http://www.sodhini.com

2, ఆగస్టు 2026, ఆదివారం

శరవణభవుని శౌర్యం: క్రౌంచపర్వత భేదనం నుండి సూరపద్ముని సంహారం వరకు

 


క్రిందటి టపాలో కుమారస్వామి జననం గురించి తెలుసుకున్నాం.

క్రిందటి టపా లింక్ : కుమారసంభవం - పునరావలోకనం

🤱కార్తికేయునికి పోషణాకర్తలు

ఇప్పుడు ఈ శిశువుకు తల్లి పాలుకావాలి ఎలా... ఇంద్రాది దేవతలు బాగా యోచించి కృత్తికలను ప్రార్థిస్తారు. ఈ బిడ్డ మా బిడ్డగా గుర్తింపబడాలన్న వరాన్ని కోరి, వారు ఒకరి తర్వాత ఒకరిద్దామని కాకుండా, ఆరుగురు ఒకేసారి పాలివ్వడానికి సిద్ధపడగా, ఆ శిశువు ఆరుముఖాలతో ఏకకాలంలో పాలు తాగేసాడు.
ఒకే ఒకసారి మాత్రమే పాలు తాగి, అందర్నీ రక్షించడానికి యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు.

👑దేవసేనాధిపతిగా నియామకం - నిశ్చయం 

మరుక్షణంలోనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, దేవతలందరూ దేవసేనాధిపతిగా కుమారస్వామికి అభిషేకించారు. తారకాసురుడు మూడులోకాలను వణికిస్తున్నాడు కాబట్టి, వెనువెంటనే కుమారస్వామి శోణితపురంపై దండెత్తడానికి నిశ్చయించుకొనెను.

🎁 దేవసేనాధిపతికి వివిధ శక్తుల ఆయుధాలు బహుకరణ

ఈ సందర్భంలో పార్వతీపరమేశ్వరులు త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలము(అమ్మవారి శక్తి) లను బహుకరించారు. శంకరుడు శాంభవీ విద్యను కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును; 
శ్రీమహావిష్ణువు వైజయంతి కంఠహారమును, ఐరావతమును, వజ్రాయుధమును; 
లక్ష్మీదేవి సంపదను; 
సావిత్రీదేవి సకలవిద్యలను; 
వరుణుడు శ్వేతచ్ఛత్రమును, రత్నమాలను; 
సూర్యుడు మనోవేగం కలిగిన రధమును, కవచమును;
యముడు యమదండమును; 
చంద్రుడు అమృతకలశమును; 
అగ్ని మహాశక్తిని; 
వాయువు వాయవ్యాస్త్రమును; 
కుబేరుడు గదను; 
పాలసముద్రము అమూల్యమైన రత్నాలను, రత్నములతో కూడిన ఒక అందెను; 
హిమవంతుడు పట్టు బట్టలు; 
గరుత్మంతుడు చిత్రభర్హణుడు అనబడే నెమలిని,
అరుణుడు తామ్రచూడుడు అనే కుక్కుటం (కోడిపుంజు)ను బహుకరించిరి.

🎪దేవసేన సమీకరణం - సైన్యం మోహరింపు

తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం, బ్రహ్మాది దేవతలతో సంప్రదించి, బృహస్పతికి నమస్కరించి, వెనువెంటనే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు తదితరుల సైన్యాలను సమీకరించి
రుద్రగణాలను వెంట తీసుకుని, కుమారస్వామి శోణితపురంపై రణభేరి మ్రోగించాడు. పురానికి నాలుగు దిక్కులా సైన్యం మొహరించేటట్లు, యుద్ధవ్యూహం పన్నాడు.

✉️  దేవాసేనాని దూత - విశాఖుని రాయబారం

కుమారస్వామి యుద్ధానికి ముందే శాంతి కోసం 'విశాఖుడు' అనే దూతతో తారకాసురుని వద్దకు రాయబారం పంపెను.

