15, ఏప్రిల్ 2021, గురువారం

సదా స్మరణీయులు | సద్గురువులు

                      

సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మ సంస్థాపనకోసం, జగత్కల్యాణ కారక కార్యనిర్వహణ కొరకు, ప్రతీ యుగంలోనూ భగవంతుడే కాదు, సద్గురువులు అవతరిస్తునే ఉంటారు. 

                         

"శ్రీగురు నామస్మరణం -సర్వపాపహరం". 

సర్వబాధల నుండి రక్షించి, సంసార సముద్రాన్ని తరింపచేసి, తన శాశ్వత సద్గురు ధామాన్ని ప్రసాదింప చేయగల పరమపుణ్యులు, త్రిమూర్త్యాత్మక స్వరూపులు "సద్గురువులు". అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవారు సద్గురువులు. 
                          

 శ్రీ దక్షిణమూర్తి, శ్రీ వేదవ్యాసులు, శ్రీ దత్తాత్రేయులు, శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ విద్యారణ్యులు, శ్రీరామకృష్ణులు, కబీరుదాసు, త్రైలింగస్వామి, లాహిరి బాబా, యోగానంద, శ్రీ రమణులు...ఇలా ఎందరో సద్గురునాధులు. అందరికి వందనములు.

మన సద్గురువులు గురించి స్మరణలో స్మరించుకోవాలనిపించి...  ఈరోజు ఇలా ఓ సద్గురువును స్మరించుకుంటున్నాను -

ఇది ఒకప్పటి కధనం. 
యుగ యుగాలనాటి కధనం. 
తెలుసుకోదగ్గ కధనం... 
ప్రజాపతియైన బ్రహ్మ అనునిత్యం తన జన్మకారకుడైన శ్రీమహావిష్ణువును అనంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, పరబ్రహ్మ ప్రసాదించిన శక్తితో, ఈ సర్వసృష్టిని కొనసాగిస్తున్నాడు. ఆ పరబ్రహ్మే శంఖుకర్ణుడనే తన భక్తున్ని, సృష్టికర్తకు సపర్యలు చేయటానికి బాసటగా ఉంచాడు.
                          

బ్రహ్మ చేసే శ్రీమహావిష్ణువు దశావతార పూజలకు, కావలసిన తులసి, పూలదండలు మొదలగునవి సమయానికి సమకూర్చడం శంఖుకర్ణుని దినచర్య. ఇది నియమం తప్పక సాగే నిరంతర చర్య. ఇలా కాలం గడుస్తున్న తరుణంలో... ఒకానొక రోజు శంఖుకర్ణుడు "శ్రీరామ"రూప శ్రీహరి పూజకు తులసి, పూల మాలలు సమయానికి సమకూర్చక, శ్రీరాముని దివ్యస్వరూపాన్ని స్మృతి పథంలోకి తెచ్చుకొని తదేకధ్యానముతో తన్నుతాను మరచి తన్మయుడై తను చేయాల్సిన పనిని మరిచాడు.

బ్రహ్మదేవుడు పూజవేళ అతిక్రమిస్తుందని ఆందోళనగా శంఖుకర్ణునికై చూస్తుంటే - శంఖుకర్ణుని జాడలేదు, పూజకు పత్రీ పూలు లేవు. కాలహరణం ఏ మాత్రం ఉపేక్షించని బ్రహ్మ కన్నులు జేవురించగా, శంఖుకర్ణుని నిర్లక్ష్యానికిగాను దానవుడవై జన్మించమని శాపమిచ్చాడు. సృష్టికర్త గంభీర స్వరంతో ఇచ్చిన శాపముకు ఉలిక్కిపడి, తన్మయత్వం నుండి బయటపడి, 'బ్రహ్మదేవా! పరమాత్మ మీ పూజకు సాయపడమని నన్ను నిర్దేశించగా, ఆనాటినుండి సవ్యంగా పనిచేస్తున్న నేను, నేడు మీరు దశావతారములో భాగమైన శ్రీరామచంద్రునికి పూజ చేస్తారనే మహోత్సాహముతో పువ్వులు సేకరిస్తుండగా, ఆ దివ్యమూర్తి రమణీయ రూపం మనోఫలకంపై నిలవగా, నన్ను నేను మర్చిపోయానే తప్ప, మరే ద్యాస నాకు లేదు. హృదయఫలకంపై నిలిచిన శ్రీరామచంద్రుని రూపాన్ని దర్శిస్తూ, నన్ను నేను మర్చిపోయేస్థితిలో ఉన్న నన్ను, ఈ విధంగా శపించడం న్యాయమా' అని ప్రాధేయపూర్వకంగా అభ్యర్ధించగా, తృటిలో సర్వం గ్రహించిన బ్రహ్మదేవుడు, శంఖుకర్ణుని ఉద్దేశించి, "నాయనా! ఇదంతా భగవద్విలాసంలోని భాగమే. పరమ భాగవతోత్తముడైన నీ విష్ణుభక్తి శాశ్వతం. విష్ణులోకం నీకు శాశ్వతం. పరమాత్ముని చిద్విలాసంలో భాగంగా, నీవు భూలోకంలో దానవుడవై జన్మించినా, నీ అచంచలమైన విష్ణుభక్తి, దృఢదీక్ష సర్వలోకాలవారికి ఆదర్శమౌతాయి. నీ జన్మ చరితార్ధమౌతుంది. అంతేకాదు, ఏ శ్రీరామచంద్రుని రూపాన్ని దర్శిస్తూ, నిన్ను నీవు మరచి తాదాత్మ్యం చెందావో, ఆ మూలరాముని పూజించుకుంటూ, నిన్ను నీవు ఉద్దరించుకోవడమే కాకుండా, త్రికరణశుద్ధిగా నిన్ను నమ్మి సేవించుకొనే సర్వభక్తజనులను సముద్ధరిస్తావు. లోకశుభంకరుడవై, పతితదీనజనోద్దరణ గావిస్తావు" అని అశీర్వదించగా -
భగవద్విలాసానికి తలవొగ్గి, శాపఫలితంగా విష్ణు ద్వేషియైన హిరణ్యకశిపునికి పుత్రుడిగా, ప్రతిక్షణం హరినామస్మరణ గావించే భక్తప్రహ్లాదునిగా జన్మిస్తాడు. శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం...ఆ దివ్యలీలావతార కధనం అందరికీ విధితమే.  ఇది కృతయుగము నాటి మాట. 

ఇలా రాక్షసకులంలో జన్మించి, పరమభాగవతోత్తమునిగా ప్రకాశించిన ప్రహ్లాదుడు, జన్మకర్మ విశేషాన తదుపరి జన్మలో బాహ్లీకరాజుగా జన్మించి, పరమభక్తాగ్రణియై శ్రీకృష్ణున్ని తన ఆరాద్యదైవంగా స్వీకరించి, సేవించి ధన్యుడైనాడు. 
ఇది ద్వాపరయుగం నాటి మాట.

పిదప ఈ పరమ వైష్ణువుడే, ఈ కలియుగమున 15వ శతాబ్దిలో శ్రీ వ్యాసరాయతీర్ధులుగా ప్రభవించి, తన అశేష ప్రజ్ఞా పాటవములతో, వైదికతత్వ ప్రచారము, విశేష గ్రంధరచనలు చేసి, సకలవిధ సత్సంగములు గావిస్తూ, ఎన్నో లీలలతో, తమ శక్తియుక్తులతో లోక కళ్యాణం, భక్తజన సంరక్షణం, దీనజనపాలనం చేస్తూ, శ్రీ మధ్వ పీఠాధిపతులుగా, మహామాన్వితులై వెలుగొందారు.

అది -
ధైర్య, శౌర్య, ధర్మ కృత్యములతో చరిత్ర ప్రసిద్ధి పొందిన చక్రవర్తి, కలాన్ని కత్తిని ఏక చేతిన పట్టిన సాహితీ సమరాంగణ ధీరుడు, సకల కళాకోవిదుడు అయిన శ్రీకృష్ణ దేవరాయ సౌర్వభౌమలవారి కాలం -

