17, నవంబర్ 2020, మంగళవారం

కార్తీకశుద్ద చవితి - నాగుల చవితి

పరమాత్మ యొక్క వ్యక్తరూపమే ప్రకృతి అని, అన్నింటిలోనూ ఆయా ఉపాధుల ద్వారా, పరమాత్మతత్త్వం వ్యక్తమౌతుందన్న విశ్వాసం భారతీయులది. అందుకే మన దృష్టిలో, ప్రకృతిలోని సర్వజీవులు, సర్వ పదార్ధాలూ పూజనీయమే.  ప్రకృతిలో కనిపించే ప్రతీజీవికి, అవి మనకు చేసే మేలుకు కృతజ్ఞతగా -  సందర్భానుసారంగా పూజలు చేస్తుంటాం. ఇది మన ఔనత్యం. ఇంతటి మహత్త్వభావన విశాలవిశ్వంలో భారతీయులకే సాధ్యమైంది. పంచభూతాలను, సముద్రమును, పర్వతాలను, వృక్షాలను, గోవులను, సర్పాలను, విగ్రహాదులను ఆరాధించడం ప్రాచీనకాలం నుండి వస్తున్న సంప్రదాయం. సనాతనధర్మంలో - సమస్తాన్ని భగవన్మయంగా భావించడం, పూజించడం ఓ భాగం. పూజలు చేయడం వలన, సాత్త్వికమైన మనస్సుతో పరమార్ధ విచారణ చేయడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది


కార్తీకశుద్ద చవితి - నాగుల చవితి

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ !
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!


                       

నాగుల చవితి రోజున నాగేంద్రునిని శివభావముతో అర్చిస్తే, శారీరకరోగాలు  తగ్గుతాయని, సౌభాగ్యవంతులవుతారని, సర్పపూజ చేసే వారి వంశం చక్కగా వర్ధిల్లుతుందని పెద్దలు చెప్తుంటారు. 

నాగారాధన - వేదకాలం నుండి ఉంది. నాగేంద్రుడు శివునికి ఆభరణముగా, శ్రీమహావిష్ణువుకు శయ్యగా ఉన్నాడు. నాగులు బ్రహ్మదేవునికి పౌత్రులు (మనవళ్ళు). కనుక నాగరాజున్ని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినట్లేనని పెద్దల వచనం. 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, సాధరణంగా సర్పాలను చాలామంది దేవతలు ఆభరణంగా ధరిస్తారు. వినాయకుడి వడ్డాణం, యజ్ఞోపవీతం సర్పమే. ఇక, సుబ్రహ్మణ్యుడునయితే... నాగస్వరూపునిగా పూజిస్తారు. జంటపాములును సుబ్రహ్మణ్యుడే అని ఆరాధిస్తుంటారు. 

ఇక, సర్పపూజ విషయానికి వస్తే - ప్రాణులన్నిటా పరమాత్మ ఉన్నాడని, ఏ ప్రాణిని అనవసరంగా భాదించకూడదని, దేనివల్ల జరగాల్సిన మేలు దానివల్ల జరుగుతుంటుందనే ఓ చక్కటి సందేశంకు దర్పణం సర్పపూజ. 
పుట్టను పూజించడం, పాలు తేనె పోయడం...రావి వేప చెట్ల దరి, నాగప్రతిష్ఠ చేసి ప్రదక్షిణాలు చేసి పూజించడం... వీటన్నిటిలో ఎన్నో ఆరోగ్యకర, వైద్య, విజ్ఞాన రహస్యాలున్నాయి.

తలస్నానం చేసి ఉపవాసంతో వుండి పెసలు/పెసరపప్పు, మొలకెత్తిన/నానబెట్టిన అపక్వాహారంతో పాటు నువ్వులు దంచి, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి ప్రసాదమును, బియ్యపుపిండి బెల్లం కలిపి చేసిన చలివిడి మొదలగునవి నాగులకు నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తారు. ఎందుకంటే - పుట్ట దరికి వెళ్లడం, తాకడం, పుట్టమన్ను వాసన పీల్చడం వలన మరియు ప్రసాదములుగా పెట్టిన పై పదార్ధములు తినటం వలన, స్త్రీలకు నాడీమండలం శుద్ధై, సంతానోత్పతికి అవసరమైన శక్తులు వృద్ధి అవుతాయని, గర్భధారణకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయని ఆయుర్వేదం తెలుపుతుంది. ఈ కారణం చేతనే, సంతానం లేనివాళ్ళు నాగపూజలు, నాగప్రతిష్టలు చేసే ఆచారాన్ని పూర్విజులు ప్రతిపాదించారు. అలాగే పుట్ట బంగారం (పుట్ట మన్ను) చెవులకు రాసుకుంటారు. పుట్టలోకి పాములు వెళ్లి వస్తున్నప్పుడు పుట్ట అంచులకు శరీర రాపిడితో పాములనుండి స్రవించే ద్రవం ఆ మట్టికి అంటి ఓ ఔషధంలా పనిచేస్తుందని చెప్తుంటారు. 
                           

ఆధ్యాత్మిక అంతరార్ధం -  మన శరీరాన్ని నవరంద్రాలున్న పుట్టగా పోల్చుతారు. పుట్ట క్రిందభాగం విశాలంగా వుండి పోను పోను సన్నగా ఎలా అయిపోతుందో, అలానే మనం కూర్చున్నప్పుడు మన దేహాకృతి వుంటుంది.
మన దేహంలో ఉండే మనస్సుకు కేంద్రం మెదడు. ఈ మెదడు పాముపడగ ఆకారంలో వుంటుంది. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని వ్యవహరిస్తారు. కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం చెబుతోంది. 'కుండల'మంటే పాముల చుట్ట. పుట్ట అడుగున చుట్ట చుట్టుకొని పాము  ఉన్నట్లే, మన శరీరంలోనూ మూలాధార చక్రమునందు కుండలినీ శక్తి చుట్ట చుట్టుకున్న పాములా ఉంటుంది. ఈ కుండలినీ శక్తిని సాత్త్విక విధానంలో ఉద్ధీపింపజేయడమే నాగపూజ పరమార్ధం. 
                           

తలనుంచీ తోకవరకు మెలికలు ఉన్న రెండుపాముల రాయి ఒకటి రావిచెట్టు క్రింద ఉండడం కొన్ని దేవాలయాల్లో చూస్తుంటాం. 
                         

                                     
ఆ విధంగానే కుడి ఎడమ ముక్కు రంద్రాలతో పీల్చేగాలి, పింగళ ఇడ నాడుల ద్వారా, పాములు మెలిక వేసుకొని ఉన్నట్లు శరీరంలోనికి పోయి, సంచరిస్తూ వుంటుంది.

తమో రజో గుణాలనే విషాన్ని పాము చిమ్మకూడదని, సత్త్వగుణంతో ఉండి మనల్ని రక్షించాలని ప్రార్ధిస్తూ, సత్త్వగుణ ప్రతీకయైన పాలును పుట్టలో ఎలా వేస్తున్నామో... అలానే, మనలో  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, రజో తమో గుణాలు క్షయమై సత్త్వగుణ సంపత్తి పెంపొందించుకోవడానికి, భగవత్ భక్తి అనే క్షీరాన్ని పోయాలని పెద్దలు పేర్కొంటారు. 

ఒకోసారి మన దేవతామూర్తులను పరిశీలిస్తే, చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. వారు చెంత కొలువై ఉన్నవి ... పరస్పర శతృవర్గం వారు.  విష్ణువుకు ఆదిశేషువు శయ్య కాగా, గరుత్మంతుడు వాహనం.  ఒకే ఇంట ఉన్న - శివునికి, వినాయకునికి పాములు ఆభరణములు కాగా, కుమారస్వామికి వాహనం నెమలి. ఆపై అమ్మవారో...నకులేశ్వరి (నకుల అంటే ముంగిస). ముంగిస స్వరూపంలో కూడా అమ్మ వారు ఉంటారట. అంతేనా...మానవదేహమునందలి వెన్నెముక యందు కుండలినీ శక్తిగా సర్పాకారంలో ఉన్నదీ...  ఆ శ్రీవిద్యా స్వరూపిణి జగన్మాతయే.

పాముకు ప్రధాన శతృవులు - గరుడపక్షి, నెమలి, ముంగిస. మరి ఇవన్నీ మనం ఆరాధించే దేవతల చెంతనే ఉండడం వెనుక మర్మమేమిటి? 
అధోగతి పట్టించే అంశాలను సంహరించే స్థితిని దేవతలు అనుగ్రహిస్తారు. అందుకే మనకు అనుకూల్యతగా శతృత్వం ఉన్న వాటిని తమకి ఆభరణాలుగా, వాహనములుగా మలుచుకుంటారు. వాటి  ద్వారా మన పంచేంద్రియాలతో అపసవ్యంగా చరించే మనస్సును సవ్యదిశలో నడిపిస్తారు. దీనిని కాస్త కూలంకుషంగా  పరిశీలిద్దాం -
సృష్టిలో ప్రతీ అంశంలో అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, మనలో ఉన్న కుండలినీ  సర్పములో కూడా అనుకూలత, ప్రతికూలతల అంశాలు ఉంటాయి.  అనుకూలతగా ఉన్న అంశం ఉద్ధరణలోనికి తీసుకొస్తే,  ప్రతికూలతగా ఉన్న అంశం  క్షీణింపచేస్తుందని పేర్కొంటారు. 

క్షీణింపచేసే అంశం - మనలో తేజస్సుని ఇంద్రియలౌల్యం కొరకు క్షయం చేసే సర్పం. ఇది శరీరంలో మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. బుద్ధిని మందగింపజేస్తుంది. బ్రహ్మమునందు నిలబడనీయదు. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. తేజస్సుని అదోముఖంగా క్రిందకు వెళ్ళేటట్లు చేస్తుంది. తత్ఫలితంగా పురోగతి చెందలేం. భగవంతున్ని చేరుకునే దిశగా వెళ్ళలేం.
                       

ఉద్ధరణలోనికి తీసుకొచ్చే అంశం - భగవంతుని యందు భక్తితో బ్రహ్మచర్యమందు పూనికతో ఉండేటట్లు చేస్తుంది. తేజస్సును ఓజస్సుగా మార్చుతుంది. ఉన్నతపధం వైపు నడిపిస్తుంది. 

జన్మ సార్ధకతకు కావల్సిన స్థితిని పొందాలంటే కేవలం మనశక్తే సరిపోదు. ఈశ్వరశక్తి కూడా తోడవ్వాలి. అందుకై భగవంతున్ని త్రికరణశుద్ధిగా ప్రార్ధించాలి. అలా ప్రార్ధించినప్పుడు ప్రతికూలత అంశాలను సంహరింపజేసి, అనుకూలత అంశాలను ప్రేరేపించడానికి దోహదపడేవి దేవతల చెంతనున్న ఆ శతృవర్గం వారే. ఎలాగంటే - 
శ్రీహరిని ఆశ్రయిస్తే, ఆయన వాహనమైన గరుత్మంతుడు సర్పంలో ప్రతికూలత అంశాలను సంహరించి, అనుకూలతను  ప్రేరేపిస్తాడు.
శివున్ని, అమ్మవార్ని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యుడుని ప్రార్ధిస్తే -
జగన్మాత, ముంగిస రూపంలో వచ్చి, కుండలిని రూపంలో ఉన్న సర్పంలో ప్రతికూలతాంశాలను సంహరించి అనుకూలతాంశలను ఉద్ధీపనజేస్తుంది.  లేదా సుబ్రహ్మణ్యుడు తన వాహనమైన నెమలి ద్వారా, ప్రతికూల అంశాలను సంహరించి అనుకూలతను  పురోగమింపచేస్తాడు. 
 
