7, అక్టోబర్ 2025, మంగళవారం

కుమార సంభవం

ఇది కదా... స్కంద అనుగ్రహంస్కందుడు చరితం  అను రెండు టపాల తరువాయి భాగం - 

ఇక అసలు కథనం లోనికి వస్తే - 

శివ మాయామోహితులైన ఇంద్రాది దేవతలు అడగకూడని కోరిక కోరుతుంటే, శివుడు చిరునవ్వుతో,  "ఇకపై నా రేతస్సును ఎప్పుడూ పార్వతీదేవి యందు నిక్షిప్తం చేయను. నా రేతస్సును ఓజస్సుగా మార్చి, బ్రహ్మీమయ స్థితియందు తపశ్శక్తితో ఉంటాను. కానీ, ఇప్పుడు నా తేజం బయటికి వచ్చి తీరాలి. ఎందుకంటే నూరు దివ్యవర్షములు పార్వతీదేవితో కలిసి క్రీడించిన కారణం చేత, స్వస్థానమునుండి కదిలిన నా తేజస్సు బయటకు రాక తప్పదు. ఇప్పుడు నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి" అని అనెను. మాయ కమ్మిన వారు, పార్వతీదేవి తప్ప అన్యులు ఆ తేజస్సును భరించలేరన్న సత్యాన్ని గ్రహించలేక, 'భూమి భరిస్తుంది, భూకాంత మీద మీ తేజస్సును విడిచిపెట్టండి' అని అన్నారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరించింది. శివ రేతస్సు భూమి మీద పడింది. మరుక్షణంలోనే మహోత్తరమైన శంకర తేజస్సు భూమి మీద వ్యాపించి సమస్త ప్రాణికోటి స్తంభీభూతమయిపోతుంది. ఆ తేజస్సు వేడిని భరించలేక భూమి తల్లడిల్లుతూ తట్టుకోలేకపోతున్నాను అంటూ గట్టిగా కేకలేస్తుంది. తక్షణమే బ్రహ్మ సూచన మేరకు అగ్నిహోత్రుడు వాయు సహకారంతో వేగంగా భూమిని చేరి, ఆ తేజస్సును తనలో నిక్షిప్తం చేసుకుంటాడు. ఆ క్షణంలోనే పార్వతీదేవి బయటకు వచ్చి, జరిగిన విషయం తెలుసుకొని, ఆగ్రహంతో, "అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకు మీరందరూ ప్రతిబంధకం అయ్యారు. నా హక్కును మీరు కబళించారు. నా కడుపు పండకుండా, నా భర్త తేజస్సు వేరొక స్త్రీ యందు పడేటట్లు చేశారు. చేయకూడని పాపం చేశారు. ఇక మీదట దేవతలకు బిడ్డలు జన్మించకుందురుగాక" అని దేవతలను శపించింది. (అందుకే ఎప్పటికీ దేవతలు ముప్పది మూడు కోట్లు మంది మాత్రమే) అలానే భూమిని చూస్తూ, వీరు అడిగితే, నీవు ఎలా నా భర్త తేజాన్ని పుచ్చుకున్నావు? నీవూ ఆడదానివే కదా, ఇలా చేయడం నీకు తగునా? అందుకే నీవు ఇక వివిధ రూపాలను పొందుతావు. (ఒకచోట సారవంతమైన భూమిగా, మరో చోటా బీడు భూమిగా, ఎడారి భూమిగా, పర్వత ప్రాంతంగా, ఎగుడుదిగుడుగా... రకరకాల రూపాలు) వేరొకరి భర్త తేజస్సును నీవు భార్యగా పొందావు కాబట్టి, నీవు ఉన్నంతకాలం చాలామందికి భార్యవవుతావు. రాజు అయినవాడు భూకాంతుడు. అంటే భూమికి భర్త. భూమిని ఎంతమంది రాజులు పరిపాలిస్తే అంతమందీ వావి వరుసలు లేకుండా నీకు భర్తలే అవుతారు. కొన్ని వేలమందికి ఏక కాలంలో భార్యవగుదువు గాక. నాకు కొడుకు పుట్టకుండా చేశావు. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జనించినా, ఆ బిడ్డ ఆడపిల్లే అవుతుంది తప్ప, నీకు మగ పిల్లవాడు పుట్టడు..." ఇలా అమ్మ భూదేవికి శాపం ఇచ్చిన తర్వాత, దేవతలందరూ సిగ్గుతో తలలు వంచుకుని ఉండిపోయారు. పిమ్మట పార్వతీపరమేశ్వరులు అక్కడ నుండి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు మరింత విజృంభించాడు. మరల దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి, మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ బాగా ఆలోచించి, 'అగ్నిహోత్రుడులో నిక్షిప్తమై ఉన్న శివ తేజస్సును హిమవంతుని పెద్ద కుమార్తె గంగ యందు విడిచిపెడితే, గంగకు కుమారుడు కలిగితే, నా తోడబుట్టిన అక్కే కదా శివ తేజస్సు మోసింది అని  ప్రేమతో పార్వతీదేవి అనుకుంటుంది గానీ, కోపంతో శపించదు కాబట్టి, ఆమెను అడిగి ఆమె యందు విడిచిపెట్టు' అని అగ్నికి చెప్తూ, 'ఈ కార్య నిమిత్తం నీవు ఒక్కడివే గంగ దగ్గరకు వెళ్ళి సామరస్యంగా మాట్లాడు' అని చెప్పగా, అగ్నిహోత్రుడు గంగ దగ్గరకు వెళ్ళి, అమ్మా! దేవతల ప్రియము కొరకు, దేవతలు మరియు లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివునికి కొడుకు పుట్టాలి. శివతేజస్సును పట్టగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. అందుకే తల్లీ, నీవు అందరికోసం ఒక పని చేయాలి. నీవు పరమ సంతోషంతో అంగీకరిస్తే, నీ యందు శివ తేజస్సును ప్రవేశపెడతాను. నీవు గర్భం దాల్చాలి. గర్భం దాల్చడానికి దేవకాంతలు పనికిరారు. కనుక తల్లీ, లోక కల్యాణం కోసం నీవు ఆ తేజస్సును స్వీకరించి కొడుకును కను అని అడిగెను. దీనికి గంగ అంగీకరించడం, శివ తేజస్సును అగ్నిహోత్రుడు గంగ యందు ప్రవేశపెట్టడం జరిగింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ చూస్తుంటారు. ఆమె శివ తేజస్సును తట్టుకోగలదా? గర్భం దాల్చుతుందా? కుమార సంభవం జరుగుతుందా... ఎంతో ఉత్కంఠతో చూస్తుంటారు. ఇంతలో గంగాదేవి 'నేను ఈ తేజస్సును భరించలేకపోతున్నాను. నీరు నీరంతా ఉడికిపోతుంది. ఈ వేడి తట్టుకోలేను. నాలో నీరంతా ఆవిరైపోతుంది, ఈ తేజస్సును నాలో ఉంచుకోలేను...ఈ తేజస్సును విడిచిపెట్టేస్తాను. ఎక్కడ వదిలిపెట్టను? ఇప్పుడు నేను ఏమి చేయాల'ని అడుగుతుంది. (శివ తేజస్సును అమ్మ తప్ప అన్యులు భరించగలరా? పైగా ఈశ్వరుడుకు మాత్రమే మహాజ్ఞాని సనత్కుమారుడు కొడుకుగా పుడతానన్నప్పుడు ఆ శివ తేజస్సు ఏ స్త్రీ యందైన ఎలా నిక్షిప్తం అవుతుంది?). ఇక అందరిలో కంగారు మొదలైంది. అంతట అగ్నిహోత్రుడు పార్వతీపరమేశ్వరులు హిమావత్పర్వతం మీద ఉన్నారు కాబట్టి, వారే చూసుకుంటారు, కాపాడతారు అన్న నమ్మకంతో, గంగతో 'నీవు శివ తేజస్సును భరించ లేకపోతే, ఆ తేజస్సును హిమవత్పర్వతప్రాంతపాదముల దగ్గర విడిచిపెట్టు' అని చెప్పగా, గంగాదేవి అలానే చేసింది. తక్షణమే అక్కడ పెద్ద మెరుపు మెరిసి, ఆ ప్రాంతమంతా మిక్కిలి కాంతితో నిండిపోయింది. తేజస్సు వెళ్ళి రెల్లుగడ్డి మీద పడగా, తక్షణమే ఆ ప్రాంతమంతా తేజోమయమైంది. ఆ శివ తేజం నుండి విశేషమైన బంగారం, తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారములో నుండి రాగి, ఇనుము పుట్టాయి. దాని మలం లోంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమిలో కలిసిపోతే నానారకాల దాతువులు పుట్టాయి. అయ్యో...మనకి కావలసినవి ఇవి కాదు కదా, పైగా తేజస్సు భూమి మీద పడింది, భూమికి కొడుకులు పుట్టరు కదా... అని బెంగగా దిగులుగా చూస్తుండగా, అక్కడ శరవణం (రెల్లుపొదలు) దగ్గరలో ఉన్న శరవణ తటాకంలో పడిన తేజం నుండి బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఒక బాబు లేచి రెల్లు పొదాల మీద పడ్డాడు. కుమార సంభవం జరిగింది🙏. 

ఇక, పార్వతీదేవి సంబంధంగా పుడతానని అన్న సనత్కుమారుడు, పార్వతీదేవికి కొడుకులా ఎక్కడ ఎలా వచ్చాడనే సందేహం వస్తుంది కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సిన కథనం మరొకటి ఉంది.

విశేషవంతమైన శరవణ తటాకం గురించి తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు భస్మాసురుడికి శంకరుడు వరం ఇచ్చిన తర్వాత, తన హస్తమును శంకరుడు తల మీద పెడతానని, ఆ అసురుడు వెంటపడగా, శంకరుడు పరుగెత్తుతుంటే, అమ్మవారు అక్కడ తన శరీరమును ఒక తటాకంగా మార్చింది. దానినే శరవణ తటాకం అని పిలుస్తారు. ఆ తర్వాత అమ్మవారు జగదంబ రూపు దాల్చినా, అక్కడ శరవణ తటాకంలా అలానే నిలిచింది. ఆ తటాకంలోనే పడి,  పార్వతీదేవి శరీరం నందు పడినవాడు అయ్యాడు కావున, అమ్మవారికి కొడుకై భాసిల్లాడు.  అమ్మ గర్భవాసం లేకున్నా, అమ్మ శరీర సంబంధంతో అమ్మకు కొడుకై వచ్చాడు. శరవణభవుడు అయ్యాడు. ఈ విధంగా కుమార సంభవం జరిగింది. దేవతలందరూ పొంగిపోయారు. విజయ దుందుభులను మ్రోగించారు. పుష్పవృష్టి కురిపించారు.
     నా మనుమరాలు శ్రీమాన్వి నాకు బహుకరించిన చిత్రం

శరవణభవ శరవణభవ పాహిమాం 
శరవణభవ శరవణభవ రక్షమాం

తతిమ్మా భాగం తదుపరి టపాలో - 

6, అక్టోబర్ 2025, సోమవారం

స్కందుడు చరితం

క్రిందటి టపా ఇది కదా...స్కంద అనుగ్రహం లో తారకాసురుని గురించి తెలుసుకున్నాం. 

దేవతలు తారకాసురుని బాధలనుండి బయటపడేది ఎలా? కుమార సంభవం జరిగేదేలా?

దక్షయజ్ఞం సమయంలో సతీదేవి యోగాగ్ని నందు శరీరం విడిచిపెట్టేక, పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి, తపస్సులో మునిగిపోయి ఉండెను. 

కొంతకాలానికి సతీదేవి మేనక హిమవంతులకు పార్వతీదేవిగా జన్మించి, పెద్దదవుతుంది.
ఒకరోజు హిమవంతుడు పార్వతీదేవికి తగిన వరుడు శంకరుడే అని నారదుడు ద్వారా తెలుసుకొని, తన కుమార్తెతో, 'అమ్మా! హిమాలయ పర్వత ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్న శంకరునికి శుశ్రూషలు చేయడం వలన శుభం కలుగుతుంద'ని చెప్పి, శంకరుడు తపస్సు చేస్తున్న చోటకు తీసుకువెళ్ళి, శంకరుడు బహిర్ముఖుడయినప్పుడు, 'మీకు సేవ చేయాలని నా కూతురు కోరుకుంటుంది, మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా సేవలు చేస్తుంది'...అని పలు విజ్ఞాపనలు చేసి ఒప్పించి, కూతురితో, 'తల్లీ! ఈ మహానుభావుడిని జాగ్రత్తగా సేవించు, చీకటి పడేవేళకి ఇంటికి చేరు. నీకు శ్రేయస్సు కలుగుతుంద'ని చెప్పి, కూతుర్ని శివుని సేవలకు వినియోగించి వెళ్ళిపోయాడు. అమ్మ కోరికా ఇదే కదా... ప్రతిరోజు శివునికి పరిచర్యలు చేస్తుండేది. ఇలా కాలం గడిచిపోతుందే తప్పా, శివుడు తపస్సు విడవడు. ఇక వీరి కళ్యాణం ఎట్లా? వీరి వివాహం కానిదే, వీరికి బిడ్డ పుట్టనిదే తారకాసుర సంహారం జరగదు. 

