21, జూన్ 2023, బుధవారం

మహా తపస్వి మహర్షి అత్రి - మహోన్నత తపస్విని మహాసాధ్వి అనసూయ - మహిమాన్విత మహాగురుదేవుడు దత్తాత్రేయుడు

భారతీయ సనాతనధర్మంలో మహర్షులది మహోన్నత స్థానం. వేదసారాలను శ్రుతి స్మృతి పురాణ ఇతిహాసాల రూపేణా అందించిన జ్ఞానమార్గ ప్రబోధుకులు. మహర్షుల మనుగడ, వారి తపస్సు లోక శ్రేయస్సు కోసమే. లోకాల్ని ఉద్ధరించి, లోక శ్రేయస్సే వ్యక్తిగత శ్రేయస్సుగా భావించి, తమ తపస్సంపదను సమాజ రక్షణ కోసం ధారపోసిన మహర్షులను స్మరించుకోవడం మన కనీస ధర్మం. 


మనకోసం పుట్టిన అటువంటి మహా తపసంపన్నులలో ఒకరైన అత్రి మహర్షిని నేడు స్మరణ బ్లాగ్ ద్వారా, భక్తి పూర్వకంగా స్మరించుకుంటూ ప్రణమిల్లుతున్నాను.

కృతయుగం ప్రారంభంలో -




సృష్టిని విస్తరింపచేయటం కోసం బ్రహ్మ సంకల్పంతో ఉద్భవించిన బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. సప్తర్షులలో ఒకరు. గోత్ర (ఆత్రేయ గోత్రం) ప్రవర్తకులు. 

తపోధనుడు లోకోత్తరుడు అత్రి మహర్షి 

త్రిగుణాలకు అతీతుడు కనుక ఈ మహర్షికి అత్రి అనే పేరొచ్చింది.  
ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రిశబ్దవాచ్యో జీవన్ముక్తో కశ్చిన్మహర్షిః 
త్రివిధ తాపత్రయములు, త్రిగుణములు గ్రంథిత్రయదోషాలు అనే త్రయములు లేనివాడు అత్రి.
లోకసృష్టి విస్తరింపజేసే లక్ష్యంగా, సద్గుణాలతో మనుజులు విల్లసిల్లాలంటే లోకాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానికే తపస్సు చేయమన్న తండ్రి బ్రహ్మగారి ఆదేశానుసారంగా తపస్సు ప్రారంభించెను. ఆ తీవ్ర తపస్సుతో జ్ఞానసంపన్నులై, ప్రాణుల శరీరవ్యవస్థ పంచ భూతాత్మకమైనదని, అది అస్థిరమైనదని, నిత్యమైనది ఆత్మ మాత్రమేనని గ్రహించి, ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప కూడా ఉగ్రతపస్సును  సాగించడంతో, ఆ తపశ్శక్తి ప్రభావంతో అత్రిమహర్షి నేత్రాల నుంచి ఓ దివ్య తేజస్సు వెలువడి, ఆ కాంతి దశదిశలా వ్యాపించగా, ఆ తేజస్సును ఆ దిశలు తట్టుకోలేక సముద్రంలోకి విడిచిపెట్టబోతుండగా, బ్రహ్మదేవుడు క్షణాల్లో ఆ దివ్యతేజస్సును తనలోకి లాక్కున్నాడు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ, తనని స్తుతిస్తున్న దేవతలతో, ఓ దేవతలారా! ఇలా జరిగిందంతా లోక సంక్షేమం కోసమే. అత్రికి భవిష్యత్తులో అనసూయ అనే కన్యతో వివాహమౌతుంది. అప్పుడు ఆ దంపతులకు కుమారుడుగా నాలో ప్రవేశించిన ఈ తేజస్సులో కొంతభాగం చంద్రుడుగా పుడతాడు. అలాగే, మిగిలిన తేజస్సే మరోసారి క్షీర సాగరమధనవేళ చంద్రుడుగా ఉద్భవించి లోకాలన్నిటికీ మేలు చేస్తాడని బ్రహ్మదేవుడు తెలిపాడు. 
అత్రి మహర్షి కంటి చూపు ఎంత శక్తివంతమైనదంటే - తన కంటి నుండి వెలువడిన తేజస్సు చంద్రుడు కావడం ఒక విశేషమైతే, దేవతలను బాధిస్తున్న జంభుడు అనే రాక్షసుడిని, సూర్యచంద్రులను వేధిస్తున్న రాహువును కూడా నశింపజేసింది ఆ కంటి చూపే.  దివ్య తపో తేజోమూర్తి.
ఈ మహర్షి మానవాళికి శ్రుతులు, స్మృతులు అందించారు. లఘు అత్రి స్మృతి, వృద్ధ ఆత్రేయ స్మృతి, అత్రి సంహిత, అత్రి ధర్మ సంహిత అనేటి మార్గదర్శక సూత్రాలను అందించారు. పరమ ధర్మాలను, అర్చనా విధానాలను, దేవాలయాలాది నిర్మాణా విధానాలను, యజ్ఞాది కర్మల విధానాలను 'అత్రి సంహిత' పేరిట లోకానికి అందించిన మహాత్ముడు అత్రి మహర్షి. అన్నింటికీ మించి అంటరానితనం తగదని, ప్రతీజీవి దైవ సృష్టి అయినప్పుడు అంటరానితనం ఎందుకని ప్రశ్నిస్తూ, అభేదాన్ని ప్రతిపాదించారు. 

