12, అక్టోబర్ 2017, గురువారం

"దాంపత్య జీవన సాఫల్యత"

అమ్మా! 
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ... అంటూ, స్త్రీ ఎలా ఉండాలో చెప్పారు. మరి పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదా? యిదీ కొన్నిరోజుల క్రితం మా అమ్మాయి అడిగిన ప్రశ్న.  
కార్యేషు యోగీ, కరణేషు దక్షః ... అంటూ పురుషుడు ఎలా ఉండాలో చెప్పారమ్మా. కానీ, ఎందుచేతనో యిది ప్రాచుర్యంలో లేదు... అని తనకి బదులిచ్చిన నా మనస్సు గతంలోకి పయనిచ్చింది. 
గతంలో ఇదే సందేహం నాకూ వచ్చింది. అప్పుడే ఓ భార్య ఎలా వుండాలో నన్నదే కాదు, ఓ భర్త ఎలా వుండాలన్నది తెలిసింది. కానీ, ఒకింత కోపం ... స్త్రీని చాకిరీలు చేసే దాసిలా, అన్నింటిని ఓర్చుకుంటూ పడుండే భూమిలా, రంభలా ఉండమని, పురుషుడిని యోగిలా, రామునిలా ... ఇలా చెప్పడం ఏమిటని ఒకింత అసహనంకు మొదటలో లోనయ్యాను. కానీ, పెద్దలు ఏది చెప్పిన అందులో పరమార్ధముంటుందన్న సత్యం అనుభవపూర్వకంగా ఎఱిగి, ఇందులో కూడా ఏదో అంతరార్ధముంటుందని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. కాస్త కూస్తో తెలుసుకున్నాను. నిజానికి స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా సరిగ్గా సమానంగా చెప్పారు మన పూర్విజులు. 

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. 
    
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః 

స్త్రీ పురుషులు ఎలా ఉండాలో తెలియజెప్పే ఈ శ్లోకాల రెండింటి సారూప్యతలను గమనిస్తే -

కార్యేషు దాసీ - కార్యేషు యోగీ 

స్త్రీ పనులు చెయ్యడంలో దాసి లాగా, పురుషుడుపనులు చెయ్యడంలో ఒక యోగి వలె ఉండాలని అర్ధం.   
ఒకరింట్లో పనిచేసే దాసి, తన యజమాని  ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. అంతే తప్ప ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపట్ల, వస్తువుల పట్ల స్వంతమని గాని, ఎలాంటి కోరికాది భావములను గాని కలిగియుండదు. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకొని వెళ్ళిపోతుంది. 
అలానే ఓ యోగి ఏ వస్తువు పట్లయినా, ఏ కర్మ పట్లనైనా ఇష్టం అయిష్టం, సంగం అసంగం, రాగం ద్వేషం లాంటి భావాలు ఏర్పరచుకోక, చేసే కార్యాలయందు నిమిత్తుడై, నిర్లిప్తుడై భగవత్కార్యమనే భావనతో, భగవదర్పణ బుద్ధితో నిర్వర్తిస్తాడు. 
ఒకింత యోచిస్తే కర్మల యందు ఓదాసి అయినా, యోగి అయినా ఒకేలా ఉంటారు. పదాలు వేరైనా చక్కటి సారూప్యత. 
కరణేషు మంత్రీ - కరణేషు దక్షః

స్త్రీ - మంచి సలహాలు, సూచనలు, మాటలు చెప్పడంలో మంత్రిలాగా, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించే దక్షత కలవాడై పురుషుండాలి. 
రాజుకు శ్రేయస్సు కల్గించే సరైన సూచనలిస్తూ, అటులనే రాజు తప్పు చేసిన, పొరబడినా, తనకి  తగిన సలహాలిస్తూ, నయాన్నో భయానో  మంచిమార్గములో నడిపించి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడం మంత్రి బాధ్యత. అలానే భార్య మంత్రివలె మంచిపనులను మగనికి దెల్పి, మగనికి మంచి స్పూర్థినిచ్చెడి ఆలోచనా తోడ్పాటు నందివ్వవలెను. సూచనలు, సలహాలనా... మాటే వినని భర్తకు చెప్పేదేముంది అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ, చెప్పే రీతిలో చక్కగా చెప్తే చక్కటి ఫలితమే ఉంటుంది. ఇక్కడ రామాయణంలో సీతారాముల మృదుభాషణమొకటి మదిలో మెదులుతుంది - దండకారణ్యంలో మునులకు రాక్షసబాధ లేకుండా చేస్తానని మాటిచ్చిన రామునితో సీతమ్మ ఇలా అంటుంది - 'రాజా! మోహం వలన మూడు అనర్ధాలున్నాయి. మొదటిది అసత్య భాషణం, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది తగిన కారణం లేకుండా వైరం పెట్టుకోవడం. నాకు తెలుసు సత్యసంధుడివయిన నీవు ఎన్నటికీ అసత్యభాషణం చేయవు. అలానే స్వదార నిరతుడివి, ఏకపత్నీవ్రతుడివయిన నీకు పరస్త్రీ వ్యామోహం కలుగదని. కాకపొతే నిష్కారణంగా రాక్షస సంహారం చేస్తానని మాటివ్వడం నన్ను బాధిస్తుంది. ఆర్తులను రక్షించడానికే రాజులు కత్తి పట్టాలి గానీ,  ఎటువంటి శతృత్వం లేకుండా ఎవర్నీ సంహారించడం సరికాదు. ఇప్పుడు మనం వనవాసులం, అడవులకు వచ్చింది తాపస ధర్మాన్ని సేవించడానికి గాని, క్షత్రీయ ధర్మాన్ని నెరవేర్చడానికి కాదుకదా ... అని చెప్తూ ... నేను చెప్పానని కాదు, నీవు ధర్మజ్ఞుడివి, సరిగ్గా ఆలోచించు, అప్పుడు నీకు ఏది సమ్మతనిపిస్తే అది చెయ్యి అని అంది. సీతమ్మ చెప్పిందంతా ఓపిగ్గా విన్న శ్రీరాముడు 'జానకీ! నువ్వు నా ధర్మపత్నివి. నీకు తోచినది చెప్పావు, మంచిమాటలు చెప్పావు, కానీ నువ్వే అన్నావు - ఆర్తుల్ని రక్షించడానికి మాత్రమే క్షత్రీయులు ఆయుధం పట్టాలని. నేనిప్పుడు అదేపని చేస్తున్నాను. వారు తమ తపశ్శక్తితో తమని తాము రక్షించుకోగల తాపసులు, తమ తపఃశక్తిని అధములు కోసం వృధా చేసుకోకూడదని, తమని రాక్షసుల బారినుండి రక్షించమని కోరారు. అందుకే ఎవరికీ ఏ హానీ చేయని వారిని అకారణంగా హింసిస్తున్న రాక్షసులను సంహరిస్తానని మునులకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడం సరికాదు కదా ... అని అనడం ..... ఈ ఘట్టాన్ని ఓసారి పరిశీలిస్తే - సీతమ్మ తనకు తోచిన ధర్మాన్ని నొప్పించక తగుమాటలతో సున్నితంగా, నిర్మొహమాటంగా చెప్పడం, బాగుగా యోచించి తగు నిర్ణయం తీసుకోమనడం ... 
ఆ రీతిలోనే భార్య చెప్పింది అంతా ఓపిగ్గా వినడం, సహృదయతతో అర్ధం చేసుకోవడం, తన మాటలకు తగిన విలువనిస్తూనే తన మనస్సులో మాటను సున్నితంగా చెప్పడం ... నొప్పించక ఒప్పింపజేయడం... 
ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరూ నొచ్చుకోకుండా అర్ధమయ్యేరీతిలో సరళంగా సమస్యలొచ్చినప్పుడు మాట్లాడుకుంటే ఆ దాంపత్యజీవితం అర్ధవంతమూ, ఆదర్శవంతమూ కాదా? 
రూపేచ లక్ష్మీ - రూపేచ కృష్ణః 

 స్త్రీ రూపంలో లక్ష్మీదేవిలాగా, పురుషుడు రూపంలో కృష్ణుని వలె ఉండాలి.

                                                                   
లక్ష్మీదేవి అనగానే ఓ కమలంపై అందంగా ఆనందంగా ఆసీనురాలైన అమ్మవారి రూపం కళ్ళముందు కదలాడుతుంది. 
కమలం - బురదలో వున్నా బురదను నీటిని అంటించుకోక, బురదలో నుండి స్వచ్ఛంగా బయటకొస్తుంది. లక్ష్మీ ... సంపదలొసగే తల్లి ... ఆమె అందరికీ ఒనర్చుతుంది కానీ, తనకై దాచుకోదు, కోరుకోదు. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - సంసారకూపమందు ఉంటూ సంసారమును అంటీముట్టనట్లు ఉండమని. అలానే అందరికీ అన్నీ అమరుస్తూ ఆనందంగా ఉండమని. 
                       