ఈశ్వరుని మనస్సును పార్వతీదేవిపై మరలింపజేయడానికి ఇంద్రాది దేవతలు బాగా ఆలోచించాక, ఇంద్రుడు మన్మథుడుని పిలిచి,  శివుడు బహిర్ముఖుడు అయినప్పుడు ఓ పూలబాణం వేసి, పార్వతీదేవితో అనురాగంలో పడేటట్లు చేయమని చెప్పి, లోకరక్షణార్థం నీవు ఈ పని చేయాలని బలవంతంగా ఒప్పించడం, ఇక తప్పదని తెలిసి భయం భయంగానే మన్మథుడు అదును చూసి బాణం శంకరుడుపై వదలడం, చిరు వికారభావం కలిగిన శివుడు తన యందు వ్యగ్రతతో ఎవరు ప్రవర్తించారో గ్రహించడం, మూడవకంటి నుండి చిచ్చు బయలుదేరడం, ఆ అగ్నిహోత్రంలో మన్మథుడు భస్మరాశియై క్రింద పడిపోవడం తృటిలో జరిగిపోయాయి. అనంతరం ఎటువంటి మార్పు చెందని శివుడు మౌనంగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. ఈ వార్త తెలిసిన హిమవంతుడు బాధతో వచ్చి,  నిశ్చేష్టురాలై ఒంటరిగా నిలబడిపోయిన పార్వతీదేవిని అంతఃపురంకు తీసుకొని వెళ్ళిపోతాడు. 

ఇంద్రాది దేవతలు బ్రహ్మ సూచన మేరకు శివుడుని ప్రార్థిస్తుంటారు. కాలం గడుస్తుంది... శంకరుడుని ఎవరు కదిలించగలరు? ఆయనకు ఆయనే కదలాలి. లోకములు రక్షింపబడాలంటే, ఆయనే పూనుకోవాలి. అందుకే శివుడు ఎఱుకలసానిలా అమ్మ అంతఃపురంకు వెళ్ళి సోది చెప్పడం, తత్ఫలితంగా పార్వతీదేవి అరణ్యమునకు వెళ్ళి శివునిని భర్తగా పొందడానికి తీవ్ర తపస్సు చేయడం, శంకరుడు కదిలిపోయి పార్వతీదేవికి తనపై ఎంత ప్రేమ ఉందో లోకానికి చూపించడం కోసం బ్రహ్మచారి వేషంలో రావడం, శంకరుడు గురించి తక్కువ చేసి మాట్లాడుతూ, ఆయన నీకు తగడు...నేనే నీకు సరిజోడి, నన్ను చేసుకో అనడం...ఆ మాటలు విన్న పార్వతీదేవి చెలికత్తెలతో తక్షణమే ఈ శుష్క బ్రహ్మచారిని కొట్టి, అవతలకు తోసేయండి, శివ నింద చేస్తున్న ఈ ధూర్తబ్రహ్మచారి పళ్ళు ఊడిపోయేటట్లు కొట్టండి అని ఆదేశించడం, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పార్వతీదేవి అక్కడ నుండి కదిలి వెళుతుండగా, ఆ క్షణాన్నే శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షం కావడం, అమ్మ తపస్సు ఫలించి, అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగడం జరిగింది. 

ఇక ఇప్పుడు కుమారసంభవం జరగాలి - 
దేవతలంతా వీరిని మీరు ఓ బిడ్డను కనాలని కోరడం, సరే, బిడ్డ పుట్టేంతవరకు మాకు ఎటువంటి అవాంతరం కలిగించకండి అని చెప్పి ఓ గుహలోనికి శివపార్వతులు వెళ్ళిరి. ఆ గుహలో వారి దివ్యమైన క్రీడ ప్రారంభమై శత దివ్య సంవత్సరములు అయినవి. ఇక్కడ తారాకాసురుడు మరింత విజృంభిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. కొద్దిరోజులు ఆగండి, శివునికి పుత్రుడు పుడతాడు అని విష్ణువు చెప్పెను.
ఇప్పుడు శివ మాయ దేవతల మీద ప్రసరిస్తోంది. తత్ఫలితంగా వారి మధ్య ఒక తప్పు చర్చ ప్రారంభమైంది. శంకరుని మహా తేజస్సు, శక్తిస్వరూపిణి అమ్మతో కలిస్తే, వీరిరువురి శుక్రశోణితముల కలయికతో ఆవిర్భవించబోయే పుత్రుడు మహా మహా తేజోమంతుడు అవుతాడు. అటువంటి తేజోమూర్తిని ముల్లోకాలు తట్టుకోగలవా... మనం తట్టుకోగలమా... ఇత్యాది మాటలు మాట్లాడుకుంటూ, అసలు శివ తేజస్సు కదలరాదు అన్న ఆలోచన చేశారు. (శివునికి బిడ్డ పుట్టాలని తపించింది వీరే. ఇప్పుడు అమ్మో, వద్దు అనుకునేది వీరే) అనుకున్నదే తడవుగా పరమశివుడు దగ్గరకు వెళ్ళి, పార్వతీదేవితో లోక రక్షణార్ధం కోసం శృంగారక్రీడలో ఉన్న శివుణ్ణి గట్టిగా ప్రార్థించి పిలిచారు. శివుడు బయటకు రాగా, 'ఓ మహాదేవా, లోకముల హితమును కోరుకునేవాడా, శరణు శరణు, మీ తేజస్సును అమ్మలో నిక్షిప్తం చేస్తే, ఆవిర్భవించబోయే మహా తేజోవంత బిడ్డను తట్టుకునేశక్తి ముల్లోకాలకు లేదు. మీ రేతస్సు స్కలనం కాకూడదు. మీ తేజస్సును మీలోనే ఉంచేసుకోండి. పార్వతీదేవితో ఇక విహరణ వద్దు. ఏదైనా పర్వతశృంగం మీదకు మీ ఇరువురు వెళ్ళి తపస్సు చేసుకోండి'... అని కోరరాని ఘోర కోరిక కోరారు.
ఇలా ఇంద్రాది దేవతలు కోరడానికి కారణం, వీరంతా శివ మాయామోహితులు కావడం వలనే. ఇంతకు ఇక్కడ శివ మాయ ఏమిటి? ఎందుకు? దేవతలపై ఎందుకు తన మాయను ప్రసరింపజేసాడు... తెలుసుకోవాలంటే - 

త్రిపురా రహస్యంలో మహాత్మ్యకాండయందు ఒక సంఘటనను పరిశీలన చేయాలి.

 పార్వతీపరమేశ్వరులు ఓరోజు ఎత్తైన ఋషిపర్వతం మీద విహరిస్తుండగా, అచ్చట ఉన్న ఎందరో మహర్షులు, యోగులు, ఋషులు వీరికి ప్రణమిల్లగా,  బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు అనే బాలుడు అహంబ్రహ్మస్మి స్థితిలో ఉండి, వీరిని ప్రత్యేకంగా గుర్తించక, కదలక ఆత్మస్థితిలో బ్రహ్మానందంలో ఉండడం చూసి, ఆహా! ఎంతటి గొప్ప స్థితి అని శివుడు పార్వతితో చెప్తూ, సనత్కుమారుని చెంత నిలిచి, ''ఏమయ్యా! జగత్తుకే మాతాపితురలం కదా, మమ్మల్ని పలకరించవేమిటి?" అని అడుగగా, 'అంతటా బ్రహ్మమే కనబడుతున్న నాకు మీరు వేరుగా తోస్తే కదా, పలకరించడానికి'... అని బదులిస్తాడు. "నీకో వరం ఇస్తాం, ఏమి కావాలో కోరుకో" అని శివుడు అనగా, 'వరం ఇవ్వడానికి నువ్వొక్కడివి, తీసుకోవడానికి నేనొకడిని అని ఉంటే కదా...ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకే వరమూ వద్ద'నెను. శివుడు లోలోపల ఈయన అద్వైత జ్ఞానస్థితికి ముగ్ధుడౌతు, "అయితే శాపం ఇస్తాను" అని అనెను. 'వరమూ, శాపమూ అని రెండున్నాయా? వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖమూ అని రెండు లేనప్పుడు, నీవు ఏది ఇస్తే నాకేమిటి...సరే, శాపమిచ్చిన ఈ శరీరానికే గాని, నాకు కాదు కదా, ఇవ్వండ'నెను సనత్కుమారుడు. శివుడు ఆనందంతో, "ఏం జ్ఞానమయ్యా నీది. వరం వద్దంటావు, శాపాన్ని ఇస్తానంటే ఇమ్మంటావు" అని అంటుండగా, 'స్వామీ!  వరం అంటారు, శాపం అంటారు ఏమిటిదంతా... కావాలంటే నేనే మీకు వరం ఇస్తాను, ఏం కావాలో అడగండి' అంటాడు సనత్కుమారుడు. దీనికి ఎంతో ముగ్ధుడైన శివుడు, "నాయనా! నీవు నాకు కుమారుడిగా జన్మించు. ఇదే నేను కోరుకునే వరం" అని అన్నాడు. అప్పుడు 'నీకు మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను' అని సనత్కుమారుడు అంటాడు. ఈ మాటకి ప్రక్కనే ఉన్న పార్వతీదేవి "అదేమిటి నీకు మాత్రమే అని శివుడితో అంటున్నావు. నాకు కొడుకుగా పుట్టవా" అని అడుగుతుంది. 'అమ్మా! ఏమీ అనుకోకు, నీకు కొడుకుగా రావాలంటే, నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి. నేను యోనిసంభవుడుగా రానమ్మా. ఆ గర్భస్థ యాతన నాకొద్దు. నేను శివ కుమారుడుగానే పుడతాను...అంతే!' అన్నాడు సనత్కుమారుడు. "అదెలా సాధ్యమవుతుంది? మగవాడికి పుత్రుడు ఎలా  పుడతాడు? లోకంలో ప్రకృతి పురుషుడు లేకుండా జన్మించడం ఎలా కుదురుతుంది? ఆది దంపతులమైన మాకు నీవు పుత్రుడుగా పుట్టాల్సిందే"నని అమ్మ అనగా, 'అమ్మా! పార్వతీపరమేశ్వరులకు కొడుకును అవుతానేమో గానీ, నీ గర్భవాసం లేకుండా నీ కొడుకుగానే వస్తాను. నీ సంబంధంగా పుట్టి, నీ కొడుకుగా కీర్తింపబడతాను' అని సనత్కుమారుడు అంటాడు. ఆ మాటతో ఆదిదంపతులు ఆనందంగా అంతర్థానం అయిపోతారు.

ఆ పిమ్మట ఒకసారి బ్రహ్మజ్ఞాని అయిన సనత్కుమారునికి తాను దేవసైన్యానికి అద్యక్షుడయినట్లు, కత్తి పట్టుకొని, రాక్షససంహారం చేస్తున్నట్లు కల వచ్చింది. అన్నింటికీ సాక్షిగా ఉండవలసిన నేను ఈ కలలో తాదాత్మ్యత పొందాను. ఉద్వేగాన్ని పొందాను. నాలో ద్వంద్వ భావం ఎలా వచ్చింది. తనకి కల రావడమేమిటని విచారణ చేస్తూ, తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, 'నాకు కల రావడం ఏమిటీ? నేను దేవసైన్యములకు అధిపతిని అయినట్లు, రాక్షస సంహారం చేస్తున్నట్లు కల వచ్చింద'ని చెప్పగా, "నాయనా! క్రిందటిజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు, ఈ వేదాలనే కదా రాక్షసులు తస్కరించారు,  సముద్రంలో పడేసారు, ధిక్కరించారు, పరమాత్మను ఇబ్బందిపెట్టి అవతారాలు తీసుకునేలా చేశారని కోపగించుకుంటూ చదివావు. దేవాసుర యుద్ధ ఘట్టాలు చదివినప్పుడు విపరీతమైన భావోద్వేగాన్ని పొంది, నాకే గనుక దేవసేనాధిపతిగా అవకాశం వస్తే, కత్తిపట్టి, వాళ్ళ తలలు నరికేసి ఉండేవాడిని... అని బలంగా అనుకునేవాడివి. ఆ వాసనాబలం చేతనే ఈ కల వచ్చింది. ఈ వాసన పోవడానికి దేవసేనానిగా ఒకసారి నీవు పుట్టవలసిందే. అన్నీ తెలిసిన మహానుభావుడు శంకరుడు. అందుకే నీ వాసనాబలం క్షయం చేయడానికే, నీ చెంతకు వచ్చి, వరం తీసుకున్నాడు. లేకపోతే ఆయన నీకు వరం అడగడం ఏమిటి? నీవు ఆయనకు కుమారుడవై పుట్టబోతున్నావు.  దేవసైన్యమునకు అధ్యక్షత వహిస్తావు"... అని బ్రహ్మ తెలిపెను. 
ఇప్పుడు ఇక్కడ మనం కొంత పరిశీలన చేస్తే, శివుడుచే జరగాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 
మొదటిది : బ్రహ్మ ఇచ్చిన వరం వలన దేవతలను రక్షించడానికి తన వీర్యం నుండి తారాకాసురుడును సంహరించగలిగే కొడుకు రావాలి.
రెండవది: సనత్కుమారుడు వాసనాబలం పోగొట్టాలంటే, ఆ జ్ఞానిని కొడుకుగా కని, దేవసైన్యానికి అధిపతిని చేసి, అసురులను అంతమొందించాలి.
మూడవది : పార్వతీదేవి గర్భవాసం చేయనన్న బ్రహ్మజ్ఞాని సనత్కుమారుని మాట నిలబెట్టాలి.
ఈ మూడు విషయాలు అర్ధం చేసుకుంటే, ఈ మూడు నిజం చేయడానికే అన్నీ తెలిసిన శివయ్య ఒక ప్రణాళిక ప్రకారం శివమాయను దేవతలపై ప్రసరింపచేశాడనే పరమార్థమును గ్రహించగల్గుతాం.