తపస్విని లోకహితైషిణి అనసూయ

మన ఈ ఆర్యభూమి ఎందరో పవిత్రత పాతివ్రత్య సాధ్వీమతల్లులకు నిలయం. అందులో అగ్రగణ్యురాలు అనసూయ.

స్వాయంభవు మనువు, శతరూప దంపతుల కుమార్తె దేవహూతి.  
మహా తపస్సంపన్నుడు అయిన కర్దమ ప్రజాపతి, దేవహూతి దంపతుల కుమార్తె అనసూయ.  యస్యాం నవిద్యతే అసూయ సా అనసూయ అనసూయ అంటే అసూయ లేనిది. అసూయను వీడిన తత్త్వం. జీవుడు మాయను వదిలిన స్థితి అని దత్తపురాణం నిర్వచించింది. 




అనసూయను తపో శ్రేష్ఠుడయిన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహాధర్మాన్ని చక్కగా పాటిస్తూ, భర్తనే దైవంగా సేవిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, పతి ప్రేమను పూర్ణంగా పొంది, ఆయన నుండి జ్ఞానోపదేశం పొందింది. ఈ ఆహార నిద్రాది సంసార వ్యామోహం తుచ్ఛమని గ్రహించి, ఆత్మానాత్మ వివేకం సంపాదించినది. తన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలను అబ్బురపరస్తూ, పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణకువగా వుండేలా చేసుకున్న మహాసాధ్వి.

ఈ దంపతుల తపః ఫలితంతో వారు ఉన్న ప్రాంతం పరమ పవిత్రమూ, శక్తివంతమూ అయింది.

ఒకరోజు ఆకాశంలో త్రిమూర్తులు వారివారి వాహనాల మీద మేరుగిరికి వెడలుచుండగా, ఒకచోట వీరి వాహనములు తటాలున ఆగిపోయి ముందుకు కదలలేకపోయాయి. అట్లు ఆగుటకు కారణం ఏమని అనుకుంటుండగా, 
అప్పుడు గరుత్మంతుడు స్వామీ! ఈ క్రింద భూమి మీద అత్రిమహర్షి ఆశ్రమం ఉంది. ఆ మహర్షి భార్య అనసూయ మహా పతివ్రత. ఈ దంపతుల పవిత్రత దాట శక్యం కాదు. అందుకని దీని మీదుగా ముందుకు వెళ్లలేమ'ని ప్రక్క త్రోవలో ప్రయాణం సాగించారు. ఏమీ! ఇంత శక్తి వుందా? అనుకొని, మానవాళికి ధర్మం యందు అనురక్తి కలగాలంటే, వీరి శక్తి ప్రకటితం కావాలని, అత్రి అనసూయల ఖ్యాతిని మరింత ప్రకాశింపజేయాలని, మహా పతివ్రత అనసూయ ధర్మవైభవం లోకానికి తెలియాలని, ముగ్గురు మూర్తులు సంకల్పించుకొని అనసూయను పరీక్షించాలని భావించారు.
భగవంతుడు వరాలిచ్చేమందు పరీక్ష పెడతాడు. ముందుగా పరీక్ష పెట్టేవాడు ఇంద్రుడు. అత్రి దంపతులకు పరీక్ష పెట్టే శక్తి తనకి లేదని త్రిమూర్తులతో ఇంద్రుడు చెప్పగా, ఆ మువ్వురు నారదుని పిలిచి, అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించమని అనగా, ఆయన మారువేషంలో వెళ్ళి, అనసూయతో శనగలు తినాలని ఉందని, ఇనుప గుగ్గిళ్ళు ఇచ్చి, వండమని కోరగా, వచ్చింది నారదుడు అని తెలిసిన, బయటపడక ఆ ఇనుప గుగ్గిళ్ళును తీసుకొని వాటిని చక్కగా వండి పెట్టింది. 

