16, డిసెంబర్ 2014, మంగళవారం

శివయ్యకు చలా?????

నిన్న ప్రక్కింటావిడ, వాళ్ళ అమ్మాయి హారిక మా ఇంటికి వచ్చారు. ఈరోజు హారిక పుట్టినరోజండి, అందుకే తెల్లవారుఝామునే శివాలయంకు వెళ్లి అభిషేకం చేశామండి ... అని చెప్తూ, తెల్లవారక ముందే లేచి, చన్నీళ్ళు స్నానం స్వాములు ఎలా చేస్తారో గానీ, ట్యాంక్ లో నీళ్ళతో స్నానం చేసేసరికి వణికిపోయానండి చలితో, అని ఆవిడ చెప్తుండగా ... హారిక నవ్వుతూ, మరి నీళ్ళను , ఫ్రిడ్జ్ లో పాలును శివలింగం మీద పోస్తున్నప్పుడు శివునికి చలెయ్యదా ఏమిటీ? అని ఆ అమ్మాయి అంటే, శివయ్యకు చలా????? అని నేను అనుకుంటుండగా చాలా సంవత్సారాల క్రితం ఓ మాసపత్రికలో చదివిన ఓ భక్తుని చమత్కారపు భావన గుర్తుకొచ్చింది.
ఆ భక్తుని చమత్కార భావన ఇదే -
ఇదెక్కడి విపరీతమయ్యా స్వామీ! నెత్తిమీద చల్లని చంద్రుణ్ణి పెట్టుకున్నావ్. అక్కడితో ఆగావా? అంతకన్నా చల్లనైన గంగమ్మను నెత్తికెక్కించుకున్నావు. ఆపైన తాకితే జివ్వుమనిపించే చల్లని పాముల్ని నగల్లా అలకరించుకున్నావు. అవన్నీ చాలవన్నట్లు మంచుకొండ కూతుర్ని ప్రక్కన కూర్చోబెట్టుకున్నావు. నీ చోద్యపు చిన్నెలకు అంతెక్కడ? గజగజలాడించే కార్తిక మార్గశిరమాసాలలో బ్రహ్మీ ముహూర్తము నుంచే ధారపాత్ర కింద తిష్టవేస్తావు. అభిషేకం పేరుతో ఎప్పుడూ నీళ్ళక్రింద నానుతుంటావు. నీ భక్తులూ నీకు తగినవారే, ఈ శీతలోపచారాలకు తోడు నీ ఒళ్ళంతా చల్లని విభూది చందనాలను పూస్తూ ఉంటారు. అయినా నీకు చలెయ్యదా మహానుభావా? అని ఓ భక్తకవి శివున్ని ప్రశ్నించాడు. అంతలోనే ఆయనకే సమాధానం తట్టి, 'నా అమాయకత్వంకానీ, నీకు చలేమిటయ్యా? తాపత్రయాలతో సలసల కాగిపోతున్న నా హృదయంలోనే కదా నీవున్నావు' అన్నాడట. 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

గృహస్థులకు బ్రహ్మచర్యమా ???

గత టపాను చదివిన శైలజగారు, గృహస్థులకు బ్రహ్మచర్యం వర్తించదేమో, గృహస్థులకు బ్రహ్మచర్యం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. 
ఆ ప్రశ్నకై నేను విని, చదివి తెలుసుకున్నంతలో ఈ చిరు వివరణ - 

ముందుగా బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం -

బ్రహ్మభావే మనశ్చారో బ్రహ్మచర్యం పరం తధా 
బ్రహ్మ భావనమందు మనస్సును సర్వదా చరింప జేయుటయే బ్రహ్మచర్యం. 

బ్రహ్మణీ చరతీతి బ్రహ్మచారీ, తస్యభావః బ్రహ్మచర్యం
పరబ్రహ్మయందు చరించువాడు బ్రహ్మచారి, వానిభావం బ్రహ్మచర్యం. 

ఇక సామాన్యముగా ఆలోచిస్తే -

మైధునస్యాప్రవృత్తిర్హి మనోవాక్కాయకర్మణా /
బ్రహ్మచర్యమితిప్రోక్తం యతీనాం బ్రహ్మచారిణామ్ //
మనోవాక్కాయకర్మలచే స్త్రీ సంబంధ విషయములనుండి నివృత్తి యేది కలదో అదే బ్రహ్మచర్యం. ఇది యతులకును బ్రహ్మచారులకును వర్తిస్తుంది. 

అయితే -

మానవునికి త్రివిధ దేహములు (స్థూల సూక్ష్మ కారణ) యున్నట్లే బ్రహ్మచర్యం కూడా మూడు విధములై యున్నది. 

తద్భేదం త్రివిధం వక్ద్యే స్థూలం సూక్ష్మం చ కారణమ్ /
వ్యాయామః ప్రధమః ప్రోక్తః మనోనైర్మల్యకం తధా //
ఆత్మశుద్ధిన్త్రుతీయా చ మోక్షస్సిద్ధ్యతి తే నఘ /
త్రివిధం బ్రహ్మచర్యం చ సాధనీయం సదా జనై: //

బ్రహ్మచర్యం కూడా స్థూలం, సూక్ష్మం కారణం అని మూడు విధములై ఉంది. స్థూలబ్రహ్మచర్యమును వ్యాయామముద్వారా, సూక్ష్మబ్రహ్మచర్యమును మనోనిర్మలత ద్వారా, కారణబ్రహ్మచర్యమును ఆత్మశుద్ధి ద్వారా పరిశుద్ధత గాంచును. 

పైన చెప్పిన వ్యాయామ, మనోనిర్మలత, ఆత్మశుద్ధులు ఎలా కల్గుతాయంటే -

యోగాసనం చ వ్యాయామే ప్రాణాయామశ్చ మానసే /
పరమాత్మ స్వరూపస్య విదుర్జ్జ్ఞానం తృతీయకే //

వ్యాయామ బ్రహ్మచర్యంలో యోగాసానాదులున్ను, మానస బ్రహ్మచర్యంలో ప్రాణాయామాదులున్ను, ఆత్మశుద్ధి బ్రహ్మచర్యంలో పరమాత్మ స్వరూపజ్ఞానమును కల్గుతాయి. 