పుట్టకు వెళ్ళడం ఏమిటీ...పూజించడం ఏమిటీ...
పుట్టలో పాలు పోయడం  ఏమిటీ...మూఢ నమ్మకాలు...అని కొందరు విమర్శించడం విన్నాను. అయితే మన పెద్దలు దేనినీ ఊరకనే చెప్పరు. వారు చెప్పినదాంట్లో పరమార్ధం మనకు తెలియకున్న, మన శ్రేయస్సుకై చెప్పారన్నది సత్యం. 
                      

మన ఆచారాల వెనుకనున్న ఆంతర్యాన్ని గ్రహిస్తే ... భారతీయుల జ్ఞాన విజ్ఞాన దృష్టి ఎంత సమున్నతమైందో అర్ధమౌతుంది.

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారిని  నాఇంటివారిని ఆప్తమిత్రులనందరిని ఏలు. 
పడగ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకో.
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో... నూకలిచ్చెదను, మూకలిమ్ము...  పిల్లల మూకను నాకిమ్ము .


28, అక్టోబర్ 2020, బుధవారం

కాల విశిష్టత

                                                     



మహిమాన్వితమైన కాల మహాత్మ్యం -
సహస్ర నేత్రాలతో భూమిపై జరిగే సమస్త కర్మలకు ప్రత్యక్ష సాక్షి కాలం.     
కాలం సమస్త జీవకోటి జీవన గతిగమనాలను నిర్దేశించే మహేంద్రజాలం.   

                                                           


కాలో అశ్వోవహతి సప్త రశ్మిః సహస్రాక్షో అజరో భూరి రేతాః | 
తమా రోహంతి కవయో విపశ్చి తస్తస్య చక్రాభువనాని విశ్వా | |( అధర్వణవేదం)
కాలమనే అశ్వము ఏడు పగ్గములతో తనను తాను నియమించుకొనుచూ ప్రపంచమును మోయుచున్నది. ఈ కాలమునకు వేల వేల కన్నులు. ముదిమి లేని ఈ కాల ప్రభావము, బలము చాలా గొప్పవి. ఈ అశ్వమును పరమాత్మను సాక్షాత్కరించుకొనువారు, పరమాత్మ స్వరూపమును బోధించువారు అధిరోహించెదరు.   

స ఇమా విశ్వా భువనాని అంచ్యత్‌
కాలస్య ఈ యతే ప్రధమోనుదేవ:
సఏవ సంభువాన్యా నా భారత్‌
సఏవ సంభువానాని పరైత్‌
పితాసన్నభవత్‌ పుత్ర ఏషాం
తస్మాద్వై నాన్యత్‌ పరమస్తు తేజ: 

అనంత భువనములను ఏర్పరిచింది, అనంతకోటి బ్రహ్మాండాల్లో నిండియున్నది, అన్నింటా తానుండి నడిపించింది, చరాచరాలు అన్నింటా ఉన్నది కాలపురుషుడే. 

మహాభారత సంగ్రామ రంగంలో శరతల్పగతుడైన భీష్మాచార్యులవారు పాండవులతో, 
నాయనలారా! శ్రీకృష్ణపరమాత్ముడు, మీ జీవితాలకు సారధ్యం వహిస్తున్నా, మీరు కష్టాల పాలై, బాధలు పడ్డారు కదా అని అంటూ...ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ పడిపోతూ ఉన్నట్లు (వాయువశంబులై యెగసి వారిధరంబులు ...) ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తమూ కాలచక్రం వల్ల కూడుతూ, వీడుతూ ఉంటుంది. కాలమే అన్నింటికీ మూలం. కాలం విచిత్రమైనది ఎంతటివారైన సరే ఈ కాలప్రవాహాన్ని దాటలేరని ఓదార్చారు. 

కాలం ఒకేలా ఉండదు. మనకు ప్రాప్తించిన కష్టసుఖాలు, వియోగ విలాపాలు, సిరి సంపదలు  మన ప్రారబ్ధ ఫలితాలే. కాల నియమానికి ఎవరమూ అతీతులు కాము.  విశ్వంలోని ప్రతిజీవి కాలాధీనమై  వర్తించాల్సిందే. సుఖ దుఃఖాలైన, మంచి చెడులైన, కాలంతోనే వస్తుంటాయి... పోతుంటాయి. మన మనస్సును మురిపించే బంధాలు, ప్రేమాభిమానాలు, ఆస్తులు, హోదాలు... సమయానుకూలంగా కాలం వాటిని మనకు ప్రారబ్ధ ప్రాతిపదికన సమకూర్చి, గడువు తీరగానే తనలో లయం చేసుకోవడం అందరూ నెఱిగిందే.  దీనిబట్టి కాలగమనంలో కష్టసుఖాలు సహజమేనని గుర్తించి, స్థిమితంగా జీవనగమనం సాగించడం ఉత్తమం.  "బహు విఘ్నః సురాః కాలః కాలః కాలం నయిష్యతి:" కాల గమనంలో ఎన్ని విఘ్నాలైనా రావచ్చు, కానీ, కాలానికి కాలమే ఏదో పరిష్కారం చూపుతుంది.     

                             
                                                     
కాలం పరమేశ్వర స్వరూపం. కనుక అఖండమైనది. విభజించడానికి అవకాశం లేనిది. కానీ; కార్య స్వరూపం చేత క్షణములు, ఘటికలు, దినములు, పక్షములు, మాసములు...మొదలగు భేదాలు కల్పించారు. 
                                                     


ఒక్క క్షణం ఆగండి...చిటికెలో చేసేస్తా.
కనురెప్పపాటులో జరిగిపోయింది. 
లిప్తపాటైన ఏమరుపాటు వద్దు. 
ఇలా విభజన చేయలేని అతి చిన్న సమయాన్ని కూడా మాటల్లో సూచిస్తుంటాం. 

కాలాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా విభజించినా, వర్తమానం చాలా చిన్నది. అది కేవలం క్షణకాలమే వుంటుంది. భూతకాలం చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోగలిగినంత. భవిష్యత్తు మరి ఎక్కువ. ఊహించగలిగినంత. భూత భవిష్యత్తుల కాలంలో కాకుండా వర్తమానంలో అనుక్షణం ఉండగలగడం ఓ అద్భుత జీవనసరళి. 




మనం ప్రతీ క్షణముని ఎలా వినియోగంచుకుంటామన్నది ముఖ్యం. వినియోగించుకోని క్షణం తిరిగిరానిది, వృధాగా గడిచిపోయినది. సకల సృష్టికి సమయం ఒకటే. కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్లమందిని పాలించే ప్రభువైన గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. కాలాన్ని వృధా చేయడమంటే మనల్ని మనం దోపిడి చేసుకోవడమే అవుతుంది. ఏ క్షణంకా క్షణం వినియోగించుకుంటేనే ఆ క్షణం జీవించునట్లు. లేకపోతే పొగొట్టుకున్నట్లే. 

                                                      


మన జీవితమంతా మన ఆలోచనల పర్యవసానమే. మన ఆలోచనలే మనల్ని రూపొందిస్తున్నాయి. ఆలోచన అంటే మనస్సు లోపల నిశ్శబ్ధంగా జరిగే మాటల ఆట. 
చాలావరకు ఎన్నో క్షణాలను ఏవేవో ఆలోచనల నడుమ పరధ్యానంగా గడిపేస్తాం. మనిషి సంపూర్ణంగా జీవించాలంటే ముందుగా పరధ్యానం పొగొట్టుకోవాలి. ధ్యానంలోనికి రావాలి. పూర్తిగా ఎఱుకలోనికి వచ్చి, జీవితాన్ని సంపూర్ణంగా జీవించే విధానమే పరధ్యానం లేని ధ్యానం. ఆ క్షణంలో చేస్తున్న పనియందే  శ్రద్ధగా, నిలకడగా ద్యాస పెట్టడమే ధ్యానం. వర్తమానంలో ఎఱుకతో అన్ని పనులు చక్కబెట్టడమే జీవించమంటే. 

                                                          


కానీ, సాధారణంగా మనలో చాలామంది -  ఎప్పుడూ చేసే పనులే కదా, అలవాటైన ఆ పనులు అలవోకగా అయిపోతుంటాయి. ఈ పనులు గురించి ఆలోచనలు అవసరం లేదని అనుకుంటాం. అయితే ఇక్కడే పొరపాటు చేస్తుంటాం. అలవాటైన పనులే కదా  అని, ఆ పనిని యాంత్రికంగా నిర్వహించడాన్ని శరీరానికి వదిలేసి,  ఆ క్షణంలో ఆ పని గురించి కాక, వేరే ఆలోచనలలోనికి అలవోకగా  జారుకుంటాం.  చేస్తున్న పనికి ఏ సంబంధం లేని, సమయానికి వర్తించనిది అయిన మరేదో విషయంలోకి వెళ్ళటం... అంటే భూత భవిష్యత్తు లోనికి పయనించటం.  వర్తమానంలో చరించక భూత భవిష్యత్తు లోనికి చరించే వెసలుబాటు మన మనస్సులకు ఇస్తుంది మనమే. ఆ అలవాటు చేస్తుంది మనమే.

                                                                 


అన్ని పనుల్లో, అంత ఆలోచించాల్సిన అవసరం లేదన్నది నిజమే గానీ, ఇక్కడ ఇతరత్రా ఆలోచించడం అవసరమా? ఇతర ఆలోచనలు ముఖ్యం కాదు, గమనించటం ముఖ్యం. చేస్తున్న దానిని గమనించటమనే పనిలో, ఏకాగ్రత పెట్టడం వలన, మనస్సు అనవసర విషయాల్లోనికి పోకుండా వుంటుంది. మనస్సు ఎన్నోసార్లు చేస్తున్న పనినుంచి ప్రక్కకు తప్పుకుంటూ ఉండవచ్చు... తిరిగి వెనక్కి తీసుకొని రావచ్చు. ఇలా ఎన్నిసార్లు జరుగుతుందని లెక్కలు వేసుకోవడం సాధన కాదు, పోయిన క్షణాలు ఎలాను పోయాయి, వాటి గురించి ఆలోచించి, బాధపడి మరిన్ని క్షణాలు పోగొట్టుకోకూడదు. ఇంతసేపు ఇలా జరిగిందని బాధపడడం కంటే, ఎప్పుడైతే మనస్సు ప్రక్కకు వెళ్ళిందని గ్రహింపుకొస్తుందో, ఆ క్షణంలో వర్తమానం లోనికి వచ్చి మనస్సుని అక్కడే నిలుపుకోవాలి. ఈ విధమైన అభ్యాసంకు  సమయం పడుతుంది. కానీ, ఇది మనస్సును ఏకాగ్ర మొనర్చటానికి శక్తివంతమైన సాధన. ఇది శ్రేయోదాయకమైన సాధన. కాలం విలువ గుర్తించి, ఎవరిని వారు గమనించుకుంటూ జీవితం గడపటం వలన, ప్రతీ పనిలోనూ ఆనందం తృప్తి కలుగుతుంది. ఎంత సమర్ధవంతంగా పని చేయగలుగుతున్నామో ఎవరికి వారు ప్రత్యక్షానుభవముతో తెలుసుకోవచ్చు. 



