30, జులై 2017, ఆదివారం

"తత్త్వజ్ఞాన ప్రభోదం - సుయజ్ఞోపాఖ్యానం"

ఈ మధ్య-
నా స్నేహితురాలు విశాల 'సుయజ్ఞోపాఖ్యానం' గురించి  ప్రస్తావించగా నా మనస్సు గతంలోనికి జారుకుంది ... 
అమ్మ భౌతికంగా దూరమయినప్పుడు ఆ దుఃఖంలో నేనున్నప్పుడు నా ఆత్మీయనేస్తం హరిప్రియ నన్ను సముదాయిస్తూ, ఒకింత గదమాయిస్తూ ...  భాగవతం సప్తమ స్కంధం లో సుయజ్ఞోపాఖ్యానంను చేతిలోపెట్టి చదువమని శాసించింది. నేను చదివాక, 
భారతీ! బాధలో ఉన్నప్పుడు సత్యం తెలిసిన మాయలోపడి అన్నీ మర్చిపోతుంటాం. నేను చెప్పింది కాస్త అర్ధం చేసుకోమ్మా...  అంటూ ఇలా చెప్పింది -
                                                   

భాగవతమును శ్రీశుకుడు ఉపదేశం చేసేప్పుడు పరిక్షిత్తుమహారాజు ఒక్కరే లేరు. ఆయన చుట్టూ ఎన్నో వేల మంది ఉన్నారు. రాజు రాజ్యం వదిలి పెట్టి ఉంటే వారంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఋషులు కూడా అక్కడ చేరి ఉన్నారు. గంగను మించిన జన ప్రవాహం ఉంది అక్కడ. అందరూ భాగవతమును విన్నారు, మరి అందరూ తరించారా? ఊహు ... తరించింది ఒక్క పరిక్షిత్తుమహారాజు మాత్రమే. ఎందుకంటే అది విన్న వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. అందులో కొందరు రాజుగారికి సప్తదినాల్లో మరణమని తెలిసి, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి విన్నవారు, మరికొందరు ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు విన్నవారూ ఉన్నారు. కానీ పరిక్షిత్తుమహారాజుకే మోక్షఫలం దక్కింది. అదేమి పక్షపాతం కాదు. విన్నవారి యోగ్యతబట్టే ఫలితం. తెలుసుకోవాలని తపన మూర్తీభవించి విన్నవాడు తరించాడు. శ్రవణం చేస్తుంటే తిండి నీరు నిద్ర అసలేం వద్దు అన్నాడు. దాహం, ఆకలి, అలసట అనేది అనిపించటం లేదు అని అన్నాడు. ఆయనకున్న శ్రద్ధ, తపన అలాంటిది. అందుకే ఆయనకి మోక్షం వెంటనే లభించింది. భారతీ! మనం అంతటి యోగ్యులంకాము కానీ, ఆధ్యాత్మిక అభిలాష కలవారం. కాస్తో కూస్తో దైవ చింతన వున్నవారం. అందుకే అవగాహనతో సుయజ్ఞోపాఖ్యానంలో తత్త్వమును గ్రహించి, ఎప్పటిలా సరైన మార్గంలోనికి వస్తావో, కుళింగ పక్షిలా దుఃఖంతో గడిపేస్తావో నీవే నిర్ణయించుకో అంటూ హితోపదేశం చేసింది. 

అసలు ఏమిటీ ఈ సుయజ్ఞోపాఖ్యానం? ఈ కధనం దేనిని తెలుపుతుంది? గతంలోనికి జారిన మది మరోమారు మననం చేసుకుంది.  

