29, నవంబర్ 2015, ఆదివారం

మాతృమూర్తులకు ఆహార నియమావళి

హిందూ సంస్కృతిలో మాతృస్థానం మహోన్నతమైనది. మాతృదేవోభవ  అని వేదమే మాతృస్థానంను శ్లాఘిస్తుంది. ఓ బిడ్డకు జన్మమిస్తున్న స్త్రీ మూర్తిని దైవంగా కొనియాడే శాస్త్రాలు ఆ పుట్టబోయే బిడ్డ మంచిగా మేధావిగా ప్రజ్ఞా ధీశాలిగా జనించాలంటే గర్భవతి అయిన ఆ స్త్రీ ఏం చేయాలో కూడా శాస్త్రాలు తెలుపుతున్నాయి .
మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది.  అట్టి శిశువుని మొదటిమాసం నుండి నవమాసముల వరకు, వరుసగా ఒక్కొక్క మాసం వివిధ దేవతాశక్తుల రూపేణా లలితా అమ్మవారు ఎలా పరిరక్షిస్తూ వుంటారో లలితా సహస్ర నామములయందు చక్కగా తెలపబడింది. ఆయా మాసముల యందు ఆయా దేవాతశక్తులకు ప్రీతికర ఆహారమును గర్భవతులు అయినవారు స్వీకరిస్తే, ఆయురారోగ్య తేజోవంత సత్సంతానంను పొందుదురు.

మాతృమూర్తులగు స్త్రీలకు ఆహార నియమావళి -
                                                   

మాతృమూర్తులగు స్త్రీలకు లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.


విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ || 101 ||
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా || 104 ||
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ || 105 ||
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,‌உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||


సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,‌உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110 ||


పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది 

మొదటినెల -
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.

రెండవ నెల -
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.

మూడవ నెల -
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం,  బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.

నాల్గవ నెల -
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.

ఐదవ నెల -
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత  సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.

ఆరవ నెల -
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు.  ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.

ఏడవ నెల -
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.

ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు -
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం. 

13 కామెంట్‌లు:

 1. చక్కటి సందేశము నందించావురా!నేటి స్త్రీలు ఉద్యోగ,గృహ వ్యవహారాలలో హడావిడిగా వుంటున్నారు. మాతృమూర్తులగు మహిళలకు ఆహారనియమావళిని అధ్యాత్మికత జోడించి అందివ్వడము. అద్భుతం .nice post...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "లలితా సహస్ర నామములు" యందు ఉన్నదే తెలియజేశాను వేద. మీ స్పందనకు ధన్యవాదములు.

   తొలగించండి
 2. 'స్మరణ'భారతి గారికి, హృదయపూర్వక నమస్సులు. మా అమ్మాయి తల్లి కాబోతున్నది అన్న శుభవార్త వినగానే ఎటువంటి ఆహరం ఇవ్వాలని ఆలోచిస్తుండగా, ఎప్పుడో ఎక్కడో లలిత యందు గర్భిణీలు తీసుకునే చక్కటి ఆహరం గురించి ఉందని చదివిన గుర్తు. వెంటనే లలితా సహస్రనామంలు చదివాను. కానండీ, ఎక్కడుందో నాకు అర్ధం కాక, మీతో పాటు మరి కొందర్ని అడిగాను. నేను తరచుగా మీ బ్లాగ్ చదువుతుంటాను. నాతో ఏ మాత్రం పరిచయం లేకున్నా వెంటనే స్పందించి పనుల ఒత్తిడి కారణంగా వివరణగా పోస్ట్ పెట్టడానికి ఓ నాలుగైదు రోజులు పడుతుందని తెలిపుతూ, మీ శుభాకాంక్షలను ముందుగా అందజేయడం నాకో మరుపురాని మధురానుభూతి.
  ఇప్పుడే మీ పోస్ట్ ను చూశాను. ఎంతో విలువైన వివరణతో నాకు అర్ధమయ్యేలా చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
  రాత్రి రెండు మెయిల్స్ పెట్టాను. దయజేసి చూడగలరు.
  పద్మ.

  రిప్లయితొలగించండి
 3. మిరుమిట్లు గొలిపెడు మెరుగు బంగారంపు
  పచ్చని తనుఛాయ బరగు తల్లి
  ముమ్మూర్తులకు , వారి మువ్వురు సతులకు
  మూలపుటమ్మయి గ్రాలు తల్లి
  అమ్మతనమ్ము బ్రహ్మాండమంతయు బర్వ
  వాత్సల్య ఫలములు పంచు తల్లి
  వారు వీరను భేద భావమ్ము జూపక
  చేజేత అక్కున జేర్చు తల్లి

  సకల సృష్టి స్థతి లయాభి శక్త యగుట
  తల్లినే కాదు తల్లులందరి కడుపులు
  కాచి రక్షించు తల్లి యీ కల్పవల్లి
  శ్రుతుల శ్రీలలితాపరంజ్యోతి దెలియ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాస్టారు గారు!
   మీ వ్యాఖ్య ఈ టపాకు మకుటం లాంటిది. పదేపదే స్మరించుకోదగ్గ 'అమ్మ'ఘనతను ఎంతో సరళంగా తెలిపారు. మీకు నా హృదయపూర్వక నమస్సులు.