అలాగని గతాన్ని వదిలేయాలా? భవిష్యత్తుకై ఆలోచించకూడదా ... అంటే - 
ఇప్పుడు చేస్తున్న పనికి గతానుభవం అవసరమైతే, దాన్ని తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకొని ఇప్పటిపనిని మరింత చక్కగా చేయవచ్చు.  
అలానే భవిష్యత్తు -   భవిష్యత్తులోని ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చేయాల్సిన పనులకోసం ఆయా ప్రణాళికలను దృష్టిలో పెట్టుకోవడం కూడా అవసరమే.
రేపటి పలహారానికి (ఇడ్లి, అట్లు లాంటివి) ఈరోజే పప్పు నానబెట్టాలి. తినటం రేపటి పని. పప్పు నానబోయడం ఈరోజు పని. అంతేగానీ,  రేపటి పలహారపు రుచిని, తినడాన్ని ఇప్పటినుండే ఊహించుకొని ఆ ఊహల్లో ఉండడం సరికాదు. ఎవరికైతే ఉన్నత లక్ష్యం ఉంటుందో వారు దానికై ఊహించుకుంటూ వర్తమానంను ఆలోచనలతో గడిపేస్తే ఫలితముండదు.  
భవిష్యత్తులోకి అవసరమైన దానిని అమర్చుకోవడం ప్రస్తుత కర్తవ్యమే గానీ, నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. ఊహాలతో విజయాలు రావు. కాలానుగుణ కార్యాచరణ చేస్తూ, నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. ఆదౌ కాలం పరిక్ష్యేత్, తతః కర్మాణి కారయేత్ ... 
కాలాన్ని అనుసరించి కర్మలు చేయాలి. కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ కర్తవ్య నిర్వహణ కావించేవారే విజ్ఞులు. 

                                                   


గతానుభవాలు చేదువని, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ప్రస్తుత క్షణాలను చేజార్చుకోవడం తగదు. మంచి క్షణం కోసం ఎదురుచూసేకంటే, ఉన్న క్షణాన్నే మంచిగా మలుచుకోవడం విజ్ఞుల లక్షణం. సమయాన్ని దేనికి ఎప్పుడు ఎలా కేటాయించాలో అప్పుడు అలా పద్దతి ప్రకారం కేటాయిస్తేనే సత్ఫలితాలు అందుతాయి. సమయాన్ని సద్వినియోగపర్చుకోవడం ఓ  చక్కటి కళ.







25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నీవు నా అమ్మవు...నేను నీ బిడ్డను...అందుకే నాకు ఈ ప్రశాంతత! 

సకల సిరిసంపదలున్నా శాంతిమయ జీవనానికి హామీ లేదు. సర్వాధికారాలున్నా భద్రమయ జీవనానికి భరోసా లేదు.సమస్త బంధుబలగం చుట్టూ ఉన్నా సుఖమయ జీవనానికి ఆసరా లేదు.  మనమెంత జాగ్రత్తగా ఉన్నా, ఒకోసారి ఎదుటివారి అజాగ్రత్త, మనల్ని బాధలకు గురి చేస్తుంటుంది. ఇప్పటికి సరిగ్గా నెల క్రితం మా ఇంట్లో అద్దెకున్నతని అజాగ్రత్త, గోప్యతల కారణంగా మా ఇంట్లో అందరం కోవిడ్ బారిన పడడం... కొంతమేర తేరుకోవడం అయింది. ఇంటిల్లుపాది ఒకేసారి బాధితులం కావడంతో నరకం చూసాం. ప్రారబ్ధం...అనుభవించకతప్పదు. ఇదే సమయంలో అంతర్గతంగా ఉన్న శారీరక బాధలు (కిడ్నీలో రాళ్ళు, యుటెరైన్ పైబ్రాయిడ్స్) బయటపడడంతో చాలా బాధ పడాల్సివచ్చింది. నావరకు నాకిది పునర్జన్మలా ఉంది. ఇటువంటి సమయంలో అమ్మవారు స్వప్న దర్శనం... "శ్రీ మాత్రే నమః" అనుకోవడం తప్ప, అమ్మని ఆరాధించే విధానం నాకు తెలియదు. అమ్మ గురించి ఆలోచిస్తుండగా - మనస్సులో శ్రీ శంకరులవారి 'దేవీ అపరాధ స్తొత్రం' కదిలాడింది. శ్రీ శంకర భగవత్పాదులవారు గురించి అందరికీ తెలుసు. మనల్ని తరింపజేయడానికీ ఎన్నో స్తోత్రాలను తెలిపారు. అందులో ఒకటి - 
 "శ్రీదేవి అపరాధ స్తోత్రరత్నమ్"
అమ్మా! నాకు నీ మంత్రము తెలియదు, నీ యంత్రమూ తెలియదు, నిన్ను స్తుతించడమూ తెలియదు, నిన్ను ఆవాహన చేయడమూ తెలియదు, నిన్ను ధ్యానించడమూ తెలియదు, నీ గాధలు చెప్పడమూ తెలియదు, నీ ముద్రలూ తెలియవు, అయ్యో...ఇవేవి తెలియవని నీకోసం విలపించడమూ చేత కాదు. కానీ, అమ్మా! నిన్ను విధేయతతో స్మరిస్తే, నా సమస్యలన్నీ సమసిపోతాయని మాత్రం తెలుసు. 
అమ్మా! విధివిధానాలు తెలియకపోవటంచేత, ధనం లేకపోవటంచేత, నా బద్ధకంచేత, ఆశక్తతచేత నీ పాదపద్మములు సేవించుటలో లోపం జరిగింది. అమ్మా! నన్ను క్షమించు, నన్ను క్షమించే క్షమత నీలో ఉంది. అందరినీ ఉద్ధరించే తల్లివి...నీకు తెలియనిది ఏముందీ? లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ చెడ్డతల్లి ఉండదు కదా.  
అమ్మా! ఈ భూమిపై సరళమార్గంలో, సత్యమార్గంలో నడయాడే సాధుజనులైన బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ; వారందరి నడుమ నిలకడలేని, మందమతినైనవాడను నేనొకడును ఉన్నాను. అయినను, అమ్మా! సర్వమంగళా! జగజ్జననీ! నేనూ నీ బిడ్డనే కాబట్టి, నన్ను నీవు వదిలివేయక ఆదరించి కాపాడు తల్లీ. ఎందుకంటే, లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ చెడ్డతల్లి ఉండదు కదా.  
అమ్మా! జగన్మాత! నేను నీ పాదపద్మములు ఎన్నడూ సేవించలేదు, ధనం లేక నీ సన్నిధిన సమర్పించిన నైవేద్యమూ ఏమీలేదు, కానీ; అమ్మా! నీవు మాత్రం నాపై నిరుపమానమైన మాతృవాత్సల్యం చూపించక తప్పదు. ఎందుకంటే, లోకంలో చెడ్డబిడ్డ వుండవచ్చేమో గానీ, చెడ్డతల్లి ఉండదు కదా.   
ఏ దేవతా పూజావిధానాలు ఏమీ చేయని నాకు, 55సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నేను చేయగల్గినది నీ శరణు కోరడమే. ఓ లంబోదరజననీ! ఇప్పుడు నీ కృప కలగకపోతే నాకు దిక్కెవరు? నిరాశ్రయుడైన నాకు, నీవుకాక వేరెవ్వరు ఇవ్వగలరు ఆశ్రయం?  
  అమ్మా! నీకై చేసే ప్రార్ధన చెవిన పడినంత మాత్రమునే - ఛండాలుడు(కుక్కమాంస భక్షకుడు)తేనెలూరు తియ్యని మాటలతో మాటకారి అవుతాడు. దరిద్రుడు కోటి కనకరాశితో చిరకాలం అడ్డులేకుండా విహరిస్తాడు. అమ్మా! అపర్ణా! ఇక నీకై భక్తిగా ప్రార్ధన చేసిన వారికి ప్రాప్తించే ఫలితాన్ని కొనియాడడం సాధ్యమా? 
 అమ్మా! చితాభస్మధారి, విషభోక్త, దిగంబరుడు, జటాధారి, కంఠంలో పాములను ధరించేవాడు, పశుపతి, కపాలమును భిక్షపాత్రగా కలవాడు, భూతాలకి అధిపతి అయిన శంకరుడు, ఈ జగత్తంతటిచే ఈశ్వరుడుగా ప్రార్ధింపబడుతున్నాడంటే... భవానీ! అది నీ పాణిగ్రహణ ఫలమేనమ్మా.
అమ్మా! చంద్రవదనా! నాకు మోక్షం పొందాలనే కోరిక లేదు, అనంత ఐశ్వర్యం కావాలనీ లేదు, ప్రాపంచిక విజ్ఞానమూ వద్దు, సుఖాలు మళ్ళీ అనుభవించాలనీ లేదు, కాబట్టి అమ్మా! నా శేషజీవితం మృడానీ, రుద్రాణీ, శివశివ భవానీ అంటూ నీ నామస్మరణతో గడిపేసేలా అనుగ్రహించమని వేడుకుంటున్నాను తల్లీ.  
అమ్మా! శ్యామా! నిన్ను వేదోక్తంగా షాడోపచారాలతో పూజింపలేదు. సరికదా, పరుషమైన పదాలతో దూషించాను. చేయని చెడు తలపు, మాట్లాడని చెడు మాట లేదు. కానీ, ఓ శ్యామా! నీవు ఈ అనాధ యందు కృప చూపు. అమ్మా! నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ అభాగ్యునిపై నీవు దయ చూపుతున్నావంటే, అది కేవలం కరుణామయమైన నీ తత్త్వానికి ఉచితమైన నడవడి కావడంవల్లనే తల్లీ.   
అమ్మా! కరుణాసముద్రా! ఆపదల యందు నిన్ను స్మరిస్తున్నానని తప్పుగా భావించకమ్మా.  దయాసాగరీ! ఇది సహజమే కదమ్మా ... ఆకలిదప్పులున్నప్పుడే, బిడ్డలు తల్లిని స్మరిస్తారు.    
అమ్మా! జగన్మాత! నాపై నీవింత దయ కలిగి వుండండంలో ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. సహస్రాధికమైన తప్పులు చేసినా సరే, ఏ తల్లీ తన బిడ్డను ఉపేక్షించదు  కదమ్మా.   
అమ్మా! నాతో సమానమైన పతితుడు వేరొకరు లేరు. అలాగే మహాపాపాలను సైతం ధ్వంసం చేయటంలో నీకు సరిజోడు లేరు. ఓ మహాకాళీ! ఇది దృష్టిలో వుంచుకొని నన్ను బ్రోచుటకు ఏది యోగ్యమో అది చేయు. 

"ఆమె - అమ్మ" 
 న మాతుః పరదైవతమ్ ... కన్నతల్లిని మించిన దైవం లేదు... అంటుంది శాస్త్రం.  కన్నతల్లే దైవమంటే, అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ... ఆ జగన్మాత గురించి చెప్పేదేముంది? ఆమె విశ్వానికి "అమ్మ".  
"ఆమె - శ్రీమాత" 
లోకంలో జన్మనిచ్చిన మాత - జన్మనిచ్చి, లాలించి, పోషించి, పెంచి, పెద్దజేసి, వృద్ధాప్యంలో బిడ్డలపై ఆధారపడడం సహజం. కానీ, సృష్టి స్థితి లయకర్తయైన ఆ జగన్మాతది శ్రీమంతమైన మాతృత్వం. అందుకే ఆమె "శ్రీమాత".  