అసలు కధనం ఏమిటంటే - 
హిరణ్యకశిపుడు దుఃఖంతో, మరణించిన తన సోదరుడైన హిరణ్యాక్షునికి అంత్యక్రియలు చేసి, అతని భార్యలను పుత్రులను ఓదార్చి, పుత్రశోకంతో కుమిలిపోతున్న తన తల్లియైన దితిన్ని ఊరడిస్తూ ఇలా చెప్తాడు -
అమ్మా! లోకం ఒక చలిపందిరి వంటిది. ప్రాణులందరూ దాహార్తులై వచ్చిన బాటసారులు. వాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నట్లు, మనం కూడా ఈ సంసారంలోనికి వచ్చి మనపని కాగానే వెళ్ళిపోతూ ఉంటాం. కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం.
తల్లీ! ఆ ఈశ్వరుడు సమస్తానికి అధిపతి. సర్వమూ తెలిసినవాడు. సర్వత్రా నిండియుండేవాడు. ఆ ప్రభువు సత్యుడు, నిత్యుడు, నిర్మలుడు, ఆద్యంతములు లేనివాడు, ఆత్మస్వరూపుడు.
కదలనిచెట్లు కదలాడే నీళ్లలో కదులునట్లు కనబడు విధంగా, భ్రమతో నిండినటువంటి కళ్ళకు భూమి చంచలంగా తోచిన విధంగా, భావ వికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చలించే మనస్సు గలవాళ్ళకు చంచలుడుగా అనిపిస్తాడు. కానీ, ఆ భగవంతుడు అచంచలుడు.
మాతా! భగవంతుడు ఇదిగో ఈ విధంగా ఉంటాడు, ఈ లక్షణాలతో ఉంటాడు ... అని నిర్ధారణ చేయలేం. కాని, అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు పొంది సంసార కర్మబంధాలలో చిక్కుకొని యోగవియోగాలు అనుభవిస్తుంటాడు.
పుట్టుక, వినాశం, శోకం, వివేకం, అవివేకం, చింత, స్మరణం అనేవి అనేక విధాలు. ఈ పరమార్ధం వివరించటానికి పెద్దలు "ప్రేతబంధు యమసంవాదం" అనే కథను చెప్తారు. ఆ కథ చెప్తాను, విను అని హిరణ్యకశిపుడు తన తల్లికి చెప్పిన కధే సుయజ్ఞోపాఖ్యానం - 

ఉశీనరదేశంలో సుయజ్ఞుడనే రాజుండేవాడు. అతడు యుద్ధంలో శత్రువులచేతికి చిక్కి మరణించగా, ఆరాజు మృతదేహం చుట్టూ చేరిన అతని భార్యాపుత్రులు, బంధుజనాలు తలలు బాదుకుంటూ, గతస్మృతులను తలుచుకుంటూ, నీ ఈ వియోగం భరించలేం... నీతోపాటు సహగమనం చేసి మేమూ నీ సన్నిధికి చేరుకుంటామంటూ హృదయవిదారకంగా విలపించసాగారు. సూర్యుడు అస్తమించే వేళ అయింది. ఆ సమయంలో వారి రోదనం విని విప్రబాలుని వేషంలో యముడు వచ్చి, వారిని ఓదార్చుతూ ఇలా భోదించసాగాడు -
                                      
మచ్చిక వీరికెల్ల బహుమాత్రము జోద్యము, దేహి పుట్టుచుం
జచ్చుచునుండ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ
చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాగవచ్చునే?
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజం ప్రాణికోటికిన్
                                   