📜 షణ్ముఖుని రాయబార సందేశం

'తారకా ! నీ త్రిలోకపాలన హింసాయుతంగా మారింది. ప్రజలు బాగా ఇక్కట్లు పడుతున్నారు. దేవతలు, మునులు వారి విద్యుక్త ధర్మాల నుండి దూరం అవుతున్నారు. వారికి సహాయం చెయ్యడానికి నేను నీ పురం వెలుపల సైన్యంతో వున్నాను. ఈ రాజ్యాన్ని మాకు అప్పగించి, నీవు పాతాళలోకంలో వున్న, భోగవతీ పురానికి వలస వెళ్ళు. లేనిచో, నిన్ను ఏమాత్రం సంకోచం లేకుండా, యుద్ధంలో జయించి, ఈ రాజ్యాన్ని, నీ అధికారాన్ని ఇంద్రాదులకు వప్పజెప్పగలను' అని, షణ్ముఖుని రాయబార సందేశాన్ని విశాఖుడు తారకాసురునికి విన్నవించాడు.

⚔️ తారకాసురుని తిరస్కారం - యుద్ధ ప్రకటన

ఈ రాయబార సందేశానికి తారకాసురుడు కోపించి, 'యుద్ధానికి సిద్ధం ' అని జవాబు చెప్పి అనేక ప్రగల్భాలు పలికి, దూతను వెనుకకు పంపించాడు.

విశాఖుని ద్వారా తారకాసురుని సందేశం విన్న కుమారస్వామి, దేవతలు, సైనికాధికారులు చర్చించుకుని, దేవేంద్రునిచే తారకాసురునిపై ముల్లోకాలలో అతని అధికారంపై యుద్ధం ప్రకటించారు.

🥁 దేవసేనాని రణభేరి 

ఉభయసైన్యాలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు.  వేలాది రథాలు, గజాలు, అశ్వాలు, రాక్షస వీరులు యుద్ధరంగాన్ని నింపివేశారు. అనేక మంది దేవగణాలు, రాక్షస గణాలు గాయపడ్డారు.

⛰️ క్రౌంచ పర్వత భేదనం
ఆ కాలంలో క్రౌంచుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు. అతను ఒక పర్వతం రూపాన్ని ధరించి, తన మాయాజాలంతో ప్రయాణికులను మరియు ఋషులను ఇబ్బంది పెట్టేవాడు.
ఒకసారి అగస్త్య మహర్షి ఆ మార్గంలో వెళ్తుండగా, క్రౌంచుడు తన పర్వత రూపంతో ఆయనను తప్పుదోవ పట్టించి, భారీ వర్షం కురిపించి ఇబ్బంది పెట్టాడు. అగస్త్యుడు తన దివ్యదృష్టితో అది రాక్షసుడి మాయ అని గ్రహించి, "నువ్వు పర్వతంగా మారిపోతావు మరియు శివుని కుమారుడైన కుమారస్వామి చేతిలో హతమవుతావు" అని శపించాడు.
దేవతలకు, అసురులకు జరిగిన యుద్ధంలో కుమారస్వామి తన పవిత్రమైన 'వేల్' (శక్తి ఆయుధం)ను అసురులకు ఆశ్రయమిస్తున్న క్రౌంచ పర్వతం పైకి విసరాగా,. ఆ శక్తివంతమైన వేల్ దెబ్బకు క్రౌంచ పర్వతం ముక్కలవ్వగా, క్రౌంచుడు శాప విముక్తుడయ్యెను.
🤜🤛తారకాసురుడుతో భీకర పోరు
ఇంద్రుడు స్వయంగా తారకాసురునితో యుద్ధం చేశాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించినా, బ్రహ్మవరం వల్ల తారకాసురుడు దానిని తట్టుకున్నాడు. ఇతర దేవతల అస్త్రాలు కూడా అతనిపై ప్రభావం చూపలేదు.

అప్పుడు కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగాడు. ఇద్దరి మధ్య ఘోర ద్వంద్వయుద్ధం జరిగింది. ధనుర్విద్య, ఖడ్గయుద్ధం, గదాయుద్ధం, అనేక దివ్యాస్త్రాల ప్రయోగం జరిగింది. యుద్ధరంగం కంపించిపోయిందని పురాణాలు వర్ణిస్తాయి.