మరల ఈ బ్రహ్మచర్యమును మూడువిధములుగా పేర్కొంటారు. అదేమిటంటే -

1. మానసికం :-  మనస్సున ఎలాంటి విషయ సంకల్పములు లేకుండుట. 
2. వాచికం :- వాక్కుతోను విషయాభిలాష ప్రయుక్తాలాపములు లేకుండుట. 
3. కాయికం :- క్రియారూపేణా శరీరముతో సంబంధం లేకుండుట. 

అటులనే ఈ బ్రహ్మచర్యమును మరో మూడువిధములుగా శాస్త్రము చెప్పుచున్నది. అవి ఏమిటంటే - 

1. నైష్టికము :- 
                    జన్మించిన మొదలుగు మరణపర్యంతం ఎలాంటి విషయ దోషములు లేకుండా ఆచరింపబడు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - శుకమహర్షి, సనకాదులు, ఆంజనేయుడు, గార్గి మరియు సులభాయోగినులు భీష్ముడు, మొదలగువారు. కలియుగమున రమణమహర్షి, అరవిందులవారు తదితరులు. 
2. గార్హస్థ్యం :- 
                   ఋతుకాలమునందు మాత్రమే విషయములయందు ప్రవర్తించి ధర్మబద్ధుడై అనుష్టించు బ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - జనకుడు, చూడాలా, శిఖిధ్వజ, మదాలస మొదలగువారు. 
3. వైదురము :- 
                      భార్యవియోగము లేక భర్తవియోగం కల్గిగాని, లేక భార్యాభర్తలకు ఆత్మశుద్ధి గలిగి విషయములలో విరక్తి కలిగి బ్రహ్మచర్యము ఆచరించురో అది విధురబ్రహ్మచర్యం. ఇందులకు దృష్టాంతం - యాజ్ఞవల్క్య మైత్రేయీ, విశ్వామిత్రుడు మొదలగువారు. కలియుగమున గురునానక్, శ్రీకృష్ణచైతన్యాదులు కలరు. 

అసలు బ్రహ్మచర్యమునకు ఆహరమునకు సంబంధం ఏమిటంటే -

ఆహరస్సత్త్వజనకం కరుణా భక్తివర్ధినీ /
బ్రహ్మభావనయా స్వస్మిన్ స్వయం బ్రహ్మాత్మనిశ్చయః //

సత్త్వగుణాభివర్ధకమగు సాత్త్వికాహారం సేవించుటయు బ్రహ్మచర్యమే యగును. భక్తిని వృద్ధి చేయు కరుణయు బ్రహ్మచర్యమే. స్వాత్మయందు బ్రహ్మభావనయు బ్రహ్మచర్యమే. 

మరి గృహస్థుల విషయంలో ఈ బ్రహ్మచర్యమును పరిశీలిస్తే - 

ఏ విధమైన వ్రతములు గాని, యజ్ఞాదిక్రియలుగాని, మండలం రోజుల పూజాదీక్షలుగాని చేసినప్పుడు బ్రహ్మచర్యం గృహస్థులు పాటించడం ఓ నియమంగా పెట్టుకుంటారు. 
కానీ, గృహస్థు బ్రహ్మచర్యమంటే - 

కాయేన మనసా వాచా నారీణాం పరివర్జనమ్ /
ఋతౌ భార్యాం వినా స్వస్య బ్రహ్మచర్యం తదుచ్యతే //
మనోవాక్కాయ కర్మాదులచే పరస్త్రీలతో సంసర్గం లేకుండుట, ఋతుకాలంలో మాత్రమే స్వపత్నితో జేరుటను గృహస్థ బ్రహ్మచర్యమనబడును. అటులనే మనోవాక్కాయ కర్మాదులచే పరపురుషచింతన లేనిదై, ఋతుకాలమందు మాత్రమే సంతానాభిలాషగలదై పతితో చేరు స్త్రీయు బ్రహ్మచారిణియే యగును.  

ఋతుకాలాభిగామీ యః స్వదారనిరతశ్చయః /
స సదా బ్రహ్మచారీ హి విజ్జ్ఞెయస్స గృహశ్రమీ //
ఋతుకాలమందు మాత్రం స్వభార్యయందు చేరు గృహస్థుడు ఎల్లప్పుడును బ్రహ్మచారియే అగును. అలాంటి నారీమణియు బ్రహ్మచారిణియే యగును.  

ఇక శాస్త్రము తెలుపుతున్న ఋతుకాల వివరణ -

ఋతుస్స్వాభావికః స్త్రీణాం రాత్రయః షోడశస్మృతాః /
చతుర్భిరితరైస్సార్ధమహోభిస్సద్విగర్హితై: //
స్త్రీలకు స్వాభావికముగా పదునారు దినముల వరకు ఋతుకాలము. అందు మొదటి నాలుగు దినములు వర్జనీయములు. 

తాసామాద్యాశ్చతస్రస్తు నిందితైకాదశీచ యా /
త్రయోదశీ చ శేషాస్తు ప్రశస్తా దశ రాత్రయః //
ఈ ఋతుకాలదినములలో మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ రాత్రియు నిందితములు. మిగిలిన పదిరాత్రులు ప్రశస్తములు. 

నింద్యాస్వష్టాసు చాన్యాసు స్త్రీయో రాత్రిషు వర్జయన్ /
బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే పసన్ //
పైన చెప్పిన నిషిద్ధములైన మొదటి నాలుగు దినములను, పదకొండవ, పదమూడవ దినములను, అమావాస్య పున్నమ వ్రత దినములను వదిలిపెట్టి తక్కిన రాత్రుల పత్నితో కూడినవాడు గృహస్థాశ్రమము నందున్నను బ్రహ్మచారియే యగును. అలాంటి స్త్రీయును బ్రహ్మచారిణియే యగును.  

బ్రహ్మచర్యం అవలంబించడం వలన ప్రయోజనమేమిటంటే - 

ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞా శ్రీశ్చ మహద్యశః /
పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా //
బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, తేజస్సు, దేహేన్ద్రియములకు బలం, ఓజస్సు, ప్రజ్ఞా, జ్ఞానసంపద, యశస్సు, పుణ్యం, భగవత్ప్రీతియు కలుగును. 

శాన్తిం కాన్తిం స్మృతిం జ్ఞానమారోగ్యం చాపి సన్తతిమ్ /
య ఇచ్ఛతి మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదిహ //
ఈ జగత్తున శాంతి, కాంతి, స్మృతి, జ్ఞానం, ఉత్తమ సంతానం కోరువారెల్లరు సర్వోత్కృష్ట ధర్మమైన బ్రహ్మచర్యవ్రతమును తప్పక పాటించవలెను.