కుమార సంభవం తదుపరి టపాలో - 

5, అక్టోబర్ 2025, ఆదివారం

ఇది కదా...స్కంద అనుగ్రహం

తాతయ్య నాన్నమ్మలతో కలిసి చి|| అన్విక (2 సం|| నా మనుమరాలుకు) మొదటి సినిమా చూస్తే బాగుంటుందనే మా అబ్బాయి కోరికను కాదనలేక, సుమారుగా 17 లేక 18 సం||ల తర్వాత ఆగస్ట్ 25 న దియేటర్ కు వెళ్ళి (చివరగా దియేటర్ కు వెళ్ళి చూసింది పాండురంగడు) 'మహావతార్ నరసింహ' యానిమేషన్ చిత్రాన్ని చూసాను. 

అద్భుతంగా తీసారు. ఆద్యంతం ఆసక్తిదాయకం. సినిమా చూడడం అయింది కానీ; మనస్సులో పురాణ కథనాల కదలికలు...ఆలోచనలు!

బీజం, క్షేత్రం రెండూ శ్రేష్ఠమైతే జనించేవి ఒకలా, బీజం శ్రేష్టమైనది అయినను, క్షేత్రం శ్రేష్టమైనది కాకపోతే, జనించేవి మరోలా...! జనించేవాటిలో ఎంతో వైరుధ్యం. అందుకు ఉదాహరణే దైత్యులు, దేవతలు.

గర్భవతుల వైఖరి, మనోభావాలు పుట్టబోయే బిడ్డలపై ఎంతగా ప్రభావితమౌతాయో ప్రహ్లాదుడు, అభిమన్యుడులాంటివారిని పరిశీలిస్తే అర్థమౌతుంది. అలాగే భర్తను చేరిన భార్య మనోభావాలు ఎంత ప్రభావం చూపుతాయో భారతంలో ధృతరాష్ట్రుడు అంధుడిగా, పాండురాజు పాండురోగిగావిదురుడు జ్ఞానవేత్తగా ఎలా జన్మించారో గ్రహిస్తే, భర్తను చేరిన భార్య మనోభావాలకు, అంకురం మొదలు ప్రసవించేంతవరకు తన భావాలకు, నడవికకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థమౌతుంది. అందుకే కదా, పెద్దలు గర్భిణీ స్త్రీలు ఉత్తమ సంతానం పొందడానికి పురాణ ఇతిహాసాలు, ముఖ్యంగా స్కందోత్పత్తి లాంటివి చదవమని, వినమని చెప్తుంటారు. స్కందోత్పత్తి అంటే జ్ఞాపకం వచ్చింది, కొన్ని నెలల క్రితం మా అక్కగారి అమ్మాయి 'విద్య' ఇంతవరకు కుమారస్వామి గురించి స్మరణలో వ్రాయలేదు, నాకోసం కుమార సంభవం గురించి వ్రాయమని అడిగింది. తన కోసం, ఇప్పుడు వ్రాయగల్గుతున్నాను స్వామి అనుగ్రహంతో.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఈ బ్లాగ్ మొదలుపెట్టాక చాలాసార్లు అనుకున్నాను... సుబ్రమణ్యస్వామి గురించి వ్రాయాలని. షణ్ముకోత్పత్తి కథనం తెలిసినా గానీ, వ్రాయలేకపోయేదాని. ఈ సినిమా చూసాక, ఎలాగైనా ఈసారి వ్రాయాలని బలంగా అనుకున్నా గానీ, ఏరోజుకారోజు వాయిదాలు. రాత్రి పడుకునేటప్పుడు రేపు వ్రాయాలని గట్టిగా అనుకోవడం... మరునాడు మనస్సు వేరేదానిపై మరలడం, ఏదో అలసత్వం... తమోగుణంలో ఉండేదానిని. ఎందుకిలా? ఆలోచిస్తే, స్వామి గురించి వ్రాయాలంటే, స్వామి గురించి నాకు తెలుసు అన్న అహంను వీడి, ముందు స్వామిని ఆరాధించాలి అని స్ఫురించి, ఆరోజు నుండి స్వామి కథనాలు, స్వామి భక్తులకథలు, శరవణభవ శరవణభవ... స్మరణం, పఠనం, శ్రవణం... ఒకే ధ్యాస... అదే ధ్యానం.
దసరా సెలవులని వచ్చిన అభినవ్ రామ్, అభిజిత్ రామ్ (దౌహిత్రులు)లకు రాత్రి పడుకునే ముందు ఇవే కథలు, మావారికి, చెల్లికి, స్నేహితులకు... ఒకరని ఏముందీ, ఈమధ్యకాలంలో నన్ను కలిసిన అందరితో స్వామి కబుర్లే. ఇది కదా...అనుగ్రహమంటే🙏
ధర్మసూక్ష్మాలతో కూడుకున్న స్కందుని జననంకు కారణం తెలుసుకోవాలంటే, ముందున్న నేపథ్యం కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే స్వామి జననం కొన్ని కథనాలకు, శివయ్య లీలలకు అనుసంధానమై ఉంటుంది. అలాగే ఈ కథనాలు రామాయణం లోనూ, మహాభారతంలోనూ, శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చిన్న చిన్న వ్యత్యాసాలతో కనిపించవచ్చు. ఒకే కుమారసంభవమును అనేక కోణాలలో మహర్షులు దర్శించారు కాబట్టి, చిరు చిరు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, అవి అన్నీ సత్యమే. కథనాలన్నీ ఋషి ప్రోక్తములే.

కుమార సంభవంకు పూర్వ నేపథ్యం - 

బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కళల కుమారుడు కశ్యప ప్రజాపతి. దక్ష ప్రజాపతి కుమార్తెలలో పదమూడు మంది ఈయన భార్యలు. ఈ పదముగ్గురులో అదితి, దితిల గురించే ఇక్కడ కాస్త తెలుసుకోవాలి. ఎందుకంటే దేవతలు, దైత్యుల
ఆవిర్భావంనకు ప్రధానభూమికలు వీరివురే. 

సంతాన విషయంలో స్త్రీ సంస్కారబలం, శుద్ధభావనలు ఎంతో ముఖ్యం కాబట్టి, పూర్వం వివాహం అవగానే  ఋషులు కొంతకాలం తమ భార్యలతో కలిసి ఈశ్వరారాధనం చేసేవారు. వారి మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తరువాత భార్యను ఏమి కావాలని అడిగి, తను కోరుకున్న  సంతానముకు బీజం వేసేవారు. 

తపోనిష్టాగరిష్ఠుడు, ధర్మానిష్టాగరిష్ఠుడు మహాభక్తుడైన కశ్యప ప్రజాపతిని త్రికరణశుద్ధిగా ఏకాత్మ భావనతో అనుగమించే ధర్మపత్ని సత్త్వగుణశీలి అదితికి ఆదిత్యులు (దేవతలు) జన్మించగా, భర్త యెడల కించిత్ ధర్మలోపంతో, అశాస్త్రీయ కోరికలతో, ద్వైత భావంతో అనువర్తించే దితికి దైత్యులు (అసురులు) పుడతారు. 
మోహంతో సంగమించిన దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టడం, వారిరువురును శ్రీమహావిష్ణువు వరాహ, నరసింహ అవతారాల్లో సంహరించడం అందరికీ తెలిసిందే. ఇంత జరిగినా, ఏ మార్పు రాని దితి మరల బిడ్డలను కనాలని, కశ్యప ప్రజాపతిని 'నాకు ఇంద్రుడిని చంపే కొడుకు కావాల'ని కోరింది. అంతట కశ్యప ప్రజాపతి, 'నీకు ఎలాంటి బిడ్డ పుట్టాలో ఆ ఈశ్వరునికే ఎరుక. నీవు కోరుకున్నటువంటి బిడ్డ కలగాలంటే, ఈశ్వరుడుని సేవిస్తూ, ఏ ధర్మలోపం జరగకుండా తపస్సు చేయ'మని చెప్పెను. కొంతకాలానికి ఆమె లోపలకి కశ్యప ప్రజాపతి తేజం ప్రవేశించింది. ఆమె గర్భిణీ అయింది. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఆమె దగ్గరకు వచ్చి, 'నీకు సేవ చేస్తాన'ని అడుగగా, ధర్మం పాటిస్తూ 'సరే'నని అంగీకరించింది. ఒకానొకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చొని ఉండగా, చిన్న కునుకు పట్టి, మోకాలి మీదకు తల ఒరగగా, జుట్టు పాదములను తాకింది. స్త్రీలకు అలా తగలకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం జుట్టు చివర ముడి వేయాలి. ముడి వేయని ఆమె జుట్టు పాదములను తాకగానే, అదే అదునుగా ఇంద్రుడు, ఆమె గర్భంలోనికి ప్రవేశించి, వజ్రాయుధంతో లోపలున్న పిండమును మారుదః మారుదః (ఏడవకండి ఏడవకండి) అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడుస్తూ, 'నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను కానీ, నీచే చంపబడ్డ పిల్లల్ని కాదు. నీచే చంపబడ్డారు కనుక నువ్వు వాళ్ళని బ్రతికించి, నీ దగ్గర పదవులియ్యు'అని ఇంద్రుణ్ణి కోరగా, మారుదః మారుదః అని ఇంద్రునిచే చంపబడ్డ వాళ్ళు 'మరుత్తులు'గా స్వర్గలోకంలో పదవులు పొందారు.
మరికొంతకాలం పిమ్మట, దితి భర్తను 'నాకు దేవతలందరినీ జయించగల కుమారుడు కావా'లని కోరింది. అంతటా కశ్యప ప్రజాపతి, 'అటువంటి కొడుకు కావాలంటే పదివేల సంవత్సరాలు నియమంతో, బ్రహ్మ గురించి తపస్సు చేయ'మని చెప్పగా, ఆమె కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహం పొంది, భర్తను చేరగా, గర్భం ధరించి వజ్రములవంటి అంగములు గల కొడుకును కన్నది. ఆ కొడుకు పేరు వజ్రాంగుడు. 
ఈ వజ్రాంగుడు తన అపార దేహబలంతో ఇంద్రాది దేవతలను ఓడించి, ఇంద్రాది దిక్పాలకులను కారాగారంలో బంధించి, దేవలోకాన్నంతటిని ఆక్రమించి, అక్కడ మిగిలిన వార్ని అడవులకు తరిమేసి, సర్వాధిపత్యాన్ని పొందాడు. ఆ తరుణంలో బ్రహ్మ, కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకొని, వజ్రాంగుడు దగ్గరకు రాగా, వజ్రాంగుడు లేచి నమస్కరించి, సముచితాసనమునందు కూర్చోబెట్టి, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చెను. 'నాయనా! నీ అతిథిమర్యాదకు సంతోషించాం. నీవు విజేయుడివే, ఇందులో సందేహం లేదు గానీ, నేను పదవులిచ్చిన ఇంద్రాది దిక్పాలకులను కారాగారంలో పడేశావు. వార్ని విడిచిపెట్టి, వాళ్ళ పదవులను వారికి తిరిగి ఇచ్చేయ'మని బ్రహ్మ చెప్పగా, 'మహానుభావా! మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకోవడానికి మేము తపస్సు చేయాలి గానీ, మీకు మీరుగా నా దగ్గరకు రావడం ఏమిటి? అమ్మ కోరిక తీర్చడానికి, ఇంద్రుడును ఓడించి బంధించాను. వారిని విడిచిపెట్టమని శాసించకుండా యాచించడం ఏమిటి? ఇది నాకు కీర్తి కాదు, అపకీర్తి. నాకు ఈ రాజ్యం మీద గానీ, పదవుల మీద గానీ ఆశ లేదు'...అని వజ్రాంగుడు అంటూ, అందర్నీ విడిచిపెట్టి, వారి వారి పదవులు వారికి ఇచ్చివేసెను. (ఇది తండ్రి అయిన కశ్యప ప్రజాపతి తేజస్సుచే అబ్బిన సంస్కారం). పిమ్మట బ్రహ్మను ప్రార్థిస్తూ, 'నాకు ఈ భోగ భాగ్యాలు వద్దు, నాలుగు వేదములు తెలిసిన మీరు, అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో... అది నాకు బోధపడేటట్లు ఉపదేశం చేయవలసింది'గా కోరెను. వజ్రాంగుడు ఈ కోరికకు బ్రహ్మ ఆనందభరితుడై, 'నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వగుణము కలిగి ఉండు. ఈశ్వరుడుని నమ్మి ఉండు. ఈశ్వరుడుని పట్టుకొని ఉంటే, నీ మనస్సు భగవంతునిపై లగ్నమైతే, సంసారంలో ఉన్నా, నీకు ఏ బాధ ఉండదు. నీవు సదా చిత్త శాంతితో ఉంటావు. నేనే నీకు ఒక భార్యను ప్రసాదిస్తాను. నేను సృష్టించి ఇచ్చిన ఈమెను స్వీకరించు, ఈమె పేరు వరాంగి' అని చెప్పి, దగ్గరుండి పౌరోహిత్యం చేసి పెళ్ళి చేసెను. సత్త్వ స్థితికి వచ్చిన వజ్రాంగుడు  బ్రహ్మచేత సృష్టింబడిన వరాంగితో కల్సి నిరంతరం ఈశ్వరుని యందు భక్తితో ధర్మాచరణపరుడై ఉంటాడు. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అసురుడుగా పుట్టిన వజ్రాంగుడు రజో తమోగుణాలు విడిచిపెట్టి సత్త్వగుణ సంపన్నుడై ధర్మమార్గంలో అనువర్తిస్తుంటే, బ్రహ్మచే సృష్టింపబడిన వరాంగి అసురుల ఇంటా అసురులచే వండబడిన అన్నం తినడంతో, రజో తమో గుణాలు పొంది, బాహ్యంగా భర్తతో పాటు పూజలు చేస్తున్నా, అన్నింటా భర్తకి సహకరిస్తున్నా, అంతరాన మాత్రం ఈయన ఎంతో ప్రతాపంతో పుట్టి, ఆ ప్రతాపమును మరిచి, ఏ కోరికా లేకుండా సదా ఈశ్వర ధ్యాసలో ఉంటారేమిటీ... అని లోలోన వాపోతూ, మూడు లోకములను ఏడిపించగలిగిన కొడుకు నాకు పుడితే బాగుండును అనే కోరికతో ఉంటుంది. ఒకనాడు ఏం కావాలో కోరుకో అని వజ్రాంగుడు వరాంగినీ అడుగగా, 'విష్ణు ద్వేషి, వేదాలను గౌరవించని, ముల్లోకములను గడగడలాడించి, ఇంద్రుణ్ణి అవలీలగా గెలిచే, దేవలోకాన్ని స్వాధీనం చేసుకునే శక్తివంతుడైన కొడుకు నాకు కావాలి' అని కోరుతుంది. అత్త దితికి తగ్గ కోడలు వరాంగి. భార్య కోరిన ఈ కోరికతో ఎంతో వేదనకు లోనై, బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు వజ్రాంగుడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే, మీరు ప్రసాదించిన వరాంగితో కలిసి ఈశ్వరుని పై నమ్మికతో ధర్మాచరణలో నేనుంటే, ఆమె ఇంద్రుడిని జయించే, ముల్లోకాలను ఏడిపించే కొడుకు కావాలని కోరింది. ఆమె కోరిక తీర్చడం నా ధర్మం. అటువంటి కొడుకు నా వలన ఆమెకు కలిగేటట్లు మీరే వరమివ్వండి అని అడిగాడు. ' తథాస్తు' అన్నాడు బ్రహ్మ. తిరిగివచ్చిన వజ్రాంగుడు భార్య యందు తన వీర్యాన్ని నిక్షిప్తం చేయగా,  కొంతకాలం పిమ్మట వరాంగికి తను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే భూమి కంపించింది. మేఘాలు రక్తాన్ని కురిపించాయి, దిక్కులన్నింటా అగ్నిహోత్రాలు చెలరేగాయి, ప్రకృతి విలయతాండవం చేసింది. పశుపక్షాదులు భయంతో గోల చేశాయి. ఆ బాలుడికి తాతగారైన కశ్యప ప్రజాపతి తారకుడు అని నామకరణం చేశారు. తారకాసురుడు చిన్న వయస్సులోనే, దుష్ట ఆలోచనల దితి, వరాంగీలా సూచనతో బ్రహ్మ కోసం ఉగ్ర తపస్సు చేసి, మూడు లోకాలను జయించగల శక్తిని ఇమ్మని, పరమశివుడు వీర్య స్ఖలనం నుండి పుట్టిన ఏడురోజుల కొడుకు చేతిలోనే మరణం ప్రాప్తించాలనే వరాలను బ్రహ్మ నుండి పొందాడు. (సతీ వియోగంతో తపస్సు చేసుకుంటున్న శివుడుకు కొడుకు ఎలా పుడతాడనే భావన తారకునిది). తమతో దండెత్తుకొచ్చిన వీడితో యుద్ధం ఎందుకని ఇంద్రాది దేవతలు తలవొగ్గారు. ఇంద్ర పదవిని అధిష్టించి, దిక్పాలకులందరి పదవులను తీసేసి, ఇక తన ఆజ్ఞానుసారం నడుచుకోవాలని శాసించాడు. కుబేరుడిని, తుంబురుడిని, సూర్యచంద్రాదులను తను చెప్పినట్లే నడుచుకోవాలని శాసించాడు. ఈ నిర్భంద బాధలు పడలేక, వీరంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, శివుడుకి కొడుకు పుట్టేలా, మీరే ఏదైనా చేసి, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. 