🛡️పద్మ చక్ర వ్యూహాలు - భీకర సంక్షోభం

కుమారస్వామి పద్మవ్యూహ రచనచేసి, సైన్యాన్ని మొహరించి, ఒకరోజంతా భీకర యుద్ధం చేసాడు తారకాసురునిపై. ఆ మరునాడు శివుని ప్రార్ధించి, చక్రవ్యూహ రచన చేసి తారకాసురుని ఎదుర్కొన్నాడు.

తారకాసురుడు చక్రవ్యూహాన్ని చూసి భయపడి, తన సేనలకు యుద్ధంలో మరణిస్తే, వీరమరణం వస్తుందని ప్రబోధించడం ప్రారంభించాడు. తను కూడా భీకరంగా పోరగా, అతని పరాక్రమానికి దేవతలు భయపడసాగారు.

🔥పాశుపతాస్త్ర ప్రయోగం - తారకాసురుని పలాయనం

ఆ విధంగా యుద్ధం జరుగుతుండగా, దేవేంద్రుడు కుమారస్వామిని ప్రార్ధించి, ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యే ఉపాయం చూడమని చెప్పాడు. వెంటనే, కుమారస్వామి ఆలోచించి మహిమాన్వితమైన పాశుపతాస్త్రాన్ని తారకాసురుని సైన్యం పై ప్రయోగించాడు.

దాని ధాటికి చనిపోయినవారు చనిపోగా, కొందరు రాక్షసులు భయపడి పారిపోయి సముద్రంలో దాక్కున్నారు. పాశుపతం యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయే వారిని సంహరించదు గనుక, తారకాసురుడు ఉపాయంగా రణరంగం నుండి వెనుకడుగువేసి, పారిపోయాడు. పాశుపతాస్త్రము తిరిగి కుమారస్వామి అంబులపొదిలోనికి చేరింది.

🔱 తారకాసుర సంహారము - పంచారామాల ఆవిర్భావం 

🩸రక్త అభిషేకం - అశరీరవాణి పలుకులు

రణరంగం నుండి పారిపోయిన తారకాసురుడు, తన రక్తంతో శివలింగానికి అభిషేకం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు అశరీరవాణి... 'తారకా ! నీకు సంపూర్ణ ముక్తి లభిస్తుంది. విచారించకు.' అని పలికింది.

ఆ మాటలకు తారకుడు సంతోషించి, మరునాడు సూర్యోదయం కాగానే, మళ్లీ కుమారస్వామి పైకి యుద్ధానికి వెళ్ళాడు. మహాశక్తి అనే ఆయుధాన్ని కుమారస్వామిపై ప్రయోగించగా, దానికి కుమారస్వామి బ్రహ్మాస్త్రంతో జవాబు చెప్పి, ఆ మహాశక్తి అస్త్రాన్ని తుత్తునీయలు చేశాడు.

🔎 కొన్ని రోజుల యుద్ధం - తారకుని బల రహస్యం

అంతటితో ఆగకుండా కుమారస్వామి అనేక గొప్ప అస్త్రములు ప్రయోగించినప్పటికీ, తారకుడు అన్నింటినీ ఛేదిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు కుమారస్వామికి, తారకాసురునికి భయంకర యుద్ధం జరిగింది.

షణ్ముఖుడు కూడా అలసిపోయి, తారకాసురుని బల రహస్యం తెలుసుకోగోరి నారదుని అడుగగా, నారదుడు... 'తారకాసురుడు గొప్ప శివభక్తుడు. పార్థివలింగాన్ని ఎల్లప్పుడూ తన కంఠంలో అలంకరించుకుని ఉంటాడు. అతని మెడలోని పార్థివలింగాన్ని ఖండించినా, తిరిగి ఆ ముక్కలతో దేవాలయ నిర్మాణం గావించి అతనికి అందకుండా చేయాలి. లేకుంటే ఆ ముక్కలని మళ్లీ అతికించుకుని, తన కంఠసీమను అలంకరించుకుంటాడు తారకుడు' అని చెప్పాడు.