శ్రీ = "శ"కారం +"ర"కారం + "ఈ"కారం. 
"శ"కారం ➡ ఆనందవాచకం.  
"ర"కారం ➡ తేజోవాచకం. 
 "ఈ"కారం ➡ శక్తివాచకం. 
 తేజోమయానందశక్తి స్వరూపిణి "అమ్మ". అందుకే ఆమె "శ్రీమాత". 
 శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, బుద్ధి, ధర్మం, సంపత్తి, విభూతి, విద్య, శోభ... ఇవన్నీ అమ్మ అనుగ్రహం. వీటన్నిటికి అధిష్టాన దేవత అమ్మే. అందుకే ఆమె "శ్రీమాత". 
 
"ఆమె - లలితాపరాభట్టారిక" 
 సృష్టికి మూలం శక్తి. వైదిక శాస్త్రల వచన ప్రకారం విశ్వరచనకు మూలం 'ఈక్షణశక్తి'. కనుచూపులతోనే ఈ జగద్రచనను కొనసాగించినది పరమేశ్వర శక్తి. ఈ చరాచర జగత్తుని నడిపించేది ఆ శక్తే. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కంటికి కనబడకుండా సూక్ష్మరూపంలో అంతటా అందరిలో వున్న శక్తుల సముదాయానికే 'పరాశక్తి, మహాశక్తి' అని పేర్లు. ఆ కటాక్ష రూప చైతన్యాన్ని 'విశ్వపోషణ చేసే మాతృరూపం'గా ఆరాధించడం మన సంప్రదాయం (శాక్తేయం).  
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ... రెప్పలు మూయడంతో విలయాన్నీ, తెరవడంతో సృష్టినీ, చూపుల ప్రసరణతో స్థితినీ కొనసాగించే చైతన్యశక్తి శ్రీలలిత. శక్తికి అధిష్టాన దేవత పరాశక్తి. నరాయణం నుంచి నారాయణం వరకు సమస్త సృష్టిని నిలిపి కాపాడేది ఆ పరాశక్తే. అందుకే ఆమె "లలితాపరాభట్టారిక". 

 "ఆమె" 
 సృష్టి స్థితి లయకారిణి.  ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సుస్వరూపిణి. శ్రీవిద్యా స్వరూపిణి, ఆది పరాశక్తి, పరబ్రహ్మతత్త్వమయి, అఖిలాండకోటి బ్రహ్మండ భాండోదరి, సర్వవేద వేదాంతసారిణి, శాస్త్ర సాహిత్య సమభూషిత, విశ్వమాత, విజ్ఞానమును ఒసగే జ్ఞాన ప్రదాత్రి, ప్రకృతికి ప్రాణదాత్రి, ప్రేమను పంచే హృదయనేత్రి, అవ్యాజ కరుణామూర్తి, సౌభాగ్యాలను ప్రసాదించే శుభకరి, అనేక రూపాల్లో కరుణించే అనంతరూపిణి.   శక్తి ఏ రూపంలో ఉన్నా, అది ఆ ఆది పరాశక్తి స్వరూపమే. ప్రపంచమంతా ఆదిశక్తి సంభరితం. శక్తి కానిది, లేనిది ఈ సృష్టిలో లేదు. జగమంతా ఆ జగన్మాత విశేష విన్యాసమే. 'నిర్గుణము, సూక్ష్మము, శుద్ధచైతన్యం' శ్రీ జగన్మాత మూలతత్త్వం. 
'శక్తి యొక్క అంతర్ముఖం - ఆత్మ. 
శక్తి యొక్క బహిర్ముఖం - ప్రకృతి'.
సర్వదేవతల సమన్విత శక్తి రూపం అమ్మ.  వీక్షణ శక్తి గల పరమాత్మను ఉపాసన సంప్రదాయంలో అనేక నామాలతో ఆరాధిస్తుంటారు. అమ్మకు అసేతు హిమాచలంలో ఎన్ని నామాలో, ఎన్ని విభూతులో! అష్టాదశ శక్తిపీఠాలలోనే కాదు, గ్రామగ్రామమున, వాడవాడన ఎన్ని దేవతల రూపాలో.  గ్రామదేవతలు కూడా జగన్మాత అంశలే. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కలకత్తా కాళీ, ముత్యాలమ్మ, తలుపులమ్మ, పోలేరమ్మ, కుంచుమాంబ ..... ఒకటని ఏముంది? ఊరు ఏదైనా, పేరు ఏమైనా, అన్నీ... ఆ ఆదిశక్తి ప్రతిరూపాలే. అనేక నామాలతో అమ్మ ఆరాధించబడుతున్నా వాస్తవానికి నిరాకారబ్రహ్మ యొక్క శక్తియే వ్యక్తరూపంలో ఇలా  పిలవబడుతుంది. 
అమ్మా!నా బలహీనతలన్నీ నీకు తెలుసమ్మా. లోపల మనోశుద్ధత కావడడంలేదు. శాస్త్ర విధులను ఎరుగను. నిన్ను ఏ స్తోత్రాలతో స్తుతించలేను. తల్లీ! నా అనంత అపరాధాలను క్షమించి దయతో నన్ను ఉద్ధరించు. అమ్మలగన్నయమ్మవు, నా అవసరాలు నీకు తెలియనివా? అడగకపోయినా నాకు కావాల్సింది ఎలాగూ నీవు ఇస్తావు. ఎందుకంటే నీవు అమ్మవు కాబట్టి!   అయినను అల్పురాలిని... అడగకుండా ఉండలేను... గాఢభక్తిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. ఈ అజ్ఞానురాల్ని అత్యంత  ఆర్ధతతో అక్కున చేర్చుకోమ్మా... నీవు నా అమ్మవు...నేను నీ బిడ్డను...కనుక నీవు నన్ను చూసుకుంటావ్... అదే నా విశ్వాసం... అందుకే నాకు ఈ ప్రశాంతత!

1, మే 2020, శుక్రవారం

"చెప్పాలని ఉంది, మనసిప్పాలని వుంది"...

లాక్డౌన్ ప్రకటించిన మొదట రెండుమూడురోజులు... మావారు టి.వి చూస్తూ, కబుర్లు చెప్తూ, కాస్త నా పనుల్లో సహాయపడుతూ హుషారుగా గడిపేశారు. ఆ తర్వాత రెండురోజులు... అబ్బా ఏ చానల్ చూసిన కరోన, కరోన... భయం వేస్తుంది, టి.వి చూడడానికి విముఖత, టైం గడవడంలేదు, బోర్, విసుగు, నిట్టూర్పులు. 
                              
ఒకరోజు బంధువులతో, స్నేహితులతో ఫోన్ లో కబుర్లు. ఆరోజు ఉత్సహాంగా గడిచింది. మరుసటిరోజు ముందురోజు మాట్లాడిన వారి ద్వారా, మరికొందరు బంధువుల, మిత్రుల ఫోన్ నంబర్స్ తెలుసుకొని, వరుసగా ప్రతీరోజూ కొందరితో మాట్లాడడం...ఆనాటి బంధాలు, అలనాటి జ్ఞాపకాల ముచ్చట్లు... ఓహో... ఎన్నెన్ని కబుర్లో.....వీరు చెప్పుకునే కబుర్లకు కొదవేలేదు.పెరట్లో ఆడుకునే ఆటలు మొదలు ప్రపంచాన్ని అల్లాడిస్తిస్తున్న కరోన వరకు, మారిన పల్లెలు లగాయతు దేశాల్ని దాటిన పిల్లల వరకు, కర్రబిళ్ళ మొదలు క్రికెట్ వరకు...ఒకటని ఏముందీ...పాత సైకిల్ టైరుని ఒక కర్రతో తోసుకుంటూ ఊరంతా తిరిగేయడం, గోళీలాటలు, గడ్డివాముల్లో దొర్లడాలు, పొలాలగట్ల వెంబడి పరుగులు, తాటిముంజులు, జీళ్ళు పంచుకొని తినడాలు, పిట్టగోడలు పై కూర్చొని దొంగతనంచేసిన జామకాయలు కాకి ఎంగిలి చేసుకొని తినడాలు, పిల్లకాలవలో ఈత కొట్టడాలు, కొబ్బరివాచ్ పెట్టుకొని కొట్టే పోజులు, ఆరుబయట నులకమంచంపై పడుకొని, చేతుల్ని తలక్రింద దిండుగా చేసుకొని  చుక్కల్ని లెక్కిస్తూ, మేఘాలతో ఆడుకుంటున్న చందమామని చూస్తూ పాడుకునే పిల్లరాగాలు మొదలు .....ఎన్నెన్నో కబుర్లు... అహంలేని అప్పటి అమాయకత్వంలో ఆనందం, అహంతో పాటు పెరిగిన  ఆస్తులు, అనారోగ్యాలు గురించి వీరు మాట్లాడుకుంటూ, ఆ ఆత్మీయత పలకరింపుల పులకరింతల నడుమ లాక్డౌన్ మాటే మరిచారు. మావారి తీరు బహు బాగు బాగు అనిపించి, ఈ విషయాన్ని నా సన్నిహితులతో చెప్పాను. 
                         
మన జీవితాల్లో ఎన్నో బంధాలు, ఎందరో బంధువులు, ఎన్నెన్నో పరిచయాలు, మరెన్నో స్నేహాలు....కానీ; నేడు బంధాలన్నీ ఒకప్పటిలా లేవు.  కొన్ని సజీవంగా, కొన్ని మరుగున పడి, మరికొన్ని ఉండీ ఉన్నట్లు...వున్నాయని అర్ధమైంది. ఎందుకిలా బంధాలు బలహీనమౌతున్నాయని మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటూ, తరచి చూసుకున్నాం. 
                          
నావరకు నాలో నాకు నచ్చని అంశాలు రెండున్నాయి. మొదటిది - నా వ్యక్తిగత బాధ్యతల నిర్వహణలో మునిగి, నా కుటుంబంకే పరిమితమై, మిగతా బాంధవ్యాలను సరిగ్గా పట్టించుకోక పోవడం. వ్యక్తిగత బాధ్యతలకు పూర్తిగా ప్రాధన్యత ఇచ్చి, ఎదుటివారికి అవసరమైన సందర్భాలలో స్పందించకపోవడం... ఇదీ ఓ విధమైన నిర్లక్షమే. మనుషుల్ని దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషాలు కంటే ప్రధానమైంది నిర్లక్షమే. నిజానికి ఈ మధ్యనే ఇలాంటి నిర్లక్ష్యానికి నేనూ గురైయ్యాను. ఆ బాధ వర్ణానాతీతం. ఇప్పుడర్ధమైంది, నేను కొందర్ని ఎంతగా నొప్పించానన్నది.  మనవళ్ళ సంరక్షణ, కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా వున్నను, అప్పుడప్పుడైన కొంత సమయం ఆత్మీయ బంధాలకు కేటాయించాల్సింది...ఇప్పుడు కాస్త తీరికై వెనక్కి చూసుకుంటే, బంధాల నిర్వహణలో ఒకింత విఫలమైనయ్యానని అర్ధమైంది. ఆత్మీయంగా ఓ పలకరింపు, చిరునవ్వుతో ఓమాట... వీటితో పోయేదేముంది, అవతల మనిషిలోని కలత తప్ప. తప్పు చేసాను... సరిదిద్దుకున్నానిప్పుడు. 
ఇక రెండవది చివర్లో ప్రస్తావిస్తాను.  
                           