తారకాసురుడు ముల్లోకాల మీద పడి చేస్తున్న విద్వాంసం ఆగాలంటే, స్కందోత్పత్తి జరగాలి. దక్షయజ్ఞం తరువాత సతీవియోగుడైన పరమశివుడు తీవ్రధ్యానంలో ఆత్మస్థితిలో ఉన్నాడు. మరి కుమారస్వామి జననం జరిగేది ఎలా? 

తదుపరి టపాలో - 

2, జులై 2025, బుధవారం

నా జీవితానికి ధన్యత చేకూర్చవా శివా🙏

సనాతన సాంప్రదాయంలో భాగంగా మన ఋషులు సమాజ శ్రేయస్సు, చైతన్యం కొరకు అనేక సూచనలు చేశారు. అందులో భాగంగా ఆలయాల ఆవశ్యకత, సాకారోపాసన, దైవ దర్శనం అనంతరం ఆలయ మండపంలో కూర్చొని, భగవంతుణ్ణి కాసేపు ధ్యానిస్తూ ఈ క్రింద శ్లోకాన్ని, లేదా వేరే మంత్రాల్ని లేదా నమ్మే నామాన్ని మననం చేసుకోమని చెప్పడం...ఇత్యాదివి మరి కొన్ని.

స్థల పరిశీలన, వాస్తుశాస్త్ర నిబద్ధత, నిష్ణాతుల పరివేక్షణ, అద్భుత శిల్పకళా నైపుణ్యతల నడుమ ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా నిర్మితమయ్యే దేవాలయాల గర్భగుడిలో, మంత్ర యంత్ర బీజాక్షరాల శక్తితో ప్రతిష్ట అయిన అర్చా మూర్తులు... నిత్య దీప ధూప మంత్ర సహిత ఆరాధనలు... అందుకే ఆలయం లోనికి అడుగుపెట్టగానే, మంద్రంగా వినిపించే భక్తి పాటలతో తనువు పులకిస్తుంది. గుడి గంటల సవ్వడితో సడి చేయక మనస్సు నెమ్మదిస్తుంది. సర్వాలంకృత అర్చా మూర్తిని చూడగానే చేతులు అప్రయత్నంగా నమస్కరిస్తాయి. శిరస్సు వంగుతుంది. వేద మంత్రోచ్ఛరణతో జరిగే అభిషేక అర్చనాదులతో, కర్పూర నీరాజనాలతో హృదయం లయిస్తుంది. మూల విరాట్ ను ప్రతిష్టించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలతో అంతరంగం పరవశిస్తుంది. ఇన్ని విధాల సానుకూల భావాలు సమీకృతమై భగవంతుని పట్ల భక్తిభావంతో ఏకాగ్రమై మనమున్న ఆ సమయంలో, దివ్య చైతన్యంతో బాసిల్లే ఆ ప్రాంగణంలో కూర్చొని, దర్శించిన అర్చామూర్తిని ధ్యానిస్తూ, నిర్మలమైన మనస్సుతో ఈ శ్లోకాన్ని చదవమని చెప్తుంటారు. 


 వేదన లేని మరణాన్ని, ఒకరిపై ఆధారపడని జీవితాన్ని, మరణ సమయంలో నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు పరమేశ్వరా...అని!

కొందరు ఇలా చదువుతారు -


వేదన లేని మరణం, ఒకరిపై ఆధారపడని జీవనం, నీ పట్ల అచంచలమైన భక్తిని ప్రసాదించు శంభో శంకరా...అని!

అనాయాసేన మరణం
నాకు నొప్పి, బాధ  లేని, మరణాన్ని ప్రసాదించు.

{ఓ పరమేశ్వరా! తనువు రోగగ్రస్తమై మంచాన పడి యాతనపడుతూ ఇతరులకు భారంగా మారేక, వచ్చే మరణం కాకుండా, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ పండు తొడిమ నుండి సునాయాసంగా విడివడినట్లు సునాయాస మరణం ప్రసాదించు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు నిష్క్రమించాల్సిందే. ఆ క్షణం బాధతో కూడిన క్షణంగా ఉండకూడదు, కృతజ్ఞతతో భగవంతుణ్ణి తలచుకుంటూ చిరునవ్వుతో సంతృప్తిగా కనులు మూయాలి. ఆ స్థితికి రావడానికి కావలసిన సన్నాహం మొదట నుండి చేసుకోవాలని సాధకులు చెప్తుంటారు}

వినా దైన్యేన జీవనం
ఎవరి మీదా ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు.
{ఇలాంటి జీవితాన్ని కోరుకోవడం తప్పు కాదు గానీ, విలాసాల కోసం ఆశిస్తూ కోరుకుంటే అది దురాశే. ఆధ్యాత్మిక జిజ్ఞాసపరులకు ఇది తగదు. ఏది కోరుకోవాలో, ఏ కోరిక విడవాలో అన్న వివేకం ఉండాలి}

దేహాంతే తవ సాన్నిధ్యం
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.

{దీనికంటే రెండవ శ్లోకంలో చెప్పినట్లుగా ముందు త్వయి భక్తిమచంచలం (అచంచలమైన భక్తినిప్రసాదించమని) కోరుకోవడం ఉత్తమం. ఎందుకంటే అచంచలమైన భక్తి లేనిదే మరణ సమయంలో భగవంతుని స్పురణ కలగదు}

దేహిమే పరమేశ్వరా!
ఓ పరమేశ్వరా! నాకు ఈ మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను. 

మామూలుగా చూస్తే, ఇది సాధారణభక్తితో కూడిన ప్రార్థనా శ్లోకం. కానీ, ఆధ్యాత్మిక అన్వేషకులు భగవంతునిపై భక్తి ప్రేమ విశ్వాసం కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం కాదని, దీనిలో మార్మికతను శోధించి సాధన చేయమంటారు. గుడిలో కాసేపు కూర్చొని ఈ శ్లోకం వల్లెవేస్తే పరమేశ్వరుడు ఈ మూడు కోరికలు తీర్చేస్తాడు అని అనుకంటే, అది పొరపాటే. 

జీవిత పరమార్థం కోసం కోరే మూడు ముఖ్యమైనవాటిని పొంది తరించాలంటే మనం ముందు శ్లోకం అంతరార్థం అర్ధం చేసుకొని, తదానుగుణంగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు మాత్రమే పరిపూర్ణ ఫలితాన్నిస్తాయి.

ఇక్కడ రెండు సందేహాలు వస్తాయి మొదటిది - ఈ శ్లోకం తెలియని వారు, రానివారు ఉంటారు కదా...వారిని పరమేశ్వరుడు అనుగ్రహించడా? 
రెండవది - అన్నింటికీ అర్థం తెలుసుకొని చేయలేం కదా... మరి అర్ధం తెలియకుండా మననం చేసుకుంటే ఫలితం ఉండదా? అని.
మొదట సందేహంకు పెద్దవారు ఇలా సమాధానం చెప్పారు - 

భగవంతునికి మంత్రాలు కాదు మన మనస్సు కావాలి. మన భావం కావాలి. ఆ భావం శ్లోకాలలోనో మంత్రాల్లోనే వ్యక్తం చేయనవసరం లేదు. మన భాషలో మన మాటల్లో వ్యక్తపరచవచ్చు. ప్రార్ధించవచ్చు.

"యే యథా మాం ప్రపద్యంతే తాంసదైవ భజామ్యహమ్..." ఎవరు ఎలా భావించి సేవిస్తారో వారిని నేను అలా అనుగ్రహిస్తాను అన్న కృష్ణ పరమాత్మ మాటలయందు విశ్వాసం ఉంచి, నిర్మల మనస్సుతో ఆ భగవంతునితో మాట్లాడవచ్చు. ఆ మాటలే నిజమైన ప్రార్థన.

రెండవ దానికి కూడా సమాధానం చెప్పారిలా - 
నీటిలో తెలిసి పడినా, తెలియక పడినా తడిసిపోతాం. అలానే, దేవుణ్ణి తెలిసి తలచినా, తెలియక తలచినా తప్పక అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాకపోతే,  సునాయాస మరణం, తిండికి బట్టకి ఇంటికి ఎవరిపై ఆధారపడని సౌకర్యవంతమైన జీవితం... ప్రాప్తించవచ్చు గానీ, దేహాంతే తవ సాన్నిధ్యం... మృత్యువు సమీపించినప్పుడు భగవంతుడినే స్మరించుకోవడం, దర్శించుకోవడం జరగాలంటే, ఎంతో సాధన కావాలి. 

మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. తెలిసినా అంతవరకు జీవించిన కాలంలో స్మరణలో లేనిది ఆ క్షణంలో స్ఫురణకు ఎలా వస్తుంది? మరణం వచ్చే సమయానికి మన మతి గతి స్థితి లకు భగవంతుడు స్పురించాలంటే నిరంతరం భగవత్ ధ్యానంలో ఉండాలి. అందుకు ఎంతో సాధన అవసరం. 