ఈ సంఘటన మొదటిసారి మా తాతయ్య చెప్తున్నప్పుడు - నిజంగానా... ఇనుప గుగ్గిళ్ళును అలా ఎలా వండేసింది అని నేను అంటే, నిజమే తల్లీ, ఆవిడ అంత తపశ్శాలి. దీనికే నోరు వెళ్ళబెట్టిస్తే ఎలా? ముందు ముందు ఘనమైన అద్భుతాలు ఎన్ని చేసిందో...విను, అన్నారు. 

ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ప్రశస్త పద్యాలు ప్రస్తావించకుండా ఉండలేను.
అల కలహభోజనుని ఫలహారమునకు 
నినుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు
అమ్మ! నీ చేతి తాలింపు కమ్మదనము
భరత దేశాన ఘుమఘుమ పరిమళించె 




అంతట ఆశ్చర్యానందాలతో పాతివ్రత్యం అంటే అనసూయ దేనని, అనసూయ పాతివ్రత్యాన్ని లోక కల్యాణార్థం నారదుడు త్రిమూర్తుల ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించెను.

అత్యపూర్వ మమౌఘ మనంత మైన
తావక పతివ్రతా మహత్త్వమ్ములోన
ఆది సాధ్వీమణుల హృదయములతోడ
నుక్కు శనగలు తుక తుక ఉడికిపోయే

మువ్వురు పత్నులు కించెత్ అసూయకు లోనై (లోకోద్ధరణకై  వీరి మానసిక స్పందనలుంటాయి. అనసూయ గొప్పతనాన్ని మరింత విశదంగా లోకానికి తెలిపారు) ఆమె పాతివ్రత్యం పరీక్షించమని తమ తమ భర్తలను కోరారు. 

అంతట త్రిమూర్తులు బ్రాహ్మణ వేషదారులై అత్రి ఆశ్రమమున కేతించగా, ఆ మువ్వురిని ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆహ్వనించి ఉచితాసనాలు అర్పించి స్వాగత సత్కారాలు చేసిన తర్వాత, 'మీ మువ్వురి రాకతో మా ఆశ్రమం పావనమైనది, భోజనాలు సిద్ధం చేశాను రండీ' అంటూ అనసూయ పలికింది. వారు ఆశీనులయ్యాక, వడ్డన చేయుటకు ఆమె సమాయత్తమవ్వగా, 'ఆగమ్మా, మేము ఆతిథ్యం స్వీకరించాలంటే నీవు నగ్నంగా వడ్డించా'లని కోరారు. పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమగును. అతిథి ఆకలితో తిరిగివెళ్ళిపోతే గృహస్థు పుణ్యాన్ని, తపస్సును అతిథి తీసుకొని పోతాడని శాస్త్రవచనం. కానీ, ఆ మాటలు విన్న ఆమె తన ప్రత్యక్షదైవం అయిన తన భర్తను మనసారా తలుచుకొని, వచ్చింది ఎవరో, వారి రాక ఆంతర్యమేమిటో గ్రహించి, తన పాతివ్రత్యమునకు, అతిథిసేవలకు భంగం కలగకుండా, చిరునవ్వుతో ఏమీ నాయీ భాగ్యము...ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు ఇలా వచ్చినారా...అనుకుంటూ - 




పతిని ప్రార్థించి, కమండలోదకమును వారి శిరస్సున చల్లి, వారిని పసిబాలురను చేసి, వారు కోరిన రీతిలో స్తన్యమిచ్చి, ఆహారం పెట్టింది.