కృష్ణుడు అనగానే ఒకకాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీ అననట్లు, చేతిలో వేణువుతో, వెనుక గోవుతో నిల్చున్న రూపం సాధారణంగా జ్ఞాపకం వస్తుంది.  
కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీ అననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.
క్షమయా ధరిత్రీ - క్షమయా తు రామః
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో ఓర్పుగా భూదేవిలాగా స్త్రీ, 
జీవితమందు ఎంతో సహనంతో రామునిలా పురుషుడుండాలి. 
భూమికి  సహనం సహజగుణం. గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, తొలిచేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది. తనని ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్న సహిస్తుంది. అలానే కుటుంబంలో స్త్రీ కూడా సహనంగా, క్షమాగుణంతో మసలుకోవాలి. 
మానవునికి ఆభరణం గుణం, గుణమునకు ఆభరణం జ్ఞానం, జ్ఞానమునకు ఆభరణం క్షమ. ఆ క్షమకు ప్రతిరూపం శ్రీరాముడు. కోపగించుకోవడానికి తగు కారణాలున్నా, తనకు ఎంత దుఃఖం కల్గించిన మనస్సు నందు ఎటువంటి ప్రతీకార బుద్ధి లేకుండా కోపాది వికారాలు లేకుండా సహనంతో, సహృదయతతో, అందరితో సౌజన్యంగా స్నేహాయుతంగా ప్రీతిగా వ్యవహరించడం, శరణువేడిన విభీషణుడునే కాదు, రావణుడు వచ్చిన ఆదరిస్తాననే అభయమిచ్చే సహనమూర్తి శ్రీరాముడు. కుటుంబంలో పురుషుడు కూడా ఎంతో సంయమనంతో క్షమాశీలుడై మెలగగలగాలి. 
భోజ్యేషు మాతా - భోజ్యేషు తృప్తః
భర్తకు భోజనం పెట్టేటప్పుడు స్త్రీ ఓ తల్లిలాగా, 
భార్య వండినదాన్నిభర్త సంతృప్తిగా భుజించాలి. 
కన్నతల్లి తన బిడ్డ సరిగ్గా తినాలని తపిస్తూ, తన బిడ్డకు ఏది ప్రీతికరమో, ఎలా చేస్తే ఇష్టంగా తింటుందో నని ఆలోచిస్తూ, ఆ రీతిలో చక్కగా శ్రద్ధగా వండి ప్రేమతో నెట్లు వడ్డించునో, అట్లేనే భార్య భర్తకు గూడా ప్రీతితో పెట్టవలెను. అలానే భార్య  వండినదాన్ని ఎటువంటి వంకలు పెట్టకుండా, టి.వి చూస్తునో, ఇతరత్రా ఏదో ఆలోచిస్తూనో... భోజనం యాంత్రికంగా చేయకుండా, ఆ వంటకాల్లో రుచినే కాదు, భార్య ప్రేమను కూడా ఆస్వాదిస్తూ భర్త సంతృప్తిగా భుజించాలి. ఒకోసారి వంట సరిగ్గా చేయలేకపోవచ్చు, అప్పుడు కోపగించుకోక సహృదయతతో సర్దుకుపోవాలి. 


శయనేషు రంభ - సుఖదుఃఖ మిత్రం
ఈ రెండే ఒకింత సారూప్యత లేనివి. 
స్త్రీ పడకటింటి లో రంభలాగా ఉండాలి. 
పురుషుడు సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. 
ఓ స్త్రీని పడకింటిలో ఇలా ఉండమని చెప్పడానికి కారణం - ఈ సమయమందు స్త్రీ మనోభావనాలుకు  అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఓ శిశువు అంకురం మొదలు ప్రసవించేంతవరకు... స్త్రీ మనోభావనలు, తీసుకునే ఆహరం, గర్భాలయంలో ఉన్న శిశువుపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఇక్కడ భారతంలో ఓ సన్నివేశంను ఉదహరిస్తాను - శంతనమహారాజుకు, గంగామాతకు భీష్ముడు జన్మించడం, అటుపై దాశకన్య అయిన సత్యవతీ శంతనుల వివాహ నిమిత్తమై భీష్ముని ప్రతిజ్ఞ, శంతన మహారాజుకి సత్యవతి భార్యకాకపూర్వం పరాశరుని వల్ల గర్భవతియై వ్యాసభగవానుని కనడం... శంతనునికి సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించడం, చిత్రాంగదుడు గంధర్వుల చేత హతుడవ్వగా, విచిత్రవీర్యుడికి కాశీరాజు కూతుళ్ళు అంబిక, అంబాలికలను భీష్ముడు బలవంతంగా తెచ్చి పెళ్లి చేయడం, విచిత్రవీర్యుడు క్షయవ్యాధి సోకి చనిపోవడం, వీరికి సంతానం కలగకపోవడం వలన వంశం అంతరించకూడదని, సత్యవతి తన మరో కుమారుడైన వ్యాసుడిని పిలిచి వంశాన్ని నిలపమని కోరడం, వ్యాసుని దరి చేరిన విచిత్రవీర్యుని భార్యలు భయమునకు లోనై, ఒకరు కళ్ళు మూసుకొని సమాయత్తమైనందున పుట్టుగ్రుడ్డి ఐన దృతరాష్ట్రుడును, వణుకుతూ సమాయత్తమైన మరొకరు పాండురోగి ఐన పాండురాజుకు జన్మనివ్వడం, మూడవసారి అంబిక,అంబాలికలు భయముతో వారికి బదులుగా దాసిని పంపగా దాసీ పుతృనిగా విదురుడు జన్మించడం..... అందరికీ విదితమే. దీనిబట్టి భర్తను చేరిన భార్య మనోభావనలు ఎంత ముఖ్యమో ఇక్కడ అర్ధమౌతుంది. ముందుగా  ఆలోచనలు సంగమించాలి, భావాలు శృతి కలవాలి, మనస్సు లేకోన్ముఖం కావాలి. దీనిని విలాసమయ వినోదమయ శృంగారమయ క్రియగా భావించక, యోగ్యవంతమైన సత్సంతానంకై అన్న పవిత్ర భావనతో ఉంటే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు. స్త్రీ మనోభావనలకు ప్రాముఖ్యత ఉండడంచే ఈ మాట చెప్పారని నా భావన. 
భర్త సుఖదుఃఖాలయందు మిత్రునిలా ఉండడం, మంచిచెడ్డలను కలిసి పంచుకోవడం ఎంతో ఉత్తమం. అందుకే వివాహ సమయమందు దంపతుల నడుమ గాఢమైన సఖ్యతకు బాటవేస్తూ - వరుని నోటంటా అద్భుతమైన పలుకులను పలికిస్తుంది వేదం - నాతో ఏడడుగులు కలిసి నడిచి, నా స్నేహితురాలివికా! చిరకాలం స్నేహితులుగా మనం కలిసి జీవిద్దాం అని. ఎంత చక్కటి ప్రమాణం. వీటన్నింటినీ అవగాహన చేసుకున్న ఆలుమగల జీవితమే స్వర్గతుల్యం కదా. 
                                                                         * * * * *

నిజానికి హిందూ వివాహ వ్యవస్థ ఓ ధర్మం. భిన్న దృక్పధములు గల్గిన ఇద్దరిని ఒక్కటి చేసి బంధాలను దృఢం చేసే సంస్కారమే వివాహం. భారతీయ మహోన్నత సంస్కృతీ సాంప్రదాయకాలకు దర్పణం - మన కుటుంబవ్యవస్థ. బలమైన కుటుంబవ్యవస్థకు మూలం - అన్యోన్య దాంపత్యబంధం.
రెండు కుటుంబాలకు వారధిగా మారి, మూడుముళ్ల బంధం ద్వారా భిన్న దృక్పధములు గల్గిన ఇద్దరు ఒక్కటై, విడదీయరాని కొత్తబంధానికి శ్రీకారం చుడుతూ, తమ పవిత్ర కలయిక ద్వారా మరో కొత్తతరానికి నాంది పలుకేటట్లు చేసే సంస్కారమే వివాహం.
అసలు ఈ వివాహం ఎందుకు? 'విశేష విధి ప్రకారం ధర్మానుబద్దంగా ఒకరు మరొకరితో కలిసి పారస్పరిక బాధ్యతను వహించుట'కై అని పెద్దలు చెప్తుంటారు. ఏమిటా పారస్పరిక బాధ్యతలు? స్త్రీ పురుష సుఖజీవనం కొరకు, గృహస్థ కర్తవ్యములైన పంచయజ్ఞములను నిర్వహించుట కొరకు, సత్సంతానం ద్వారా వంశమును నిలబెట్టుట కొరకు.
మన శాస్త్రాలు ఎనిమిది రకముల వివాహముల గురించి తెలిపినను ఆదరణ యోగ్యమైనదీ, అన్నింటిలోనికి విశిష్టమైనదీ, ఆచరణాత్మకంగా కొనసాగుతున్నది "ప్రాజాపత్య వివాహం".
వివాహమంత్రాలను పరిశీలిస్తే -
'ధర్మ పురుషార్థం' ధర్మానుబద్ధంగా గృహస్థులకు బాటవేస్తుంది. కుటుంబ పోషణార్ధం 'అర్ధ పురుషార్థం' ప్రధానమౌతుంది. అటుపై 'కామ పురుషార్థం' ఓ భూమిక వహిస్తుంది.  ఇక ఆపై గృహస్థు ఆశ్రమంలో శాస్త్రానుసారం గురువులను, విప్రులను, అతిధులను భక్తితో సేవిస్తూ, అందరితో ఆత్మీయంగా ప్రవర్తిస్తూ, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించమనే సూచిస్తాయి.