మనమెన్ని సాధనలు చేసినా, మనసులో గూడు కట్టుకుని ఉన్న దుర్గుణాలు వదిలించుకోకపోతే, సాధనంతా వృథాయే. రావణుడు గొప్ప సాధకుడు. తన తపస్సు చేత బ్రహ్మ, శివుని సహితం మెప్పించి గొప్ప వరాలు పొందినాడు. ప్రతి దినం సూర్యోదయం కాక మునుపే, కోటి శివలింగాలకు అభిషేకం చేసిన గొప్ప భక్తుడు. అంత సాధకుడు అయిననూ, తనలో ఉండిన అసుర గుణాలు వదులుకోలేక నాశనం అయిపోయాడు. సాధన చేశాం అంటే దుర్గుణాలు వదిలి పోవాలి. అంతే తప్ప, ఏదో చేసాం, ఎన్నోసార్లు మంత్రాలు వల్లె వేశాం చాలు, అనుకుంటే సరిపోదు. అందుకే పెద్దలు ఇలా చెప్తుంటారు - దేహి దైవాన్ని నిత్యం దర్శించాలి, స్పృశించాలి, సేవించాలి, సంభాషించాలి, తన వేదనను రోదనను వాదనను ఆర్తిని అర్ద్రతను స్వామి ముందుంచాలి, సహాయం కోరాలి, ఆశలను తిరస్కరించాలి, ప్రాప్తించిన వాటిని స్వీకరించాలి, సమాధాన పడాలి, అహంకారం వీడాలి, సాష్టాంగపడి శరణాగతి కావాలి, సద్గుణాలు అలవడాలి, సంస్కారం పరిమళించాలి, ఓంకారంతో నమస్కారం సమన్వయపడాలి, ప్రియంగా మాట్లాడాలి, హితంగా పలకరించాలి, చేతలు పరహితం కావాలి, మన స్వార్థం మరొకరికి అపకారం కారాదు, ఉపచారాలు ఉపకారాలు అలవడాలి, సాత్త్వికతతో ఉద్వేగాలు ఉద్రేకాలు అంతరింపజేయాలి... అప్పుడే భక్తి భావన ప్రేమతత్వంగా రూపుదిద్దుకుంటుంది. మనసంతా భగవన్మయం అవుతుంది. 

అప్పుడే సాధనకు సార్థకత చేకూరుతుంది. ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుంది. జన్మ పరమార్థం సార్థకమవుతుంది. అన్నివేళలా అంతటా భగవంతుడు స్ఫురిస్తాడు,గోచరిస్తాడు. 

ఇంత సాధన చేస్తేనే, "దేహాంతే తవ సాన్నిధ్యం" అనే కోరిక తీరుతుంది.

పై రెండు వీడియోస్ వాట్సప్ సేకరణ. రూపకర్తకు 🙏
 

17, జూన్ 2025, మంగళవారం

విగ్రహం అంటే మృణ్మయమూర్తి కాదు, చిన్మయమూర్తి!

 వేదం "ఏకం సత్" అని చెపుతుంటే, ఇందరు దేవుళ్ళు ఏమిటి? ఇన్ని రకాల దేవాలయాలు ఏమిటి? శైవ వైష్ణవ శాక్తేయ వైషమ్యాలు ఏమిటి? 

ఇలా ప్రశ్నలు ఎన్నో... ఇలా అడిగిన వారికి తగు సమాధానాలు మన శాస్త్రాలు, ప్రవచనకారులు, పెద్దలు చెప్తున్నప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి. నేను చదివిన, విన్న వాటి ద్వారా నా అవగాహన మేరకు కొందరి ప్రశ్నలకు కొంత సమాచారం ఈ టపాలో -

"ఏకం సత్" అని వేదం చెప్పిన మాట నిజం. ఉన్నదొక్కటే. అదే సత్యం. అదే నిత్యం. అదే పరమాత్మ. అదే నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్యం. 
పరమాత్మ  నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్య శక్తిగా ఏకత్వం గానే ఉంటే, ఈ సృష్టే లేదు, ఈ జగత్తే లేదు. దేవుడు లేడు, జీవుడు లేడు. కానీ, పరమాత్మ సంకల్పించాడు. 

ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి స్థితి లయలు... ఈ సగుణ సాకారాలు. 

అందుకే వేదం పరమాత్మను "త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం .... ప్రజాపతిః" "స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సో క్షరః పరమః స్వరాట్" అని కూడా ప్రవచించింది. అంతియే కాదు,  "త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం, త్వం బ్రహ్మ భూర్భువస్స్వరోమ్" (నువ్వే బ్రహ్మవి, విష్ణువివి, రుద్రుడవు, అగ్నివి, వాయువువి, సూర్యుడవు, చంద్రుడవు, భూమి ఆకాశం అంతటా ఉన్న పరబ్రహ్మవి...అని ఈ శ్లోకం భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అన్ని రూపాలలోనూ ఆయన ఉనికిని తెలియజేస్తుంది)అని అభివర్ణించింది. 
ఏకో విష్ణుః మహద్భూతం ప్రుదాగ్భూతా న్యనే కశః ...ఇత్యాది వాక్యాలన్నీ ఏకత్వం పొందిన అనేకత్వాన్ని తెలియజేస్తున్నాయి. మరి వేదం చెప్పిన ఆ ఒక్క వాక్యాన్నే కాదు, ఈ వాక్యాలను పరిగణలోనికి తీసుకోవాలి కదా.

దేశ వ్యవస్థ సవ్యంగా నడపడానికి దేశాధినేత, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు... ఇలా ఎలా అవసరమో, సృష్టి క్రమంలో కూడా అనేక రూపాలు అంతే అవసరం. 

ఒకసారి వివేకానందులవారిని ఒకరు అడిగారట, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకని...
బంగారం ఒక్కటే గానీ, ఆభరణాలు అనేకం. ఎవరి అభిరుచి బట్టి ఆయా ఆభరణాలు ఉంటాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా, మేం మాకు కావలసిన రూపులో తలచుకొని ఆరాధిస్తుంటాం. భక్తుల భావాలు బట్టే భగవంతుడు రూపాలు ధరిస్తాడు అని చెప్పారట. 


భగవంతుడు సర్వవ్యాపి కదా. సర్వత్రా ఉన్న భగవంతునికి ఆలయాలు ఎందుకు?

నిజమే. పరమాత్మ సర్వవ్యాపి అనేది సత్యం. కానీ, ఆ పరమాత్మను మనం ఎలా గుర్తించగలం? 
నిర్గుణుడు, నిరాకారుడు, విశ్వవ్యాపి అయిన పరమాత్మను కారణజన్ములైన మహాయోగులు, ఋషులు, మహర్షులు దర్శించగలరేమోగాని, సామాన్యులు తమ భౌతికదృష్టితో దర్శించలేరు. వారు అర్చించి తరించగలరేమేగాని, సామాన్యులకు ఇది అసాధ్యం. మరి మనం తరించేది ఎలా? ముక్తి పొందేది ఎలా? ఈ జన్మపరంపరలో చిక్కుకొని జీవితం సుఖ దుఃఖాలతో సాగించవలసిందేనా? అలాంటప్పుడు పశు పక్షాదులకు మనకి తేడా ఏముంది? మానవజన్మ నిరర్ధకమే కదా. మనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికశక్తిని జాగృతం అయ్యేదెలా? ఆత్మ సాక్షాత్కారం అయ్యేదెలా? సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? అందుకనే మహాద్రష్టలైన  మన మహర్షులు మనం తరించడానికి వేదానుసారం అనేక మార్గాలను సూచించారు. అందులో భాగంగానే ఆలయ నిర్మాణాలు, సాకారార్చనలు.
ఆలయాలు గురించి మరింత వివరణ ఈ లింక్ లో - ఆలయాల ఆవశ్యకత
అంతర్యామి ఆత్మ రూపేణా హృదయంలోనే ఉంటాడు కదా. హృదిలో ఉన్న హరిని దర్శించక ఆలయాలకు వెళ్ళడం ఎందుకు? విగ్రహారాధన ఎందుకు?


ఇక విగ్రహారాధన ఎందుకంటే - భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక ఆకారం అవసరం. విశ్వాసంతో ఓ విగ్రహాన్ని దైవంగా ఆరాధించడం ద్వారా మనలో ఆరాధన భావం పెంపొంది, క్రమేణా మనోబుద్ధులు సంస్కరింపబడి, విచారణతో ముందుకు సాగుతూ నిజాన్ని ఆవిష్కరించుకోమని హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకాదు, ఒక రూపాన్ని పెట్టి, ఆ రూపాన్ని ధ్యానం చేయమంటేనే, మనస్సు మర్కటంలా పది చోట్లకు పరుగులు తీస్తుంది. అలాంటిది ఏ ఆలంబన లేకుండా అదృశ్యమైన, అత్యున్నతమైన దానిని ధ్యానించాలంటే... అది మనకు సాధ్యమేనా? నిరంతరం చలించడం మనస్సు స్వభావం. ఒక పట్టాన ఒకదానిపై నిలవదు. అందుకే సాకార ఆరాధన. మన హైందవ ధర్మం ఇలా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళే మార్గాలన్నింటినీ సూచిస్తుంది. ఈ విగ్రహ ఆరాధనే క్రమేపి రూపానికి అతీతమైన తత్త్వానికి తీసుకెళ్తుంది. ముందు సాకారం, సగుణం. ఆ తర్వాత నిరాకారం, నిర్గుణం.

దారు లోహ రాయి... విగ్రహాల్లో భగవంతుడు వ్యక్తమౌతాడా? అంతటి శక్తి ఎలా వస్తుంది? ప్రాణ ప్రతిష్ట అంటారు కదా. నిజంగా విగ్రహాల్లో ప్రాణం ఉంటుందా?

విద్యుత్ శక్తి ఒకచోట బల్బ్ లో, మరోచోట ఫ్యాన్ లో, ఏసీ, మిక్సీ..... ఇలా పలు ఉపకరణాలు ద్వారా వ్యక్తమైనప్పుడు, అంతటా ఉన్న విశ్వశక్తి విగ్రహాల్లో వ్యక్తమవ్వదా?

ఒక వంద రూపాయల నోటును చూడండి. అది మొదట ఒక కాగితం. దానిపై వంద రూపాయల విలువను సాధికారంగా ముద్రించినప్పుడు దానికి ఆ విలువ వచ్చింది. ఒక విలువ వ్యక్తమవాలంటే  ఒక సాధికార ముద్ర కావాలి. అలానే విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు మహత్తరమైన బీజాక్షరాలతో ఆయా దేవతల శక్తిని ఆవాహన చేసి, చేస్తారు. మానవ నిర్మిత ముద్రలకే విలువ ఉన్నప్పుడు మన మహర్షులు తెలిపిన మంత్రాల్లో విశ్వశక్తి ఉండదా? అంతటి మహత్తర బీజాక్షరాలతో ప్రతిష్ట చేసిన విగ్రహాల్లో ప్రాణ శక్తి ఉండదా? అంతటా ఉన్న భగవంతుడు విగ్రహంలో ఉండడా?  చూసే భక్తి, విశ్వాసం మనకుంటే తప్పక కనిపిస్తాడు. అందుకు నిదర్శనాలు అనేకం.

మచ్చుకు ఓ రెండు - 
రాజస్థాన్ లోని ఉదయపూర్ దగ్గర శ్రీరూప్ చతుర్భుజ్ స్వామి పేరిట విష్ణుమూర్తి ఆలయం ఉన్నది. ప్రతిరోజూ ఉదయం అప్పటి ఉదయపూర్ మహారాజు రాణా వారు ఈ స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చేవారు. అప్పటి ఆ ఆలయ అర్చకులు దేవాజీ పండా గారు భగవంతునికి అలంకరించిన పూలమాల తీసి రాజుగారి మెడలో వేసేవారు. ఒకరోజు మహారాజు ఆలయానికి ఉదయం రాలేదు. రాత్రి ఆలయ తలుపులు మూసివేసే సమయం అవడంతో, ఇక మహారాజు రారని భావించి, ఆ పూజారి పూలమాలను తన మెడలో వేసుకొనెను. ఇంతలో మహారాజు వారు వస్తున్నట్లు కబురు రావడంతో, మెడలో వేసుకున్న మాలను తీసి పళ్ళెంలో పెట్టి, రాజుగారు రాగానే ఆయన మెడలో వేసెను. అయితే, పూజారి తన మెడలో వేసుకొని తీసినప్పుడు అతని తెల్లని వెంట్రుక ఆ మాలలో ఉండిపోవడం గమనించలేదు గానీ, అది చూసిన మహారాజు, ఆ వెంట్రుకను చూపిస్తూ, ' ఏమిటీ భగవంతునికి జుట్టు కూడా ఉందా? అదీ పండిపోయిందా?' అని అడుగగా, ఆ...అవును అన్న మాటలు అనుకోకుండా పూజారి అనడం జరిగింది. వెంటనే మహారాజు ' నేను రేపు ఉదయాన్నే వచ్చి విగ్రహాన్ని చూస్తాను' అని చెప్పి వెడలిరి. ఇక పూజారికి భయం మొదలయింది. భగవంతుని విగ్రహానికి తల వెంట్రుకలు ఎలా వస్తాయి? అవి కూడా తెల్లనివి. అబద్ధం చెప్పినందుకు కఠిన దండన తప్పదు. నా కుటుంబంకు ఇక ఏ ఆధారం ఉండదు, ఆ దీనజన రక్షకుడైన విష్ణుమూర్తే తనని రక్షించాలని తెల్లవార్లు ప్రార్థిస్తూ, శరణువేడుకున్నారు. మరునాడు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి చూడగా, స్వామి వారు తెల్లటి జుట్టుతో ఉండడం చూసి ఆశ్చర్యపోయి, స్వామి తన ప్రార్థన విన్నందుకు అమితానందం పొందుతూ, భగవంతుని కరుణకు కన్నీటి పర్యాంతమైన సమయంలో, రాజుగారు ఆలయానికి వేంచేసి, తెల్లటి జుట్టుతో ఉన్న భగవంతుని విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. ఇది నిజమా కాదా అని పరీక్షించడానికి ఒక వెంట్రుకను లాగగా, వెంటనే అక్కడ నుండి రక్తం స్రవించింది. అది చూసి మహారాజు మూర్చపోయారు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మహారాజు భగవంతుని ఉనికిని సందేహించినందుకు పశ్చాత్తాపం పడి, స్వామి ముందు సాష్టాంగ పడి క్షమాపణ కోరెను. అంతట స్వామి ప్రత్యక్షమై, మహారాజా నీవు నా ఉనికిని సందేహించావు. విశ్వాసం లేని నీలాంటి వారు నన్ను దర్శించడానికి అర్హులు కారు. అందువల్ల నేటి నుండి ఈ ఉదయ పూర్ సింహాసనాన్ని అధిరోహించే ఏ మహారాజుకైనా ఆలయ ప్రవేశం నిషిద్ధం అని ఆజ్ఞాపించెను.  అందువల్లనే ఆనాటి నుండి ఉదయపూర్ మహారాజుకు ఈ దేవాలయంలోనికి ప్రవేశం లేదు. నేటికీ ఇది అమలులోనే ఉంది. 