ఎక్కువ మక్కువ పెంచుకొని కాలం తీరిపోయిన వారికోసం ఇంతలా దుఃఖించడం చోద్యంగా ఉంది. పుట్టినవారు గిట్టక తప్పదు, పుట్టిన తర్వాత గిట్టని ప్రాణి అంటూ ఉంటుందా? ఇది మీరంతా నిత్యం చూస్తుంటారు కదా. మీరు చనిపోనివారిలాగా చనిపోయిన వారికోసం విలపిస్తారేమిటి? మృత్యువును తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదే. ప్రాణి ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చెనో, మరల అక్కడికి పోవటం తప్పనిసరి కదా!
అని, ఇంకా ఇలా వివరిస్తున్నాడు యముడు -
పరమేశ్వరుని అనుగ్రహముంటే క్రూరమృగాలున్న అడవుల్లో ఉన్నా, సురక్షితంగానే ఉంటాం. ఎలాగంటే, తల్లిగర్భంలో ఉన్న శిశువును పోషించునట్లు. సర్వత్రా సర్వవిధాలా ఆయనే రక్షకుడు. ఈ విశ్వమును సృష్టించేది, రక్షించేది, నశింపజేసేది ఎవడో, అనంతమూర్తి ఎవడో, బ్రహ్మాండానికి అధిపతి ఎవడో ... వాడే లీలావిలాసంగా ఈ లోకాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు. ధనమును వీధిలో పడవేసినా దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది. గీత బాగుండకపోతే ఇంట్లో మూల భద్రపరిచిన మటుమాయమై పోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్నా, భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి పొందుతాడు. అది లేనివాడు సౌధాల లోపల రక్షకభటులతో రక్షింపబడుతున్న రాజైనా మరణిస్తాడు. పరమాత్ముడు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అయినా ఈ ప్రాణికోటి కాలానికీ, కర్మకూ వశమైపోయి ఈ బ్రహ్మాండ చక్రంలో ప్రవర్తిల్లుతుంటుంది. ఆ ఆత్మస్వరూపుడు త్రిగుణాలకు లోబడినవాడు కాడు. ఆ గుణాలకు అతీతుడైన విశ్వనాథుడాతడు.
                                  
పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహం ఒక భవనంలాంటిది. ఆ భవనం వంటి శరీరంలో ఆత్మపురుషుడు (జీవుడు) పూర్వకర్మానుసారియై ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలం తీరిపోగానే ఆ భవనం నుండి వెళ్ళిపోతాడు. దేహం అశాశ్వతం, అందులోని ఆత్మస్వరూపుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది గాని, లోపలున్న ఆత్మనకు మాత్రం నాశనం లేదు. ఆత్మ, దేహం వేరు వేరే కానీ ఎప్పుడూ ఒకటికాదు. ఆరణిలో అగ్ని దాగివున్నట్లు, శరీరంలో వాయువున్నట్టు, తామరతూడు లోపల శూన్యమున్నట్టు దేహంలో దేహి వేరుగా విలసిల్లుతుంటాడు.
అని అనేకరీతుల్లో తత్త్వోపదేశం చేస్తూ, ఇంకా నిట్లనియె -
ఆ ఆత్మస్వరూపుడు పంచభూతాలను, పంచేంద్రియాలను, మనస్సునూ, లింగదేహమునూ విలాసంగా ధరిస్తాడు. మరల విడిచిపెడతాడు. అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు వేరుగా ఉంటాడు. అతడే సర్వాధిపతి. కాబట్టి దీనికోసం మీరు బాధపడడం, దుఃఖించడం అవివేకం.
ఎప్పటివరకు ఆత్మ దేహమును ధరించి యుంటుందో అప్పటివరకు ఈ కర్మయోగం జరుగుతూనే వుంటుంది. ఆత్మ దేహమును విడిచిపెట్టగానే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. వీటితో సంబంధమే ఉండదు. ఈ మాయా యోగంవల్ల చలించే హృదయంతో కుమిలిపోవడం వృధా కదా.
అజ్ఞానాంధులైన కొందరు ఆ మహామాయ అనే భ్రాంతిలో పడి తల్లితండ్రులపై, భార్యాపుత్రాదులపై, స్నేహితులపై, ఆశ్రితులపై అనురాగాలూ, అనుబంధాలూ పెంచుకొని ఇళ్ళూ వాకిళ్ళూ సంపదలు, సామ్రాజ్యాలు సంపాదించుకుంటారు. ఎక్కడైనా కలలో కన్పించిన సంపద యదార్ధం అవుతుందా? కర్మానుబంధం ఉంటే సంయోగం కలుగుతుంది. కర్మఫలం అనుభవించాక బంధం విడిపోయి, వియోగం ఏర్పడుతుంది.
ఈ మాయాప్రపంచ రహస్యం తెలుసుకున్న మునులు, జ్ఞానులూ శాశ్వతమైన వాటిని గురించి సంతోషించరు, అశాశ్వతమైన వాటిని గురించి దుఃఖించరు. అజ్ఞానులు, అవివేకులూ మాత్రమే సంయోగం కలిగితే పొంగిపోతారు, వియోగం కలిగితే కృంగిపోతారు.
పూర్వం ఒక అడవిలో పక్షులను వేటాడి జీవించే వేటగాడొకడు సూర్యోదయం కాగానే వేటకోసం వెళ్లి, వలపన్ని పక్షులను పట్టి, రెక్కలు విరిచి సంచిలో వేసుకుంటూ అడవంతా తిరుగాడుతుండగా ఒకచోట అడవిపిచ్చుకల జంటను చూసి, ఉరిపన్ని ఆడపిచ్చుకను పట్టి, రెక్కలు విరిచి చిక్కంలో వేసుకున్నాడు. అది చూసిన మగపిచ్చుక ఆడపిచ్చుకకై విలపిస్తూ  గద్గద స్వరంతో బ్రహ్మ మన తలరాతలను ఇలా రాశాడా, విధియొక్క చేతలును ఏమనాలి, మన పిల్లల్ని ఎలా చూడాలి, వాటి రోదనను ఎలా భరించాలి ... అని పరి పరివిధాల రోదిస్తున్న మగపిచ్చుకను అప్పుడే చూసిన బోయవాడు వేగంగా బాణం సంధించి నేలకూల్చాడు. ఆయువు తీరితే ఎంతటివారైనా మరణించక తప్పదు కదా
ప్రాణం పోకడ, వానరాకడ తెలియదంటారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మీరు మీ సంగతి మర్చిపోయి చనిపోయి నేలమీద పడియున్న ఈ మహారాజు శవం చుట్టూ చేరి శోకించడం వ్యర్థం. ఇలా వందసంవత్సరాలు విలపించినా మీ నాధుణ్ని చేరుకోవడం దుర్లభం. చనిపోయినవారు తిరిగి లేచివస్తారా?
ఈ విధంగా బాలకుని రూపంలో వచ్చి చెప్పిన యముడు మాటలు విన్న వారంతా విశ్వం శాశ్వతం కాదని తెలుసుకొని, శోకం మాని, కర్తవ్యం ఆలోచించి, సుయజ్ఞ మహారాజుకు ఉత్తరక్రియలు చేసి వెడలిరి. అటుపై యముడు అంతర్ధానమయ్యాడని చెప్తూ, హిరణ్యకశిపుడు ఇంకా ఇలా పలికెను -
ప్రాణులకు పరతత్త్వ చింతన లేకపోవడంచేత మనవాళ్ళు అని, ఇతరులు అనీ తేడాగా భావిస్తారు. ఎవరు పరులు? ఎవరు తనవారు? వారు - మేమూ అని అజ్ఞానులే అనుకుంటారు. ఆలోచిస్తే అందరూ ఒకటే. అని వివరంగా చెప్పగానే తల్లి దితి, ఆమె కోడళ్ళు తత్త్వం గ్రహించి, విలపించడం మానుకున్నారు. ఇదే సుయజ్ఞోపాఖ్యాన కధనం. 