   తొలగించండి
 4. భారతి గారికి,నమస్సులు. రెండు సందేహలండీ ... 1. మా అమ్మాయి శ్వేత తల్లి కాబోతుందన్న విషయం తెలిసింది నెలా తొమ్మిదిరొజులకు. మరి లలితలో సూచించినట్లు మొదటినెల ఆహారం తీసుకోవడం ఎలా? 2. ఏడవ నెల వచ్చాక మైలంటారు కదా, అప్పుడు లలితా పారాయణం, పూజలు చేయవచ్చా? తప్పుగా అనుకోకండీ, నా ప్రశ్నలను చూసి. దయజేసి రాత్రి నేను పంపిన మెయిల్స్ చూడండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్మ గారు!
   `1. సాధారణంగా తల్లి కాబోతున్న విషయం ఏ అమ్మాయికైనా రెండవనెలలోనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మొదటగా మొదటినెల పారాయణం చేసి, ఆ ప్రసాదంను స్వీకరించి, తదుపరి రెండవనెల ముగియకముందే లలితయందు సూచింపబడినట్టు చేస్తే సరిపోతుందని నా భావన. 2. లలితా అమ్మవారు ... అమ్మ, మన అమ్మ, అందరికీ అమ్మ, సమస్తానికీ అమ్మ ...మాతృత్వ వరప్రదాయిని, గర్భస్థశిశువు సంరక్షిణి. పైన మాస్టారుగారు చెప్పినట్లు మూలపుటమ్మ. ఆ అమ్మ సర్వకాల సర్వవ్యవస్థలయందు పూజ్యునీయులు. అమ్మను ఆరాధించడానికి మైలన్నది ఓ అడ్డంకమా. ఏదైనా మన భావన బట్టి ఉంటుంది. ఇక, మన ఆచారవ్యవహారాలు అన్నీ నాకు అర్ధం కావు. అలాగని అగౌరపరచను. పెద్దలు ఏది చెప్పిన అందులో పరమార్ధం అర్ధంకాకపోయినా, వారు చెప్పింది మన శ్రేయస్సుకే అని నమ్ముతాను కాబట్టి తెలిసినంతలో వాటిని ఆచరిస్తాను. మీరూ ఓ పని చేయండి. ఆ నెలల్లో అమ్మవారిని పూజించి, ఆ పారాయణమును మీరు చేసి, పూజానంతరం అమ్మకు నివేదించిన ప్రసాదంను మీ అమ్మాయికి ఇవ్వండి. అమ్మనామంను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో మీ అమ్మాయిని స్వీకరించమనండి. 'అమ్మ, అమ్మమ్మ' కాబోతున్న మీ అమ్మాయికి, మీకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

   తొలగించండి
 5. అద్భుతం తల్లీ! ఇలా వివరించడం అమ్మకే సాధ్యం సుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సర్,

   మీ వ్యాఖ్యతో .....
   అమ్మ ఆశీస్సులు అందాయి.
   సదా మీ ఆత్మీయ స్పందనను ఆశిస్తూ ...

   మీకు నా హృదయపూర్వక నమస్సులు.

   తొలగించండి
 6. చాలా మంచి విషయం చెప్పారండి . అమ్మవారికి బెల్లంతో చేసిన ప్రసాదం ఇష్టం అనుకున్నాను కాని అదంతా మన మంచికే అన్న విషయం సంతోషాన్ని కలిగించింది.అమ్మ ఆశీస్సులు మీకు సదా కలగాలి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అమ్మ ఆశీస్సులు అందిస్తూ చక్కటి మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములు తులసిగారు.

   తొలగించండి
 7. Bharathi gaari paadapadmaaluku naa namaskaaralu..me blogu ..me rachanalu..vaatilo vishsleshana..chala , chala bagunnai..naa peru prasad age 42 nenu 10 years back 1 daaba mettlu digutu kaalu slip ai kinda paddanu..appudu naa vennupaamu meda bhagamlo C4 C5 C6 poosalu vattukupoyai ventane nenu na naadiche , nilabade shaktini kolpoyanu..tirigi malli nadavataaniki kerala tho saha chala prayatnalu chesanu ..kaani ippatiki kaneesam nilabadalekapotunna kaabatti nenu 10 years nundi mancham lone untunna ..so na manasu adhyatmakatha vaipu malli devudu ki sambandichina vishayalu chaduvutu ...bhakti songs ..sahasranamaalu..vintu unna ...e kramamlone nenu naku tosinappudalla sri rama mantraanni japistunnanu ..aite nenu sri rama mantram japistunnapuudalla naaku ...'aavulinthalu' vasthunnai ..idi naaku shubhama...ashubhama ...nenu emi cheste naku manchi jarigi nenu malli nadavagalugutaanu dayachesi cheppagalaru...

  me abhimaani,
  prasad

  email ;= samineni.binnu@gmail.com 9866469344

  రిప్లయితొలగించండి
 8. ప్రసాద్ గారికి, నమస్తే. రామనామ స్మరణకు ఆవలింతలకు ఏ సంబంధం లేదండి. పరమ పావనమైన రామనామ స్మరణను ఏ సందేహాలు పెట్టుకోకుండా కొనసాగించండి. తప్పకుండా మీకు శుభమే జరుగుతుంది. మీకోసం నేనూ రామాంజనేయుల్ని ప్రార్ధిస్తాను. వైద్యుల సూచనలను పాటిస్తూ ఏ చింత పెట్టుకోకుండా దైవ చింతనలో ఉండండి.


  రిప్లయితొలగించండి