కానీ, నేడు చాలావరకు కుటుంబాల్లో - పరస్పరం అనుకూలముగా అన్యోన్యతగా ఉండటం అంటే ఏమిటో తెలియక అనేక పర్యాయాలు భార్యాభర్తల నడుమ కలతలు రేగుతున్నాయి. చిన్ని చిన్ని విషయాలు కూడా అవగాహనలోపంతో పెద్దవి చేసేసుకుంటారు. మనస్తత్వాలలో తేడా, అభిప్రాయాల్లో తేడా, అహంకారాలు అడ్డం, ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకోవడం, పరస్పరం నిందించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, పరుషవాక్కులతో దూషించుకోవడం, తేలికభావంతో మాట్లాడడం, నొప్పించే పరిహాసాలు చేయడం, ఆధిక్యతను కనబర్చడం .... ఇవన్నీ సహృదయతను కొరవడేటట్లు చేసి స్పర్ధలు పెంచేవే. అలానే భార్యాభర్తల నడుమ తమ తల్లితండ్రులు, తమవారే, తమ బంధుమిత్రులే గొప్పంటే గొప్పనే ఆధిక్యభావం, ఆర్ధిక వ్యక్తిత్వ వైవిధ్యాలు, బంధుమిత్రుల వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. భర్త వ్యసనాల వలనో, భార్య ప్రవర్తనలోని అవకతవకల వలనో సజావుగా సాగాల్సిన సంసారంలో స్పర్ధలు...  ఇలా కలతలకు కారణాలెన్నో! 
ఇటువంటి భార్యాభర్తలు ముందుగా తెలుసుకోవాల్సినవి తెలుసుకోగలగాలి. నిజమైన బాంధవ్యానికి ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం ముఖ్యం. పెద్దలు కూడా తెలియజెప్పాలి.  
                                           



బంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. సుఖదుఃఖాల సమ్మేళనమే జీవితం. కుటుంబంలో ఉన్న అందరిలో మనకు నచ్చినవి మాత్రమే కాదు, నచ్చనివి అనేకముంటాయి. ఇవి ప్రశాంత, ప్రేమైక సౌఖ్యమైన జీవనగమనంలో ఒకింత అవరోధాలే కావొచ్చు. కానీ, అవి లేకుండా బంధాలు లేవు. గులాబీలమధ్యా ముళ్ళు తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన వైవిధ్య సంఘర్షణలు తప్పవు . ప్రియా అప్రియాలు రెండింటినీ స్వీకరించగలిగినప్పుడే బాంధవ్యాలు బలపడతాయి.
                                                



ఆలుమగల తగాదా అద్దం మీద ఆవగింజ నిలిచినంత సేపే అన్నట్లుండాలి. అరమరికలు లేకుండా మనోభావనలు పంచుకోవడం, అవగాహన, ప్రేమ అన్నవి లేనిచో ఏ బంధమూ నిలవదు. అర్ధవంతం కాదు. 
                                    
లోటుపాట్లును తప్పొప్పులను పరస్పరం ఎత్తి చూపించుకోవడం కంటే మనసువిప్పి మసలుకోవడం ముఖ్యం. మాటలే రెండు మనస్సుల మధ్య వారధి. మనసార మాట్లాడుకోవడం మరింత హాయి. 
ఒకర్ని ఒకరు తమ కోరికలు తీర్చే యంత్రంలా కాకుండా ఒకరికై ఒకరం జీవిస్తున్నామన్న భావనతో మసులుకోగలగాలి. భార్యను భర్త, భర్తను భార్య ...  తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించి ప్రయత్నించినంతకాలం ఆ కాపురంలో కలహాలు, కలతలే చోటు చేసుకుంటాయి. భార్య ఎలా ఉన్నా ఆమె నాభార్య, భర్త ఎలావున్నా అతడు నా భర్త అన్న భావంతో పరస్పరం ప్రేమతో గౌరవించుకోవడం, నాదే కరెక్టు, నేనే గొప్ప, నేను చెప్పిందే వినాలన్న ప్రతికూల అహంభావమును త్యజిస్తూ, అహాన్ని అదుపులో వుంచుకొని ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటూ, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలిన, ఎన్ని ఇబ్బందులు జనించిన, రుసరుసలు తగ్గించుకొని, మాటలు రువ్వుకోవడం మాని, ఒకరి వ్యక్తిత్వాన్ని, అభిరుచుల్నీ మరొకరు గుర్తించి గౌరవిస్తూ, ఒకరికై ఒకరు అవగాహనతో అనుగుణంగా నడుచుకుంటే, ఇరువురూ కోరుకునే మార్పు ఇరువురులోను సహజంగా చోటు చేసుకుంటుంది... గృహమే స్వర్గసీమౌతుంది. 
సంతుష్టో భార్యయా భర్తా, భర్తా భార్యా తథైవవచ
యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువమ్
ఏ వంశమునందు భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య ప్రసన్నంగా ఉందురో, ఆ వంశమునందు నిశ్చితంగా కళ్యాణం కలుగును. దంపతులు పరస్పరం అప్రసన్నంగా ఉంటె ఆ వంశంలో నిత్యమూ కలహమే.

                                                          


అన్నం లేకపోవడం పేదరికం కాదు...కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే నిజమైన పేదరికం..!
ఎట్టి పరిస్థితులలోను ఒకరి పట్ల ఒకరికి శాంతి దాంతులు సద్భావాలు సడలకుండా, కష్టాల్ని కలిసి ఎదుర్కోవడం, సుఖాల్నీ సమంగా స్వీకరించడం, సమానాశయ సిద్ధికై ఒకరి ద్వారా ఇంకొకరు, ఒకరికి ఒకరుగా జీవించడం ... ఎంత ఆనందమో ఒక్కసారి ఆలోచించండి. అవగాహనతో ఆత్మీయబంధాల్నీ ఆనందంగా ఆస్వాదించండి. 

22, ఆగస్టు 2017, మంగళవారం

శ్రీ గణపతిని సేవింపరారే .....

                                                                             
                                               
శ్రీ గణేశ ప్ర్రార్ధన 

తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్ 

మెండుగ  మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ 

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 

యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్!


భాద్రపదమాసం - 
చాంద్రమాసరీత్యా పౌర్ణమినాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండటంవలన ఇది భాద్రపద మాసం. 
భాద్రపద శుక్ల చతుర్థి -
ప్రణవస్వరూపుడు, ఆదిదేవుడు, ప్రథమపూజ్యుడు, సకల శుభప్రదుడు, కల్యాణ మంగళ స్వరూపుడు అయిన "గజాననుని" ఆవిర్భవం. 
(పార్వతీదేవి అభ్యంగన స్నానమాచరిస్తూ, నలుగుపిండితో బాలుని సృష్టించి, ప్రాణప్రతిష్ట చేసి, ద్వారంవద్ద కావలి ఉంచగా, తనను అడ్డగించినందుకు శివుడు రుద్రుడుగా మారి ఆ బాలుని శిరస్సు ఖండించి, పిదప పశ్చాత్తాపపడి, ఏనుగు శిరస్సుతో ఆ బాలున్ని పునరుజ్జీవుని జేయడంతో 'గజాననుడు'గా పేరువచ్చింది). 
భాద్రపద శుక్ల చతుర్థి -
గజాననునికి ఈశ్వరుడు గణాధిపత్యాన్ని ప్రసాదించిన రోజు. 
(దేవగణాలకు అధిపతిని నియమించాలని పార్వతీపరమేశ్వరులు వినాయకుడు, కుమారస్వామిలలో ఎవరు సమర్థులో పరీక్షించదలచి, ముల్లోకాలలోని పుణ్యతీర్ధాలను సందర్శించి ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధిపతిగా నియమిస్తామని చెప్పగా, ఆ క్షణమే కుమారస్వామి నెమలివాహనంపై పయనమవ్వగా, మూషికవాహనుడు ముమ్మారు తల్లితండ్రులకు ప్రదక్షిణం చేసి, పుణ్యనదుల్లో స్నానంచేసిన పుణ్యఫలాన్ని సంపాదించి, గణాలకు అధిపతి కాగలిగాడు). 
ప్రణవ స్వరూపం గణపతిం -
సృష్ట్యాదిలో జగత్ సృష్టికి ఏర్పడిన విఘ్నాలను తొలగించడానికి బ్రహ్మ ధ్యానమగ్నుడు కాగా, ఆ పరబ్రహ్మ ఓంకారస్వరూపునిగా, వక్రతుండునిగా (వక్రతలను తొలగించేవాడు. సరిగ్గా కార్యములు సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. ఈ వక్రాలను తొలగించేవాడు వక్రతుండుడు) దర్శనమిచ్చి విఘ్నాలను తొలగించాడు. 
                                                        
