాను, సరేనా ... అన్నప్పటినుండి ఈ కార్తీకపౌర్ణమి కై నిరీక్షణ .....
 
హమ్మయ్య! కార్తీకపౌర్ణమి వచ్చింది, నా నేస్తమూ వచ్చింది, నా సందేహమూ తీరింది.
నా సందేహం ఎలా తీరిందో, నా నేస్తం ఏం చెప్పిందో తదుపరి టపా లో -

30, అక్టోబర్ 2013, బుధవారం

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.
బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.
చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.
అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.



28, అక్టోబర్ 2013, సోమవారం

"మౌనం"


మౌనం -
              దైవభాష.
              సనాతనం.
              లిపి లేని విశ్వభాష.
              ధార్మిక దివ్యత్వానికి ద్వారం.
              సనాతన భాషాస్రవంతి.
మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.

మౌనమంటే -
                   నిరంతర భాషణ.
                   చింత, చింతన లేని తపస్సు.
                   అఖండ ఆనందపు ఆత్మస్థితి.
                   విషయ శూన్యావస్థ.
యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-



                   వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.


2. అక్షమౌనం :-
                
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.


3. కాష్ఠమౌనం :-
      
 
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.




దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం -
                      దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.
                      గురువు మౌనం జ్ఞానానుగ్రహం.
                      జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.
                      భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.
ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.
పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం
బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే
తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని
ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.
                                          - శ్రీ సీతారామాంజనేయ సంవాదం.
ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.




11, ఆగస్టు 2013, ఆదివారం

ఒకప్పుడు నేను విన్న కధను గుర్తుచేసిన 'శ్రీ శ్యామలీయం గారి భాగవతం'

పరమ భాగవతోత్తముడైన బమ్మెర పోతానామాత్యులవారు తన సహజపాండిత్యంతో అనితరభక్తితో మానవాళికి ఆత్మోన్నతిని అందించే శ్రీ మద్భాగవతాన్ని తెలుగులోనికి అనువదించగా,
దానిని తిరిగి ధారావాహికంగా భక్తజన హృదయాలను రంజింపజేస్తూ, ఎంతో భక్తితో తను చేస్తున్న ఈ పనిని ఓ తపస్సులా భావిస్తూ శ్రీమదాంధ్రమహాభాగవతంను సరళముగా అందిస్తున్న శ్రీ శ్యామలీయంగారికి నమస్సులు. వారి శ్యామలీయం భాగవతం చదువుతుండగా ఒకప్పుడు నేను విన్న ఈ కధ జ్ఞాపకం వచ్చింది.
శుకమహర్షి భాగవతమును ఏడురోజులలో పరీక్షిత్తు మహారాజునకు తెలిపి ముక్తిని కలుగజేసినట్లు తెలుసుకున్న ఓ మహారాజు తన ఆస్థాన పురోహితున్ని పిలిచి, ఆ భాగవతమును తనకి విశదపరచమని, తనకు అలానే ఏడురోజుల్లో మోక్షమును కలుగజేయమని, లేనిచో నీ పౌరాణికత్వం రద్దుచేసి, దేశబహిష్కరణ చేస్తానని శాసించెను. అంతట ఆ పౌరాణికుడు ఎంతో శ్రద్ధాభక్తులతో చెప్పినను ఆరాజు మనస్సు భగవద్వీలీనం చేయక ఏడవరోజు ముక్తికై ఎదురుచూస్తుండడంతోనే ఆరురోజులూ గడిచిపోయాయి. మరుసటిదినం ఏడవరోజు అగుటచే పౌరాణికుడు మహావ్యాకులతతో వుండగా, ఆ పండితుని సేవకుడు తన యజమాని విచారమునకు కారణం అడిగితెలుసుకొని, ఈ పనికి నన్ను నియమించండి, మీ బదులుగా నేను వెళ్లి ఈ పనిని పూర్తిచేస్తానని చెప్పి, తానే రాజభవనానికి వెళ్ళి, ప్రభూ! ఈ చిన్నివిషయానికి తానేల రావలయునని తలచి, మోక్షము యొక్క రహస్యమును తమకు తెలిపి రమ్మని నా యజమాని ఆదేశించగా నేను వచ్చితిని అని చెప్పి, ఓ రాజా! ఈ రోజు పురాణం ప్రారంభించుటకు ముందు మీరు బంధీకృతులు కావలసియున్నది అని చెప్పగా ... మోక్షం వచ్చుటకు ఇదికూడా అవసరం కాబోలు అని రాజు అంగీకరించగా, రాజును ఒకస్తంభమునకు కాలుచేతులు కట్టి బంధించి, ఆ పిమ్మట ఆ సేవకుడు అనేకరకముల ఫలహారములు తెప్పించి రాజుముందు పెట్టి,
మహారాజా! శుభముహూర్తం దగ్గరకు వచ్చింది, ఈలోపునే మీముందున్న ఫలహారములను స్వీకరించాలి కావున వెంటనే భుజించమని చెప్పెను. ఇదెలా సాధ్యం? బంధీకృతమైన నేను ఎలా భుజించగలనని రాజు ప్రశ్నించగా, ఓ రాజా! పరీక్షన్మహారాజు వలే మీకు తగిన వైరాగ్యం లేదు, మీ బంధనములు తెగలేదు. ఇట్టిస్థితిలో ఏడురోజుల్లో మీకు మోక్షమిప్పించుట ఎట్లా సాధ్యమౌతుంది?
ఓ రాజా! 
జనమేజయులకు రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునను తప్పించి, చిత్తంబు హరికి అర్పించి, ప్రాయోపవిష్టుండైన పరమభాగవతుడైన పాండవపౌత్రుండు
పరీక్షిత్తు మహారాజుకున్న వైరాగ్యం మీలో లేదు. మీరింకనూ ఆశాపాశములతో ఈ మాయాప్రపంచంన కట్టుబడే యున్నందున మోక్షం సాధ్యం కాదు. రాజా! ప్రీతితో, ఆసక్తితో, ఫలాభిలాషతో, కర్తృత్వబుద్ధితో గడుపుజీవితం బంధమును కలిగిస్తాయి. బంధమెంతవరకుండునో అంతవరకు మోక్షం లేదు. ముక్తి పొందడానికి యోగ్యత, సాధన, ఆచరణ కావలసియున్నది. సమస్త బంధనములనుండి విముక్తి పొందినవారికి మాత్రమే ముక్తి సాధ్యమగును.
ఓ మహారాజా! దేహపుత్రకళత్రాది వారిపైగల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఏకాంతప్రదేశమున అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడిన బ్రహ్మబీజమైన *ఓంకారము*ను మనస్సులో స్మరిస్తూ, ఉచ్ఛ్వాస నిశ్శ్వాశాలను వశపరుచుకోవాలి. విషయాల వెంబడి పరుగిడే ఇంద్రియాలను బుద్ధి అనే సారధితోను, మనస్సనే పగ్గంతోను బిగబట్టి నిగ్రహించాలి. గట్టివైన కర్మబంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతునిపై నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమముగా ధ్యానించాలి. రజో, తమో గుణాలచే ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సునూ, ఆ గుణాలవలన కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి. అలా చేసిననాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతారని, వారే మోక్షం పొందుతారని శుకమహర్షి చెప్పినట్లుగా,  అప్పటికే సర్వమూ పరిత్యజించి, హృదయాంతరమున హరిని నిలిపి, మనస్సును భగవద్విలీనం చేయుటచే పరీక్షిత్తు మహారాజు మోక్షం పొందాడు మహారాజా, అని భక్తుడైన ఆ సేవకుడు చెప్పగా, తన తప్పుని రాజు గ్రహించి పశ్చత్తాపపడెను. సేవకుడు తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళగా, అప్పటికే జరిగిన విషయాలన్నీ జనుల ద్వారా తెలుసుకున్న ఆ పండితుడు ఈ భక్తోత్తముడిని సాదరంగా ఆహ్వానించి, 'నాయనా! ఈ దినమునుండి నేనే నీకు సేవకుడిని, మీరే నేటి నుండి నా గురువులు' అని రెండు చేతులను ముకుళించి నమస్కరించెను.

*ఓంకారం* గురించి మరింత వివరణ ఈ లింక్స్ నందు -
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post.html
http://smarana-bharathi.blogspot.in/2011/09/blog-post_29.html)
 

ఎప్పుడో విన్న స్మరించుకోదగ్గ ఈ కధ మరుపున పడకూడదని స్మరణ లో పోస్ట్ చేస్తున్నాను.

9, ఆగస్టు 2013, శుక్రవారం

గీతాకల్పతరువు

గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం
వేదవ్యాసవివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురమ్ /
నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి
ప్రవాళాంకితం
కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభి
ం మోక్షప్రదం జ్ఞానినామ్ //

భగవద్గీత ఓ కల్పవృక్షం. దానిని నాటినది శ్రీకృష్ణపరమాత్మ. పోషించి పెంచినది వ్యాసభగవానుడు. ఉపనిషత్తులే గీతకు బీజం. వైరాగ్య సహనములే గీతాకల్పతరువు యొక్క చిగురుటాకులు. నానాశాస్త్రములు దాని శాఖలు. శ్రీకృష్ణ పాదపద్మమునందలి పూర్ణభక్తియే దాని పుష్పం. జాతి లింగ ఆశ్రమ భేదములేక యెవ్వరు దానిని భక్తితో ఆశ్రయింతురో వారు తప్పక ముక్తులగుదురు.

ఇటువంటి కల్పతరువును ఏ ఫలం ఆశించి ఆశ్రయిస్తే ఆ ఫలం మాత్రమే సిద్ధిస్తుంది. కామ్యఫలం ఆశిస్తామో, జ్ఞానఫలం ఆశిస్తామో మన అభిమతంపై ఆధారపడి ఉంటుంది.

6, ఆగస్టు 2013, మంగళవారం

"నా ఆ ఆనందం అందరితో ....."