సధర్మ నిరతులు, భగవద్భక్తి పరాయణులు, నీతి కోవిదులు, దేశ, ప్రభుభక్తి పరాయణులైన శ్రీకృష్ణ భట్టులవారు ఆనాటి విజయనగరాధీశుల ఆస్థాన పండితుల్లో ఒకరు. వీరే శ్రీకృష్ణ దేవరాయలవారికి వీణానాద పాండిత్యాన్ని నేర్పినవారు. ఈ శ్రీకృష్ణ భట్టారకుల కుమారుడు కనకాచలభట్టు. ఈయన కూడా తండ్రికి వలె వీణా విశారదులు, శాస్త్ర పండితులు, నిష్ఠాగరిష్టులు. ఇతనికి చాలా కాలం సంతానం కలగకపోవడంతో, హంపీ విజయనగరంలో శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయున్ని సేవించగా, ఆంజనేయున్ని అనుగ్రహ ఫలంగా పుట్టిన బిడ్డ తిమ్మన్నభట్టు. (తిమ్మణ్ణాచార్యులవారిగా ప్రసిద్ధి). ఈయన కూడా తాత, తండ్రి లాగే వీణా విద్వాంసులు, వేదాధ్యయనమే జీవన పరమావధి అని త్రికరణశుద్ధిగా నమ్మినవారు, గొప్ప వ్యాకరణ వేత్త మరియు శ్రీ వేంకటేశ్వరారాధుకులు. వీరి సతీమణి గోపికాంబ. వీరికి ఓ అమ్మాయి (వెంకమాంబ) అబ్బాయి  (గురురాజ) సంతానం. వీరు కూడా విజయనగర సామ్రాజ్య ఆస్థాన విద్వాంసులుగా కాలం గడుపుచుండగా ... మహ్మదీయులు రాజ్యకాంక్షతో సమైక్యముగా సల్పే దాడుల ఫలితంగా విజయనగర రాజ్యపతనం కాగా, రాయల శకం అంతరించడం వలన కవులు, గాయకులు, కళాకారులు, పండితులు అనాధులైపోయారు. తిమ్మన్నభట్టువారు కూడా తన కుటుంబంతో వలసపోతు తంజావూరు మండలంలోని కంచినగర సమీప భువనగిరి చేరారు. అప్పటి మండలాదిపతి అయిన శ్రీ చెన్నప్ప నాయకుల ఆశ్రయాన్ని పొందిన తిమ్మన్నభట్టు, కాలగమనంలో శ్రీ మహామధ్వాపీఠాచార్యులైన శ్రీ సురేంద్రతీర్ధ, విజయేంద్రతీర్ధుల ఆదేశానుసారం కుంభకోణానికి తమ మకాం మార్చి, శ్రీ మహాపీఠంలో జీవనం సాగిస్తున్న తరుణంలో... కుమార్తె వెంకమాంబను మధురలోని మహాపండితుడైన శ్రీలక్ష్మీ నరసింహాచార్యులవారికి ఇచ్చి వివాహం జరిపించడం, కుమారుడైన గురురాజుకు ఉపనయనము చేసి గురుకులానికి పంపడం జరిగింది. అటుపిమ్మట వారికి మరోపుత్రుడు ఉంటే బాగుండుననిపించి, వెంటనే తిరుపతికి బయల్దేరి, పుత్రున్ని ప్రసాదించమని భక్తివిశ్వాసాలతో శ్రీ వేంకటేశ్వరున్ని సేవించగా, కొంతకాలమునకు ఆ వేంకటాధీశుడు 
ఈ దంపతులకు స్వప్నసాక్షాత్కారమిచ్చి - 'భక్తజనదీనబాంధవుడు, పరమ కళ్యాణమూర్తి, అచంద్రార్క కీర్తివంతుడై నిలిచే కుమారరత్నాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను' అని ఆశీర్వదించగా, ఆ దంపతులు అవధులు లేని ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చారు. 
                             

శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వచన ఫలంగా, వరప్రసాదిగా 1595 వ సంవత్సరం పాల్గుణశుద్ధ సప్తమి గురువారం నాడు, మృగశిరా నక్షత్రంలో సర్వశుభంకరుడు, లోకక్షేమంకరుడు, భవిష్యద్భక్త జనసంరక్షకుడు, ధర్మమూర్తి, మహాజ్ఞాని, విశ్వవిఖ్యాతుడైన  కుమారుడు వారికి జన్మించెను.   
 
శ్రీ వేంకటేశ్వర అపార కృపాకరుణాపాత్రులైన ఆ దంపతులకు వరప్రసాదిగా జన్మించిన ఆపుత్రుడే -

ఎవరన్నది తదుపరి టపాలో.....

4 కామెంట్‌లు:

  1. సదాశివ సమారంభాం
    శంకరాచార్య మధ్యమాం
    అస్మదాచార్య పర్యంతాం
    వందే గురు పరంపరాం

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గురుభ్యో నమః
    చక్కటి కధనం, తెలుసుకోదగిన కధనం.
    ఏకబిగిన చదివేటట్లు రాసిన విధానం బాగుందండి. ఈ సద్గురువు ఎవరో సస్పెన్స్ లో ఉంచక ముడి విప్పేయండి త్వరగా

    రిప్లయితొలగించండి