8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం)





ఆహారశుద్ధి గురించి, వాని నియమములు గురించి, అలానే మాంసాహారం హింసాపూర్వక ఆహారమయినచో, శాకాహారంలో కూడా జీవముంటుంది కదా, మరి అది ఎందుకు హింసాపూర్వక ఆహరం కాదు? అలానే సాత్త్విక ఆహారం భుజించిన వారంతా ఎందుకు ధ్యానులు, జ్ఞానులు కాలేదని శైలజగారు గతంలో నేను పోస్ట్ చేసిన "శుద్ధ ఆహరం"  చదివి తన సందేహాలను అడిగారు. 


నాకు తెలిసినంతవరకు ఆ సందేహాలకు వివరణ ఇక్కడ ఇస్తున్నాను. 

అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ /
కలుషీకృతచిత్తానాం ధర్మస్సమ్యజ్న భాసతే //
ఆహారదోషంచే సర్వదా చిత్తమునకు కల్మషం కలుగును. కల్మషచిత్తం కలవారికి ధర్మరహస్యమైన జ్ఞానం ప్రకాశింపదు. 

అందుకే ఆధ్యాత్మిక సాధకులకు ఆహరశుద్ధి, ఆహారనియమములు తప్పనిసరి. 

మాంసాహారమునకు శాకాహరమునకు గల భేదం -

శాకాదులయందు జీవశక్తి యున్నప్పటికీ అవి జడములు. వాటికి ఇంద్రియములు లేవు. ఇంద్రియములు లేకపోవడం వలన వాటికి సుఖదుఃఖములు కలుగుటకు అవకాశం లేదు. 
జంతువులు మనుష్యులవలె స్త్రీపురుష సంయోగంచే నుత్పత్తి యగును గాని, సస్యముల వలె నుద్భిజ్జములు కావు. సస్యవర్గములు భూమి, నీరు మొదలగువాటి సహాయముతో పాటు, ఎక్కువగా సూర్యశక్తిని గ్రహించి, సూర్యశక్తిచే వృద్ధి అగుచున్నందున సూర్యుని యందున్న శక్తి సస్యాదులయందధికముగా యున్న కారణంచే వాటిని భుజించువారికి శుద్ధత్త్వం కలుగును. సత్త్వగుణం అలవడును. సూర్యుడు తమస్సును నాశము జేయునట్లు, శాకాహారంచే తమోగుణం నాశన మగును. 

ఆహార శుద్ధౌ సత్త్వశుద్ధి: సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతి: /
స్మృతిలాభే సర్వగ్రంధీనాం విప్రమోక్షః //
సాత్త్వికమైన శుద్ధాహారంచే మనఃశుద్ధియు, మనఃశుద్ధిచే దృఢమైన ప్రజ్ఞయు గల్గును. దృఢప్రజ్ఞచే సర్వగ్రంధులు నిశ్శేషముగా నాశంపొందును. 

ద్యానమూ, జ్ఞానమూ ఎప్పుడు అలవడతాయంటే - 

మానవునికి స్థూల, సూక్ష్మ, కారణలనెడి దేహములు కలవు. శుద్ధమైన సాత్త్వికాహారముచే స్థూలదేహము ఇంద్రియములు మాత్రమే శుద్ధములగును. సూక్ష్మ దేహానికి ఈ ఆహారం కొంతమాత్రమే సహాయపడును. కరుణ, శాంతం, సత్యం, అధ్యయనం, ప్రేమ, దైవభావం, సమత్వం, ఏకాత్మభావనం, దేవోపాసన  బ్రహ్మచర్యం గురు, దేవ, పూజయుక్తమైన సాత్త్వికాహారం ప్రాణాయామాది యోగములచే స్థూలదేహ శుద్ధి గలుగును. అటుపై కారణదేహశుద్ధతకు పై రెండు శుద్ధతవలన జ్ఞానం అలవడి పవిత్రమగును.  

సాత్త్వికాహారులందరూ ఎందుకు జ్ఞానులు కాలేకపోతున్నారంటే - 

ఆహరశుద్ధి అంటే తీసుకున్న ఆహరం సాత్త్వికముగా ఉంటే చాలదు. ఆ ఆహారం వచ్చిన మార్గము కూడా సత్యముగా ఉండవలయును. సత్యముగా సంపాదించిన ఆహారమును యుక్తముగా, నియమముగా దైవారాధన చేసి భుజించవలెను. 
శ్రీశంకరభగవత్పాదుల వారు చెప్పినట్లు -
జిహ్వతో భుజించెడు ఆహారమే ఆహరం కాదు. కర్ణ, త్వక్, చక్షు, ఘ్రాణముల ద్వారా స్వీకరించేది కూడా ఆహారమే అవుతుంది.
ఇక ఆహారశుద్ధి యొక్కటే చాలదు, ఆత్మశుద్ధియు కలిగి యుండవలయును. అలానే ఆత్మశుద్ధి గలిగిన చాలదు, ఆహారశుద్ధియు కలిగి యుండవలయును. పైన చెప్పినట్లు స్థూల సూక్ష్మ దేహాలలో శుద్ధతా లోపము వలననే కొందరికి శుద్దాహారము కలిగియుండినను ఆత్మజ్ఞానం కలుగకపోవుటకును, అలానే ఆత్మ శుద్ధమైనది జ్ఞానమైనదని విచారణచేత తెలుసుకొనినను ఆత్మజ్ఞానం అనుభవమునకు రాకపోవుటకున్ను కారణమని గ్రహించాలి. కావుననే "శుద్ధిద్వయం మహత్కార్యం దేవానామపి దుర్లభం" అని శాస్త్రం వక్కాణిస్తుంది. 
 
ఈ సూక్ష్మ కారణ దేహములను శుద్ధపరుచుట తెలియకపోవుటచేతనే స్థూలమైన సాత్త్వికాహారమును భుజించువారందరిలో ధ్యానం, జ్ఞానం అలవడడం లేదు. 

ఇక గృహస్థులు ఎంత హింసారహితముగా ఉందామనుకున్నను అనివార్యమైన ఐదు విధములైన హింసలు వచ్చుచుండును. 

