6, ఆగస్టు 2013, మంగళవారం

"నా ఆ ఆనందం అందరితో ....."


చిట్టితల్లి 'శ్రీ మాన్వి' కారణముగా మరోసారి (క్రిందటి టపాలో మొదటిసారి తెలుసుకున్నది తెలిపాను) కృష్ణతత్త్వం తెలుసుకోగల్గినందుకు నా ఆనందం మరింత అధికమైంది. "నా ఆ ఆనందం అందరితో" పంచుకోవాలని ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని టపాగా పెడుతున్నాను.

ఉదయం హరిప్రియతో ముచ్చటిస్తూ, ఓ ప్రక్కకు తిరిగి నోటిలో బొటనవ్రేలు పెట్టుకుంటూ ఊ ఊ లు కొడుతున్న శ్రీ మాన్విని చూసి -
అరే, ఈమధ్య బొటనవ్రేలు నోటిలో పెట్టేసుకుంటుంది, ఇప్పుడే దీనిని మాన్పించాలి, అలవాటైతే కష్టం కదా, అయినా పిల్లలు ఎందుకు నోటిలో వ్రేలు పెట్టుకుంటారో ఏమిటో ... అన్న నా మాటలకు నవ్వి, దానికీ ఓ కధ వుంది అని, చెప్పిందిలా -
పూర్వకాలంలో సూర్యవంశంలో మాంధాత అనే రాజు తండ్రి నుండే తిన్నగా ప్రభవించాడు. మన శరీరంలో ప్రతి అవయంలో ఒక్కొక్క దేవత అధిదేవతగా ఉన్నట్లే చేతికి అధిపతిగా ఉన్న ఇంద్రుడు, పాలిచ్చేతల్లి లేనికారణముగా ఆ బిడ్డను నేను పోషిస్తానని వచ్చి, బొటనవ్రేలు ద్వారా అమృతం పిల్లవానికి చేరాలని,  'మాం - దాతా' పిల్లవాని బొటనవ్రేలును పిల్లవాని నోట్లో పెట్టాడట. అందుకేనేమో, చాలామంది పిల్లలు బొటనవ్రేలును చీకుతుంటారని అంది.
ఓహో ... కధ బాగుంది కానీ; మరి శ్రీకృష్ణుడు వటపత్రం పై శయనిస్తూ కాలిబొటనవ్రేలును నోట్లో పెట్టుకుంటూ ఓ లీలను ప్రదర్శిస్తాడు కదా, దానిలో ఏమైనా అంతరార్ధం వుందా అన్న నాప్రశ్నకు -
ఆ ... పరమాత్మ లీలలకు పరమార్ధం తప్పకుండా ఉంటుంది. మనల్ని మాయనుండి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదించే దివ్యరూపమిదని, తాతయ్యగారు చెప్పింది లీలగా జ్ఞాపకం ఉంది. 