గర్భము లేదు, కష్టపడి కన్నదిలేదిక, బారసాల సం
దర్భము లేదహో! పురిటి స్నానములున్ నడికట్లు లేవు, ఏ
స్వర్భువనాలనుండి దిగివచ్చిరి నీ ప్రణయాంక పీఠికీ
యర్భకు లంతులేని జననాంతర పుణ్య తపః ఫలమ్ములై 

గర్భంలేదు, ప్రసవవేదన లేదు, పురిటిస్నానం లేదు, పేరు పెట్టింది లేదు, నడికట్టు లేదు... ఏ లోకాలునుండి వచ్చారమ్మా, ఈ అర్భకులు నీ ఒడిలోకి? సాక్షాత్ త్రిమూర్తులే అర్భకులై  ఒడిలోకి రావడం... ఎంతటి అద్భుత ఘటన.
పిమ్మట వస్త్రధారియై పూలపాన్పుతో ఊయల సిద్ధం చేసి జోలపాడింది. 



ఇయ్యఖిల ప్రపంచములనే తమ బొజ్జల మాటుకొన్న బా
బయ్యలు మువ్వురున్ శిశువులై శయనించిరి నీ గృహాన, నీ
తియ్యని జోలపాటల కిదే పులకించెను సృష్టి యెల్ల, నీ
యుయ్యల తూగులో నిదుర నొందునులే పదునాల్గు లోకముల్!
ఔరా! బ్రహ్మాండ నాయక త్రయం శిశుత్రయ మయిందే ...



వేద వేదాంత సౌవర్ణ వీధులందు
తిరుగుచుండెడి దివ్యమూర్తిత్రయమ్ము 
నేడు నీ వంటయింట దోగాడుచుండె
గోరుముద్దలు గుజ్జనగూళ్ళు తినుచు

కాలు కదపక బిడ్డ లుయ్యేలలందు
నూగులాడె ముల్లోకము లూగుచుండె
కాలు వచ్చి గంతులు వేయుకాలమునకు
ఇంత కెంతౌనొ? వింతబాలెంతరాల!
అబ్బో! ముందు ముందు ఇంకేం జరుగునో...

ఆదియు నంతమే యెరుగునట్టి మహామహిమాడ్యు లైన బ్ర
హ్మాదుల కుగ్గు వెట్టి ఒడియం దిడి జోలలబాడు పెద్ద ము
త్తైదువ! దన్యురాలవు గదమ్మ! త్వదుజ్జ్వల కీర్తి గీతికా
నాదము మ్రోగె స్వర్గ భువనమ్మున దైవతమౌని వీణపై

ఓహో! బ్రహ్మాదులకే ఉగ్గుపోసి జోలపాట పాడే పెద్ద ముత్తైదువ.  స్వర్గ భువనమ్మున నారదుడు తన వీణ మీద పలికిస్తున్నాడు ఈ అపూర్వ సంఘటనను. ఏమీ ఘనత అనసూయమ్మది.

అగ్గిని గల్పి మట్టు మరియాదలు, పుణ్య పురాణ పూరుషుల్
ముగ్గురు చేయివచ్చిన యమోఘపు టగ్నిపరీక్ష లోపలన్ 
నెగ్గితి వీవ పూర్వములు నీ చరితమ్ముల్ చెవిసోకి మేనులన్
గగ్గురుపాటు పుట్టినదిగా ముగ్గురమ్మల కొక్కపెట్టునన్

ఆహా! ఎంతటి సాధ్వీమతల్లి... మువ్వురు దేవేరులు ఉలిక్కిపడ్డారు కదా.




ఇలా వుండగా, లక్ష్మీ, సరస్వతీ, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టగా, అంతలో అక్కడకు వచ్చిన దేవార్షి నారదుని వలన అత్రి మహర్షి ఆశ్రమము నందు జరిగిన వింత తెలుసుకొని, హుటాహటీన ఆశ్రమముకు చేరుకొని, పసిబిడ్డలుగా ఉన్న వారి భర్తలను చూసి, కన్నీళ్ళతో "తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను పరీక్షించమని చెప్పి పంపి, తప్పు చేశామని, తాము చేసిన తప్పిదాన్ని మన్నించి, మా భర్తలను స్వస్వరూపాలతో ప్రసాదించమని వేడుకొన్నారు. 

కొంగులు బట్టి 'మా పసుపు కుంకుమతో పతిభిక్ష పెట్టి మా
మంగళ సూత్రముల్ నిలుపు' మంచు సరస్వతి సర్వమంగళా 
మంగళ దేవతల్ ప్రణతమస్తకలై పడియున్నవారు నీ
ముంగిట యందు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్!

అంత అనసూయ పతిని తలుచుకొని కమండలోదకం ప్రోక్షించగా, త్రిమూర్తులు స్వస్వరూపం పొందారు.  