నా సన్నిహితులతో ఈ విషయమై మాట్లాడాక, 'బంధాలు - అనుబంధాలు' సాధారణంగా ఏ కారణాలచే బలహీనమౌతాయో అర్ధమైంది. మేమందరం వీలైనంతవరకు మా మా బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొని, అందరికీ ఫోన్ చేసి, సడలిన, వడలిన బంధాలను పునరుద్దరించుకోవడానికి శ్రీకారం చుడుతూ, "చెప్పాలని ఉంది, మనసిప్పాలని
వుంది" అనుకుంటూ, కొందరి దగ్గర ఆత్మీయంగా ఒదిగి, కొందరికి పెద్దరికంగా హితం చెప్పి, కొందరికి  ఏం కోల్పోయామో మృదువుగా తెలుపుతూ, కొందరికి క్షమపణలు, కొందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ప్రేమతో మనసార మాట్లాడి, అందర్నీ అభిమానంగా పలకరించడంతో, అన్నీ మరచి, ఆత్మీయంగా అందరం ఆనందంతో అనుబంధాలను దృఢపర్చుకున్నాం.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఆత్మీయ అనుబంధాలతో విరాజిల్లేవి.  ఉమ్మడి కుటుంబాలల్లో ఆప్యాయతలు, ఆ ఆప్యాయత వెనుక ఆశీర్వాదాలు, ఆ ఆశిస్సులు వెనుక అండదండలు... అద్భుతం. అర్ధవంతమైన ఆరోగ్యకరమైన వాతవరణంలో స్థిరంగా సాగే తొందరలేని జీవనాలు ఆనాటివి. కానీ; కాలమాన పరిస్థితులబట్టి కుటుంబవ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. 
చాలావరకు చాలామంది వ్యక్తిగత అభిరుచులకు, ఆకాంక్షలకు భిన్నంగా వున్నాయి, నేటి బ్రతుకులు. తప్పదు, ఈమార్పులకు సహకరించక తప్పదు. ఈ మార్పును స్వాగతించక తప్పని నేపద్యాలు...అంత మాత్రమున మంచి బంధాల నుండి, మంచి స్నేహాల నుండి దూరం కానవసరం లేదు.

మనం సంఘజీవులం. బంధాలు లేనిదే మనుగడ లేదు. మనకు అనుబంధాలు తప్పనిసరి. పరస్పరం సహకరించుకుంటూ జీవనగమనం సాగించడానికి, జీవితమును అర్ధవంతం చేసుకోవడానికీ, ఆనందమును అనుభవం లోనికి తెచ్చుకోవడానికి అనుబంధాలను ఏర్పరచుకుంటాం. ఇలా ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాల విషయంలో అందరికీ చిరు చిరు ఒడిదుడుకులు వొస్తుంటాయి. అందరం చిన్న చిన్న తప్పుల్ని చేస్తుంటాం. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ వుండరు కదా. బంధాలు అనుబంధాలు ఆనందంగా ఆహ్లాదంగా కలకాలం సాగాలని, సాగించాలని ఎవరికుండదు? అందరికీ ఉంటుంది. కాకపోతే ఏ బంధంలోనైన అప్పుడప్పుడు చిరు చిరు మాటపట్టింపులు, కలతలు, అపోహాలు సాధరణంగా వుంటుంటాయి. అలానే కుటుంబీకులు కూడా ఒకోసారి మన ఆలోచనలకు విలువనివ్వకపోవడమో, అర్ధం చేసుకోలేకపోవడమో, వారి భావాలను మనమీద రుద్దడమో జరుగుతుంటుంది. అటువంటప్పుడు ఆవేదన కలుగుతుంది. కానీ, అప్పుడు ఒకటి గుర్తుంచుకొండి...ఎదుటివారు మన సంబంధీకులు, మనవారు! వారితో వెంటనే వాదనచేసి దూరం పెంచుకోకండి. తర్వాత మనకు కల్గిన బాధను నెమ్మదిగా అర్ధమయ్యేటట్లు చెప్పవచ్చు. అంతేగానీ, తక్షణమే గొడవపడి అహమును అడ్డుతెరగా నిలపకండి. అపార్ధమనే అడ్డుగోడల్ని కట్టకండి. అర్ధం చేసుకొనే వారధిని కట్టుకొండి. అలానే, ఎవరేం అనుకుంటారో, ఎవరెలా అర్ధం చేసుకుంటారో...ఇత్యాది సంశయాలతో మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం కూడా తప్పే. దానివలన సంబంధాలు బలహీనమవ్వవొచ్చు. అపార్ధాలు తొలగాలంటే వాదించడంవలనో, మౌనంగా ఉండడంవలనో ప్రయోజనం వుండదు. నేర్పుతో, ఓర్పుతో, సహృదయతతో అవతలివ్యక్తి అభిప్రాయాన్ని అర్ధం చేసుకుంటూ, ప్రేమతో మాట్లాడవలసిన చోట మాట్లాడండి...నిదానంగా స్పష్టంగా! 
ఇక, వాదించేవారికి మనం ఎంత తక్కువగా స్పందిస్తే, అంత ప్రశాంతంగా వుండగలుగుతాం. అలానే అప్పుడప్పుడు మన అభిరుచుల్ని మార్చుకోవల్సి వస్తుంది. ఒకానొక చిరాకు స్థితిలో, వాళ్ళకోసం నా ఇష్టాల్ని వదులుకున్నాను, వాళ్ళకై ఇది చేసాను, అది చేసాను, మరి వాళ్ళు ఏం చేసారు నాకై... అని దుఃఖపడతాం. ఎన్నో త్యాగాలు చేసినట్లు భావిస్తాం. ఒకటి గుర్తుంచుకొండి - ఇది వ్యాపారం కాదు; బంధం! శాశ్వతబంధాలలో చిన్న చిన్న త్యాగాలు తప్పనిసరి. ఏ బంధంలోనైన కాస్తంత సంయమనం, సర్ధుబాటుతత్త్వం తప్పనిసరి.

అలానే  సన్నిహితులతో బంధాలు గురించి మాట్లాడుతున్నప్పుడు, మా గమనిక లోనికి వచ్చిన మరికొన్ని విషయాలు ఏమిటంటే - మనముందు ఒకలా మన పరోక్షంలో మరోలా కొందరు  మాట్లాడుతుంటారు. ఒకరి గురించి మంచిగా చెప్పకపోయిన పర్వాలేదు, చెడుగా మాత్రం చెప్పకండి. మీరు చేసే కామెంట్స్ వలన కొందరి బంధాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. నిజాన్ని కప్పిపుచ్చి సగం సగం మాట్లాడకండి. మనిషి మంచివాడు కావాలంటే మంచిపనులు చేయనక్కరలేదు, ఎదుటివారు గురించి చెడుగా  మాట్లాడకుండా వుంటే, అంతేచాలు.

ఒకోసారి ఏదీ నిర్ణయించుకోలేని సందిగ్ధపరిస్థితులు ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, కుటుంబ పెద్దలు లేదా దగ్గరలోనే ఉండే శ్రేయోభిలాషులు తగు సూచనలు, చేయూత ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి లేదు కాబట్టి, స్నేహితులనో సన్నిహితులనో సలహా అడగడం  సహజం. అలా అడిగినప్పుడు - 'కొంచెం బిజీగా ఉన్నాను కాసేపు ఆగి నా పనులు పూర్తయ్యాక చెప్తాను'...అని చెప్పి, అలా... గంటలు రోజులు, రోజులు వారాలౌతాయి. వారినుండి బదులుండదు. చిన్నమాట చేయూతకు అంత జాప్యమా? నిజంగా వారికి ఏం చెప్పాలో తెలియకపోతే, ఆ మాటే చెప్పేయవచ్చు ముందుగా. కానీ, వారిని నిరీక్షణలో పెట్టేస్తారు. మాట లేదా చేత...చేయూత అడిగినప్పుడు చేయగలిగితే వెంటనే చేయండి. లేదంటే, 'చేయలేనిప్పుడు ఏ సహాయమును' అని ముందే చెప్పేయండి. దాహంగా ఉండి నీరు అడిగినప్పుడు ఉంటే ఇవ్వండి, లేదంటే లేవని వెంటనే చెప్పేయండి. తీరిక అయినప్పుడు ఇద్దామనుకుంటే, ఆ వ్యక్తి అంతవరకు నిలబడి ఉంటారో, సొమ్మసిల్లి పడిపోతారో ఆలోచించండి. (ఇది ఒక సారూప్యత కోసం ఉదహరించాను)

ప్రతీ మనిషిలో మంచి చెడు ఉంటాయి, మంచినే చూద్దాం. ప్రతి ఒక్కరు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు, ఇతరుల ప్రవర్తనని సానుకూలంగా నిర్వచించుకుందాం. స్వంత అభిప్రాయాలు ఏర్పరచుకొని ఆ కోణంలో ఎదుటివార్ని విశ్లేషించక, వారి కోణంలో కాస్తా ఆలోచించండి. నిజానికి ఏ బంధంలోనైన, చాలావరకు విభేదించే విషయాలకంటే ఏకీభవించే విషయాలే ఎక్కువ. ఇది నిదానంగా మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఏదీ పోట్లాడి, పోరాడి సాధించలేం. మంచిగా బ్రతకాలంటే మేధస్సు కాదు, మనస్సు వుండాలి. పొరపాట్లు మన్నించే మనస్సుండాలి.  ప్రేమించే మనస్సుండాలి. సఖ్యసంబంధాలు నెలకొనాలంటే సమైక్యభావన వుండాలి, అధికులమన్న భావన, చిన్నచూపు తగదు. అతిగా స్పందించడం తగదు. చిన్న చిన్న అపార్ధాలతో, అందమైన ఆనందకర అనుబంధాలను అర్ధరహితంగా, అర్ధాంతరంగా ఆపేయకండి. కలుపుకు పోయే తత్త్వం మనలో వుంటే, అందరూ మనతోనే ఉంటారు. పొరపాట్లు అవతలివారిలో ఉందనుకుంటే క్షమించడం, అవసరాలకి కాక ఆత్మీయతలకి విలువనిచ్చినప్పుడు, మనుషులతో కాకుండా మనసులతో మాట్లాడినప్పుడు, ఏ బంధమైన దృఢంగానే నిలుస్తుంది.

మనిషికి ఎన్నోరకాల ఆలోచనలు కలుగుతుంటాయి. అందులో ఏవి మంచివి, ఏవి చెడువి అంటే, అవి ఆయా సందర్భాల మీద అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. మనిషికి ఇలాగే వుండాలి, ఇలాగే ఆలోచించాలి, ఈ పనులే చెయ్యాలి, ఈ అలవాట్లే వుండాలి అని అందరికీ వర్తించేటట్లుగా సిద్ధాంతీకరించడం అసాధ్యం. కానీ, ప్రేమతత్వంలో ఉన్న ఘనతను, మహత్తును తెలుసుకుంటే, సాధ్యమైనంతవరకు మన సంబందీకులతో ప్రేమగా సఖ్యతగా ఉంటూ జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చు. కానీ, ప్రేమను పంచుకోం, మనసార మాట్లాడం, ఏదీ ఒకంతట వ్యక్తం చేయం, అన్నీ మనసుపొరల్లో దాచిపెడతాం. కొందరైతే వారి మాట, చేత, ఇష్టాలకు తందాన తాన అంటేనే, వారి ప్రేమను అందిస్తారు. ఇదా ప్రేమంటే? ఈ ప్రేమలో సహజత్వం ఉందా? స్వచ్చత ఉందా? స్వార్ధం ఉందా? ఇలాంటి ప్రేమతో బంధాల్లో అశాంతి, అసహనం, అపశృతులు రావా మరి. ఒక్కసారి మనలో మనం మధించి చూసుకుంటే ప్రేమలో ఎన్ని లోపాలో... ఇష్టాయిష్టాలతో ప్రేమను ముడిపెట్టి చూడకండి. ప్రేమంటే మానసికమైన ఉద్రేక ఉద్వేగాలు కాదు, కరచాలనం ఆలింగనాలు కాదు, ప్రేమంటే హృదయాన్ని స్పృశించడం. ఇది అంతర్గత స్పందన, నిరంతర ప్రవాహం. శాసింపులు, షరతులు ఉండవు. అవసరమైన చోట చిరు కఠినత్వమే తప్ప, నిరంకుశత్వమెరుగదు. ప్రేమ మృదువుగా మాట్లాడిస్తుంది, మృదువుగా వ్యవహారాల్ని చక్కబెడుతుంది, మృదువుగా హెచ్చరిస్తుంది. నిజానికి ప్రేమకి మించిన పదునైన ఆయుధం లేదు. ఈ ప్రేమ మనలో లేనిది కాదు, మనలోనే అనేక భావోద్వేగాల (ఆవేశం, అసహనం, ఆవేదన, అవమానం, అసూయ, అసంతృప్తి లాంటివి)క్రింద అణిగివుంది. ఆ ఆయుధాన్ని బయటికి లాగండి.  ద్వేషించడం వలన ద్వేషాన్ని రూపుమాపలేం. ద్వేషానికి సరైన మందు ప్రేమ. ప్రేమతోనే మానవసంబంధాలు పటిష్టంగా ఫరిడిల్లుతాయి.