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' కారణముగా మరోసారి (క్రిందటి టపాలో మొదటిసారి తెలుసుకున్నది తెలిపాను) కృష్ణతత్త్వం తెలుసుకోగల్గినందుకు నా ఆనందం మరింత అధికమైంది. "నా ఆ ఆనందం అందరితో" పంచుకోవాలని ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని టపాగా పెడుతున్నాను.

ఉదయం హరిప్రియతో ముచ్చటిస్తూ, ఓ ప్రక్కకు తిరిగి నోటిలో బొటనవ్రేలు పెట్టుకుంటూ ఊ ఊ లు కొడుతున్న శ్రీ మాన్విని చూసి -
అరే, ఈమధ్య బొటనవ్రేలు నోటిలో పెట్టేసుకుంటుంది, ఇప్పుడే దీనిని మాన్పించాలి, అలవాటైతే కష్టం కదా, అయినా పిల్లలు ఎందుకు నోటిలో వ్రేలు పెట్టుకుంటారో ఏమిటో ... అన్న నా మాటలకు నవ్వి, దానికీ ఓ కధ వుంది అని, చెప్పిందిలా -
పూర్వకాలంలో సూర్యవంశంలో మాంధాత అనే రాజు తండ్రి నుండే తిన్నగా ప్రభవించాడు. మన శరీరంలో ప్రతి అవయంలో ఒక్కొక్క దేవత అధిదేవతగా ఉన్నట్లే చేతికి అధిపతిగా ఉన్న ఇంద్రుడు, పాలిచ్చేతల్లి లేనికారణముగా ఆ బిడ్డను నేను పోషిస్తానని వచ్చి, బొటనవ్రేలు ద్వారా అమృతం పిల్లవానికి చేరాలని,  'మాం - దాతా' పిల్లవాని బొటనవ్రేలును పిల్లవాని నోట్లో పెట్టాడట. అందుకేనేమో, చాలామంది పిల్లలు బొటనవ్రేలును చీకుతుంటారని అంది.
ఓహో ... కధ బాగుంది కానీ; మరి శ్రీకృష్ణుడు వటపత్రం పై శయనిస్తూ కాలిబొటనవ్రేలును నోట్లో పెట్టుకుంటూ ఓ లీలను ప్రదర్శిస్తాడు కదా, దానిలో ఏమైనా అంతరార్ధం వుందా అన్న నాప్రశ్నకు -
ఆ ... పరమాత్మ లీలలకు పరమార్ధం తప్పకుండా ఉంటుంది. మనల్ని మాయనుండి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదించే దివ్యరూపమిదని, తాతయ్యగారు చెప్పింది లీలగా జ్ఞాపకం ఉంది. 

                                                    
శ్రీకృష్ణపరమాత్మ తన యోగమాయను మార్కండేయునకు చూపించడానికి వటపత్రంపై ఎడమకాలి బొటనవ్రేలును నోటిలో పెట్టుకొని శయనిస్తున్నట్లు దర్శనమిచ్చాడు. ముందుగా వటపత్రంపైనే ఎందుకు శయనించాడో చెప్పారు. జంతువులలో గోవు ఎంత శ్రేష్టమో, చెట్లలో మఱ్ఱిచెట్టు అంత శ్రేష్ఠమైనది. మఱ్ఱిచెట్టునే వటవృక్షమని, న్యగ్రోధమని అంటారు. ఈ వృక్షముది కనీకనబడని విత్తనమట. మిగతా మొక్కల్ని నాటినట్ట్లుగా ఈ మఱ్ఱిమొక్కను ఎవరూ నాటరు. ఇది స్వయంభువంగా వెలుస్తుంది. దీనికి ఎన్నో కొమ్మలు, ఊడలు ఉండి అనేక చెట్లగుంపులా విస్తారముగా ఉంటుంది. ఈ చెట్టును చూస్తే ఈశ్వరసాదృశ్యం తేటతెల్లమౌతుంది. ఎలాగంటే అంతచెట్టు చిరువిత్తనంలో ఉన్నట్లే పరమాత్మ కూడా అణువణువులోనూ ఉన్నాడని, ఆ చెట్టు విస్తారంగా వ్యాపించినట్లే పరమాత్మ కూడా బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్నాడని, ఇది స్వయంభువంగా మొలకెత్తినట్లే పరమాత్ముడు కూడా స్వయంభువుడుగా అవతరించాడని, ఈ చెట్టుని గమనిస్తే అర్ధమౌతుంది. అందుకే దక్షిణామూర్తి మౌనంతో ఆత్మతత్త్వాన్ని వెల్లడించింది ఈ చెట్టు క్రిందనేనని అంటారు. 
అదియును కాక,  గోవు యొక్క సారం నవనీతం అయినట్లుగా, దానిని కృష్ణపరమాత్మ గ్రహించినట్లుగా వెన్నదొంగతనంలో కృష్ణతత్త్వం అర్ధం చేసుకున్నాం కదా.  చిట్టచివర వచ్చే నవనీతదశలో మాత్రమే కాదు,వటపత్రంపై ఉండండం ద్వారా,  ప్రాధమికదశయైన పత్రదశలోనూ (ఏ చెట్టుకైనా ముందు ఆకులే కదా చిగురిస్తాయి) తానున్నాని తెలియజేస్తున్నాడు. అలానే, మన శరీరంలో ఇడానాడి (దీనినే చంద్రనాడి అని అంటారు) ఎడమవైపున ఉంటుంది. ఇది జీవస్థానంకు, భౌతికప్రవృత్తికి సంకేతం. యోగులు ఈ నాడి నుండే అమృతస్రావాన్ని అనుభవిస్తారని, కృష్ణుడు తన ఎడమకాలి బొటనవ్రేలు నోటిలో పెట్టుకోవడం ద్వారా ఆ యోగస్థితిని సూచించాడని అంటారు. అలానే ప్రళయకాలంలో మార్కండేయునకు ఈ లీల చూపడంలో సమస్త సృష్టి మాయేనని, చిట్టచివరికి అంతా తనయందే లయమౌతుందని, అది గ్రహించమని జ్ఞానమార్గమును చూపించాడు. ఈ లీల ద్వారా తాను అమృతం త్రాగుతున్నట్లు కనబడినా, అతడు నిజంగా మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తూ జనన మరణ ప్రవాహమునుండి మనల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అందువల్లనే "ముకుంద", ముక్తిప్రదాత అని స్తుతింపబడుతున్నాడు. అంతే కాకుండా బాలరూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా పిల్లల హృదయంలాంటి హృదయాన్ని కల్గియుండి, మనస్సును పాలమాదిరిగా స్వచ్ఛంగా ఉంచుకుంటే, మన మనస్సనే పాలసముద్రంపై భక్తిత్వం అనే వటపత్రం తేలగా, దానిపై క్షీరాబ్ధిసాయిలా శయనిస్తూ మనల్ని తనలో లీనం చేసుకుంటాడన్న సంకేతముందని తనకి జ్ఞాపకం వున్నంతవరకు వటపత్రశాయి గురించి వివరించిన
నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
తన చిరుచేష్టల ద్వారా ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.

కరారవిందేన పదారవిందం
ముఖారేవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
వటపత్రంపై శాయనిస్తున్న, పద్మంవంటి కాలిబొటనవ్రేలును, పద్మంవంటి చేతితో పట్టుకొని, పద్మంవంటి ముఖంలో పెట్టుకున్న ముకుందున్ని మనసార స్మరిస్తున్నాను.


29, జులై 2013, సోమవారం

మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' తో కాసేపు కబుర్లు చెప్పడానికి ఎప్పటిలానే ఈరోజు కూడా నా స్నేహితురాలు హరిప్రియ విచ్చేసింది.
ఓ ... అసలు విషయం చెప్పడం మరిచా -
చిట్టితల్లి 'శ్రీ మాన్వి' నా ప్రియమైన మనుమరాలు. మే నెల పంతొమ్మిదవ తారీఖున జననం. అమ్మని అయినప్పటికంటే అమ్మమ్మని అయినప్పుడానందం అధికంగా అద్భుతంగా  ఉంది. అదేమిటో గానీ, అన్ని బందాలకంటే ఈ అనుబంధం అపురూపంగా అద్వితీయంగా అనిర్వచనీయంగా ఉంది. 
రోజూ వచ్చి, శ్రీ మాన్వితో కాసేపు గడిపే నా స్నేహితురాలు ఈరోజూ వచ్చింది. తను వచ్చిన కాసేపటికి చిట్టితల్లికి వెక్కిళ్ళు రాగా -
'ఓహో! శ్రీ మాన్వి! దొంగతనంగా వెన్న తిన్నావా? ఏం తిన్నవురా మాన్వీ ... వెక్కిళ్ళు వస్తున్నాయి?' అని అంటుంటే -
ఎందుకలా అంటుందో అర్ధంకాక, తనని అదేమిటట అని ప్రశ్నించగా -
సరైన కారణం తెలియదు గానీ, పిల్లలకు వెక్కిళ్ళు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇలా అనేవారు, అని చెప్తూ ... భారతీ! నీ చిట్టితల్లి ఎవరింటికెళ్ళి "చిన్నికృష్ణు"నిలా వెన్న దొంగతనం చేసిందంటావ్? అని అడుగుతూ ... నీకు తెలుసా ... చిన్నికృష్ణుని చోరత్వంలో అంతరార్ధం? అని ప్రశ్నించింది. 

                              


     నవనీత చోరత్వం - అంతరార్ధం
 








ఏమిటేమిటీ ... చోరత్వంలో కూడా ఆధ్యాత్మిక అంతరార్ధం ఉందా? తెలియదు, చెప్పమని నేనడగగా; తనకి తెలిసింది చెప్పిందిలా -
శ్రీకృష్ణుడు గీత ద్వారా జ్ఞానాన్ని ప్రబోధించడమే కాదు, తన బాల్యచేష్టలద్వారా వేదాంత రహస్యాలను ప్రదర్శించేవాడని మా తాతయ్యగారు చెప్తుండేవారు. ఓసారి ఈ నవనీత చోరత్వం గురించి చెప్పారు. 