అవి - 

పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్కరః /
కండనీ చోదకుంభశ్చ బధ్యతే యాస్తు వాహయన్ //

1. చుల్లీ :- కట్టెలు మొదలగువాని వలన వండునప్పుడు కట్టెలలో గల చెదలు మొదలగు క్రిములు నాశం. 
2. పేషణి :- విసరుచున్నప్పుడును, నూరుచున్నప్పుడును కలిగెడు ప్రాణహింస. 
3. ఉపస్కరః :- ఇతర గృహకృత్యములు చేయునప్పుడు కలిగెడు ప్రాణహింస. (బూజులు దులుపుట, తుడుచుట, చిమ్ముట, అలుకుట మొదలగు గృహ శుభ్రత పనులు, అలానే సస్యములలో నాగలితో దున్నుతున్నప్పుడు, పారతో చెక్కుతున్నప్పుడు కొన్ని క్రిములకు కలుగు ప్రాణహింస)
4. కండనీ :- ధాన్యాదులు దంచుతున్నప్పుడు కలుగు హింస. 
5. ఉదకుంభః :- నీరు మరిగించినప్పుడు కలుగు ప్రాణహింస. 

అందుకే ప్రతిదినం పంచయజ్ఞపరాయణులై యుండవలయునని మనుస్మృతి చెప్తుంది. 
పైన తెలిపినవి లేకపోతే మానవునికి మనుగడ కష్టం కాబట్టి,  ఇటువంటి అనివార్యమైన హింసల నివృత్తి కొరకు పంచయజ్ఞములు విధింపబడినవి. 

అవి - 

అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పితృయజ్ఞస్తు తర్పణమ్ /
హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞో తిధిపూజనమ్ // 

1. బ్రహ్మయజ్ఞము :- వేదోపనిషద్భగవద్గీత పారాయణము లేదా ప్రణవాది మంత్రజప భగవత్కీర్తన పూజాదులలో ఏదో ఒకటి ఆచరిస్తూ భోజనం చేయడం. 
2. పితృయజ్ఞము :- తర్పణాదులచే పితరులను తృప్తి పరచుట. 
3. దైవయజ్ఞము :- అగ్ని యందు వ్రేల్చుహోమము (వైశ్వదేవము). 
4. భూతయజ్ఞము :- కుక్క, పిల్లి, కాకి మొదలగు చిరుప్రాణులకు ఆహారమిడుట. 
5. మనుష్యయజ్ఞము :- అతిధిసత్కారం (బ్రహ్మచారులకు, సన్యాసులకు, సాధువులకు, తీర్ధయాత్రికులకు పూజ్యభావంతో భోజనం పెట్టుట, రోగులు, అంగహీనులు, నిస్సహాయులకు కరుణతో అన్నదానం చేయుట. 

ఆహార నియమములు -

హితం మితం సదాశ్నీయాద్యత్సుఖే నైవ జీర్యతే /
దాతు: ప్రకుప్యతే యేవ తదన్నం వర్జయేద్యతి: /
ఎల్లప్పుడూ ఆహరం మితంగాను, శుద్ధమైనదిగాను, ప్రీతికరమైనదిగాను ఉండవలెను. సుఖముగాను త్వరితముగాను జీర్ణమగునట్టి ఆహారమునే భుజించవలయును. ధాతుప్రకోపం కల్గించునట్టి అన్నమును భుజించరాదు. 

అన్నమని చెప్పుటచే బియ్యపు అన్నము అని అనుకోకూడదు. 'అద భక్షణే' అన్న దాతువునుండి అన్న శబ్ధమేర్పడినది. కనుక భక్షించున దంతయు అన్నమనియే భావించవలెను. 

ద్వౌ భాగౌ పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్ /
మారుతస్య ప్రచారార్ధం చతుర్ధమవశేషయేత్ //
సాధకులు అందరూ ఉదరమును సగభాగము అన్నము చేతను, పాతికభాగము జలము చేతను నింపి, మిగిలిన పాతిక భాగము గాలి సంచారార్ధముగా నుంచువారు బ్రహ్మనిష్ఠ యందు సర్వదా యుండగలరు. వీరికి వ్యాధులు రావు. 

సాయం ప్రాతర్మనుష్యాణామశనం దేవనిర్మితమ్ / 
నాన్తరం భోజనం దృష్టముపవాసీ తధా భవేత్ //
మనుష్యులకు దైవనిర్మితమగు భోజనము - ఉదయము, సాయంకాలము రెండుసార్లు మాత్రమే యేర్పడినది. అనగా మధ్యాహ్నం లోపల ఒకసారియు, సాయంకాలమున ఒక పర్యాయము మాత్రమె యుండవలయును. అట్టివారికి ఎలాంటి వ్యాదియు ఉండదు. ఈ రెండువేళల తప్ప ఇతర సమయములలో నేమియూ భుజింపనివారు ఉపవాసఫలమును పొందుదురు. 

మోక్షధర్మేషు నియతో లఘ్వాహారో జితేన్ద్రియః /
ప్రాప్నోతి బ్రాహ్మణః స్థానం తత్పరం ప్రకృతేర్ధ్రువమ్ //
మోక్షమార్గమందు ప్రవర్తించువారు నియమశీలులై, యుక్తాహారులై జితేన్ద్రియులై యుండినచో ప్రకృతికి పరమై, శాశ్వతమై యుండు పరబ్రహ్మస్థానమును పొందుదురు. 

ఆహారశుద్ధౌ చిత్తస్య విశుద్ధిర్భవతి స్వతః /
చిత్తశుద్ధౌ క్రమాత్ జ్ఞానం త్రుట్యన్తి గ్రంధయస్పుటమ్ //

15, ఆగస్టు 2014, శుక్రవారం

జయహో ... ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని.

హాయ్ ... 

ఈ రోజుకి ఈ బ్లాగ్ కు నేనే నాయకిని. 
నా పేరు "శ్రీ మాన్వి". 
వయస్సు ఒక సంవత్సర రెండు నెలల ఇరవైఏడు రోజులు. 

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనిపించి మా అమ్మమ్మ బ్లాగ్ కు వచ్చేసాను. 