సృష్టికి శ్రీకారం 'ఓం'కారరూపంలో ఉద్భవించినది. వేదమంత్రాలు గణాలైతే వాటికి మూలమైన ఓంకారమే గణపతి. సనాతనధర్మంలో సర్వదేవతా శక్తులకు మూలం ఓంకారం. సృష్టారంభంలో, మంత్రంలో, యంత్రంలో, సమస్తదృశ్య ప్రపంచంలో, త్రికాలాదుల్లో, ప్రత్యణువులో ప్రస్ఫుటమయ్యే విశ్వజనీనమైన, విశ్వవ్యాప్తమైన, సర్వ సమగ్రమైన 'ప్రణవ'స్వరూపమే గజాననుడు. అందుకే ఈ వక్రతుండున్ని ఓంకారస్వరూపుడుగా 'గణపత్యధర్వ శీర్షం' వర్ణించింది. ఏడుకోట్ల మంత్రరాశికి మూలమైనవాడు కాబట్టే 'సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతిః' అని సహస్రనామార్చనలో కొలుస్తారు.  
ప్రథమపూజ్యుడు -
వ్యాసులవారు వేదములను విభాగం చేసి పురాణములను రచించాలని ప్రారంభించినప్పుడు ఆదిలోనే అనేక విఘ్నాలు ఏర్పడగా, బ్రహ్మ చెంతకు వెళ్ళి కారణమడుగగా 'స్మరణంవా గణేశస్య ప్రారంభే అన్యస్య వా'  ఏదైనా కార్యం ప్రారంభినప్పుడు ముందుగా గణపతిని ఆరాదించాలి. అది నీవు మరిచావు అనిచెప్పగా, ఎవరీ గణపతి అని వ్యాసులవారి ప్రశ్నకు బదులుగా బ్రహ్మ ఇలా చెప్తారు -
సప్తకోటి మహామంత్రా: గణేసస్యాగమే స్థితాః 
ఓంకార రూపీ భగవాన్ బీజంచ గణనాయకస్య 

అలాగే, దేవతలు అమృతంకై క్షీరసాగర మధనం చేస్తుండగా మధ్యలో పుట్టిన హాలాహలం ధాటికి తట్టుకోలేక దేవతలంతా శివుణ్ణి ఆశ్రయించగా, శివుడు ఇలా చెప్తారు - 
కార్యారంభేతు విఘ్నేశం యేనార్చంతి గణాధిపం 
కార్యసిద్ధిం నతేషాంవై భవేతు భవతాం యధా 

అందుకే - పారమార్ధిక కార్యమైనా, ప్ర్రాపంచిక కార్యమైనా ప్రధమంగా వినాయకుణ్ణి పూజించడం ఆచారం. 
                           
గణేశుడు -
జ్ఞానర్ధ వాచకో గశ్చణశ్చ నిర్వాణ వాచకం 
తయోరీశం పరం బ్రహ్మ గణేశం  (బ్రహ్మవైవర్త మహాపురాణం)
 'గ' జ్ఞానార్ధవాచకం, 'ణ' నిర్వాణ వాచకం. ఈ రెండింటికీ ఈశుడైన పరబ్రహ్మయే 'గణేశుడ'ని మహావిష్ణువు చెబుతాడు. 
గజాననుడు -
ముఖం గజవదనం. పైభాగం గజం. 'గ' గమ్యమైనది 
శరీరం నరాకారం. క్రిందభాగం జగం. 'జ' కారణమైనది. 
క్రింద భాగమైన నరాకారం త్రిగుణాత్మక ప్రకృతికి సంకేతం. గజాకారం పురుష (పూర్ణ) తత్త్వానికి ప్రతీక. ప్రకృతికి చైతన్యం - పురుషుడు, పురుషునికి ఉపాధి - ప్రకృతి. ఈ రెండింటి ఏకత్వమే ఈ విశ్వచలనం. చిన్మయమైన ఈశ్వరతత్త్వం గజవదనం. మాయమయమైన ప్రకృతి నరాకారం. పార్వతీపరమేశ్వరుల సమన్వయతత్త్వమే గణపతి ఆకృతి. శరీరం శక్తిమయం, శిరస్సు శివమయం. 
గ' అనే అక్షరం గతిని ,సూచిస్తుంది. 'జ' అనే అక్షరం జన్మను సూచిస్తుంది. ఈ 'గజ' అన్న పదం "ఈ జగత్తు ఎవరినుండి వెలువడిందో వారి వైపే సాగిపోతూ చివరికి వారిలోనే లయమవ్వడాన్ని సూచిస్తుంది. 
గణాధిపతి  - 
గణపతిని జేష్ఠరాజుగా, బృహస్పతిగా, బ్రహ్మణస్పతిగా, వేదాలు అభివర్ణించాయి. 'బృహతీనాం వేదవాచాం పతిః' బృహతి అనగా వాక్కులు. దీనికి అధిపతి బృహస్పతిగా, వేదవిజ్ఞానాలు,ఉత్తమ కర్మలే బ్రహ్మణాలు. వీటికీ అధిపతి బ్రహ్మణస్పతిగా స్తుతించాయి.  
మంత్ర గణాలకీ, జీవగణాలకి అధిపతి. ఛందో గణాలకు అధిపతి. అందుకే గణాధిపతి అనే పేరు వచ్చింది. 
గణ అంటే పుర్యష్టకము (ఎనిమిదింటితో కూడుకున్న పురం). 1. పంచకర్మేంద్రియాలు, 2. పంచజ్ఞానేంద్రియాలు 3. పంచభూతాలు 4. పంచప్రాణాలు 5. కామ 6. కర్మ 7. అవిద్య 8. మనస్సు - వీటితో కూడుకున్నదే సూక్ష్మదేహం. వీటి ఆధీశ్వరత్వమే గణేశ్వరత్వం.
సంకేతాలమయ స్వరూపం - 
తత్త్వపరంగా గణపతి నామాలకు ఎన్ని పరమార్ధాలున్నాయో, ఆయన ఆకృతిలో అన్ని అంతరార్ధాలు, అద్భుత సంకేతాలున్నాయి. 
ఏనుగుతల నుంచి ఎలుకవాహనం దాకా ... అంగాంగామూ అమూల్యమైన సంకేతమే. గుమ్మడికాయంత తల గొప్పగా ఆలోచించమని చెప్తుంది. చాటెడు చెవులు శ్రద్ధగా వినమంటాయి. బుల్లినోరు వీలైనంత తక్కువగా మాట్లాడమంటుంది. చిన్నికళ్ళు సూటిగా లక్ష్యానికే గురిపెట్టమంటాయి. బానపొట్ట బ్రహ్మాండాన్ని, స్థిరత్త్వాన్ని తలపిస్తుంది. తొండం ఎటైనా తిరుగుతుంది. ఎంతదూరమైనా చొచ్చుకొని వెళ్తుంది. ఎంత సూక్ష్మమైనదైనా సునాయాసంగా అందుకోగల్గుతుంది. ఎంత పెద్ద బరువైన అవలీలగా అందుకుంటుంది. జ్ఞానసముపార్జనలో ఈ రీతిలో ప్రయత్నం ఉండాల్సిందేనన్న సంకేతమిస్తోంది. మనిషిలోని చంచల స్వభావమే చిట్టెలుక. అహాల్నీ అత్యాశల్నీ ఎప్పుడూ నెత్తిన ఎక్కించుకోకూడదు. నిగ్రహశక్తితో వాటిని ఓడించాలి. మెడలువంచి సవారీ చేయాలి. 
మరింత నిశితంగా పరిశీలిస్తే - 
వినాయకుడి తల ఏనుగుది. ఏనుగు జంతువులన్నింటిలో సూక్ష్మగ్రాహి. కళ్ళు చిన్నవే కానీ, చూడగానే దేనినైనా ఆకళింపుచేసుకుంటాయి. చేటల్లాంటి పెద్దచెవులు. చేటను సంస్కృతంలో 'శూర్పం' అని అంటారు. కనుకనే గణపతికి 'శూర్పకర్ణుడు' అని మరియొక నామం. పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించమనే సంకేతమిస్తున్నాడీ శూర్పకర్ణుడు. 
మనిషికూడా మాటల్లో చెడుని వదిలిపెట్టి, మంచిని మాత్రమే తనచెవులద్వారా గ్రహించాలన్న సంకేతముంది. పెద్దతల జ్ఞానానికి గుర్తు. ఒకే ఒకదంతం శక్తికి చిహ్నం. పెద్దబొజ్జ బ్రహ్మాండాన్ని తనలో ఇముడ్చుకున్నానని సూచిస్తుంది. వక్రతుండం బుద్ధి కుశలతకు ప్రతీక. గణపతి వక్రతుండం ఓంకార ప్రతీక. చేతిలోని పాశ అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. మోదకం ఆనందానికి ప్రతీక. పరమానందాన్ని ప్రసాదిస్తాడు గణపతి. లంబోదరానికి బిగించిన సర్పం కుండలినీ శక్తికి సంకేతం.
గణపతి వాహనం ఎలుక. (మూషికుడనే రాక్షసుడు విఘ్నేశ్వరునితో యుద్ధంలో ఒడి, శరణుజొచ్చగా అతన్ని వాహనంగా చేసుకున్నట్లు పురాణకధనం). ఎలుక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు ప్రతీక. అంతేకాదు, తమో రజోగుణాలు విధ్వంసకారక శక్తికి సంకేతం. 
{ఇదియే కాక, సింహం నెమలి కూడా వాహనాలైనట్లు ముద్గలపురాణం చెబుతుంది. మత్సరాసురుడనే రాక్షసుని సంహారనిమిత్తం వక్రతుండావతారం దాల్చినప్పుడు సింహం వాహనమైనది. కామాసుర సంహారనిమిత్తం వికటావతారమెత్తినప్పుడు నెమలి వాహనమైంది}.
                                                 