                      
నవనీతం అంటే వెన్న. ముందుగా ఈ వెన్న ఎలా తయారౌతుందో గమనించమన్నారు. గోవు నుండి ఓ కుండలోనికి పాలు తీసి, బాగా కాచి, పొంగినపాలను చల్లార్చి, అందులో కాస్తా మజ్జిగ లేదా పెరుగును చేర్చి, పెరుగయ్యాక దానిని కవ్వంతో చిలకగా వెన్న వస్తుంది కదా. అలా వచ్చిన వెన్నను కృష్ణ పరమాత్మ దొంగలించాడు అంటే, అందులో ఓ పరమార్ధం ఉంది.
గోవు సత్త్వబుద్ధికి ప్రతీక. సాధకుడు గోవులాంటివాడు. కుండ సాధకుని హృదయం. సాధకుని మనస్సు స్వచ్ఛమైన తెల్లని పాలవంటిది. భక్తిత్వ తపనతో సాధకుని పాలవంటి శుద్ధమనస్సు వేడి ఎక్కగా, పాలమాదిరిగా పొంగిన మనస్సు తీవ్రసాధనతో చల్లబడి(అణిగి)నప్పుడు  కాస్తంత ధ్యానమును తోడుగా చేర్చితే, ప్రవాహశీలం లేని పెరుగులా గట్టిగా ముద్దగా తయారౌతుంది. ఇప్పుడు ఆ పెరుగు ఉన్న కుండ(హృదయం)లో కవ్వం పెట్టి చిలకడానికి కవ్వం కావాలి. కవ్వం, కవ్వంకు కట్టిన త్రాడు సాధనాలు. కవ్వం అంటే విచారణ. {అంటే శోధన, జ్ఞానవిచారణ (శ్రీరమణులు చెప్పినట్లు), తత్త్వవిచారణ}. త్రాడు అంటే ఏకాగ్రత. ఈ రెండింటి సాయంతో చిలకగా, చిలకగా {మధించగా మధించగా(అంతర్మధనం)
}, అప్పుడు పూర్ణత్వం అనేది వెన్న వస్తుంది. అదే నవనీతం. అలా నవనీతంతో మన హృదయం పూర్ణత్వం నింపుకున్నప్పుడు మనకు తెలియకుండనే శ్రీకృష్ణుడు వచ్చి అపహరిస్తాడు. ఇక్కడ ఓ సందేహం రావచ్చు. శ్రీకృష్ణుడుకి వెన్న కరువా? అయినను గోపికలకి కృష్ణుడంటే అమితప్రేమ కదా, వెన్నని అడిగితే గోపికలు ఇవ్వరా?  దానికి దొంగతనం చేయడం ఎందుకు? ఇప్పటికీ వెన్నదొంగ అని అనిపించుకోవడం ఎందుకు? అన్న  సందేహం రావచ్చు. కృష్ణుడు అడగడం, మనమివ్వడం అంటే అడుగేవాడు ఒకడు, ఇచ్చేవాడు ఒకడు ఉన్నట్లే. మనమివ్వడం అంటే ఇవ్వడానికి 'నేను' అన్న ఒకరున్నట్లే. 'నేను' అన్న భావన ఉంటె అది పూర్ణత్వం కాదు. ద్వైతం లేనిస్థితే పూర్ణత్వస్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండనే పరమాత్మ మనలో ప్రవేశించి తనలో ఐక్యం చేసుకుంటాడు. అపహరించడం అంటే ఇదే.
అటువంటి పూర్ణత్వస్థితికి మనం రాగలగాలి. అప్పుడు మనం సంసారంలో వున్నను పూర్ణత్వస్థితిలో ఉన్నట్లే. ఎలాగంటే, పాలు నీళ్ళలో కలుస్తుంది. కానీ; వెన్న నీటిలో తేలుతుంది. అట్లాగే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం సంసారంలో ఉన్నా, దాన్ని అంటక పూర్ణత్వస్థితిలో ఉన్నట్లే.
అలానే ప్రతీ ఇంటికి వెళ్లి కుండలు బ్రద్ధలు కొట్టడం అంటే దానికీ ఓ అంతరార్ధం వుంది. మనకున్నది దాచుకోవడానికి కాదు, ఉన్నది తీసి లేనివారికి సహాయం చేయాలనే సామాన్య సందేశంతో పాటు, పూర్ణత్వస్థితిలో పొందిన జ్ఞానాన్ని కుండలాంటి హృదయంలోనే దాచుకోకుండా అందరికీ పంచిపెట్టాలనే ధార్మిక అర్ధముందని తాతయ్యగారు చెప్పారు అని తను వివరించింది.
ఇంత మంచి విషయం వివరించిన నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన నా ముద్దుల మనుమరాలికి శుభాశీస్సులు.


13, ఏప్రిల్ 2013, శనివారం

నా రామయ్య జననం ... కళ్యాణం!

                                  శ్రీరామ జయరామ జయజయ రామ 
రామజననం

మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే /
పునర్వస్వ్రక్షసహితే  క్షసహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే //

చైత్రమాసం శుక్లపక్షమున నవమినాడు, శుభకరమగు కర్కాటక లగ్నమందు, పునర్వసు నక్షత్రమున ఐదుగ్రహములు ఉచ్ఛస్థానములో యుండగా, సూర్యుడు మేషరాశి యందుండగా మధ్యానకాలమందు సనాతనుడగు పరమాత్మ కౌసల్యకు ఆవిర్భవించెను.


యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞానవిప్లవే /
తం గురు: ప్రాహ రామేతి రమణాద్రామ ఇత్యపి //
                                                                                   
జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోయిన తరువాత, మునులు ఎవరియందు రమింతురో, ఎవరు తన సౌందర్యంచే భక్తజనుల చిత్తములను ఆనందింపచేయునో అతనికి "రాముడ"ని గురువు వశిష్టుడు పేరు పెట్టెను.

భరణాద్భరతో నామ లక్ష్మణం లక్షణాన్వితమ్ /

శత్రుఘ్నం శత్రుహన్తారమేవం గురురభాషత //


జగత్తును భరించినవాడు కావున రెండవ పుత్రునకు (కైకయి కి పుట్టినవానికి) "భరతుడ"ని, (ఇక సుమిత్రకు పుట్టిన ఇద్దరికి) సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి "లక్ష్మణుడ"ని, శత్రుహంత యగుటచే నాల్గవ వానికి "శత్రుఘ్ననుడ"ని వశిష్టులవారు పేర్లు పెట్టిరి. 




 రామకళ్యాణం
తమ రాజ్యమునకు వచ్చిన విశ్వామిత్రుడును, రామలక్ష్మణులును జనకుడు సాదరముగా స్వాగతించగా -
జనక మహారాజా! నీ వద్దనున్న శివధనస్సును చూడాలని రామలక్ష్మణులు అభిలాషించుచున్నారు. ఓసారి ఆ ధనస్సును వారికి చూపమని విశ్వామిత్రుడు అనగా -
అంతట జనక మహారాజు, జనక వంశీయులకు దేవతలు ప్రసాదించిన శివధనస్సును ఎవరు ఎక్కిపెడితే వారికే సీతనిచ్చి వివాహం చేయాలన్న తన సంకల్పమును విశ్వామిత్రునికి తెలిపి,  ధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించగా -
జనకుని ఆదేశంతో బలిష్టులైన ఐదువేలమంది పురుషులు ధనుస్సు ఉంచిన పెట్టెను లాక్కొని రాగా -
గురువాజ్ఞ తీసుకొని, అందరూ ఉత్కంఠతో చూస్తుండగా, ధనస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగా, విరిగిపోయిన ధనస్సును సర్వులూ ఆశ్చర్యానందాలతో వీక్షించగా -



 
తన ప్రతిజ్ఞ మేరకు తన ప్రాణతుల్యమైన పుత్రికను రామునికి ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు అనగా-
విశ్వామిత్రుని సూచన మేరకు జరిగిన విషయలాను వివరిస్తూ ఆహ్వానపత్రికను దూత ద్వారా అయోధ్యరాజు దశరధునికి పంపగా -
అంతట దశరధుడు ఎంతో సంతోషంతో వసిష్ఠ వామదేవాదులతో, మంత్రులతో, చతురంగబలసైన్యంతో విదేహరాజ్యమును చేరగా -
దశరధుని కులగురువు వశిష్టుడు దశరధుని వంశవృక్షమును జనకునికి తెలపగా, జనకుడు తన వంశవృక్షమును దశరధునికి వివరించగా -
అనంతరం సీతారాముల కళ్యాణమునకు అంతా సన్నద్ధమవ్వగా -
అంగరంగవైభవముగా సీతారాముల వివాహం జరిగినది.




సీతారాముల వివాహం జరిగినరోజు సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, కర్కాటక లగ్నం అని పౌరాణిక కధనం. అయితే భగవంతుడు ఏ అవతారం ఏరోజున దాల్చితే, ఆ రోజునే ఆయన కళ్యాణం జరిపించాలన్న ఆగమశాస్త్రవచనం ప్రకారం; శ్రీరామనవమి నాడే రాముని జన్మదిన వేడుకలతోపాటు సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా, భక్తి పారవశ్యాలతో జరుపుకుంటున్నాం.

ఈ నెల 19 న "శ్రీరామ నవమి". 

 

7, ఏప్రిల్ 2013, ఆదివారం

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత!

"అచంద్రార్కం యావత్ చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్ఠతి మేదిని" అని వాల్మికి మహర్షి అన్నట్లు సూర్యచంద్రులు వున్నంతకాలం రామాయణం మానవాళిని తరింపజేస్తుంది.

రామాయణం అనే మహాకావ్యాన్ని ఎవరు ఎన్నివిధాల చెప్పినా, ఎవరు ఎన్నిసార్లు రామకధను కొనియాడినా, ఎవరు ఎన్నిసార్లు రామనామ మహత్యమును కీర్తించిన, ఎవరు ఎన్నిసార్లు రామతత్వాన్ని ప్రవచించిన, ఎవరు ఎన్నివిధాల మధించి అమృతరసాన్ని గ్రోలిన, ఎవరు ఎంతగా రామామృతాన్ని ఆస్వాదించిన, ఎవరు దీని సారాన్ని గ్రహించి శ్లాఘించిన .....  తనివి తీరని తపన రామభక్తులది.