అమ్మవైనావు చతురాస్య హరి హరులకు
అత్తవైతివి వాణీ రమాంబికలకు 
ఘనతమై అత్తగారి పెత్తనము చూపి
క్రొత్త కోడండ్ర నిక దిద్దుకోగదమ్మ!

జగదీశ్వరులకే అమ్మవై, వాళ్ళను ఆలించి లాలించి, సరస్వతీ, లక్ష్మీ పార్వతి దేవేరులకు అత్తవైనావు. ఎంతటి ఘనత! ఇక అత్తగారి పెత్తనంతో క్రొత్త కోడళ్లను దిద్దుకోమనడంలో కరుణశ్రీ  మురిపపు కవితాదృష్టి ఎంత ఘనం!

మాతృప్రేమ పునీతమౌ సఫల దాంపత్యమ్ము నీ సొమ్ము, నీ
పాతివ్రత్యములోన అత్రితపముల్ పండెన్, వియద్గంగకే 
యేతామెత్తెను నీ యశస్సులు గుమాయించెన్ జగమ్మెల్ల నీ
యాతిథ్యమ్ము, నమస్సులమ్మ! అనసూయా! అత్రి సీమంతినీ!

ఈ తపశ్శాలి పాతివ్రత్యం, మాతృప్రేమ అమోఘం, అద్భుతం, అపూర్వం. ఈ మహాతల్లికి శిరస్సు వంచి నమస్కరించక ఎవరుండగలరు?




ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుంది? త్రిమూర్తులను సంతానంగా పొందిన ఏకైక మహతపస్విని.




త్రిమూర్తులు స్వస్వరూపం పొందిన అనంతరం,
అనసూయ అత్రిదంపతులను వరం కోరుకోమనగా - దేవాధిదేవులైన మీరు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకోవడం... తథాస్తు అనడం జరిగింది.

పిమ్మట అత్రిమహర్షి భార్యతో ఋక్షపర్వతంపై నూరుసంవత్సరాలు ఘోరతపస్సు చేయగా త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు. నేను ఏ పరమాత్మను గురించి తపస్సు చేస్తున్నానో,  ఆ పరమాత్మ స్వరూపం మీ ముగ్గురులో ఎవరు అని అత్రి అడగగా, నీవు ధ్యానిస్తున్న పరమాత్మ మేమే. మేము మూడు రూపాలలో ఉన్నా, నిజానికి ఒక్కరమే. మాకు బేధం లేదు. అనన్యసాధ్యమైన మీ తపస్సుకు మాకు మేమే మీకు దత్తమౌతాం. మీకు త్వరలో మా మువ్వురు అంశలతో పుత్రులు పుడతారని వరమిచ్చి వెడలిరి.




ఒకసారి మహాపతివ్రత అయిన సుమతి, కుష్టువ్యాధిగ్రస్తుడైన తన భర్త కౌశికుని ఒక బుట్టలో కూర్చుండబెట్టి, ఆ బుట్టను నెత్తిపై పెట్టుకొని వెళ్తుండగా, మార్గమధ్యంలో కౌశికుని కాలు మాండవ్యమహర్షికి తగిలింది. అతడు కోపావేశంతో రేపు సూర్యోదయానికి నీ భర్త మరణించుగాక అని శపించెను. అంతట సుమతి తెలియక జరిగిన పొరపాటును మన్నించమని పలువిధాల మాండవ్యమహర్షిని వేడుకొన్నా, ఆయన కనికరించకపోవడంతో, రేపటిదినం సూర్యోదయమే లేకపోవలెనని సూర్యుణ్ణి ఆదేశించింది. ఆమె పాతివ్రత్యమహిమ తెలిసిన సూర్యభగవానుడు తన సంచారాన్ని నిలిపివేశాడు. ప్రపంచమంతా చీకటిమయమై సృష్టిగతి స్థంభించింది . దీనిని నివారించడం దేవతలకు అసాధ్యం కావడంతో, దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా, ఒక పతివ్రత శాపమును మరో పతివ్రత మాత్రమే నిలువరించగలదని,  లోకబాంధవి అనసూయను ప్రార్ధించమని చెప్పగా, వారంతా అనసూయ దగ్గరకు వచ్చి వేడుకోగా, అనసూయ సుమతి వద్దకు వెళ్ళి, పతివ్రత ధర్మములు చెప్పి, సూర్యుణ్ణి ఉదయించమని చెప్పు, నీ భర్త మృతి చెందినా, నా తపః ప్రభావంతో బ్రతికిస్తాను అని చెప్పి కౌశికుని పునర్జీవింపజేస్తుంది. అంతటి తపస్సంపన్నురాలు అనసూయ. ఈ అద్భుత కార్యానికి సంతసించిన త్రిమూర్తులు ప్రత్యక్షమై, ఆమెను వరం కోరుకోమనగా, లోగడ తనకు ఇచ్చిన వరాన్నే అనుగ్రహించమని కోరింది.