                                       
ప్రకృతి ప్రియుడికి పత్రార్చన - ఏకవింశతి పత్రపూజ - 
గణపతి పూజకు 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. ఈ పత్రాలన్నీ అత్యంత ఔషధగుణాలున్నవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం ద్వారా వాటిలో ఉండే ఔషధీ విలువలను మనం పొందగలం. గణపతి ఏకవింశతి (21) సంఖ్యాప్రియుడు. 21 దూర్వాలతో (గరికలతో) పూజించమని పెద్దలు పేర్కొంటారు. ఈ 21 అనే సంఖ్యకు అంతరార్దంగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, మనస్సు అని భావన చేసి శరణాగతితో సమర్పణ చేసిన, జన్మసాఫల్యానికి మార్గం సుగమం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు అర్ధం చెప్తుంటారు. 
గరికపోచలు ఇరవైఒకటిగా కూర్చి, వాటితో చేసే పూజ గణపతికి ఎంతో ప్రీతికరం. (పూర్వం అనలాసురుడనే రాక్షసుడు అగ్నిజ్వాలలు వెదజల్లుతూ భయభ్రాంతులను చేస్తూ ఉంటే, ఆ రాక్షసున్ని పట్టి, అగ్నిని చల్లార్చి నశింపజేసిన గణపతిలో తాపం జనించగా, ఎన్ని ఉపచారాలు చేసిన ఆ తాపం తగ్గకపోవడంతో, ఎనభైఎనిమిది వేలమంది ఋషులందరు కలిసి ఒక్కొక్కరూ ఇరవైఒకటి చొప్పున గరికెలు తెచ్చి స్వామికి వీచగా, తాపం ఉపశమించడంతో గరికపూజ ప్రీతికరమని కధనం). 
'ఓం ఓషధీవతంతు నమః' అనేది విఘ్నేశ్వరుని సహస్రనామాల్లో ఒకటి. ‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ అంటూ శ్రుతి గరికను దేవి అని ప్రస్తావించింది. ఇది దుస్వప్నాలను నివారిస్తుంది. స్వప్నతుల్యమైన జగత్తులో అజ్ఞాన ప్రేరిత స్వప్నస్థితి నుండి మెళుకువను (జాగృతి) అభిలషిస్తూ కేవలం నిరాకార నిర్గుణ సద్గుణ తత్త్వబోధకై గణపతి పూజలో ఋషులు గరికను విధించారని శాస్త్ర వచనం.
జ్యోతిష్య శాస్త్ర సంకేతాలు -
హస్తా నక్షత్ర సంజాతం విఘ్నేశ్వరం గజాననం 
పార్వతీ హదయాంబోధి సోమాంసదా స్మరామ్యహమ్ 
జనన నక్షత్రం హస్త. కన్యారాశి. మేషరాశి నుండి ఇది ఆరవరాశి. కాలభావచక్రంలో షష్టమభావం శత్రు, ఋణ, రోగాలను తెలియజేస్తుంది. ఈ మూడూ మానవుని పారమార్ధిక ప్రగతికి, ప్రాపంచిక ప్రగతికి విఘ్నాలు కలిగిస్తుంటాయి. అందుకే ఈ రాశిలో చంద్రుడు ఉండగా, పుట్టిన విఘ్నేశ్వరుడు ఈ మూడు రకాలైన విఘ్నాలను తన భక్తులకు తొలగిస్తాడు. అంతేకాదు, కన్యారాశినుండి చంద్రుడు సమసప్తక దృష్టితో సూటిగా వీక్షించే రాశి మీనరాశి. ఇది కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. కాలభావచక్రంలో ఈ పన్నెండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాతశత్రువుల్నీ తెలుపుతుంది. ఇవన్నీ మన ప్రగతికి విఘ్నాలే. అయినాసరే, కన్యలో కూర్చొని ఈ విఘ్నాలపైనా కూడా దృష్టి సారించి, సవరిస్తాడీ హస్తిముఖుడు. 
చతుర్థి పూజ పరమార్ధం - 
జగత్తు త్రిగుణాలతో కూడింది. దీనికి మూలమైన పరమాత్ముడు ఏకం. రెండూ కలిపితే నాలుగు. ఈ సంఖ్య గణపతిని తెలియజేస్తుంది. అ, ఉ, మ - మూడు. (ఓం). నాల్గవది తురీయం. ఈ నాలుగింటి సమైక్యరూపమైన ఓంకారమే గణపతి సాకారం. ఏకమైన పరమాత్మనీ, మూడైన ప్రపంచాన్ని కలిపి ఒకే భగవత్స్వరూపంగా చూడడమే గణపతి ఆరాధనలో అంతరార్ధం. 
శుక్ల  పక్ష చవితిచంద్రుడు అంటే దినదిన ప్రవర్ధమానమయ్యే చంద్రుడు. ఈరోజు వినాయకుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తే మనమూ దినదిన ప్రవర్ధమానమౌతామని తెలుపుతుంది శాస్త్రం.
అవతారాలు - అసురసంహారాలు - అంతరార్ధాలు -
వక్రతుండావతారంతో మత్సరాసురున్నీ, ఏకదంతావతారంతో మదాసురునీ, మహొదరావతారంతో మోహాసురున్నీ, గజాననావతారంతో లోభాసురున్నీ, లంబోదరావతారంతో క్రోధాసురున్నీ, వికటావతారంతో కామాసురున్నీ, విఙ్ఞరాజావతారంతో మమాసురున్నీ, ధూమ్రకర్ణావతారంతో అహంకారాసురున్నీ సంహరించినట్లుగా ముద్గలపురాణంలో గణేషలీలలయందు వివరింపబడింది. ఈ ఎనిమిది అవతార లీలల్లో అసురనామాలను పరిశీలిస్తే అవి స్పష్టంగా మానవులోని అసురశక్తులకు సంకేతాలని అవగతమౌతుంది. ఈ ఎనిమిది అసురీప్రవృత్తులను అణచేవాడు గణపతి. 
సాధారణంగా మనం విఘ్నాలకు కారణం బాహ్య పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుష్యులు అని భావిస్తాం. కానీ, అసలు విఘ్నాలకు కారణం మన మనస్సే. అందువల్ల బాహ్యమైన విఘ్నాలు తొలగాలని, చేపట్టిన కార్యాలు సిద్ధించాలని, శుభాలు చేకూరాలని పూజించేకంటే మనలోనున్న విఘ్నాసురులను నశింపజేయమని ప్రార్ధించడం ఉత్తమం. 
విఘ్నకారకాలైన అంతరంగ అసురులు నశించినప్పుడే శాంతి వెల్లివిరుస్తుంది, సమతాభావం నెలకొంటుంది, మమతాభావం పెరుగుతుంది, ధర్మనిరతి పెంపొందుతుంది, ప్రాపంచిక ఆనందం సాధ్యమౌతుంది, పారమార్ధిక ప్రగతి సాకారమౌతుంది, జన్మ ధన్యమౌతుంది. 
గణేష్ నవరాత్రుల్లో రోజుకో సంకేతంను అకళింపు చేసుకొని అన్వయించుకుంటే చాలు, తొమ్మిదోరోజు మనలోని చెడునంతా నిమజ్జనం చేయవచ్చు. 
తత్త్వరహస్యాలు -
యోగశాస్త్రం ప్రకారం గణపతి మూలాధార స్థితుడు. మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది. ఈ శక్తిని మేల్కొల్పడానికి గణపతి బీజాక్షరమే సాధనం. పృథ్వితత్త్వంలో ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతిగా పంచాయతనంలో ఆరాధిస్తారు. ఈ భావానికి సంకేతంగా మట్టితో మూర్తిని మలచి, పత్రాలతో ఫలాలతో అర్చించి, తిరిగి జలతత్త్వంలో మిళితం చేస్తారు. అందుచే ప్రకృతీ ప్రేమికుడైన గణేశుడి ప్రతిమను మట్టితో తయారుచేసి, పూజలనంతరం భక్తిశ్రద్ధలతో ప్రవహించేజలాల్లో నిమజ్జనం చేయడం సర్వవిధాలా శ్రేయస్కరం. 
                                                     