రామాయణంలో బయటకు కనిపించనటువంటి ఆధ్యాత్మికమైన నిగూఢసత్యాలు అనేకం వున్నాయి. అందులో ఒకటి - జనకుడు సీతారాములకళ్యాణఘట్టమందు కన్యాదానం చేస్తూ చెప్పిన ధర్మాచరణ ఉపదేశం.
ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||

ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది.
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీతా' ఇదిగో సీత. నా పుత్రిక. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీ ధర్మపత్ని. ఈమె పతివ్రతయై, ఎల్లవేళలా సహధర్మచారిణిలా నిన్ను అనుసరిస్తుంది.

అయితే; ఈ శ్లోకం గురించి కొందరు చలోక్తులతో వివరిస్తూ చెప్పినవి ... అక్కడక్కడ, అప్పుడప్పుడూ విన్నవీ, చదివినవీ ... నాకు అర్ధమయినంతవరకు ఈ టపాలో పెడుతున్నాను.

రామా! ఈమె ఎవరో కాదు, 'ఇయం సీతా' ఈమె సీత, నీ భార్యయే, నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో, ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించినది. ఈమెను నీవిప్పుడు స్వీకరిస్తేనే తప్ప, లోకానికి మంచి జరగదు.  కావున నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు, నీ ధర్మాచరణలో నీ నీడవలె అనువర్తిస్తుంది.

ఎటు చూసిన దివ్యప్రకాశంతో శోబిల్లుచున్న సీతే కనబడడంతో విభ్రాంతికి లోనయి అటుఇటు చూస్తున్న రాముని అవస్థను గమనించిన జనకుడు, రామా!  నీవే 'పుంసాం మోహనరూపాయ' అని, నీవే సుందరుడివి అని అనుకుంటున్నావేమో... 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. నా కుమార్తె. ఈమె పాణిని గ్రహించి, ధర్మపత్నిని చేసుకో. ధర్మాచరణలో నిను అనువర్తిస్తుంది.

రామచంద్రా! 'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. మీరు లక్ష్మీనారాయణులు. లోక కళ్యాణార్ధమై ఈ మానవజన్మ మీరు ఎత్తడానికి ఇలా విడివడినారు. ఈమె చేతిని అందుకొని, ఈమెని నీ ధర్మపత్నిని చేసుకొని, ఇక ధర్మస్థాపన చేయు రామా. నీవు ఏ కారణంచే ఈ రూపంలో అవతరించావో ఆ పని పూర్తిచేయు. నీవు చేసే ఆ ధర్మస్థాపనలో నీ నీడవలె నిను అనుకరించి, సహకరిస్తుంది.

సీత సిగ్గుతో తనచేతిని పట్టుకోమని తనకు తానుగా చెయ్యి చాపలేక సిగ్గుపడడం, అలానే రామచంద్రమూర్తి కూడా, తనకు తానుగా చెయ్యి చాచి సీత చేతిని పట్టుకోవడానికి, పెండ్లికాకముందే ఇంత తొందరా? ఎంత రసికుడయ్యా రామచంద్రుడు అని ఎదురుగా కూర్చొని కల్యాణం తిలకిస్తున్నవారు భావింతురని బిడియపడడం గమనించిన జనకుడు, తానే సీత చేతిని రాముని వైపుకు త్రోస్తూ, 'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె, ఈమె చేతిని గ్రహించి నీ ధర్మపత్నిని చేసుకో, నిను నీడలా అనుకరిస్తుంది.

రామయ్యా! ఎదురుగా ఉన్న సీత నీకు కానరాలేదని కాదయ్యా... 'ఇయం సీతా' ఈమె సీత అని చెప్తున్నది; నీవు శివధనస్సును ఎక్కిపెట్టినప్పుడే అర్ధమైంది - నీవు విష్ణువే అని! నీ ధర్మపత్నియైన లక్ష్మీదేవియే ఈ సీత అని నీవు గ్రహించాలనే 'ఇయం సీతా' అని చెప్తున్నానయ్యా. ఈమె చేతిని అందుకొని నీ ధర్మపత్నిని చేసుకో, నిన్ను నీడలా అనుగమిస్తుంది.

'ఇయం సీతా' ఇదిగో ఈమె సీత. సీతా ... ఇదేం పేరు అని యెంచకు. ఈమె నాగటిచాలుకి తగిలి, తనకు తానుగా పైకి లేచిన బాలిక. ఈమె అయోనిజ. ఈమె సీత అని, నాకు కూతురు అవుతుందని అశరీరవాణి చెప్పింది.  ఏ ఫలాపేక్ష లేక, కర్షకునికి భూమాత ఎట్లు ఫలములను కలిగించునో, అట్లే; నా సీత కూడా ఏ ఫలాపేక్ష ఆశించక, నీ ధర్మస్థాపనలో నీకు సహకరిస్తుంది. తల్లి భూదేవి వలెనె సహనంతో నీకు సహకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవీమెను నీ ధర్మపత్నిగా గ్రహించు.

'ఇయం సీతా' ఈమె సీత, నా కుమార్తె. నీకు సహధర్మచారిణి. నీతో కలసి ధర్మమూ ఆచరిస్తుంది. నీవు చేసే ధర్మస్థాపనలో నీకు తోడై యుండి, నీ ధర్మకార్యం సఫలమగునట్లు చూస్తుంది. నీవు ఎట్లు నీ తండ్రి వాక్యం శిరసావహించి పాలించుచున్నావో, ఈమెయూ నీ వాక్యం పాలించి, నీవు నిర్వహించు ధర్మకార్యములన్నింటిలో నీకు తోడై యుండును.

'ఇయం సీతా' ఈమె సీత. పరమాత్మవైన నీకు సహధర్మచారిణి. నీ సహధర్మచారిత్వమీమెకు సహజసిద్ధం. ధర్మఉద్ధరణకై నీవు చేయు కార్యములయందు సహధర్మచారిణియై నీకు సహకరించడానికి 'సీత'లా అవతరించిన ఈమె పరమాత్మానుగ్రహంతో నా కుమార్తె. నీ ధర్మచారణలో తోడై వుండే ఈమెను నీవు స్వీకరించి, ధర్మస్థాపన చేయు.

మన హిందూ వివాహపద్ధతిలో వధూవరులిద్దరూ గృహస్థాశ్రమంలో ఆచరించవలసిన ధర్మములలో ధర్మానికే ప్రముఖత్వం ఉంది. వివాహమనేది ప్రధానంగా ధర్మాచరణకొరకై నియమింపబడినది. అర్ధకామాలకంటే ధర్మమే ప్రధానమైనది కావున భార్యను ధర్మపత్ని అంటారు.
వివాహఘట్టమందు -
'నాయనా! ఈమె నా కుమార్తె. ఈమెను నీ భార్యగా స్వీకరించు. నీవు చేసే సకల ధర్మాచరణలయందు సహధర్మచారిణిలా నిన్ను అనువర్తిస్తుంది. ఇక నా కుమార్తె చేతిని అందుకుని, ప్రేమగా చూసుకో' అని వరునికీ,
అలానే వధువునకు - 'తల్లీ! నీవు నీ భర్తని ఛాయలా వెంబడించు. నీ భర్తకు నీడలా వెన్నంటే ఉండు, అతని పనుల యందు సహకరించు' .....
అన్న సందేశం జనకునిది. జనకుడు అంటే తండ్రి అని అర్ధం. జనకుడు సీతకు మాత్రమే తండ్రిగా కాదు, సర్వులకు తండ్రే, ముఖ్యంగా వధువులందరకు ఆయన తండ్రే. ఆయన కన్యాదానం చేస్తూ చెప్పిన పై శ్లోకంలో సందేశం అందరు వధూవరులకు ఆచరణీయం.

25, మార్చి 2013, సోమవారం

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !




రెండురోజుల క్రితం - 
హరిప్రియ (స్నేహితురాలు) నుండి ఫోన్ ... 'నేనిప్పుడు ట్రైన్లో ఉన్నాను, చిన్నమ్మ (పిన్ని) దగ్గరకు వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. ఓకే నా' !
నిన్న ఉదయం -
తననుండి మరల ఫోన్ ... 'ఇప్పుడే ఇంటికి వచ్చాను, వీలైతే రా, నీతో ఓ విషయం చెప్పాలి.....'!
నిన్న సాయంత్రం తనింటికి వెళ్లగా, తను చెప్పిన విషయం ఏమిటంటే -
ఈ మధ్యనే తన మరదలకి పాప పుట్టింది. పేరు సన్వి. పెద్దపాప పేరు సమన్వి. రెండుసార్లు సిజేరియన్ కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అదే వారి చిన్నమ్మకు కోపకారణమైంది. ఎంతో సఖ్యతగా ఉండే అత్తాకోడళ్ళ మధ్య ఈ కారణంగా చిరు స్పర్ధ. ఎవరికైన ఒక్కపుత్ర సంతానమైన ఉండాలని, పాపని చూడడానికి ఎవరు వచ్చినా, నా మాట వినలేదు, పున్నామ నరకంనుండి రక్షించే పుత్ర సంతానం లేదని అనడం ... ఆ మాటలకు బాధపడి మరదలు ఫోన్ చేస్తే ఊరు వెళ్లి, చిన్నమ్మకు కౌన్సిలింగ్ చేసి వచ్చాను అని!
ఓహో ... ఏమని కౌన్సిలింగ్ ఇచ్చావో చెప్పుమరి, అని అడగగా -
ఏముందీ, నాతో కూడా చిన్నమ్మ అవే మాటలంది. ప్రియమ్మా! నీవైనా చెప్పు, తల్లితండ్రులను ఉద్ధరించేది కొడుకే కదమ్మా, పుత్రుడే కదా పున్నామ నరకంనుండి రక్షించేది, కొడుకు వలనే కదమ్మా మోక్షమని శాస్త్రం చెప్తుంది, ఇదే నేనంటున్నానని మీ తమ్ముడు, మరదలు నన్ను తప్పు పడుతున్నారు, నేను అన్నదాంట్లో తప్పేం ఉంది? అని అమాయకంగా ప్రశ్నిస్తున్న చిన్నమ్మ మీద కొంచెం కోపం, జాలి కలగగా, ఓపిగ్గా చెప్పాను, అమ్మ ఆలోచన తప్పని!
తనేం చెప్పిందో తన మాటల్లోనే -
"అపుత్రస్య గతిర్నాస్తి' అన్న మాట శాస్త్రంలో ఉన్నమాట నిజమే గానీ, అమ్మా! ఆ మాట ఈ కాలానికి చెందినది కాదు. కొన్నివేల సంవత్సారాలు క్రితం, అప్పటి రాజులు తమ రాజ్యాన్ని పరిపాలించినంతకాలం పరిపాలించి, అటుపై పుత్రునికి రాజ్యాధికారమును అప్పగించి, తమ తమ జన్మలను తామే ఉద్ధరించుకోవాలని అన్నింటిని పరిత్యజించి వానప్రస్థం స్వీకరించేవారు. అటువంటివారు పుత్రుడు జన్మిస్తే కొంతకాలానికి వారికి రాజ్యపరిపాలన అప్పగించి, నిశ్చింతగా తపస్సు చేసుకోవాలని పుత్రున్ని కోరుకునేవారు. అప్పటి కాలధర్మప్రకారం పుత్రుడు ఆవశ్యకమై శాస్త్రంలో చెప్పిన మాట అది. అమ్మా! పుత్రులు లేనివారికి మోక్షం లేనిచో, అసలు భార్యాబిడ్డలే లేని నారద, శుక, సనక, సనందనాది మహర్షులు, శంకరాచార్యులు, షిర్డీ బాబా, రమణులు మొదలగువారికి మోక్షసిద్ధి ఉండకూడదు కదా! అమ్మా! నీకు షుగర్ ఉందని నీవు మందు వేసుకోకుండా తమ్ముడు వేసుకుంటే నీకు షుగర్ తగ్గుతుందా? నీకు ఆకలి వేసినప్పుడు తమ్ముడు భోజనం చేస్తే నీ ఆకలి తీరిపోతుందా? అలానే నీ ప్రారబ్ధకర్మలను నీవే క్షయం చేసుకొని, మోక్షసిద్ధిని పొందాలే తప్ప, పుత్రుడిని కన్నంతమాత్రమున రాదమ్మా. అయితే అమ్మా, ఎంత దుష్టులైన పుత్రున్ని కంటే చాలు, మోక్షాన్ని పొందేస్తారా? మోక్షానికి అర్హత పుత్రున్ని కనడమేనా? "అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం" ఎవరు చేసిన కర్మఫలితం వారికే సిద్ధిస్తుందని శాస్త్రవచనం ఉంది కదా. మనం చేసుకున్న పుణ్యకర్మలు, సాధన బట్టే మోక్షసిద్ధి వస్తుందమ్మా. తల్లితండ్రులను ప్రేమతో చూసుకున్న బిడ్డలు, తాముచేసిన ఈ పుణ్యకర్మవలన తాము ఉద్ధరింపబడతారు. అలానే, తమను ఆత్మీయంగా చూసుకుంటూ, తాముచేయు పుణ్యకర్మలకు సహకరించిన సంతానం వలన తల్లితండ్రులు కొంత ఉద్ధరింపబడతారన్న మాట వాస్తవమే అయినను, అంతమాత్రమునే మోక్షం రాదు. ఇక, పితరుల సౌఖ్యం కొరకు ఆచరించే పితృకర్మలు (శ్రాద్ధములు మొ...) ద్వారా పితరులకు కొంత సౌఖ్యం, పిల్లలకు పితృదేవతలనుగ్రహం దొరుకుతుందే తప్ప, అంతమాత్రమున మోక్షం రాదని చెప్పా!

అబ్బా ... ఇంత చక్కగా ఎలా చెప్పావ్ అని అనగా, 'నీ సాంగత్యంలో అలవడిన పుస్తక పరిజ్ఞానంతో' అన్న తన మాటలింటూ, హృదయపూర్వకంగా ఇలా అనుకున్నాను -

"ఆహా ... నా నెచ్చలి బహు బుద్ధిశాలి" !
                               

23, మార్చి 2013, శనివారం

నా జీవనగమనంలో ..... శ్రీ బుద్ధ భగవాన్!



సకల జనావళిని అజ్ఞానంధకారంలోంచి జ్ఞానకాంతిలోకి తీసుకురావడమునే తన జీవిత ఆశయంగా పెట్టుకొని, 'సిద్ధి పొందుగోరువారికి నేను రక్షకుడును, ముక్తి కోరువారికి నేను మార్గదర్శకుడును, దుర్వార సంసార సాగరాన్ని దాటదలిచినవారికి నేను సేతు బంధనమును, నిర్లక్ష్యం చేయబడ్డవారికి నేను విశ్రమించు పాన్పును, నా సన్నిధి కోరువారికి నేను మిత్రుడును' అని భావించి, సమ్యక్ సంబుద్ధిని, నిర్వాణ పధం ప్రభోదములను చేసిన అనంతకారుణ్యమూర్తి - "శ్రీ బుద్ధ భగవాన్'.
నాకు ప్రశాంతజీవనం అలవడడానికి, నన్ను నేను చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి దోహదపడిన
బుద్ధభగవాన్ బోధలలో కొన్ని -
                                                  
కర్మ చేయకుండా ఎవరూ ఉండరు, ఉండలేరు. ప్రతీ కర్మకు ఫలితం వుంటుంది. కర్మకు కారణం వున్నంతవరకు, దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. కర్మలు మూడు విధములు. అవి కాయక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ. కర్మ బయటనుండి వచ్చేది కాదు. ఏ దైవం చేతనో అది మన మీద విధింపబడేది కాదు. అది మన స్వభావం వలనే జరుగుతుంది. మన మానసిక అలవాట్లు, అభ్యాసాలు, ఊహలు, భావాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, సంబంధాలు, ఆపేక్షలు, కోర్కెలు, ఇష్టాలు ... వీటి ఫలితమే కర్మ. మనగతమంతా కర్మ ఫలితమే, ఈ కర్మే మన వర్తమానాన్ని ఏర్పాటు చేస్తుంది గనుక, వర్తమాన జీవితం కర్మలచేత బంధింపబడి యుంటుంది. వర్తమానంలో చేసే కర్మల ఫలితమే భవిష్యత్తులో తటస్థపడుతుంది. ఆ ఫలితాలే భవిష్యత్తులో మన స్థితిగతుల మీద తమ ప్రభావాన్ని చూపుతాయి. కర్మలలో వ్యత్యాసం వలనే మనుష్యులందరూ ఒకే విధంగా జీవించలేరు. కానీ, నిష్కామముతో కర్మలాచరించే వారిని ఏ కర్మఫలితమూ బంధించదు. కర్మ కాంక్షతో చేసినప్పుడే అది బంధహేతువు అవుతుంది. అది మనోమాయకు, దుష్కర్మకు దారి తీస్తుంది. తత్ఫలితమే దుఃఖం. అందుకే మనం సదా సత్కర్మాచరణే  గావించాలి.
                              
             * * *
మనసే మనిషిని బద్ధున్ని లేదా బుద్ధున్ని చేస్తుంది.
                              
             * * *
ధర్మమార్గం, సమదృష్టి, దృఢసంకల్పం, సత్కర్మాచరణ, మితభాషణ, సహజీవనం ఇవే సత్యప్రాప్తికి సాధనాలు.
భోగభాగ్యాలపై, సుఖాలపై వాంఛలేకుండా, మనోప్రక్షాళనం చేసుకొని స్వధర్మంలో పయనించాలి. విషయాలు విషం వంటివి. విషయవాసనలనుంచి విరమణ వలన మనస్సు నిర్మలం, నిశ్చలం అవుతుంది. నీ చీకటిని నువ్వే పారద్రోలుకునేందుకు, నీ సంరక్షణ బాధ్యత నీకు నువ్వే స్వయంగా తీసుకునేందుకు, నీకు నువ్వే జ్యోతిగా నిలిచి వెలిగేందుకు ... బయట దేనితోను సంబంధం పెట్టుకోక, దేన్నీ ఆశ్రయించక, అనుకరించక, అనుసరించక; నీలోనే ఆ ఆశ్రయమో, రక్షణో తీసుకో!
                              
          * * *
తనను తాను తెలుసుకుంటే, ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. తనని తాను, తాను తెలుసుకోక, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. ప్రవర్తన వినయంగా వుండేకొద్దీ మేలు అధికంగా, బహుముఖంగా వుంటుంది. దానికి సోమరితనం పనికిరాదు, కాలం వృధా చేయకూడదు, వర్తమానంలో జీవించాలి.
                              
          * * *
ధ్యానం అంటే - నిజజీవితం నుండి పలాయనం కాదు, నిజజీవితం లోకి ప్రవేశం.
ధ్యానం అంటే - ఒక అనుభవం కాదు, ఆ క్షణంలో సాక్షికి ఎరుకలో వుండటం.
ధ్యానం అంటే - సంకల్పరహిత స్థితి. అకర్మ స్థితి.
మనసు ఎక్కడ ఎప్పుడు అంతం అవుతుందో, అప్పుడు అక్కడ ధ్యానం ఆరంభమౌతుంది.
                              
            * * *
జన్మ ఒక అల లాంటిది. అది తిరిగి మహాసముద్రంలో కలిసి, మరో అలలా పైకి లేస్తుంది. అవిరామంగా, అనంతముగా జననమరణాలు రెండూ మానవజీవితంలో ఎడతెగకుండా అలలు మాదిరిగా వస్తూ పోతూ ఉంటాయి. ఆ జీవన ప్రవాహం అవిచ్ఛన్నంగా సాగిపోతూ వుంటుంది. 'అజ్ఞానం' జీవితంలో పేరుకుపోయినంతకాలం జననమరణాలు తప్పవు.అజ్ఞానం పోయి స్వస్వరూప జ్ఞానం కలిగితే పునర్జన్మలు ఉండవు. "నేను" అనే అహంభావం వుంటే, కోర్కె కలగడం సహజం. ఆ కోర్కె వలన కర్మ చేయడం సహజం. కోర్కె ఆగి, స్వస్వరూప జ్ఞానం కలిగిన క్షణమునే జీవనసాఫల్యత!
                              
