26, ఆగస్టు 2015, బుధవారం

జీవాత్మ-పరమాత్మ --- చక్రశుద్ధి - ఆనందసిద్ధి [ఆరవభాగం]


గత టపాల్లో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధచక్రాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరవచక్రమైన ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం -
ఆజ్ఞాచక్రం -
ఐం హ్రీం శ్రీం హాం హం సశ్శివస్సోహం సోహం, సశ్శివ ఆజ్ఞాదిష్టాన దేవతాయై హాకినీ సహిత పరమాత్మస్వరూపిణ్యై నమః
ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.
భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది. 

ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. 

 'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని  వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై  ఇక్కడ చూడండి.  
ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును.  
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.  
తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను  పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును. 
ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం. ఈ ఓంకారం వివరణకై ఇక్కడ ఓంకారం - 1&2చూడండి.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.
ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
తదుపరి చక్రం 'సహస్రారం' గురించి తదుపరి టపాలో ...

1 కామెంట్‌:

  1. చక్కటి వివరణతో సప్త చక్రాలను విశదీకరించి వ్రాస్తున్నారు.మధ్యలో ధ్యానము,ఓంకారము,వాక్కులను గూర్చి మీరు వ్రాసిన టపాలను మరల చదివే అవకాశం కల్పించారు.మనిషి మానసిక స్థితికి,చక్రాల జాగృతిని అనుసంధానం చేసి చాలా వివరముగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు భారతిగారు!

    రిప్లయితొలగించండి