🌞సూర్యభగవానుని ప్రార్థన - వ్యూహాత్మక ప్రణాళిక

వెంటనే షణ్ముఖుడు సూర్యభగవానుని ప్రార్థించి... 'నేను పార్థివలింగాన్ని ముక్కలు చేయగానే, ఆ ముక్కలతో వెంటనే దేవాలయ నిర్మాణం చేసి, ఆ లింగ శేషాలు తారకాసురునికి అందకుండా నాకు సహాయం చేయి' అని అడిగాడు. దానికి సూర్యుడు అంగీకరించాడు.

🏹 ఆగ్నేయాస్త్ర ప్రయోగం - పంచ భీమేశ్వరాలయాల జననం

షణ్ముఖుడు తిరిగి చేసిన భయంకర యుద్ధంలో, దేవతలంతా త్వరితగతిన తారకాసురుని చంపమని ప్రాధేయపడుతుండగా... దేవ, రుద్ర, మరుద్గణ సహాయంతో, శత్రుసైన్యాలను దునుమాడుతూ, ఒక ఆగ్నేయాస్త్రంతో కుమారస్వామి, తారకాసురుని పార్థివలింగాన్ని ఖండఖండాలుగా చేశాడు.

ఆ ఖండాలు పవిత్ర మధుర ఓంకార ధ్వనులతో నేలను అయిదు ఖండాలుగా తాకుతుండగా, సూర్యుడు విశ్వకర్మ సహాయంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, అయిదు దేవాలయాల నిర్మాణమొనర్చి లింగ ప్రతిష్ట చేశాడు. అవే పంచ భీమేశ్వరాలయాలుగా (పంచారామాలుగా) ప్రసిద్ధి పొందాయి. వెన్వెంటనే వేల్ దెబ్బతో తారాకాసురుడు అంతమయ్యాడు.

🦁సింహముఖాసుర సంహారం

సింహముఖుడు సూరపద్ముని అన్న. సింహం వంటి ముఖం, అపారమైన బలం కలిగిన అసురుడు. బ్రహ్మ వరప్రభావంతో అతడు దేవతలను తీవ్రంగా బాధించేవాడు.
తారకాసురుడు మరణించిన వార్త తెలుసుకున్న సూరపద్ముడు, తారకాసురుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించి, సింహముఖుడిని యుద్ధానికి పంపాడు. కుమారస్వామి ఇతనిని కూడా యుద్ధంలో ఓడించి సంహరించాడు.

⚡మాయా యుద్ధం - సూరపద్ముని సంహార ఘట్టం

చివరికి సూరపద్ముడు స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు. పోరాడలేక తన మాయాశక్తులను ప్రయోగించాడు. ఆకాశంలోకి వెళ్ళి చీకట్లు కమ్మేలా చేశాడు, పర్వతమయ్యాడు, సముద్రమయ్యాడు, అగ్నిగా మారాడు, అనేక భయంకర రూపాలు ధరించాడు.
కానీ, కుమారస్వామి తన వేల్ (శక్తి ఆయుధం)తో అన్ని మాయలను ఛేదించాడు.
చివరకు సూరపద్ముడు ఒక మహా మామిడి చెట్టు రూపం ధరించాడు.
అప్పుడు కుమారస్వామి తన వేల్ తో ఆ చెట్టును రెండుగా చీల్చాడు.

🔁 సూరపద్మడు సంహారం - శత్రువు నాశనం కాదు - అహంకార పరివర్తన 

ఇదే కథలో అత్యంత అందమైన భాగం -

చెట్టులోని రెండు భాగాలలో ఒకటి 
🦚నెమలిగా మారింది. మరొకటి
🐓కోడిపుంజుగా మారింది. సూరపద్ముడు తన అహంకారాన్ని విడిచి శరణాగతి పొందాడు. కుమారస్వామి ఎంతో కృపతో నెమలిని తన వాహనంగా కోడిపుంజును తన ధ్వజ చిహ్నంగా
అంగీకరించాడు. 