భారతీయవాజ్మయంలో రామాయణం, మహాభారతం, భాగవతములు పరమ ప్రామాణికమైన మహోన్నత ఇతిహాసాలు. 
భాగవతం, భగవంతుని మరియు భాగవతుల దివ్యగాథ. అమృత సుధ. ఇందులో ఏ గాథయినా మన జీవనగమనం సవ్యదిశలో సాగేలా మార్గనిర్దేశం చేసేందుకే. జీవితపరమార్ధాన్ని సాధించడానికి దివ్యసందేశాన్ని ప్రభోదించడానికే. భాగవతపఠనం ముక్తిదాయకం, మోక్షసోపానం. పరీక్షిత్తు మహారాజును మాధ్యమంగా చేసుకొని, ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతుండే మానవులందరికీ ఈ సంసార మాయాజలధిని దాటే తరుణోపాయాన్ని శ్రీశుకుడు శ్రీమథ్భాగవతము ద్వారా సర్వులకూ అందించాడు. భాగవతాన్ని ప్రతి మనిషి భావగతం చేసుకుంటే ఇహపరాలను సార్ధకం చేసుకున్నట్లే. 
మరణం అనివార్యమని తెలిశాక, ఆ ఆఖరిదినాల్లో ఆత్మీయులతో కాకుండా, సంసారబంధాలు తెంచుకుని పరమాత్మను పొందే తోవను చూపమని ప్రాధేయపడి శుకమహర్షి కృపతో హరిని ధ్యానిస్తూ ఆయనలో ఐక్యమయ్యాడు పరీక్షిత్తుమహారాజు
శరతల్పగతుడైన, స్థిరచిత్తుడై మనస్సులో ఆ దేవదేవుండును నిలుపుకొని, నిలుపుకున్న రూపాన్ని వీక్షిస్తూ, స్తుతిస్తూ నిశ్వాసాన్ని నిరోధించి 
గోవిందుడిలో మమైకమైనాడు గాంగేయుడు. 

కానీ మనం?
అంపశయ్యపై నున్న, అయినవారిపై మమకారం చంపుకోలేక, వ్యామోహం తెంచుకోలేక, ఆశలు విడవలేక, సంసారమునే స్మరిస్తూ వదలలేక వదలలేక ప్రాణాల్ని విడుస్తాం, జన్మ పరంపరలో చిక్కుకుంటాం. ధర్మాచరణ లేక, హరిని చింతించక, తత్త్వాన్ని గ్రహించక, ఆత్మాన్వేషణ ప్రసక్తే లేక, సంసారభోగాల్లో మునిగితేలుతున్న లౌకికులమై జనన మరణ చక్రాల్లో తిరుగాడుతూనే వుంటాం.  
అందుకే మనలాంటివారిని చూసిన మహర్షులు యోగులు విస్మయంతో ఇలా అంటూ, అంతలోనే ఏంచేసి తరించాలో తెలుపుతారిలా - 
పశుకళత్ర పుత్రబాంధవ దేహాది, సంఘమెల్ల తమకు సత్యమనుచు
కాపురములు చేసి కడపట సత్తురు, కనియుగాన రంత్యకాలసరణి
పశువులు, భార్యాబిడ్డలు, బంధువులు, శరీరం ఇత్యాది పరివారమంతటినీ నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ, సాగిస్తూ కడకు కన్నుమూసి కాటిపాలవుతారని, అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారని అంటారు శుకమహర్షివారు. 