                                             "భారతదేశం నా మాతృభూమి" 

రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం 
బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందేభారతమాతరం 

(రత్నాకరుడైన సముద్రుడు ఎవరి పాదములను కడుగుతున్నాడో, ఎవరికీ హిమాలయము కిరీటమై ప్రకాశిస్తుందో, బ్రహ్మర్షి రాజర్షులనెడి పుత్రరత్నములతో ఎవరు ప్రకాశిస్తూ ఉన్నారో ... అట్టి పవిత్ర భారత నా మాతృభూమికి వందనం)

భారతభూమి జగన్మాత యొక్క సాక్షాద్రూపమే. అది ఎలాగంటే తండ్రి అయిన దక్షునిచే అవమానింపబడి అగ్నికాహుతి అయిన సతీదేవి దేహాన్ని ఎత్తి పరమశివుడు ప్రళయతాండవం చేస్తే, ఆ దేవి శరీరావయవాలు ఏబైరెండు చోట్ల పడ్డాయి. అవి మన భారతదేశంలోనే ఎబైరెండు శక్తిపీఠాలుగా విలసిల్లుతూ మన భూమి ఘనతను వెల్లడిస్తుంది. సముద్రమును వస్త్రముగా, పర్వతములను స్తనమండలముగా గలిగిన విష్ణుపత్నిగా భారతమాతను మన ఋషులు శ్లాఘిస్తున్నారు. మన మాతృదేశం కేవలం ఒక మట్టిముద్దకాదు, ఆమె భవాని, మహిషాసురమర్ధిని, భారతి. ఆమె కోటి కోటి జనమనో హృదయాలలోని ఇచ్ఛాశక్తుల సజీవ సాక్షాత్కారం. ఆమె సాక్షాజ్జగజ్జనని. పరాశక్తి యొక్క సజీవావిష్క్రుతి అని అరవిందులు వారుకీర్తించారట. ఈ విషయాలు అన్నీ మా అమ్మమ్మ చెప్తుంటుంది. అందుకే - 
                   
                    "నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్విస్తున్నాను"

ఏ ప్రపుల్ల పుష్పముల నీశ్వరునకు 
పూజ సల్పితినో యిందు పుట్టినాడ 

ఇంతటి మహనీయగడ్డ పై నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న (అనూష, లతీష్) లకు వందనములు. 


ఈ టపా ఇప్పుడు నాకు అర్ధం కాకపోయినను భవిష్యత్తులో నాకు స్ఫూర్తినిస్తుందనే ఆకాంక్షతో నా పేరిట మా అమ్మమ్మ ఈ పోస్ట్ ను పెట్టింది. 

మరోసారి -

అందరికీ 

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!


                                                                                         - మీ  శ్రీ మాన్వి 


5, జూన్ 2014, గురువారం

ఇది నా అంతరంగమధనం - భగవంతుడు ఉన్నాడా?

సాధారణంగా కొందరు కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు లేనే లేడు, దేవుడే ఉంటే నాకిలా ఎందుకు జరుగుతుంది... అని అనుకోవడం జరుగుతుంది. ఇలా అనుకునేవారిలో నేనూ వున్నాను. కొద్దినెలల ముందు కొన్ని విపత్కర పరిస్థితులలో భగవంతుడు ఉన్నాడా అని అనుకున్నాను. 
జీవితంలో సుఖదుఃఖాలు, లాభనష్టాలు, గౌరవవమానాలు ... ఇటువంటివి సహజం. నా జీవితంలో కూడా ఇవన్నీ వున్నాయి. కానీ, దేనికీ పొంగని కృంగని సరళమైన జీవనగమనం నాది. మా నాన్నగారి నుండి ఇది నాకు అలవడింది. ఏ స్థితిలో ఉన్నను, ఏనాడు 'రామ'నామం మరువలేదు. భగవంతునిపై విశ్వాసం వీడలేదు. కానీ; గత కొద్దిమాసాలుగా కొనసాగుతున్న సమస్యల పరంపర, ఊహించని సంఘటనలు, నమ్మకద్రోహాలు మనస్సుని కల్లోలపరుస్తుంటే - భగవంతుడే లేడని, దేవుడన్నది ఒక ఊహేనని కొంతసమయం ఆవేదనతో అనుకున్నాను. 

అయితే అదే సమయంలో మా మాస్టారుగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యుడు, మందులు ఎలా అవసరమో అలానే కష్టస్థితిలో భగవంతుని స్మరణ అంతే అవసరం. అలాగని ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందులు అవసరం లేదని, సుఖాల్లో భగవంతున్ని విస్మరించడం కూడా తప్పే. కష్టాలు వచ్చేసరికి భగవంతుని కృప లేదనుకోవడం చాలా పొరపాటు. భగవంతుని కృప నిరంతరం వుంటుంది. అనుకూలతలో వుందని, ప్రతికూలతలో లేదని అనుకోవడం మనోదుర్భలత్వము. మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టించుతాయి. లౌకిక ప్రపంచం ఆపదలతో కూడుకున్నదే. ఆ ఆపదలకు ఆవేదన పడేకంటే ఓర్చుకొని పారమార్ధిక జ్ఞానం వైపు పురోగమించడమే మన పని. 
మాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది అని అంటుంటారు. ఏమీ రాకపోతే ఈ శరీరం భూమి మీదకు ఎందుకు వస్తుంది? ఆ అనుభవాలు పొందింప జేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతుల్ని చేస్తాడు. చెరకుగెడ గెడలాగే వుంటే రసం రాదు, దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే రసం వస్తుంది. అనేక కష్టనష్టాలకు గురి అయితే గాని దానిలో నుండి అమృతత్వం రాదు అన్న బాబా మాటలు మరువకండి. 
శ్రీమద్భాగవతము లో చెప్పినట్లుగా -
యస్యాహమనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైః అన్నది శ్రీభగవానువాచ. (నేను ఎవరిని అనుగ్రహించదలచుకున్నానోవారి సంపదలను, గౌరవాదులను మెల మెల్లగా హరిస్తాను). 

లౌకికమునందు మునిగిపోయినప్పుడు భగవానుడు మనయందు తన అనుగ్రహంను ప్రసరింపజేయ తలచి మనకు మోహం కల్గించే వాటిని, అహం పెంచేవాటిని హరించి మనల్ని తనవైపుకి త్రిప్పుకుంటాడు. 
నిజానికి ఈ ఆపదలు మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి, భగవంతున్ని స్మరించుటకు వీలు కల్పిస్తున్నాయి. 
మోక్షమును ప్రసాదించే నీ దర్శనం కలుగునట్లుగా ఈ విపత్తులన్నియూ మరల మరల కలుగవలెనని (విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో. భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్కోరుకున్న అనన్యభక్తి కుంతీ మాతది. 
బాల్యం నుండియే అనేక ఆపదలను ఎదురైనను ఆవేదన చెందక అచంచల భక్తితో హరినామ స్మరణం ద్వారా ప్రహ్లాదుడు ఏం పొందాడో గమనించండి. 

