28, డిసెంబర్ 2012, శుక్రవారం

ధ్యాని - దర్శనంసర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని /
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః //

ధ్యానయోగపరుడు సర్వభూతములయందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను సమానముగా దర్శించును. ధ్యానయోగపరులు అందరూ, అంతా ఆత్మస్వరూపమే అన్నభావన కల్గివుందురు. ఈ భావనే ఏకాత్మభావన. ఇదే ఏకీభావస్థితి. చరాచర ప్రాణులయందు అఖండాత్మ చైతన్యమును ధ్యాని మాత్రమే దర్శించగలడు.

ధ్యాని తను సంకల్పించిన ప్రతీపనిని దైవభావనతో చేయడం వలన అది భగవత్సేవే అవుతుంది.
ధ్యాని తను సంభాషించిన ప్రతీమాట మృదుభావనతో మాట్లాడడం వలన అది భగవత్ సంకీర్తనమే అవుతుంది.ధ్యాని తను చూసినదంతా స్వాత్మభావనతో దర్శించడం వలన అది భగవత్ దర్శనమే అవుతుంది.

సృష్టికర్త తన సృజనలో - ప్రతీది పరమాత్మభావనతో మనం చూడాలనే, ప్రతీ జడచేతనాలలో తానై యుండి దైవత్వాన్ని దర్శించుకోమన్నాడు. ధ్యానిలా జీవించమన్నాడు. 

మొక్క, చెట్టు, వనం, అడవి, తోట మొదలగు వాటిపేర్లు వేరైనను వీటి బీజమూలం ఒక్కటే. అది అర్ధం చేసుకోమనే వీటి యందు కూడా పరమ'ఆత్మ'గా తానే ఉన్నానని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అందుకు కొన్ని ఉదాహరణలు - తులసిమొక్క నిత్యపూజలందుకునే దేవతామూర్తి కాగా, రావిచెట్టు విష్ణుమూర్తి స్వరూపముగా భాసిల్లగా, వేపచెట్టు మహాలక్ష్మి స్వరూపమైంది.

ఇక బావి, చెరువు, కాలువ, నది, సముద్రం అని వేర్వేరు పేర్లతో పిలవబడినను వీటన్నింటిలో ఏకమై ఉన్నది నీరు ఒక్కటే. వీటన్నంటి యందు ఉన్నది ఒకే చైతన్యం. అది అర్ధంచేసుకునే గంగా యమున మొదలగు నదులను దేవతాస్త్రీలుగా కొలవడం.

అలానే పాము సుబ్రహ్మణ్యస్వామిగా, కుక్క కాలభైరవుడుగా, గోమాత సకలదేవతలకు నిలయమైన దేవతామూర్తిగా, సూర్యాది గ్రహాలూ దైవస్వరూపాలుగా గుర్తించి ఆరాదిస్తున్నాం.
ఇక హిమాలయాది పర్వతశ్రేణులు, భద్రాది కొండలు, గుట్టలు మిట్టలు భగవంతుని నివాసాలుకాగా, పంచభూతాలూ పరమాత్మస్వరూపాలై అంతటా ఉన్నది పరమాత్మే అన్న భావనను దృఢపరుస్తున్నాయి. 
ఇలా సృష్టిలో అణువణువున భగవంతున్ని దర్శించడం, సమస్తమునూ పరమాత్మ స్వరూపముగా భావించడమూ, పవిత్రభావంతో పూజించడం - ఇదే భారతీయ దార్శినికత్వం - ఇదే మానవుడుని మాధవుడుగా మార్చగలిగే దార్మికత్వం -ఇదే సర్వత్రా, సర్వదా సర్వమూ అఖండాత్మ చైతన్యరూపమునకు దర్పణం. 
సమస్త సృష్టికి ఆధారభూతుడు పరమాత్మయే! ఆణువణువూ వ్యాపించి వున్నది ఆ భగవంతుని తత్త్వమే. ప్రతీ జడచేతనలు యందు ఉన్నది పరమాత్మ అంశయే! 

దీనినే ధ్యానయోగమందు ధ్యాని దర్శిస్తాడు. ఏకాత్మభావనతో సర్వాత్మను దర్శిస్తాడు.

                                చిల్లగింజ నీటిని, మంచిమాట మనసుని తేటపరుస్తాయి  

2 కామెంట్‌లు: