31, జులై 2018, మంగళవారం

ఏమిటే ఈ మనస్సు ... భావకుసుమాలు

                                                            
                                                   

శుభోదయం భారతీ అంటూ, వాట్సాప్ లో పలకరించే నేను ఇలా లేఖలో ప్రత్యక్షమవ్వడం ఏమిటని అనుకుంటున్నావా? కారణం వుందోయి ... 
"శ్రీరామ జయరామ జయరామ ... 
యేన కేన ప్రకారణ యస్య కస్యాపి దేహినః 
సంతోషం జనయేత్ప్రాజ్ఞస్తదేవేశ్వర పూజనమ్ 
ఏ ప్రకారముగానైనను ఏ జీవికైనను ప్రాజ్ఞుడైనవాడు సంతోషం కలుగచేసేడు కార్యమునే చేయవలెను. అదియే సర్వేశ్వరునికి  గొప్ప పూజ. 
శుభోదయం రా బంగారం". 
అని నీవు పంపిన వాట్సాప్ మెసేజ్ నా ఈ లేఖకు కారణం. 
నీ ఈ మెసేజ్ తో కొద్దిరోజుల క్రితం నాలో జరిగిన సంఘర్షణను నీకు చెప్పాలనిపించి, అదంతా వాట్సాప్ లో తెలపలేక ఫోన్ బదులు పెన్ను పట్టుకున్నా.

రోజూ పావుతక్కువ ఐదుకు లేవడం, స్నానాదికాలు పూజ, ఆపై వంటావార్పు వగైరాలు..... మధ్యాన్నం ఓ అరగంట సేదతీరడం... తిరిగి పనులు ప్రారంభం... అన్ని ముగించుకొని పదకొండింటికి పడుకోవడం. ఇది సాధారణంగా నా క్రమం తప్పని నిత్య దినచర్య. అయితే గత కొద్దిరోజులుగా నేను లేచేసరికి పువ్వులన్నీ ఎవరో కోసేస్తున్నారు. నేను గమనించిందేమిటంటే - మార్నింగ్ వాక్ కు ఓ కవరుతో బయలుదేరడం, పూవులు కోసేయడం, ప్రహరీ లోపలున్న మందారమొక్కను కర్రతో వంచి కోసేయడం. విచారకరమేమిటంటే - ఆ హడావిడిలో చాలా పువ్వులు నేలమయం, కొమ్మలు విరిచేయడం... ప్చ్...
సరిగ్గా పువ్వులు లేక పూజలో ఏదో అసంతృప్తి. ఓ రోజైతే అస్సలు పువ్వులు లేవు. కాస్త తులసిదళాలతో పూజ ముంగించాను గానీ, మనసంతా వెలితి.
                                 

భారతీ, నా చిన్నప్పుడు, నాన్నమ్మ దేవునిపాటలు పాడుతూ... పెరట్లో పూవులను, తులసిదళాలను పూలసజ్జ నిండా కొస్తుంటే, ఆ పాటలు వింటూ, నేనూ కొన్ని పువ్వులు కోసి సజ్జలో వేయడం... నాన్నమ్మ నా ఈ చిన్నిపనికి మురిసిపోతూ... నా బంగారు తల్లీ, ఎంత సాయమో నాకూ... అని అంటూ, నా మొఖం చుట్టూ చేయి తిప్పి తన తలపై మెటికలు విరవడం... ఓ అందమైన జ్ఞాపకం. మదిలో మధురమైన సజీవ దృశ్యం.
నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, ఓసారి నాన్నమ్మను అడిగాను, పూజకు పూవులు, తులసిదళములు, దీపాలు, అగరబత్తి ధూపాలు, కర్పూర నీరాజనములు ఎందుకని?

మనల్ని శుద్ధి చేసుకోవడానికి. స్నానాదికాలు శరీరాన్ని, పూజాదికాలు మనస్సుని శుద్ధి చేస్తాయి. బాహ్య శుద్ధితో పాటు అంతరశుద్ధి కూడా ఉండాలి తల్లి. పరమాత్ముడు అన్ని చోట్ల వుంటాడు. అందరిలోనూ వుంటాడు. కానీ, మనం దర్శించుకోలేం. ఆయనను దర్శించడం సామాన్యులకు సాధ్యం కాదు. మనస్సు చంచలం చపలం. ఓ చోట స్థిరంగా ఉండదు. ఈ లౌకిక లంపటాల నడుమ భగవంతునిపై మనస్సు లగ్నం చేయలేము. అందుకే మన మహర్షులు వేదాల్ని ఆధారంగా చేసుకొని, నిరాకారునికి రూపం, దీపం, ధూపం, పుష్పం, తీర్ధం, నైవేద్య  నివేదన... ఇలా అనేక ప్రక్రియలను ఏర్పరిచారు. మానవజన్మ నిరర్ధకం కాకూడదని, మన మనస్సును రోజులో కొద్ది సమయమైన భగవంతునివైపు మరల్చడానికి, భగవంతుని చెంతన భక్తుని మనస్సు ఏకాగ్రమొనర్చడానికి, సామాన్యభక్తులను తరింపజేయడానికే ఇవన్నీ ఏర్పరిచారని నాన్నమ్మ చెప్పింది. కొంతకాలం పిదప నాన్నమ్మ చెప్పింది అర్ధమైంది. ఆప్పటినుండేరా, పూజ చేయడం అలవడింది. 

నిజమే కదా,  బాహ్యక్రియలు అంతరశుద్ధికై సహకరిస్తాయి. ప్రాధమికంగా పరబ్రహ్మం నందు చిత్తం లగ్నం చేయవలెనన్న అందుకు అనుకూలమైన స్థానం సాధన ఉండాలి కదా.  
స్థూలం గా ఏర్పరిచే ఈ పూజాది ప్రక్రియలన్నీ భగవంతుని వైపు పూర్ణంగా మరలడానికే. సంపూర్ణ సమర్పణాభావం అలవడడానికే. ఎచ్చట దృగ్గోచారమగు స్థూలప్రకృతి యంతయూ పవిత్రంగా నుండునో, అచ్చట మన సూక్ష్మప్రకృతియగు మనోమయకోశం పరిశుద్ధస్థితి నొందును.
పంచేంద్రియాలతో పాటు మనసును ఏకాగ్రం చేయుటకే ఈ పూజ ఏర్పరిచారనిపిస్తుంది. దివ్యమంగళకరమగు భగవత్ రూపమునందును, దీప ధూప కర్పూరాది జ్యోతులయందు నేత్రేంద్రియం, సుగంధ ధూపవాసనలచే ఘ్రాణేంద్రియము ఏకాగ్రత నొందును. గంట శంఖధ్వనులలో కర్ణేన్ద్రియం లీనమగును. భగవన్నామోచ్చారణలచేత జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు చందనాదులచే త్వగింద్రియం శాంతము నొందుతుంది. వీటన్నింటి మూలంగా మనస్సు  రమిస్తుంది కదా. 
భారతీ, ఇప్పుడు నేను చేసిన పూజ మహాఅయితే గంట లోపే. కానీ, ఆ ఒక్క గంట మిగిలిన 23 గంటల జీవనంకు శక్తిదాయకం. సరే, అసలు విషయంకు వస్తాను... ఆ రోజు పువ్వులు లేకుండా చేసిన పూజతో ఒకవిధమైన అసంతృప్తి. ఇంట్లో అందరికీ టిఫిన్స్, వంట తతిమ్మా పనులు పూర్తయ్యేసరికి 11 అయింది. 
దగ్గరలోనే గుడికి వెళదామనిపించి వెళ్లాను. దర్శనం అనంతరం బయటమెట్లుపై కూర్చొని ప్రసాదం తింటుండగా, ఆ ప్రక్కనే కూర్చున్న కొందరు, శ్రావణంలో తీసుకోవాల్సిన చీరల గురించి, ఏ షాపులో కొనాలో, కొనాలనుకుంటున్న బంగారం గురించి, ఆపై టీవీ సీరియల్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటేంటే... గుడికి వచ్చింది ఇందుకా... ఒకింత బాధతో గుడి లోపలకు మరల వెళ్లగా, ఓ 10 సం|| పాప తన పుట్టినరోజని అందరికీ ఓ పండుతో పాటు శివానంద లహరి పుస్తకమును ఇచ్చింది. అచ్చటే ఓ మూల కూర్చొని శివానందలహరి చదువుతుండగా ఈ శ్లోకములయందు మనస్సు నిలిచింది ... 
గభీరే కాసారే విశతి విజనే హోర విపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమార్పైక్యం చేత స్సరసిజ ముమానాధ భవతే
సుఖేనావ స్థాతుం జన ఇహ న జానాతి కిమహో 
ఓ ఉమాపతీ! ఏమీ ఆశ్చర్యం? మానవుడు తెలివి తక్కువవాడై, నీ ఆరాధనకై పువ్వులను సేకరించవలెనని లోతైన చెరువులలోకి దిగుతున్నాడు, నిర్జనారణ్యాలలో, ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తున్నాడు. కానీ మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించి ఇచ్చట సుఖంగా స్థిరంగా వుండడం తెలుసుకోలేకున్నాడు కదా.
అలాగే కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ ... అన్న శ్లోకమందు 
గిరీశా! చేతిలో బంగారుకొండ, సమీపంలో కుబేరుడు, కామధేను, కల్పవృక్షం, చింతామణి మున్నగునవి గృహంలో రాజిల్లుతుండగా, శిరోపరి భాగంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా, సమస్త మంగళాలూ నీ పాదపద్మలా సన్నిధిలో ఉండగా, నేను నీకేమి ఇవ్వగలను? నా మనోపుష్పమును నీకర్పిస్తున్నాను స్వీకరించు. 

నిజమే కదా, మనోపుష్పం సమర్పించవచ్చు కదా... ఆనందమనిపించింది, నా అసంతృప్తి పోగొట్టడానికే భగవంతుడు ఇలా అనుగ్రహించాడనుకుంటూ ఇంటికి బయల్దేరాను. మధ్యాన్నం అందరి భోజనాలు అయ్యాక, కాస్త సేద తీరుదామని మంచమెక్కాను. నిద్ర రాలేదు కానీ, ఓ సందేహం మనస్సును తొలవడం ప్రారంభించింది. క్రిందపడిన పువ్వులూ, వాసన చూసిన పువ్వులూ పూజకు పనికిరావంటారు, మరి బంధాల క్రింద పడి, ఎన్నో విషయం వాసనలను తగిలించుకున్న ఈ మనోపుష్పంను ఎలా సమర్పించగలను? 
ఏమైంది నాకు, ఎందుకిన్ని ఆలోచనలు... అసహనంగా అనుకుంటుండగా ఫోన్ రింగ్... మాట్లాడి, వాట్సాప్ చూడడం మొదలెట్టా. అందులో ఓ ఫ్రెండ్ పంపిన మెసేజ్ చూడగానే ఆనందం పునఃప్రవేశం. ఆ మెసేజ్ -
అహింసా ప్రధమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథై వచ
సత్య మష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్
మొదటి పుష్పం అహింస.  అహింసా వాఙ్మనంకాయై: ప్రాణిమాత్ర ప్రపీడనం ... శరీర మనో వాక్కులతో బాధింపకుండుట అహింస. వయస్సు రీత్యో, శారీరక శక్తి తగ్గో, బాధ్యతలు పెరిగో ... కాస్త చిరుబురులు ...ఇలా అప్పుడప్పుడు వాక్కు హింస చేస్తున్నా. 
ఇక రెండవది ఇంద్రియ నిగ్రహం... ప్రారబ్ధ ప్రపంచానురక్తిని విడిచి, బహిర్ముఖమగు ఇంద్రియములు నిగ్రహించి అంతర్ముఖం చేస్తూ,తామరాకుపై నీటిబొట్టులా మనుగడ సాగించడం ... అనుకున్నంత సులువు కాదురా..... కారణజన్మురాలైన సీతమ్మవారి నేత్రేంద్రియమే మాయలేడి వెనుక పరుగులు తీయగా, సామాన్యురాలిని ఈ మాయాప్రపంచబంధాల వెనుక పరుగిడడంలో ఆశ్చర్యమేముంది? 
మూడవ పుష్పం సర్వభూత దయ. సర్వజీవుల యెడ దయగా ఉండడం. హు... వంట చేస్తుండగా వంటగది ప్రక్కనున్న ప్రహరీగోడపైకి కాకుల రాక... కాస్త టిఫినో, బిస్కట్సో ... ఏదుంటే అది పెడితే, అది చూసిన మామయ్యగారు అలా పెట్టడం వలనే రోజూ కాకులు వస్తున్నాయని, గోడ నిండా రెట్టలే అని చిరుబురులు. అంతవరకూ కనిపించని శ్రీవారు, ఎన్నిసార్లు చెప్పించుకుంటావ్, పెద్దవాళ్ళ మాటకి విలువివ్వవా, మానర్స్ లేదు, కామన్సెన్స్ లేదు... మెత్తమెత్తని చివాట్లు.  అదేమిటో కానీ, అత్తయ్యగారు, మామయ్యగారు దండకం ఎప్పుడు ఉన్నా, ఎక్కడుంటారో గాని, ఈయన ఆ టైంకి ప్రత్యక్షం... (నవ్వకు గాని,  మామయ్య, అత్తమ్మగార్ల  చిరుబురులు తగ్గించడానికి మావారి రంగప్రవేశం, చివాట్లు...) అయినా మనస్సు చివుక్కు మంటుంది. కామన్సెన్స్ ఉన్న ఆ తండ్రీకొడుకులు భోజనం చేసేటప్పుడు కంచం చుట్టూ అంట్లే. టేబుల్ మానర్స్ లేనిది వీరికి, వాల్ మానర్స్ లేనిది కాకులకి... మధ్యలో నాకు తిట్లు. మెల్లగా మనస్సు  సణిగిన గొణిగిన అన్నీ కాసేపటిలో మణిగినవే.  చిన్న భూతదయకే ఫలితమిది. ఇక మిగతా పుష్పాలు గురించి ఏం చెప్పను... నా హృదయపూదోటలో పూర్తిగా వికసించని విరులివి. విడవని విరులతో విష్ణువుని ఎలా పూజించను? ఆలోచనలు ఆపి, మరల శివానందలహరి చదవడం మొదలెట్టా... 
సదా మోహాటవ్యాంచరతి ... అనే శ్లోకంలో మనందరికోసం ఇలా ప్రార్థిస్తారు శంకరభగవత్పాదులవారు -

ఓ కపాలీ! ఆదిభిక్షు ! నా మనస్సు ఒక కోతివంటిది. అది ఎప్పుడూ సంసారవ్యామోహమనే  మహారణ్యంలో  సంచరిస్తూ, సుందరాంగనల చుట్టూ  తిరుగుతూ, ఆశారూప శాఖలపై దుముకుతూ, , క్షణం తీరిక లేకుండా అటుఇటు పరుగులు తీస్తుంటుంది. అందువల్ల నా మనస్సనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని భక్తి అనే  తాడుతో గట్టిగా కట్టి, నీ ఆధీనంలో ఉంచుకో స్వామీ! 
నిజమేకదా, మట్టి, బురదలలో ఆడుకొని ఇంటికొచ్చిన బిడ్డని తల్లి దరి చేర్చుకోదా? బిడ్డ ఎలా ఉన్నా, దరిచేర్చుకున్న తల్లిలానే, ఆ పరమాత్ముడు ఎలా నేనున్నా, నన్ను దరిచేర్చుకుంటాడని అనుకోగానే ఎంతో స్వాంతన. 
నా ఈ భావనలు అమ్మతో పంచుకుంటే,  సకల సృష్టికర్తకు ఈ ఫల పుష్పాదులు ఏపాటి?  మన ప్రతీ క్రియలోను భక్తి, నిష్టా శ్రద్ధ కలిగియుండుటయే పూజ. అయినా, తల్లీ! చివరలో  
మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం చమూపతే
యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||
 