చీకటితో ఎంత పోరాడినా ఏమీ లాభం వుండదు, వెలుగు వైపు అడుగులేస్తేనే చీకటి తనదారి తాను చూసుకుంటుంది. వెలుగు విలువ తెలుస్తుంది. అలానే వడలిన బంధాలను తలచుకొని బాధపడితే ఏమీ లాభం వుండదు, సరిచేసుకోవడానికి ఓ అడుగు ముందుకువేయండి. బంధాల్లో ఆనందం తెలుస్తుంది. 

మన కుటుంబవ్యవస్థను "ఉదారచరితానాంతు వసుదైక కుటుంబం" అని కీర్తిస్తారు. కుటుంబీకుల నడుమ పరస్పర అనురాగం గౌరవం ఉన్నను;  ఒకొకప్పుడు కుటుంబీకులను బాధపెట్టలేక కొన్ని విషయాల్లో రాజీపడతాం. ఎదుటివారి అభిరుచుల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం కోసం  కొంత తగ్గుతాం. అవతలివారి ఆధిపత్యానికో, పెద్దరికానికో ... భయంతోనో, భక్తితోనో కొంత మూగబోవల్సివస్తుంది... ఫలితం అసంతృప్తి. ఇలా ప్రతీ బాంధవ్యంలో ఎంతో కొంత అసంతృప్తి సహజం. అటువంటప్పుడు స్నేహితుల చెంత, ఆ అసంతృప్తి మర్చిపోవడానికి ప్రయత్నించిన, అదీ అన్నివేళలో సంతృప్తికరంగా ఉండదు. 
వీటన్నిటినీ అధిగమించడానికి మన ప్రవర్తనా శైలిలో, మన అభిరుచుల్లో, ఆలోచన సరళిలో ఓ మార్పు రావాలి. ఆ మార్పు మనకి ఆహ్లాదపరిచే తోడు కావాలి. ఆ తోడు మన అభిరుచుల్లో దొరుకుతుంది. ఎవరికో నచ్చినట్లుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సివస్తుంది. అదే మనకి నచ్చినట్లుగా బ్రతికితే, జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మనస్సు హాయిగా వున్నప్పుడే, సవ్యంగా ఉండగలుగుతాం. మనస్సుని నిర్మలంగా, వ్యవహారశైలిని సౌమ్యంగా నిలపగల్గేవి, మన అభిరుచులే. బంధాలు అప్పుడే పటిష్టంగా శోభిల్లుతాయి.

నా ఆత్మీయ నేస్తమొకరు ప్రకృతి ప్రేమికురాలు. సూర్యోదయమును ఆస్వాదిస్తారు, చంద్రరాజును చూస్తూ పులకిస్తారు, పక్షుల కువకువలు, పుష్పాల సొగసులు, గాలి గుసగుసలు...అన్నీ ఆమె మురిపింపులకు హేతువులే. రంగవల్లులు, పుష్పాలంకరణలు, దీపారాధనలు, మంచి సంగీతం మంచి సాహిత్యం ...ఇలా ఆమె అహ్లాదంగా సాగే దారులు ఎన్నెన్నో! తన ఈ అభిరుచులే తనకి చక్కటి తోడు. వీటితో తనకి చక్కటి అనుబంధం. ఇలా అభిరుచులతో అనుబంధం ఏర్పరచుకున్న ఆమె, తన అన్ని సంబంధబాంధవ్యాలతో ప్రేమగా నిత్యనూతనంగా నిలకడగా ఆనందంగా ఉండగలుగుతున్నారు.
ఈ కాంక్రీట్ కట్టడాల్లో, ఉరుకుల పరుగుల కాలంలో... ప్రకృతి, భావుకత్వంలతో జీవించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా...ఒక మిత్రురాలి సందేహం. ఊహు...నా ఉద్దేశ్యం తనని అనుసరించమని కాదు, చక్కటి అభిరుచులు ఇచ్చే మానసిక, శారీరిక ఉల్లాసాలు అత్యద్భుతమని తెలుసుకోమంటున్నాను. 
అందరం  ప్రకృతిశక్తితో అనుబంధం ఏర్పరచుకొని జీవించడం సాధ్యం కాదు కానీ, అసంతృప్తి లేకుండా, జీవించడం అసాధ్యం కాదు కదా. బాహ్య పరిస్థితుల మీద, ఆనందం ఎప్పుడు ఆధారపడదు. అది మన మనస్సులోని 
కదిలాడే భావాల పరిస్థితి మీద ఆధారపడి వుంటుంది. మానసిక ఉల్లాసం ఇచ్చే క్రొంగ్రొత్త దారులు కోకొల్లలు. ఎవరి అభిరుచులుకు తగ్గట్లు ఆ అభిరుచులతో అనుబంధం ఏర్పరచుకొని నచ్చిన మార్గంలో పయనిస్తే జీవనగమనం సవ్యంగా సాగదా? అయితే అభిరుచుల అన్నింటా అంతర్లీనంగా, ఇది అంతా భగవంతుని సృజన, ప్రతిభ అన్న స్పృహ, భగవత్ప్రేమ ఉంటే ఆ పొందే ఆనందంలో నిండుతనం ఉంటుందని నా భావన.
గమనించండి... మంచి ఆరోగ్యకర అభిరుచులతో(పుస్తకపఠనం, చక్కటి సంగీతమును ఎంజాయ్ చేయడం, మంచిపాటలువినడం, హయిగా పాడుకోవడం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం మొ||) అనుబంధం ఉంటే మనస్సు హడావిడి తగ్గిపోతుంది ముందు. మనస్సెంత సందడి లేకుండా నిర్మలంగా వుంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది.

మంచి చెడు, కష్టం సుఖం, రాత్రి పగలు, చీకటి వెలుతురు...ఇలా ద్వంద్వాలతోనే జగత్తు ముడిపడి ఉంది.  కొన్ని బంధాలు బాగా బాధపేట్టేవిగా ఉంటాయి. రెచ్చగొట్టేవారు, చిచ్చు పెట్టేవారూ ఉంటారు. వారికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. అవే గుణాలు మనలో ఉంటే మార్చుకోవడం మంచిది. అహం, సంకుచిత్వం, స్వార్ధం ఉన్నవారితో కాస్త దూరంగా ఉండవచ్చు. అవే లక్షణాలు మనలో ఉంటే వదిలించుకుంటేనే ఆనందం. ఒకోసారి ఒకొకరికి వారితో వున్నవారి వలన చితికిపోయే స్థితి కలుగుతుంది. అప్పుడు వారు, వారివారి అనుభవాల బట్టి వారి బంధాలను నిర్ణయించుకుంటారు. అది ఇక్కడ చర్చాంశం కాదు. 
                          
ఇక నాలో నాకు నచ్చనిరెండవ అంశం - నన్ను ఎవరైన నొప్పిస్తే మాటకు మాట అన్నట్లుగా, వెంటనే బదులిచ్చి వార్ని నొప్పించలేక, వారే తెలుసుకుంటారు వారి తప్పుని, అన్న భావంతో మౌనమైపోతాను కొద్దిరోజులు. నా ఆత్మీయ నేస్తాల్లో ఓ ఇద్దరు అప్పుడప్పుడు వారి మాటలతో, చేతలతో బాగా గాయపరిచేవారు. వారిని ఏదో అని బాధపెట్టలేక, వారే తెలుసుకుంటారు వారి తప్పుని అన్న భావనతో, మౌనమైపోయేదానిని కొద్దిరోజులు. తర్వాతమాములుగా మాట్లాడేదానిని. కానీ చిత్రమేమిటంటే, వారు తప్పును గ్రహించేవారు కాదు, అదే నడవడిక... ఎందుకిలా జరుగుతుందని... నాలో ఏమైన లోపముందేమోనని స్వీయ పరిశీలన చేసుకునేదానిని. నా తప్పు నాకు తెలియరాక, సూటిగా వార్నే అడిగేదానిని... నాలో ఏమైన లోపాలున్నాయా...చెప్తే సరిదిద్దుకుంటానని. ఏమీ లేవనేవారు. మీ ప్రవర్తన నన్ను నొప్పిస్తుంది అని కూడా చెప్పేదానిని. కొద్దిరోజులు బాగా ఉండేవారు. ఆపై మరల మాములే. నేనే సర్ధుకుపోయేదానిని బంధానికి విలువనిస్తూ. కానీ, నా ఈ బలహీనత వారికి ఆట అయింది. కోపం వచ్చిన రెండు మూడు రోజులే... తనే మరల మాట్లాడుతుంది అన్న భావన వారిది. ఇది సరికాదని నాకే అనిపించి, వారంటే ఎంత అభిమానం ఉన్నను, వారికి కారణం చెప్పి, పూర్తిగా మౌనమైపొయి, కొన్ని నెలలు అయింది. కొన్ని పరిచయాలు మనకు ఎంతో దూరంగా ఉన్నా, దగ్గరనిపిస్తాయి. కొన్ని బాంధవ్యాలు ఎంత దగ్గరగా ఉన్నా, దూరంగా అనిపిస్తాయి.
ఎందుకో మరి కొందరు మనస్సుకు చేరువుగా వచ్చి బరువుగా మారిపోతుంటారు. ప్చ్... మనస్సు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానముండదు. ఒకోసారి మనస్సుకు తగిలిన మాట చాల లోతుగా గాయం చేస్తుంది. కాలానికి కూడా దానిని మాన్పించే ఔషదం దొరకకపోవచ్చు. ఈ విషయం గ్రహించి చక్కటి చేతలతో, చల్లని మాటలతో, చిక్కటి బంధాలకు శ్రీకారం చుడితే బాగుంటుంది. 

ఆపేక్ష సత్సంబంధాలకు పునాది. మంచివ్యక్తిగా ఉండటంకన్నా, ఆపేక్ష చూపించగల మనిషిగా ఉండటం తృప్తినిస్తుంది. 
అర్ధం చేసుకోగల మనస్తత్వం, ప్రేమతత్వం, క్షమాతత్వం వున్నప్పుడే అన్ని అనుబంధాలు చక్కగా అమరుతాయి.
మనజీవితం ఆనందాన్ని వెతుక్కునేదిగా కాకుండా ఆనందాన్ని పంచుకునేదిగా అయినప్పుడు మన అనుబంధాలు అద్భుతంగా రాజిల్లుతాయి.