తరువాత కొద్దికాలానికి బ్రహ్మాంశతో చంద్రుడు, బ్రహ్మరుద్రాంశాలతో కూడిన విష్ణంశతో దత్తాత్రేయ స్వామి, రుద్రాంశతో దుర్వాసముని ఈ పుణ్య దంపతులకు పుత్రులై జన్మించిరి. ఈ ముగ్గురు అత్రి సంతానం కనుక ఆత్రేయులని, దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు.

అనురాగభరితమైన ఆదర్శ దాంపత్యజీవనం




త్రిగుణాలకు అతీతుడు అయిన అత్రికి అసూయ రహితురాలైన అనసూయ జోడీ అయి ప్రపంచానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు. వీరి దాంపత్యజీవితం సర్వుల సంక్షేమం కోసమే సాగింది.
ఇద్దరూ ఎంతటి తపశ్శాలులు అయినా ఒకరినొకరు అర్థం చేసుకొని అరమరికలు లేని దాంపత్య జీవితాన్ని గడిపారు. ఎన్ని పరీక్షలెదురైనా తమ పవిత్రతతో ఎదుర్కొని నిలబడ్డారు. సంసార జీవితాన్ని ఎంతో ఆదర్శంగా గడిపారు. 
సంప్రదాయాన్ని అనుసరించి గృహస్థజీవితం ముగిశాక, వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాలి. అంటే భార్యాభర్తలిద్దరూ శేష జీవితాన్ని తపస్సు చేస్తూ అడవుల్లో గడపాలి. పుత్రులు కలిగాక, అత్రి మహర్షి వానప్రస్థానికి  సంకల్పించి, ఈ విషయాన్ని అనసూయకు చెప్పి, 'నీవు వస్తావా' అని అడగగా, 
ఆమె "స్వామీ! సంతాన పోషణకు, వారి సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసిన పిదప తపస్సుకు వెళ్ళడం సముచితంగా ఉంటుంద"ని ఓ మాతృమూర్తిగా, బాధ్యతాయుతమైన ఇల్లాలిగా కుటుంబ బాధ్యత నిర్వహించడం ఎంత అవసరమో చెప్పింది. ఆమె చెప్పిన ధర్మబద్ధమైన  మాటలను అంగీకరించిన అత్రి మహర్షి, ధనం కొరకు పృధు చక్రవర్తిని ఆశ్రయించగా, ఆ చక్రవర్తి ఆ సమయంలో చేయ సంకల్పించిన అశ్వమేధయాగం గురించి చెప్పి, యాగాశ్వ రక్షణకై తన కుమారునితో వెళ్ళమని కోరడంతో, సరేనని పృధువు కుమారునితో బయలుదేరెను. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించగా, అత్రి మహర్షి తన దివ్యదృష్టితో ఇంద్రుణ్ణి కనిపెట్టి, శిక్షించమని చెప్పి, నిర్విఘ్నంగా యాగాన్ని పూర్తి చేయించడంతో, కృతజ్ఞతాపూర్వకంగా భూరి దక్షిణలతో మహర్షిని చక్రవర్తి సత్కరించెను. చక్రవర్తి ఇచ్చిన సంపదను తెచ్చి సంతానానికి ఇచ్చి, గృహస్థ జీవిత బాధ్యతలను నెరవేర్చి, ఇరువురు వానప్రస్థ ఆశ్రమముకు వెడలిరి.