అంటూ క్షమాప్రార్ధన చేస్తాం కదమ్మా, మన పూజలో ఏ లోపాలున్నా క్షమిస్తాడమ్మా ఆ భగవంతుడు అని అమ్మ చెప్పాక చాలా హాయనిపించింది. 
అబ్బా... ఏమిటే ఈ మనస్సు? ఒక్క విషయంకై  ఇన్ని భావ పరంపరలా? ఈ మనస్సు ఎన్నో అనుభూతుల మోపరి కదా!   
భారతీ, నా ఈ లేఖ సుత్తిగా ఉండవచ్చు, కానీ, ఇంచుమించుగా ప్రతీ విషయం, నా భావాలు నీతో పంచుకోవడం నా అలవాటు కదా.  నాకు ముక్తి, ఆత్మసాక్షత్కారంల్లాంటి పెద్ద విషయాలు తెలియవు. కానీ, రోజూ వేకువనే చేసుకునే పూజ, సమయం ఉన్నప్పుడు కాస్త ఆ దైవపుస్తకాలు చదువుకోవడం, నామస్మరణం ..... దీని వలన ప్రతికూలతభావాలు ఎక్కువసేపు మనస్సులో నిలువక, ప్రశాంతంగా జీవనం సాగుతుంది. ఇదే నా చిరు సాధన. 
ఉండనా మరి,
నీ... శైలు. 

6 కామెంట్‌లు:

 1. శైలూ,
  సుత్తి కాదు, స్తుతించదగ్గ లేఖేనని నా భావన. అందుకే 'స్మరణ'లో ఇలా పదిలపరిచాను.

  రిప్లయితొలగించండి
 2. నా భావనలు 'కుసుమాలు'అయి స్మరణ బ్లాగ్ తోటలో విరియడం ఆనందంగా ఉంది. ధన్యవాదములు నేస్తం.

  రిప్లయితొలగించండి
 3. బాగుందండీ. ఆసక్తిదాయకమైన ఆలోచనాస్రవంతి.
  ఏమిటో ఈమధ్యన ఏమీ వ్రాయాలనే అనిపించటం లేదు.
  వ్రాయగలపాటి వాడనా! వ్రాయకపోతేనేం అని అన్న భావనలో ఉండిపోయాను కొన్నాళ్ళుగా.
  అందుకే శ్యామలీయం మౌనంగా ఉన్నది.
  మీ యీ టపా చదివిన తరువాత కొంచెం కదలిక కలుగుతున్నది.
  రాముడు నాచేత ఏమన్నా వ్రాయిస్తాడేమో చూడాలి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్యామలీయం గారు, నమస్తే.
   బాగుందండీ. ఆసక్తిదాయకమైన ఆలోచనాస్రవంతి... మీ ఈ వ్యాఖ్యకు ధన్యవాదములండి.
   వ్రాయగలపాటి వాడనా! ...
   ఎంతమాట! రామభక్తి క్షీరంతో అక్షరార్చన చేస్తున్నారు..
   కాలం చెల్లే రాతలు కావు, మీవి.
   కలకాలం నిలిచే సంజీవని రాతలివి.
   కొందరిలో వికాసాన్ని, మరి కొందరిలో భక్తి ప్రకాశాన్ని నింపే రాతలివి.
   ఒక దీపం మరో దీపాన్ని వెలిగించగలదు. వెలగటం శోభ. అలా శోభించే బ్లాగులలో ఒకటి 'శ్యామలీయం'.
   సర్, మీ రాతలను ఇష్టపడే నాలాంటి వారికోసం మీరు రాయండి.

   తొలగించండి
 4. భారతి గారూ,
  ఇప్పుడే వచ్చిన రామ కీర్తనం ఇది.
  మనఃపుష్పార్చన
  భవదీయుడు
  శ్యామలరావు.

  రిప్లయితొలగించండి
 5. అశాంతిగా వున్న మనసుకు సాంత్వన కల్గించే విషయం వున్న పోస్ట్ యిది. ధన్యవాదాలు భారతి గారూ ..

  రిప్లయితొలగించండి