నా బంధువొకామె, నేను ఫోన్ చేసి మాట్లాడేసరికి ఆశ్చర్యంతో అమితానందంగా, నిజంగా నీవేనా...నీవేనా అక్కా... మాట్లాడుతున్నది... మన పెద్దవారి మధ్య స్పర్ధలు రావడం ఏమిటో, వారి ఆంక్షలకు... వారి పిల్లల కుటుబాలు కుటుంబాలు దూరమవ్వడం ఏమిటో, ఇప్పటికీ అర్ధం కాదు. ఆ పెద్దలు ఇప్పుడు లేరు కానీ,  ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది కష్టసుఖాల్లో కూడా కలుసుకొలేంతగా! ఎన్నోసార్లు అనుకున్నాను, నీతో మాట్లాడలని...కానీ, నీగురించి ఎప్పటికప్పుడు చాలామందిని అడిగి తెలుసుకుంటాను. ఒకప్పుడు తరచుగా మాట్లాడేదానివని, ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు వెళ్ళి తక్కువగా మాట్లాడుతున్నావని వినడంతో, బంధాలు మరల గుర్తుచేయడం ఎందుకని మాట్లాడలేకపోయానని... ఎన్నో చెప్తున్న తనని, ఒక ప్రశ్న అడిగాను - ఆధ్యాత్మికం అంటే ఏమిటమ్మా అని. 

చక్కటి మంత్రాలతో పద్ధతిగా పూజలు చేయడం, శ్లోకాలు వల్లెవేయడం, ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో ఉండడం, ప్రాపంచిక విషయాలు పట్టించుకోకపోవడం, బంధాలకు దూరంగా ఉండడం, ఏ ఆలోచనలూ లేకుండా ఉండడమే కదక్కా ఆధ్యాత్మికత్వం...
తన భావన అర్ధమై, నాకు తెలిసినంతలో చిన్న వివరణ ఇచ్చానిలా - 
ఆధ్యాత్మికత అంటే మంత్రాలు వల్లెవేయడాలు,  శ్లోకపూరిత అనుష్టానాలూ కాదమ్మా. ప్రాపంచికతను పట్టించుకోకపోవడం కాదు, బంధాలును వదిలించుకోవడం కాదు. ఆధ్యాత్మిక పయనం పలాయనవాదం కాదమ్మా. 
ఆధ్యాత్మికత అంటే - తొలుత అపార శ్రద్ధ, నమ్మకం, భక్తితో కూడిన దైవచింతనగా మొదలై, క్రమేణా మానసిక పరివర్తనకు దారితీయడం. దైవత్వం అంటే ఏమిటో అవగాహనకు రావడం. ధ్యానాదులచే మనలోనికి మనం చూసుకోవడం. మనోశుద్ధతకై 
యత్నించడం. పరిపక్వత చెందడం...ఇలా ఒకో మెట్టు అధిరోహిస్తూ, ఆత్మతో అనుబంధం ఏర్పర్చుకోవడం. 
ఆధ్యాత్మికత ఒక్కటే మనిషి దైనందిక జీవితంలో సృజనాత్మక వైఖరిని ప్రవేశపెట్టి, ఆనందమయమైన మనుగడను ఇస్తుంది. ఆధ్యాత్మికత మనిషిని ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితిలోనికి తీసుకెళ్ళే చైతన్య స్రవంతి. ప్రేమ కరుణ కృతజ్ఞతల కలబోత ఆధ్యాత్మికం. అందుకే, ఆధ్యాత్మికతత్వాన్ని జీవితం నుండి విడదీసి చూడకు, అలా విడదీసి చూస్తే అది ఆధ్యాత్మికమే కాదు. ఇది మనల్ని మనకి చూపిస్తుంది. మానసిక కాలుష్యాన్ని తొలగిస్తుంది, మనకి ఏది అక్కర్లేదో ఏది కావాలో తెలుపుతుంది, అంతర్గత శక్తిని పెంచుతుంది. జీవితం మీద ప్రేమ నశించపోకుండా ఉండటానికి, ప్రాప్తించిన దాంతోనే సంతోషంగా సంతృప్తిగా జీవించడానికి, సంపూర్ణత్వం తీసుకురావడానికి దోహదపడుతుంది. జరిగే అన్నింటినీ అంగీకరించడం నేర్పుతుంది. సరళంగా, సదావగాహనతో, సానుకూలంగా జీవించడం అలవర్చుతుంది. జరిగే సంఘటల వలన మనకి సుఖదుఃఖాలు కలగవు, మన కర్మల ఫలితంగా సుఖదుఃఖ అనుభవాలను పొందాలి కాబట్టి, ఆయా సంఘటనలు జరుగుతున్నాయనే అవగాహన వస్తుంది. ఆధ్యాత్మికం వలన సుఖదుఃఖాలు తొలగవు. సుఖదుఃఖాలను కూడా ఆనందంగా అంగీకరించే శక్తినిస్తుంది. మితిమీరిన మనో వ్యాపకములన్నీ మరణమృదంగములే అని గ్రహింపుకుతెచ్చి ఆ వ్యాపకాలను తగ్గించుకొని జీవనగమనం ఇష్టంగా (ఇలా వుంటేనే కావాలి అనిపించడం ఇష్టం)కాకుండా, ప్రేమతో (ఎలా వున్నా కావాలి అనిపించడం ప్రేమ)సాగేటట్లు చేస్తుంది. ఇక, ఆలోచనలు ఎవరికీ అస్తమించవమ్మా, కాకపొతే ఆలోచనలలో కామ్యకమైన ఆర్తి చల్లబడుతుంది, అంతే! ఇది అర్ధమౌతే, అన్నీ అవే అవగాహనకొస్తాయిరా... అని సంభాషనను ముగించి ఇవన్నీ స్మరణలో పదిలపర్చుకుంటుండగా, వాట్సాప్ లో ఓ విడీయో...ఆ విడీయో నచ్చి దానిని పదిలపరుస్తున్నాను ఇక్కడ -
                            

1, ఏప్రిల్ 2020, బుధవారం

ఎవరు ఎప్పుడు ఎలా ఎఱుకకు వస్తారో.....

ఆ మధ్యన ఓ స్నేహితురాలు ఇష్టాగోష్టిలో సుమంత్రుడు గురించి ఓ టపా పెట్టవోయి అని అన్నప్పుడు -

సుమంత్రుడా...దశరధుని మంత్రులలో ఒకరు కదా...అతను గురించి రాయడానికి ఏముంటుంది అని నిరాసక్తగా అన్నాను. 

వాల్మీకిచే సృజింపబడే రామాయణంలో పాత్రలన్నీ ప్రముఖమైనవే, వ్రాయరా అని తను అనగా, వ్రాయనని బదులిచ్చాను. 

ఏమిటో ...రామాయణంలో అన్ని పాత్రలు గురించి రాస్తుంటారు అందరూ, ఉడతను కూడా మరువక మెచ్చుకుంటారు గానీ, సుమంత్రుని గురించి పెద్దగా వ్రాయరు ...అని ఏదో చెప్తున్న తనమాటలను కొనసాగించడం ఇష్టం లేక, సరే పనుందని పోన్ పెట్టేసాను గానీ, నాలో ఏదో అంతర్మధనం. 

చిన్నప్పుడు సక్షిప్తంగా రామకధను చదివినను, సంపూర్ణ రామాయణమును తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు చదివిన గుర్తు. అలా చదువుతున్నప్పుడు నా రాముడిని అడవిలో వదిలి పెట్టడానికి వెళ్ళింది సుమంత్రుడని చదివినప్పటి నుండి అతనిపై ఓ విధమైన కోపం. అందుకే సుమంత్రుడు పేరు రామాయణంలో ఎక్కడ కనిపించిన ఆ పేజీలు చదవకుండా దాటవేయడం అలవడింది. ఆ కోపమో బాధో తెలియదు గానీ, ఈ వ్యక్తిగత తిరస్కార భావన నాలో అంతర్లీనంగా నాకు తెలియకుండనే వుండిపోయింది...నిద్రాణమై

అప్పట్లో మా తెలుగు టీచరమ్మను ఇదే అడిగితే - సుమంత్రుడు మంత్రి కదా, రాజాజ్ఞ ప్రకారం చేయడం అతని ధర్మం అని చెప్పినను, అడవికి బయలుదేరినప్పుడు ఆగమని దశరధుడే చెప్తున్నప్పుడు, మరి ఎందుకు ముందుకు రధం నడిపాడు... రాజైన దశరధుని మాట వినక, ఇంకా రాజుకాని, రాముని మాట ఎందుకు విన్నాడనే బాధతో కోపభావం నాలో ముద్రపడిపోయింది.

[అలానే సీతమ్మ వియోగమప్పుడు రాముని విలాపం కూడా చదవలేక ఆ పుటల్నీ కూడా దాటవేసాను] ఇప్పుడు నా స్నేహితురాలి వలన ఆ భావాలు మేల్కొన్నాయి.

చిన్నప్పటి కంటే ఇప్పుడు నాలో ఒకింత ఆలోచనలో పరిణితి రావడంతో, ఆనాటి నా భావన సరికాదేమో అన్న అంతర్మధనం. మరల రామాయణం పూర్తిగా చదువుదామన్న ఆలోచన, తపన. 


రామాయణం చదవడం ప్రారంబిస్తుండగా, ఈ వీడియో వాట్సాప్ లో. 


                              
రామానుగ్రహం అన్న పులకింత. చిత్రకారునికి శతకోటి వందనాలు. 

చదివాక అర్ధమైంది - 
నాది ఎంత అవగాహన రాహిత్యమో, అతను ఎంతటి సర్వజ్ఞుడో ... అన్నది. చదువుతున్నప్పుడు ఆయా సందర్భాలలో ఆయన కార్యశీలత దక్షత అర్ధమై పశ్చతాపంతో ఏడ్చేసాను. 

సుమంత్రుడు - సర్వజ్ఞుడు - ప్రజ్ఞావంతుడు  


దశరధమహారాజు మంత్రిమండలిలో రాజనీతిజ్ఞులైన ఎనిమిదిమంది మంత్రులు వుండిరి. వారిలో ఒకరు సుమంత్రుడు. 

ధర్మజ్ఞుడు, బహుప్రజ్ఞాశాలి అయిన దశరధుడు సంతనార్ధియై, అశ్వమేధయాగాన్ని చేయ సంకల్పించుకొని మనస్సులో మాటను ముందుగా  తెలిపి గురువులను పురోహితులను తీసుకురమ్మని ఆజ్ఞాపించినదీ  సుమంత్రునికే. 

వశిష్టాదులు వచ్చి వెళ్ళేక... 
                        


                         

మీకు పుత్రప్రాప్తి కలుగుతుంది మహారాజా, అని హితం కల్గించే మాటను ప్రియంగా తొలుత చెప్పి, పూర్వం సనత్కుమారుడు ఋషులతో సంభాషిస్తుండగా, వారి నోట విన్న కొన్ని జరగబోయే విషయాలను చెప్తూ, పుత్రప్రాప్తికై చేసే ఈ యాగమునకు ఋష్యశృంగుని ఆహ్వానించవలసినదిగా చెప్పి, ఋష్యశృంగుని గురించి వివరంగా తెలిపి, దశరధునితో అంగదేశానికి వెళ్ళి ఆ మునిని ఆహ్వానింపజేసిందీ సుమంత్రులవారే. 
                            ◇◇◇◇◇

దశరధుడు, రేపే రామునికి రాజ్యాభిషేకం అని  చెప్పాక, సభాసదులందరు సంబరంగా వారి వారి ఇళ్ళకు వెళ్ళేక, రామున్ని మరల మరల చూడాలని వున్నదన్న తన తపనను తెలిపీ రామున్ని తీసుకురమ్మని చెప్పిందీ సుమంత్రునికే. 



