20, జులై 2016, బుధవారం

"సనత్సుజాతీయం"

భగవంతుడే చైతన్యస్వరూపుడు, పూర్ణుడు, శాశ్వతుడు, సర్వస్వడు,. ఆ పరమాత్ముడే సత్యం ... సనాతనం. అతని ప్రేమైక సృజనయే సృష్టి.

దివ్యమై, అనంతమై, అమృతమై, ఆనందమై, శివమై, దైవమై, సత్యమై, నిత్యమై, సనాతనమై భాసిల్లే పరతత్త్వం గురించి తెలియజెప్పేదే వేదం. దీనికి శబ్ధరూపములుగానైన ప్రతులే ఋగ్వేదాది నాలుగు వేదములు. వీటి సారమే విజ్ఞానదాయకమైన ముక్తిప్రదాయినులగు పురాణములు, రామాయణము, మహాభారతం, భాగవతములు. ఇందు రామాయణం వాల్మీకి ప్రోక్తం కాగా, మిగిలినవి వ్యాసప్రోక్తములు.  ఇందులో మహాభారతం పంచమవేదంగా ప్రశస్తి పొందడానికి కారణం - అందు అశ్వనీదేవతల స్తుతి, సనత్సుజాతీయం, భగవద్గీత, ఉత్తరగీత, భీష్ములవారి ఉపదేశములు, విష్ణు సహస్రనామములు మొదలగు ఎన్నో ముక్తిత్వంలను ఒసగు ధర్మ ధార్మిక ఘట్టములు అనేకములు వుండడంచే పంచమవేదంగా కీర్తింపబడుతుంది.

శ్రీమన్నారాయణునిచే వేదములు గ్రహించిన సృష్టికర్తయగు బ్రహ్మ తేజోమయ చతుర్ముఖములకు నేపధ్యములు సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు. ఈ ముఖములందలి తేజస్సులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వీరు పరమ ఋషీంద్రులు. బ్రహ్మవిద్యా ప్రవర్తుకులు.

శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణకై ద్వాపరయుగమందు శ్రీకృష్ణుడుగా అవతరించక ముందే దైవప్రణాళికకు సహకరించడానికి సనత్కుమార, సనత్సుజాతులవారు గోపాలురుగా దిగివచ్చిరి. ఇందులో సనత్సుజాతులవారు శతగోపనామధేయంతో గోకులంకు వచ్చిరి. ఈయనే రాధదేవిని పెంచిన తండ్రి. ఇటు నరదేహంన శతగోపుడుగా వర్తించుచున్నను, అటు సనత్సుజాత ఋషీంద్రులుగా కూడా వర్తించగలిగేవారు. కృష్ణ భక్తుడును, సద్గుణవంతుడయిన విదురుడు వీరి శిష్యుడై బ్రహ్మజ్ఞానం పొందిరి.

సంజయుడు పాండవ వాసుదేవుల వద్దనుండి తిరిగివచ్చిన తర్వాత...
దృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేయమని, లేదంటే యుద్ధం తప్పదని, యుద్ధమే సంభవిస్తే నీ కుమారులెల్లరు మృత్యువాత పడేదరని విదురుడు ఉపదేశించినను, దురాశతో విదురుని మాటలకు దృతరాష్ట్రుడు విలువివ్వలేదు. కానీ, తన కుమారులు యుద్ధమందు మరణిస్తారేమో నన్న భయంతో నిద్రపట్టక విదురునిని రప్పించుకొనగా ...
రాజా!   ఏ విధమైన అనారోగ్యాలు లేనప్పుడు నిద్ర పట్టనిది నలుగురికే. 1. బలవంతుడయిన శత్రువు తనపై దాడి చేస్తాడేమో నన్న భయంతో వుండే బలహీనునకు, 2. సరుకు (సంపద)కోల్పోయినవారికి 3. దొంగకు 4. కామాతుర చిత్తుడునకు. రాజా! ఇప్పుడు చెప్పు ... ఎందుకు నీకు నిద్రపట్టడం లేదు అని విదురుడు అడగగా -
ప్రతీవారు మృత్యువే అంటారు, ఆ మృత్యువును దాటడానికి ఏ మార్గమూ లేదా ? అన్న దృతరాష్ట్రుని ప్రశ్నకు విదురుడు ఇలా ప్రబోధిస్తాడు -
ఆధ్యాత్మిక జ్ఞానం ... ఆత్మవిద్య ఉన్నది. సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని తెలుసుకొని, దాని మీద మనస్సు నిలిపి, మనస్సులో కూడా అదే అంతర్యామిత్వం చెంది, ఇంద్రియములను నిలిపి, ఇంద్రియములలో కూడా అదే అంతర్యామిత్వం చెంది, దేహము, మనస్సు ఇంద్రియములు అనేటువంటివి లేకుండా, వాటి స్థానంలో కూడా సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమునే నిలుపునటువంటి ... ధారణ, ధ్యాన సమాధి నిష్టులయిన మహాత్ములకు మృత్యువు లేదు అని చెప్పగా ...