ఇక్కడ ఒక సందేహం వస్తుంది. గరుత్మంతుడు చిత్రభర్హణుడు అనబడే నెమలిని అరుణుడు తామ్రచూడుడు అనే కోడిపుంజును ఇస్తే వాటిని వాహనంగా ధ్వజ చిహ్నంగా ఉన్నప్పుడు, ఇప్పుడు సూరపద్ముని ఈ రూపాలు వాహనం ధ్వజ చిహ్నం అవ్వడం ఏమిటి?
దేవతలు ఇచ్చిన నెమలి, కోడిపుంజులు దైవిక శక్తులు. సూరపద్ముడి నుండి వచ్చిన నెమలి, కోడిపుంజులు పరివర్తన చెందిన రాక్షస శక్తులు. స్వామివారు ఆ రాక్షస శక్తుల అహాన్ని అణచివేసి, దేవతలు ఇచ్చిన దైవిక శక్తులతో వాటిని కలిపేసి తన వద్దే ఉంచుకున్నారు.

"ఇది సంహారం కంటే గొప్పది.  శరణాగతికి లభించిన కృప"

💫సాధకునికి అన్వయం

⛰️క్రౌంచుడు

క్రౌంచపర్వతం అంటే రాళ్లతో కూడిన పర్వతం మాత్రమే కాదు అది మన జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుపడే అతి పెద్ద అడ్డంకి. అంతర్గత అవరోధాలకు ప్రతీక. అందుకే జ్ఞాన శక్తితో మన జీవితంలోని "క్రౌంచ పర్వతాలను" ముందుగా ఛేదించినప్పుడే, మనలోని "తారకాసురుడు" (అహంకారం, దుర్గుణాలు)ను జయించగలం.

కుమారస్వామి - వేల్ (శక్తి ఆయుధం)

🪷 కుమారస్వామి అంటే మేల్కొన్న జ్ఞానం. 

🔱 వేల్ శక్తి ఆయుధం అంటే వివేకం, స్పష్టమైన లక్ష్యం, ఏకాగ్రత, ధైర్యం...

తారకాసురుడు - సింహముఖుడు - సూరపద్ముడు

▪️తారకాసురుడు - అహంకారం, అధికారం మీద మదం.

▪️సింహముఖుడు - క్రూరత్వం, కోపం, హింసాత్మక స్వభావం.

▪️సూరపద్ముడు —- మాయ, స్వార్థం, దురాశ, మమకారం.

జ్ఞానం VS అజ్ఞానం 

కుమారస్వామి జననం అంటే మనలో జ్ఞానం పుట్టడం.

తారకాసురుడు, సింహముఖుడు, సూరపద్ముడు వధ అంటే అజ్ఞానం నాశనం కావడం.

'కోపం క్రూరత్వం మనిషిని అసురునిగామారుస్తాయి. ఆత్మనిగ్రహం వివేకం మనిషిని దైవత్వం వైపు నడిపిస్తాయి'


అందుకే అనేక గురువులు ఒక అద్భుతమైన భావన చెబుతారు:

"అసురులు బయట లేరు, మనలోనే ఉన్నారు. కుమారస్వామి కూడా బయటలేడు, మనలో మేల్కొనే దివ్యజ్ఞానమే కుమారస్వామి"

ఈ కోణంలో చూస్తే కుమారస్వామి జనన కథ మొత్తం ఒక యోగసాధకుని అంతర్మార్గ ప్రయాణానికి ప్రతీకగా కనిపిస్తుంది.

నేటి తరం వారికి అన్వయం 

వేరే వేయి మాటలేలా? ఈ టపాలో చిత్రాలు పరిశీలించి, గ్రహిస్తే చాలు.

✍️ తదుపరి టపా - "కార్తికేయుని కళ్యాణ వైభోగం - తెలుసుకుందాం రారండీ"...