సూర్యోదయం కావడం, వశిష్టాదులు రాజ్యాభిషేకంకై కావల్సిన సామగ్రి అంతా సిద్ధం చేసుకొని అంతఃపురంలోనికి ప్రవేశించి, సుమంత్రునిని చూసి, సుమంత్రా! వెంటనే వెళ్ళి మహారాజా వారికి మా రాకను తెలిపి, వారిని తీసుకొని రా అని వశిష్టులవారి మాట ప్రకారం దశరధుల అంతఃపురంకి వెళ్ళెను. అంతఃపురంలోనికి వెళ్ళడానికి సుమంత్రునికి ఎవరూ అడ్డుచెప్పరు. ఎందుకంటే సుమంత్రుడు రాదలచకున్నప్పుడు అతనిని అడ్డగింపకూడదని దశరధుని ఆదేశం. 

తం తు పూర్వోదితం వృద్దం ద్వారస్థా రాజసమ్మతాః |

న శేకురభిసం రోద్ధుం రాజ్ఞః ప్రియచికీర్షవః ||



సుమంత్రుడు రాజగృహంలోనికి ప్రవేశించి, మేల్కొలుపుతూ యుక్తాయుక్తంగా స్తుతించగా, ఓ సుమంత్రా! నీ స్తోత్రాలన్నీ నా హృదయాన్ని చీల్చివేస్తున్నాయి అని దీనంగా పలికిన మహారాజును చూసి ఖిన్నుడైన సుమంత్రుడుకి, వెంటనే వెళ్ళి రామున్ని ఇక్కడకు తీసుకురండని కైకయి ఆదేశించగా, అటుపై అది నా ఆజ్ఞగానే స్వీకరించి రామున్ని ఇక్కడకు తీసుకొని రా, అన్న మహారాజు మాటలు విని రామ మందిరానికి బయలుదేరాడు.
                             
                   

రామమందిరానికి వచ్చిన సుమంత్రుడు, తను వచ్చినట్లు చెప్పమని అక్కడ ద్వారపాలకులకు చెప్పగా, వారు వెళ్ళి రామునితో చెప్పగా, ఏకాంతగృహంలో సీతతో కలసి ఉన్నా, వచ్చింది తండ్రికి సన్నిహితుడు, తనకి అత్యంత గౌరవపాత్రుడు కావటం వలన వెంటనే తనవద్దకు తీసుకురమ్మని చెప్పగా, లోపలకు వచ్చి, కౌసల్యా పుత్రా! రామా! దశరధమహారాజు, కైకేయి వెంటనే నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పడమే కాకుండా, తానే స్వయంగా రాముడు బయలుదేరి కూర్చున్న రధాన్ని మహారాజు అంతఃపురం వైపు నడిపెను. 
                            ◇◇◇◇◇
రాముడు వనవాసమునకు సిద్ధమై, తండ్రితో చెప్పి వెళ్ళాలని, సీతాలక్ష్మణులతో కలసి దశరధ రాజప్రసాదంలోకి అడుగుపెట్టి, దుఃఖిస్తూ దీనంగా వున్న సుమంత్రునిని చూసి, సుమంత్రా! నేను అడవులకు పోవటానికి సిద్ధమై, తండ్రిగారి దర్శనంకై వచ్చానని, ఈ విషయం తన తండ్రికి చెప్పమని చెప్పెను. 

పిమ్మట అడవులకు వెళ్ళే రామున్ని చూసి, దశరధ మహారాజు మహాదుఃఖంతో మూర్ఛిల్లగా - 
నీతివేత్తయైన సుమంత్రుడు వాడియైన మాటలతో, కఠినంగా, నిష్ఠూరంగా మాట్లాడిన, చలించక, దయచూపని కైకేయిని చూస్తూ బాధను తట్టుకోలేక, నీ తల్లి మూర్ఖత్వమే నీకూ వచ్చిందని...ఆమె జన్మ రహస్యం గురించి చెప్పి, నిందించి ఆపై ఎంతగానో బ్రతిమిలాడెను. 

రామాదులను అరణ్యంలో వదిలిపెట్టుటకు రధమును సిద్ధంచేయమని సుమంత్రునిని ఆదేశించాను దశరధుడు అశ్రుపూరితనేత్రాలతో. 
                             
                  

అంతా శోకమయులై యుండగా, రధం నడపడంలో నేర్పరి అయిన సుమంత్రుడు రధాన్ని కదిల్చాడు. రధాన్ని త్వరగా నడపమని రాముడు, ఆపమని దశరధుడు...రెండు చక్రాలనడుమ నలిగిపోతున్న వేదననుభవిస్తూ రాముడు చెప్పినట్లే వేగంగా నడిపాడు. 


తమసానదీ తీరాన ఆ రాత్రి సీతారామలక్ష్మణులు శయనించుటకు శయనాన్ని సుమంత్రుడే ఏర్పాటు చేసెను. ఆపై వేకువనే వెంబడే వస్తున్న పౌరులను ఏమార్చి, 
రాముడు చెప్పినట్లు మరొక మార్గంలో తపోవనాలకు పోయేదారికి చేరుకున్నారు. వేదశృతి గోమతి నదులను దాటుతూ, కోసలరాజ్యంను కూడా దాటి, గంగా తీరాన్ని చేరారు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించాలనుకున్నారు. 
                        

తెల్లారక గుహుడు గంగానదిని దాటడానికి నావను సిద్ధం చేసాక, రాముడు ప్రేమపూర్వకంగా సుమంత్రుని భుజం తట్టుతూ, సుమంత్రా! నువ్విక అయోధ్యకు వెళ్ళు అని అనగా, అందుకు విలపిస్తూ వెళ్ళలేనని చెప్పగా-
సుమంత్రా! మా ఇక్ష్వాకువంశానికి ఎన్నడూ నీవంటి విశ్వాసపాత్రుడైన సన్నిహితుడు లేడు. దశరధమహారాజు నన్ను తలచుకొని దుఃఖించకుండా, ఆయన్ను దగ్గరుండి ఓదారుస్తూ ఉండు. ఈ పనిని నువ్వు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. జితేంద్రియుడు అయిన నా తండ్రికి నా నమస్కారం అందజేసి నా మనవిని తెలుపంటూ...నిన్ను అయోధ్యకు వెళ్ళమని చెప్పటానికి బలమైన కారణాలున్నాయి అని, అవీ చెప్పి, నీవు వెళ్ళు...నాకు సంతోషం కలుగించు అని 
రాముడు చెప్పడంతో, అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యాడు  సుమంత్రుడు.

సుమంత్రుడు అయోధ్యకు చేరడం, రాముని సందేశాన్ని వినిపించడం, దశరధ కౌసల్యాదులకు ఓదార్చడం జరిగింది. ఈ సంఘటనలలో ఉత్తమదూత లక్షణం, హితాన్నికోరుకునేతత్వం 
ప్రస్ఫుటమౌతాయి.

దశరధుడు మరణించిన పిమ్మట మిక్కిలి దుఃఖితుడైన భరతుడు రామసందర్శనంకై అరణ్యమునకు వెళ్ళుటకు తగిన ఏర్పాట్లు చేయమని సుమంత్రున్నే ఆదేశించాడు.


భరతుని ఆజ్ఞను సుమంత్రుడు పరమసంతోషంతో శిరసావహించాడు. 

                              



భరతుడు తన సైన్యంతో దండకారణ్యమునకు వెళ్ళి దూరం నుంచే రాముని నివాసం చూసి తన సైన్యమును అక్కడనే నిలిపి కేవలం 

సుమంత్రున్ని గుహున్ని మాత్రమే తీసుకొని ముందుగా వెళ్ళాడు. ఆశ్రమంలో భరతునిని ఆలింగనం చేసుకున్నట్లే, రామలక్ష్మణులు సుమంత్రున్ని కూడా సమాలింగనం చేసుకొన్నారు.

తండ్రి మరణవార్త వినగానే, విలపిస్తున్న రామున్ని వశిష్టాది మంత్రులంతా ఓదార్చాక వారి సూచన మేరకు జలతర్పణాలు ఇచ్చేందుకు బయలుదేరారు. దశరధమహారాజుకు పరమ ఆప్తుడైన సుమంత్రుడు వారిని మందాకినీ నదిలో స్నానం చేయించాడు. 

ఇక ఉత్తర కాండముకు వస్తే - 

                             
                   


లోకాపవాదం...సీతమ్మను పొలిమేరలు దాటించి, గంగానది ఆవలి ఒడ్డున ఆశ్రమం చెంతన దిగబెట్టి రావడానికి వెళ్ళిన ఘటనలో...పొలిమేరలు దాటేంతవరకు వెళ్ళిన రధమునకు సారధి సుమంత్రుడే. 



సీతమ్మకు రాముని సందేశం చెప్పి...తిరిగి వచ్చిన లక్ష్మణుని వేదనను చూసి, 

లక్ష్మణా!  ఏ దైవసంకల్పంచేత ఇటువంటి దుఃఖం కలిగిందో, ఆ దైవాన్ని ప్రతిఘటించలేం కదా అని అంటూ, ఓసారి వశిష్ట దుర్వాసమహర్షివారలను దశరధమహారాజు కలిసి మాట్లాడినప్పుడు, నేనూ అక్కడే ఉన్నాను. దుర్వాసమహర్షి అప్పుడు మీతండ్రిగారితో కొన్నిమాటలు చెప్పెను. శ్రీమహావిష్ణువే రాముడని, 11000సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడని, భృగుమహర్షి శాపం వలన భార్య వియోగం అనుభవిస్తాడని... 

తదితర విషయాలు లక్ష్మణునికి చెప్పి ఊరట కల్గించింది సుమంత్రుడే.


ఇలా రామాయణంలో సుమంత్రుడు పాత్ర ఎంతో ప్రశస్తమైనది. బాలకాండము నందు దశరధుడు యాగం చేద్దామనుకున్నప్పుడు, సరైన సమయంలో, సవివరంగా, సరైన సూచన చేసి రాజునకు ప్రియుడైనాడు.
వశిష్టాది మహర్షులకు, మహరాజుకు, రాజపుత్రులకు, రాజపురోహితులకు వినయజ్ఞుడై, తగు సమయంలో, తగు సేవలను అందించి, అందరి గౌరవాభిమానలను పొందిన వ్యక్తి సుమంత్రుడు. 

ఇతడు మహాపరాక్రమవంతుడే కాకుండా సమయాసమయాలు నెఱిగి నేర్పుతో మాట్లాడగల నేర్పరి.ఇతను ఇక్షాకువంశ హితకాముడు, విశ్వాసపాత్రుడు, పరమాప్తుడు.
ఎవరు ఎప్పుడు ఎలా ఎఱుకకు వస్తారో... 
ఏది ఎప్పుడు ఎలా తెలియబరుస్తాడో 
భగవంతునికే ఎఱుక. 
ఇంతకాలంకు సంపూర్ణరామాయణం చదవడం ప్రాప్తిఅయింది. నా అవగాహనారాహిత్యం నాకు తెలియజెప్పిన మిత్రురాలు 'విశాల'కు వందనాలు🙏🙏🙏