వీరి అన్యోన్య ఆదర్శ దాంపత్యంకు దర్పణం పట్టే ఓ చక్కటి ఘట్టం, మువ్వురికే కాదు, సర్వులకు అనసూయమ్మ అమ్మే అని తెలియజెప్పే ఘట్టం వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో ఉంది. ఆ ముచ్చటైన ఘట్టం చదువుతున్నప్పుడంతా, ఒక ఆదర్శమూర్తి అయిన భర్తగా అత్రి మహర్షి గోచరిస్తారు.
సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తూ, చిత్రకూటం నుంచి నడుస్తూ, దండ కారణ్యంలోని అత్రి ఆశ్రమానికి వచ్చినప్పుడు -




అత్రి మహర్షి పండుముసలిగా ఉన్న తన భార్యను పరిచయం చేస్తూ - 
ఈమె నా ఇల్లాలు. అనసూయ. మహాభాగ్యవతి, ధర్మచారిణి, గొప్ప తపస్విని... అని, అలానే ఆమె ఔన్నత్యాన్ని తెలియజెప్తూ -
రామా! పూర్వం ఒకప్పుడు పది సంవత్సరాలు వానలు కురవక, మహాక్షామము వచ్చింది. అప్పుడు నా ఇల్లాలు ఋషులకు, అందరికీ ఆహారాన్ని సృష్టించి పెట్టింది. అంతేకాదు, తన తపః ప్రభావంతో గంగాజలాలు సమృద్ధముగా ప్రవహించునట్లు చేసింది. ఒకప్పుడు దేవకార్యం కోసం ఈమె పది రాత్రులను ఏకరాత్రిగా చేసింది. ఈ మహాయశస్విని కోపం అనేది ఎరుగదు... ఇలా అత్రి మహర్షి తన భార్య పట్ల తనకున్న అనురక్తి తొణికిసలాడేలా మాట్లాడుతూ, అనురాగపూరిత భర్తగా భాసిల్లుతారు. 




సీతకు అనేక ధర్మ విషయాలను, పాతివ్రత్యం గూర్చి విశేషంగా చెప్పి, సీతా రాముల కళ్యాణ ఘట్టం చెప్పించుకొని, ఆ రాత్రి వారికి ఆతిథ్యమిచ్చి, ఎప్పుడూ వాడిపోని పుష్ప మాలలు, వస్త్రములు, పరిమళ ద్రవ్యాలు కానుకగా ఇచ్చి సీతమ్మను ఆశీర్వదించిన పెద్ద ముత్తైదువ అనసూయ.

తపశ్చర్య అనంతరం లభించిన సంతానం వలన లోకశ్రేయస్సు కలుగుతుందని అత్రి అనసూయ దంపతుల వృత్తాంతం వలన తెలుస్తుంది.
భగవాన్ దత్తాత్రేయుని ఆవిర్భవం 




మార్గశిర శుక్ల పౌర్ణమి -
శ్రీ దత్తాత్రేయుని జననం.

{దత్తాత్రేయుడు సృష్టి ప్రారంభంలో స్వాయంభువ మన్వంతరం లోని కృతయుగంలో అవతరించినట్లు చెప్తారు. శ్రీ గురుసంహిత పీఠికలో కృతయుగే మాధవమాసే కృష్ణ పక్షే  దశమ్యాం, ధిషణస్యవాసరే  పౌష్ణేచ ఋక్షే జపే జుపాంశే దత్త మూర్తి స్వయమావిరాసీత్
అని ఉండటం చేత కృతయుగంలో వైశాఖ బహుళ దశమి, గురువారం, రేవతి నక్షత్ర, మీనలగ్నంలో మీనాంశలో అవతరించినట్లున్నది. అయితే షోడశ దత్తావతారములలో,  చాలా చోట్ల మార్గశిర పౌర్ణమినాడు అవతరించినట్లు ఉండడంతో ఈ రోజే దత్తజయంతిగా ప్రసిద్ధి}.

భగవానుడి అవతారములు అనేకం. అందులో ముఖ్యంగా ఈ అవతారములు రెండు రకాలు. ఒకటి ధర్మ అవతారం. రెండవది జ్ఞాన అవతారం. 
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నరసింహుడు తదితర అవతారములు ధర్మ అవతారములు. రాక్షస సంహారానికి దుష్ట శిక్షణకూ ఏర్పడిన  అవతారములు. ధర్మ అవతారంలో భగవానుడు ఆయుధములు ధరించి దుష్టసంహారం చేసి ధర్మమును రక్షించగా, జ్ఞాన అవతారములలో ఆయుధాన్ని పట్టక, జ్ఞానం ద్వారా అజ్ఞానమనే అసురులను సంహరించడం స్పష్టమవుతుంది. దుష్టభావాన్ని రూపుమాపి జనులందరిని జ్ఞానప్రబోధంతో సన్మార్గులుగా చేయటానికి దత్తావతారం వచ్చిందని చెప్పవచ్చు. మానవులలోని రాక్షస ప్రవృత్తులనూ దుష్ట గుణాలను తొలగించి యోగసిద్దులుగా చేసే మహా యోగాన్ని బోధించే మహాజ్ఞాన గురుతత్వం దత్తునిది. 