                                   శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం 


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే 
పై శ్లోకం గణపతిని ఈ పదహారు నామాలతో పూజిస్తే ... విద్యారంభంలో, వివాహంలో , క్రొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, యుద్ధంలో ఇలా సకల కార్యాములయందు ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యాలు సిద్ధిస్తాయని ఫలశ్రుతి. ఎంతటి అద్భుతమైన ఫలశృతి యిది. 
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా 
సంగ్రామే సర్వకార్యేషు విఘ్న: తస్య న జాయతే 
'విద్యారంభే'- విద్యారంభం నందూ, అంటే విద్యను నేర్చుకునేటప్పుడు, అనగా బ్రహ్మచర్యాశ్రమంలోనూ,
'వివాహేచ'- వివాహామందు, అనగా గృహస్థాశ్రమంలోనూ, 
'ప్రవేశే' -  ఒక చోటు లేదా ప్రదేశమందు ప్రవేశించించుట యందునూ, అనగా, క్రియలోనికి ప్రవేశించినప్పుడునూ,  
'నిర్గమం' - తిరిగి వచ్చుట లేదా తిరిగి వెళ్ళుట. అనగా ఓ క్రియ నుండి తిరిగి మరో క్రియలోనికి తిరిగి వచ్చుట యందునూ, అంటే మొదట ప్రవేశించిన కార్యమునుండి మరలి, వేరే కార్యంలోనికి వెళ్ళినప్పుడూ,  
'సంగ్రామే' - జీవితమంటే మంచి చెడుల, సుఖ దుఃఖాల, వివిధ అనుభవాల అనుభూతుల సమాహారం. ద్వంద్వాలతో కూడుకున్నది. అందుకే జీవితమొక సంఘర్షణ లేదా పోరాటమని  విజ్ఞులంటారు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. అజ్ఞానంతో పోరాడితేనే జ్ఞానం వికసిస్తుంది. పోరాటంనుండే జీవనమారంభమౌతుందని పెద్దలు పేర్కొంటారు. అంటువంటి సంఘర్షణ లేదా పోరాటం  ఓ యుద్ధమే. అట్టి సంఘర్షణమయ సంగ్రామంలో విఘ్నాలుండక విజయమే సిద్దిస్తుందనీ,
'సర్వకార్యేషు విఘ్న: తస్య న జాయితే' - పై యే కార్యమలందూ విఘ్నాలుండవని, శాస్త్ర వచనం. 
ఇంతటి ఫలశ్రుతినిచ్చే ఈ పదహారునామాలను త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్దలతో మన నిత్యప్రార్ధనలో భాగం చేసుకుంటే సదా సర్వత్రా శ్రేయోదాయకం. 

[పండుగ అంటే క్రొత్తబట్టలు, పిండివంటలు, బంధుమిత్రుల కలయిక ... మాత్రమే కాదు, ప్రతీ పండుగలో అంతరార్ధముంటుంది. మనిషి మనీషి కాగలిగే పరమార్ధాలుంటాయి. ఎన్నో సందేశాలుంటాయి. వాటిని అవగాహన చేసుకొని, ఆచరణలోనికి తేగలిగితేనే జన్మ చరితార్ధమౌతుందని మా తాతయ్యగారు చెప్పిన మాటలు, అప్పుడప్పుడు అక్కడక్కడా విన్నవీ, చదివినవి మననం చేసుకుంటూ, మరో మూడురోజుల్లో రాబోతున్న 'వినాయక చవితి' సందర్భంగా గణపతయ్య పాదపద్మములకు సమర్పించుకుంటున్న చిరు పుష్పమీ టపా]

30, జులై 2017, ఆదివారం

"తత్త్వజ్ఞాన ప్రభోదం - సుయజ్ఞోపాఖ్యానం"

ఈ మధ్య-
నా స్నేహితురాలు విశాల 'సుయజ్ఞోపాఖ్యానం' గురించి  ప్రస్తావించగా నా మనస్సు గతంలోనికి జారుకుంది ... 
అమ్మ భౌతికంగా దూరమయినప్పుడు ఆ దుఃఖంలో నేనున్నప్పుడు నా ఆత్మీయనేస్తం హరిప్రియ నన్ను సముదాయిస్తూ, ఒకింత గదమాయిస్తూ ...  భాగవతం సప్తమ స్కంధం లో సుయజ్ఞోపాఖ్యానంను చేతిలోపెట్టి చదువమని శాసించింది. నేను చదివాక, 
భారతీ! బాధలో ఉన్నప్పుడు సత్యం తెలిసిన మాయలోపడి అన్నీ మర్చిపోతుంటాం. నేను చెప్పింది కాస్త అర్ధం చేసుకోమ్మా...  అంటూ ఇలా చెప్పింది -
                                                   

భాగవతమును శ్రీశుకుడు ఉపదేశం చేసేప్పుడు పరిక్షిత్తుమహారాజు ఒక్కరే లేరు. ఆయన చుట్టూ ఎన్నో వేల మంది ఉన్నారు. రాజు రాజ్యం వదిలి పెట్టి ఉంటే వారంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఋషులు కూడా అక్కడ చేరి ఉన్నారు. గంగను మించిన జన ప్రవాహం ఉంది అక్కడ. అందరూ భాగవతమును విన్నారు, మరి అందరూ తరించారా? ఊహు ... తరించింది ఒక్క పరిక్షిత్తుమహారాజు మాత్రమే. ఎందుకంటే అది విన్న వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. అందులో కొందరు రాజుగారికి సప్తదినాల్లో మరణమని తెలిసి, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి విన్నవారు, మరికొందరు ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు విన్నవారూ ఉన్నారు. కానీ పరిక్షిత్తుమహారాజుకే మోక్షఫలం దక్కింది. అదేమి పక్షపాతం కాదు. విన్నవారి యోగ్యతబట్టే ఫలితం. తెలుసుకోవాలని తపన మూర్తీభవించి విన్నవాడు తరించాడు. శ్రవణం చేస్తుంటే తిండి నీరు నిద్ర అసలేం వద్దు అన్నాడు. దాహం, ఆకలి, అలసట అనేది అనిపించటం లేదు అని అన్నాడు. ఆయనకున్న శ్రద్ధ, తపన అలాంటిది. అందుకే ఆయనకి మోక్షం వెంటనే లభించింది. భారతీ! మనం అంతటి యోగ్యులంకాము కానీ, ఆధ్యాత్మిక అభిలాష కలవారం. కాస్తో కూస్తో దైవ చింతన వున్నవారం. అందుకే అవగాహనతో సుయజ్ఞోపాఖ్యానంలో తత్త్వమును గ్రహించి, ఎప్పటిలా సరైన మార్గంలోనికి వస్తావో, కుళింగ పక్షిలా దుఃఖంతో గడిపేస్తావో నీవే నిర్ణయించుకో అంటూ హితోపదేశం చేసింది. 

అసలు ఏమిటీ ఈ సుయజ్ఞోపాఖ్యానం? ఈ కధనం దేనిని తెలుపుతుంది? గతంలోనికి జారిన మది మరోమారు మననం చేసుకుంది.  