ఇలాగే, సాక్షి గోపాల్ కథ. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆలయం, సాక్షి గోపాల్ ఆలయ కథ ప్రకారం, యాత్రా సమయంలో అస్వస్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, ఆ సమయంలో తనకు సేవ చేసిన ఒక పేద బ్రాహ్మణ యువకుడుకు  తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మధురలోని బృందావనంలో ఉన్న గోపాలుని గుడిలో వాగ్దానం చేస్తాడు. అయితే, స్వగ్రామం చేరాక, ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అతని కుటుంబం వారి అమ్మాయిని ఆ యువకుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోరు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వాగ్దానం చేశాడనడానికి సాక్ష్యం ఎవరున్నారని అడగగా, ఆ యువకుడు సాక్షిగా ఉండమని బృందావనం వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించగా, ఆ విగ్రహం బృందావనం నుండి పూరీ వరకు నడిచి వచ్చి సాక్ష్యం చెప్పి, సాక్షి గోపాల్ గా అక్కడే నిలిచెను.
విగ్రహాలలో భగవంతుడు ఉన్నాడనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలవా?

ఏకేశ్వరోపాసన, బహు దేవతారాధనలలో ఏది ఉత్తమం? అయినా ఒక్క రూపం చాలదా? ఇన్ని రూపాలు ఎందుకు?

ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే కాని, రూపాలు నామాలు అనేకం. 


ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే కాబట్టి, మనం ఈశ్వరుడిని అభిషేకించినా, విష్ణువుని అర్చించినా, అమ్మని ఆరాధించిన మనకు లభించిన అనుగ్రహంలో ఎటువంటి తేడా ఉండదు. ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి...అంటారు శంకర భగవత్పాదులవారు. ఆకాశం నుంచి జాలువారే ప్రతి చిన్న నీటి బిందువూ అంతిమంగా సముద్రాన్ని చేరి లేనమైనట్లే, మనం ఏ దేవుడికి నమస్కరించినా, ఆరాధించినా, అవన్నీ  అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకే చేరతాయి. 

ఒక వ్యక్తి ఒకరికి కొడుకు, మరొకరికి సోదరుడు, మరొకరికి స్నేహితుడు, మరొకరికి భర్త, మరొకరికి తండ్రి, ఇంకొకరికి తాత...ఇలా పలు బంధాల్లో వ్యక్తమై, పలు పేర్లతో అభిమానింపబడినప్పుడు;
పరమాత్మ పలు రూపాల్లో వ్యక్తమై, పలు పేర్లతో ఆరాధింపబడడంలో అభ్యంతరమేముంది?
సాధకుడిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపాల్లో వస్తాడన్నది ఆది శంకరులవారి మాట. ఈ ఉపాసనలు అన్నీ, ఆరాధనలు అన్నీ, రూపాలు అన్నీ, నామాలు అన్నీ అద్వైతం లోనికి చేరడం కోసమే. మనలో ఆత్మశక్తికి ఒక కొనసాగింపే ఈ ఆరాధనలు. ఈ ఆరాధనల కొనసాగింపే ఏకత్వం...అద్వైతం!


ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడుగుతారు గానీ, ఎప్పుడైనా ఇన్ని రకల పండ్లు ఎందుకని, ఇన్ని రకాల కూరగాయలు ఎందుకని ఇన్ని రకాల రుచులెందుకని ఎవరైనా ఎందుకు ప్రశ్నించుకోరు? 

అనాయాసేన మరణం  వినాదైన్యేన జీవనం ... అన్న శ్లోకం తదుపరి టపాలో ...

7, జూన్ 2025, శనివారం

నేస్తం మాటలు...మదిలో మెదిలే కథలు

అదేమిటో...ఎన్నిసార్లు కొట్టించిన మూడునాళ్ళ ముచ్చటే. మూడు నెలల క్రితమే కొట్టించి, యు ఎస్ వెళ్ళి వచ్చేసరికి, గుంపులు గుంపులుగా పుట్టుకొచ్చాయి. అయినా వీటిని అనుకొని ఏం ప్రయోజనం? నాలుగు తలలేసుకొన్న ఆ పెద్దాయనను అనాలి. ఆ క్షణంలో వారి కార్యం నెరవేర్చుకోవడానికి దీనిని సృష్టించి, మనల్ని అవస్థల పాలుచేయడం బ్రహ్మకు తగునా? పైగా వీటికి ఓ పెద్ద వరమివ్వడం ఒకటి. అక్కడే ఉన్న ఇంద్రాది దేవతలు మా పని పూర్తయితే చాలనుకొని వీటి సృష్టిని తిలకించారే గానీ, భూలోక వాసులకు కష్టమౌతుందననే తలపే లేదు. పైగా వారి మాట, చేత, లోక కళ్యాణార్థమేనని ముక్తాయింపు ఒకటి..... 

శ్రీమతి ఈ దండకం ఎందుకో అర్ధం కాక, ఏమిటోయ్... ఎప్పుడూ నన్నూ, పిల్లల్ని దులిపేసే నీవు, ఇప్పుడు ఆ భగవంతునిపై దాడి చేస్తున్నావు. ఏమిటి కత? కాస్త ఆ దండకం ఆపి, అసలు సంగతి చెప్పు అని అడుగుతున్న శ్రీవారిని పట్టించుకోకుండా, తన ధోరణిలో తనుంటూ, 
ఆ విష్ణుమూర్తికి నిద్ర ముంచుకురావడం ఏమిటో, ధనస్సునే శేషపాన్పుగా చేసుకోవడం ఏమిటో... ధనస్సు కొసపై గెడ్డం పెట్టుకొని పడుకోవడం ఏమిటో... ఆయనను లేపడానికి ఈ బ్రహ్మ గారు దీనిని సృష్టించడం ఏమిటో... ఏమిటో ఆ మహామాయ, పెనుమాయ... మనకు పెను బాధలు...
ఇంతలో లోపలున్న అత్తగారు సోధ్యం కాకపోతే,
ఏ చిన్న పొరపాటు చేసినా క్షమించు దేవుడా అంటూ లెంపలేసుకుంటూ, గుంజీలతో నీ బారీకాయాన్ని కష్టపెట్టే నీవు,  పొద్దస్తమాను ఆరాధించే దేవుళ్ళను ఆడిపోసుకోవడమేమిటే...తప్పు తప్పు...అని అనడంతో, 
ఆరాధించేవారికే ఆక్షేపించే అర్హత ఉంటుంది అత్తయ్యా... భక్తులు నిందాస్తుతి చేయడం సహజమే కదా! అయినా... నా గోడు వెళ్ళబోసుకుంటున్నానే తప్పా, ఆడిపోసుకుంటున్నానా... తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అంటూ, అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మాయా| దాసో యమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర| అంటూ చెంపలు వాయించుకుంటున్న మిత్రురాలిని చూసి, అంతవరకు ఈ సన్నివేశానికి మౌన వీక్షకురాల్ని అయిన నేను, ఇక నవ్వు ఆపుకోలేకపోయాను. అంతవరకూ నా రాకను గమనించని తను, కాస్త ఉలిక్కిపడి దరిచేరింది. మా ముచ్చట్లు అయి ఇంటికి వచ్చినా, అదే సన్నివేశం మదిలో మెదలడం, తన దండకంలో కథా, భగవత్ లీలలను, హయగ్రీవ వృత్తాంతంను స్మరించుకున్నాను ఆనందంగా.

ఎవరీ హయగ్రీవస్వామి?
ఎప్పుడు ఎందుకు ఎలా అవతరించారు?
సకల విద్యలకు, జ్ఞానానికి ఆధారం ఈయనే అని ఎందుకు కీర్తిస్తున్నారు?
తొలుత శ్రీమహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించి, ఓరోజు ఆయనకు శబ్ద తేజోరూపంగా (హయగ్రీవునిరూపం) దర్శనమిచ్చి, వేదాలను అనుగ్రహించెను. వాటి సహాయంతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించెను. మొదటగా బ్రహ్మకు వేదములు ఇచ్చిన శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం హయగ్రీవఅవతారం.  
ఇదే మొదట అవతారమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కథనం బట్టి విష్ణువే స్వయంగా హయగ్రీవుడయినది ఒక పార్శమైతే, ఇతర కారణాలచే ఆయనకు హయశీర్షం తగిలించినట్లు మరికొన్ని కథనాలు ఉండడం మరొక పార్శం. ప్రతీ కథనం వెనుక అంతరార్థం అద్భుతం అద్వితీయం. 
హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకుని, తెల్లని పద్మంపై ఆసీనులై ఉంటారు. కుడిచేతిలో చక్రం, పై ఎడమచేతిలో శంఖం, కింది ఎడమచేతిలో పుస్తకం, కింది కుడి చేయి చిన్ముద్ర ధరించి ఉంటారు. 
శ్వేతపద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికి, పుస్తకం సకల విద్యలకు, శంఖం సకల సృష్టికి కారణభూతమైన నాదానికి, చక్రం అజ్ఞాన సంహారానికి చిహ్నాలు.
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు దాల్చిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. అయితే ప్రముఖంగా పేర్కొన్న దశావతారాల్లో ఈ అవతారం గురించి చెప్పకపోయినా, భాగవతంలో, మహాభారతంలో ఈ స్వామి గురించి వర్ణింపబడినది.

ఒకానొక శ్రావణ పౌర్ణమినాడు వేదోద్ధరణకై, గుర్రపుముఖంతో నరశరీరంతో చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి, వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవస్వామి.

పూర్వం మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళలోకానికి వెళ్ళిపోవడంతో, బ్రహ్మకు అజ్ఞానం ఆవహించి మందుడై, కర్తవ్యతామూఢుడు కావడం వలన, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, మధుకైటభులను వధించి, వేదాలను తిరిగి బ్రహ్మకు ఇవ్వడం, బ్రహ్మదేవుడి బుద్ధి చైతన్యవంతమై వికసించడం, సృష్టికార్యం యథావిధిగా కొనసాగించడం జరిగింది. శుక మహర్షి హయగ్రీవుని గురించి వర్ణిస్తూ అనంతమైన వేదరాశి ఆయన యొక్క ఊర్పులు అని చెప్తారు. ఇందువల్లనే హయగ్రీవ స్వామిని జ్ఞానానందమూర్తిగా, వేదాది సకలవిద్యారక్షకుడుగా, విద్యా ప్రదాతగా కొలుస్తారు.

'హయ' అనగా విజ్ఞానం. 'గ్రీవ' అనగా కంఠం. అన్ని విద్యలూ కంఠస్థమై ఉన్న సర్వ విద్యారూపమే హయగ్రీవ మూర్తి.  