తత్తేऽనుకమ్పాం సుసమీక్షమాణో భుఞ్జాన ఏవాత్మకృతం విపాకమ్
హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే స దాయభాక్ //
(కర్మ పరిపాకాన్ని అనుభవిస్తూ, నీ దయ ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ, శరీర మనో వాక్కులతో నీకు నమస్కారం చేస్తూ ఎవరు బతుకుతారో అటువంటి వారు నీ దయను పొంది ముక్తిని పొందుతారు) భక్తుని యొక్క దృక్పదం ఈరీతిలో ఉండాలని చెప్తూ చివరగా ఓ మాట చెప్పారు - "పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సాధన చేసుకోండి, ప్రతికూలంగా వున్నప్పుడు వైరాగ్యం పెంచుకోండి". 
పై మాటలు గుర్తుకురావడంతోనే నా అవివేకంకు ఆవేదన కల్గింది. 

అలానే భగవంతుడు ఉన్నాడా అన్న సందేహం కల్గగానే నా ఆత్మీయురాలికి ఈ సందేహాన్ని తెలిపాను.  
దానికి తను ఏమందంటే - తప్పు, తప్పు ఎప్పటికీ ఈ భావన నీలో రానీయకు... పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా వున్నా భగవంతుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఆ సంఘటనలతో మనోస్థైర్యంను పెంచుకోవాలని చెప్తూ, ఇలా అంది - మనం ఈ జన్మలో ఏ పాపాలు చేయకు పోవచ్చు, గతజన్మల ప్రారబ్ధం కావొచ్చు కదా, తప్పదు ... జీవితంలో కష్టసుఖాలాను సరళంగా సహజంగా స్వీకరిస్తూ గమ్యం వైపు సాగిపోవడమే...  తన ఈ మాటలతో నా భావన ఎంత హేయమైనదో గ్రహించాను. 
పై ఇరువురి మాటలు నా తప్పిదాన్ని తెలుసుకునేటట్లు చేశాయి. పూజ్యులు మాస్టారు గారికి, నేను ఎంతగానో అభిమానించే నా ఆత్మీయురాలికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 


అటుపై భగవంతుడు లేడని అనుకున్నందుకు నేను పొందిన ఆవేదన నేను ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితుల కంటే అధికమైనది. ఆ సమయంలో నాలో జరిగిన ఆ అంతర్మధనమే ఈ టపా - 
ఆ సమయంలోనే నాలో స్వీయపరిశీలన జరిగింది. 
నిజమే నా మనస్సు విషయత్వం నందు చిక్కుకుంది. ఈ విషయత్వం విషం కంటే దారుణమైనదని శాస్త్రమంటుంది. (ఉపభుజ్య విషం హంతి విషయా స్స్మరణాదపి) విషం తినినచో చంపును. కాని విషయం తన్ను స్మరించిన మాత్రమునే హననం చేయును.  
ఇక ప్రారబ్ధంను తప్పించుకోవడం ఎలా? ప్రారబ్ధం భోగతో నశ్యే అన్నారు పెద్దలు. వీటిని సహనంగా అనుభవించి అధిగమించాల్సిందే. ఇటువంటి స్థితిలో ఆవేదన కలగకూడదంటే ఆపదలను ఆపదలుగా కాకుండా భగవంతున్ని అనుగ్రహంగా భావించాలి. ఈ సమస్యలు నాలో తగినంత వివేకం, వైరాగ్యం, అభ్యాసం లేవని తెలియజెప్పడానికే కల్గి వుండవచ్చు.
మంచి చెడుల సమ్మేళనములతో, ఆశానిరాశల సమాహారములతో, ఆనందవిషాదభాష్పాల సంగమములతో, ఎన్నెన్నో సంక్లిష్టతలతో కూడిన ఈ లౌకిక ప్రపంచంలో చలించని భక్తివిశ్వాసాలతోనే పారమార్ధిక పధంలో పయనించగలగాలి. జీవితము పట్ల ఓ చక్కటి అవగాహన కల్గి వుండాలి. గీతలో చెప్పినట్లుగా అందుకు తగ్గ అభ్యాస వైరాగ్యంలను సాధన చేయాలి. (మనస్సుని లౌకిక విషయాలనుండి మళ్ళించడం వైరాగ్యం. మనస్సుని ఆత్మయందు నిలపడం అభ్యాసం). 

ఇప్పటికీ సమస్యల నడుమే వున్నను నాలో ఇప్పుడు దుఃఖం లేదు. కాలగమనంలో ఈ సమస్యలు వీడవచ్చు, వీడకపోవచ్చు. కానీ; ఇక నాలో ఎప్పటికీ భగవంతునిపై విశ్వాసం వీడదు. 

త్వయి మేऽనన్యవిషయా మతిర్మధుపతేऽసకృత్
రతిముద్వహతాదద్ధా గఙ్గేవౌఘముదన్వతి //


ఓ మధుపతీ! నా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు. గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రం వైపునకు ప్రవహించురీతిన, నా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా ఇతరముల వైపునకు మరలక,
నిన్నే కలిసేటట్లు నీయందే ఉండాలి.
 



 

15, మార్చి 2014, శనివారం

ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అందేది ???


ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అందేది ఏమిటో తెలుసుకునే ముందు అప్పుడప్పుడు నేను విన్న రామనామ మహత్తును ఓసారి  ఇక్కడ ప్రస్తావిస్తాను. 