త్రిమూర్తిస్వరూపుడైన శ్రీదత్తుడిది అత్యంత ప్రత్యేకమైన విశిష్టావతారం.
యుగయుగాల నుండి నేటి కలియుగం వరకు ఈ అవతారం నిలిచేయుంది. నిత్య సత్యావతారము. 16 కళలతో విరాజిల్లుచుండు పూర్ణావతారం. 

శ్రీ దత్తుని వైభవం... తదుపరి టపాలో -



13 కామెంట్‌లు:

  1. అబ్బా ...ఎంత బాగా వ్రాసారో🙏
    సతీ అనసూయ సినిమా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను గానీ, అత్రి మహర్షి, అనసూయమ్మల గురించి ఇంత విపులంగా ఇప్పుడే తెలుసుకున్నాను. దత్తాత్రేయ వైభవం గురించి ఎంతగానో ఎదురుచూస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  2. నేను ఇంతకు ముందు పోస్ట్‌లలో కూడా చెప్పినట్లు, ప్రతి ఒక్కరూ మన పురాణాలు మరచిపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వ్యక్తులు చాలా అవసరం. పోస్ట్ చేసినందుకు మరియు మీ జ్ఞానాన్ని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ధన్యోస్మి🙏
    ప్రశస్తమైన కరుణశ్రీ పద్యాలతో పాటు మీ వివరణ ప్రశస్తంగా ఉంది.
    మీ నుండి వచ్చిన మరో ఆణిముత్యం ఇది.

    రిప్లయితొలగించండి
  4. 🙏🙏.."ఓం దత్త .. శ్రీ దత్త .. జయ గురుదత్త"..🙏🙏

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా వ్రాసారండీ. ఎంతోమందికి ఉపయోగించే గొప్పవ్యాసం. (ఐతే అక్కడక్కడ చిన్నచిన్న అక్షరదోషాలు కనిపిస్తున్నాయి. ఒకసారి సరిదిద్దండి). మీవ్యాసం చదివి మహదానందం కలిగింది.

    రిప్లయితొలగించండి
  6. శ్యామలీయం సర్,
    బాగున్నారా?
    మీ స్పందన చాలా ఆనందాన్ని కల్గించింది.
    నేను గుర్తించిన మేర సరిదిద్దాను.
    ధన్యవాదాలండీ...🙏

    రిప్లయితొలగించండి
  7. 🪔భగవంతుడిని చూడాలంటే...🪔

    ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది. అతను ఎన్నోతీర్థయాత్రలు చేశాడు. ఎన్నో పురాణాలు, గ్రంధాలు చదివాడు.కానీ, అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు. అతని కోరిక తీరలేదు. భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.
    ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూసాడు. అస్తమానూ ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తున్నది. ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది. ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ, వాటిపైన బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనించాడు. ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు.

    మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు. ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనబడకుండా చేసింది. కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది. సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించడం చూసాడు.

    ఒకరోజు నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు. కొంతమంది గ్రామస్థులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు. ఈ మురికి నాచును చెరువులో ఎవరు వేశారు ? అని ఆ వ్యక్తి గ్రామస్థులను అడిగాడు. ఎవరూ వెయ్యలేదు. నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది. ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది. ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక, త్వరలోనే చెరువు తేటగా, శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు. ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు.

    నాచు నీటిలో నుండే వచ్చింది కాని, అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తేగాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు. అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి. గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు. అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది. కాని ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తున్నది. బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది.

    నీరు, నిప్పు, సూర్యుడు ఇంతకు ముందే ఉన్నాయి. కొత్తగా ఏర్పడలేదు, కాని అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చెయ్యవలసి ఉంటుందని, ఆ ప్రయత్నం బయట కాదు, లోపల చేయాలన్న సత్యం ఆ వ్యక్తికి బోధపడింది. ప్రపంచం అనే మాయా దుప్పటిని పక్కకి తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాం.

    దత్తుని గురువుల గురించి చదువుతుండగా ఎప్పుడో వాట్సప్ లో చదివిన ఇది గుర్తుకువచ్చింది.

    రిప్లయితొలగించండి