దొరసినకాయముల్ ముదిమితోచినజూచిప్రభుత్వముల్ సిరుల్
మెరుపులు గాక జూచి, మరి మేదినిలో తమతోడివారు ముం
దరుగుట జూచి, చూచి, తెగు నాయువెరుంగక మోహపాశముల్
తరుగని వారికేమిగతి దాశరధీ కరుణాపయోనిధీ
దశరథరామా! శరీరములు ముదిసిపోవడంతో శరీరం అస్థిరమనీ, సంపదలు మెరుపుతీగవలె అదృశ్యంకాగా అవి  అస్థిరమనీ, తమ సహచరులు, సమాన వయస్కులు తమకంటే ముందుగానే మరణించినప్పుడు తామునూ మరణించవలసిన వారమనీ తెలుస్తూ ఉన్నప్పటికీ ఆయువు తరిగిపోవడం తెలుసుకోక, అస్ధిరాదులైన దేహాదులలో అజ్ఞానమనే తాళ్లబంధాలలో పట్టుపడుతున్నారు కదా! ఇట్టి అజ్ఞానులకు ఇక గతి ఏంటి? అని వాపోతాడు ఓ రామభక్తుడు.  
మన అస్తిత్వం ఎంత అల్పమైందో నిర్వచిస్తూ అన్నమయ్య ఇలా అంటారు -
మాపులే మరణములు రేపులే పుట్టువులు 
చాపలాలు మాని విష్ణు శరణను మనసా ... 
పుట్టుకలను రేపులతో అంటే ఉషోదయాలతో, మరణాల్ని మాపులతో అంటే సాయంసంధ్యలతో పోలుస్తూ చాపలాలు అంటే చంచల స్వభావాల్ని వదిలేసుకొని భగవంతునికి శరణాగతి చెందమని సూచిస్తాడు. 

ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను... అనే గజేంద్రుడు ద్వారా మనం ఏం చేయాలో తెలుపుతుంది భాగవతం. 
ఇన్నీ తెలిసినా, మాయలో పడిపోతుంటాం. 
అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్ /
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః //
అంత్యకాలమందు ఎవరైతే నన్నే స్మరించుచూ దేహమును విడిచిపెడతారో, వారు నా స్వరూపమును పొందుతారు. నన్నే చేరుకుంటారు. ఇందులో సందేహం లేదని అభయమిచ్చాడు శ్రీకృష్ణభగవానుడు. 

కష్టాల్లో దేవుణ్ణి కొలుస్తూ, సుఖాల్లో మరుస్తూ, ఉన్నాడో లేడో అని అరకొర విశ్వాసంతో జీవనగమనం సాగిస్తే అంత్యకాలంలో స్ఫురణకు స్మరణకు అందడు ఆ అనంతుడు.
కన్నుమూసేవేళ ఆ కారుణ్యమూర్తే కళ్ళముందు కదలాడాలంటే, మనుగడలో మలుపులెన్ని ఉన్నా, మాధవుడినే మనసార విశ్వసిస్తూ, మన దైనందిక జీవితంలో ఆ దేవదేవున్ని ఓ ఆలంబనగా ఆరాధనీయునిగా చేసుకొని, సదా సన్మార్గంలో సాగిపోగలిగే సాధనను సాధిస్తే, సర్వవేళల్లో సర్వేశ్వరుడు స్పురిస్తాడు, అంత్యకాలంలో అంతరంగ ఆలయమున అనంతుడై అగుపిస్తాడు, అప్పుడు ఆ అంతర్యామిలోనే ఐక్యమౌతాం. 

 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదం గాక! 

తొలిసంధ్యలో ఆరవిరిసిన అరవిందాలు మలిసంధ్యలో వాలి రాలిపోవడం సహజం. అట్లే జనించాక మరణించడం కూడా సహజమే. ఇది కాలధర్మం. అయితే ఆ మరణం వెన్నెల్లో పూసిన పారిజాతాలు వేకువలో పరవశంగా పరమాత్మునిపూజకై రాలిపోయినట్లు ఉంటే ఆ జననంకు సార్ధకత ఉన్నట్లే. మరుజన్మ లేనట్లే. 


2 కామెంట్‌లు:

  1. చక్కటి పద్యాన్ని పరిచయం చేశారు. మీరిచ్చిన వివరణ, పిట్టకథలు బావున్నాయి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళటం ఎంత సహజమో మరిచిపోతూవుంటాము.

    రిప్లయితొలగించండి
  2. భారతి గారు,చాలా అద్భుత విషయాలు పరిచయం చేశారు.. ఇంతకన్నా నేను ఏమీ వ్రాయలేను.. గ్రహించగలరు ..

    రిప్లయితొలగించండి