పూర్వం ఓ రాజు తన వృద్దాప్యదశలో తాను ఎన్నో పాపాలను చేసినట్లుగా గ్రహించి, పశ్చాత్తాపం చెంది, ఏం చేస్తే తనకి నివృత్తి అవుతుందో తెలుసుకోవడానికి సమీప అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఓ ఋషి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఋషి కుమారుడు ఆశ్రమంలో ఉన్నాడు. రాజుగారి వేదన, తపన, ప్రార్ధన విని, ఆ ఋషి కుమారుడు "మూడుసార్లు రామనామం జపించు, నీ పాపాలన్నీ తొలగిపోతాయి" అని చెప్తుండగా; ఆశ్రమంకు వచ్చిన ఋషి తన తనయుడు చెప్పిన మాటలు విని, కోపంతో "రామనామాన్ని కించపరుస్తావా? ఒక్కసారి రామా  అంటేనే జన్మజన్మపాపాలు నశిస్తాయి కదా, మరి మూడుసార్లు జపించామంటవా? ఈ నేరానికి నువ్వు మరుజన్మలో ఆటవికుడుగా పుడతావు" అని శపించాడు. 
ఈ శాపాన్ని పొందిన ఋషితనయుడే రామాయణకాలంలో గుహుడుగా జన్మించినట్లు పెద్దలు చెప్తుంటారు. 

ఓ స్త్రీ తన భర్త మరణించడంతో ఎంతగానో విలపిస్తూ, శవయాత్ర వెంటే వెళుతూ అదే దారిలో ఉన్న తులసీదాసు ఆశ్రమం లోనికి ప్రవేశించి, ఆయనపాదాలపై పడి శోకించగా, జాలితో ఆమె భర్త శవమును సమీపించి, రామనామాన్ని జపించి కమండలంలోని జలాన్ని శవం మీద జల్లి జీవం పోశారు.  
అటులనే మరోసారి ఒక తులసిఆకుపై రామనామాన్ని వ్రాసి, ఆ ఆకును నీటిలోవేసి, ఆ తీర్ధంతో ఐదువందలమంది కుష్టురోగుల వ్యాధిని నయం చేసిన మహాత్ముడు తులసిదాసువారు. ఇటువంటి రామనామమహిమను తెలిపే మరో ఘటనను కూడా పెద్దలు ద్వారా విన్నాను. ఓ నదిలో కొట్టుకుపోతున్న ఓ శవం చెవిలో రామనామం లోని 'ర'కారాన్ని మాత్రమే ఓ సంతు జపించగా ఆ శవంలో జీవం వచ్చినట్లుగా విన్నాను.
రామనామమహత్యం గురించి మరింత వివరణ ఈ లింక్ లో - పరమపావనం - రామనామం 

అయితే ఇంతటి శక్తివంతమైన ముక్తిదాయకమైన నామధారి అయిన "శ్రీరామచంద్రుని అనుగ్రహం" అందుతుంది ఆంజనేయున్ని ఆశ్రయిస్తే. 
అందుకు నిదర్శనంగా కొన్ని ఘటనలు పరిశీలిద్దాం -

సీతాన్వేషణకై లంకకు వెళ్ళిన ఆంజనేయునికి విభీషణుడు పరిచయమయ్యేను. ఆంజనేయునితో సంభాషణమువలన ఎంతయో ప్రభావితుడై, రావణుని కొలువులో హనుమపక్షమున మాట్లాడి, ధర్మహితం పలికి, తిరస్కరింపబడి అన్నయైన రావణుని వీడి, శ్రీరామచంద్రున్ని శరణుజొచ్చెను. విభీషణుడుని తమ పక్షమున చేర్చుకొనువిషయమందు సుగ్రీవుడు ప్రతిఘటించిన శరణాగతరక్షణుడు రాముడు నిర్ణయం విని అమితానందంతో విభీషణుడుని రామునిసన్నిధికి చేర్చింది ఆంజనేయుడే. 

సముద్రంపై సేతునిర్మాణము గావించుచున్నప్పుడు హనుమ అసంఖ్యాకములైన పర్వతములను పెకిలించి తెచ్చెను. ఆ క్రమంలో ఉత్తరమున ఉన్న మరియొక పర్వతమును పెకిలించి తీసుకొస్తుండగా,  సేతునిర్మాణము పూర్తియయ్యెను అన్న సమాచారం అందుకోవడంతో ఆ పర్వతమును అక్కడే వదిలివేచెను. కానీ, ఆ పర్వతం హనుమను ఇట్లు ప్రార్ధించెను - 'హనుమా! నీ కరకమల స్పర్శను పొందియు కూడా భగవానుని సేవకు దూరము అయిపోవుటకు నేను ఏమి అపరాధము చేసితిని? నన్ను ఇక్కడ విడనాడవలదు. నన్ను కొనిపోయి భగవానుని చరణారవింద సన్నిధియందే పడవేయుము, అప్పుడే నాకు సార్ధకత' అని వేదనతో వేడుకోగా; ఆ మాటలను విన్న హనుమా ఇలా అనెను ... 'గిరిరాజా! నీ నిష్టను చూడగా నిను కొనిపోవాలని నాకున్నను ఇక పర్వతములు తేవలదని రాముని ఆదేశం వచ్చినది. కానీ, నీ కోరికను స్వామికి విన్నవించెదను' అని చెప్పి వెడలి, రాముని సన్నిధికి చేరి ఆ గిరివరుని కోరికను తెలపగా, రామప్రభువిట్లనెను - 'హనుమా! నీ చేతిస్పర్శచే పునీతుడైన ఆ గిరివరుడు నాకు అత్యంత ప్రేమపాత్రమైనవాడు. నేను ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడనై యవతరించి సప్తదినముల పర్యంతము ఆ గిరివరుని నా చిటికినవ్రేలిపై నిలిపి నాకార్యమునకు వినియోగించుకొందునని పోయి అతనికి తెలుపుము' అని పలుకగా, హనుమ మరల ఆ గిరివంతుని దరికి కేగి స్వామి సందేశమును తెలిపెను. హనుమంతుని కృపవలన ఈ విధంగా పరమాత్మానుగ్రహంకు పాత్రమైన ఆ గిరియే గోవర్ధనగిరి. 

మహాభక్తుడు గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసేవారు. ఆయన ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై, 'నాకు విమోచనం కల్గించినందుకు ప్రతిఫలంగా ఏమైనా అడుగు ఇస్తాన'ని అనగా; మహాభక్తుడు తులసీదాసు "శ్రీరామ దర్శనం" కోరారు. 'ఆపని తనవల్లకాదని, ఓ ఉపాయం చెప్పిందాభూతం. నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు. (యత్ర యత్ర రఘునాధ కీర్తనం / తత్ర తత్ర కృత మస్తకాంజలిం)కన్నులనీరు కారుతూవుండగా (భాష్పవారి పరిపూర్ణ లోచనం)నందంగా రామాయణం వింటూ వుంటాడు. అతన్ని పట్టుకో, నీకు రామదర్శనం అవుతుందని చెప్పింది  భూతం. తన ప్రవచనాన్ని విని చివరిగా వెనక్కి మరలిన హనుమను వెంబడించి ఆయన పాదాలను పట్టుకొని ప్రార్ధింఛి, హనుమ సాయంతో శ్రీరామదర్శనం చేసుకొనెను తులసీదాసు. 