"మృత్యువు" యొక్క స్వరూపంను, మృత్యువును దాటే ఉపాయాన్ని తెలపమని విదురునిని దృతరాష్ట్రుడు కోరగా,  ఇది బ్రహ్మవిద్యా రహస్యం. దీనినుపదేశింప తానర్హుడ గానని, మా గురువుగారే అర్హులని, దానిని ద్రుతరాష్ట్రునికి ఉపదేశించుటకు  తన గురువగు సనత్సుజాతులవారిని విదురుడు సంస్మరించెను. స్మరణ మాత్రంచేత అనుగ్రహిస్తానని విదురునికి మాట ఇచ్చిన సనత్సుజాతుల వారు ప్రత్యక్షమై ద్రుతరాష్టునికి ఉపదేశించిన దివ్యజ్ఞానామృతమే "సనత్సుజాతీయం". 


తదుపరి వివరణ తదుపరి టపాలో ... 


4 కామెంట్‌లు:

 1. మునివరు సనత్సుజాతుల
  ఘనచరితపు మహిత దివ్య ఘట్ట విశేషా
  లను , తమ 'కథనా చాతురి'
  మనమున హత్తుకొన జేసె 'స్మరణ'మహాత్మా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాస్టారు గార్కి, నమస్సులు.
   మీ అమూల్య స్పందనకు మనసార ధన్యవాదములు.
   మీలాంటివారి ప్రేరణతోనే నేను చదివినవి, విన్నవి ఇలా స్మరించుకుంటున్నాను.

   తొలగించండి
 2. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశాను ... అప్పుడప్పుడు నీ నోటంట విన్న ఈ సనత్సుజాతీయమును వివరంగా ఎప్పుడు చెప్తావా అని ఎదురుచూసేదానిని. సనత్సుజాతీయం గురించి చెప్తున్నప్పుడు తాతయ్యగారి జ్ఞాపకాలతో మౌనమయ్యేదానివి, అందుకే వివరంగా చెప్పమని అడగలేకపోయేదానిని. ఇప్పటికి నా నిరీక్షణ ఫలించడం ఆనందంగా వుందమ్మా...

  రిప్లయితొలగించండి
 3. ప్రియా,
  నీవన్నది నిజమే. తాతయ్యగార్కి దృష్టిలోపం కలగడంతో నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటి నుండి బడి నుండి వచ్చాక తాతయ్యగారికి తను చదవమన్నవి చదివి వినిపించడం ఓ అలవాటు అయింది. భారత భాగవత రామాయణాది పుస్తకాలు నాకు అర్ధమయినా, అవ్వకపోయినా చదివి వినిపించేదానిని. నాచేత కొన్ని పేజీలు చదివించుకోవడం, ప్రక్కన ఎవరైనా వుంటే చక్కటి వివరణతో విశ్లేషిస్తూ చెప్పడం, ఎవరూ లేకుంటే తనకు తానే విశ్లేషణ చేసుకుంటూ బయటకే చెప్పుకునేవారు. చిన్న చిన్న కధలతో నాకు చెప్పేవారు. అవి నా మనస్సును బాగా హత్తుకునేవి. ఇద్దరు తాతయ్యల(అమ్మ నాన్నగారిలా నాన్నలు) ఆస్తులకు వారసులయ్యాము గానీ, జ్ఞానముకు కాలేకపోయాం. ఇక సనత్సుజాతీయం తాతయ్యగారికి చదివి వినిపించిన చివరి పుస్తకం. అనారోగ్యరీత్యా ఇక ఎక్కువరోజులు..... తెలిసి ఆ సమయంలో చదివిపించుకున్న పుస్తకమిది. అందుకే సనత్సుజాతీయం గురించి మాట్లాడినప్పుడంతా మనస్సు భారమై మూగబోతుంది.

  రిప్లయితొలగించండి