          * * *
దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ... ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి... పరీక్షించుకోవాలి... పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి. ఇదే 'అంతర్వీక్షణ'.
                              
         * * *
జీవితం సత్యాన్వేషణతో సాగాలి గానీ, కోర్కెలతో కాదు.
                              
         * * *
ఇతరుల మాటకో, భావానికో, అభిప్రాయానికో ... దేనికో ఒకదానికి నువ్వు కోప్పడి, బాధపడితే అది నీ దుర్భలత్వం. వారు మనస్సుతో గాక, స్వేచ్ఛగా అనాలోచితంగా అనినా, చేసినా ... నువ్వు దానికి ప్రతిస్పందించి, ప్రతిక్రియ చేయడం అది నీ మనోదాస్యం. ఇది తగదు.
                              
        * * *
దుఃఖరహితంగా జీవించాలంటే, విషయలోలత్వం కోర్కెలు స్వార్ధచింతన పూర్తిగా నశించాలి. ఇందుకు అష్టాంగ సూత్రాలును అనుసరించాలి. అవి - సరైన ఆలోచన, సదవగాహన, నిర్మల మనస్సు, సత్కర్మ, సరైన యత్నం, సత్ప్రవర్తన, బుద్ధిసూక్ష్మత, ఏకాగ్రత.
                              
       * * *
మీరు దేనిమీద ఆధారపడక, మీ కాళ్ళమీద మీరు నిలబడండి. ప్రార్ధించి, బేరమాడినంతమాత్రాన పాపపరిహారం కాదు. శీలం, సమాధి, ప్రజ్ఞ అనే మూడూ జీవితంలో ముఖ్యంగా అలవర్చుకోవాలి.
శీలమంటే పవిత్ర అలోచనాలు, సమాధి అంటే సరైన ఏకాగ్రత, ప్రజ్ఞ అంటే సంపూర్ణ ఎరుక.
                              
       * * *
ధర్మ శబ్దం విపులార్ధం కలది. అది గంభీరమైనది. కేవలం భాషా పాండిత్యం వాళ్ళ అది తెలిసే సంగతి కాదు. అచంచలమైన ధర్మనిష్ఠ, ధర్మనిరతి, సత్యవంతమైన నిర్మలమైన అంతరంగం, సాత్విక ప్రవృత్తి, శమం (అంతరింద్రియ నిగ్రహం), దమం (బాహ్యఇంద్రియ నిగ్రహం), భూతదయ, ఓర్పు, నమ్రత దానికి అవసరం. అప్పుడే ధర్మ స్వరూపాన్ని దర్శించగలరు.
                              
      * * *
నదీ ప్రవాహంలో అనేక వస్తువులు, చెత్త చెదారం అంతా, అన్నీ కొట్టుకుపోతాయి. ఏవో రెండు వస్తువులు ఆ ప్రవాహంలో కలుసుకొని, కొంతదూరం కలిసి ప్రయాణించి, ప్రవాహతాకిడికి ఎక్కడో విడిపోతాయి. సంసారంలో ఈ జీవులస్థితి ఆ విధంగానే వుంటుంది. గతంలో ఎక్కడెక్కడో వున్నవారో, వచ్చి ఒకచోట చేరి, ఒక కుటుంబంగా వుండి, కొంతకాలం తర్వాత తిరిగి ఎవరిదారినవారు పోతారు. కాబట్టి విజ్ఞులగువారు ఇట్టి సంయోగ వియోగాలకు బాధపడరు.
                              
      * * *
ఈ ప్రపంచంలో లాభనష్టాలు, దూషణ భూషణలు, కష్టసుఖాలు, బాధా సంతోషాలు ఎప్పుడూ వుండేవే. వివేకులు వాటిని నిగ్రహించుకోవాలి. అవి ఎట్లా వస్తాయో, అట్లానే పోతాయి.
                              
      * * *
పాపం చేయకపోవుటయే 'పుణ్యం'.
                              
      * * *
జీవితంలో ఏ విషయంలోనైనా సరే 'అతి'ని వదలాలి. మధ్యేమార్గం అవలంభించాలి. ఆ మార్గం జ్ఞానవంతుల్ని చేస్తుంది. నిర్వాణస్థితికి చేరుస్తుంది. ఈ స్థితిని పొందడానికి పది సంకెళ్ళుతో కూడిన భవచక్రమును దాటాలి. ఆ పది సంకెళ్ళు ఏమిటంటే - 1. అహాన్ని ఆత్మగా భావించరాదు. 2. ధర్మం విషయంలో సంశయం పనికిరాదు. 3. కర్మాచరణ విషయంలో మూఢఆచారాలు పోవాలి. 4. విషయ వికారాల్ని జయించాలి. 5. సమత్వం వుండాలి. 6. ప్రాపంచికత యందు అనాసక్తత. 7. సుఖాపేక్ష ఉండరాదు. 8. గర్వం ఉండరాదు. 9. దంభం నశించాలి. 10. అజ్ఞానం తొలగాలి.
                              
    * * *
శారీరకంగా కోర్కెలనే బంధాలనుండి విముక్తి పొందటం, మానసికంగా 'నేనే' అనే అహంభావం విసర్జించడం. నైతిక దృష్ట్యా కామ, క్రోధ మోహాదులు, విద్రోహ విద్వేషాలు, అజ్ఞానం వదలడం ... దీనినే నిర్వాణస్థితి అంటారు.
                              
   * * *
రాగం శాంతిస్తే దోషాగ్ని శాంతిస్తుంది. దోషాగ్ని శాంతిస్తే అభిమానాది సకలదోషాలు ఉపశమిస్తాయి. అప్పుడే మానవునికి శాంతి.
                              
     * * *
యోగమంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తం చలించుటయే బంధం. స్థిరంగా వుండుటే మోక్షం. యోగి, వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని సాక్షి యందు లయింపజేసి, ఆ సాక్షిని అసలు సత్యంగా గుర్తిస్తాడు. యోగమార్గం - అంతఃపధం. అంటే అంతర్భాగంలో మనోదారణే యోగం. యోగద్వారం - హృదయం. యోగగమ్యం - పరబ్రహ్మం. అంటే హృదయమందు జీవనం.
                              
    * * *
యజ్ఞయాగాది క్రతువుల పేరుతో జరిగే జంతుబలుల్ని ఆపమని చెప్పి, అసలు యజ్ఞం అంటే ఏమిటో తెలియజెప్పిన బుద్ధ ప్రబోధమిదే -
నోరులేని పశువులను బలిచేయడం కాదు, మనలో ఉన్న అజ్ఞానపశువును జ్ఞానవేదికపై బలిచేయడమే నిజమైన యజ్ఞం. సర్వప్రాపంచిక భావాలను, స్వార్ధ అహంకార పశువాసనలను బ్రహ్మాగ్ని కుండంలో ఆహుతి చేయడమే బ్రహ్మయజ్ఞం. మానవునిలోని అరిషడ్వర్గములనే పశువులను సంహరించి, పరిశుద్దులగుటయే యజ్ఞం. నియత కర్మలన్నీ ధర్మభావనతో చేస్తే, అదే యజ్ఞం!
                              
   * * *
జన్మతః అందరూ జ్ఞానులే. జీవించేకొద్దీ చాలా ఎక్కువమంది అజ్ఞానులుగా మారతారు. అజ్ఞానాన్ని గుర్తించి, ఆగి, ఆలోచించినవాడే నిజమైన అన్వేషకుడు.
                              
   * * *
మనలో వెలిగే అంతరజ్యోతే జ్ఞానం. ఆ జ్ఞానజ్యోతిని ఎవరికివారు దర్శించడమే, అంతిమ సత్యం.
                              
  * * *
జీవితంలో నిరాకరించవలసినవి ఐదు వున్నాయి, అవి - జీవితం కోసం కాంక్ష, అహంకారం, అవిద్య, కామం, ద్వేషం. జీవితంలో ఆహ్వానించదగినవి ఐదు వున్నాయి, అవి - విశ్వాసం, జాగృతి, నీతివర్తన, ధ్యానం, జ్ఞానం.
                               * * *
అజ్ఞానాన్ని తొలగించకుండా, మానసిక బలహీనతల్ని అధిగమించకుండా, ఎవరూ భవసాగరాన్ని దాటలేరు, విముక్తి పొందలేరు.
                               * * *
ముక్తి అనేది మరణించాక వచ్చేది కాదు, బతికుండగానే సంపాదించుకోవలసినది.
                              * * *
మనిషి ప్రకృతి నుండి ఎంతో నేర్చుకోవాలి.
మట్టి : అమృతం, విషం రెంటినీ స్వీకరిస్తుంది. మన మనస్సులోకి వచ్చే మంచి చెడు ఆలోచనలను మనం సమంగా స్వీకరించాలి.
నీరు : నీళ్ళలో ఎంత మురికి చేరినా స్వీకరిస్తుంది. స్వచ్చంగా వుంటుంది.  జ్ఞాని అలానే ఉండాలి.
నిప్పు : అన్నింటినీ కాల్చివేస్తుంది. మంచి చెడు పదార్ధాలని చూడదు. అలానే జ్ఞానంతో అన్ని మాలిన్యాలను దగ్ధం చేయాలి.
గాలి : సుగంధాలను దుర్గంధాలను తనలో కలుపుకొని పోతుంది. జ్ఞాని అంతే, దేనినీ తప్పుపట్టక సాగిపోవాలి.