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

ఇకపోతే, ఈ హయగ్రీవ అవతారం గురించి మరికొన్ని కథనాలు - 

ముందుగా దేవి భాగవతంలో ఉన్న కథ - 
కొన్ని సంవత్సరాలు (పదివేల సంవత్సరాలు)
ఏకధాటిగా రాక్షససంహారం చేసిన శ్రీ మహావిష్ణువు అలసటతో ఓ చోట, అల్లెత్రాడు గట్టిగా బిగించి ఉన్న ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపు మీద గడ్డాన్ని ఆనించి, విశ్రాంతిగా కనులు మూసుకొని యోగ నిద్రలోనికి జారుకొనెను. ఇదో యోగమాయ. 
ఇదిలా ఉండగా - 
తాము చేస్తున్న యజ్ఞ హవిస్సులు అందుకోవడానికి విష్ణువును ఆహ్వానించడానికి(వేదవాఙ్మయంలో యజ్ఞోవైవిష్ణుః... విష్ణువే యజ్ఞస్వరూపుడు అని స్తుతింపబడింది) బ్రహ్మాది దేవతలు  వైకుంఠంకు వెళ్ళి, అక్కడ విష్ణువు లేకపోవడంతో, దివ్యదృష్టితో విష్ణువును గాంచి, యోగనిద్రలో ఉన్న విష్ణువు దరిచేరి, లేపడానికి సందేహిస్తూ, ఎలా అని యోచిస్తుండగా, బ్రహ్మ వమ్రి (చెదపురుగు)అనే కీటకాన్ని సృష్టిస్తాడు. ఈ వమ్రి నన్ను ఎందుకు సృష్టించారని ప్రశ్నించగా, ధనుస్సు నారిని తెంపితే ధనస్సు కదిలి విష్ణువు మేల్కొంటాడు కాబట్టి, వింటి నారిని కొరకమని చెప్పగా, నిద్రా భంగం చేయడం, కథా ప్రవచనాలను మధ్యలో ఆపడం, దంపతుల నడుమ అన్యోన్యతకు భంగం కలిగించడం, తల్లీ బిడ్డలను విడదీయడం... బ్రహ్మహత్యాపాతకంతో సమానమంటారే. ఈ మహాపాపం నేను చేయలేను, అని అనగా, లేదు లేదు, ఇది దైవ కార్యం. నీకు ఏ పాపమూ అంటదు, మేము చేసే యజ్ఞంలో హోమగుండం వెలుపల పడిన హవిస్సులు నీకే ప్రసాదిస్తాం అని వరమిచ్చాడు బ్రహ్మ. పవిత్ర హవిస్సు దొరుకుతుందనే సంతోషంతో వింటినారిని చెద పురుగు కొరకడం, నారి తెగి విష్ణువు తలకు తగిలి, తల తెగిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఈ ఊహించని పరిణామానికి మ్రాన్పడిపోయి, అపరిమిత వేదనకు అందరూ లోనయ్యారు. 
ఏదైనా కష్టం వచ్చినా, బాధ కలిగిన, భయం వేసినా ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మే. శ్రీ మహావిష్ణువు తల తెగి ఎక్కడ పడిందో తెలియక భయభ్రాంతులైన వీరికి కూడా ఆ జగన్మాతే గుర్తుకు వచ్చి, ఈ విపత్తు నుండి రక్షించమని ఆమెను ప్రార్ధించగా, ఆ పరాత్పరి ప్రత్యక్షమై, ఇదంతా దైవ ఘటన. ఇలా జరగడం నా సంకల్పములో  భాగమే, ఈ లోకంలో ప్రతికార్యమూ కారణ సహితమే. విష్ణువు శిరస్సు ఇలా తెగిపడడంలో కూడా కారణం ఉన్నదని  జగన్మాత ఇలా చెప్పెను -
ఒకానొక రోజు వైకుంఠంలో శేషపాన్పుపై పవళిస్తున్న శ్రీ మహావిష్ణువు ఏదో ఆలోచిస్తూ, తనకి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవిని చూస్తూ, వంకరగా నవ్వడం, అంతట ఆ నవ్వుకు అర్ధం తెలియక మదిలో కదిలాడే అనేక ఆలోచనలతో అసహనంకు లోనై, కుపితురాలై, 'స్వామి!నన్ను గేలి చేస్తూ నవ్విన మీ తల తెగిపడును గాక!' అని ఆవేశంతో అన్నది లక్ష్మీదేవి. ఈ హఠాత్సంఘటనకు ఉలిక్కిపడి, ఈ సంఘటన యాదృచ్చికం కాదు, భవిష్యత్తులో జగత్కల్యాణం కోసమే అయి వుంటుందని భావించారు ఇరువురు.
ఇదియే కాదు, ఈఘటనకు మరో కారణం కూడా ఉంది...
పూర్వం గుర్రం తలతో ఉండే హయగ్రీవుడనే లోక కంటకుడైన రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నేను అతనికి ప్రత్యక్షం కాగా, 'మరణంలేని జీవితం కావాల'ని వరం కోరుకున్నాడు. అది అసంభవమని, పుట్టినవారు మరణించక తప్పదని నచ్చజెప్పి, మరో వరం కోరుకోమన్నాను. తనలాగే గుర్రంతల ఉన్నవాని చేతిలోనే మరణం సంభవించాలనే వరం కోరడంతో నేను అతనికి ఆ వరం అనుగ్రహించాను. తనలా గుర్రం తలతో మరొకరు పుట్టడం అసంభవం కనుక, తనకి చావే ఉండదని మరింత అహంతో కొంతకాలంగా విజృంభిస్తున్నాడు ఆ రాక్షసుడు. ఇపుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హయగ్రీవ అవతారం విష్ణువుకు అవసరం. అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను. మీరు విచారించకండి. గుఱ్ఱపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి అతికించండి. విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు. రాక్షస సంహారం సాగిస్తాడు. నేను హయగ్రీవుడనే రాక్షసుని కిచ్చిన వరమూ, లక్ష్మీదేవి శ్రీహరికి ఇచ్చిన శాపం రెండూ ఈ రీతిలో నెరవేరతాయని పలుకగా, అమ్మ ఆదేశం మేరకు గుర్రపు తలను విష్ణువు మొండేనికి అతికించారు. విష్ణువు హయగ్రీవుడై కనులు తెరచి, జగన్మాత మాయా విలాసాన్ని, జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి, హయగ్రీవ రాక్షసుణ్ణి సంహరించి, లోక కల్యాణం కలిగించాడు.

ఇక బ్రహ్మాండపురాణంలో శ్రీ లలితా పరాభట్టారిక యొక్క దివ్య సహస్రనామ స్తోత్రాన్ని, సాక్షాత్తు చతుర్భుజుడై శంఖచక్రాలతో లక్ష్మీదేవితో కూడి ఉన్న శ్రీ హయగ్రీవ స్వామియే అగస్త్య మహర్షికి ఉపదేశించిన దివ్య కథనం ఉంది. 
శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామిని ఉపాసించిన అగస్త్య మహర్షిని అనుగ్రహిస్తూ ప్రత్యక్షమైన హయగ్రీవస్వామిని మహర్షి ప్రార్థిస్తూ, స్వామీ! జగన్మాత అయిన లలితా పరాభట్టారిక యొక్క అవతార విశేషాలను, ఆమె చేసిన భండాసుర వధలను లోగడ తెలిపారు. శ్రీచక్ర మహత్యాన్ని, పంచాక్షరీ మహిమను, విధివిధానాలను  చక్కగా వివరించారు కానీ, లలితాదేవి సహస్ర నామాలను, వాటి విశిష్టతను ఉపదేశించలేదు. వాటిని వినే అర్హత నాకు లేదా స్వామీ... అని ఆసక్తితో ఆర్తిగా అడుగగా, 
అగస్త్యా! మహిమాన్వితమైన ఈ నామాలు అందరికీ ఉపదేశించరానివి. అతి రహస్యమైనవి. అయినా ఎంతో ఆర్తిగా నీవు అర్థిస్తున్నావు కనుక, ఆ పరమేశ్వరి సంకల్పంతో లోక క్షేమం కోసం లలితా సహస్ర నామస్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను. 

శ్రీమాతా శ్రీమహారాజ్జీ శ్రీమత్సింహాసనేశ్వరీ | చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా || 
............................................................
............................................................

శ్రీ శివా శివశక్త్యాక్య రూపిణీ లలితాంబికా | 
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్రకథనం ...

ఈ విధంగా శ్రీ హయగ్రీవ స్వామి అగస్త్యుల సంవాదం వల్ల మహిమాన్వితమైన ఈ స్తోత్రం మనకి అందింది. పరిపూర్ణ వేదమూర్తి స్వరూపుడైన హయగ్రీవ స్వామిచే 
ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. అంతేకాదు, సకల మంత్రతంత్రాలకు సైతం హయగ్రీవుడు అధిపతి అని బ్రహ్మాండాది పురాణాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. మహోన్నత అవతారమూర్తి అయిన హయగ్రీవస్వామిని అర్చించిన ఎందరో రుషులు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి, ఆ విజ్ఞానాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఆదిశంకరులు, విశిష్టాద్వైత మత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు హయగ్రీవ ఉపాసనతో సర్వోన్నత జ్ఞానాన్ని సంపాదించారని చెబుతారు. హయగ్రీవ ఉపాసన పుణ్యఫలితం వల్ల శ్రీపాద రాజతీర్థులనే పండితుడు రాజాస్థానంలో జరిగిన పండిత సభలో విజయం సాధించాడు. దుష్టమంత్ర ప్రభావం వల్ల శ్రీపాదుడికి కలిగిన వాగ్బంధనం కూడా హయగ్రీవ ఉపాసన వల్ల తొలగిపోయింది. సూర్యుడు సహా దేవతలందరూ హయగ్రీవుడి ఉపాసన చేసినట్లు హయగ్రీవ ఉపనిషత్ చెబుతున్నది.

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం - 

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ | నరం ముంచన్తి పాపాని దరిద్రమివ యోషితః ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ | తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్ ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః | విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదమ్ ||

ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం హయగ్రీవసంపదాస్తోత్రం సంపూర్ణమ్ ||

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు, పాపాలన్నీ పోయి, దరిద్రం తొలగుతుంది.

హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా సర్వవిద్యలూ ప్రాప్తిస్తాయి. 

హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకొని వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది.

హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు దివ్యమైన శ్లోకములను ఎవరైతే స్మరిస్తారో, వారికి సంపదలు కలుగుతాయి.

హయగ్రీవస్వామి శీఘ్ర అనుగ్రహప్రదాత అని స్వామి ఉపాసుకుల మాట. హయగ్రీవస్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం. అందుకే పిల్లలకు హయగ్రీవ స్తోత్రంను గానీ, మంత్రమును గానీ నేర్పించమని పెద్దలు చెప్తుంటారు.

ఓం నమో భగవతే హయగ్రీవాయ
                               [ద్వాదశాక్షర మంత్రం]

విశ్వోతీర్ణ స్వరూపాయ చిన్మయానంద రూపిణే, 
తుభ్యం నమో హయగ్రీవాయ విద్యారాజాయ విష్ణవే
                                    [హయగ్రీవ మంత్రం]

హయగ్రీవాయ విద్మహే విద్యానాథాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్
        [కపింజల సంహితలోని హయగ్రీవ గాయత్రి]


15, ఫిబ్రవరి 2025, శనివారం

అవగాహన - ఆచరణ

మా సత్సంగంలో ఒకామె -
సర్వం ఆత్మగా దర్శించినప్పుడు, సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు, శోకం మటుమాయమవుతుందని తెలిపే ఉపనిషత్ ఈశావాస్యోపనిషత్ అని,

అంతా ఏకత్వమే అని గ్రహించాక, నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని, ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనని, ఒక్కమాటలో చెప్పాలంటే 'తత్వమసి' సారం చాందోగ్యం అని,

మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని తెలిపేది, 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ప్రతిపాదించేది బృహదారణ్యక ఉపనిషత్ అని...
ఈ మూడు ఉపనిషత్తుల గురించి అనర్గళంగా మాట్లాడగలరు.

భగవద్గీత, కపిల గీత, ఋభు గీత... వీటిలో ఏ సందేహం అడిగినా, అడిగిందే తడవుగా, తడబడకుండా తడుముకోకుండా చెప్పగలరు.

రామాయణం, భారతం, భాగవతం, యోగ వాసిష్టం ల గురించి విపులంగా వివరించగలరు. నాకు ఏ సందేహం వచ్చిన ముందుగా కాల్ చేసేది తనకే. అలాంటి ఆమెలో ఏదో నిరాశ, బాధ, నిర్లిప్తత. ఉత్సాహమనేది కనిపించదు. కొంతకాలం తర్వాత ఒకానొక సందర్భంలో వ్యక్తమయ్యారు.

నేను ఈ సత్సంగముకు రాకముందు ధ్యాన తరగతులకు వెళ్ళేదానిని. అక్కడ ఓ అరగంట ధ్యానం గురించి చెప్పి, ఆ తర్వాత ఓ గంట నిటారుగా కూర్చొని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమనేవారు. ఆలోచనలు వస్తే, ఆ ఆలోచనలు వెంబడే వెళ్ళిపోకుండా, ఆ ఆలోచనలను కట్ చేసి వెనక్కి వచ్చి శ్వాస మీదే దృష్టి పెట్టండని చెప్పేవారు. ఆ తర్వాత మరో గంట ధ్యాన అనుభవాలు చెప్పమనేవారు. సప్త ఋషులు కనిపించారని, నీటి ప్రవాహం నెత్తి మీద పడి ప్రవాహంతో సాగిపోతున్నానని, గాలిలొ తేలిపోతున్నానని... ఒకటని ఏముందీ... ఎన్నో అనుభూతులు... అక్కడి సాధకులవి. 
ఒకరోజు మాష్టారు గారు నన్ను అడిగారు...ఎప్పుడూ మీ అనుభూతులు చెప్పరేమని? 'కదలకుండా కూర్చోవడమే కష్టంగా ఉంది. వీపు నొప్పి వస్తుంది. ఆలోచనల వెంబడి పరుగులు తీస్తున్న మనస్సును శ్వాస మీద పెట్టడం... మరల ఆలోచనలు... వెనక్కి రావడం... ఇదో ఆటలా ఉంది తప్ప, ఏ అనుభూతి లేద'ని చెప్పేను. దాంతో అందరూ నన్ను ఏదోలా చూసారు. మీరు ధ్యానంకు పనికిరారు. నిటారుగా కూర్చోలేరు. మీకు గూని ఉంది. ధ్యానం ద్వారానే ముక్తి వస్తుంది. ఈ జన్మలో మీకు ముక్తి రాదు. మరు జన్మలోనైనా ఈ వైకల్యం లేకుండా పుట్టించమని దైవాన్ని వేడుకోండి. రేపటి నుండి క్లాస్ కు రాకండి అని చెప్పేసారు. నాకు ముక్తి రాదు, ధ్యానం కుదరడం లేదు. నా గూనే నాకు అవరోధం. నా వైకల్యమే నాకు శాపం...అంటూ ఏడ్వడం ప్రారంభించారు.


ఆశ్చర్యం....ఒక ప్రతికూల భావం అన్నీ తెలిసిన ఆమెను మాయలా కమ్మేసింది కదా.