ఆంజనేయున్ని ఆశ్రయిస్తే అపారమైన ఆంజనేయుని అనుగ్రహంతో పాటు ముక్తిదాయకమైన రామానుగ్రహం కూడా అందుతుందని పై ఘటనల ద్వారా తెలుస్తుంది. 



మరిన్ని వివరణలు మరోటపాలో ...  

20, ఫిబ్రవరి 2014, గురువారం

ఆధ్యాత్మికఆచార్యుడు ఆంజనేయుడు

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. 
ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతీకార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే. 

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు 

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 
'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు. 

పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం 

వానరరూపం - వాయుతత్త్వం. 
గరుడరూపం - ఆకాశతత్త్వం. 
నరసింహరూపం - అగ్నితత్త్వం. 
వరాహరూపం - భూమితత్త్వం. 
హయగ్రీవరూపం - జలతత్త్వం. 




ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 
నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 
సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు. 

అఖిలలోకోపకారి ఆంజనేయుడు 

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు. 

{అష్టసిద్ధులు - వివరణ :-
అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. 
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.  

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.  
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.  
పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.  
ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.  
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి. 
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం". 
అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"} 

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా / 
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?
ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి. 
గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //
భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. 
అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును. 




రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు 
అటుపై వీరి బంధం "ఏకత్వం". 
ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -
దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /
ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //
ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. 

బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు. రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. 
భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు. 

మరిన్ని వివరణలు తదుపరి టపాలో ... 


   

1, ఫిబ్రవరి 2014, శనివారం

నా నెచ్చలితో నా కబుర్లు ... 'భక్తుని అంతరంగభావపరంపరలు'

భారతీ! పాండురంగ శతకంలో పద్యాలు చదువుతూ ఆశ్చర్యానందములతో పులకించిపొయాను. ఓ భక్తుని భావపరంపరలు ఏమని చెప్పను? నేను చదివిన ఆ కొన్ని పద్యాలు నీకోసమని వ్రాసుకొచ్చానని నా నెచ్చలి ఇచ్చిన అమూల్యపద్యాలు చదివి పరవశమయ్యాను. ఆ పద్యాలను 'స్మరణ'లో పదిలపరచుకుంటున్నాన్నిలా -

భగవంతుడు నిరాకారుడు అయినా సాకారుడుగా, నిర్గుణుడు అయినా సగుణుడుగా భక్తులకై అవతరించు ఆత్మీయుడు. అటువంటి సర్వాంతర్యామిని త్రికరణశుద్ధిగా ఆరాదించే భక్తుని మనోభావనలు అనంతం, అద్భుతం. 
అట్టి సర్వేశ్వరునిని ముందు ఓ భక్తుడు జోలె సాచి అర్ధిస్తున్నాడిలా -

భక్తితో నొసగిన పత్రమైనను గొని 
     తినలేదే? దృపదుని తనయ కొరకు,
ఆర్తితో కుసుమమ్ము నర్పించి మొరలిడ 
     రాలేదే? వే కరిరాజు కొరకు,
పండుదినుటె గాదు పై పొట్టు సైతం 
     మ్రింగలేదే? విదురాంగనకయి,
నోరూర బుడిశెడు నీరమున్ గైకొని 
     త్రావలేదే? రంతిదేవు కొరకు,

ఏమిగని యారగించితో శ్యామలాంగ 
అట్టి ప్రేమను భిక్షగా బెట్టుమయ్య 
జోలెసాచితి నీ ముందు జాలితోడ 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 



భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు, భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే. భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు. భక్తునికై పరుగులు తీస్తాడు. భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు. తనని సేవించే భక్తులకై పరుగులు తీసే పరమాత్మను సేద తీరమంటాడిలా -

ఏకనాధుని యింట పాకాది కార్యముల్ 
     జేసి కావడి నీళ్ళు మోసి మోసి, 
ప్రేమన్ జనాబాయి పిలిచిన నటకేగి 
     వేడుకతో పిండి విసిరి విసిరి,
శ్వేతవాహను పైన ప్రీతితో రణమున 
     లీలగా రధమును తోలి తోలి,
ఆర్త జిజ్ఞాసువు లర్ధార్ధులెందరో 
     మొరలిడ వారికై తిరిగి తిరిగి, 

ఎంత శ్రమనొంది యుంటివో యే మొరమ్ము 
దాచు కొందును హృదయాన తాల్మితోడ 
విశ్రమింపుము క్షణమైన విమల చరిత 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!! 



భగవంతుడు నిష్క్రియుడు, నిర్విశేషుడు, నిర్లిప్తుడు అయినను సృష్టి స్థితి లయ కారకుడు. సర్వవ్యాపకుడు, పరిపూర్ణుడు, మహిమాన్వితుడు. అటువంటి పరమాత్మను తనకు తానుగా తెలుసుకోలేనని, తనపై కరుణతో తనకు తానుగా(భగవంతుడు) తానే తెలియబడాలన్న సత్యాన్ని గ్రహించి, ప్రార్ధిస్తాడిలా -

నిన్నెరుంగగ మాకు కొన్ని గుర్తులు జెప్పి 
     మూగదై శ్రుతి మౌనమును వహించె, 
వేనోళ్ళ బొగిడిన విభవాదియే గాక
     శేషింప తానాదిశేషుడయ్యె,
నిన్నెరింగిన వారలన్న తెల్పుచు తత్త్వ 
     మిదమిద్ధమని నిరూపించరైరి,
అంతరంగములోన నెంత యోచించిన 
     తెలిసినట్లౌ నేమి తెలియకుండు,

నీవు కరుణించినంగాని నిన్నుగాంచ 
నలవి గాదయ్య బహు జన్మములకునైన 
వేగ కృపతోడ బ్రోవుమో వేదవేద్య 
పరమ కరుణాంతరంగ! శ్రీ పాండురంగ!!