20, మార్చి 2013, బుధవారం

నా జీవనగమనంలో ..... 'శ్రీ రమణమహర్షి'

తమను తాము తెలుసుకున్న మహాత్ములందరూ - ఏం చేసినా,అది సమస్త ప్రాణికోటి పురోభివృద్ధి కోసమే, సర్వుల ఉద్ధరణకే! ఏం చెప్పినా, అది పరమాత్మ సిద్ధి కోసమే, సర్వ జనావళిని తరింపజేయడానికే!
అటువంటి మహాత్ములు ఈ అవనిపై అప్పుడప్పుడు అక్కడక్కడా సకల ప్రాణికోటి శ్రేయస్సుకై దేహదారులై గురువులుగా , జ్ఞానులుగా , మహర్షులుగా , ప్రవక్తలుగా , సంతులుగా అవతరిస్తునే ఉంటారు. అటువంటివారిలో ఒకరు "శ్రీ రమణమహర్షి".
వీరు నా జీవనగమనంలో నాకెలా మార్గదర్శకులయ్యారంటే -


భగవంతునికై
ప్రార్ధన, సాధన ఉండాలి అంటారే 
..... అసలు ప్రార్ధనంటే ఏమిటి? సాధన అంటే ఏమిటన్న నా మొదటి సందేహానికి సమాధానం భగవాన్ రమణ మహర్షి ఇలా తెలియజేశారు -
"భగవత్ ప్రార్ధన అంటే మాటలు జపించడం కాదు, భగవంతునికై పరితపించడం. సాధన అంటే ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహించడం. సాధన అంటే వికాసంతో కూడిన ఒక సజీవమైన సంగతి. ఎదుగుదల, పెరుగుదలతో కూడిన విషయమిది. మొగ్గ పువ్వుగా విచ్చుకున్నట్లు, జీవుడు ఈశ్వరుడుగా ఎదగడం. మొగ్గ సూర్యుని వైపు తిరగడం వంటిది సాధన. అంటే జీవుడు ఈశ్వరుడు వైపు దృష్టి మరల్చడం. విగ్రహారాధన, దైవపూజ, శరణాగతి, భక్తి, విశ్వాసం, తన్మయత్వం, ఆరాధన అవసరమే గానీ, నామరూపరహితమైన పరమాత్మే అన్నింటిలోనూ అంతర్భూతంగా వున్న ఆత్మ అని అనుభవపూర్వకంగా గుర్తించడం నిజమైన సాధన". 

                                                     * * *
ఒకానొకసారి నేను అనుకున్నది ఒకటి, జరిగినది వేరొకటి, అన్న రీతిలో ఉండేది నా పరిస్థితి. ఏమిటిది? ఎందుకిలా జరుగుతుందని చాలా కలత చెందుతున్న తరుణంలో శ్రీ రమణుల బోధ ఒకటి యాదృచ్చికంగా నా కంట బడింది. నాకు జవాబు దొరికింది., కలతా తీర్చింది, ఆ బోధ ఇదే -
"వారి వారి ప్రారబ్ధకర్మానుసారం విధాత వారి విధి నిర్ణయిస్తాడు. జరగవలసింది, ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. జరగనిది, ఎవరెంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. కనుక ఊరికే వుండటం మంచిది".
(ఇది శ్రీరమణులు ప్రపంచానికి ఇచ్చిన ప్రధమోపదేశం)
                              
                          * * *
భార్య మాటలతో కనువిప్పై భార్యను వదిలి పరమాత్మునికై పరితపించిన తర్వాతే తులసీదాసు యోగి అయ్యాడు. సిద్ధార్ధుడు భార్యాపుత్రులను, తల్లితండ్రులను, రాజ్యాన్ని పరిత్యజించి పరిశ్రమించి పరిశుద్దుడై, ప్రాపంచిక బంధాలకు బద్ధుడవ్వక బుద్దుడైనాడు. వెంకటరమణ తల్లిని, తోబుట్టువులను, బంధువులను వదిలి అరుణాచలం వెళ్లి యోగాపరుడై రమణమహర్షిలా భాసిల్లడు. అంటే సన్యసించినవారికి, సర్వం పరిత్యజించినవారే పరమాత్మను తెలుసుకోగల్గుతారా? మరి, కర్మానుసారం ఏర్పడే కర్తవ్యాన్ని గాలికొదిలేయడం తప్పు కాదా? ఇవన్నీ ప్రారబ్ధసారం వచ్చేవే కదా, ప్రారబ్ధాన్ని అనుభవించి అధిగమించాలంటారే... అటువంటప్పుడు ఈ బంధాలను, బాధ్యతలను పరిత్యజించడం పాపం కాదా????? ... ఇత్యాది ప్రశ్నలతో మనసంతా గజిబిజిగా అయినప్పుడు - 'దేనినీ పరిత్యజించనవసరం లేదు, కానీ; దేని యందు తాదాత్మ్యం ఉండకూడద'ని అంటూ, అసలు సన్యాసమంటే ఏమిటో తెలియజెప్పిన రమణమహర్షి వాక్కులివే ...
"సన్యాసమంటే - కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన.
సన్యాసమంటే - ప్రపంచం నుంచీ, మరి దేనినుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలివేయడం కాదు. సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం. ఆ ఆలింగనంలో సంసారం అన్నీ వుంటాయి.
సన్యాసమంటే - అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దానిపట్ల అనురక్తిని త్యజించడం.
సన్యాసమంటే - పరిశుద్ధ జ్ఞానం.
                             ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం. నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి
, సన్యసించించాలి అని అనుకోరు. నిజమైన సంసారం మనస్సంసారం. దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు. సర్వకర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్నవారే నిజమైన సాధకులు. విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం". 
                              
                    * * *
ఇంట్లో ఏకాంతం లేదు, బయట సత్సంగంకు వెళ్ళడానికి వీలు కుదరడం లేదు, ఇలా అయితే నా సాధన సాగేదేలా? తీవ్ర సాధన చేస్తేనే కదా, పరమాత్మను కాంచగలం ... ఓహో ... ఇలాగైతే ఎలా ... లోలోన ఏదో వేదన ...!
ఈ విధంగా వేదన పడుతున్న నాకు అవగాహన కల్పించి స్వాంతన చేకూర్చిన  శ్రీ రమణుల వాక్కులివే-

"ఏకాంతమంటే - బైట ప్రపంచం నుంచి విడినివాసం కాదు.
ఏకాంతమంటే - ఆలోచనారహిత స్థితి.
ఏకాంతమంటే - ఆత్మలో స్థిరంగా నిలవడం.
                                 మనల్ని తరిమేది మన మనస్సే. ముందు దాన్ని సిద్ధం చేయాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా హాయిగా ఉండవచ్చు. ఉన్నచోట నిశ్చలమనస్సుతో శ్రద్ధగా సాధన చేయవచ్చు. బైట సత్సంగం వుంటుందంటున్నావు, అది సరే, అసలైన సత్సంగం నీలోనే యుంది. అదే నిజమైన గుహవాసం. ఏకాంతం మనస్సులోని సంగతి. మనష్యుల మద్య మసలినా, మనోపవిత్రతను నిలుపుకున్నవాడు ఏకాంతవాసే. అడవిలో, నిర్జన ప్రదేశంలో వుండి, ఆలోచిస్తూ వుంటే, అది ఏకాంతవాసమా? అనాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసే".

                              
                    * * *
జీవితమన్నాక కష్టసుఖాలు తప్పవు. ఒకసారి ఒకదాని వెంబడి ఒకటిగా సంభవిస్తున్న ఆపద్కాలములో మానసికంగా బాగా అలసిపోయి, ఇక భరించలేను రామా! ఎందుకీ పరీక్షా? ఏమిటీ కష్టాలని రాముని చిత్రాన్ని చిత్తానికి తాకించుకొని బాధపడగా, ఆ రోజు సాయంత్రమే నా మిత్రురాలు యాదృచ్ఛికంగా రమణమహర్షి పుస్తకం ఇచ్చారు. తను వెళ్ళాక, రామున్ని ధ్యానించి పుస్తకం తెరవగా, తెరిచినా పుటలో ఉన్నది చదివాక, ఎప్పటిలా ప్రశాంతత వచ్చేసింది.  నేను ఆ క్షణంలో చదివింది ఏమిటంటే - 
"ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు. ఆయనే భగవంతుడు. పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే. మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం. పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు. కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు. నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి, నీవు నిశ్చింతగా వుండు".
                                                * * *
ఎన్ని చదివినా, ఎప్పటికప్పుడు ప్రతీది కొత్తగానే ఉంటుంది. ఒకానొక కష్టసమయంలో రామా! నిన్ను ఇంతలా నిరంతరం స్మరిస్తానే, మరి ఇదా నీ అనుగ్రహం అని అజ్ఞానంతో బాధగా అనుకుంటూ ఎప్పటిలా పుస్తకం తీసి, (నాకు కోపం, బాధ, ఆనందం, ఉద్వేగం, ఉక్రోషం, అసహనం, అశాంతి ... ఇత్యాది ఏ భావాలు కల్గిన మౌనంగా ఏదో ఒక పుస్తకాన్ని తీసి చదవడం అలవాటు) రాముణ్ణి ధ్యానించి ఓ పుటను తెరిచి చదవగా, మూడు ముక్కల్లో నా అజ్ఞానాన్ని నేను గుర్తించేటట్లు చేశారు శ్రీ రమణులు.   
"మనం భగవంతున్ని స్మరించాం, అంటే అది భగవంతుడు అనుగ్రహించినవరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు. అనుగ్రహమే భగవంతుడు. దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం".
                                                * * *
తనే కరెక్ట్ అని, ఎదుటివార్ని అర్ధం చేసుకోకుండా కించపరిచే తనమాటలతో ఓసారి విభేదించానని, కొన్నేళ్ళ స్నేహాన్ని మరిచి, అరిచి, విడిచి, అహాన్ని అడ్డుగోడగా కట్టేసి,  నిందిస్తూ, నిష్టూరాలు ఆడిన ఓ ఆత్మీయనేస్తం ప్రవర్తన నన్ను కలచివేస్తున్నప్పుడు మౌనమయ్యాను. బాహ్యమున మౌనంగా ఉన్నా, అంతరాన్న ఆవేదన. ఆ తరుణంలో రామానుగ్రహంతో రమణుల బోధ నాచెంత చేరి నాలో చింతను పూర్తిగా మాయం చేసింది. ఒకప్పుడు ఎప్పుడూ కదిలాడే తన జ్ఞాపకాలతో మనస్సు బాధతో భారమయ్యేది, ఏ పనియందైన పరధ్యానమే! మరి ఇప్పుడు ఎప్పుడైనా తను జ్ఞాపకం వచ్చినా, దుఃఖస్పర్శ లేశమాత్రమైన ఉండక, దైనందికకార్యక్రమాల్లో ప్రశాంతంగా నిమగ్నురాలినౌతున్నాను. ఆమెకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 
"మనల్ని ఎవరైతే ఖండిస్తారో, కాదంటారో, తిడతారో, నిందిస్తారో, నిరాకరిస్తారో వారు మన మిత్రులు. ఎందుకంటే, మన శత్రువైన దేహాన్ని (దేహాత్మభావాన్ని) వారు నిందిస్తున్నారు. మన మనోశత్రువునకు శత్రువైన దేహానికిశత్రువు అయినవారు మనకు ఆప్తమిత్రుడు కావాలి కదా"?
                                                * * *
కొందరు భక్తిమార్గం గొప్పదని, మరికొందరు ధ్యానయోగమని, మరికొందరు జ్ఞానమార్గమని, మరికొందరు కర్మయోగం గొప్పదని అంటుంటారు. నిజానికి ఏ యోగం గొప్పదన్న సందేహం కలిగి, నాలో నేనే... ఇదనీ, అదనీ విశ్లేషించుకుంటూ సతమతమౌతున్న తరుణంలో రమణుల పుస్తకం చేతికి రావడం, అందులో సమాధానం వుండడం ... ఒకింత అవగాహనై ఉపశమించాను. 
"ఏ యోగవిధానం మంచిదంటే ... అది వ్యక్తి అభిరుచి మీద ఆధారపడి వుంటుంది. ఒకరికి ఒక పద్ధతి, ఒక తీరు, ఒక విధానం సులభంగా వుంటే; మరొకరికి మరొక పద్ధతి సులువుగా వుంటుంది. అంతా, అన్నీ ఒకటే, సమానమే.
జీవుడు జనన, మరణవలయం నుంచి విముక్తి కావడానికి చేసే కర్మాచరణే - "కర్మయోగం".
అంతా దైవమే అయినా, తాను పరబ్రహ్మ నుంచి విడివడ్డాననే తపనతో, నిజమైన భక్తి విశ్వాసాలతో వుండుటే - "భక్తియోగం".
అజ్ఞానమనే తిమిరంలో పడి కొట్టుకునే జీవుడు, కాంతికోసం విమోచన కోసం ప్రయత్నించుటే - "జ్ఞానయోగం".
జీవుని స్వభావం విచారణ ద్వారా తెలుసుకోవడమే మహాయోగం ... అదే విచారణ మార్గం. పరిపూర్ణభక్తితో భక్తుడు శరణాగతి అవ్వడాన్నే విచారణ మార్గమును అనుసరించేవారు జ్ఞానమంటారు. అన్నిమార్గాలు అహంకారాన్ని ఆత్మలో లయింపజేయడమే గమ్యంగా కలిగియుంటాయి".

                                         * * *
లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమయిన కుట్టదంటారే ...  అన్నీ ప్రారబ్ధసారం జరుగుతుందంటారు కదా, మరి ప్రత్యేకంగా ఈ దుర్గుణాలు, దురభ్యాసాలూ పోగొట్టుకోవాలనటం ఎందుకు? అన్న సందేహానికి సమాధానం - శ్రీ రమణభాషణంలో ... 
ఎందుకా? చెబుతాను విను. శరీరం వుంది, దానికెక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో, డాక్టరు వచ్చి, కత్తితో ఆ భాగం కోసి, చెడురక్తం తీసివేసి, మంచిరక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అట్లాగే యిదీనూ! ఆ వ్రణం కోయకుండా వదిలితే,లోపలంతా కుళ్ళుతుంది. కోసిన వెనుక కట్టు కట్టకుంటే, చీముపడుతుంది. మానవుని నడవడిక లోనూ అంతే. దుర్గుణాలు, దురభ్యాసాలూ వ్రణం లాంటివి. కోసివేయకుంటే అదఃపతితుడౌతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి.
                                                 * * *
 
గురుసన్నిధిలో నిరంతరసాధన చేస్తున్న సత్యాన్వేషకులుకే తప్ప నేను చేయగలనా ఈ ఆధ్యాత్మికమార్గంలో పయనాన్ని..... అన్న వెరపు నాలో కల్గినప్పుడు నాలో ధైర్యాన్ని పెంచడానికి శ్రీ రమణానుగ్రహంతో నా కంటబడిన శ్రీరమణులు వివరించిన కధ ఇది -
ఒక పిచ్చుక గ్రుడ్డు సముద్రంలో జారి పడిపోతే, ఆ గ్రుడ్డును బయటికి తీసి రక్షించాలని పట్టుదలతో సముద్రంలో నీళ్ళన్నీ బయటపోస్తానని, విసుగు విరామం లేకుండా సముద్రలో మునిగి, ముక్కుతో నీరు పీల్చి ఒడ్డుకు వచ్చి రెక్కలతో విదిలించడం, ముక్కుతో బయటపోయడం చేస్తుండగా, ఇది చూసిన నారదులవారు, విషయం అడిగి తెలుసుకొని, ' వెఱ్ఱిపిచ్చుకా! నీకిది సాధ్యమా?' అని అడగగా, 'సాధ్యమా? అసాధ్యామా? అన్న చింత నాకు లేదు, పట్టుదలతో ప్రయత్నిస్తాను, పైన దైవమున్నాడు' అని అన్నదట ఆ పిచ్చుక. నారదుడు పిచ్చుక శ్రద్ధకు ఆనందంచి, గరుడుని వద్దకు వెళ్ళి, ఈ విషయమంతా వివరించి, 'ఏమోయ్, నీ జాతిపక్షి అంతశ్రద్ధతో పని చేస్తుంటే నీవు ఊరకే వుండటం ధర్మమా? సహాయపదరాదా?' అని అన్నాడట. ఆ మాటలు విన్న గరుడుడు పరుగుపరుగున వచ్చి రెండు రెక్కలతో ఒక్కసారి విసిరితే నీరంతా రెండు పాయలై చెదిరి గ్రుడ్డు బయటపడ్డది. పిచ్చుక ఆనందంతో ఆ గ్రుడ్డును తీసుకుందట. అదేవిధంగా ఆత్మచింతన కలవారూ, సత్కార్యాచరణపరులూ... ఈ పని పెద్దదే, మనకు ఈ పని చేయడం సాధ్యమా అని జంకి విడవక శ్రద్ధతో పాటుపడితే దైవసహాయం దానంతట అదే వస్తుంది. 
ఈ కధే కాకుండా ఒకరికి వచ్చే సందేహాలను శ్రీ రమణులు ఎలా తీర్చారో...  క్రింద సంభాషణను చదివి, తద్వారా నా సందేహానికి కూడా సమాధానం తెలుసుకున్నాను. 

పృచ్ఛకుడు: భగవాన్! మీరు చెప్పినట్లు 'అహం' వృత్తియొక్క మూలమును, బుద్ధికుశలత వలన 'ఆత్మ' అని గ్రహించినను, మనస్సందు ప్రవేశింపకున్నది. కారణమేమి?
రమణమహర్షి : ఏమి అడ్డు వచ్చుచున్నదో చెప్పుడు?
పృచ్ఛకుడు : జన్మాంతర సంస్కారములు, మనస్సు తాను పుట్టినచోట చేరకుండా అడ్డు తగులుచున్నవేమో!
రమణమహర్షి: అది నిజమే! ఆ సంస్కారములను పోగొట్టుకొనుటకై మనం చేయు సాధన?
పృచ్ఛకుడు : మన ప్రయత్నమెంత తీవ్రమైనను, జన్మజన్మాంతరములుగా మనస్సులో నాటిన సంస్కారములను నిర్మూలింపలేము. భగవంతుని కృప ఒక్కటే, దీనికి సమర్ధమైనదని నా అభిప్రాయం. దేవుని కృప లేనిదే మనమెంత సాధన చేసినను లాభం లేదు.
రమణమహర్షి : మీరు చెప్పినది అంతయూ నిజమే. ఇందు మూడు విషయములు ఉన్నవి. 1. స్వప్రయత్నం 2. కాలపరిపాకం 3. ఈశ్వరకటాక్షం. మనం సాధన చేయుచుండగా, సమయం వచ్చినప్పుడు ఈశ్వరుణ్ణి కటాక్షం దానంతట అదే లభించును. దానికై దేవునికి జ్ఞాపకం చేయనవసరం లేదు. ఆయన మనం చేస్తున్నదంతా చూస్తూనే వున్నాడు. తగినసమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం దొరుకును. సాధకులు సామాన్యముగా దేవునికృపకై చూస్తూ తమసాధనలో అశ్రద్ధ వహిస్తారు. అందువలన వారు గమ్యస్థానం ఎప్పటికీ చేరలేరు.
                                   * * *
ఇలా చెప్తే చాలా ఉన్నాయి. పోస్ట్ పెద్దదవుతుందన్న కారణంతో .....
రమణానుగ్రహం
అపారం, రామానుగ్రహం అనంతం.
అనంతమైనది ఆధ్యాత్మికత్వం. ఆధ్యాతిక మార్గంలో పయనం అనేక అవరోధాలతో కూడుకున్నది, నీవు ఒంటరిగా ఎలా పయనించగలవని కొందరు మిత్రులు అడుగుతుంటారు. వారికి నా చిరునవ్వే సమాధానం. ఓ రచయిత అంటారు - నీవు ఎప్పటికీ ఒంటరివి కావు, నీకు తోడుగా ఆ దైవం ఆత్మరూపమున నీలోనే ఉందని.
నా రామాంజనేయులు, పుస్తకరూపేణా ఇందరి గురువులు నా దగ్గర ఉండగా ఇక నాకు వెరపు దేనికీ?
ప్రయత్నిస్తాను, చివరిక్షణం వరకు ప్రయత్నిస్తాను.

"ప్రయత్నం చేయక ఓడిపోతే మరణించినట్లే,
ప్రయత్నం చేస్తూ మరణించినను జయించినట్లే".
నా తదుపరి టపా -
నా జీవనగమనంలో .....  శ్రీ బుద్ధ భగవాన్!