అసలు కధనం ఏమిటంటే - 
హిరణ్యకశిపుడు దుఃఖంతో, మరణించిన తన సోదరుడైన హిరణ్యాక్షునికి అంత్యక్రియలు చేసి, అతని భార్యలను పుత్రులను ఓదార్చి, పుత్రశోకంతో కుమిలిపోతున్న తన తల్లియైన దితిన్ని ఊరడిస్తూ ఇలా చెప్తాడు -
అమ్మా! లోకం ఒక చలిపందిరి వంటిది. ప్రాణులందరూ దాహార్తులై వచ్చిన బాటసారులు. వాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నట్లు, మనం కూడా ఈ సంసారంలోనికి వచ్చి మనపని కాగానే వెళ్ళిపోతూ ఉంటాం. కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం.
తల్లీ! ఆ ఈశ్వరుడు సమస్తానికి అధిపతి. సర్వమూ తెలిసినవాడు. సర్వత్రా నిండియుండేవాడు. ఆ ప్రభువు సత్యుడు, నిత్యుడు, నిర్మలుడు, ఆద్యంతములు లేనివాడు, ఆత్మస్వరూపుడు.
కదలనిచెట్లు కదలాడే నీళ్లలో కదులునట్లు కనబడు విధంగా, భ్రమతో నిండినటువంటి కళ్ళకు భూమి చంచలంగా తోచిన విధంగా, భావ వికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చలించే మనస్సు గలవాళ్ళకు చంచలుడుగా అనిపిస్తాడు. కానీ, ఆ భగవంతుడు అచంచలుడు.
మాతా! భగవంతుడు ఇదిగో ఈ విధంగా ఉంటాడు, ఈ లక్షణాలతో ఉంటాడు ... అని నిర్ధారణ చేయలేం. కాని, అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు పొంది సంసార కర్మబంధాలలో చిక్కుకొని యోగవియోగాలు అనుభవిస్తుంటాడు.
పుట్టుక, వినాశం, శోకం, వివేకం, అవివేకం, చింత, స్మరణం అనేవి అనేక విధాలు. ఈ పరమార్ధం వివరించటానికి పెద్దలు "ప్రేతబంధు యమసంవాదం" అనే కథను చెప్తారు. ఆ కథ చెప్తాను, విను అని హిరణ్యకశిపుడు తన తల్లికి చెప్పిన కధే సుయజ్ఞోపాఖ్యానం - 

ఉశీనరదేశంలో సుయజ్ఞుడనే రాజుండేవాడు. అతడు యుద్ధంలో శత్రువులచేతికి చిక్కి మరణించగా, ఆరాజు మృతదేహం చుట్టూ చేరిన అతని భార్యాపుత్రులు, బంధుజనాలు తలలు బాదుకుంటూ, గతస్మృతులను తలుచుకుంటూ, నీ ఈ వియోగం భరించలేం... నీతోపాటు సహగమనం చేసి మేమూ నీ సన్నిధికి చేరుకుంటామంటూ హృదయవిదారకంగా విలపించసాగారు. సూర్యుడు అస్తమించే వేళ అయింది. ఆ సమయంలో వారి రోదనం విని విప్రబాలుని వేషంలో యముడు వచ్చి, వారిని ఓదార్చుతూ ఇలా భోదించసాగాడు -
                                      
మచ్చిక వీరికెల్ల బహుమాత్రము జోద్యము, దేహి పుట్టుచుం
జచ్చుచునుండ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ
చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాగవచ్చునే?
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజం ప్రాణికోటికిన్
                                   
ఎక్కువ మక్కువ పెంచుకొని కాలం తీరిపోయిన వారికోసం ఇంతలా దుఃఖించడం చోద్యంగా ఉంది. పుట్టినవారు గిట్టక తప్పదు, పుట్టిన తర్వాత గిట్టని ప్రాణి అంటూ ఉంటుందా? ఇది మీరంతా నిత్యం చూస్తుంటారు కదా. మీరు చనిపోనివారిలాగా చనిపోయిన వారికోసం విలపిస్తారేమిటి? మృత్యువును తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదే. ప్రాణి ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చెనో, మరల అక్కడికి పోవటం తప్పనిసరి కదా!
అని, ఇంకా ఇలా వివరిస్తున్నాడు యముడు -
పరమేశ్వరుని అనుగ్రహముంటే క్రూరమృగాలున్న అడవుల్లో ఉన్నా, సురక్షితంగానే ఉంటాం. ఎలాగంటే, తల్లిగర్భంలో ఉన్న శిశువును పోషించునట్లు. సర్వత్రా సర్వవిధాలా ఆయనే రక్షకుడు. ఈ విశ్వమును సృష్టించేది, రక్షించేది, నశింపజేసేది ఎవడో, అనంతమూర్తి ఎవడో, బ్రహ్మాండానికి అధిపతి ఎవడో ... వాడే లీలావిలాసంగా ఈ లోకాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు. ధనమును వీధిలో పడవేసినా దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది. గీత బాగుండకపోతే ఇంట్లో మూల భద్రపరిచిన మటుమాయమై పోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్నా, భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి పొందుతాడు. అది లేనివాడు సౌధాల లోపల రక్షకభటులతో రక్షింపబడుతున్న రాజైనా మరణిస్తాడు. పరమాత్ముడు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అయినా ఈ ప్రాణికోటి కాలానికీ, కర్మకూ వశమైపోయి ఈ బ్రహ్మాండ చక్రంలో ప్రవర్తిల్లుతుంటుంది. ఆ ఆత్మస్వరూపుడు త్రిగుణాలకు లోబడినవాడు కాడు. ఆ గుణాలకు అతీతుడైన విశ్వనాథుడాతడు.
                                  
పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహం ఒక భవనంలాంటిది. ఆ భవనం వంటి శరీరంలో ఆత్మపురుషుడు (జీవుడు) పూర్వకర్మానుసారియై ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలం తీరిపోగానే ఆ భవనం నుండి వెళ్ళిపోతాడు. దేహం అశాశ్వతం, అందులోని ఆత్మస్వరూపుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది గాని, లోపలున్న ఆత్మనకు మాత్రం నాశనం లేదు. ఆత్మ, దేహం వేరు వేరే కానీ ఎప్పుడూ ఒకటికాదు. ఆరణిలో అగ్ని దాగివున్నట్లు, శరీరంలో వాయువున్నట్టు, తామరతూడు లోపల శూన్యమున్నట్టు దేహంలో దేహి వేరుగా విలసిల్లుతుంటాడు.
అని అనేకరీతుల్లో తత్త్వోపదేశం చేస్తూ, ఇంకా నిట్లనియె -
ఆ ఆత్మస్వరూపుడు పంచభూతాలను, పంచేంద్రియాలను, మనస్సునూ, లింగదేహమునూ విలాసంగా ధరిస్తాడు. మరల విడిచిపెడతాడు. అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు వేరుగా ఉంటాడు. అతడే సర్వాధిపతి. కాబట్టి దీనికోసం మీరు బాధపడడం, దుఃఖించడం అవివేకం.
ఎప్పటివరకు ఆత్మ దేహమును ధరించి యుంటుందో అప్పటివరకు ఈ కర్మయోగం జరుగుతూనే వుంటుంది. ఆత్మ దేహమును విడిచిపెట్టగానే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. వీటితో సంబంధమే ఉండదు. ఈ మాయా యోగంవల్ల చలించే హృదయంతో కుమిలిపోవడం వృధా కదా.
అజ్ఞానాంధులైన కొందరు ఆ మహామాయ అనే భ్రాంతిలో పడి తల్లితండ్రులపై, భార్యాపుత్రాదులపై, స్నేహితులపై, ఆశ్రితులపై అనురాగాలూ, అనుబంధాలూ పెంచుకొని ఇళ్ళూ వాకిళ్ళూ సంపదలు, సామ్రాజ్యాలు సంపాదించుకుంటారు. ఎక్కడైనా కలలో కన్పించిన సంపద యదార్ధం అవుతుందా? కర్మానుబంధం ఉంటే సంయోగం కలుగుతుంది. కర్మఫలం అనుభవించాక బంధం విడిపోయి, వియోగం ఏర్పడుతుంది.
ఈ మాయాప్రపంచ రహస్యం తెలుసుకున్న మునులు, జ్ఞానులూ శాశ్వతమైన వాటిని గురించి సంతోషించరు, అశాశ్వతమైన వాటిని గురించి దుఃఖించరు. అజ్ఞానులు, అవివేకులూ మాత్రమే సంయోగం కలిగితే పొంగిపోతారు, వియోగం కలిగితే కృంగిపోతారు.
పూర్వం ఒక అడవిలో పక్షులను వేటాడి జీవించే వేటగాడొకడు సూర్యోదయం కాగానే వేటకోసం వెళ్లి, వలపన్ని పక్షులను పట్టి, రెక్కలు విరిచి సంచిలో వేసుకుంటూ అడవంతా తిరుగాడుతుండగా ఒకచోట అడవిపిచ్చుకల జంటను చూసి, ఉరిపన్ని ఆడపిచ్చుకను పట్టి, రెక్కలు విరిచి చిక్కంలో వేసుకున్నాడు. అది చూసిన మగపిచ్చుక ఆడపిచ్చుకకై విలపిస్తూ  గద్గద స్వరంతో బ్రహ్మ మన తలరాతలను ఇలా రాశాడా, విధియొక్క చేతలును ఏమనాలి, మన పిల్లల్ని ఎలా చూడాలి, వాటి రోదనను ఎలా భరించాలి ... అని పరి పరివిధాల రోదిస్తున్న మగపిచ్చుకను అప్పుడే చూసిన బోయవాడు వేగంగా బాణం సంధించి నేలకూల్చాడు. ఆయువు తీరితే ఎంతటివారైనా మరణించక తప్పదు కదా
ప్రాణం పోకడ, వానరాకడ తెలియదంటారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మీరు మీ సంగతి మర్చిపోయి చనిపోయి నేలమీద పడియున్న ఈ మహారాజు శవం చుట్టూ చేరి శోకించడం వ్యర్థం. ఇలా వందసంవత్సరాలు విలపించినా మీ నాధుణ్ని చేరుకోవడం దుర్లభం. చనిపోయినవారు తిరిగి లేచివస్తారా?
ఈ విధంగా బాలకుని రూపంలో వచ్చి చెప్పిన యముడు మాటలు విన్న వారంతా విశ్వం శాశ్వతం కాదని తెలుసుకొని, శోకం మాని, కర్తవ్యం ఆలోచించి, సుయజ్ఞ మహారాజుకు ఉత్తరక్రియలు చేసి వెడలిరి. అటుపై యముడు అంతర్ధానమయ్యాడని చెప్తూ, హిరణ్యకశిపుడు ఇంకా ఇలా పలికెను -
ప్రాణులకు పరతత్త్వ చింతన లేకపోవడంచేత మనవాళ్ళు అని, ఇతరులు అనీ తేడాగా భావిస్తారు. ఎవరు పరులు? ఎవరు తనవారు? వారు - మేమూ అని అజ్ఞానులే అనుకుంటారు. ఆలోచిస్తే అందరూ ఒకటే. అని వివరంగా చెప్పగానే తల్లి దితి, ఆమె కోడళ్ళు తత్త్వం గ్రహించి, విలపించడం మానుకున్నారు. ఇదే సుయజ్ఞోపాఖ్యాన కధనం. 