                                                    
శ్రీకృష్ణపరమాత్మ తన యోగమాయను మార్కండేయునకు చూపించడానికి వటపత్రంపై ఎడమకాలి బొటనవ్రేలును నోటిలో పెట్టుకొని శయనిస్తున్నట్లు దర్శనమిచ్చాడు. ముందుగా వటపత్రంపైనే ఎందుకు శయనించాడో చెప్పారు. జంతువులలో గోవు ఎంత శ్రేష్టమో, చెట్లలో మఱ్ఱిచెట్టు అంత శ్రేష్ఠమైనది. మఱ్ఱిచెట్టునే వటవృక్షమని, న్యగ్రోధమని అంటారు. ఈ వృక్షముది కనీకనబడని విత్తనమట. మిగతా మొక్కల్ని నాటినట్ట్లుగా ఈ మఱ్ఱిమొక్కను ఎవరూ నాటరు. ఇది స్వయంభువంగా వెలుస్తుంది. దీనికి ఎన్నో కొమ్మలు, ఊడలు ఉండి అనేక చెట్లగుంపులా విస్తారముగా ఉంటుంది. ఈ చెట్టును చూస్తే ఈశ్వరసాదృశ్యం తేటతెల్లమౌతుంది. ఎలాగంటే అంతచెట్టు చిరువిత్తనంలో ఉన్నట్లే పరమాత్మ కూడా అణువణువులోనూ ఉన్నాడని, ఆ చెట్టు విస్తారంగా వ్యాపించినట్లే పరమాత్మ కూడా బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్నాడని, ఇది స్వయంభువంగా మొలకెత్తినట్లే పరమాత్ముడు కూడా స్వయంభువుడుగా అవతరించాడని, ఈ చెట్టుని గమనిస్తే అర్ధమౌతుంది. అందుకే దక్షిణామూర్తి మౌనంతో ఆత్మతత్త్వాన్ని వెల్లడించింది ఈ చెట్టు క్రిందనేనని అంటారు. 
అదియును కాక,  గోవు యొక్క సారం నవనీతం అయినట్లుగా, దానిని కృష్ణపరమాత్మ గ్రహించినట్లుగా వెన్నదొంగతనంలో కృష్ణతత్త్వం అర్ధం చేసుకున్నాం కదా.  చిట్టచివర వచ్చే నవనీతదశలో మాత్రమే కాదు,వటపత్రంపై ఉండండం ద్వారా,  ప్రాధమికదశయైన పత్రదశలోనూ (ఏ చెట్టుకైనా ముందు ఆకులే కదా చిగురిస్తాయి) తానున్నాని తెలియజేస్తున్నాడు. అలానే, మన శరీరంలో ఇడానాడి (దీనినే చంద్రనాడి అని అంటారు) ఎడమవైపున ఉంటుంది. ఇది జీవస్థానంకు, భౌతికప్రవృత్తికి సంకేతం. యోగులు ఈ నాడి నుండే అమృతస్రావాన్ని అనుభవిస్తారని, కృష్ణుడు తన ఎడమకాలి బొటనవ్రేలు నోటిలో పెట్టుకోవడం ద్వారా ఆ యోగస్థితిని సూచించాడని అంటారు. అలానే ప్రళయకాలంలో మార్కండేయునకు ఈ లీల చూపడంలో సమస్త సృష్టి మాయేనని, చిట్టచివరికి అంతా తనయందే లయమౌతుందని, అది గ్రహించమని జ్ఞానమార్గమును చూపించాడు. ఈ లీల ద్వారా తాను అమృతం త్రాగుతున్నట్లు కనబడినా, అతడు నిజంగా మనకు జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తూ జనన మరణ ప్రవాహమునుండి మనల్ని ఒడ్డున పడేస్తున్నాడు. అందువల్లనే "ముకుంద", ముక్తిప్రదాత అని స్తుతింపబడుతున్నాడు. అంతే కాకుండా బాలరూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా పిల్లల హృదయంలాంటి హృదయాన్ని కల్గియుండి, మనస్సును పాలమాదిరిగా స్వచ్ఛంగా ఉంచుకుంటే, మన మనస్సనే పాలసముద్రంపై భక్తిత్వం అనే వటపత్రం తేలగా, దానిపై క్షీరాబ్ధిసాయిలా శయనిస్తూ మనల్ని తనలో లీనం చేసుకుంటాడన్న సంకేతముందని తనకి జ్ఞాపకం వున్నంతవరకు వటపత్రశాయి గురించి వివరించిన
నా స్నేహితురాలు 'హరిప్రియ'కు కృతజ్ఞతలు.
తన చిరుచేష్టల ద్వారా ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి కారకురాలైన "శ్రీ మాన్వి" కి శుభాశీస్సులు.

కరారవిందేన పదారవిందం
ముఖారేవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసా స్మరామి
వటపత్రంపై శాయనిస్తున్న, పద్మంవంటి కాలిబొటనవ్రేలును, పద్మంవంటి చేతితో పట్టుకొని, పద్మంవంటి ముఖంలో పెట్టుకున్న ముకుందున్ని మనసార స్మరిస్తున్నాను.


1 కామెంట్‌:

  1. మీరు రాసిన ఈ పోస్ట్ చదువుతుంటే, వెన్న ముద్దలు మింగినట్లూ, వెండి కొండను ఎక్కినట్లూ, వెన్నెల కొమ్మను వంచినట్లూ... ఉంది, భారతి గారూ మీ శైలి అద్భుతం.

    రిప్లయితొలగించండి