ఏదైనా చదివిన, విన్నా... దానిని ఒక విజ్ఞానంగా మెదడులో నిక్షిప్తం చేసుకుని అక్కడే ఆగిపోతే, అది ఓ జ్ఞాపకంలా మాత్రమే నిలిచిపోతే...మాటలు నేర్చిన చిలుకలా పలకడానికే ఆ విజ్ఞానం పనికి వస్తుందని జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలు ఉదహరిస్తూ ఒకరు చెప్పిన చిలుక కథ చెప్పనా -

ఒకానొక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక తన పిల్లలతో వుండేది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోననీ, భయపడి, ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్నిచూసి, పిల్లల్లారా! రండి, మీకొక సత్యాన్ని పాటగా నేర్పిస్తాను అంది సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు...

వేటగాడొస్తున్నాడు జాగ్రత్త.
గింజలు ఎరగా విసురుతాడు జాగ్రత్త.
వలవేస్తాడు జాగ్రత్త.
పట్టుకుంటాడు జాగ్రత్త.
మెడ విరిచేస్తాడు జాగ్రత్త.

అనే పాటనేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు రమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు, అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఒకనాడు ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త... అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దామనుకొని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త... అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త... అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు ........ అంటూనే చచ్చిపోయాయి.

చూసారా... ఆ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని అవగాహన చేసుకోలేదు, ఆచరణలో పెట్టలేదు.

మనమందరము కూడా, అలానే వున్నాము. తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ప్రవేశపెట్టడమే ఆచరణ. తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టకపోతే, తెలుసుకొని ప్రయోజనం ఏముంది? ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృథాయే కదా!

ఇక ధ్యానమంటారా... కొందరు నిటారుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతారు. కొందరు పద్మాసనం వేసుకొని చేస్తారు. సుఖాసనం అని పంతజలి చెప్పారు. ఆటంకం కలిగించని, ఎవరి సౌలభ్యం కొద్దీ వారు కూర్చోవచ్చు. ఒత్తిడికి గురైన భంగిమలో ధ్యానం చేయడం వల్ల శరీరం యొక్క అసౌకర్యంపై మనస్సు నిలిచిపోతుంది. ఏకాగ్రత కుదరదు. కూర్చోవడం ధ్యాన ముద్ర. శ్వాస మీద ధ్యాస పెట్టడం ధ్యాన నిష్ఠ. ఇవి ధ్యాన ప్రక్రియలు. అయితే ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చొని, రోజంతా మనకు నచ్చేలా ఉండడం ధ్యానం కాదు.


నిరంతరం ఎరుక లో ఉండడం ధ్యానం. చేస్తున్న ప్రతీ పనినీ ఎరుకతో చేయడం ధ్యానం. ధ్యానం యొక్క అంతిమ గమ్యం సాక్షితత్వమే.

గూని... ఇది ఓ చిరు శారీరక లోపం మాత్రమే. ఒకటి గుర్తించండి... శారీరక వైకల్యాలు ఎప్పుడూ ప్రాపంచికంగానైనా, పారమార్ధికంగానైనా మన లక్ష్యాలకు అడ్డు కావు. ప్రాపంచిక పరంగా ఉదాహరణలు చూస్తే -

అరుదైన వ్యాధితో వచ్చిన పూర్తి పక్షవాతం చక్రాల కుర్చీలో కుదేసినా, మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదిపేసినా, కృత్రిమ పరికరంతోనే విశ్వాంతరాలను శోధించి, కృష్ణబిలాలు, వర్క్హోల్స్, క్వాంటమ్ మెకానిక్స్, టైమ్ ట్రావెల్... అంటూ, శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసే సిద్ధాంతాన్ని వెలువరించిన మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ గురించి విన్నాం కదా.

పుట్టుకతోనే చేతులు లేని జర్సికా, కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్ గా గిన్నిస్ రికార్డు సాధించారు కదా.

1981 జూన్ నెలలో తమిళనాడులోని త్రీచీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినా, కృత్రిమ కాలితో నాట్య ప్రదర్శనలు ఇచ్చి, వందలాది అవార్డులను అందుకున్న నాట్య మయూరి సుధాచంద్రన్ గురించి అందరికీ తెలుసు కదా.

వాలీబాల్, ఫుట్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఉత్తరప్రదేశ్ అంబెద్కర్ నగర్ కు చెందిన అరుణిమా సిన్హా, 2011 ఏప్రిల్ లో జరిగిన ఓ ఘటన కారణంగా తన కాళ్లను కోల్పోయినా, కృత్రిమ కాళ్ళు అమర్చుకుని, ఎవరెస్టు శిఖరం ఎక్కాలని నిశ్చయించుకుని, 2013 లో పట్టుదలతో 52 రోజులపాటు ఎముకలను కొరికేసే చలిలో సైతం ప్రయాణించి, శిఖరాగ్రాన్ని చేరారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వికలాంగ మహిళగా అరుణిమ చరిత్రకెక్కారు కదా.

3 సంవత్సరాల వయస్సులో అంధుడిగా మారిన లూయిస్ బ్రెయిలీ అంధులు చదవగలిగే వ్రాయగలిగే లిపిని కనుగొనలేదా?

పారమార్థిక పరంగా చూస్తే -
ఏడు గుర్రాలున్న రథంపై నిరంతరం సంచరిస్తూ, అఖిల జగాలకూ వెలుగునిచ్చే మహత్కర్యాం నిర్వర్తిస్తున్న సూర్యుని రథ సారథి ఎవరు? కాళ్ళు, తొడలు లేని సమర్ధుడైన అనూరుడు కాదా?

అంధత్వం కలిగిన భక్తిపూర్వక కీర్తనలతో సూరదాసు కృష్ణ పరమాత్మను సాక్షాత్కారింప జేసుకోలేదా?

కాళ్ళు చేతులు లేని కూర్మదాసు అనే పాండురంగ విఠల భక్తుడు పండరీపూర్ సందర్శించాలని తలచి, దృఢ చిత్తంతో నాలుగు నెలలు రోడ్డుపై పాకుకుంటూ బహుల ప్రాంతం చేరుకొని, ఇక కదలలేక విఠలునే ప్రార్ధించగా, భక్తునికై విఠలుడే కదిలి రాలేదా? భక్తుని కోరిక మేరకు అక్కడ విగ్రహంలా వెలియలేదా?

ఎనిమిది అంగ వంకరలు కలిగిన అష్టావక్రుడు బ్రహ్మర్షి కాలేదా?


ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికే గానీ; మనసుకు కాదంటూ చాటిచెప్పిన మహర్షులు, మహా భక్తులు, మహానుభావులు ఎందరో కదా🙏
నిజం చెప్పాలంటే, ఆలోచనా వైఫల్యమే వైకల్యం. ఆచరణా వైఫల్యమే వైకల్యం.

ఆఁ అన్నట్లు అష్టావక్రుడు అంటే గుర్తుకు వస్తుంది. ఒకనాడు మా తాతయ్య గారు (నాలో ఆధ్యాత్మికత పట్ల అభిరుచి, అవగాహనలకు బీజం వేసిన గురువర్యులు) చెప్పిన విషయం -

ఒకసారి ఎందరో పండితులు, వేదాంతవేత్తలు, తత్వవేత్తలుతో జనక మహారాజు ఏర్పాటు చేసిన పండిత మహాసభకు వచ్చిన అష్టావక్రుడును చూసి సభలో వారంతా నవ్వగా, వారందర్నీ చూస్తూ, అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వెను. కొంతసేపటికి నవ్వులు సర్ధుమణిగాక, "మిమ్మల్ని చూసి సభలో వారంతా నవ్వినందుకు అందరి తరుపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారంతా ఎందుకు నవ్వారో అర్థమైంది కానీ, మీరు అంత బిగ్గరగా ఎందుకు నవ్వారో అర్థం కావడం లేదు. మీ నవ్వుకు కారణం తెలియజేయగలరా" అని వినయంగా జనక మహారాజు అడిగెను. అంతటా అష్టావక్రుడు జనకుడితో, "ఈ సమావేశం జ్ఞాన కోవిదులు, వేద పండితులు మరియు తత్వవేత్తల కోసం అని నేను అనుకున్నాను. వారిని దర్శించుకుని తరిద్దామని వచ్చాను కానీ; వీరందరూ అజ్ఞానులు. వీరికి భౌతిక దృష్టే తప్పా, ఆత్మ దృష్టి లేదు. వీరంతా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ శరీరం లోపల వెలుగులీనుతున్న ఆత్మను దర్శించలేకపోతున్నారు. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన అందులోని ప్రతిమ వంకర తిరిగి ఉంటుందా? వీరంతా దేహాత్మ భావనలోనే ఉన్నారు. బాహ్యదృష్టే తప్ప అంతర దృష్టి అలవడలేదు. వారికి పైకి కనిపించే చర్మమే తప్ప, దాని వెనక ఉన్న తేజోమయమైన ఆత్మతత్వం అవగతం కాలేదని అర్థమైంది. పుస్తక పాండిత్యమే తప్ప, అనుభవ జ్ఞానం లేని అజ్ఞానులను చూసి అందుకే నవ్వెన"నెను.



శాస్త్ర జ్ఞానంతో వెలుతురు పుట్టించవచ్చు. అనుభవ జ్ఞానమే నీలో అంధకారాన్ని తొలగిస్తుందని అంటారు స్వామి మైత్రేయ.

ఆధ్యాత్మిక ఆకాంక్షలు, శాస్త్రపరిజ్ఞానం ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి. మనం తెలుసుకున్న వాటిని మన జీవితంలో ఆచరించగల్గినప్పుడే అందులో మహా సత్యాన్ని అనుభూతి చెందగలం.

ఇక ముక్తి -
అన్నింటి నుంచి విముక్తం చేసేదే ముక్తి. ఇది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతుంది. ఎవరి యోగ మార్గం వారిది. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి సాధనా విధానం వారికి సరైనది. ఇది తప్పు కాదు. ఒక గమ్యానికి వెళ్ళినప్పుడు అన్ని దిశల నుండీ ఎన్నో దారులుంటాయి. ఏ దారిలో వెళ్ళినా, గమ్యస్థానం చేరగలం. ఎన్నో వాహనాలు... ఏ వాహనం మీద వెళ్ళినా, గమ్యం చేరుకోగలము. అల్లోపతీ, ఆయుర్వేదం, హోమియోపతీ, మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ఆక్యుపంచర్, ఫిజియోథెరఫీ... వైద్యవిధానాలు ఏవైనా, రోగికి స్వస్థత చేకూర్చేందుకే. వారి వారి శరీరతత్వం బట్టి, విశ్వాసం బట్టి వైద్య మార్గం అనుసరిస్తారు. ఒక వైద్య విధానముతో లొంగని రోగం మరొక విధానముతో తగ్గవచ్చును.

అలానే ముక్తే గమ్యమైనప్పుడు, అక్కడికి చేరడానికి ఎన్నో మార్గాలను కృష్ణ పరమాత్మ, ఋషులు తెలిపారు. కొందరు వేద మార్గంలో, కొందరు క్రియాయోగ మార్గంలో, కొందరు ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో..... ఇలా పలు మార్గాలు. ఎవరి విశ్వాసం బట్టి వారు ఆ మార్గంలో వెళ్తారు. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.

మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. మన ప్రవర్తన మన ఆలోచన విధానాలే మనం వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడుతాయి. కొన్నిసార్లు ఎక్కడా దొరకని ప్రశాంతత, మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. అంతేగానీ, చిత్తాన్ని చంచలం చేసుకుంటే దాని ఫలితంగా లక్ష్య సాధన సిద్ధించదు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.

దృఢసంకల్పానికి ఏకాగ్రత, విశ్వసనీయత తోడైనప్పుడు, ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింప జేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా చేశాడు.


ఎవరు ఏమైనా చేయనీ, ఎన్నైనా చెప్పనీ, మనదృష్టి మన లక్ష్యంపై మాత్రమే వుంటే, మనం మనతోనే విశ్వాసంగా వుంటే, మనం సాధించాలనుకున్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు! తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తిమార్గాన్ని వీడలేదు.

దారిలో నది అడొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు - నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులోస్తే ఆపాల్సింది పని కాదు - ప్రయత్నించే పద్ధతి.

బాహ్య సంఘటనలకి ఉద్రేక పడకుండా నిలకడగా మనసును జాగ్రత్తగా ఉంచుకోవడమే సాధన. అలానే మనం చేసే సాధనలన్నీ ఆత్మను పొందటానికి కాదు, శరీరం నేను కాదు అని తెలుసుకోవటానికే.


శరీరం దైవదత్తం - మనసు మానవ కల్పితం
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్ష సిద్ధి తధ్యం.
                                                   - స్వామి మైత్రేయ


తను గురించి, తనలా ఆలోచించేవారి గురించి మీరు మాట్లాడుకున్నది బాగుంది. కానీ, నాకు ధ్యానం కుదరదు, జ్ఞానం నా ఊహకు అందని పదం. కర్మ చేయడమే తప్ప, కర్మ ఫలత్యాగం అంటే అర్థం కాదు. నాకు తెలుసిందంతా ఒకటే...ఉదయం దైవ స్మరణతో లేవడం, స్నానాదికాలు అయ్యాక దైవాన్ని పూజించడం,  పనులు చేసుకుంటూ, మధ్య మధ్యలో నేను నమ్మిన దైవాన్ని తలుచుకోవడం, రోజు చివరలో అంటే పడుకునేముందు, నేను ఈరోజు నా మాట చేతలతో చేసే పనులలో తప్పున్నా, ఒప్పున్నా నన్ను మన్నించు అని మనస్సులో దైవం ముందు సాగిలపడడం తప్పా, ఏ శాస్త్ర పరిజ్ఞానం లేని నాకోసం ఏం చెప్తారని అడిగిన మరొకామెకు నా సమాధానమిదే -