భారతీయవాజ్మయంలో రామాయణం, మహాభారతం, భాగవతములు పరమ ప్రామాణికమైన మహోన్నత ఇతిహాసాలు. 
భాగవతం, భగవంతుని మరియు భాగవతుల దివ్యగాథ. అమృత సుధ. ఇందులో ఏ గాథయినా మన జీవనగమనం సవ్యదిశలో సాగేలా మార్గనిర్దేశం చేసేందుకే. జీవితపరమార్ధాన్ని సాధించడానికి దివ్యసందేశాన్ని ప్రభోదించడానికే. భాగవతపఠనం ముక్తిదాయకం, మోక్షసోపానం. పరీక్షిత్తు మహారాజును మాధ్యమంగా చేసుకొని, ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతుండే మానవులందరికీ ఈ సంసార మాయాజలధిని దాటే తరుణోపాయాన్ని శ్రీశుకుడు శ్రీమథ్భాగవతము ద్వారా సర్వులకూ అందించాడు. భాగవతాన్ని ప్రతి మనిషి భావగతం చేసుకుంటే ఇహపరాలను సార్ధకం చేసుకున్నట్లే. 
మరణం అనివార్యమని తెలిశాక, ఆ ఆఖరిదినాల్లో ఆత్మీయులతో కాకుండా, సంసారబంధాలు తెంచుకుని పరమాత్మను పొందే తోవను చూపమని ప్రాధేయపడి శుకమహర్షి కృపతో హరిని ధ్యానిస్తూ ఆయనలో ఐక్యమయ్యాడు పరీక్షిత్తుమహారాజు
శరతల్పగతుడైన, స్థిరచిత్తుడై మనస్సులో ఆ దేవదేవుండును నిలుపుకొని, నిలుపుకున్న రూపాన్ని వీక్షిస్తూ, స్తుతిస్తూ నిశ్వాసాన్ని నిరోధించి 
గోవిందుడిలో మమైకమైనాడు గాంగేయుడు. 

కానీ మనం?
అంపశయ్యపై నున్న, అయినవారిపై మమకారం చంపుకోలేక, వ్యామోహం తెంచుకోలేక, ఆశలు విడవలేక, సంసారమునే స్మరిస్తూ వదలలేక వదలలేక ప్రాణాల్ని విడుస్తాం, జన్మ పరంపరలో చిక్కుకుంటాం. ధర్మాచరణ లేక, హరిని చింతించక, తత్త్వాన్ని గ్రహించక, ఆత్మాన్వేషణ ప్రసక్తే లేక, సంసారభోగాల్లో మునిగితేలుతున్న లౌకికులమై జనన మరణ చక్రాల్లో తిరుగాడుతూనే వుంటాం.  
అందుకే మనలాంటివారిని చూసిన మహర్షులు యోగులు విస్మయంతో ఇలా అంటూ, అంతలోనే ఏంచేసి తరించాలో తెలుపుతారిలా - 
పశుకళత్ర పుత్రబాంధవ దేహాది, సంఘమెల్ల తమకు సత్యమనుచు
కాపురములు చేసి కడపట సత్తురు, కనియుగాన రంత్యకాలసరణి
పశువులు, భార్యాబిడ్డలు, బంధువులు, శరీరం ఇత్యాది పరివారమంతటినీ నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ, సాగిస్తూ కడకు కన్నుమూసి కాటిపాలవుతారని, అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారని అంటారు శుకమహర్షివారు. 

దొరసినకాయముల్ ముదిమితోచినజూచిప్రభుత్వముల్ సిరుల్
మెరుపులు గాక జూచి, మరి మేదినిలో తమతోడివారు ముం
దరుగుట జూచి, చూచి, తెగు నాయువెరుంగక మోహపాశముల్
తరుగని వారికేమిగతి దాశరధీ కరుణాపయోనిధీ
దశరథరామా! శరీరములు ముదిసిపోవడంతో శరీరం అస్థిరమనీ, సంపదలు మెరుపుతీగవలె అదృశ్యంకాగా అవి  అస్థిరమనీ, తమ సహచరులు, సమాన వయస్కులు తమకంటే ముందుగానే మరణించినప్పుడు తామునూ మరణించవలసిన వారమనీ తెలుస్తూ ఉన్నప్పటికీ ఆయువు తరిగిపోవడం తెలుసుకోక, అస్ధిరాదులైన దేహాదులలో అజ్ఞానమనే తాళ్లబంధాలలో పట్టుపడుతున్నారు కదా! ఇట్టి అజ్ఞానులకు ఇక గతి ఏంటి? అని వాపోతాడు ఓ రామభక్తుడు.  
మన అస్తిత్వం ఎంత అల్పమైందో నిర్వచిస్తూ అన్నమయ్య ఇలా అంటారు -
మాపులే మరణములు రేపులే పుట్టువులు 
చాపలాలు మాని విష్ణు శరణను మనసా ... 
పుట్టుకలను రేపులతో అంటే ఉషోదయాలతో, మరణాల్ని మాపులతో అంటే సాయంసంధ్యలతో పోలుస్తూ చాపలాలు అంటే చంచల స్వభావాల్ని వదిలేసుకొని భగవంతునికి శరణాగతి చెందమని సూచిస్తాడు. 

ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను... అనే గజేంద్రుడు ద్వారా మనం ఏం చేయాలో తెలుపుతుంది భాగవతం. 
ఇన్నీ తెలిసినా, మాయలో పడిపోతుంటాం. 
అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్ /
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః //
అంత్యకాలమందు ఎవరైతే నన్నే స్మరించుచూ దేహమును విడిచిపెడతారో, వారు నా స్వరూపమును పొందుతారు. నన్నే చేరుకుంటారు. ఇందులో సందేహం లేదని అభయమిచ్చాడు శ్రీకృష్ణభగవానుడు. 

కష్టాల్లో దేవుణ్ణి కొలుస్తూ, సుఖాల్లో మరుస్తూ, ఉన్నాడో లేడో అని అరకొర విశ్వాసంతో జీవనగమనం సాగిస్తే అంత్యకాలంలో స్ఫురణకు స్మరణకు అందడు ఆ అనంతుడు.
కన్నుమూసేవేళ ఆ కారుణ్యమూర్తే కళ్ళముందు కదలాడాలంటే, మనుగడలో మలుపులెన్ని ఉన్నా, మాధవుడినే మనసార విశ్వసిస్తూ, మన దైనందిక జీవితంలో ఆ దేవదేవున్ని ఓ ఆలంబనగా ఆరాధనీయునిగా చేసుకొని, సదా సన్మార్గంలో సాగిపోగలిగే సాధనను సాధిస్తే, సర్వవేళల్లో సర్వేశ్వరుడు స్పురిస్తాడు, అంత్యకాలంలో అంతరంగ ఆలయమున అనంతుడై అగుపిస్తాడు, అప్పుడు ఆ అంతర్యామిలోనే ఐక్యమౌతాం. 

 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదం గాక! 

తొలిసంధ్యలో ఆరవిరిసిన అరవిందాలు మలిసంధ్యలో వాలి రాలిపోవడం సహజం. అట్లే జనించాక మరణించడం కూడా సహజమే. ఇది కాలధర్మం. అయితే ఆ మరణం వెన్నెల్లో పూసిన పారిజాతాలు వేకువలో పరవశంగా పరమాత్మునిపూజకై రాలిపోయినట్లు ఉంటే ఆ జననంకు సార్ధకత ఉన్నట్లే. మరుజన్మ లేనట్లే.